రాగో
భాగం-28
– సాధన
ఇర్కు కస దగ్గరికి దళం చేరే సరికి ఉదయం తొమ్మిదైంది. దారిలో ఊర్లు తగలకుండా అడవిలో అడ్డంపడి నడుస్తూ వెంట తెచ్చుకున్న సద్ది ఆ రాత్రికి తిని పుంజులు కూసే వేళకు బయల్దేరి ఏకధాటిగా నడవడంతో దళం అక్కడికి చేరుకుంది. కిట్లు దించుకొని ముఖాలు కడుక్కొని దళం అలసట తీర్చుకునేసరికి కర, ఫకీరలు దాదలను, సామానులను వెంట పెట్టుకొని చేరుకున్నారు. వెంటనే పొయ్యి రాళ్ళు పెట్టి వంట ప్రయత్నాలు ప్రారంభమైనాయి.
వంటయ్యేలోపు రుషి, గాండోలు గ్రామ రక్షక దళం వారిని పక్కకు తీసుకెళ్ళి సర్వే వివరాలు మరింత లోతుగా తెలుసుకోసాగారు.
ఈలోగా డుంగ, ఉల్లేలు సామానులతో దిగారు. రుషి, గాండోలు వచ్చిన వారు తెచ్చిన సామానులు చూసుకోవడంలో మునిగిపోగా మిగిలిన కామ్రేడ్స్ అందరూ తిండ్లు కానిచ్చారు.
వార్తలు విని రేడియో బందు చేసి, దళాన్ని సమావేశపరిచాడు రుషి. గ్రామ రక్షక దళం వారు కూడ కూచున్నారు.
“కామ్రేడ్స్,
లంగరు గూడెం నుండి కొత్తూరు పోయే బళ్ళ బాట ఇక్కడికి ఓ కోసు ఉండవచ్చు. మన అందరం చూసిందే అది. లంగరు గూడెం క్యాంపు వాళ్ళు ఈ ఏరియాలో చురుగ్గానే పెట్రోలింగ్ చేస్తూ కూంబింగ్ కూడా చేస్తున్నారు. ఇక్కడ 3, 4 గ్రామాల్లోని సంఘం దాదలు వాళ్ళ రాకపోకల్ని రోజూ చూస్తూనే ఉన్నారు. ఇపుడు మన యాక్షన్ ప్లేస్ అదే. ఆ జాగా మనం అనేక మార్లు చూసిందే. అయినా యాక్షన్ కోసం ఆ జాగా ప్రతి అంగుళం మనం క్షుణ్ణంగా సర్వే చేసి అర్థం చేసుకోవాలి. అయితే ఇపుడు అక్కడికి పోను సాధ్యం గాదు. ఇక్కడ నక్షా వేసుకొని వివరాలు అర్థం చేసుకుందాం. రేపు మబ్బులో లేచి ఆ గ్రౌండు అంతా పరిశీలించుకొని పొద్దెక్కేసరికల్లా ఎవరి పొజిషన్స్ వారు తీసుకోవచ్చు” అంటూ రుషి లేచి నిలబడ్డాడు. నేలపై కర్రతో గీస్తూ.
” కామ్రేడ్స్,
పెద్దవాగు గడ్డెక్కి కొద్దిగ నడిస్తే ఊడలమర్రి చెట్టుంది కదా. అక్కడి నుండి 100-120 గజాల దూరం పోతే కన్నూరుకు పోయె కాలిబాట ఉంది. చూడండి. అగో ఆ మధ్య జాగా మనం అంబుష్ కు సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఆ తోవకు కుడివైపు బండలున్నాయి గదా. అగో. అక్కడ మనం ఉండాలి. అయితే ఇదే వాగు కొద్దిగ వంక తిరిగి బాగా కోసి పెద్ద కయ్య అయింది. ఆ తోవకు వచ్చేటోడు ఎడమ దిక్కు ఉరికితే కయ్యల పడుడు ఖాయం.
