మిట్ట మధ్యాహ్నపు మరణం- 14
– గౌరీ కృపానందన్
ఉమ చటుక్కున లేచింది. “ఆనంద్! ఇది చూడు” అన్నది.
“ఏమిటది ఉమా?”
మౌనంగా అతనికి ఆ ఉత్తరాన్ని ఇచ్చింది. ఆనంద్ తలెత్తి చూసి సన్నగా విజిల్ వేస్తూ, “మాయ అని ఒక వ్యక్తి ఉన్నట్లు తెలుస్తోంది” అని అన్నాడు.
ఉమ కవరును తిప్పి చూసింది పోస్టల్ ముద్ర కోసం. బెంగళూరు అని ఉంది.
“ఈ విషయాన్ని వెంటనే పోలీసులకి తెలియ జేయాలి.”
“వెనకాల ఏదో వ్రాసి ఉంది చూడు” అన్నది ఉమ.
“వస్తున్నాను అని ఉంది.”
“అంటే నా కోసం వస్తోందా?” అన్నది ఉమ.
“ఎవరు?” అడిగాడు ఆనంద్.
“మాయ.”
“మాయ స్త్రీయా పురుషుడా అన్న విషయాన్ని ఎలా తేల్చుకోగలం? నువ్వే చెప్పు.”
“తప్పకుండా స్త్రీ అయి ఉంటుంది. నా భర్తను చంపిన హంతకి! తరువాత నన్ను చంపడానికి వస్తోంది.”
“ఛ…. ఛ… అలా ఊహించుకోకు. దీనిని పోలీసులకి అప్పగిద్దాం.”
“ఇక్కడే చెన్నై పోలీసులకి హ్యాండ్ ఓవర్ చేద్దామా?” ఉమ అడిగింది.
“వద్దు. ఇనస్పెక్టర్ మాధవరావు గారికి ఫోన్ చేసి అడుగుదాం. ఆయనేం చెప్తారో అలాగే చేద్దాం. నాకేమో ఎవరో పిచ్చివాడు చేసిన పనిలా అన్పిస్తోంది.”
“చూడు ఆనంద్! మీ అన్నయ్యని అలా ఆ రోజు చూసిన నాకు ఏర్పడిన షాక్! నా జీవితంలో మళ్ళీ అలాంటి షాక్ తగులుతుందని అనుకోను. మాయ అని ఎవరైనా నా ముందుకు వచ్చి నిలబడితే సంతోషిస్తాను. ఎందుకు చంపావు అని అడిగి తేల్చేసుకోవచ్చు కదా?”
“ఈ లెటర్ నుంచి ఏదైనా క్లూ దొరికినా దొరక వచ్చు, పోలీసులకు.” జేబులో పెట్టుకున్నాడు. ఒక్క నిమిషం తరువాత అన్నాడు. “ఈ విషయాన్ని అమ్మా, నాన్నల దగ్గర చెప్పొద్దు ఉమా.”
“చెప్పను ఆనంద్. కానీ మళ్ళీ నాకు ఆ ఉత్తరం కావాలి.”
“తర్వాత ఇస్తాను.” అన్న వాడల్లా క్రిందికి దిగి వెళ్లి పోయాడు.
మాయ అన్నది వట్టి భ్రమ కాదు. ఆ పేరు మీద ఒక స్త్రీయో పురుషుడో ఉన్నారు. తన భర్తను హత్య చేసింది ఆమెనా… అతనా…
క్రిందినించి అత్తగారి మాటలు మొదట్లో అస్పష్టంగానూ, పోను పోనూ స్పష్టంగానూ వినిపించాయి.
“నేనూ చూస్తూనే ఉన్నాను. వచ్చినప్పటి నుంచీ మేడ మీద గదిలో అంతోటి రాచ కార్యాలు ఏమిటి?”
“ఏమిటమ్మా ఆ మాటలు? తను పిలిచింది. నేను వెళ్లాను.”
“ఏమో ఆనంద్! ఇదంతా బాగా లేదు. అంతే.”
“అమ్మా! నీకు వేరే పని లేదు.”
“పుత్ర శోకంతో అల్లాడుతున్నది చాలదన్నట్లు, మేడ మీది గదిలో రాణిగారిని కూర్చోబెట్టి మీ నాన్నగారు వేళ తప్పకుండా కాఫీలు, టిఫిన్లు అందించి వస్తున్నారు. నీవేమో అక్కడే పడిగాపులు కాస్తున్నావు.”
