విజయవాటిక-15
చారిత్రాత్మక నవల
– సంధ్య యల్లాప్రగడ
ఇంద్రపురి – ఘటికాపురి
రాజ గురువులు పరమేశ్వరశాస్త్రులు పీఠము మీద అధిష్టించి ఉన్నారు. వారి ఎదురుగా మరో పీఠము మీద రాజమాత కూర్చొని ఉన్నారు.
రాజ గురువులు కొంత సేపటి నుంచి ధీర్ఘ ధ్యానంలో ఉన్నారు.
కాసేపటికి ఆయన కళ్ళు తెరిచి, ప్రశాంతమైన చూపులతో రాజమాతను చూశారు.
ఆమె, ‘ఆయన ఏమి చెప్పనున్నారో?’ అని ఎదురుచూస్తున్నది.
ఆయన చిన్నగా “అమ్మా! మీరు మహాదేవుని మనసులో నిలుపుకున్నారు. మీకు తెలియని విషయము కలదా? మీకు నేను చెప్పవలసినది ఏమున్నది?”
“గురుదేవా! మీరు మా శ్రేయస్సు కోరేవారు. మా వంశ శ్రేయస్సు మీ దీవెనలే. నేటి కాలము మా వంశమునకు గడ్డు కాలము కారాదు. మీరే దారి చూపాలి. మీ అనుగ్రహముతో మాత్రమే ఈ గండం దాటగలము…” అన్నది రాజమాత చిన్నగా, కంఠం వణుకుతుండగా.
“అమ్మా మన విష్ణుకుండినుల వంశక్షేమము మా ధ్యేయము కూడా! మీకు నేను చెప్పవలసినది ఏమున్నది. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కదలదు కదా!”
“గురుదేవా ప్రతిదానికీ మార్గమున్నది. నాకు మా వంశము నిలబడటము తప్ప మరో స్వార్థము లేదు…”
“అమ్మా! మీ గురించి నాకన్న ఎవరికి తెలుసు? మీరు రాజ సింహాసనాన్ని వంశం నిలబడటము కోసము వదులుకున్నారు. దేశమంతా నేడు వేద ధర్మము నిలబడిందన్నా, ధర్మము, న్యాయము నాలుగు కాళ్ళ పై నడుస్తున్నవన్నా, అది కేవలము మీ సంకల్ప బలము వల్లనే కదా తల్లీ! పైగా మీ పట్టుదలతో, మీరు అందరినీ ఏకతాటిన నిలిపినారు. లేనిచో ఏముక్కకాముక్కగా విడిపోవలసిన రాజ్యము కదా ఇది…”
“గురుదేవా! నేడు ఈ కష్టకాలమేమిటి? నాకు కనపడుతున్న ఈ దుశ్శకునాలేమిటి? అనుదినము మహేశ్వరుని దర్శించే నాకు స్వామి దర్శనము గగనమవటమేమి? నాకు తోచటంలేదు…”
“సంభాళించుము రాజమాతా! అన్నింటికి దారి కలదు. ఒక మార్గం చెబుతాను. అన్నింటికీ మహాదేవుడున్నాడు…” అన్నారు రాజగురువులు.
“చెప్పండి గురుదేవా!”
“మీరు అమరావతిలో ఉండి, మండలము రోజులు మహదేవుని రుద్రము, నమక చమకములతో అభిషేకించండి. మీ సంకల్పమే ఈ రాజ్యానికి బలము. మీరు కోరిన తరువాతే త్రిలింగాలు మీ ఏలుబడిలోకి వచ్చాయి. నేడు ఆ త్రిలింగాలు నిలుస్తాయన్నా మరల మీ సంకల్పము వలననే. అంతా సరిదిద్దుకుంటుంది. అంతా శుభప్రదమవ గలదు…” అన్నారాయన.
రాజమాత ఆలోచనలో పడినట్లుగా మౌనము వహించింది.
ఆమె హృదయము చిన్నబోయింది. కొంత సేపటికి తేరుకొని ఒక నిర్ణయము తీసు కున్నది. తల ఎత్తి
“సరే గురుదేవా! మంచి ముహుర్తం చెప్పండి, నా అమరావతి ప్రయాణానికి…”
రాజగురువులు తల ఊపి, లెక్క కట్టి, ఇప్పటికి ఒక పదిహేను రోజులలో మంచి ముహుర్తమున్నదని చెప్పారు.
