మహా సృజనకర్తకు కన్నీటి వీడ్కోలు కథనం

పుస్తకాలమ్’ – 13

(ప్రపంచవ్యాప్త సాహిత్యాన్ని పరిచయం చేసే ఎన్.వేణుగోపాల్ పుస్త’కాలమ్’ )

  -ఎన్.వేణుగోపాల్

 

          చనిపోయిన తన తల్లిదండ్రుల గురించి ఒక వ్యక్తి తన జ్ఞాపకాలు రాయడం పెద్ద విశేషమేమీ కాదు. అవి రాస్తున్నప్పుడు ఆ వ్యక్తి కూడ 62 ఏళ్ల వాడు కావడం కాస్త విశేషం.

          ఆ జ్ఞాపకాలు తనకు తెలిసిన తల్లిదండ్రుల జీవితం మొత్తానివి కూడ కాదు. తండ్రిని ఆస్పత్రి నుంచి ఇంటికి చేర్చి, కొన్ని వారాల కన్న ఎక్కువ బతకడని తెలిసినప్పటి నుంచి అంత్యక్రియల దాకా సాగిన కథనం కావడం ప్రత్యేకం.

          ఆ కథనంలో గడిచిన భౌతిక కాలం ఎక్కువలో ఎక్కువ ఒక నెల, కాని వెనుకా ముందూ ఆలోచనల్లో కొన్ని దశాబ్దాలు. కథ నడిచిన స్థలం ప్రధానంగా ఒక నగరం, ఒక ఆస్పత్రి, ఒక ఇల్లు, ఒక విద్యుత్ శ్మశాన వాటిక, చితాభస్మం ప్రజా ప్రదర్శనకు పెట్టిన ఒక రాజప్రాసాదం – అన్నీ ఒక్క మెక్సికో సిటీ లోనే. కాని కథలో పాత్రలు చుట్టివచ్చినది ప్రపంచం.

          ఆ తండ్రి కోట్లాది మంది పాఠకుల అభిమాన రచయిత గనుక, ఆయన గురించి ఎవరు ఏమి రాసినా ఆసక్తితో చదివే పాఠకులు ఉండడం కూడ సహజమే. “ప్రతిరోజూ స్నానం చేసి వీపు తుడుచుకుంటున్నప్పుడు, నా ఆరో ఏట వీపు ఎలా తుడుచుకోవాలో నేర్పిన నాన్న గుర్తొస్తాడు” అని ఆ అరవై రెండేళ్ల పెద్దమనిషి ఎనబై ఏడవ ఏట మరణించిన తన తండ్రి గురించి రాయడం దానికి ప్రత్యేకత అద్దింది. అది ఆ ఇద్దరు తండ్రీకొడుకుల నామవాచకాల కథ కాదనీ, ప్రపంచమంతా ఎప్పుడైనా ఎక్కడైనా సాగే తండ్రీకొడుకుల, తల్లీకొడుకుల సంబంధపు కథ అనీ చదువరి హృదయతంత్రులను మీటి కనులు చెమ్మగిల్లేలా చేస్తుంది.

          ఆ కొడుకు రోడ్రిగో గార్షియా. ఆయన రాసిన పుస్తకం ‘ఎ ఫేర్ వెల్ టు గాబో అండ్ మెర్సిడిస్ – ఎ సన్స్ మెమొయిర్’ A Farewell to Gabo and Mercedes – A Son’s Memoir). పుస్తకానికి వస్తువైన తండ్రి గాబ్రియెల్ గార్షియా మార్క్వెజ్. తల్లి మెర్సిడిస్ బర్చా.

