మా కథ (దొమితిలా చుంగారా)- 38

రచన: దొమితిలా చుంగారా 

అనువాదం: ఎన్. వేణుగోపాల్ 

ప్రజలు – సైన్యం

          1970లో మరొక సైనిక తిరుగుబాటు జరిగింది. వైమానికదళం, నావికాదళం, సైన్యం కలిసి దేశాన్ని పాలించేందుకు ఒక ముగ్గురు సభ్యుల పాలనామండలిని ఏర్పరచాలని ప్రయత్నించాయి. జనం అందుకు ఒప్పుకోలేదు. జాతీయస్థాయిలో సమ్మెకు పిలుపిచ్చారు. సిఓబి ప్రతినిధులు వైమానికదళ కేంద్ర స్థావరం ఆలో-ది-లాపాజ్ కు వెళ్ళి జనరల్ తారెసన్ను అధికారం స్వీకరించమని కోరారు. ఆయన అందుకొప్పు కున్నాడు.

          ప్రజల కోసం ఏమన్నా చేయాలనే తారెస్ అనుకున్నాడు. ఆయన కొద్ది కాలంపాటే అధికారంలో ఉన్నా కొన్ని మంచి పనులు చేశాడు. ఆయన బొలీవియా నుంచి శాంతి దళాలనబడే వాటిని తన్ని తరిమేశాడు. ప్రముఖమైన మెటిల్డా గనుల్ని జాతీయం చేశాడు. అలాగే గని కార్మికులు 1965లో బారియెంటోస్ తమ జీతం డబ్బులు కొట్టేశాడని చెప్తే శ్రద్ధగా విన్నాడు. కొమిబొల్ లోనూ, బొలీవియా చమురు నిక్షేపాల కార్పొరేషన్లోనూ మేనేజర్ హోదా సాంకేతిక సిబ్బంది జీతాలెంత అని కూడా ఆయన అడిగి తెలుసు కున్నాడు. అవి అధ్యక్షుని జీతంకన్న వేల వేల డాలర్లు, లక్షల పిసోలు ఎక్కువగా ఉన్నాయి. ఆయన ఒక చట్టం ద్వారా వాళ్ళ జీతాలు తగ్గించి ఆ డబ్బుని కార్మికులకి ఇప్పించాడు.

          జనరల్ తారెస్ ఓ సారి ఈ జీతాల హెచ్చింపు వార్త చెప్పడానికీ, జనంతో మాట్లాడడానికి గనుల్లో కొచ్చాడు. గని కార్మికులు ఆయనను తమ భుజాల మీద ఎక్కించుకుని తీసుకు పోతామన్నారు! కార్మిక వర్గం తమ నాయకునికో, తాము ప్రేమించే మరొకరికో ఇచ్చే అత్యున్నత గౌరవం అది. కాని జనరల్ అందుకొప్పుకోలేదు. “వీల్లేదు. నేనిది ఒప్పుకోను. నిజానికి నేనే కార్మికులను నా భుజాలమీద ఎక్కించుకోవాల్సి ఉంది” అని ఆయన అన్నాడు.

          అప్పుడు కటావిలో ఆయనకు ఒక విందు ఏర్పాటు చేయబడింది. అప్పుడాయన గృహిణుల సంఘం సభ్యులందరికీ వ్యక్తిగతంగా ఈ విందుకి ఆహ్వానం పంపాడు. నాకు అక్కడికి వెళ్ళడం ఇష్టం లేకపోయింది. జైల్లో నన్ను ఇన్ని ఇక్కట్లకు గురిచేసిన సైన్యమంటే నాకింకా వ్యతిరేకతే ఉండింది. కానీ నా మిత్రులందరూ నేను వెళ్ళాలని పట్టుబట్టారు.