రాజమాత తల ఊపి, నెమ్మదిగా లేచి నమస్కరించింది. సహాయకులు వచ్చి సాయము పట్టగా, ఆమె నెమ్మదిగా రాజగురువుల పర్ణశాల నుంచి బయటకు నడిచింది. ఘటికాపురి బయట ఆగి ఉన్న మేనా ఎక్కింది. పరివారము, దండనాయకులు ముందు వెనకలు నడుస్తుండుగా ఆ పరివారము ఇంద్రపురి వైపు సాగిపోయారు.
***
ఇంద్రపురి రాజమందిరం
సాయం సమయమైంది, అప్పుడే చంద్రోదయమైంది. ఆ నాడు ప్రదోష శివ పూజ చేసుకున్న రాజమాతకు హృదయంలో ఎందుకో దిగులు కమ్ముకున్నది. ఆమె పరమేశ్వరుని చూసి నమస్కరించి, నెమ్మదిగా లేచి, ఊతగా చేతి కర్ర ధరించి బయటకు వచ్చింది.
విక్రమేంద్రుడు అక్కడ కూర్చొని ఉన్నాడు.
“అమ్మా!” అన్నాడు ఆత్రంగా…
“నాయనా విక్రమేంద్రా! గురువుగారు చెప్పిన విషయము విన్నావు కదా… మన రాజ్యానికి ఇప్పుడు కొంత కాలము గడ్డుకాలము. ఏ కాలమైనా మనము పరమేశ్వరుని పట్టుకు నడవటమే చెయ్యగలము…”
“అమ్మా మీరెందుకంత ఆందోళన చెందుతున్నారు?”
“నాకు ఆందోళన ఏమీ లేదు. కాని మనము వీరత్వంతో ఏదైనా సాధించాలి… దొంగ చాటు పనుల వల్లకాదు…” అన్నదామె.
విక్రమేంద్రవర్మ ఆమె వైపు దీక్షగా చూశాడు. రాజమాత మాటలలో ఒక గూడార్థము స్ఫురించినా… అతను బయటపడలేదు. మనసులో ఖంగుతిన్నాడు. మౌనము వహించాడు.
“అమ్మా! మీ కోరిక ప్రకారము మీరు మండల కాలము అమరావతిలో ఉండే ఏర్పాటు చేస్తున్నాను.… ఇంద్రభట్టారకుడు కూడా మీతోడు వస్తారు…” చెప్పాడు యువరాజు.
“మంచిది నాయనా…” చెప్పింది రాజమాత. ఇంద్రభట్టారకుడు ఆమె మనుమడు.
ఆమె అమరావతిలో మండల కాలము దీక్షలో ఉంటుందన్న కబురు మాధవవర్మకు చేరింది. ఆయన ఆ విషయము చూడమని శ్రీకరుని నియమించాడు.
***
అమరావతి
చంద్రోదయమైంది. రాజమాత అమరావతి నగరములోని ప్రత్యేక అంతఃపురములో ఉంది. ఆమె ఆనాటి ప్రదోష పూజ ముగించుకొని వచ్చింది. ఆమె ముఖము పైన గంధపు తిలకము మెరుపు ఆమె మేని మేరుపును దాచలేకపోతోంది. ముఖము కొద్దిగా వడలి ఉంది. ఆమె మండల దీక్ష మొదలు పెట్టి ఆహారము తగ్గించింది. కేవలము కొద్దిగా పళ్ళు మాత్రమే తీసుకుంటోంది. రోజులో ఆమె ధ్యానములో ఉండే సమయము పెరిగింది. ఎందుకో నిర్లిప్తంగా ఉంటోంది. వసంతుడు ఆమె ఆజ్ఞకై నిలబడి ఉన్నాడు.
ఎందుకో రాజమాత చాలా సమయము మౌనములో గడుపుతోంది. ఆమె ఆ రోజు శ్రీకరుని పిలిచింది.
శ్రీకరుడు వచ్చి ఆమెకు పాదాభివందనము చేసి నిలబడ్డాడు.
“ఇటు రా కారా!” దగ్గరకు పిలిచింది రాజమాత
ఆమె పాదాల వద్ద కూర్చున్నాడు శ్రీకరుడు.
“నీవు మా దాయాదుల సంతానము. మీ నాయనా, అమ్మా ప్రమాదములో మరణిస్తే ప్రియంవద వద్దకు తీసుకురాబడినావు…” గతంలోకి తొంగి చూస్తూ అన్నదామె. ప్రియంవద రాజమాత దూరపు చుట్టమైన అన్న వరుస అయిన వాని కూతురు. మహాదేవ వర్మ తల్లి. ప్రస్తుత మహారాజు పట్టపురాణి.
“అవును తల్లీ!” అన్నాడు శ్రీకరుడు.