          ఈ పుస్తకాలమ్ శీర్షిక ప్రారంభించడమే గాబ్రియెల్ గార్షియా మార్క్వెజ్ పుస్తకంతో ప్రారంభించాను. ఆ వ్యాసంలోనూ అంతకు ముందూ కూడా మార్క్వెజ్ మీద నా అభిమానాన్ని చాలసార్లు చెప్పుకున్నాను. 1982లో ఆయనకు నోబెల్ సాహిత్య బహుమతి రాగా అప్పుడే సుబ్బారావు వన్ హండ్రెడ్ యియర్స్ ఆఫ్ సాలిట్యూడ్, నోబెల్ బహుమతి ఉపన్యాసం నాకిచ్చాడు. ఆ బహుమతి స్వీకార ఉపన్యాసాన్ని అప్పుడే తెలుగు చేసి సృజనలో ప్రచురించాను. నలబై ఏళ్లుగా మార్క్వెజ్ రాసిన, మార్క్వెజ్ మీద రాసినవన్నీ దొరికినవన్నీ చదివే పిచ్చి అలా కొనసాగుతూనే ఉంది.

          ఇప్పుడు రోడ్రిగో తన తల్లిదండ్రుల స్మరణలో ఈ పుస్తకం రాశాడంటే మార్క్వెజ్ కోసమే కొనుక్కున్నాను. కాని ఈ పుస్తకం కేవలం రోడ్రిగో తల్లిదండ్రులకు అర్పించిన నివాళి మాత్రమే కాదు, అది లాటిన్ అమెరికన్ మాంత్రిక వాస్తవికత గురించీ, ఆ మాంత్రిక వాస్తవికతను అక్షరీకరించడానికి గాబో చేసిన ప్రయత్నం గురించీ చెప్పిన పుస్తకం. గాబో, మెర్సిడిస్ ల వ్యక్తిత్వాలను సూక్ష్మంలోనే విస్తారంగా తెలిపిన పుస్తకం. తల్లిదండ్రులకూ కొడుకుకూ మధ్య సంబంధం గురించీ, జ్ఞాపకశక్తి కోల్పోయిన తండ్రి తమతో, తల్లితో, స్నేహితులతో, ఆరోగ్యసేవకులతో ప్రవర్తించిన తీరు గురించీ, మరణం చేరువలోకి వచ్చిన తర్వాత తండ్రితో దగ్గరిగా చివరి రోజులు గడిపిన కొడుకు గురించీ, తండ్రి రచనా పద్ధతి గురించీ, స్నేహాల గురించీ, మహారచయిత అంత్యక్రియల గురించీ, ఆ విషాద సమయంలో తల్లి దృఢత్వం గురించీ అనేక స్థాయిల్లో, అనేక కోణాల నుంచి పొరలు పొరలుగా మానవసంబంధాలను అందంగా, కవితాత్మకంగా, లోతుగా, విశాలంగా చిత్రించిన చిన్న పుస్తకం ఇది.

          గాబోకు కాన్సర్ వ్యాధి వచ్చిందని 1999లో మొదటిసారి బైటపడింది. బాధాకరమైన చికిత్సల మధ్య కూడ రాయడం మానకుండా, మూడు సంపుటాలుగా తలపెట్టిన ఆత్మకథ మొదటి భాగం ‘లివింగ్ టు టెల్ ఎ టేల్ ‘ 2002లో వెలువరించాడు. చివరి నవల ‘మెమొరీస్ ఆఫ్ మై మెలాంకలీ వోర్స్’ 2004లో వెలువరించాడు. రాయకుండా ఒక్కరోజు కూడ గడవని ఆరు దశాబ్దాల జీవితం తర్వాత 2005లో మొట్టమొదటిసారి “ఏమీ రాయకుండా గడిచిన సంవత్సరం” అని ఆయనే చెప్పుకున్నాడు. కాన్సర్ చికిత్స, అది సాగుతుండగానే 2012లో వచ్చిన మతిమరుపు, 2014 మార్చ్ లో న్యూమోనియాతో మొదలై ఊపిరితిత్తులకూ, కాలేయానికీ కాన్సర్ వ్యాపించి తోసుకొచ్చిన మృత్యువు… మనకాలపు మహారచయిత 2014 ఏప్రిల్ 17న అస్తమించాడు.