“అమ్మా! గొంతు కాస్త తగ్గించు. ఆమెకి వినబడుతుంది.”
“వినబడనీ. నాకేం భయం. ఏ ముహూర్తంలో పెళ్ళయిందో, నా కొడుకును మూడో రోజే కోల్పోయాను. నాకు మాత్రం దుఃఖం లేదా? నాకెవరైనా చేసిపెట్టే వాళ్ళున్నారా? నాకూ కొడుకు పోయాడు. ఒక వేళ కాఫీ అయినా కలిపి ఇచ్చే దిక్కు లేదు.”
ఉమ మెల్లిగా మేడ నుంచి దిగి వచ్చింది.
“ఉన్న బాధ చాలదన్నట్లు ఈమె ఒకర్తి.”
దిగి వస్తున్న ఉమను చూసింది మూర్తి తల్లి. “రామ్మా! టిఫిన్ తిన్నావా? మామగారు తెచ్చి ఇచ్చారా?” గొంతు మార్చి మృదువుగా అన్నది.
“అత్తయ్యా! నేను ఈ ఇంట్లో ఉండకూడదా?”
“అలా ఎవరన్నారు? ఏదో విని వేరే ఏదో ఊహించుకోకు.”
“లేదత్తయ్యా! స్పష్టంగానే వినబడింది. నేనేం చేయాలి? ఇంటి నుంచి వెళ్లి పొమ్మంటున్నారా?”
“ఉండమ్మా. ఇక్కడే ఉండు. నువ్వు ఈ ఇంటి కోడలివి కదా.”
“నేను ఇక్కడ ఉండడానికి కారణం మీ కోడల్ని అని కాదు. మీ కొడుకుని చంపిన హంతకుడిని వెతికి పట్టు కోవాలి.”
“మాకు అవన్నీ ముఖ్యంగా అనిపించడం లేదు. కొడుకు పోయాక ఉన్న వాళ్ళను చూసుకోవడమే నాకు ముఖ్యం అనిపిస్తోంది.”
“అంటే? మూర్తి ముఖ్యం కాదా మీకు?”
“మూర్తి ఉన్నంత వరకు అతనూ ముఖ్యంగానే అనిపించాడు. పోయాడు.. బాగా ఏడిచాను. కన్నవాళ్ల పుత్ర శోకం తీరేది కాదు. మా నొసట దేవుడు అలా వ్రాసి పెట్టాడు. ఇక చాలు. ఈ చిక్కు ముడి ఇంకా కొనసాగడం మంచిది కాదు.”
“అంటే నన్ను వెళ్లి పొమ్మంటున్నారా?”
“ఇంకా విడమరిచి చెప్పాలా?”
“అమ్మా!” గద్దించినట్లుగా అన్నాడు ఆనంద్.
“కాస్త ఆగు ఆనంద్! అత్తయ్యా! నేను ఈ క్షణమే మీ ఇల్లు వదిలి వెళ్ళిపోతాను. అయితే ఒక కండిషన్. పెళ్లి కోసం మా నాన్నగారు పెట్టినవన్నీ తిరిగి ఇచ్చెయ్యాలి.”
“చూశావా ఆనంద్! ఎలా మాట్లాడుతుందో? ఇదెక్కడి న్యాయం?”
“అంత ఖర్చుపెట్టి చేశారు పెళ్లి. మీ కొడుకు ఇప్పుడు లేడుగా? అందుకు!”
“అర్ధాంతరంగా అతను చనిపోతే మేమేం చెయ్యగలం చెప్పు.”
“అత్తయ్యా! మూర్తి గురించి మీరు ఏదో నా దగ్గర దాస్తున్నారని అనిపిస్తోంది. ఏ కారణమూ లేకుండా అంత కిరాతకంగా ఎవరూ చంపరు. సరియైన కారణం చెప్పందే నేను ఈ ఇంటి నుంచి కదిలేది లేదు.” ఖచ్చితంగా అన్నది ఉమ.
***
మాధవరావు ఆ ఇంటికి తలుపులు తట్టారు. తలువులు తీసిన ఆవిడకి దాదాపు ముప్పై ఏళ్ళు ఉంటాయి. దివ్య పోలికలు కన్పించాయి. యూనిఫారంలో మాధవరావును చూడగానే ఆమె కంగారు పడింది.
“ఏం కావాలండీ?”