“ఆనాటి నుంచి నాకు నీవొకటి, మహాదేవుడొకటి కాలేదు. మీ ఇద్దరూ మా పిల్లలే అనుకున్నాను…”
శ్రీకరుడు మౌనంగా వింటున్నాడు. మనసులో ఆలోచిస్తున్నాడు ‘ఈ సంభాషణ ఎటువైపు మరలుతుంది?’… రాజమాత శ్రీకరుని నుంచి చాలా పెద్ద విషయమే అడగ బోతున్నదని భావించాడు.
“నాకు విష్ణుకుండినుల వంశ ప్రతిష్టకన్నా ముఖ్యమైనది లేదు. మనము వ్యక్తుల కన్నా వంశ ప్రతిష్టకే ప్రాముఖ్యత నివ్వాలి…”
“అవును మాతా….”
“రాముడు సీతమ్మ తల్లిని ఎందుకు అడవులకు పంపాడు?”
మధ్యలో అనుకోని ప్రశ్నకు ఆమెవైపు వింతగా చూశాడు.
“ఆయన రఘురాముడు కాబట్టి. రఘువంశ ప్రతిష్టకు భంగం రాకూడదని. వంశ ప్రతిష్ట కన్నా రాజుకు వ్యక్తిగతమైనది ఉండదు, ఉండకూడదు. రాజు ప్రజలకు జవాబుదారి. ధర్మదేవత ప్రతిరూపము ప్రజలు. వారి కోసమే తమ సుఖాలను రాజు త్యాగము చెయ్యాలి, అవసరమైతే…అది మనము మనసులో సదా జ్ఞప్తికి ఉంచుకోవాలి…”
శ్రీకరుడు అవునన్నట్లుగా తల ఊపాడు.
“రాజు బంధువులైనా, రాజస్థానములో ఉద్యోగులైనా, రాజు కోసము నమ్మకముగా పనిచేస్తున్న వారు శాంతి భద్రతల కోసము, స్థిరత్వం కోసము పాటుపడాలి…”
తల ఊపాడు శ్రీకరుడు.
రాజమాత లేచి “మంచిది వెళ్ళిరా. మళ్ళీ పిలుస్తాను…” అన్నది.
శ్రీకరుడు ఆమె పాదాలంటి నమస్కరించి వచ్చేశాడు. మనసులో ఆశ్చర్యము ‘ఎందుకు రాజమాత ఇలా మట్లాడింది’ అనుకుంటూ ధీర్ఘంగా ఆలోచనలో మునిగి పోయాడు.
అతనికి ఇంద్రపురిలో గురుదేవుల మాట గుర్తుకు వచ్చింది.
రాజమాతను అమరావతికి తోడ్కొని రావటానికి వెళ్ళినప్పుడు అలవాటుగా ముందు గురుదేవులు పరమేశ్వరశాస్త్రిని దర్శించుకున్నాడు.
“ప్రణామములు గురుదేవా!”
“క్షేమమా కారా?”
“గురుదేవా! మీ కృపన…”
“నీ ఈ రాకకు కారణమేమి?”
“రాజమాతను అమరావతి కొనిపోవలెను…”
“ఓహో… సరి. నీకో విషయము చెప్పవలె. నీ హృదయములో పెట్టుకో ‘ఇంటి దొంగను ఈశ్వరుడైనను పట్టలేరు’ గుర్తుపెట్టుకో…”
“అదేమి గురుదేవా?”
“అవును నాయనా! నీవు అప్రమత్తంగా ఉండు. మరో విషయము, మనుష్యుల కొరకు కాక మనము వంశ ప్రతిష్ట కోసము ప్రయత్నించవలె…”
“అవశ్యము గురుదేవా…”
“మంచిది నాయనా. క్షేమముగా వెళ్ళిరా…”
ఇదే విషయము రాజమాత నోటి వెంట కూడా విన్నాడు. ఎక్కడో ఏదో జరుగు తున్నదా? లేక జరగనున్నదా? తెలియలేదు శ్రీకరునికి, అతను మనసులోనే ముక్కలు ముక్కులుగా ఉన్న సమాచారమును క్రోడీకరించే యత్నం చెయ్యసాగాడు.
కళింగుల నుంచి ప్రమాదము పొంచి ఉన్నదని తలిచాడు…కాదా? ఆలోచనతో వణుకు కలిగిందతనికి.
