నా జీవన యానంలో- రెండవభాగం- 24
-కె.వరలక్ష్మి
అక్షరాలంటే ఆకుల్లాంటివి. అవి అలా భిన్నంగా ఎందుకున్నై ‘అని తెలుసు కోవాలంటే అసలు వృక్షం యొక్క అభివృద్ధి క్రమాన్నే అవగతం చేసుకోవాల్సి ఉంటుంది. అక్షరాలు తెల్సుకోవాలంటే పుస్తకాలు చదవాలి, మానవుడు ఆనందభరితమైన, ఉపయోగకరమైన మొక్కల్ని ఎన్నిట్నో నాటి వాటిని ఉద్యానవనంగా రూపొందించినట్టే రచయిత ఒక పుస్తకాన్ని రాస్తాడు “
“అపనిందలకి నువ్వెంత తక్కువ విలువనిస్తే అంత మంచిది. దుష్టలకు దూరంగా ఉండడం నేర్చుకో, ఎవడు సుఖంగా బతుకుతాడో వాడు నిందలపాలవుతాడు, ఎవడు సుఖంగా బతకలేడో వాడు అసూయాపరుడౌతాడు!”.
“తిండి పుష్కలంగా తిన్నవాడే, ఒళ్లు కదలకుండా ఉన్నవాడే ఇతరుల్ని వెక్కిరిస్తాడు, కడుపులో చల్ల కదలని పెద్దమనుషులకు బాధ, ఆకలి, అశాంతి అన్నమాటలకు అర్థమేం తెలుస్తుంది.??” నా ప్రపంచం –గోర్కీ.
“ఒక విషయం గురించి దుఃఖిస్తూ కూర్చుండిపోతే చివరిదాకా ఆ దుఃఖం లోనే మిగిలిపోతాం, అనవసరమైన ఆ దుఃఖాన్ని విడిచి పెడితే చాలు, ఏమీ జరగనట్లే మనం మామూలుగా హాయిగా జీవించగల్గుతాం”–మేనేన్ డేర్
1995 లో వచ్చిన కవిత్వాన్ని సమీక్షిస్తూ ‘మాజీ రంగస్థల నటి దేహంతోసహా అమ్ముకోవడానికేమీలేక జీవచ్ఛవంలా మిగిలిపోవటాన్ని కె.వరలక్ష్మి దయనీయంగా చిత్రించారు’ అని రాసారు. కె.రామమోహనరాయ్ 96 జనవరి 1 ఆంధ్రజ్యోతి సాహిత్య వేదిక లో నా కవిత ‘మాజీ రంగస్థల నటి’ గురించి,
1991 లో మా అమ్మ కాలం చేసిన తర్వాత మా తమ్ముళ్లు మా అక్క చెల్లెళ్లు ముగ్గుర్నీ సంక్రాంతికి హైదరాబాద్ వాళ్లింటికి పిలవడం మానేసారు. మాకు కూడా పిల్లల పెళ్ళిళ్ళై కూతుళ్లు, అల్లుళ్లు రావడం – మా ఇంట్లోనే పండగ చేసుకోవడంతో కుదిరేది కాదు. 96 జనవరిలో సంక్రాంతికి అందర్ని రమ్మని పిలిచేరు మా తమ్ముళ్లు.
అందరం పండగని ఎంజాయ్ చేస్తూ ఉండగానే 18 వ తేదీ ఉదయాన్నే NTR ఆ తెల్లవారు ఝామున మరణించిన వార్త టీవీలో మారుమ్రోగిపోయింది. సిటీకేబుల్లో రోజంతా ఆ కార్యక్రమాలే చూస్తూ ఉండి పోయాం. NTR రాజకీయాల్లోకి రాకుండా ఉండాల్సింది అన్పించింది.
