పుత్రకామేష్టి
(నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక & అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎన్నికైన కథ)
– డి.కామేశ్వరి
పెళ్లయి వెళ్ళాక కరోనా ధర్మమాని రెండేళ్ల తరువాత వచ్చిన మనవడిని చూసి సంబరపడిపోయింది అనసూయమ్మ. పలకరింపులు కబుర్లు భోజనాలు నిద్రలు అయ్యాక సావకాశంగా కాఫీ కప్పుతో కూర్చుని
“ఏమిటి బామ్మా కబుర్లు”అంటూ చేయి పట్టుకు పలకరించాడు మనవడు చైతన్య .
“ముసిలిదాన్ని నా దగ్గరేముంటాయి కబుర్లు, నీవే చెప్పు మీ అమెరికా కబుర్లు, కొత్త పెళ్ళాం కబుర్లు, మీ హనీమూన్ పర్వం అయిపోయిందా..”మురిపంగా చూస్తూ అందావిడ.
“పో బామ్మా రెండేళ్లయింది ఇంకా కొత్తపెళ్ళాం, హనీమూన్ లు, ఏమిటి ప్రేమ యాత్రలకి నందనవనాలు, బృందావనాలు ఏలనోయి అన్నట్టు గృహమే స్వర్గసీమ అనుకుంటూ కరోనా ధర్మమాని ఖర్చు లేకుండా గడిపేసాం”. హాస్యంగా అన్నాడు చైతన్య.
“అయితే పోట్లాటలు లేకుండా అన్యోన్యంగా వున్నారా, మీ ఆవిడ వంట గింటా నేర్చుకుందా, వండి పెడుతుందా..’ ఆరా తీసింది ఆవిడ గొంతు తగ్గించి పక్కగదిలో ఇంకా నిద్ర పోతున్న మనవరాలికి వినపడకుండా.
‘అవన్నీ నీవడగ కూడదు నేచెప్పకూడదు. అవన్నీ పాతకాలం కబుర్లు. ఎవరికీ టైముంటే వాళ్ళు చేస్తాం. అక్కడ కాఫీ కావలిస్తే కలుపుకుంటాం. ఆకలేస్తే అన్నం వండేయాలి, పప్పో కూరో ఏం తిన్నాం అన్నది కాదు కడుపు నిండిందా అన్నదే పాయింట్. అంతగా ఓపిక లేకపోతే హోటల్కి పోతాం సెలవురోజు వస్తే’ అన్నాడు నిర్లిప్తంగా చైతన్య.
” అదేమిటిరా అదేం చోద్యం పెళ్లయి పెళ్ళాం వచ్చాక అయినా ఇంట్లో వంట చేయదా” వింతగా చూస్తూ అనసూయమ్మ అడిగింది . “మరేంటనుకున్నావు ఉద్యోగం చేసే పెళ్లామంటె.. మాతో సమంగా చదివి, సమంగా సంపాదిస్తున్నవాళ్ళు, మేమే ఎందుకు చేయాలి పని అంతా ఇద్దరం కలిసి చేయాలంటారు ..కాఫీ అని ఆర్డర్ వేస్తె గో అండ్ గెట్ అంటారు ఇప్పటి అమ్మాయిలు నీవింకా ఎప్పటి ప్రశ్నలో వేస్తె ఎలా బామ్మా..”నవ్వుతూ తేలిగ్గా అన్నాడు.
“బానేవుంది సంబడం. ఆ మాత్రం దానికి పెళ్లి ఎందుకు..ఏం చదువులు చదివితే మాత్రం ఆడది ఇల్లు సంసారం పట్టించుకోవద్దా..” కోపంగా అందావిడ.
“బామ్మా ఆ మాటలు వదిలేయి ఇంకేమన్నా కొత్త సంగతులు చెప్పు.”
“వాళ్ళు కలిసిమెలిసి పనులు చేసుకుంటారు. మనలా ఆడపని మగపని అనివుండవక్కడ. మీరేం అనకండి వసుధ దగ్గర చాదస్తంగా.” కోడలు కాస్త మందలింపు ధోరణిలోనే అంది.
“ఆ అవును రేపు పొద్దున్న పిల్లలు కంటే నెప్పులు నీవంతు అంటారేమో చూసుకో నాపీలు పాలసీసాలు ఇప్పటికే అంట కట్టారు మీ వంతని” అందావిడ వ్యంగ్యంగా.