          మా సంఘం మిత్రులు మధ్యలో ఎర్ర గులాబీతో ఓ పూలగుత్తి తయారుచేశారు. మేం ప్రధాన కార్యాలయం చేరేసరికి అక్కడ పొడవాటి వరుసలెన్నో కనబడ్డాయి. ఎంతో మంది తారెనక్కు ఇవ్వడానికి పూలగుత్తులు పట్టుకొని నిలబడి ఉన్నారు. వాళ్ళందరూ జనరల్ ను చూడదలచుకున్నారు గాని సైన్యం లోపలికి పోనివ్వడం లేదు. వాళ్ళు మమ్మల్ని కూడా లోపలికి వెళ్ళనివ్వరేమో అనుకున్నాను గాని, మేం మా ఆహ్వానపత్రం చూపగానే లోపలికి వెళ్ళనిచ్చారు. మేం లోపలికి చేరగానే ఒక నాయకుడు “వీళ్ళే సైగ్లో-20 గృహిణుల సంఘం ప్రతినిధులు” అని మమ్మల్ని పరిచయం చేశాడు. జనరల్ మాకు అభివాదం చేసి మమ్మల్ని తన ముందే కూచోబెట్టుకున్నాడు.

          అప్పుడు నేనో చిన్న అభినందన ఉపన్యాసం ఇచ్చాను. ఆరెస్ కు మేం స్వాగతం చెపుతున్నామనీ, ఎన్నో ఇక్కట్లకు లోనై మా జీతాల డబ్బు మాకిప్పించినందుకు మేమెంతో కృతజ్ఞులమై ఉన్నామని నేనన్నాను.

          “మొత్తానికి మీరు మా వైపు వుండదలచుకున్నానని చూపారు. అయితే సైన్యంలో మంచి వాళ్ళుండడానికి ఎంత అవకాశముందో, చెడ్డవాళ్ళుండడానికి అంత కంటే ఎక్కువ అవకాశం ఉంది. మీరు మా మిత్రులైతే జనం చేతికి కూడా ఆయుధాలివ్వండి. మా భర్తలు ధైర్యసాహసాలు లేక కాదు, రక్షించుకోవడానికి ఆయుధాల్లేక వీథుల్లో పిట్టల్లాగ రాలిపోతుంటే చూసీ చూసీ మా స్త్రీలం అలసిపోయాం. మీరు ప్రజల మిత్రుణ్ణని చెపుతున్నారు. అయితే మా చేతికి ఆయుధాలివ్వండి. ప్రజల్ని రక్షించడంలో మేం మీ పక్కన నిలబడతాం. అధికారంలో ఉండే నరరూప రాక్షసుల చేతుల్లోని ఒక అణచివేత సాధనంగానే సైన్యం పనిచేసింది. మీరు గనక మా మిత్రులైతే సైన్యం కూడా మా వైపు కొస్తుంది. మీ అధికారం పోయినా, మీరు మా మిత్రునిగా ఉండక పోయినా సైన్యం మాకు వ్యతిరేకమయి పోతుంది. మేం చెప్పింది మీ కెప్పుడూ గుర్తుండడానికి పూలగుత్తి ఇస్తున్నాం. దీనిలో మధ్యనున్న ఎర్రగులాబీ ఇక్కడ సైన్యం సాగించిన ఘోర హత్యాకాండల్లో మా జనం రాల్చిన నెత్తురు చుక్క” అని ఆయనకా పూలగుత్తి ఇచ్చాను.

          అప్పుడాయన “మిత్రురాలి మాటలు నాకెంతో బాధ కలిగించాయి. ఇంత ఖండితంగా మాట్లాడిందంటే తప్పకుండా ఆమె ఎన్నో బాధలు అనుభవించి ఉంటుంది. నేను బొలీవియన్ల మీద జరుగుతున్న ఈ మారణకాండలకు శాశ్వతంగా ముగింపు పలకదలచుకున్నానని హామీ యిస్తున్నాను. సైన్యం ఇంకెప్పుడూ తన తుపాకులు మీ మీదికి ఎక్కు పెట్టదు. సైన్యం ఇప్పటి వరకూ ఆలోచించినట్టుగా ఇక ముందు ఆలోచించదు. మేం సైన్యపు ఆలోచనా సరళినంతా మార్చెయ్యబోతున్నాం. మా కీ పనిలో మీరు తోడ్పడతారని నాకు తెలుసు. సైన్యంలో ఉన్న ప్రతివాడూ వచ్చి మీతో, మీలో కలిసి బతకాలనీ, కనీసం రెండు మూడు నెలలైనా అలాంటి జీవితం గడపాలని ప్రతిపాదిస్తున్నాం. అలా వాళ్ళు మీ వాస్తవ స్థితిగతుల్ని తెలుసుకొని మీది న్యాయమైన పోరాటమని తేల్చుకో గలరు …” అన్నాడు.