96 జనవరి 20న బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య కళాక్షేత్రం లో అస్మిత సమావేశానికి వెళ్లేను, ఉదయం సమావేశంలో ఓల్గా, శ్రీదేవి మాట్లాడేరు, మధ్యాహ్నం లక్ష్మీనరసయ్య అధ్యక్షతన జరిగిన సభలో జూలూరి గౌరీశంకర్, పైడి తెరేష్ బాబు దళిత వాదం గురించి మాట్లాడేరు, అప్పుడప్పుడే దళితవాదం మొదలవుతున్న కొత్త రోజులు, ఆ స్పీచెస్ ఆసక్తిదాయకంగా నడిచాయి, జనవరి 21 ఆదివారం అస్మిత సమావేశం రెండవ రోజు, ఉదయం సభలో వసంతా కన్నాభిరాన్, సజయ, ఫ్లారెన్స్ మాట్లాడేరు, మధ్యాహ్నం సభ ప్రెస్ క్లబ్లోజరిగింది. స్త్రీవాదం మీద కొంతచర్చ అనంతరం కవిసమ్మేళనం జరిగింది. ఆ సభకు అధ్యక్ష బాధ్యత నాకు అప్పగించారు. ‘వంటింటి మసి’ పుస్తకావిష్కరణ జరిగింది, ఆ సభ తర్వాత అందరం అక్కడికి దగ్గర్లో ఉన్న ఇరానీ రెస్టారెంట్ చాయ్ తాగాం. ఇరానీ చాయ్ నాకు కొత్త, ఎంత నచ్చేసిందో! హైదరాబాద్ చలి వాతావరణంలో ఇరానీ చాయ్ తాగడం బలే ఉంటుంది. పొనుగోటి కృష్ణారెడ్డి ఆ రోజు నాకు శీలా వీర్రాజు గారిది, మధురాంతకం రాజారాం గారిది కథల పుస్తకాలు ఇచ్చాడు.
22 న వెస్ట్ మారేడ్ పల్లిలోని అస్మిత ఆఫీస్ లో జరిగిన చిన్న సమావేశానికి అటెండై అస్మిత ఆఫీస్ చూసాను. ఓల్గా ఓ రెండు పుస్తకాలు ఇచ్చింది. ఆ రాత్రి గౌతమీలో తిరిగి వచ్చేసాం.
పెళ్లికి ముందు వరకూ ఎక్కడికి వెళ్లినా, సాహిత్యానికి సంబంధించి ఏ సమావేశానికైనా మా గీత నేను కలిసి వెళ్లేవాళ్లం, పెళ్లి తర్వాత గీత వైజాగ్లో ఉండడం, చంటి పిల్లాణ్ని సందరించుకోవడం, మరోపక్క చదువుకోవడంతో నేనొక్కదాన్నే వెళ్లాల్సి వచ్చేది. ముఖ్యంగా తన ఇంట్లో సాహిత్యానికి సంబంధించిన ప్రోత్సాహం ఉండేది కాదు,
‘మొగవాడు ఆడదాన్ని తన కోణం నుంచి చూసి, తన అవసరాల వరకే గుర్తిస్తాడు, కానీ, స్త్రీ మరొక స్త్రీని బైటపడే ఎమోషన్స్, పరిస్థితుల్ని బట్టి కాక, జెలసీ కాంప్లెక్సులు లేకుండా కుతుహులంతో స్టడీ చేస్తే కనపడని భావాలు, అర్థాలు బోలెడు స్ఫురిస్తాయి.’ అంటారు జలంధర తన కథలో ఒకచోట.
