ఆమె పేరు అపర్ణ
(నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక & అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎన్నికైన కథ)
– కంఠస్ఫూర్తి విజయ కనకదుర్గ
సాయంత్రం.. నాలుగున్నర!
నరసింహం మళ్ళీ ఆ ఇంటి మెట్లు ఎక్కుతూ ఒక క్షణం ఆగాడు! నెలకు రెండుమూడు సార్లు..ఆ ఇంటి మెట్లు ఎక్కి దిగుతూనే ఉన్నాడు ! విసుగు..కోపం.. చిరాకు ఒకదాని వెంట ఒకటి విరుచుకు పడుతున్నాయి.. సహనం.. సంయమనం..ఓర్పు..దయ ఎందుకో వెనక్కి లాగుతున్నాయి..!
”ఇలా ఎంత కాలం? ఎన్ని నెలలు? ఈ రోజు ఏదో ఒకటి తేల్చుకోవాల్సిందే.. ఆ పని ఎలాగైనా చేయాల్సిందే” మనసులో దృఢంగా నిర్ణయించుకుని నరసింహం మెట్లు ఎక్కసాగాడు..!
ఆ ఇల్లు నరసింహానిదే.. ఆస్తుల పంపకాలులో రెండు ఇళ్ళు అతని వాటాకు వస్తే ఒక దాంట్లో తను భార్యా పిల్లలుతో ఉంటూ..రెండో ఇల్లు అద్దెకు ఇస్తూ వచ్చాడు..రెండు ఎదురు ఎదురుగానే ఉన్నాయి..రెండిళ్ళ మధ్య ముప్పై అడుగుల రోడ్డు మాత్రం ఉంది!
పల్లె ..పట్టణం కానీ..ఆ చిన్న ఊర్లో..పది నెలల క్రితం.. ఒక ఉదయం పూట..!
ఇల్లు అద్దెకు కావాలంటూ వీధిలో వెతుక్కుంటూ ఇద్దరూ యువతీ యువకులు వచ్చారు.. అప్పుడే రైలు దిగి వస్తున్నామని..దగ్గర్లో బొమ్మూరులోని హార్లిక్స్ ఫ్యాక్టరీలో తనకు ఉద్యోగం వచ్చిందని ఆ అబ్బాయి చెప్పాడు..
అతని చేతిలో పెద్ద సూట్ కేసు.. భుజానికి బుట్ట లాంటి సంచి ఉన్నాయి.. అమ్మాయి గంధపురంగు చీరలో.. చందనం పసుపు కలిపిన శరీర ఛాయలో.. నవనవలాడుతూ ఉంది.. నుదుట తిలకం బొట్టు.. చెవులకు జూకాలు.. రెండు చేతులకు నిండుగా బంగారు గాజులు.. కొత్తగా పెళ్లయింది ఏమో!. మెడలో పచ్చగా మెరిసిపోతున్న పసుపుతాడు.. ముత్యాలహారం.. దాని వెనుక చంద్రహారాల గొలుసు.. చిన్నిచిన్ని మంగళ సూత్రాలు..కాళ్ళకు మెట్టెలు! పట్టీలు!
అమ్మాయి పేరు అపర్ణ..అచ్చం మహాలక్ష్మిలాగే ఉంది.. అబ్బాయి పేరు మోహన్. సలక్షణంగా ఉన్నాడు.. వాళ్ల ఊరు..పెద్దవాళ్ల వివరాలు నరసింహం కనుక్కున్నాడు. చెప్పిన అద్దెకు అంగీకరించి మూడు నెలల అద్దె ముందుగా చెల్లించగానే అన్ని విధాలా సంతృప్తిపడి.. ఆ దంపతులకి ఇల్లు అద్దెకి ఇచ్చాడు..