గత నెల రోజుల నుండి లంగరు గూడెం క్యాంపు వాళ్ళు ఆ బాట వెంబడే ఒక్కోసారి జీపులో, ఒక్కోసారి నడిచి పెట్రోలింగ్ కు తిరుగుతున్నట్టు మనకు ఖచ్చితమైన సమాచారం ఉంది కనుక, ఆ బండల వెనుక మనం అస్సాల్టు పార్టీ మాటుగాసి కనీసం 70 గజాలు కిల్లింగ్ గ్రౌండ్ ను కవర్ చేసినా కూడ వాళ్ళు రెండు జీపుల్లో వచ్చినా, లేదా 15, 20 మంది కాలినడకన వచ్చినా ఆ కిల్లింగ్ గ్రౌండ్ నుండి బయటపడడం వాళ్ల తరంగాదు.
మన అస్సాల్టు పార్టీకి అవతలి వైపు, బాటకు ఎడమ ప్రక్కన మన స్టాప్ పార్టీ కవ ఉంటే శత్రువు కిల్లింగ్ గ్రౌండు నుండి బయటపడి అటువైపు నాచురల్ డెడ్ గ్రౌండులో అంటే ఆ కయ్య వైపు పరుగెట్టినా మన స్టాప్ పార్టీ వారిని ఖతం చేయగలుగుతుంది.
మర్రిచెట్టుకు అవుతల బోరుమీద మన స్కౌట్ పార్టీ ఉండే శత్రువు బాట వెంట వచ్చి వాగులోకి దిగేటపుడే వీళ్ళకి స్పష్టంగా కనబడుతుంది. ఎందరొస్తున్నరో, ఎట్లా వస్తున్నారో వివరాలతో సహా ఖచ్చితంగా అంచనా వేసుకోవచ్చు. స్కౌట్స్ నుండి అస్సాల్ట్ పార్టీ కమాండర్ వరకు సులభంగానే కనెక్షన్ పెట్టుకోవచ్చు. కనుక శత్రువు ఎంటరయిన సిగ్నల్ వెంటనే అందుతుంది.
అలాగే సెకండ్ స్కౌట్ పార్టీ కన్నూరు కాలిబాటను కవర్ చేస్తూ ఉంటే ఊహించని శత్రువు ఎదురైనా వాళ్ళు మనల్ని అలర్ట్ చేయగలుగుతారు. ఇటు ప్రైమరీ పోస్టుకి అంటే బోరు మీద స్కౌట్లకి, అటు సెకండరీ పోస్టు అంటే కన్నూరు బాట దగ్గర మన వాళ్ళుండే స్థలానికి మధ్య కనీసం 120 గజాలుంటుంది.
బండల కవరులో కూచుని ఉండే అస్సాల్టు పార్టీ కమాండరు మొత్తం గ్రౌండు, దారి స్పష్టంగా కనపడుతుంది. అస్సాల్టు పార్టీలోని వారు అందరికి బండల కవరు చాలా సహజంగా ఉండడం వలన ఎవరి ఫైరింగ్ లో వారు శత్రువును స్పష్టంగా చూడ గలుగుతారు. అలాగే ఆ ప్రదేశం బాట కంటే ఎత్తులో ఉండటం వల్ల ఆ బాటలో వచ్చే శత్రువు దూరంలో ఉండగానే ఇన్ ఫ్లెటెడ్ పొజిషన్లోనూ, దగ్గరగా వచ్చినపుడు డిప్లేటెడ్ పొజిషన్లో కూడ స్పష్టంగా కనిపిస్తూ మన దృష్టి నుండి తప్పించుకు పోలేడు.
అంతేగాక బండల వెనుక నుండి ఇటు బాటలోకి రావలసిన అవసరం లేకుండా, అటు మర్రి వైపు పోవలసిన పని లేకుండా అటు నుంచి అటే అడవిలోకి తప్పుకోడం చాలా తేలిక. అందువల్ల ఏ క్షణంలోనైనా కాషన్ (సిగ్నల్) వస్తే విత్ డ్రా కావడానికి గానీ, అత్యవసర పరిస్థితుల్లో రిట్రీట్ కావడానికి కూడ ఆ ప్రదేశం చాలా అనువుగా ఉంటుంది.