ఆ మార్చిలో ఒక రోజు మధ్యాహ్నం స్కూలు నుంచి ఇంటికొచ్చేసరికి మా ఇంటి వెనక ఫేక్టరీ కట్టవలోని తాటిచెట్లు ఎండిన ఆకుల్నీ, మట్టల్నీ కొట్టి పడేస్తున్నాడు కల్లుగీసుకునేవాడొకడు. ఆ చెట్లమీద గూళ్లు కట్టి గుడ్లుపెట్టినట్టున్న కాకులు హృదయ విదారకంగా అరుస్తూ చెట్టు నుంచి చెట్టుకు ఎగురుతున్నాయి. ఎంత వేదన ఆ గంతుల్లో! అదే, ఆ ఆర్ద్రతే కాబోలు మాతృత్వమంటే –
ఆధునిక జీవితం లోని ఆటుపోట్లు, ఆందోళనలు, ఆదుర్దాలు,తగిన విశ్రాంతిలేని యాంత్రిక జీవనం అయిపోయింది నాది. కొద్ది వ్యవధి లో అనేక పనులను చేయాలనుకొని కాలానికీ, పరిస్థితులకూ ఎదురీదుతూ, లక్ష్యాలను సాధించాలనే తపనతో నిరంతరం శ్రమపడడం నా ఆరోగ్యం మీద క్రమక్రమంగా తన ప్రభావాన్ని చూపడం మొదలైంది. ఆ సంవత్సరం ఏప్రెల్ 3వ తేదీన మా మేనమామల్లో అందరికన్నా చిన్నవాడైన అయిదవ మేనమామ కేన్సర్తో కాలం చేసాడు. చిన్నప్పుడు నన్నెత్తుకుని మోసినవాడు. ‘బాధపడాలి, నలగాలి జీవిత రథచక్రాల కింద – కలంలోంచి నెత్తురు వొలకాలంటే’ – అంటాడు చలం.
‘స్వర్గాన్ని నరకంగా, నరకాన్ని స్వర్గంగా చూపేది మన మనసు. సృష్టిలో ఏమీ లేదు. చూసే దృష్టిలో ఉంది ‘- అంటాడు మిల్టన్, ఎంత వద్దనుకున్నా స్కూల్ ను గురించి ఒకటే దిగులు వదలకుండా పట్టుకుంది. రాత్రులు నిద్రపట్టడం మానేసింది, ఎలా? ఎలా?.. ఎంతో హైలెవెల్ కి తీసుకెళ్లిన స్కూలు. ఇక పై నా ఫ్యూచర్ జీవితానికి ఆధార మేది? ఓడిపోయిన ఫీలింగ్..
‘నిరంతరం విజయం వల్ల ప్రపంచాన్ని ఒకవైపు నుంచే చూడగలుగుతాం. పరాజయాలు పొందినప్పుడు రెండవ పార్శ్వాన్ని కూడా దర్శించగలుగుతాం’- అని కాల్టన్ సూక్తి. ఎవరెవరివి ఎన్నెన్ని సూక్తులు చదివినా జీవితంలో వచ్చేవడిదుడుకుల ప్రభావమే జయిస్తుంది.
96 ఆగష్టు15న గౌతమీ గ్రంథాలయంలో సన్నిధానం శర్మ గారి కవిత్వ సంపుటి ‘ప్రాణహిత’ ఆవిష్కరణ జరిగింది. ఆ సభకు హైదరాబాద్ నుంచి వచ్చిన శర్మగారి మిత్రులు, తెలుగు యూనివర్శిటీ ప్రొఫెసర్ జయధీర్ తిరుమల రావుగారు నా కథల పుస్తకం వెయ్యడానికి సాంకేతికంగా తోడ్పడతానన్నారు. యూనివర్శిటీ బుక్స్ ప్రింటింగ్ వ్యవహారాలు ఆయనే చూస్తారు కాబట్టి ఆయన తప్పకుండా చేసిపెడతారు అని శర్మ గారు భరోసా ఇచ్చారు. అప్పటికే పుస్తకం వెయ్యమని అందరూ సలహా ఇస్తున్నా ఎలా ప్రొసీడ్ కావాలో తెలీక ధైర్యం చెయ్యలేదు. మర్నాడే 18 కథలు జెరాక్స్ కాపీలు ఆయన కిచ్చి ప్రింటింగ్ టైంలో ఎమౌంట్ ఇస్తానని చెప్పేను,
ఆ మర్నాడు ఆగష్టు 17న ఆంధ్రజ్యోతి ఎడిటర్ త్రిపురనేని శ్రీనివాస్ యాక్సిడెంట్ లో మృతి చెందాడు. .