          తాను అన్నిటికంటె ఎక్కువగా చావునే అసహ్యించుకుంటాననీ, తన జీవితంలోని ఆ ఒక్క అంశం గురించి రాయడం మాత్రమే తనకు అసాధ్యం కావడమే కారణమనీ గాబో ఫిర్యాదు చేస్తుండేవాడట. ఆయన గడిపిన జీవితమంతా, సాక్షిగా నిలిచిన జీవితమంతా, ఆలోచించిన జీవితమంతా ఆయన పుస్తకాల్లో ఉంది, కాల్పనీకరించబడింది, గ్రహించ బడింది. “రాయకుండా బతకగలిగితే రాయకు” అని తరచూ అంటూ ఉండేవాడట. “నేను కూడా రాయకుండా బతకలేను, కనుక ఇది రాసినందుకు ఆయన నన్ను క్షమిస్తాడనే నమ్మకం. ‘బాగా రాసినదానికన్న బాగుండేదేమీ లేదు’ అని ఆయన తరచుగా అనే మరొక మాట నేను చచ్చిపోయేదాకా గుర్తుంచుకుంటాను. ఇప్పుడు నేను ఆయన చివరి రోజుల గురించి రాయబోయేదాని నాణ్యత ఎట్లా ఉన్నా ప్రచురణకర్తలు సులభంగానే దొరుకుతారు గనుక ఆ మాట నా చెవుల్లో మారుమోగుతున్నది. ఏదో ఒక రూపంలో ఈ జ్ఞాపకాలు రాస్తానని కూడా నాకు తెలుసు. అలా రాసినప్పుడు మళ్లీ ఆయన మాటలతోనే ఊరట పొందుతాను: ‘నేను చచ్చిపోయాక, మీకు ఏది తోస్తే అది చేయవచ్చు’ అన్నాడాయన” అంటూ రోడ్రిగో తండ్రి చనిపోయిన ఏడు సంవత్సరాలకు, తల్లి చనిపోయిన ఏడాదికి ఈ జ్ఞాపకాలను బైటికి తెచ్చాడు.

          “జీవితమంటే ఒక వ్యక్తి జీవించినది కాదు. ఆ వ్యక్తి జ్ఞాపకం ఉంచుకున్నది, ఆ వ్యక్తి తిరిగి చెప్పడానికి గుర్తు చేసుకున్నది” అని మార్క్వెజ్ స్వయంగా రాసినప్పటికీ, రోడ్రిగో మాత్రం జ్ఞాపకం మీద కన్న ఎక్కువగా వాస్తవంగా జరిగిన సంఘటనల మీద, ఆ విచార విషాద కాలంలోనే తాను రాసుకున్న నోట్స్ మీద ఆధారపడ్డాడు. అలాగే తన చిన్నతనం నుంచీ తనతో, తమ్ముడితో, తల్లితో, మిత్రులతో తండ్రి జరిపిన సంభాషణల శకలాలు అవసరమైనచోట వాడుకున్నాడు. తండ్రి నవలల నుంచీ, ఆత్మకథ నుంచీ అత్యవసరమైన వాక్యాలు ఉటంకించాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ నూట అరవై పేజీల, ఐదు అధ్యాయాల చిన్న పుస్తకం, దానిలో ఫొటోలూ, ఖాళీ పేజీలూ, ఉటంకింపులూ తీసేస్తే, ఎనబై పేజీలు కూడా లేని రచన గాబ్రియెల్ గార్షియా మార్క్వెజ్ అనే మహామాంత్రిక, ఐంద్రజాలిక వాస్తవికతా సృజనకర్త కొండను అద్దంలో చూపినట్టు చూపుతుంది. మృత్యువు పొలిమేరల్లో విషాద వాతారణంలోనే ఆ సృజనకర్త ఎంత అద్భుతమో చూపుతుంది.