ఇపుడు గ్రౌండు పొజిషన్ గూర్చి అనుమానాలు లేవనుకుంటా” అంటూనే,
“కామ్రేడ్స్
అందరూ తుపాకులు క్లీన్ (శుభ్రం) చేసుకొండి. తూటాలు చూసుకొండి. గ్రెనేడ్స్ అన్నీ దొంగ దాదకు ఇస్తే ఇగ్నీషన్ సెట్స్ చెక్ చేసి ఇస్తాడు.
ఉదయాన్నే మనం పోంగ నేను ఆర్ వి పోస్ట్ చూయిస్తాను అందరు గుర్తు పెట్టు కొండి. ఏమైనా అందరం అక్కడ కలుసుకోవాలి. ఎవరైనా తప్పితే ఇక్కడికి వచ్చి ఇక్కడుండే కామ్రేడు కలవాలి. మీ వెంట కాగితాలు, ఇతర సామానులేమి పెట్టుకోకండి. కిట్టు ఇక్కడే పెట్టాలి.”
“అట్లే మరో రెండు గంటల్లో వంట అయిపోతే తిని రెస్టు తీసుకొండి. ఉదయాన్నే 4 గంటలకు లేస్తేగానీ తెల్లారే వరకు పోయి వివరంగా అన్నీ చూసుకొని సిద్ధంగా ఉండ లేము” అంటూ రుషి మైన్స్ నింపడానికి పోయాడు.
***
ఉదయం ఆరు కావస్తుంది. అప్పుడే ఎండ వెచ్చబడడం ప్రారంభమైంది. దళం అంతా గ్రౌండు, పొజిషన్స్ చూసుకొని ఎవరి స్థలాల్లో వారు ఫిక్స్ అయ్యారు. రుషి చివరి సారిగా అన్ని పొజిషన్స్ ను చెక్ చేసుకొని వచ్చి ఎస్సాల్టింగ్ పార్టీ కమాండరింగ్ పొజిషన్లో సర్దుకొని కూచున్నాడు. తనకు కుడి ప్రక్కన ఉన్న స్విచ్ బోర్డు కనెక్షన్స్ ఫైనల్ గా సరి చూసుకొని సిగ్నల్ కోసం పెట్టుకున్న నైలాన్ తాడు ముడిని ఎడమ చేతికి తగిలించుకొని స్థిరంగా కూచున్నాడు.
అడివంతా నిశ్శబ్దం. ఎగిరే పక్షులు, పారే నీళ్ల సవ్వడితో పాటు ఎవరి ఊపిరి వారికి స్పష్టంగా వినపడుతుంది.
అందరి చూపులు ఎదురుగా ఉన్న టార్గెట్స్ మీద, అందరి మనసులు తమ చేతుల్లో పడనున్న శత్రువు మీద లగ్నమై ఉన్నాయి.
ఎన్నాళ్ళ నుండో కలలు కంటున్నట్టు ఈ రోజు శత్రువు మీద గట్టి దెబ్బ తీయడానికి అవకాశం వచ్చినందుకు ఉత్సాహం అందరిలో ఉరకలేస్తుంది.
క్రమంగా ఎండ వేడి పెరుగుతుంది. శత్రువు కోసం నిరీక్షణలో టెన్షన్ పెరుగు తుంది. వాడి జాడ, సవ్వడి ఎక్కడ వినబడటం లేదు.
అప్పుడే మూడు గంటలు దాటి పోయింది. రుషి అప్రయత్నంగా వాచివైపు చూసుకున్నాడు. 9. 15 కావస్తుంది. ‘క్రిందటిసారి ట్రైనింగ్ క్యాంపుకు పోయి వచ్చినప్పటి నుండి బీడీలు మానుకోవడం ఎంత మంచి పని అయ్యింది’ అని తనను తనే అభినందించు కుంటున్నాడు.
ఉన్నట్టుండి ఎడమ చేయి తాడు లాగినట్టయ్యింది.
‘ఎక్కడా వెహికల్ శబ్దం వచ్చినట్టు కాలేదే’ అనుకుంటూ చెవులు రిక్కించేంతలో ఈసారి మరింత స్పష్టంగానే తాడు చేయిని లాగింది.
