డ్రీమీ ఐస్
-అనూరాధ బండి
వాళ్ళు నా స్వప్నాల పై నీళ్ళు చిలకరిస్తునే ఉన్నారు.
నా దారులనిండా ముళ్ళు పరచి ఉంచారు.
వాళ్ళెలా ఊహించి ముందుగా అక్కడికి చేరారా యని ఆశ్చర్యపోయాను.
తెలుసు నాకు, మరి అదే ముళ్ళలో వాళ్ళు వెనుకకి మరలలేరని.
వాళ్ళిక్కడ లేరని నేను ముందుకు వెళ్ళడం విరమించి
గుప్పెడు గింజలను తీసుకుని చుట్టూ విసిరాను.
కొన్ని పక్షులు వచ్చి చేరాయి.
వాటి కిలకిలల మధ్య నేను కొత్తచిగురులేసుకున్నాను.
అవి తినగా మిగిలినవన్నీ మొలకెత్తి పెరుగుతున్నప్పుడు
నాలో వసంతం వెయ్యిరకాల ధ్వనులను చేసింది.
కొత్త పనులు నేర్చుకున్నాను, కొన్ని
అడ్డుగోడలు కట్టుకున్నాను.
మరో ప్రపంచాన్ని రంగులతో నిర్మించుకున్నాను.
ఆరారగా, ఆరు ఋతువులకూ నేనే యజమానినని
మూడు కాలాలనీ ముంగిట దాటిస్తూ..
స్వేదమై మెరిసేదంతా స్వేచ్ఛ అని రాసుకుని
తోచిన పాటలు పాడుకున్నాను.
ఇప్పుడిక్కడ, నాలో
శిశిరాన్ని వెక్కిరించే ఎవరూ లేరు.
వసంతాన్ని ధిక్కరించే ఎవరూ రారు.
ఏ తేనీటి సమయానో అపరిచిత స్వరం,
సర్వం మరిపించేలా సంగీతం వినిపిస్తుంది.
రాత్రుళ్ళు నిద్ర మొత్తం, మత్తు కోయిలలు కూసిన కలలతో
నా మరోప్రపంచం కళ్ళు తెరుస్తుంది.
నేను ఉన్నచోటునే స్వర్గాన్ని చూస్తాను.
ఆశల సౌదాలను కట్టుకుంటాను.
కలల ప్రపంచాలని నిర్మించుకుంటాను.
ఎవరు నాకు పిచ్చి అన్నా, పడీపడీ నవ్వుతాను.
వాళ్ళు నా నవ్వులో దూరంగా కనుమరుగవ్వకపోరు.
*****