          సరిగ్గా ఆయన చేసిన తప్పదే. సైన్యాన్ని నమ్మి ఆయన ప్రజల్ని సాయుధం చెయ్యలేదు. బొలీవియన్ సైన్యం క్రూరులతో, పెంటగన్లో శిక్షణ పొందిన వారితో, బూర్జువా భావాలు కలిగిన వాళ్ళతో, పెత్తందారీ స్వభావం కలిగిన వాళ్ళతో నిండి ఉంది. ఇలాంటి వాళ్ళు, ఈ రకమైన శిక్షణ పొందిన వాళ్ళు, ఇలా అమ్ముడుబోయిన వాళ్ళు తమ మనస్తత్వాన్ని పూర్తిగా మార్చుకుంటారనుకోవడం భ్రమకాదూ?

          ఆ సంవత్సరమే మాకు కొన్ని విషయాల మీద ఉపన్యాసాలివ్వడానికి, కొన్ని సినిమాలు చూపడానికి కొందరు సైగ్లో-20కి వచ్చారు. వాళ్ళు సంఘటిత శక్తి గురించీ, అర్థశాస్త్రం గురించీ మాకు వివరించడానికొచ్చారు. వాళ్ళలో యూనివర్శిటీ అధ్యాపకులున్నారు, ‘ఉఖమౌ’ అనే బృందానికి చెందిన జర్నలిస్టులూ, సినిమా దర్శకులు కూడా ఉన్నారు. వాళ్ళు మాకు ఉఖమ్, యవర్ మలకు అనే సినిమాలు చూపి తర్వాత జరిపిన సమావేశంలో సినిమాల గురించి మాతో చర్చించారు. తాము ప్రజా జీవితాన్ని సినిమాల్లో చిత్రించదలచు కున్నామని, తమ బృందం డబ్బుల కోసం సినిమాలు తియ్యదని మాకు చెప్పారు. తాము చాల విప్లవ చైతన్యం కలిగిన వాళ్ళమని, తమ ఆశయం ప్రజల సేవకు అంకితం కావడమేనని వాళ్ళన్నారు. తమ సినిమాల మీద పన్నులు తగ్గించమని ప్రభుత్వాన్ని కోరడం ద్వారా తమకు సాయపడమని వాళ్ళు మమ్మల్ని అభ్యర్థించారు.

          వాళ్ళ సినిమాలు దిగజారిపోనంత వరకు మేం వాళ్ళకు సాయం చేస్తామని చెప్పాం. ఒకసారి లైసెన్స్ వచ్చి, పేరొచ్చాక వాళ్ళు కూడా ఇతరుల లాగానే న్యూవేవ్ అని పిలవబడే వ్యాపార సినిమాల్లోకి దిగజారిపోవచ్చు గదా!