          లాస్ ఏంజెలిస్ లో స్థిరపడిన రోడ్రిగో స్వయంగా సినిమా దర్శకుడు, సినిమా రచయిత. తండ్రి అనారోగ్యం తర్వాత చాల ఏళ్లకు, మతిమరుపు మొదలయ్యాక రెండేళ్లకు, అప్పటికే రెండు సార్లు కాన్సర్ బారినపడిన తల్లి పరీక్షల కోసం కాలిఫోర్నియా రావలసి ఉన్న సమయంలో గాబోకు న్యుమోనియా వచ్చిందని, ఆస్పత్రిలో చేర్చవలసి వస్తుందేమోనని రోడ్రిగోకు ఫోన్ వచ్చింది. తల్లిని పరీక్షల కోసం తన దగ్గరికి రప్పించుకుని, తండ్రి సంరక్షణకు పారిస్ నుంచి తమ్ముడు గొంజాలోను రప్పిస్తాడు. అది న్యుమోనియా కాదనీ, లంగ్ కాన్సర్ కావచ్చుననీ, లివర్ కాన్సర్ కూడా కావచ్చుననీ, అందువల్ల ఆయనకు ఆస్పత్రిలో చేయగలిగిందేమీ లేదనీ, ఇంటికి తీసుకుపొమ్మనీ మెక్సికో నుంచి కబురు వస్తుంది. అంటే గాబో జీవితం వారాల్లోకో, రోజుల్లోకో వచ్చిందనీ, ఆ మిగిలిన సమయం ఆయనకు ఆహ్లాదకరంగా ఉంచమనీ అర్థం. అది బహుశా మార్చ్ మధ్యలో కావచ్చు. అప్పటి నుంచి ఏప్రిల్ 17 వరకూ గడిచిన మూడు నాలుగు వారాల ఘటనలనూ పరిణామాలనూ రోడ్రిగో కన్నీటితో, నెత్తుటితో, తండ్రి జీవన, రచనా జ్ఞాపకాలతో తాను గడపడం మాత్రమే కాదు, మనతోనూ ఆ ఉద్వేగభరిత క్షణాలను అనుభవింపజేస్తాడు.

          కుటుంబ సభ్యులు, సన్నిహిత మిత్రులు మరణశయ్య మీద ఉన్నప్పుడు, వారి చివరి రోజులను, చివరి క్షణాలను నిస్సహాయంగా చూస్తూ కుమిలిపోతూ, అయినా బైటికి గంభీరమైన ముఖం పెట్టి, తప్పని, అవసరమైన పనులు చేస్తూ గడపడం చాల మందికి అనుభవంలో ఉన్నదే. గాబ్రియెల్ గార్షియా మార్క్వెజ్ వంటి మహాద్భుత రచయిత కుటుంబ సభ్యులు కూడా మనలాంటి వేదనకే గురయ్యారని ఈ పుస్తకం చూపుతుంది. ఒక ముసిముసి వేకువ మా అమ్మ ఆస్పత్రిలో మరణించినప్పుడు, అంతకు ముందు రాత్రి ఎనిమిది తొమ్మిది గంటలు ఆమె మంచం పక్కన కూచుని నిస్సహాయంగా ఆ వేదన అనుభవించిన ఇరవై ఏళ్ల కుర్రాడిగా, ఈ పుస్తకంలో రోడ్రిగో రాసిన ఉద్వేగాలన్నీ నా అనుభవమేనన్నంతగా సహానుభూతి చెందాను. బహుశా ఏ చదువరి అయినా ఆ విషాద ఉద్వేగానికే లోనవుతారు.

