కొత్త అడుగులు – 37

వాసరచెట్ల జయంతి

– శిలాలోలిత

అక్షరాలకు జలపాతం, అర్థవంతమైన భావపుష్టి, చదివించే శైలి, గాఢమైన అభివ్యక్తి, అంతర్గత, భావోద్వేగ కవిత్వం ఆమె కవితా లక్షణం – డా. భీంపల్లి శ్రీకాంత్

ఆమె కవిత్వం / జ్ఞాపకాలను పొదివి పట్టిన దోసిలి – సి. హెచ్. ఉషారాణి

మార్పు అనివార్యతను, మానవ ప్రవర్తనల్లోని డొల్లతనాన్ని చాలా సంయమనంతో ఎండగట్టడం మొదలు పెట్టింది. -ఏనుగు నరసింహారెడ్డి

ఆకర్షించిన కవిత వింగ్స్ ఇన్ స్పెక్టర్. గిజిగానికి ప్రతీకగా ఉన్న ఈ పేరు ఆమె నిర్మాణ కుశలతకు సంకేతం. పసుపులో పులిమినట్లు కనిపించే / తలకట్టు కిరీటం అంటూ మొదలయ్యే ఈ కవితలో‘ఓ పిచ్చుకా నీకు గిజిగాడు అన్న నామకరణం ఎవరు చేసారో అన్న మాట చివరలో వచ్చి కవితా రహస్యం పట్టిస్తుంది. గిజిగాడి గురించి తెలుగు సాహిత్యంలో పద్యకవులు, వచన కవులు రాసిన వాళ్ళ కంటే విభిన్నంగా సాగిపోతుంది ఈ కవిత. గిజిగాడి గూళ్ళలోని కవితా నిర్మాణంలోని సాంకేతిక నైపుణ్యం ఆడపక్షి కోసం పడే పోరాటం గిజిగాని సివిల్ ఇంజనీర్ నేర్పరితనం చిత్రించిన తీరు ఆమె సూక్ష్మ పరిశీలనకు సంకేతం” – కాంచనపల్లి గోవర్ధనరాజు

జయంతి, మహబూబ్ నగర్ లోని అమిస్తాపూర్ లో  పుట్టింది. 1978 జూన్ 1న ఈ లోకంలోకి అడుగు పెట్టింది. ఆమె తొలి కవిత్వం ‘నేల విమానం’ 2020 లో వచ్చింది. 2021 లో ‘ఈ తురాయి పూలు’ కవిత్వాన్ని మన ముందుకు తెచ్చింది. ఇంకా ముద్రించాల్సిన పుస్తకాలు కథల సంపుటి ఒకటి, సమీక్షా వ్యాసాల సంకలనం, కరోనా కవిత్వం గాండ్ల మొగ్గలు.

పలు పురస్కారాలు, బిరుదులు తీసుకున్నారు. జయంతి మాటల్లోనే తీసుకుంటే “జీవితం నేర్పే పాఠాలు అమూల్యమైనవి. ప్రతి మలుపులో సంఘర్షణలు ఎదుర్కొన్న సందర్భాలు ఎన్నో వున్నాయి. మనిషిని మనిషిగా గౌరవించలేని ఈ సమాజంలో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్ధం కాని పరిస్థితిలో పుస్తకాలే నాతో సంభాషిస్తాయి. సమాధానం చెప్పాలనుకుంటే కాగితంపై నా మనసులోని బాధను, ఆవేదనను నాకు నచ్చినట్టు రాసుకుని ఓదార్పు పొందేదాన్ని. అలా నాకు తెలియకుండానే రాయడం అలవాటైంది.” ఎందరెందరివో  ఉపన్యాసాలు వినడం, పుస్తకాలు విపరీతంగా చదవడం వల్ల కూడా ఆమెనో కవయిత్రిని చేశాయి.

ఇలా జయంతి తనకు తెలియకుండానే సమాజం సృష్టించుకున్న రచయిత్రిగా మారింది. సహచరుని ప్రోత్సాహం వల్ల కూడా ఆమెలో రచనాసక్తి పెరిగింది. ఇప్పుడు రచనలు చేయడం ఆమె దినచర్యలో భాగమైపోయింది. ఈ క్రమంలో కరోనా పాజిటివ్ రావడంతో చదవడానికి చాలా సమయం దొరికింది. రోజురోజుకీ రాయాలనే జిజ్ఞాస పెరిగింది.

ఆమె ఒక చోట అంటుంది – “కంటి  చెమ్మ ఒత్తిని  అక్షరాల్తో వెలిగిస్తాను” అని.

“సామాజిక జీవితాలను వస్తువులుగా స్వీకరించి వాటిలోని తాత్విక కోణాలను, అనుభవ గాఢతను చిత్రిస్తూ వాటిలోని మహనీయ కోణాన్ని స్పర్శించ గల కవయిత్రి” అని రూప్ కుమార్ డబ్బీకార్ అభిప్రాయ పడ్డారు. 

