పేషంట్ చెప్పే కథలు – 8

మేధో హత్య

ఆలూరి విజయలక్ష్మి

          భయంతో, వేదనతో అస్థిమితంగా చలిస్తున్నాయి కుమార్ కళ్ళు. శరీరమంతా సన్నగా కంపిస్తూంది. గుండె చప్పుడు పైకే వినిపిస్తున్నట్లుగా వుంది. ఉన్నట్టుండి గుప్పిళ్ళు బిగిస్తున్నాడు. అంతలోనే నిస్సత్తువగా, నిర్జీవంగా చూస్తున్నాడు. మళ్ళీ అంతలోనే ఏదో పెను భూతం తనను కబళించడానికి వెన్నంటి వస్తున్నట్లుగా ఒణికి పోతున్నాడు. బట్టలు నలిగి, మాసిపోయాయి. జుట్టంతా రేగిపోయి, నుదుటి మీద పడుతూంది. 

          అతని ప్రక్కన కూర్చున్న విమల ఉబికి వస్తున్న దుఃఖాన్ని నిగ్రహించుకోవడానికి ప్రయత్నిస్తూంది. అన్న పరిస్థితి చూసి గుండె బ్రద్దలవడంతోపాటు అతను ఇంటికొచ్చేసరికి తల్లిదండ్రులిద్దరూ ఊరికి వెళ్ళడం వలన తాను ఒంటరిగా ఎదుర్కోడానికి భయంగా ఉంది. 

          ఆపరేషన్ ధియేటర్ నించి బయటికి వచ్చిన డాక్టర్ శృతిని చూడగానే సగం టెన్షన్ తగ్గినట్లనిపించింది విమలకు. లోపలికి రానని మొరాయిస్తున్న కుమార్ ని బ్రతిమాలి, నచ్చజెప్పి లోపలికి తీసుకొచ్చింది. 

          “కూర్చోండి” కుమార్ కి కుర్చీ చూపించింది శృతి. అయిష్టంగా కుర్చీలో ముడుచుకు కూర్చుని నేల చూపులు చూస్తున్నాడతను. 

          “బాధేమిటో చెప్పండి” అడిగింది శృతి. చివ్వున తలెత్తాడు కుమార్. 

          “బాధ!? నాకు బాధేంటి? ఐ యామ్ హ్యాపీ! వెరీ వెరీ హ్యాపీ!!” అసహజంగా, పెద్దగా నవ్వసాగాడతను. నిశ్శబ్దంగా ఉన్న ఆ పరిసరాల్లో అతని నవ్వు వికృతంగా ప్రతిధ్వనిస్తూంది. 

          “అన్నయ్యా! ప్లీజ్! ఊరుకో, నవ్వకు” అతని భుజం మీద చెయ్యేసి ఏడుపు గొంతుకతో అతనిని వారించసాగింది విమల. 

          “నవ్వొదంటావా? హౌ డేర్ యు ఆర్?! మళ్ళీ అన్నావంటే చంపేస్తాను. నన్ను నవ్వొద్దన్నాళ్లందరినీ… నిన్నూ… మా ప్రొఫ్ గాడినీ… ఐ విల్ కిల్ ఆల్ ఆఫ్ యూ… అందరి పీకలూ పిసికవతల పారేస్తాను” అంటూనే చేతులు చాచి విమల పీక పట్టుకోబోయాడు కుమార్. నిజంగా అన్నంత పనీ చేసేస్తాడేమోనన్న భీతితో వెనక్కు వెనక్కు జరుగుతుంది విమల. 

          “ఏయ్ మిస్టర్! ఆగు” ఉరుముల వికసించిన శృతి కంఠం వినగానే చురకత్తుల్లా మెరుస్తున్న అతని కళ్ళు ఆమె వైపు తిరిగాయి. 

          “రండి, యిలా కూర్చోండి. కొంచెం సేపు రిలాక్సవండి” మృదువుగా చెప్తూ అతని చెయ్యి పట్టుకుని కూర్చోపెట్టింది శృతి. ఆమె కళ్ళలోని కరుణ, ఆమె స్పర్శలోని ఓదార్పు, బుస్సున పొంగుతున్న అతని ఉద్రేకాన్ని తగ్గించాయి. శృతి అతని పల్స్ గమనిస్తూంటే నెమ్మది నెమ్మదిగా అతను శాంతించాడు. 

          “మీరు కొంచెం వీక్ గా కనిపిస్తున్నారు. బలానికి ఇంజక్షన్ చేస్తాను” అతని షర్ట్ స్లీవ్ పైకి జరిపి ఇంజెక్షనివ్వబోయింది శృతి. ఆమె చెయ్యబోతున్న ఇంజక్షన్ ని గమనించాడతను. 