ముచ్చటైన జంట..మూడుపొద్దులు చాలని కొత్తకాపురం! రోజులు గంటల్లా.. గంటలు నిమిషాల్లా గడిచిపోతున్నాయి.. మోహన్ ఉదయమే లేచి ఫ్యాక్టరీకి వెళ్లిపోయి.. మధ్యాహ్నమే తిరిగి వచ్చేవాడు. మరోసారి ..మధ్యాహ్నం వెళ్లి రాత్రి ఎనిమిదింటికి వచ్చేవాడు. కొన్ని రోజులు ఆఫీసుకు వెళ్ళేవాడు కాదు ..ఇంటి దగ్గర ఉన్నంత సేపు ఇద్దరూ ఒకరిని ఒకరు అంటి పెట్టుకునే ఉండేవారు.. అప్పుడప్పుడు అతను లేనప్పుడు అమ్మాయి అపర్ణ నరసింహం ఇంటికి వచ్చి అతని భార్య విశాలతో గలగలా నవ్వుతూ కబుర్లు చెప్పేది ..విశాల..పచ్చడో కూరో అపర్ణ చేతికిచ్చి పంపించేది..
వాళ్ళ అన్యోన్య దాంపత్యానికి సంబంధించిన అనేక దృశ్యాలు.. తరచుగా నరసింహం కళ్ళబడేవి.. సాయంత్రం డాబా మీద ఇద్దరు చాప దిండు వేసుకుని.. ఒకరి ఒడిలో ఒకరు పడుకుని కులాసాగా కబుర్లు చెప్పుకునే వారు.. మరోసారి మోహన్ అపర్ణ కాళ్ళు తన ఒడిలో పెట్టుకుని మోకాళ్ళ నుంచి పాదాల వరకు సుతిమెత్తగా నొక్కేవాడు. ఆమె కిలకిలా నవ్వేది..చిలిపిగా ఆటపట్టించేది.. ఆమె ఎంత ఏడిపించినా మోహన్ చలించేవాడు కాదు..
భార్యను అంతగా ప్రేమించే భర్త దొరకడం ఆ అమ్మాయి అదృష్టం అనుకునేవాడు నరసింహం!..
ఆ జంట కనులపండువగా కనిపించేది..వాళ్ల మీద కలిగిన అభిప్రాయంతో మొదటి రెండు నెలలు అద్దె చెల్లించక పోయినా..అతను పట్టించుకోలేదు. తన జీతం ఇంకా నిర్ణయించబడలేదని.. సంబంధిత కాగితాలు పై ఆఫీసుకు వెళ్ళాయి అని.. మోహన్ స్వయంగా ఇంటికి వచ్చి చెప్పాడు. సరే! మూడు నెలల అద్దె ముందుగా చెల్లించారని.. నరసింహం సరిపెట్టుకున్నాడు.. కొత్త దంపతుల సంసారజీవనం..కులాసాగా సాగిపోతోంది..
సినిమాలకు షికార్లకు కలిసి తిరుగుతున్నారు.. భార్యాభర్తల వినయం ఒద్దిక చూసి మొదటి నుంచి నరసింహం ముచ్చట పడుతూనే ఉన్నాడు.. ఇద్దరూ పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు కదా అని తృప్తి పడేవాడు..
మూడో నెల గడిచింది. నెలాఖరు వచ్చింది..మోహన్ ఆ నెలకూ అద్దె ఇవ్వలేదు.. యధావిధిగా ఫ్యాక్టరీకి వెళ్లి వస్తున్నాడు.. జీతభత్యాలు ఇంకా నిర్ణయించబడలేదు కాబోలు అనుకున్నాడు నరసింహం!
నాలుగో నెల వచ్చింది..సగం రోజులు గడచిపోయాయి.. నరసింహం సరిగ్గానే గమనించాడు.. అమ్మాయి అపర్ణ వరండా కటకటాల వెనుక నిలబడి.. ఎవరి కోసమో అన్నట్టు ఎదురుచూస్తోంది…అలా మూడు రోజులు గడిచాయి.. మరో రెండు రోజుల తర్వాత ..అపర్ణ తలుపు తీసుకుని గడప దగ్గరే కూర్చుంటోoది.. మోహన్ జాడలేదు.. అతను కనబడటంలేదు..!