“పూర్తిగా స్వేచ్చతో విస్తృతమైన ధోరణిలో రాస్తుంది. నిర్మొహమాటంగా, నిర్భయంగా చెప్పగలదని” దాసరాజు రామారావు అభిప్రాయ పడ్డారు.

“మనుషులను కదిలించే రచనలను ఆవిష్కరిస్తున్న కవయిత్రి, కధయిత్రి, విమర్శకురాలు” – అని గద్వాల కిరణ్ కుమారి అభిప్రాయ పడింది.

“మరుగున పడిపోయిన ఎన్నో వస్తువులకు అందమైన పద సవ్వడితో జీవం పోస్తున్నారు. ఆమె కవిత్వం ఎన్నో జ్ఞాపకాల గుండె తడి, ఎన్నో అనుభవాల ఊర చెరువు, బతుకమ్మ పూల పరిమళాలతో సీతాఫలాల తియ్యదనంతో గిజిగాడు గూడల్లినట్లు సహజమైన అల్లికతో కవిత్వ పదిరాల్లుతుందని” వనపట్ల సుబ్బయ్య భావించారు.

“సంవేదనలకూ, సంఘర్షణలకూ ఒక రమ్యమైన అక్షర రూపం ఇచ్చే ప్రయత్నమే ఆమె కవిత్వం” అని చౌడారపు శ్రీధర్ ప్రకటించారు.

“సామాన్యమైన వస్తువును అసామ్యంగా తన కవితలో ప్రతిఫలింప జేస్తుంది. సరళ వాక్యాల్తో, పదశిల్ప చాతుర్యంతో కవిత్వాన్ని ప్రవహింపజేస్తుందని”  కందాళై రాఘవాచార్య భావించారు.

“కవిత్వంతో పాటుగా తాను వెలువరిస్తున్న కధలు, సమీక్షలు ఎంతో ఆకట్టుకున్నాయి. సమాజం పట్ల తనకున్న స్పష్టమైన అవగాహన అక్షరాల్లో కనిపిస్తోంది. సంఘటనలకు వెనువెంటనే స్పందించగల సున్నితత్వం తనలో వుంది” అని బిల్లా మహేందర్ భావించారు.

“ఆమె కవిత్వం….

అమ్మను, అరుగును, రైతును, కూలిని తాకిన చిరుగాలి కన్నీళ్లను, అనుభవాలను కలగలిపిన లోగిలి

“ఆమె కవిత్వం….

జ్ఞాపకాలను పొదిలి పట్టిన దోసిలి”  అని సి.హెచ్.ఉషారాణి భావించారు.

ఈ ‘తురాయి పూలు” పుస్తకంలో మెత్తని 51 కవితలున్నాయి. రైతుల జీవితాలపై రాసిన కవితా ఒకటి ఉదాహరణగా.

“నింగి చుక్కలను చూస్తూ

తన జీవితపు లెక్కలకు

వెలుగురేఖలు కడుతుంటారు

నిప్పుల కుంపటి మోస్తున్న భూతల్లి దేహానికి

చలువ పందిరి పచ్చ చీర నేసే నేతగాళ్లు 

సంటిపిల్లలు దొగ్గాడుతూ బొమ్మల్తో ఆడుకున్నట్లు

తడిపెట్టిన పొలంలో కాడెద్దులతో తిరుగుతుంటారు

మబ్బుల రాపిడికి వెలిగే మెరుపు తీగలను చూసి

తమ కళ్ళల్లో చినుకు పుష్పాలు పూయిస్తుంటారు

గింజ గింజ నేలకు అంకితం చేసి

పచ్చని పైరుకు రెక్కలు తొడుగుతుంటారు

ఏపుగా ఎదిగిన కోతపంటను చూసి

దేశదేహానికి ముడి సరుకవుతున్నందుకు

పత్తి పువ్వు లెక్క పరమానందం చెందుతరు

పంట అమ్మినంక అప్పు లెక్కలు చూసి

తమ చొక్కా చిరుగులు కుట్టుకుంటరు

గిట్టుబాటు కాని ధరలను చూసి

కాలం కాలేదని సరిపెట్టుకుని

వచ్చే ఏడాది పంటకు సమాయత్తమవుతరు

ప్రతిఫలం ఆశించని సేవకులు రైతన్నలు –

ఇలా కొత్త గొంతుక నుండి రాలి పడ్డ కవితాక్షరాలలో కొన్ని  ఇవి.

వాసరచెట్ల జయంతి ఇలాగే ఎప్పటికీ సాహిత్య రంగాన నిలబడాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను. జయంతికి  అభినందనలు! 

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.