          “కాంపోజా? లార్గాక్టిలా? డోంట్ గెట్ శాక్డ్. నేను డాక్టర్ కుమార్ యం.ఎస్.ఎఫ్… ఎఫ్ అంటే ఏమిటో తెలుసా? ఎఫ్ అంటే ఫెయిల్డ్ – అవును, నేను ఎం.ఎస్. తప్పాను, కాదు- నన్ను తప్పించారు” హృదయ విదారకంగా ఏడవసాగాడతను. చెట్టంత మగాడు, ఓక ఉన్నత విద్యావంతుడిలా మనోచాపల్యంతో సతమతమవుతూ బేలగా ఏడుస్తుంటే శృతి గుండె పట్టేసినట్లయింది. ఒక నిమిషానికి తెలివి తెచ్చుకుని అతనిలోని అలజడిని తగ్గించి ప్రశాంత పరచడానికి ఇంజెక్షనిచ్చింది. అతను కొంచెం మగతలోకి వెళ్ళాక విమలను వేరుగా తీసుకు వెళ్ళి అతని గురించి అడిగింది. 

          “అంతా మా దురదృష్టం మేడం… ఉండీలేని కుటుంబం మాది. అన్నయ్య మంచి మంచి కోచింగ్ సెంటర్సుకి వెళ్లి ట్యూషన్ తీసుకునే అవకాశం లేకపోయినా కేవలం స్వంత తెలివితేటలతో కష్టపడి చదివి మెడికల్ ఎంట్రన్స్ లో ఫస్టు వచ్చాడు. 

          మెడిసిన్ లో చేరినప్పటి నించి క్లాస్ ఫస్ట్ రావాలని, ప్రతి సబ్జెక్టులో గోల్డమెడల్ సంపాదించుకోవాలనే లక్ష్యంతో అహోరాత్రులు కష్టపడి చదివాడు. సెలవుల్లో కూడా లైబ్రరీకి అంటుకుపోయి మమ్మల్ని చూడడానికి కూడా వచ్చే వాడు కాదు. మెడిసిన్ లో చేరాక యిన్నేళ్ళలో తాను ఒక్క సినిమా కూడా చూళ్ళేదంటే మీరు నమ్మరేమో!” 

          ఆగి శృతివంక సాభిప్రాయంగా చూసింది విమల. అంతగా చదివే వాళ్ళు తాను చదువుకున్న టైంలో కూడా ఉండడం తెలుసు కనుక నవ్వి ఊరుకుంది శృతి.

          “కానీ ప్రతిసారీ డబ్బు, హోదా, కులం… ఏదో ఒకటి టాప్ రాంక్ లో ఉన్న అన్నయ్యను క్రిందకు తోసేసి యీ మూడింట్లో ఏదో ఒకటో, అంతకుమించో ఉన్న అదృష్టవంతుడిని అందలం ఎక్కించేది. తనకు తగులుతున్న దెబ్బలకు కృంగిపోయినా మళ్ళీ ధైర్యం తెచ్చుకుని ఈసారైనా తన ప్రతిభకు గుర్తింపు వస్తుందని, ఈసారైనా తన కష్టానికి ప్రతిఫలం దక్కుతుందనే ఆశపడేవాడు. ఈ సారి మరీ దీన్నో జీవన్మరణ సమస్యగా తీసుకుని చదివాడు. కానీ, మళ్ళీ అన్నయ్య్యను ఇద్దరు వెన్నక్కు తోసేశారు.  ఒకరు డబ్బుతో డిగ్రీ కొనుక్కుంటే, మరొకరు కులాభిమానం వల్ల పాసయ్యారు. స్వయం కృషి, తెలివితేటలూ తప్ప మరో సప్పోర్ట్ లేని అన్నయ్యకు నెక్స్ట్ టైం బెటర్ లక్  చెప్పాడు వాళ్ళ ప్రొఫెసర్. కానీ… ఈ రోజున మనం ఎలాంటి దారుణమైన పరిస్థితుల్లో బ్రతుకుతున్నామ్మో తెలిసి కూడా అన్నయ్య ఇంతగా షాక్ తిని ఇలా అవడం కేవలం మా బాడ్ లక్ మేడం!” విమల చెపుతూంది వింటూ దేశంలోనించి మేధావులు వలస పోవడానికి, దేశంలో వున్నా ఎక్కువ మంది మేధావుల మేధస్సు నిరుపయోగంగా ఉండి పోవడానికీ, దేశానికి ఉపయోగపడవలసిన మేధస్సు దారుణంగా హత్య చేయబడి కుమార్ లాంటివారు పిచ్చివాళ్ళుగానో, సంఘ విద్రోహక శక్తులు గానో మారడానికి అసలు కారణాల్ని మరోసారి గుర్తుకు తెచ్చుకున్న శృతి హృదయం ఆవేశంతో నిండింది.

*****     

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.