“దివ్య ఇక్కడేగా ఉంటోంది?”
“అవును. గుడికి వెళ్ళింది. ఇప్పుడు వచ్చేస్తుంది. ఏదైనా…”
“ఏం లేదమ్మా. కొన్ని విషయాలు అడగాలి అంతే.”
“ఇప్పుడు వచ్చేస్తుంది. కూర్చోండి.”
“ఫరవాలేదు.” మాధవరావు గోడల వైపు పరిశీలనగా చూశాడు. గోడల నిండా కాలెండర్లు తగిలించి ఉన్నాయి. ఒక మూలగా దివ్య చిన్న వయస్సు ఫోటో.
“మూర్తికి మీ చెల్లెల్ని సంబంధం చూశారా?”
“అవును. నచ్చిందని చెప్పగానే నిశ్చితార్థానికి మంచి రోజు చూద్దామని అనుకున్నాం. ఆ తరువాత ఏం జరిగిందో తెలియదు. జాతకాలు కుదరలేదని మానుకున్నారు. దివ్య చాలా అప్ సెట్ అయ్యింది.”
“తనకి అందులో కోపమా?”
“కోపం లేదు గానీ ఆడపిల్ల ఇంటివాళ్ళను ఇలా ట్రీట్ చేస్తున్నారన్న బాధ మాత్రమే.”
“దివ్య అమ్మా నాన్నఎక్కడ ఉన్నారు?”
“నాన్న లేరు. అమ్మ చెన్నై లో ఉంది. నేనూ మావారూ ఇక్కడ ఉంటున్నాము.”
“ఇది సొంత ఇల్లేనా?”
“కాదండీ. అద్దె ఇల్లే. కాఫీ తాగుతారా?”
“వద్దు. ఇప్పుడే తాగి వచ్చాను. దివ్య రావడానికి ఆలస్యం అవుతుందా?”
“వచ్చేస్తుంది. కావాలంటే నేను వెళ్లి పిలుచుకుని రానా? గుడి దగ్గరలోనే ఉంది.”
“వద్దు వద్దు. వెయిట్ చేస్తాను,”
“సార్! నా చెల్లెలిని అనుమానిస్తున్నారా?”
“లేదమ్మా. ఇంకా ఎవరినీ సందేహించే స్థితిలో నేను లేను. మీ చెల్లెలు మా దగ్గర మొదట అబద్దం చెప్పింది. అది మంచిది కాదు. అనవసరమైన సమస్యలకి దారి తీస్తుంది.”
“ఆమెకేమీ తెలియదు సార్. వట్టి అమాయకురాలు. ఇల్లు విడిచి ఎక్కడికీ వెళ్ళదు. స్నేహితులు కూడా ఎవరూ లేరు తనకి.”
“మీరు మీ చెల్లెలితో ఎక్కవ రోజులు కలిసి లేరనుకుంటాను.”
“సెలవులకి వస్తుంది. అమ్మతోనే ఉంటుంది.”
వాకిట్లో చెప్పుల అలికిడి వినబడింది. “అక్కయ్యా!” అంటూ లోపలికి వస్తూ ఇనస్పెక్టర్ ని చూసి, “హలో సార్! బైట మీ జీప్ ని చూశాను. మీరే అయి ఉంటారను కున్నాను. ఇంకా ప్రశ్నావళి ముగియ లేదా?” అంది దివ్య.
“ఎక్కడమ్మా? మా ప్రశ్నలకి ఆది అంతం ఎక్కడ?”
“సరే. ఇదిగో ప్రసాదం. తీసుకోండి.”
“ఇంకా కొన్ని ప్రశ్నలు రామకృష్ణ గురించి.”
అదిరిపడినట్లు చూసిన దివ్య అక్క వైపు తిరిగి, “అక్కయ్యా! కాస్త కాఫీ చేసి ఇవ్వరాదూ” అంది.
“ఆయన వద్దన్నారే.”
“ఆయన అలాగే అంటారు. నువ్వు కలిపి తీసుకురా.”
అక్కయ్య లోపలికి వెళ్ళగానే, “సార్! చిన్న రిక్వెస్ట్. మీ ప్రశ్నలు ఏవైనా సరే అన్నిటికీ జవాబు చెబుతాను. కాని ఇక్కడ కాదు.”
“సరే. ఏదైనా రెస్టారెంట్ కి వెళదామా?”
“పోలీస్ జీప్ లోనా?”