“ఏదో ఏడవండి గాని రెండేళ్లయింది మునిమనవడిని ఎత్తుకుని కానీ నేను కదలను. అదేదో తొందరగా ఇచ్చేస్తే చూసి దాటిపోతా. ఇంకా ఉంటే ఇంకేం పోకడలు చూడాలో.. ఒరేయి హాస్యం కాదు రెండేళ్లయింది పిల్లలని కనే ప్లానుందా లేదా.. ఇంకా ఏదో కరోనా టైం అని భయపడి అడగలేదు.”అంది
“బాబోయి పిల్లలా నన్నిలా కొన్నాళ్ళు హాయిగా బతకనీ”నవ్వుతూ దాటేశాడు.
“బామ్మా పిల్లల్నికనాలంటే భయమేస్తుంది వాళ్ళతో మా స్నేహితులు పడుతున్న అవస్థలు చూస్తే. ఇప్పటి పిల్లలు తెలివిమీరి పోయారు బామ్మా.. తినడానికి చేతిలో ఫోన్లో బొమ్మలు చూపెడుతూ ముద్దలు నోరు తెరిచినప్పుడల్లా కూరాలి, ఏడుపు ఆపాలంటే ఐపాడ్ చేతిలోకి రాగానే టక్కున ఆపేస్తారు. ఏడెనిమిది నెలలు వరకు ఓకే గాని తరువాత పాట్లు చూడాలి. ఓ పక్క ఉద్యోగాల టెన్షను, ఇంట్లో పిల్లల పెంపకం, ఏమిటో ఆ పరుగులు, ఉరుకులు, గెంతడాలు, మొండితనాలు, కావాలన్నది ఇచ్చే వరకు ఆ ఏడుపులు, తినిపించడానికి మా ఓపికలు అడుగంటి పోతాయి, గంట గంట కూర్చోవాలి, కళ్లు పాడవుతాయని ఐపాడ్ అవి ఇవ్వకపోతే తినరు..వాళ్ళ ముద్దు మురిపాలు ఫోటోలు తీస్తే, అవి చూసుకుని ఏడాది పిల్లాడూ కూడా ఎంత మురిసిపోతాడో…వాళ్ళడిగే ప్రశ్నలకి జవాబులు ఇవ్వడానికి ఎంతంత ఓపికలుండాలో, బాబోయి వాళ్ళందరి బాధలు చూస్తే పిల్లలిని కనాలంటే భయం వేస్తుంది. మీరంతా అరడజనుకి తక్కువ కాకుండా కని ఎలా పెంచారో ఆశ్చర్యంగా ఉందిపుడు. పిల్లలు కాదు పిడుగులు ఈ జెనరేషన్ పిల్లలు” గుక్క తిప్పకుండా ఏకరువు పెట్టాడు మనవడు.
“అదేమిటిరా పిల్లలని పెంచడానికి భయపడి కనకపోవడం ఏమిటి విడ్డూరం “అనసూయమ్మ వింతగా చూస్తూ అన్నది “మీరు ఒకళ్ళు ఇద్దరు అయి గారాబంచేసి పిల్లని పెంకి వాళ్ళుగా, మొండి వాళ్ళుగా, చేస్తున్నారు. ఇద్దరు సంపాదిస్తూ అడిగిందంతా కొనిచ్చి, వాళ్ళు ఆడింది ఆట పాడింది పాటలా మీరు వాళ్ళని పెంచి పాడుచేస్తున్నారు. వాళ్ళని కాదు మిమ్మల్ని అనాలి అసలు”
“మీరేంచేసేవారు.. మీకాలంలో పిల్లలు ఇలావుండేవారు కాదా ” మనవడు చెప్పమన్నట్టు చూసాడు.
