కాళరాత్రి-16

ఆంగ్లమూలం : ఎలీ వీజల్‌ -“నైట్‌”

అనువాదం : వెనిగళ్ళ కోమల

          గెటోలో అమ్మ అలా చెప్పిన సంగతి గుర్తుకు వచ్చింది. నాకు నిద్రపట్టలేదు. కాలిపుండు విపరీతంగా సలుపుతున్నది.

          మరునాడు క్యాంపు క్యాంపులా లేదు. ఖైదీలు రకరకాల బట్టలు ధరించారు. మారువేషాల్లా అనిపించాయి. చలి కాచుకునే ఉద్దేశ్యంలో ఎన్నో బట్టలు ధరించాము. బఫూన్లలాగా ఉన్నాము. బ్రతికిన వాళ్ళలా గాక, చచ్చిన వాళ్ళలా ఉన్నాము.

          పెద్ద బూటు ఒకటి తొడుక్కుందామని ప్రయత్నించాను. కుదరలేదు. దుప్పటి చించి కాలుకు కట్టు కట్టాను. ఇంకొంచెం రొట్టె, బంగాళదుంపలైనా దొరుకుతాయేమో అని క్యాంపులో గాలించాను. కొందరు, అందరం చెకోస్లోవేకియా పోతున్నామన్నారు. కొందరు, గ్రాస్‌ రోజన్‌కి అన్నారు. గ్లేవిడ్జ్‌ అన్నారు ఇంకొందరు.

          మధ్యాహ్నం రెండు గంటల సమయంలో మంచు బాగా పడుతూనే ఉన్నది. రాత్రి త్వరగా అయినట్లనిపించింది.

          బ్లాకల్‌ టెస్ట్‌కి గుర్తువచ్చింది బ్లాక్‌ శుభ్రపరచలేదని. నలుగురు ఖైదీలను నేల తుడవమని పురమాయించాడు. ‘‘గంటలో క్యాంపు వదిలేస్తాం గదా ఎవరి కోసం ఈ శుభ్రపరిచే కార్యక్రమం. విముక్తి కలిగించే సేనల కోసం ఇక్కడ మనుషులే ఉన్నారు. పందులు కాదు, అని వాళ్ళకి తెలియాలి’’ అన్నాడతను. ‘‘అయితే మేమంతా మనుషులమేనన్నమాట?’’ బ్లాకంతా శుభ్రపరిచారు.

          6 గంటలకు గంట మోగింది. మృత్యు గంట. శవయాత్ర మొదలయింది. ‘‘లైను కట్టండి వేగంగా’’ ఆర్డరు. అన్ని బ్లాకులవాళ్ళం వరుసలు కట్టాం అంతా ప్లాను ప్రకారం నడుస్తున్నది.

          వందల మంది ఎస్‌.ఎస్‌.లు చీకటిలో నుంచి బయట కొచ్చారు. పోలీసు కుక్కలను వెంటబెట్టుకొచ్చారు. మంచు కురుస్తూనే ఉన్నది.

          క్యాంపు గేట్లు తెరుచుకున్నాయి. ఇంత కంటె కాళరాత్రి మా కోసం సిద్ధంగా ఉన్నదనిపించింది.

          కవాతు మొదలయింది. మాకంటె 56 బ్లాక్స్‌ వారు ముందు పోవాలి. చాలా చలిగా ఉన్నది. నా జేబులో రెండు చిన్న రొట్టెలున్నాయి. తినాలనిపించింది. కాని రేపటికి దాయాలి. మా వంతు వచ్చింది. 57 బ్లాక్‌ వాళ్ళం మార్చి చేస్తున్నాము. మంచు కురవటం ఆగలేదు.

          గడ్డకట్టే చలి వీస్తున్నది. అయినా లెఫ్ట్‌ రైట్‌ అడుగులేస్తూనే ఉన్నాం.

          ఇంకా తిడుతున్నారు వేగంగా పదండి అంటూ. ఎస్‌.ఎస్‌.లు ఆయుధాలు ధరించి మాతోనే పరుగెత్తుతున్నారు. వాళ్ళ నుండి పారిపోతున్నట్లు పరుగులు తీస్తున్నాం.

          చీకటి చీకటిగా ఉన్నది. మధ్య మధ్యలో తుపాకులు వినవస్తూనే ఉన్నవి. పరుగెత్త లేని వారిని కాల్చేయమని వాళ్ళకు ఆర్డర్లున్నాయి. ట్రిగర్‌ మీద వేళ్ళుంచి, వాళ్ళ ఆనందం వాళ్ళు పొందుతూనే ఉన్నారు. మేము వాళ్ళ దృష్టిలో పిచ్చి కుక్కలం. ఎవరైనా ఒక క్షణం ఆగితే తుపాకీకి ఎర అయినట్లే.

          చిక్కి, శల్యమైన నా శరీరాన్ని భారంగా ఈడుస్తున్నాను. శరీరంలో ఆ కొంచెం బరువు గూడా తగ్గితే బాగుండుననుకున్నాను. నేనూ, నా శరీరం వేరు వేరు అన్న భావం కలుగుతున్నది. నా శరీరాన్ని నేను అసహ్యించుకుంటున్నాను. ప్రతి క్షణం గుర్తు చేసుకుంటున్నాను. ‘‘ఆలోచించబోకు, ఆగబోకు, పరుగెత్తు’’ అంటూ.

          నా దరిదాపుల్లో మనుషులు నేలకూలుతున్నారు. తుపాకి మోతలు వినిపిస్తూనే ఉన్నాయి.