మరుసటి రోజు.. అపర్ణ గడప దగ్గర కూర్చుని ఉండగా నరసింహం మెట్లెక్కి వెళ్లి ఆమెను పలకరించాడు. ” ఏమ్మా!మోహన్ కనబడటంలేదు..ఎక్కడికైనా వెళ్ళాడా? ”
”అవును..బాబాయి గారూ! ఆయన వాళ్ళ ఊరు వెళ్లారు. ఇవాళ రేపో వచ్చేస్తారు” ఆ మాటల్లో ఏదో తడబాటు..బెదురు..కనిపించాయి. కం గారుగా చీరకొంగు భుజం చుట్టూ కప్పుకుంది. నరసింహం ఆమె వైపు నిశితంగా చూశాడు. ముఖంలో మునుపటి కళ లేదు.. ఏదో దిగులు..వేలాడుతోంది..అపర్ణ చీరకొంగు కప్పుకున్నప్పుడు ఆమె మెడలో పసుపుతాడు ఒకటే ఉంది.. ముత్యాల హారం.. చంద్రహారాల గొలుసు లేవు.. చెవులకు జూకాలు, చేతులకు బంగారుగాజులు ..కూడా లేవు..
అయిదారు రోజులుగా మోహన్ కనబడకపోవడం.. ఆమె మాటల్లో తత్తరపాటు. నరసింహంలో అనుమానం..పెనుభూతమై కూర్చుంది..!
”సరే జాగ్రత్త.. అమ్మా! తలుపు సరిగ్గా వేసుకో.”
నరసింహం ఆ రోజు మెట్లు దిగి వచ్చేసాడు!
మరో వారం..నెల..గడిచిపోయిఁది. మోహన్ రాలేదు.. అపర్ణ గడప దగ్గర కూర్చుని అతని కోసం ఎదురు చూస్తూనే ఉంది.. ఒంటరిగా ఇంట్లో..ఎలా ఉంటుందో? ఏం తింటుందో?.. అర్థం కాని పరిస్థితి.. నరసింహం భార్య విశాల నాలుగైదు సార్లు వెళ్లి.. అపర్ణతో మాట్లాడి వచ్చింది. ఆమె ఉన్నవనరులతో..ఏదో ఒక పూట వండుకు తింటుంది. బియ్యం డబ్బాలో బియ్యం నిండుగానే ఉన్నాయి. మోహన్ గురించి ఏ ప్రశ్న అడిగినా ఆయన వచ్చేస్తారు..అన్నమాట తప్ప మరో మాట మాట్లాడడం లేదు.. మోహన్ ఫోనుకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆ ఫోన్ మనుగడలో లేదు..అన్న సందేశం మాత్రమే వస్తోంది.. అతని గురించి హార్లిక్స్ ఫ్యాక్టరీ లో తెలిసిన వాళ్లతో విచారణ చేయిస్తే.. ఆ పేరు గల వ్యక్తి సాంకేతిక విభాగంలో కానీ.. కార్యాలయంలో కాని.. ఎవరూలేరన్న సమాచారం వచ్చింది.. అనుమానం బలపడగానే పోలీసులకు ఫిర్యాదు చేద్దామనుకున్నాడు నరసింహం ..ఆ ప్రయత్నాన్ని పెద్ద గొడవ చేసి పడనివ్వలేదు అపర్ణ..!
”అంతపని చేయకండి..బాబాయిగారూ!ఆయనకు అసలే పౌరుషం ఎక్కువ.. ఇలా అని తెలిస్తే మళ్లీ.. నా ముఖం చూడరు. ఆయన వచ్చేస్తారు తప్పకుండా! నాకా నమ్మకం ఉంది.” అపర్ణ ఏడుస్తూ వేడుకుంది.
మోహన్ రాలేదు.. మరో నెల గడిచి పోయింది. అతని మీద బెంగతో అపర్ణ సగం మనిషి అయిపోయింది.. ముందుగా ఇచ్చిన మూడునెలల అద్దె సరిపెట్టుకున్నా.. మరో మూడు నెలల అద్దె అపర్ణ చెల్లించలేదు.. అద్దె చెల్లించడానికి అపర్ణ వద్ద డబ్బులు లేవు..మోహన్ ఆమె ఒంటిమీద నగలు డబ్బు మొత్తం దోచుకుపోయాడు..ఏమీ మిగల్చలేదు..అది స్పష్టంగా తెలుస్తోంది.. అయినా అపర్ణ అమాయకంగా.. తన భర్త వస్తాడనే నమ్మకంలోనే ఉంది. ఎన్ని మాటలు చెప్పినా ఆమె తలకి ఎక్కడం లేదు.. భార్య భర్తల అనుబంధం అంటే ఇదేనేమో..? ఆ బంధంలోని గొప్పతనం అదేనేమో.. నరసింహం రోజూ తల పట్టుకుంటూనే ఉన్నాడు..