“ఆరేడు నెలల వరకు మూలనున్న ముసలమ్మ పెంచుతుంది అనే సామెత వుంది. అప్పటి వరకు పాలు నీళ్లు టైమ్ ప్రకారం జరిగిపోతాయి. అప్పుడైనా వేడివేడి నీళ్లు నలుగు పెట్టి స్నానం చేయిస్తే, పాలు రెండు వైపులా తాగించి చక్కగా పడుకోబెడితే మూడు గంటలు వొళ్ళెరగ కుండా పడుకునేవారు. మీవి చలిదేశాలని బేసిన్లో గబగబా గిన్నెలు తొలిచినట్టు స్నానం చేయిస్తారు. కుయి మంటే చాలు పాలు కుడి పెస్తారు. రెండుసార్లు చప్పరించి కళ్లు మూసేసి మళ్ళీ అరగంటకు ఏడుస్తారు. ఏడ్చినపుడల్లా పాలు పడితే వాళ్ళకి అదే అలవాటు అయి అరగంటకోసారి ఏడుస్తుంటారు. కాసేపు ఏడవనీయండి, బాలానాం రోదనం బలం అనేవారు ఇదివరకు ఏడిస్తే. శరీరంలోని కండరాలు, నాడులు, కదలికతో బాగా ఆకలి వేస్తుంది. అరగంట ఊరుకుని పాలిస్తే, అడిగినప్పుడల్లా పాలివ్వరన్న సంకేతం చిన్న మెదళ్ళకి అంది రెండు మూడుసార్లకి అర్ధమయ్యి తాగడం మొదెలెడతారు. అసలు పెంపకం అంత ఏడెనిమిది నెలల నించి పాకడం ఆరంభమయినప్పటి నించి మొదలు. అన్నీలాగేస్తారు, పీకేస్తారు. కనిపించిన వన్నీ నోట్లో పెట్టుకుంటారు. పాలు తాగరు. ఏడ్చి అన్ని పనులు సాధ్యపరుచు కుంటారు. అపుడే కాస్త ముందు జాగ్రత్తతో వాళ్ళకి తెలియ చెప్పాలి. పాలు ఇంక తాగవా తీసేయనా అని సీసా చూపిస్తూ అడగాలి. తలూపడం తెలిస్తే వద్దన్నట్టు అనగానే పాలసీసా తీసేయాలి. అంతేగాని ఫోనులో, ఐప్యాడ్లో , టీవీ లలో బొమ్మలో చూపించి తాగించే ప్రయత్నం చేయద్దు . అది వాళ్ళకి అలవాటయి ముద్దకోసారి ఏదో చూపించి పెట్టె అలవాటు చేస్తున్నారు. డైనింగ్ టేబిల్ దగ్గర బేబీ కుర్చేలో కూర్చో పెట్టి భోజనం పెట్టె అలవాటు చేసి గబా గబా తినిపించాలి. కాస్త తిని మానేస్తే ఇంక తినవా వద్ద తీసైనా అని గంభీరంగా అడిగి ప్లేట్ తీసేయాలి. వాళ్ళకి పిచ్చి వేషాలు వేస్తె అమ్మ అన్నం పెట్టదు అని అర్ధమవాలి. మీకేమో పిల్లలు ఏదోలాగా తినాలి హెల్దీగా తయారవ్వాలన్న ఆతృత. ఎలాగో అలాగా ఎదో కాస్తతినిపిస్తే ఆడుకుంటాడు అనో, ఆఫీస్ టైమ్ అయిపోతుందనో, క్రష్ లో సరిగా తినడనో, వాళ్ళు ఏది అడిగితె అది చేసేసి అలవాటు చేస్తున్నారు. అపురూపాలు ఎక్కువయి పోయాయి. పెళ్లి అయ్యాక ఐదారేళ్ళకి కంటున్నారు ఒకరిని, డబ్బెక్కువయింది, ముద్దెక్కువయి పిల్లలని పాడుచేస్తున్నారు. తుమ్మితే భయం, దగ్గితే బెంబేలు పడిపోవడం, కాస్త వళ్లు వెచ్చబడితే గాభరా, డాక్టర్ల దగ్గిరికి పరుగులు. మాటలు రాకపోయినా ఏడాదినిండిన పిల్లకి, మీ గాభరాలు, మీ వీక్నెస్సులు, మీ అపురూపాలు అన్నీ అర్ధమవుతాయి. ఎలా మిమ్మల్ని లొంగదీసుకోవాలో అర్ధం అవుతుంది. ఏడ్చి తిండి మానేసి లొంగదీస్తారు. కాస్త పెద్దయిందగ్గర నించి కనిపించిన బొమ్మ అల్లా కావాలంటారు. ఎవరి దగ్గర ఏది కొత్తగా కనిపిస్తే అది కొనాలి. కొందరయితే పిచ్చి అల్లరి చేస్తారు. ఇంట్లో వస్త్తువులు పాడుచేసి, విరకొట్టి, తోటి పిల్లని కొట్టి, వాళ్ళ చేతుల్లోవి లాక్కోడం. వాళ్ళని చినప్పుడే కంట్రోల్లో పెట్టకపోతే,పెద్ద అయ్యాక ఇంకా దురుసుగా తయారవుతారు. ఆ అనగానే ఆగే భయం ఉండాలి”.