నా కథల DTP వర్క్ పూర్తైందని, ప్రూఫులు దిద్దుకోడానికి రమ్మని జయధీర్ తిరుమలరావుగారు ఫోన్ చేసారు, సెప్టెంబర 6న హైదరాబాద్ వెళ్లి బుక్ వర్క్ స్వయంగా చూసుకున్నాను. లక్ష్మణ్ ఏలే వేసిన పల్లె వనిత ముఖచిత్రంతో అత్యంత సామాన్యంగా వేసిన నా మొదటి నా కథల పుస్తకం ‘జీవరాగం’ కాపీ చేతుల్లోకి తీసుకోగానే చెప్పలేని ప్రత్యేకమైన అనుభూతి కలిగింది. కళ్లు చెమ్మగిల్లి, మనసు ఆనందం తో నిండిపోయింది. తిరిగి 17వ తేదీ బయలుదేరి వరంగల్ లో ఉన్న మా చిన్నమ్మాయి లలితను రెండవ కాన్పు కోసం వెంట తీసుకుని 18న ఇంటికి చేరుకున్నాను.
విశాఖ సహృదయ సాహితి నా ఏకాంత శ్రోతస్విని’ కవితకు బహుమతి ప్రకటించారు. 21 న విశాఖ కళాభారతిలో గురజాడ 135 వ జయంతి సందర్భంగా గుంటూరు శేషేంద్రశర్మగారి అధ్యక్షతన జరిగిన సభలో ఆయన చేతుల మీదుగా బహుమతి అందుకున్నాను.
ఆ నెలలో మిగిలిన రోజులన్నీ పత్రికలకు, మిత్రులకు జీవరాగం కాపీలు పేక్ చెయ్యడం, ఫోన్ చెయ్యడంతో బిజీగా గడిచింది. ఆంధ్రాయూనివర్శిటీ ప్రొఫెసర్ అత్తలూరి నరసింహారావుగారు బుక్ అందుకోగానే ‘బుక్ సింపుల్ గా బావుంది, ముందుమాట అనే సర్టిఫికెట్లేకుండా చాలా మంచి పని చేసారు ‘ అని ఉత్తరం రాసారు, బుక్ అందుకున్న ఎండ్లూరి సుధాకర్ మొ॥న మిత్రులంతా ఉత్తరాలు, ఫోన్ల తో బదులిచ్చారు. అక్టోబర్ 18న ఆంధ్రప్రభ నుంచి వచ్చిన టెలిగ్రామ్ గొప్ప సర్ప్రైజ్ తెచ్చింది. అజో – విభా (అప్పాజోశ్యుల- విష్ణుభట్ల) అనే అమెరికా సంస్థ ఆంధ్రప్రభతో కలిపి పెట్టిన పోటీలో నాకథ ‘మధుర’ బహుమతికి ఎన్నికైంది, అక్టోబర్ 26-27న కాకినాడ టౌన్ హాల్లో హిమబిందు అవార్డు ఫంక్షన్ కి అటెండయ్యాను, బహుమతి గ్రహీత డా॥ వి. చంద్రశేఖరరావుని అదే మొదటిసారి చూడడం, రాత్రి సభానంతరం ఆయన్ని మా టాక్సీలో తీసుకొచ్చి సామర్లకోట రైల్వేస్టేషన్లో దించి ఇంటి కొచ్చాం.
96 నవంబర్ 18న తన 72వ ఏట పురాణం సుబ్రహ్మణ్యశర్మగారు దివంగతులయ్యారు.