”మీ అమ్మా నాన్న.. ఫోన్ నెంబర్లు ఇవ్వమ్మా! వాళ్లకి ఫోన్ చేస్తాను. ఒక రోజు నరసింహం పట్టుదలగా అడిగాడు. ”నాకు నా వాళ్ళు ఎవరూలేరు బాబాయ్ గారు.. నాకు అన్నీ మోహనే.. తప్పకుండా వస్తారు ఆయన! నా కోసం.. చూస్తూ ఉండండి” అపర్ణ స్థిరమైన జవాబు..
”ఇంకా అతని మీద నమ్మకం ఉందా నీకు..? అతను నిన్ను నమ్మించి మోసంచేసి పారిపోయాడు.. నీకా ఆలోచన రావడం లేదా? అదిగో ఇదిగో అంటూ.. తను వెళ్లి అయిదు నెలలు దాటి ఆరోనెల వచ్చింది..ఇంకా ఎన్నాళ్ళు ఎదురు చూస్తావమ్మా! ఒక ఫోన్ లేదు.. ఒక సమాచారం లేదు.. నువ్వు నమ్మితే నమ్ము నీ కర్మ! నా ఇల్లు ఖాళీ చేసేయ్ తల్లీ! చేసేయ్! ”నరసింహం గొంతులో కాఠీన్యం..కరుకుదనం ..పోటీ పడ్డాయి..!
అపర్ణ కళ్ళలో కన్నీళ్ళు సుడులు తిరిగాయి.. గొంతు గాద్గదికమైంది ..ఒక్కసారే.. నెత్తి.. నోరు కొట్టుకుంటూ.. పిచ్చిగా.. భోరున ఏడవసాగింది..! ఆమె ఇల్లు ఖాళీ చేయదు.. అద్దే ఇచ్చే పరిస్థితి లేదు.. భర్త మీద గుడ్డి నమ్మకం సడలనివ్వదు.. ఒంటరి ఆడపిల్ల..? ఎన్ని విధాల నచ్చచెప్పినా..ఆయన వచ్చేస్తారు.. అన్న మాట తప్ప మరోమాట మాట్లాడదు.. ఏమిటి చేయడం?
ఇన్నాళ్లు నరసింహానికి మనసు మారుమూల ఏదో దయ.. మానవత్వం ఉండబట్టి.. ఇంట్లో అలా ఉండనిచ్చాడు..అతని భార్యకూడా జాలి హృదయంతో.. అపర్ణను ఆదుకుంది. పస్తులు ఉండకుండా ఆకలి అవసరాలు తీరుస్తూ వచ్చింది.. ఇప్పుడు ఆ అమ్మాయిని బలవంతంగా ఇల్లు ఖాళీ చేయించడం తప్ప.. మరో మార్గం లేదు.. తప్పదు.. ఆ పనిచేయాల్సిందే!
నరసింహం మనసులో దృఢంగా నిర్ణయించుకుని.. మళ్ళీ ఆ ఇంటి మెట్లు ఎక్కుతున్నాడు!.. మెట్లు ఎక్కుతూ యాధాలాపంగా తల పైకెత్తి చూసాడు..గడప దగ్గర అపర్ణ కనపడలేదు..తలుపు దగ్గరగా వేసి ఉంది.. ‘
”అయిదారునెలలుగా.. కళ్ళల్లో వత్తులు వేసుకుని మోహన్ కోసం ఎదురు చూసే అపర్ణకి ఏమైంది? ఏం జరిగింది? ఏదైనా అనారోగ్యమా? అసలే విసిగివేసారి పోయిఉంది.. నిరాశతో నిస్పృహతో.. ఏదైనా అఘాయిత్యానికి పూనుకుందా? కాదు కాదు.. అలా జరగదు.. జరగకూడదు.. జరిగి ఉండదు.. లోపల ఏదో అలికిడి అవుతోంది.. ఎవరివో.. మాటలు సన్నగా వినబడుతున్నాయి..అతనుగాని వచ్చాడా? మోహన్ మోసగాడు.. అన్నదాన్ని తలకిందులు చేసి.. అతగాడు నిజంగానే వచ్చేసాడా? అదే జరిగితే..