“నిజమే బామ్మా మాఫ్రెండ్స్ పిల్లలు దభీ మని సోఫాలు ఎక్కి గెంతుతుంటే ఏమనరు పేరెంట్స్.. కొత్త సోఫాలు బోలెడు డబ్బు పోసి కొన్నారు, మా లాంటి వాళ్ళు వెడితే వాళ్ళ విద్యలన్ని చూపడానికి మరీ చేస్తారు. వాళ్ళందరిని చూసాక అందుకే పిల్లని కనాలంటే భయం వేస్తుంది”. నిజాయితీగా అన్నాడు చైతన్.
“మీ రోజుల్లో ఆలా అల్లరి చేస్తే అంత మందిని ఎలా కంట్రోల్ చేసేవారు బామ్మా చెప్పు” అన్నాడు నిజంగా తెలుసుకోవాలనే.
“ఇంట్లో సమిష్టి కుటుంబాలు, పదిమంది పిల్లలు, వాళ్లలో వాళ్ళు ఆడుకునేవారూ, దెబ్బలాడుకునేవారు, మళ్ళీ కల్సి పోయేవారు. ఆడపిల్లలు అంతా చింతపిక్కలు, గవ్వలు, తొక్కుడు బిళ్లలు…మగపిల్లలు చెడుగుడు, బంతాటలు, పెరళ్ళలోనో వీధుల్లోనో పరిగెత్తి ఆడేవారు. అసలు అన్నాలు పెట్టాం అని పిలిస్తేనేకాని వచ్చేవారు కాదు. పొద్దుటే స్నానాలు చేయించి తలలు దువ్వేస్తే, చల్ది అన్నాలు పెట్టేస్తే మా పని అయిపోయేది. చిన్నపెద్ద పిల్లలు వాళ్ళ ఆటలు పాటలు మరీ చంటి పిల్లలు తప్ప రెండేళ్ల పిల్లలు కూడా వాళ్ళ ఆటలు చూస్తూ కూర్చునేవారు. ఆకలేస్తేనే మా దగ్గర కొచ్చేవారు. దెబ్బలు తగిలించుకుని వస్తే ఇంత టించరు రాసేవాళ్ళం. కంప్లయింట్లు వినే వాళ్ళం కాదు. కల్సి ఆడుకోండి అని చెప్పేవాళ్ళం. పెద్దయ్యాక బడిలో వేసాక ఏం చెప్పేవారో…ఏం చదివే వారో పట్టించుకునేవాళ్ళమే కాదు. అలా పెరిగే వాళ్ళు. మీలా ఈ నాజూకులు అపురూపాలు మేము ఎరగం. తప్పుచేస్తే స్కూల్ అయినా, ఇల్లయినా, రెండు దెబ్బలు వేసేవాళ్ళు తండ్రులు టీచర్లు. ఆ భయ భక్తులు ఎక్కడ ఈనాడు..” అలా చెప్పుకు పోతుంది అనసూయమ్మ. ” అయితే మా పెంపక లోపమే అంటావా”.
“అవుననే అంటాను ప్రేమలు మమకారాలు గుండెల్లో దాచుకుని ఆగు అంటే ఆగాలి. నాన్న ఏమంటాడో, టీచరు చదవకపోతే ఏమంటారో అనే భయం ఉండాలి పిల్లలకి”.
“ఈ జెనరేషన్ పిల్లలు మీ టైమ్ పిల్లల్లా కాదు. వాళ్ళు వయసుకి మించిన నాలెడ్జితో లాపాయింట్లు తీసి వాదించి మనలని వప్పిస్తారు”.అన్నాడు చైతన్య.
“అందుకే మొక్కగా ఉండగానే వంచాలి. మంచిచెడ్డ చెప్పితే ఓహో అనుకుంటారు. ఇది మంచి అది చెడ్డ ఎలా వుండాలో ఎలా వుండకూడదో కధల్లా చెపితే వాళ్లలేత మనసుల్లో ముద్ర పడుతుంది. ఇది వరకు పెద్ద వాళ్ళు దగ్గర కూర్చోపెట్టుకుని నీతి కధలు పద్యాలు చెప్పి బోధపరిచేవారు”అంది మనవడిని చూస్తూ.
“అయితే మాదే తప్పు అని తేల్చేసావన్న మాట”.
