షర్మిలాం “తరంగం”

మనం ఇంతే !

-షర్మిల 

          మనం మారడం కష్టం ! మన నరనరాల్లో ఇంకిపోయిన తేడాలని దాటిరాలేం!వారసుడు పుట్టాలి అనే మాట తప్ప వారసురాలు అనే మాట ఎప్పుడన్నా విన్నామా మన దేశంలో ?

          మెగాస్టార్ కొడుక్కి వారసుడు పుడతాడా ?

          ఫలానా దర్శకుడికి ఎట్టకేలకు వారసుడు పుట్టాడు … ఇలా వుంటాయి మన రాతలు.

          రాసే వాడో రాసేదో ఎవరో ఇంకా ఆ పాత వాసన కొడుతూనే వున్నారు.

          ఆడపిల్లలు మాత్రం ఇంకా ఇంకా ప్రూవ్ చేసుకోవడానికి ఇక్కడ ఇంకెన్ని తరాలు పడుతుందో!

          ఒకప్పుడు ఒక హీరో కూతురు హీరోయిన్ అవుతానని పంతం పట్టింది. తీరా ఆ హీరో అభిమానులు ఆత్మహత్యలు చేసుకుంటాం కానీ తమ హీరో కూతురు సినిమాల్లో వేయడానికి వీల్లేదన్నారు!

          అదే ఆ హీరో కొడుకు సినిమా హీరో అయ్యేదాకా నిద్రపోలేదు.

          ఇది చాలా చిన్న విషయమే కావచ్చు కానీ, మన ఆలోచనలు ఎలాసాగుతున్నాయో అర్ధం చేసుకోవడానికి ఉపయోగపడతాయి.

          పెద్ద హీరోల అభిమానులందరూ ఆ హీరో ముసలివాడయ్యాకా కొడుకు హీరో అభిమానగణం కింద మారతారు. అదే హీరో కూతురు హీరోయిన్ అయితే ఈ గణాలు ఏమవుతారో తెలియదు.

          శృతిహాసన్ తన తిప్పలేవో తను పడడం చూశాంగానీ కమల్  వారసురాలు అంటూ ఏ అభిమానీ భుజాల మీద మోసినట్టు కనబడదు.

          మనం అంతే!

          ఈ మగ పిచ్చి ఏంటో జనాలకి …కొడుకుకి కొడుకు పుట్టకపోతే వంశం అంతరించి పోతుందంట అదో గోల!

          మనం వంశాలుగా కాక మనుషులుగా ఈ ప్రపంచంలోకి వచ్చామని అర్ధంఅయ్యే రోజొకటి రావాలి!

          అది ఎప్పుడొస్తుందో?

          రాజకీయాలైనా అంతే తండ్రి ముఖ్యమంత్రి అయితే ఆ తరవాత వారసత్వం పుచ్చు కోవడానికి పట్టాభిషేకానికి కొడుకు రెడీ !

          మరి కూతుళ్ళు చేసిన పాపం ఏంటో?

          వారసత్వమే తప్పుడు ఆలోచన కాగా మళ్ళీ దీంట్లోనూ ఆడ మగ తేడాలు!

          ఆనాడు నెహ్రూ గారికి మగ పిల్లలు లేక చచ్చినట్టు ఇందిరా గాంధీ  ప్రధాని అయ్యింది గానీ ఆయనకే ఒక కొడుకు వుంటే ఇందిరమ్మ పేరు సోఫిలో కూడా వినిపించేది కాదు … ఇది నిజం! 

          అది లేదూ.. ఇది లేదు… అన్ని రంగాల్లోనూ ఇదే వరస.

          సమాజం పోకడలు గమనించడానికి ఎక్కువగా ప్రాచుర్యంలో వున్న సినిమా రాజకీయ రంగాలు ఉదాహరణగా నిలుస్తాయి.

          ఈ మధ్య ఎక్కడ విన్నా ఒకానొక హీరో నాలుగో పెళ్ళి గోలే !

          మొగుడు నాలుగో ఆవిడతో గదిలో వుంటే మూడో ఆవిడ చెప్పుతో కొట్టబోయింది…  ఎవర్ని మొగుడు గారిని కాదు ఆయన గారితో వున్న ఆడ మనిషిని.

          తప్పులు ఎంచేటప్పుడు కూడా ఒకే తప్పు ఇద్దరూ చేసినా పర్యవసానాలువేరేగా వుంటాయన్నమాట!

          సదరు ఆడ ఆవిడని రెండు సినిమాల్లోంచి తీసేశారట!

          మరి మూడు పెళ్ళిళ్ళు చేసుకున్న ఇంకో హీరో గారికి పాలాభిషేకాలు!

          ఎందుకీ ద్వంద్వ నీతి!

          విషయం సిల్లీదే కానీ సమాజం అలోచించే విధానం మీదే ఈ చర్చ!

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.