ఇన్నాళ్ళ అపర్ణ నిరీక్షణ ఫలించినట్టే..! ”నరసింహం ఆత్రంగా దగ్గరగా వేసివున్న తలుపును తట్టబోయి .. అపర్ణ గొంతు వినబడి అయోమయంగా..అక్కడే నిలబడి పోయాడు!
”ఇది నా జీవితం అనుకున్నాను.. నా జీవితం నా చేతుల్లోనే చేతల్లోనే ఉంది అనుకున్నాను.. ఆ జీవితం కోసమే.. పిచ్చిగా ప్రేమించాను.. గుడ్డిగా నమ్మి దారుణంగా మోసపోయాను..వద్దని ఎంత బతిమాలినా.. నా తల్లిదండ్రులు నాకు బలవంతంగా పెళ్లి చేశారు..వాళ్లని ఎదిరించలేక పోయాను.. కనీసం ఒక్కమాట..నన్ను చేసుకునే వాడితో .. నాకీ ఈ పెళ్లి ఇష్టం లేదని.. చెప్పలేక పోయాను.. నేను పిరికిదాన్ని.. ప్రేమని నమ్ముకుని ఇంత దూరం పారిపోయి వచ్చాను.. నేను చేసిన పనికి నిష్కృతి లేదు.. చావు ఒకటే నాకు శరణ్యం! నా గురించి ఎవరికి తెలిసినా..ఛీ కొడతారు!..నా ముఖం మీదే ఉమ్మేస్తారు! ఇంత జరిగినా నేను బతికే ఉన్నాను..నేను పిచ్చిదాన్ని.. అమాయకురాలిని.. జీవితాన్ని అంతం చేసుకోవడమే నాకు మిగిలింది! అదొక్కటే నాకు మనశ్శాంతి .. అదే నా బతుకుపాఠంలో చివరి పేజీ..అదే..అదే..!”
గోడకి జారగిలబడి రెండు చేతులతో తల బాదుకుంటూ..ముఖం కప్పుకుని ..గొంతు జీరబోగా ..వెక్కివెక్కి ఏడుస్తుంది అపర్ణ.. !
నరసింహం తలుపు ముందుకు తోసి గదిలోకి అడుగుపెట్టాడు.. అంత దుఃఖంలోనూ.. తల పైకెత్తి ఏడుపు నాపుకుంటూ.. నరసింహంని..చూసి ” రండి!బాబాయ్ గారు” అంటూ..చటుక్కున కుర్చీ తెచ్చి వేసింది అపర్ణ.. నరసింహం కూర్చోలేదు…!
ఆ గదిలో ఆమెకు అభిముఖంగా.. వేరే కుర్చీలో కూర్చున్న యువకుడు లేచి నిలబడి..” నమస్కారమండీ! అంటూ నరసింహానికి రెండు చేతులు జోడించాడు.. ఆ యువకుడు.. మోహాన్ కాదు..! మరి ఎవరు ?ఎవరు?
నరసింహం నిశితంగా..ఆశ్చర్యంగా చూస్తున్నాడు..!
”నా పేరు.. శ్రీరామ చంద్రమూర్తి అండీ! అందరూ శ్రీరామ్ అని పిలుస్తారు.. మీ గురించి అపర్ణ నాకు అంతా చెప్పింది.. నేను స్వయంగా అపర్ణకు మేనమామ కొడుకుని.. అంతే! కాదండి.. అపర్ణ మెడలో అగ్నిసాక్షిగా తాళి కట్టిన భర్తను కూడా!”.. నరసింహం ఉలిక్కిపడ్డాడు! అతనిలో ఒక గగుర్పాటు..ఒక దిగ్భ్రమ! తనేం విన్నాడు? శ్రీరామ్ అపర్ణ భర్తా? మరి.. మోహన్?