          గాబో ఒక గురువారం నాడు చనిపోయాడు. అంతకు కొద్ది ముందే ఒక పక్షి విసురుగా వచ్చి ఆ భవనం పై అంతస్తు కిటికీ అద్దాన్ని చూసుకోకుండా గుద్దుకుని కింద పడి చనిపోయిందట. ఇంట్లో వాళ్లందరూ ఇదేదో అపశకునం అనుకున్నారట. కొన్ని గంటలకే గాబో చనిపోయాడు. ఈ సంగతి తెలియగానే మార్క్వెజ్ అభిమాని ఒకరు వన్ హండ్రెడ్ యియర్స్ ఆఫ్ సాలిట్యూడ్ లో ప్రధాన పాత్ర ఉర్సులా ఇగువారన్ సరిగ్గా అట్లాగే ఒక గురువారం నాడు చనిపోయిందనీ, ఆ రోజే పక్షులు ఎండకు సుడిపడి విసురుగా ఎగురుతూ గోడకు గుద్దుకుని పడి చనిపోయాయనీ మార్క్వెజ్ రాశాడని ఎత్తిచూపారట. లాటిన్ అమెరికన్ వాస్తవికతలోనే ఐంద్రజాలిక వాస్తవికత దాగున్నదనడానికి నిదర్శనం అది.

          అయితే ఈ పుస్తకం ఆ విషాద కథనం మాత్రమే కాదు, గాబోను ఎన్నెన్నో కోణాల్లో మనకు పరిచయం చేసే పుస్తకం కూడ. గాబోకు తన రచనల చిత్తు ప్రతులను, సంతృప్తికరంగా రాని రచనలను ఎప్పటికప్పుడు చించివేసే అలవాటు ఉండేదని, పిల్లలుగా తమను ఆ పనిలో భాగం చేసేవాడని కూడా రోడ్రిగో రాశాడు. అనేక రచనలు అటు వంటి నిర్మూలనకు గురి కాకుండా మెర్సిడిస్ ప్రయత్నించిందని, అందువల్లనే అనేక అసంపూర్తి, అసంతృప్తి, చిత్తు రచనలు మిగిలి ఉన్నాయని కూడా రోడ్రిగో చెపుతాడు.

          ఎప్పుడో 1966లో వన్ హండ్రెడ్ యియర్స్ ఆఫ్ సాలిట్యూడ్ రాస్తున్నప్పుడు (గాబో ఎంత క్రమశిక్షణగా నిర్ణీత సమయాల్లో రాసేవాడో, రాస్తున్నప్పుడు ఎలా ఉండేవాడో, రాయడం అయిపోయాక ఎంత సరదాగా తమతో ఆడుకునేవాడో వంటి ఎన్నో విషయాలు సరేసరి) తన నవలా పాత్ర కర్నల్ అరెలియానో బెండియాను చంపేశానని ఒక మధ్యాహ్నం పూట ఎట్లా చెప్పాడో, భార్యాభర్తలిద్దరూ ఎట్లా విచారంగా విషాదమయంగా కూచున్నారో కూడ రాస్తాడు. చాల సంవత్సరాల వరకూ గాబో తన పుస్తకాలు తాను చదవలేదనీ, వయసు మళ్లిన తర్వాత అవి చదువుతూ “ఎక్కడి నుంచి వచ్చాయో ఇవన్నీ” అని ఆశ్చర్యపోయాడనీ రాస్తాడు. తన పుస్తకం తానే అబ్బురపడుతూ చదివి చివరి అట్ట మీద తన ఫొటో చూసి ఆశ్చర్యపోయేవాడట. మతిమరుపు వచ్చాక కొడుకులిద్దరూ పక్కగదిలో ఉంటే నర్సుతో ‘ఎవరు వాళ్లు’ అని అడిగాడట. ఆమె ‘మీ కొడుకులు’ అని చెపితే, ‘అవునా, వాళ్లా? నమ్మశక్యంగా లేదే!’ అన్నాడట. ఆ ఘటన చెప్పి, దాని వెంటనే “నేను నా జ్ఞాపకాలతో పని చేస్తాను. జ్ఞాపకమే నా పని ముట్టు, నా ముడి సరుకు. అది లేకపోతే నా రచనే లేదు” అని అదే మాట పదే పదే ఎన్నో రకాలుగా చెప్పేవాడని గుర్తు చేసుకుంటాడు.