కాకినాడ క్రాంతి సాహితి నుంచి ఉత్తరం వచ్చింది. ‘మధుర’ కథ మీద ‘కథకస్వరం’ అభినందన సభ డిశంబర్ 1st గానీ, 8th గానీ ఏర్పాటు చేస్తాం అనుమతి తెలుపమని. మా చిన్నమ్మాయికి డాక్టర్ఇచ్చిన డెలివరీ డేట్ అదే కావడం వల్ల అంగీకరించలేక పోయాను. పిల్లల కోసం మనకు విలువైన వాటినెన్నో వదులుకున్నా ఆ విలువ వాళ్లకి తెలీదు. డిశంబర్ 4న మా చిన్నమ్మాయికి పండంటి పాపాయి పుట్టింది. అజో-విజో బహుమతి పొందిన అయిదుగురు కథకులం :- నేను, జొన్నవిత్తుల శ్రీ రామ చంద్రమూర్తి, సన్నపురెడ్డి వెంకటరామారెడ్డి, బండి నారాయణస్వామి, మాడభూషి రామగోపాల్. మాడభూషి తప్ప మిగిలిన నలుగురం రచనా వ్యాసంగాన్ని విజయవంతంగా కొనసాగిస్తూనే ఉన్నాం.
ఆ సంవత్సరం కథలు
28.7.96 వార్త ఆదివారం స్పెషల్లో ‘ఇదీ ఓ బతుకు కథే!’
96 ఆగష్టు ఆహ్వానంలో ‘ఇదా పెళ్లంటే..? ‘
11.8.96 ఆదివారం ఆంధ్రజ్యోతి స్పెషల్ లో‘ఆకలి’
96 అక్టోబర్ విపులలో ‘నిరసన’
96 దీపావళి ఆంధ్రజ్యోతి స్పెషల్లో ‘ప్రయాణం’
7.11.96 ఆంధ్రప్రభలో ‘ వెలుగురేఖలు’
15.11.96 ఆంధ్ర జ్యోతి వీక్లీలో ‘ముత్యాలదండ’
4.12.96 ఆంధ్రప్రభ వీక్లీలో ‘మధుర’
9.4.96 వార్తలో ‘పల్లె’ వ్యాసం; మే 96 ఆహ్వానంలో ’జ్ఞాపకం’ కవిత
21.9.96 విశాఖ సహృదయ సాహితి అవార్డ్ ‘ ఏకాంత శ్రోతస్విని’కవిత ప్రచురింపబడ్డాయి.
*****
కె వరలక్ష్మి జన్మస్థలం, ప్రస్తుత నివాసం తూర్పుగోదావరి జిల్లాలోని జగ్గంపేట. ప్రముఖ కవయిత్రి, “నెచ్చెలి” సంస్థాపకసంపాదకురాలు డా||కె.గీత వీరి అమ్మాయి. నాలుగు నవలికలు, 140 పైగా కథలు, చాలా కవితలు, రేడియో నాటికలు, వ్యాసాలు రచించారు. జీవరాగం (1996), మట్టి బంగారం (2002), అతడు నేను- (2007), క్షతగాత్ర (2014), పిట్టగూళ్లు (2017) కథా సంపుటులు, ఆమె (2003) కవితా సంపుటి, కథ, కథావార్షిక, రంజని, రచన, విశాలాంధ్ర, కవిత, కవితా వార్షిక, నీలిమేఘాలు మొ.లైన వెన్నో సంకలనాలు. చాసో స్ఫూర్తి పురస్కారం, రంగవల్లి, విమలా శాంతి పురస్కారం, సహృదయ సాహితీ, బి.ఎస్ రాములు, హసన్ ఫాతిమా పురస్కారాలు, పొట్టి శ్రీ రాములు తెలుగు యూనివర్శిటీ ధర్మనిధి పురస్కారం , రంజని, పులికంటి, ఆర్.ఎస్ కృష్ణమూర్తి అవార్డులు, అప్పాజోస్యుల- విష్ణుభొట్ల పురస్కారం, శ్రీమతి సుశీలా నారాయణ రెడ్డి సాహితీ పురస్కారం, ఆటా, తానా పురస్కారాలు మొ.నవి కథలకు అవార్డులు. శ్రీ శ్రీ, దేవుల పల్లి కృష్ణ శాస్త్రి అవార్డు మొ.నవి కవితలకు అవార్డులు. శాస్త్రీయ సంగీతం, గజల్స్ వినడం, మంచి సాహిత్యం చదవడం అభిరుచులు.