నరసింహం మనసులో.. మోహన్ మెదిలాడు. వాళ్ళిద్దరూ గడిపిన అన్యోన్య సంసార జీవనం గుర్తుకొచ్చింది… ఏవిటిది? ఏం జరిగింది? నరసింహం అపర్ణని.. శ్రీరామ్ ని మార్చి మార్చి చూస్తున్నాడు.. !
”మా ఇద్దరికీ పెళ్లి అయిన మర్నాడే.. అంటే శోభనం రోజునే.. తను కనపడకుండా వెళ్ళిపోయింది.. అపర్ణని నేను మనసా ఇష్టపడ్డాను తప్ప.. ఆమె మనసేమిటో తెలుసుకోలేక పోయానని చాలా బాధపడ్డాను..మా వాళ్ళు పౌరుషం పలుకుబడి ఉన్న వాళ్ళే! ఇరు కుటుంబాలవాళ్ళు అవమానంతో..ఆగ్రహంతో రగిలిపోయారు.. ఎలాగైనా వెతికి పట్టుకుని వాళ్ల అంతు చూస్తామని శపధం కూడా చేశారు.. నేనే వారించాను.. వాళ్లను శాంతింప చేయడానికి నా సర్వశక్తులు ఉపయోగించాను.. ఎందుకంటే..అపర్ణ అంటే మొదటి నుంచి నాకు ఇష్టం.. ప్రేమ.. అభిమానం!”
శ్రీరామ్ గొంతు మార్దవంగాఉన్నా..అది వేదనా మయంగా పలుకుతోంది!
”జరిగిందానికి..అపర్ణ ఇప్పుడు కుమిలిపోతూన్నది.. దారుణంగా మోసపోయానని చావే దానికి పరిష్కారం అంటోంది. ఎందుకిలా జరిగింది? ఏం జరిగింది? నేను వెనక్కి వెళ్ళ దలచుకోలేదు .. గతాన్ని తవ్వుకోవడం.. నా అభిమతం కాదు.” శ్రీరామ్ మరో దీర్ఘమైన నిశ్వాసo విడిచాడు!
”నాలుగు రోజుల క్రితం ఎక్కడి నుంచో నాకు ఫోన్ వచ్చింది.. మీ పిచ్చి అపర్ణ .. ఫలానా జిల్లాలో ఉంది. ఫలానా ఊళ్ళో ఉంది..ఆ ఊళ్లో..ఫలానా వాళ్ళ ఇంట్లో ఉందని కూడా చెప్పి ఫోన్ పెట్టేసాడు.. ఆ ఫోన్ మళ్ళీ నేను ఎంత ప్రయత్నించినా దొరకలేదు.. మూడు జిల్లాలు దాటి.. రెండు రోజులు ప్రయాణం చేసి.. ఈ జిల్లాలో ఈ ఊరు ఎక్కడుందో వెతుక్కుని.. ఈ ఊళ్ళో మీ ఇల్లు కనుక్కుని..ఎలాగైతేనేమి.. అపర్ణ చూడగలిగాను.. అపర్ణ నా భార్య! భర్తగా..బాధ్యతగా.. ఈ ప్రేమ వ్యామోహాలకు అతీతంగా ఆమెను నా గుండెల్లో దాచుకుంటాను.. ఈ లోకంతో నాకు పని లేదు.. నా వాళ్ళకు నచ్చచెబుతాను.. అవసరమైతే ఎదిరిస్తాను.. మీకు ఇవ్వవలసిన ఇంటి అద్దె మొత్తం ఇప్పుడే చెల్లిస్తాను.. రేపు ఉదయమే మేము బయలుదేరుతాము… ఇన్నాళ్లు ఆమెను మీ ఇంట్లో భద్రంగా ఉంచినందుకు మీకు మరోసారి కృతజ్ఞతలు..