***
మహదేవవర్మ వనములోని అద్దాల మండపములో ఉన్నాడు. తూగుటుయ్యాల పై వాలి ఉన్న మహాదేవునికి సేవకులు వింజామరలతో విసురుతున్నారు. అతను విలాసముగా ఒక చేతిపై ఆనుకొని నవ్వుతూ, ఉత్సాహముగా తాంబూలము సేవిస్తూ ఎదురుగా హరిక నృత్యము వీక్షిస్తున్నాడు. ఆమె హృద్యముగా, సొగసుగా, భువన మోహనంగా ఒక జావళి నర్తిస్తున్నది.
వసంతరాగములో మిశ్రచాపు తాళములో సాగుతున్న విరహగీతమా జావళి.
“నన్ను చులకన జేసె వినవే నా సామి…
వెనుకటి నెనరుల తనమది నునుచగ…
పరిపరి విధముల సరసమాడక నాతో
అర నిముషముండని సరసుడే దూరే విని.. నన్ను చులకన జేసె వినవే…”
తన విరహము చూపుతూ సాగే ఆ జావళిలో తన విరహమంతా నటిస్తున్నది ఆమె. ఒక ప్రక్క వాయిద్యకారులు ప్రక్కవాయిద్యాలతో సంగీతం అందచేస్తున్నారు. మృదంగానికి తగినట్లుగా ఆమె తన పాదములను కదుపుతూ ఉంటే ఆ మువ్వల ధ్వని, మృదంగ ధ్వనితో కలిసి మరింత మధురంగా ఉంది. ఆమె నృత్యము స్వర్గలోకపు మేనకా, రంభాది అప్సరస స్త్రీలకన్నా అద్భుతంగా ఉంది.
వారి ఈ ఏకాంత నృత్య విలాసానికి అంతరాయం కలిగిస్తూ ఒక ప్రతీహారి వచ్చి ఒక లేఖ ఇచ్చి వెళ్ళాడు.
ఆ లేఖ సారాంశము, శ్రీకరుడు తమను ఏకాంతముగా దర్శించాలని వాంఛిస్తున్నాడు.
మహేంద్రవర్మ తల ఊపి ‘ఈనాటి సాయం సమయము కలుద్దామన్న’ సందేశం పంపాడు.
ఆయనకు చూస్తున్న నృత్యము మీద నుంచి కన్నులు త్రిప్పటం సాధ్యంకాలేదు మరి.
అంత మత్తులో ఉన్నాడు, ఆ నర్తకి అంటే. ‘చూసి తరించ వలసిన నృత్యమది. దేవలోక నృత్యమే కదా. ఈ హరిక పూర్వము రంభా ఊర్వసులతో దాస్యము చేయించు కున్నదాయేమి? ఏమి ఈమె సౌందర్యము’ అనుకున్నాడు మహాదేవుడు ఆమెను ఆరాధనగా చూస్తూ.
* * * * *
(ఇంకా ఉంది)
తెలంగాణలో పుట్టి పెరిగారు. వివాహాంతరము అమెరికా వచ్చారు. గత పదహరు సంవత్సరాలుగా అట్లాంటా నగరములో నివాసముంటునారు. ఫీనిక్స్ విశ్వవిద్యాలయం నుండి ఎం. బి. ఎ డిగ్రి పొందారు. శ్రీవారు కొండల నల్లజర్ల టీ మొబైల్ లో పని చేస్తున్నారు. కుమార్తె మేఘన. స్టాంఫోర్డ్ లో రెసెర్చు అసిస్టెంట్ గా సైకాలజీ ల్యాబ్ లో పనిచేస్తున్నది. సాంఘిక సేవాసక్తితో వివిధ తెలుగు సంఘాలలో కార్యకర్తగా అట్లాంటా తెలుగు సంఘములో పని చేశారు. తానా, అమెరికన్ రెడ్‌క్రాస్, అట్లాంటా సాయి టెంపుల్, అట్లాంటా హిందూ టెంపుల్, వీ.టీ. సేవ ఇత్యాది సంస్థల్లో స్వచ్ఛంద సేవ సేవలందించారు. దక్షిణ ఆసియా స్త్రీల సంక్షేమం కోసము సేవలందించే ‘రక్షా’ సంస్థ వారి “Ramesh Bakshi Leadership” అవార్డును, ‘పాడుతా తీయగా’ వారి సహకార అవార్డును, సిలికానాంధ్రవారి అవార్డును అందుకున్నారు. “నేను వడ్డించిన రుచులు, చెప్పిన కథలు” అన్న పుస్తకం ప్రచరించబడింది. కౌముది, సంచిక, మాలిక, దర్శనం వెబ్ మ్యాగజైన్స్ లో వీరివి ప్రతినెలా ప్రచురితమౌతున్నవి. ఊహలుఊసులు అన్న తెలుగు బ్లాగు రచయిత.