          ఈ పుస్తకం చదువుతున్నప్పుడే మరొక ఐంద్రజాలిక వాస్తవికత నిజంగానే సంభవించింది. మెక్సికో సిటీలో బెయ్యాస్ ఆర్టెస్ అనే ప్రభుత్వ ప్రాసాదంలో మార్క్వెజ్ చితాభస్మపు కలశాన్ని చివరి చూపు కోసం పెట్టి సంస్మరణ సభ జరిపారు. మెక్సికో, కొలంబియా దేశాల అధ్యక్షులతో సహా వేలాది మంది పాల్గొన్న సంస్మరణ అది. అక్కడ “ప్రతి మనిషికీ మూడు జీవితాలుంటాయని మా నాన్న అంటుండడం నాకు గుర్తు. ఒకటి బహిరంగ జీవితం, రెండోది వ్యక్తిగత జీవితం, మూడోది రహస్య జీవితం. ఇప్పుడు మా నాన్నకు సంతాపం తెలుపుతున్న ఈ అసంఖ్యాక జనం లో ఆయన రహస్య జీవితపు మనుషుల్లో ఎవరో ఒకరు ఉండే ఉంటారని నాకనిపించింది” అని రోడ్రిగో రాశాడు.

          ఆ మాటలతో రోడ్రిగో ఏదైనా ప్రత్యేక నిగూఢార్థాన్ని సూచించాడో లేదో తెలియదు గాని, నేనా మాటలు చదవడానికి ఒక రోజు ముందో, తర్వాతో ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో వచ్చిన ఆఫ్ బీట్ సంపాదకీయం ఒకటి వివి నాకు పంపారు. (ముంబాయికి వచ్చే ఇండియన్ ఎక్స్ ప్రెస్ వేరు, దక్షిణాది న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్ వేరు. ముంబాయిలో వచ్చేది హైదరాబాద్ లో దొరకదు. వివి ఆ పత్రికను క్షుణ్ణంగా చదివి నేను చదవాలని తాను అనుకున్నవి సూచిస్తారు).

          మార్క్వెజ్ కు మెక్సికో సిటీలో ఒక మహిళతో వివాహేతర సంబంధం ఉండిందని, వారికి పుట్టిన బిడ్డకు మార్క్వెజ్ ఇందిర అని పేరు పెట్టాడని, అంతకు ముందు రోజు ఒక కొలంబియా పత్రికలో వెలువడి, లాటిన్ అమెరికన్, యూరపియన్ పత్రికల్లో వచ్చిన వార్త మీద సంపాదకీయం అది.

          మార్క్వెజ్, మెర్సిడిస్ యాబై ఆరు సంవత్సరాల పాటు కలిసి ఉన్న అన్యోన్యమైన, ప్రేమమయమైన జంట. మెర్సిడిస్ కు గాబో మీద ఎప్పుడైనా అనుమానం కలిగిందో లేదో తెలియదు. కుటుంబంలో కొందరికి గాబో వివాహేతర సంబంధం గురించి తెలుసుననీ, కాని 2020 ఆగస్ట్ లో మెర్సిడిస్ మరణించే వరకూ ఆమెకు తెలియకుండా జాగ్రత్తపడ్డారనీ కూడా పత్రికలు రాశాయి.