          జిల్‌ అనే పోలండ్‌ పిల్లవాడు పక్కన మార్చి చేస్తున్నాడు. బ్యూనాలో కరెంటు సామాన్ల డిపోలో పని చేశాడు. ఎప్పుడు చూసినా ప్రార్థన చేస్తూండేవాడు. టల్‌ముడ్‌ గురించి ప్రశ్నలు వేసుకుంటూ ఉండేవాడు. అతడు అనుభవిస్తున్న పరిస్థితులను మరచిపోవడానికలా చేస్తున్నాడనిపించింది. దెబ్బలను మరచే ప్రయత్నమది.

          అకస్మాత్తుగా కడుపు నొప్పితో లుంగ చుట్టుకు పోతున్నాడు.

          తన కడుపులో నొప్పిగా ఉంది అని చెవిలో చెప్పాడు. ముందుకు సాగలేక పోతున్నాడు. ఆగవలసి వస్తున్నది. ఆగబోకు, తొందరలోనే ఆగమంటారు. ఇలా ఎప్పటికీ పరుగెత్తలేమని అతన్ని ప్రోత్సహించాను. గుండీలు విప్పేసుకుంటూ అరిచాడు ` ‘పరుగులు తీయలేను, నా కడుపు పగిలిపోతున్నది’ అంటూ ప్రయత్నించ మంటున్నాను. కాని చేతగాక ప్యాంటు జారవేస్తూ కిందకు పడిపోయాడు. అదే నేను అతన్ని ఆఖరుసారి చూడటం. ఎస్‌.ఎస్‌.లు గమనించ లేదు. వాళ్ళు చంపి ఉండరతన్ని. మా వెనుక మార్చింగ్‌ చేస్తున్న వేల మంది కాళ్ళ కింద నలిగి చనిపోయి ఉంటాడు.

          నా కాలి బాధ పెరిగింది. ఇక అతడిని గురించి ఆలోచించ లేకపోయాను. ఇంకా కొన్ని అడుగులు వేయగలనేమొ! పడిపోతాను. తుపాకి పేలుతుంది. చిన్న మంట, నేను నేల రాలుతాను. చావు గురించి ఆలోచనలేగాదు, చావును ముట్టుకున్నట్టనిపించింది. ఇక మిగలను, చనిపోతాను అనే ఆలోచన తమాషాగా అనిపించింది. నేనుండను. నా కాలు నన్ను బాధించదు. చలిగాలి, అలసట గాని నన్ను బాధించవు. లైనులో నుండి పక్కకి జరిగి పడిపోతే…

          నాన్న ఉనికి నన్ను ఆపింది. నా పక్కనే పరుగెడుతున్నాడు. ఊపిరి సలపక, బలం చాలక, విధిలేక పరుగు తీస్తున్నాడు. నాన్నను వదలి నేనెలా చనిపోగలను? నేను లేకుంటే నాన్నకు ఆధారమే లేదు. నాకు చనిపోయే హక్కు లేదనిపించింది.

          నాకొక శరీరముంది అని గానీ, నా కాలు బాధపెడు తుందని గానీ ఆలోచనే లేదు. నా ఉనికి నేనే కోల్పోయి పరుగెడు తున్నాను వేలమంది మాదిరిగానే.

          నాకు నన్ను గురించి స్పృహ కలగగానే కొంచెం నిదానించాను. నేను పడిపోతే నా వెనకవారి కాళ్ళ కింద చీమలా నలిగి పోతాను.

          నిద్రలో నడుస్తున్నట్లుగా ఉన్నది నా పరిస్థితి. కళ్ళు మూసుకుంటున్నాను. వెనక నుండి ఎవరో నన్ను తన్నుతుంటే స్పృహలోకి వస్తున్నాను. ‘‘త్వరగా పరుగెత్తు, వద్దు అనుకుంటె మమ్మల్ని ముందుకు పోనివ్వు’’ అంటున్నాడు నా వెనుకనున్న వ్యక్తి.

          నేను కళ్ళు మూసుకునే ఉన్నానా. ప్రపంచం నా ముందు సాగిపోతున్నది. మరో జీవితం ఆవల ఉన్నది అన్న భావం. ఒక ఎస్‌. ఎస్‌. అలసిపోతే మరొకతను డ్యూటీలోకి వస్తాడు. మరి మేము అలసిపోతే మా బదులు ఎవరు పరుగెత్తుతారు?

          గొంతులు తడారి పోతున్నాయి. ఆకలి బాధిస్తున్నది. ఊపిరందటం లేదు, అయినా ముందుకుపోతూనే ఉన్నాం.

          మా ఆకలి, అలసట మా స్వతః సిద్ధమైన అవసరాలు, చావు అన్నిటికీ అతీతంగా మారాము.

          మేము చలికంటె బలవంతులం. ఆకలి కంటె బల వంతులం, తుపాకుల కంటె బలవంతులం, చావాలనే కోరిక కంటె శక్తిమంతులం. మేము మనుషులం కాదు. నంబర్లము మాత్రమే.

          ఉషోదయపు ఛాయలు కనిపించసాగాయి. బలహీనుల మయ్యాం. భ్రమలు తొలగిపోయాయి.

          మేము 20 కిలోమీటర్లు పరుగెత్తామని కమాండర్‌ చెప్పాడు. అలసటనధిగమించాం. మా కాళ్ళు మా ప్రమేయం లేకుండా వాటంతటవే నడిచాయి.

*****

(సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.