”శ్రీరామ్ స్వరంలో.. స్థిర సంకల్పం.. అతను మళ్ళీ రెండుచేతులు జోడించాడు..
శ్రీరామ్ చిన్నవాడైనా ..హృదయసంస్కారంలో.. ఉన్నత వ్యక్తిత్వంలో.. ఎంతో ఎత్తుకు ఎదిగిన వ్యక్తిలా కనిపించాడు. అపర్ణ చాలా అదృష్టవంతురాలు.. ప్రేమించి భర్తగా భ్రమించిన వ్యక్తి మోసం చేసి పారిపోతే.. తాళి కట్టిన బావ..తనను పెద్ద మనసుతో.. తిరిగి అక్కున చేర్చుకుంటాను..ఆదరిస్తానూ.. అంటున్నాడు..ఇంతకంటే గొప్ప మలుపు తన జీవితానికి ఏంకావాలి?
నరసింహం ..శ్రీరామ్ వైపు ఆరాధనగా..అపర్ణ వైపు..అభినందనగా చూశాడు..! అతనికి ఎంతో తృప్తిగా ఉంది..ఆనందంగా ఉంది.. అపర్ణ ఏం ఆలోచిస్తుందో.. మనసులో..? ఏ కల్లోల సముద్రం ఎగిసిపడుతుందో.. ఆమె తలవంచుకునే ఉంది..! ఉన్నట్టుండి.. ఆమె తలెత్తింది!
”బావ ఔదార్యం ముందు..గొప్పతనం ముందు.. నేను మళ్లీ ఓడిపోయాను.. అంత ఔదార్యం ..నేను భరించలేను..? నేను పిచ్చిదాన్ని.. అమాయకురాలిని.. మోహన్ తోనే నా జీవితం.. అనుకున్నాను.. అతడినే.. నా భర్తగా ఆరాధించేను.. ఇప్పుడు.. నేను పిరికిదాన్ని కాదు..అమాయకురాల్ని అంతకంటే కాదు.. ఆ మోహన్ ఎక్కడున్నా వెతికి పట్టుకుంటాను.. ఆ మోసగాడికి ఎలాగైనా బుద్ధి చెబుతాను..”
అపర్ణ గొంతు..స్ఫుటoగా పలికింది!
*****
పూర్తి పేరు కంఠస్ఫూర్తి విజయకనకదుర్గ.. శ్రీవారు సీనియర్ రచయిత.. వారి సాహితీ ప్రస్థానంలో నేను సహా ప్రయాణికురాలిని..వారి రచనలు చదువుతూ నా అభిప్రాయాలు సలహాలు చెబుతుంటాను..అడపాదడపా కథలు రాస్తుంటాను. ఇప్పటివరకు నేను15 కథలు రాశాను..ఇది నా 16వ కథ. మొదటి కథ “గొలుసు”కు గీతాంజలి పక్ష పత్రికలో బహుమతి వచ్చింది. రెండవ కథ.”అగ్రిమెంట్” ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధంలో ప్రచురితమైంది. అలాగే అంతర్జాల పత్రిక “కథా మంజరి” లో బహుమతులు వచ్చిన “అత్తారింటికి దారేది” “అంతిమం” “భగవాన్ నన్ను క్షమించు”. కథలు నాకు మంచి పేరు తెచ్చిపెట్టాయి.. అలాగే “హాస్యా నందం”లో బహుమతి వచ్చిన” అరచేతిలో వైకుంఠం “కథకు కూడా! నేను రాసిన ఒకే ఒక్క నాటకం”భవతి శిక్షాందేహి” ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో ప్రసారమైంది.. ఎక్కువగా ఆధ్యాత్మిక వ్యాసాలు రాస్తుంటాను.. ఆకాశవాణి విశాఖలో “చింతన” కార్యక్రమంలో పది వ్యాసాలు వరకు చదివాను.. సామాజిక స్పృహ ఉన్న రచనలు అంటే ఎక్కువ ఇష్టం.! ప్రతిఘటనలోనే స్త్రీ స్వేచ్ఛరెక్కలు విప్పుకుంటుందని బలంగా నమ్ముతాను..