“నిస్సందేహంగా అవునంటాను. ఆ పసిపిల్లలకి చెప్పే విధంగ చెపితే అర్ధ మవుతుంది. చిన్నప్పటి పెంపకం సరిగా వుంటే”. “ఈ పాఠం గుర్తువుంచుకుంటానులే” నవ్వాడు మనవడు.”గుర్తుంచుకోడం కాదు. ఈసారి వచ్చేసరికి ముగ్గురు రావాలి” అంది దబాయింపుగా అనసూయమ్మ.
“బాబోయి టైం లిమిట్లు పెట్టకు” అన్నాడు దండం పెడుతూ.
“మీ ఇష్టం వచ్చినపుడు కార్లు ఇల్లు ఫర్నీచర్లు సమకూర్చుకుని కంటాం అంటే ఇదేమి రైస్ కుక్కర్ కాదు అన్నం తయారు అయిపోడానికి. కావలసినపుడు కనడానికి ఇంకా మందులు రాలేదు” అంది.
నవ్వి లేచి లోపలి కి వెళ్ళాడు చైతన్య.
బామ్మ కోరిక తీర్చాలనే కాక వాళ్ళకే ఒకటే రొటీన్ ఆఫీస్ పని, వండుకోవడం, తినడం, ఎంతసేపు ఒకరి మొహం ఒకరుతప్ప ఇంట్లో ఇంకో మొహం కనపడక వాళ్ళకి మార్పు కావాలనిపించింది. ఇటు అటు కూడా రెండేళ్లయింది చాలు కనే ఒకర్నో ఇద్దరినో కనేయండి ఆలస్యం చేయకుండా అనే ఒత్తిడి ఫోన్లు వస్తుండడంతో ఏదో ఆ పని కానిచ్చేద్దాం అన్న నిర్ణయానికి వచ్చారు చైతన్య దంపతులు.
కానీ వాళ్ళ బామ్మ అన్నట్టు, రైస్ కుక్కర్ స్విచ్ వేసినంత సులువుగా వారు కోరుకున్న వెంటనే కావాలను కున్నప్పుడు పిల్లలు పుట్టరు అన్నది తెలిసేసరికి ఏణ్ణర్ధం గడిచిపోయింది.
“ఫామిలీ ప్లానింగ్ మాత్రలు పెళ్లయిన దగ్గర నించి వాడుతున్నారు కనక మూడునాలుగు నెలలు గ్యాప్ ఇవ్వాలి సిస్టం నార్మలు అయ్యే వరకు. మాత్రలు మానేసిన, ఇతర మెథొద్స్ వాడి, ప్రెగ్నన్సీ రాకుండా చూసుకోండి. తరువాత ఆరునెల్ల లోపల ప్రగ్నెన్సీ రాకపోతే కలవాలి డాక్టర్ ని. నార్మల్గా సంసారం చేసేటప్పుడు ఆరునెలలలోగా గర్భం రావాలి, అలా కాక పొతే టెస్టులు చేస్తాం, రిజల్టు చూసి ,ఇద్దరిలో లోపాలు గుర్తిస్తాం. ముందు మాత్రలు ఆపేసి నేను చెప్పినట్టు చేయండి. ప్రెగ్నెసి కావాలనుకున్నపుడు డ్రింకులు తాగకండి.”అంటూ అన్ని సవిస్తరంగా భోదపరిచి, నెలలో ఏ డేట్స్ లో ప్రెగ్నెన్సీ ఛాన్సులు ఎక్కవ వుంటాయో అన్నీ రాసి భోధపర్చింది డాక్టరమ్మ.
“బాబోయి ఎంత తతంగం పిల్లలు కనడానికి”.భయం నటిస్తూ నవ్వాడు చైతన్య భార్యతో.
“నో డ్రింక్స్ డియర్ లెట్ అజ్ స్టార్ట్ ఫ్రమ్టుడే” అన్నాడు యుద్దానికి వెళ్లాడనికి సంసిద్దుడవుతూ. నవ్వింది భవ్య.