తక్షణమే రుషి లోగొంతుకతో ఇష్ ఇషా మని శబ్దం చేస్తూ తన వెనుక నున్న బాడీగార్డుకి రిలే సిగ్నల్ అందించాడు. వెను వెంటనే బాడీగార్డు రిలే సిగ్నల్ ను రిపీట్ చేయడం రుషికి వినపడింది. చూపు తిప్పకుండా రుషి బాటనే పరిశీలిస్తున్నాడు. ‘అంటే ఇవాళ జీపు రావడం లేదన్న మాట’ అనుకుంటుండగానే పోలీసు పార్టీ పైలట్స్ కంట పడ్డారు. కొన్ని సెకండ్ల అంతరంలో మూడోవాడు కంటపడ్డాడు. –
మూడు, నాలుగు, ఐదు, ఆరు స్విచ్ బోర్డుపై చేయి ఆనించి రుషి కన్నార్పకుండా చూస్తూ లెక్కపెడుతున్నాడు.
మొదటి వాడి పొజిషన్ అంచనా వేస్తున్నాడు. పోలీసు పైలట్స్, సెకండరీ స్కౌట్స్ ఎదుటికి రావడానికి ఇంక కొద్ది సెకండ్సే ఉండవచ్చు.
రుషి మైన్స్ స్విచ్ నొక్కేసాడు. ఒక్కసారి చెవులు చిల్లులు పడ్డాయి. బాట మధ్యలో గ్రౌండ్ మైన్ పెద్ద శబ్దంతో పేలింది. ప్రతిధ్వనితో పెనువేసుకుంటూనే క్లోమోర్ చార్జ్ పెద్ద శబ్దంతో పేలిపోయింది. వచ్చే పోలీసులకు ఎదురుగా బాట కుడి ప్రక్కన ఉన్న మద్దిచెట్టు మాను నుండి రాళ్ళు, నిప్పులు వర్షం కురిసినట్టు క్లోమోర్ చార్జ్ పెద్ద శబ్దంతో పేలి పోయింది. వచ్చే పోలీసులకు ఎదురుగా బాట కుడి ప్రక్కన ఉన్న మద్దిచెట్టు మాను నుండి రాళ్ళు, నిప్పులు వర్షం కురిసినట్టు క్లోమోర్ చార్జి నుండి పోలీసులపై ఇనుప మేకుల వర్షం కురిసింది.
దబ దబ దబ మని నేలమీద పడిపోయిన పోలీసులు కొద్ది సెకనులు ఆగి తలలెత్తారు. ఒకరిద్దరు కవరు కోసమన్నట్టు బండల వైపు కదలబోయే సరికి బండల్లో నుండి ఒక్క పెట్టున ఫైరింగ్ స్టార్టయ్యింది. రెండు నిముషాల పాటు ఊపిరి సలుపకుండా శత్రువు మీద గుళ్ళ వర్షం కురిసింది. స్ప్రింగ్ ఫైరింగ్ జరుగుతుండగానే శత్రువు వైపు నుండి మూడు, నాలుగు రౌండ్లు కాల్పులు వచ్చాయి. కానీ అంతటితోనే అటు ఫైరింగ్ ఆగిపోయింది.
మరో నిముషంలో కమాండర్ లాంగ్ విజిల్ వినవచ్చింది. బండల్లో నుండి జరుగుతున్న ఫైరింగ్ వెంటనే ఆగిపోయింది.
అంతా నిశ్శబ్దం. ఎవరి గుండె చప్పుడు వారికి వినబడుతుంది.
1-2-3 నిముషాలు గడిచిపోతున్నాయి. రుషి వాచి చూసుకున్నాడు. ఫైరింగ్ ఆగిపోయి 10 నిముషాలు దాటుతుంది.
