యాత్రాగీతం

బహామాస్ 

-డా||కె.గీత

భాగం-8

బహామాస్ క్రూజ్ (రోజు -3, భాగం-1)

          మర్నాడు ఉదయం ఎనిమిది ప్రాంతంలో మా నౌక “నాసో” నగరపు ఒడ్డున ఆగింది. ఇక్కణ్ణించి ఊళ్లోకి వెళ్ళడానికి పడవ మీద వెళ్లనవసరం లేదు. నౌక ఆగేందుకు వీలుగా షిప్ యార్డ్ ఉంది ఇక్కడ. మేం ఆ రోజంతా నాసో నగరంలో డే టూరుకి వెళ్తామన్నమాట.  ముందుగా ఏ టూర్లు కావాలో బుక్ చేసుకున్న ప్యాకేజీ కాబట్టి మేం నౌక దిగి డే టూరుకి వెళ్లే గ్రూపుతో కలిసి వెళ్ళాలి. అక్కడ స్నోర్కిలింగ్ టూర్స్ వంటివి కూడా ఉన్నాయి. 

          ఈ “నాసో” నగరం వెస్టిండీస్ లో భాగమైన బహమాస్ దేశ  రాజధాని అన్నమాట.  బహమాస్ దేశం మొత్తం  జనాభాలో  70 శాతం ఈ నగరంలోనే నివసిస్తారట. ఈ నగర జనాభా సుమారు  మూడు లక్షలు. ఇక్కడ అంతర్జాతీయ విమానాశ్రయం కూడా ఉంది. 

          బహామాస్ మొత్తం 700 వందల ద్వీపాలు, 2400 చిన్న ఇసుక తిన్నెల వంటి ద్వీపాల సముదాయం. ఈ దీవుల్ని మొదటగా కనిపెట్టింది క్రిస్టఫర్ కొలంబస్ అయినా 1670 ప్రాంతంలో ఈ దీవులని ఆక్రమించుకున్న బ్రిటిషు వాళ్ళు ఈ నగరంలో ఒక కోటని నిర్మించి అప్పటి రాజు రెండవ కింగ్ చార్లెస్ గౌరవార్థం ఆ ప్రాంతానికి “చార్లెస్ టౌన్” అని నామకరణం చేసారు. ఈ నగరం 1684 లో స్పానిషు ఆక్రమణదారుల వల్ల పూర్తిగా ధ్వంసం అయ్యింది. ఆ తరువాత బ్రిటిషు వాళ్ళు 1695లో మళ్ళీ అధికారాన్ని చేజిక్కించుకుని ఈ సారి ఈ నగరానికి నాసో వంశస్థుడు, ఆ తర్వాతి బ్రిటిషు రాజు అయిన మూడవ కింగ్ విలియమ్స్ గౌరవార్థం ఈ నగరానికి “నాసో” అని పేరు పెట్టారు. అప్పటినించి ఆ పేరు స్థిరపడింది. 

          1973 లో బహామాస్ జాతిపిత సర్ లిండెన్ ఆస్కార్ పిండ్లింగ్ (Sir Lynden Oscar Pindling) ఆధ్వర్యంలో స్వాతంత్రయాన్ని  చేజిక్కించుకుంది. అయితే పూర్తిగా ప్రజాస్వామ్య ప్రభుత్వం కాకుండా ప్రజాస్వామ్యరాజరిక ప్రభుత్వం ఏర్పడింది. బ్రిటన్ రాణి/రాజు ఇప్పటికీ బహామాస్ కి కూడా రాజరిక పరిపాలకులే. ప్రస్తుతం టూరిజమే ప్రధాన ఆకర్షణగా మారిన ఖరీదైన దేశం బహామాస్. 

          ఇక నాసో నగర సందర్శనలో భాగంగా మేం ఒక మినీవాన్ ఎక్కేం. అది గైడెడ్ టూర్. బస్సు డ్రైవరే విశేషాలు చెప్తూ మాకు చుట్టూ అన్నీ చూపించే టూరన్నమాట. 

          ముందుగా వ్యానులోనించే వరసగా కొన్ని ప్రదేశాలని చూస్తూ వివరాలు విన్నాం. అందులో మొదటిది పాంపే బానిసల మ్యూజియం (Pompey Museum of Slavery & Emancipation). ఒకప్పుడు ఇక్కడ ఆఫ్రికా నించి ఎత్తుకొచ్చిన బానిసల కొనుగోళ్లు, అమ్మకాలు జరిగేవట. దాదాపు 1769 ప్రాంతంలో నిర్మించిన  ఈ ప్రదేశంలో 19వ శతాబ్దపు పూర్వార్థం వరకు ఇటు వంటి  లావాదేవీలు జరుగుతూ ఉండేవట. 

          1992లో దీన్ని మ్యూజియంగా మార్చారు. గులాబీ రంగులో పైకి ప్రశాంతంగా కనిపిస్తున్న ఈ భవనంలో ఎన్ని కన్నీళ్లు వరదలయ్యేవో, ఎన్ని సంకెళ్లు చప్పుళ్ళు చేసేవో తల్చుకుంటేనే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. 

          తరువాత చూసినది స్ట్రా మార్కెట్ (Straw Market ) ఇక్కడ స్థానికంగా దొరికే గడ్డి, చెక్కలతో  తయారుచేసిన బుట్టలు, బొమ్మలు, పూసల దండలతో బాటూ ద్వీపమంతటా దొరికే పింగాణీ, లోహపు  వస్తువులు వగైరా అమ్మే ప్రధాన స్థలం. ఒకప్పుడు ఇది చేపలు పట్టే బుట్టలు, పళ్ళ గంపలు తయారుచేసి అమ్మే స్థలమట. 

          అక్కణ్ణించి వ్యానులోనించే పార్లమెంటు భవన సందర్శన చేసాం. పార్లమెంట్ స్క్వేర్ (Parliament Square)గా  పిలవబడే ఈ చోట గులాబీ రంగులో నిర్మించబడ్డ అసెంబ్లీ భవనం (House of Assembly Building), సెనేట్ భవనం(Senate building), మధ్య ఠీవిగా కూచున్న విక్టోరియా రాణి శిల్పం(Statue of Queen Victoria) చూడాల్సినవి. 

          ఇక రాసన్ స్క్వేర్ (Rawson Square) లో బహమాస్ మొదటి గవర్నర్ జనరల్ అయిన సర్ మైలో  బట్లర్ (Sir Milo Butler) కాంస్య విగ్రహం ఉంది. దీనికి రాసన్ స్క్వేర్ అన్నపేరు 1860 ప్రాంతంలో గవర్నర్ జనరల్ అయిన సర్ డబ్ల్యు రాసన్ వల్ల వచ్చిందట. ఇక్కడ చర్చిల్ భవనం (Churchill Building) , సాండ్స్ వాటర్ ఫౌంటైన్ (Sands Water Fountain) చూడదగ్గవి.

*****

(ఇంకావుంది)

 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.