          1980లలో రెండు సినిమా కథల మీద గాబోతో మెక్సికన్ జర్నలిస్టు, రచయిత సుసానా కాటో కలిసి పని చేశారని, అప్పుడే ఈ సంబంధం ఏర్పడి ఉంటుందని ఊహాగానాలున్నాయి. అలా 1990ల మొదట్లో ఒక కూతురు పుట్టిందని, ఆమెకు గాబో ఇందిర అని పేరు పెట్టారని తెలుస్తున్నది. ఇందిరా గాంధీకి మార్క్వెజ్ అభిమాన రచయిత. ఆయనకు నోబెల్ బహుమతి వచ్చాక ఆయనకు అభినందనలు తెలిపిన తొలి దేశాధినేత ఆమేనట. అప్పుడే మాస్కోలో జరిగిన ఒక సమావేశంలో ఫిడెల్ కాస్ట్రోను కలిసినప్పుడు, కొద్ది నెలల్లో ఢిల్లీలో జరగనున్న అలీన దేశాల శిఖరాగ్ర సమావేశానికి వచ్చేటప్పుడు మార్క్వెజ్ ను కూడ తీసుకురావాలని ఇందిరా గాంధీ ప్రత్యేకంగా కోరారట. విమానాశ్రయానికి స్వయంగా వెళ్లి అప్పటికింకా బైటికి రాని మార్క్వెజ్ గురించి కాస్ట్రోను అడిగారట. ఆ సమావేశాల మధ్యలో మూడు రోజుల పాటు ఇందిరా గాంధీ, మార్క్వెజ్ చాల మాట్లాడుకున్నారని, ఆమె కొలంబియాలోని తన సొంత పట్టణం అరకటక కు చెందిన మనిషి లాగనే ఉందని మార్క్వెజ్ ఒక లాటిన్ అమెరికన్ దౌత్యవేత్తతో అన్నారట. ఆ తర్వాత రెండు సంవత్సరాల లోపే ఆమె హత్యకు గురయింది. తర్వాత అయిదారేళ్లకు పుట్టిన తన కూతురికి మార్క్వెజ్ ఇందిర పేరు పెట్టాడు. తల్లి ఇంటి పేరుతో ఉన్న ఇందిరా కాటో ఇప్పుడు మెక్సికోలో పేరు పొందిన డాక్యుమెంటరీ చిత్ర దర్శకురాలు, రచయిత.

          ఈ వార్తలు వెలువడి రెండు వారాలు గడిచినా ఇటు మార్క్వెజ్ కుటుంబ సభ్యుల నుంచి గాని, అటు సుసానా కాటో, ఇందిరా కాటోల వైపు నుంచి గాని ఎటువంటి నిర్ధారణా, ఖండనా రాలేదు.

          వివాహేతర సంబంధం, ఇందిరా గాంధీ వంటి రాజకీయ నాయకురాలి మీద సదభిప్రాయం వంటి అంశాలు మనలో చాల మందికి కోపం తెప్పిస్తాయి. ఆ “లోపాల” వల్ల మన నైతిక కొలబద్దల్లో ఆయన స్థానం పడిపోతుంది. కాని మార్క్వెజ్ విషయంలో మాత్రమే కాదు, ఎందరో సృజనకర్తల విషయంలో ఇటు వంటి “లోపాలు” వారి సృజనశక్తికీ, ఆకర్షణకూ అడ్డు రాలేదు. కొన్ని “లోపాలను” అసలు “లోపాలు”గానే గుర్తించక పోవడం, కొన్నిటిని గుర్తించినా వాటిని ఇతర గుర్తింపులకు పోటీ పెట్టక పోవడం, వ్యతిరేకించేటప్పుడు కూడ, “ఓహో, ఇది కూడ ఉంది” అని వదిలేయడం  బొహీమియన్, స్పానిష్, యూరపియన్ సంప్రదాయాలలో సాధారణమే.

          సరే, ఈ పిట్టకథ అలా ఉంచి, రోడ్రిగో గార్షియా రాసిన తన తండ్రి చివరి రోజుల కథ తప్పనిసరిగా చదవవలసిన పుస్తకం.

*****
Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.