హాష్ టాగ్ సేఫ్ సెక్స్ (#safesex)

ఆలమూరు సౌమ్య ఫేసుబుక్ లో “సేఫ్ సెక్స్” గురించి సూటిగా రాసిన పోస్టు మీద విపరీతంగా ట్రోలింగ్ జరుగుతూ ఉంది. ఆ పోస్టులోని అసలు విషయాల్ని తప్పుదోవ పట్టిస్తూ, సమాజం తగలబడిపోతోందని ఆక్రోశం వెళ్లగక్కడమే కాకుండా, దాడికి పాల్పడుతున్నారు. సేఫ్ సెక్స్ అనేది కేవలం ఆరోగ్యానికి సంబంధించినది మాత్రమే కాదు. ఆడపిల్లలకి ఎమోషనల్ అటాచ్ మెంటు గానో, బ్లాక్ మెయిల్ గానో పరిణమించిన పరిస్థితుల్ని తట్టుకునే శక్తి కూడా. మగపిల్లలు వ్యక్తిస్వేచ్ఛని అర్థం చేసుకుని ఆడపిల్లలకి విలువ, గౌరవం ఇవ్వాల్సిన సందర్భం. ఈ కాలపు ఆడపిల్లలు, మగపిల్లలు ఆలోచించుకోవలసిన అత్యవసర విషయం. 

దాడుల్ని నిరసిస్తూ నెచ్చెలి సంస్థాపక సంపాదకులు డా.కె.గీత రాసిన కవిత తో బాటూ, ఈ సందర్భానికి తెర తీసిన సౌమ్యని అభినందిస్తూ, ఆ పోస్టుని ఇక్కడ యథాతథంగా  ప్రచురిస్తున్నాం. 

safesex అనే విషయాన్ని బహిరంగంగా మాట్లాడవలసిన, చర్చించవలసిన అవసరాన్ని కొనసాగిస్తూ “నెచ్చెలి” మీ నుంచి రచనలని ఆహ్వానిస్తూ ఉంది. డిసెంబరు నెల సంచికలో #safesex తో ప్రత్యేక రచనల్ని ప్రచురిస్తుంది నెచ్చెలి పత్రిక. మీ రచనల్ని editor@neccheli.com కు నవంబరు30, 2022లోగా పంపించండి.

 

హాష్ టాగ్ సేఫ్ సెక్స్ (#safesex)

-డా.కె.గీత

ఇక్కడ
మనం వాడే మాటలకు
మనం రాసే రాతలకు
సెన్సార్ షిప్పు
కోసం
ప్రపంచం
అన్ని పనులూ
మానేసుకుని మరీ
ధర్నాలు
చేస్తుంది
రాసే చేతులు విరవాలని
మాట్లాడే నాలుకలు తెగ్గొయ్యాలని
అడ్డమాలిన ఆయుధాల్ని
విసురుతుంది
సేఫ్ సెక్సు-
పెళ్లికి ముందు సెక్సు-
హవ్వ…హవ్వ
అసలు
ఆడవాళ్లు
సెక్సు
జాగ్రత్తల గురించో
పరిణామాల గురించో
పాఠాలా!
పోస్టులా!!
ప్రపంచం తగలడిపోదూ..
అని వంకర్లు పోతుంది
బహిరంగంగా ట్రోల్ చేస్తుంది
వీళ్ళకి
సెక్స్ గురించి
ఆడవాళ్లు
మాట్లాడడమే
బరితెగింపు-
బహిరంగంగా
చర్చించడమే
బూతు-
విలువలు
అవసరమని చెప్పినా
వలువలు వద్దన్నట్లు అర్థమవుతుంది వీళ్ళకి
తప్పనిసరి జాగ్రత్తలు చెప్పినా
తప్పటడుగులేయిస్తున్నట్లు నషాళానికంటుతుంది వీళ్ళకి
చలువమాటల్ని
చవకబారుమాటలంటారు
ఎర్ర పెన్ను
ఎరువు తెచ్చుకుని మరీ
అండర్ లైనులకి తెగబడతారు
ఇదేదో
దేశోద్ధారక అత్యవసర కార్యక్రమంలా
విరుచుకు పడతారు
అయినా
ఎక్కడా ఆగొద్దు
వెనక్కి తిరిగి చూడొద్దు
ఆపడానికి ప్రయత్నించే
ప్రతి మాట నించీ
వెయ్యి మాటలై పుట్టుకొద్దాం
అందరం
కలిసి గొంతెత్తే
సందర్భమై
ధ్వజమెత్తుదాం
సేఫ్ సెక్సు
గురించి
బహిరంగంగా
చర్చిద్దాం-