          సైగ్లో-20 గురించి కూడ ఒక సినిమా చిత్రించమని మేం వాళ్ళకు సూచన చేశాం. మేం ప్రతిపాదించిన ఐదు నెలలలోపే వాళ్ళు సైగ్లో-20కి వచ్చి “ప్రజాసాహసం” అనే సినిమాను చిత్రించారు. సినిమాను ఐదుచోట్ల ఒకే రోజు విడుదల చేయాల్సి ఉండింది. కాని బంజెర్ తిరుగుబాటు వచ్చిపడి మా ప్రణాళిక తలకిందులయింది. మేం ఒకళ్ళకొకళ్ళం కలవ కుండా అయిపోయాం . ఇవాళికీ బొలీవియాలో ఆ సినిమాను ఎవరూ చూడలేక పోయారు. నేనా సినిమాను మొదటిసారి మెక్సికోలో చూశాను. నాకు ఆ చిత్రీకరణ నచ్చింది. మేం ఆ సినిమాలో కొన్ని ముఖ్యమైన ప్రకటనల్ని స్పష్టీకరించ గలిగాం. ఈ కళాకారుల బృందం ఎప్పుడూ ప్రజల పక్షం వహించాలని నా కోరిక.

          తారెస్ ప్రభుత్వ కాలంలోనే “విస్తృత శాసనసభ” అమలులోకి వచ్చింది. విదేశాలలో కూడా బహుళ ప్రచారం పొందిన ఈ “విస్తృత శాసనసభ” అంటే కార్మికులు అధికారంలో ఉండడమే అని వాళ్ళన్నారు. ఫ్యాక్టరీల సంఘాలు, గని కార్మిక సంఘాలు, నిర్మాణ కార్మికుల, రైతుల, యూనివర్సిటీ వర్గాల సంఘాలు మొదలైన సిఓబిలోని సభ్య సంఘాలన్నీ ఈ విస్తృత శాసనసభలో ఉండేవి. ప్రజా రాజకీయ పార్టీలు కూడా అందులో పాల్గొన్నాయి. నేను దీని గురించి వినడమే కాని, గృహిణుల సంఘానికి ఆహ్వానం లేనందున అక్కడికి వెళ్లి విషయం తెలుసుకోలేక పోయాను. కొన్ని సమస్యలు అందరి దృష్టికీ తీసుకురావడానికి ఈ శాసనసభ ఉపయోగపడింది. గని కార్మికులు తమ డిమాండ్లను బహిరంగంగా ప్రకటించగలిగారు. అయితే అక్కడ పాల్గొన్నవారి మధ్యనే ఎన్నో విభేదాలుండేవట. తమ భావాలకే ఆధిక్యత ఉండాలనే వారు కొందరక్కడ ఉండేవారట. ముఖ్యంగా అక్కడ ఉండిన రాజకీయ పార్టీల మధ్య చీలికలు ఈ కారణం వల్లనే ఉండేవి.

          విస్తృత శాసనసభ సంస్థ నిర్మాణం గురించీ, చరిత్ర గురించీ నాకంతగా తెలియదు గాని మేం అధికారానికొస్తే ప్రజాధికారానికి సాయపడే ఇలాంటి సంస్థ అవసరమని నాకనిపించింది. మనం నిర్వ్యాపకత్వంతో ఉండలేం. మన శత్రువు బలమైనవాడనీ, ఎంతో అధికారం కలిగి ఉన్నవాడనీ మనకు తెలుసు. చిలియన్ ప్రజానీకపు చేదు అనుభవం మన జ్ఞాపకాల్లో ఉండనే ఉన్నది. అందుకే నేనేమంటానంటే ప్రజలు ఒకసారి అధికారానికొచ్చాక ఆ అధికారాన్ని శాశ్వతం చేసుకునే ప్రయత్నం చేయొద్దూ?

          మేం అధికారంలోకి వచ్చినట్టయితే మంత్రులు, అధ్యక్షుని సహాయకులందరూ కార్మికులూ, రైతులూ అయి ఉండేవారు. కాని జువాన్ జోస్ తారెస్ అధ్యక్షుడయ్యాక వచ్చిన మంత్రులు ప్రజా ప్రయోజనాల పట్ల సానుభూతి కలవారే గాని బూర్జువా వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు.

          ఐతే ఈ నామ మాత్రపు ప్రజాధికారం నిలవనే లేదు. తారెస్ పదవీచ్యుతుడయి 1971 ఆగస్టు 21న జనరల్ బన్ జెర్ సైన్యం సాయంతో అధికారానికొచ్చాడు.

*****

(సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.