నవ్వినట్టు కాదు పిల్లని కనడం, అంతా మీ చేతుల్లో ఉన్నట్టు ఉహించు కోకండి, నేనొకడ్ని వున్నా పైన, అన్నట్టు ఆరు నెలలు కాదు ఏడాది పైన మూడు నెలలైనా ప్రెగ్నెన్సీ రాకపోయే సరికి, గాభరా భయం మొదలై డాక్టర్ దగ్గరికి పరిగెట్టారు ఇద్దరు. డాక్టర్ ఇద్దరికీ అన్ని టెస్ట్ లు చేయించి చావుకబురు చల్లగా చెప్పింది “స్పెరమ్ మొటిలిటీ తక్కువగా వుంది, కౌంట్ కూడా కొంచెం తక్కువే, అయినా భయం లేదు మందులతో సరిచేయవచ్చు”
అంటూ కొన్ని ఇంజక్షన్ లు మందులు రెండు నెలలు వాడి మళ్ళీరండి. ఆవిడకి అన్నీ పర్ఫెక్ట్ వున్నాయి. ” అంది డాక్టర్. చైతన్య మొహం వాడింది.
“మందులతో సరిగా అవుతుందా”అన్నాడు కలవరంగా .”లెట్ అజ్ వెయిట్ అండ్ సి “అని ధైర్యం చెప్పి పంపింది. భార్య భర్త ఇద్దరు మాట్లాడుకుని ఎవరితో ఏం చెప్పద్దు చూద్దాం అన్న నిర్ణయానికి వచ్చారు .
అనుకున్నవి అనుకున్నట్టు అయితే ఇంకేం అన్నట్టు రిజల్ట్ లో మొబిలిటీ లో తేడాలేదు.
“ఈ ఐటి ఉద్యోగాలొచ్చాక చాలా మంది మగాళ్ళకి ఈ ప్రాబ్లెమ్ కనిపిస్తుంది. ఇంకా టైం వేస్ట్ చేయకుండా ఐ.వి ద్వారా ట్రై చేద్దాం. మీరు నిర్ణయం చేసుకుని చెప్పండి. అది కూడా ఒకసారితో సక్సస్ అయిపోతుందనుకోవద్దు. రెండుమూడుసార్లు పట్టచ్చు. అంటూ మెంటల్గా వాళ్ళిద్దరిని ప్రిపేర్ చేసి ప్రొసీజర్ ఖర్చు అన్ని వివరంగా చెప్పింది .
ఖర్చు తలచుకుని గాభరాపడి,పెంచుకుంటేనో అని అలోచించి, వున్న సేవింగ్స్ గోవిందా అయినా సక్సెస్ ఐతేచాలని, కిందా మీదపడి ఆలోచించి, ఎవరికీ చెప్పద్దు అని ఆఖరి ఛాన్స్ తీసుకోడానికి నిర్ణయించుకున్నారు భార్యాభర్తలు. భగవంతుడు దయ తల్చినట్టు రెండోసారి సక్సెస్ అయి ప్రెగ్నన్సీ నిలిచింది. మొత్తానికి ఒక కొడుకు పుట్టి కళ్ళు కాయలు కాచెట్టు ఎదురుచూసిన తాతల్ని అమ్మమ్మని నాయనమ్మని అందిరిని సంతోష పెట్టాడు చైతన్య. ఇది వరకు రోజుల్లో పిల్లల కోసం యజ్ఞాలు చేసేవారు. పాపం చైతన్య కొడుకు కోసం యజ్ఞాన్ని మించిన పనేచేసాడు.
అంత అపురూపంగా, అంత ఖర్చుపెట్టి, కన్నకొడుకుని ఎంత బాగా మామ్మ చెప్పిన పాఠాలు గుర్తుపెట్టుకుని పెంచుతాడో, అయిదేళ్లకి అపురూపంగా పుట్టిన కొడుకుని ఎంత ముద్దు చేస్తాడో తెరమీద చూడాల్సిందే!!!
*****
డి.కామేశ్వరి కథారచయిత్రిగా తెలుగుసాహిత్య లోకానికి సుపరిచితులు. 11 కథా సంపుటాలు, 21 నవలలు, సుమారు 300 కథలు, 30 కవితలు, ఒక కవితా సంపుటి ప్రచురితాలు. కొత్తమలుపు నవల ‘న్యాయం కావాలి’ సినిమాగా, కోరికలే గుర్రాలైతే నవల అదే పేరుతో సినిమాగా వచ్చాయి. కొన్ని నవలలు టెలీఫిల్ములుగా, టీవీ సీరియళ్లుగా వచ్చాయి.
ఈ కాలంలో పిల్లలని పెంచడం ఎంత కష్టమో?తెలిపారు.కథచాల బాగుంది. పిల్లల్ని కనటానికి డాక్టర్ల, చుట్టూ తిరిగి ఎంతో శ్రమపడి కన్నాక ఆ పిల్లల్ని గారాబం చెయ్యకుండా పెంచలేరు.అని నా అభిప్రాయం.