———

సేఫ్ సెక్స్
-ఆలమూరు సౌమ్య

ఆడపిల్లలకు..
పెళ్లికి ముందు సెక్స్ విషయంలో ఏవో కొన్ని విలువలు మీకు మీరే ఏర్పరచుకోండి. ఎలాంటివి అని నన్ను అడిగితే నేను చెప్పలేను. మీ చదువు, అనుభవం, మీ గతం, మీ కుటుంబం, మీ పరిసరాల నుంచి మీరు నేర్చుకున్న పాఠాలో, మరొకటో..ఏవో కొన్ని విలువలను సెక్స్‌కు జత చేసుకోండి. దాని వల్ల శారీరక సంబంధాలలోకి దిగేటప్పుడు, మీకొక అడ్డంకి ఉంటుంది. అది దాటే ముందు ఒకసారి ఆలోచిస్తారు. ఇది చాలా అవసరం.
విలువలా, మట్టిగడ్డాలా..తూ నా బొడ్డు అంటారా… absolutely fine. I am with you. అప్పుడు ఈ మూడు విషయాలు గుర్తుంచుకోండి.
1. మీ ఆరోగ్యం కంటే ముఖ్యమైనది ఏదీ లేదు. మీ కోరిక, మీ అవసరం, మీ సరదా, మీ సుఖం..వీటన్నిటి కన్నా మీ ఆరోగ్యమే ముఖ్యం. ఆరోగ్యం పాడుచేసుకోకుండా సేఫ్ సెక్స్ పద్ధతులు పాటించండి.
2. శారీరక సంబంధాలలో ఎమోషనల్ అటాచ్మెంట్ పెట్టుకోకండి. తలలో దురదగా ఉంటే తల స్నానం చేసి ఆ దురదని వదిలించుకుంటాం కదా, అలా శరీరానికి పట్టిన దురదను వదిలించేసుకుని, తలంటుకోండి. అంతటితో దాన్ని వదిలేయండి.
3. మీతో సెక్స్‌లో పాలుపంచుకునేవాడు మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేసే పరిస్థితి లేకుండా చూసుకోండి. ఎమోషనల్‌గా, ఫిజికల్‌గా మిమ్మల్ని వేధించేవాడు కాడు అనుకుంటూనే సంబంధం పెట్టుకోండి. వెధవలతో మీకెందుకు? కాస్త జ్ఞానం ఉన్నవాడిని చూసుకోండి. లోకమేం వట్టిపోలేదు.
ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా, బ్లాక్ మెయిల్ చేశాడా.. పో రా వెధవ, దొబ్బేయ్ అనండి. అలా అనడం సులువేం కాదు. అలా అనాలంటే మీకు చాలా బలం కావాలి. ఆ బలం రెండు విధాలుగా వస్తుంది.
1. మీరు ఆర్థికంగా స్థిరపడినవారై ఉండాలి. ఈ లోకం వెలివేసినా మీ అంతట మీరు బతకగలగాలి. ఆర్థిక దన్ను ఉండాలి. అందుకు చదువుకోవాలి. ఉద్యోగం సంపాయించాలి.
లేదా..
2. కుటుంబమో, స్నేహితులో మీకు అండగా నిలబడాలి. ఎవరో ఒక్కరు మీతో నిలబడినా చాలు.
మగవాడికి ఈ సమాజం ఎప్పుడూ మద్దతిస్తుంది. రోడ్డు మీద వెళ్లేవాడు, ముక్కూ, మొహం తెలియనివాడు కూడా సపోర్ట్ చేస్తాడు. అమ్మాయిలకు ఆ పరిస్థితి లేదు. నా అనుకున్నవాళ్లు కూడా వీధిన పడేస్తారు. ఎక్కువ మాట్లాడితే చంపేస్తారు కూడా. మీ చుట్టూ ఉండే వ్యవస్థ మీద వీలైనంత తక్కువ ఆశలు పెట్టుకోండి. మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి.
కాస్త తెలివిగా వ్యవహరించండి. వాడు మోసం చేశాడు, వీడు మోసం చేశాడు అని ఏడుస్తూ జీవితాలను నాశనం చేసుకోకండి. వాడెలా దులిపేసుకుంటున్నాడో, మీరూ అలా దులిపేసుకోండి. దానికి కావలసిన దన్ను సంపాయించండి. ఈ కాలం అమ్మాయిలకు కావలసింది ఈ తెలివితేటలే. ఇంకా ఎన్నాళ్లని ఈ ఏడుపులు, కేసులు.. అవీ ఎటూ తేలక వేదన, బాధ!
తెలివి తెచ్చుకోండి. సెక్స్ ముఖ్యమే, కానీ దానికి ఇవ్వాల్సినంత ప్రాముఖ్యమే ఇవ్వండి. అదేం జీవితం కాదు. సెక్స్‌ని ఒక శారీరక అవసరంగా చూడడం నేర్చుకోండి. దానికి విలువ ఇవ్వండి. గౌరవించండి. దాని ద్వారా ఆనందం కలగాలి తప్పితే బాధ కాదు. వ్యక్తిగత హక్కును ఉపయోగించుకోవడం ఎంత సంతోషమో, ఎంత గర్వమో గుర్తించండి. తెలివిగా ఉండండి.
ప్రేమ, దోమ తరువాత.. గౌరవం, విలువ ముందు. మీ గౌరవం, మీ విలువ.. వీటికి ప్రాధాన్యమివ్వండి.
మారుతున్న మగపిల్లలకు..
1. మీ ఆరోగ్యం, మీ భాగస్వామి ఆరోగ్యం కంటే ప్రధానమైంది ఏదీ లేదు. సేఫ్ సెక్స్ పద్ధతులు పాటించండి.
2. మీతో సెక్స్‌లో పాలుపంచుకున్న భాగస్వామిని గౌరవించండం నేర్చుకోండి. ఒక వ్యక్తి స్వేచ్ఛగా, సంతోషంగా తన ఇష్టానుసారం మీతో ఒక సంబంధంలోకి దిగుతున్నారన్న దానికి విలువ ఇవ్వండి.
ప్రేమ, దోమ తరువాత.. గౌరవించడం, విలువ ఇవ్వడం నేర్చుకోండి.
PS: ఇలా బాహాటంగా రాసి లేదా చెప్పి సమాజాన్ని చెడగొట్టేస్తున్నారు, పిల్లలను పాడుచేసేస్తున్నారు అనుకునే పెద్దలు ఈ పోస్ట్‌ను పదిసార్లు చదవండి. పదిసార్లు చూసి రాయండి. తరువాత చూడకుండా కూడా రాయండి. ముందు దీన్ని మీ బుర్రల్లోకి ఎక్కించుకోండి. ముందు మీరు సెక్స్‌ని గౌరవించడం నేర్చుకోండి. తరువాత మీ పిల్లలకు చెబుదురుగాని.