సీజింగ్ పార్టీకి కాషన్ ఇవ్వబోతూ కిల్లింగ్ గ్రౌండ్ వెరిఫికేషన్‌కై అడ్వాన్స్ అయ్యే ముందు అరగంట లేట్ చేసినా నష్టం లేదంటూ డి.వి.సి.ఎస్. పదే పదే చెప్పిన జాగ్రత్తలు గుర్తుకు రాగా వెంటనే గ్రెనేడ్ చార్జ్ అంటూ డుంగకు కేక పెట్టాడు.
కాషన్ వెను వెంటనే నిమిషం తేడాతో రెండు గ్రెనేడ్లు పేలి అడివంతా దద్దరిల్లింది.
మరో ఐదు నిముషాలు నిశ్శబ్దం.
ఉన్నట్టుండి “సీజింగ్ పార్టీ అడ్వాన్స్” అనే కాషన్ మారుమోగింది.
గాండో, డుంగ, గిరిజ, జైని, కర్పలు బండల మాటు నుంచి లేచి ముందుకు కదిలారు.
కవర్ టు కవర్ అని రుషి మళ్ళీ కాషన్ ఇచ్చే సరికి వారంతా బెండింగ్ పొజిషన్ లో అలర్ట్ గా రాళ్ళ మధ్య నుండి చెట్ల వెనుక నుండి అడ్వాన్స్ అయిపోయారు.
మరో ఐదు నిముషాల్లో “గ్రౌండ్ క్లియర్” అంటూ గాండో విజయోత్సాహంతో పెట్టిన గావుకేకతో కయ్యవైపు నుండి స్టాప్ పార్టీ, బండల వైపు నుండి మిగతా ఎస్సాల్ట్ పార్టీ ఒకేసారి గ్రౌండులోకి పరుగుతీశారు.
కమాండర్ రుషి, బాడీగార్డు ఉల్లె తమ పొజిషన్లోనే నిలబడి గ్రౌండ్ లో కోలాహలాన్ని ఆత్రుతగా చూస్తున్నారు.
గ్రౌండ్ నుండి “రిట్రీట్” అనే గాండో కాషన్ తో కోలాహలం సద్దుమణిగింది.
కామ్రేడ్స్ అందరూ రెండేసి, మూడేసి తుపాకులు అదనంగా భుజాలకేసుకొని, బ్యాగులు, బెలు, టోపీలు చంకన పెట్టుకొని హడావిడిగా కమాండర్ వద్దకు చేరుకున్నారు.
స్కౌట్సను విత్ డ్రా కమ్మని కాషన్ ఇస్తూనే ‘సీజింగ్ పార్టీ’ని వెంటేసుకొని కమాండర్ రిజర్వు పార్టీ వైపు దారి తీశాడు.
క్షణాల్లో యాక్షన్ ప్లేస్ అంతా నిర్మానుష్యం అయింది.
మొత్తం దళాన్ని వెంటేసుకొని రుషి ఇర్కుకసకి అడ్మినిస్ట్రేటివ్ పాయింట్ కి చకచక సాగిపోయాడు.
* * * * *
(ఇంకా ఉంది)
సాధన కమ్యూనిస్టు పార్టీ నాయకులు. తెలంగాణ రాష్ట్రలోని కరీంనగర్ జిల్లా పెద్దపల్లిలో జన్మించారు. అడవి కడుపులో ఆయుధంతో అనునిత్యం కత్తి అంచుమీద నడుస్తూనే మిగుల్చుకోవడానికి కాలం వ్యాకోచించదు కనుక క్రమశిక్షణకు లోబడి ఓవర్ టైం పనిచేసి సృజనశీలియైన సాధన రాసిన రెండో నవల రాగో. అడవిలో మనుషులుంటారని, ఆ మనుషులకు అభిమానాలు, అభిజాత్యాలు ఉంటాయని – ఆ మనుషులు, వాళ్ళ మధ్యన మరో ప్రపంచపు మనుషులు కలిసి అనురాగాల, అభిమానాల, ఆదర్శాల ఒక స్వాప్నిక ప్రపంచం కొరకు ఒక కఠోర సాయుధ పోరాటం చేస్తున్నారని సాధన నవలలు ‘సరిహద్దు’, ‘రాగో’ సాధికారికంగా ప్రతిఫలిస్తాయి.