“ఒక పని చెయ్యండి. సాయంత్రం ఐదు గంటలకి మా యింటికి రాగలరా? రెస్టారెంట్ కి వెళ్ళినా పోలీస్ యూనిఫారంలో చూసే వాళ్లకి కాస్త తేడాగానే ఉంటుంది.”
“సరే, మీ యింటికి వస్తాను.”
“నాకు పెళ్లయింది.”
“కాకున్నా కూడా ఫరవాలేదు.” నవ్వుతూ అన్నది దివ్య.
ఆమెకు అడ్రెస్ ఇచ్చి, అక్కడి నించి సురేఖా స్పోర్ట్స్ షాప్ కి వెళ్ళారు.
“గుర్తు ఉన్నానా?”
“ఏంటి సార్ అలా అడుగుతున్నారు? ఆ రోజు ఒక షూ ప్రింట్ ఇచ్చి ట్రేస్ చేయమని చెప్పారుగా?”
“అవును. ట్రేస్ చేయడానికి వీలయ్యిందా?”
“చేశాము.”
మాధవరావు ముఖం ప్రకాశవంతమయ్యింది. “చెప్పండి” అన్నారు.
“అది నేను ముందే చెప్పినట్లు స్పోర్ట్స్ షూ సార్. ఆర్నెల్ల ముందు ఒక స్పోర్ట్స్ క్లబ్ కి ఇరవై అయిదు జోళ్ళు షూలను కన్సెషన్ రేట్ కి ఇచ్చాము. దాని ఇన్వాయిస్ చూస్తే తెలిసింది.”
“ఇంకెవరికైనా అమ్మి ఉంటారా?”
“అమ్మాము. కాని ఎవరికని చెప్పడం కష్టం. బిల్ మాత్రమే ఉంటుంది. పేరు ఉండదు.”
“స్పోర్ట్స్ క్లబ్ పేరేమిటి?”
“మాయా స్పోర్ట్స్ క్లబ్.”
నమ్మకం లేక పోయినా మాధవరావుకు సంతోషం కలిగింది. ఏదో క్లూ దొరక బోతున్నదన్న సంతోషం.
మాయా స్పోర్ట్స్ క్లబ్!
“ఆ ఇన్వాయిస్ ఇలా ఇవ్వండి. చూద్దాం.”
*****
(ఇంకా ఉంది)
1956లో దిండిగల్, తమిళనాడులో జననం. మాతృభాష తమిళం. తండ్రిగారి ఉద్యోగరీత్యా తెలంగాణాలో తెలుగు మాధ్యమంలో విద్యను అభ్యసించారు. బి.కాం. పూర్తి అవుతుండగానే వివాహానంతరం చెన్నైకి వెళ్ళవలసి వచ్చింది. ఆ తరువాతే తమిళ సాహిత్యం చదవడానికి అవకాశం లభించింది. సాహిత్యం అంటే మక్కువ. తెలుగులో తనకి నచ్చిన నవలలు, కధలు తమిళ పాఠకులకు, అలాగే తమిళంలో మనసుకు దగ్గరగా ఉన్న సాహిత్యాన్ని తెలుగు పాఠకులకు అందించాలనే కోరికతో, ఆశయంతో అనువాద ప్రక్రియను ఎంచుకున్నారు. 1995లో మొదటి అనువాద కధ యండమూరి వీరేంద్రనాథ్ గారి “ది బెట్’ తమిళంలో ప్రచురం అయ్యింది. దాదాపు ఎనబై తెలుగు నవలలు తమిళంలో వెలువడి ఉన్నాయి. (యండమూరి వీరేంద్రనాథ్, యద్దనపూడి సులోచనారాణి, D. కామేశ్వరి, ఓల్గా) తెలుగులో పెరుమాళ్ మురుగన్ గారి “పూనాచ్చి ఒక మేకపిల్ల కధ” ఈ మధ్యే వెలువడింది. 2015లో ఓల్గాగారు “విముక్త” కధా సంకలనానికి సాహిత్య అకాడమి అవార్దు అందుకున్న అదే ఏడాది, విముక్త తమిళ అనువాదం “Meetchi”కి గౌరీ కృపానందన్ సాహితి అకాడమి అనువాద పురస్కారం అందుకున్నారు. మూలానికీ, అనువాదానికీ ఒకే ఏడాది సాహిత్య అకాడమి అవార్డులు రావడం ఇదే తొలిసారి.