*****

Please follow and like us:

3 thoughts on “హాష్ టాగ్ సేఫ్ సెక్స్ (#safesex)”

  1. Good article.quite practical. Good advice. Girls should give imp to self respect. Should not have emotional attachment. Absolutely true.

  2. I DONOT SEE NOTHING WRONG IN THIS ARTICLE —GOOD INFORMATION
    SOUMYA GARU —SAFE SEX IS GOOD TOPIC

    ———————————————————————

  3. చెప్పనట్లు ఉన్నా…అనిపిస్తున్నా ఇందులో చెప్పింది నిజానికి ఆడపిల్ల భద్రతే నూరుశాతం. నువ్వు నీపైనే నమ్మకం పెట్టుకో అన్నారు, అంతటి విచక్షణ ఉన్న పిల్ల ఎప్పటికీ కాలక్షేపం కోసం శారీరక సంబంధం ఏర్పరచుకోదు. అయినా బలహీనత ఆవరిస్తే …అంతటితోనే ఆగమని భావోద్వేగాలతో బలహీనపడవద్దని సౌమ్య గారు చెప్పారని నాకనిపించింది. థాంక్యూ గీతా జీ…ఈ పోస్ట్ మీరు టాగ్ చేయకుంటే నా బోటి వారు చూడకపోదుము.

Leave a Reply

Your email address will not be published.