చాతకపక్షులు (చివరి భాగం)

(తొలితరం ఎన్నారై స్త్రీల అంతర్మథనాన్ని  చిత్రించిన నవల)

– నిడదవోలు మాలతి

          భానుమూర్తి బొంబాయి వచ్చి, గీతని విజయవాడ తీసుకువెళ్లేడు. “రేపు వచ్చి మా యింటికి తీసుకెళ్తాను” అని చెప్పి వెళ్లిపోయాడు అతను.

          తండ్రి గీతని చూసి కళ్ల నీళ్లు పెట్టుకున్నాడు, “మళ్లీ నిన్ను చూడనేమో అనుకున్నాను” అంటూ. కామాక్షి పోయిన తరవాత ఆయన చాలా డీలా పడిపోయాడు, గీత ఊరు విడిచి పోయిన తరవాత ఈ మధ్య కాలంలో చాలా మార్పులు జరిగేయి. తల్లి పోవడం ఒక్కటే కాదు. భానుమూర్తి వాళ్ల ఆఫీసులోనే పనిచేస్తున్న ఉషారాణిని పెళ్లి చేసుకుని వేరింటి కాపురం పెట్టేడు. తల్లిపోయిన యాడాదిలోపున కన్యాదానం మంచిదని చెల్లెలి పెళ్లి చేసేసేరు ఆర్నెల్లు తిరక్కుండా. ఊళ్లోనే పోస్టాఫిసులో పని చేస్తున్నాడుట ఆ అబ్బాయి. వాళ్లకి ఇద్దరు అబ్బాయిలు. తమ్ముడు బాగా పొడుగెదిగాడు. కాలేజీలో రెండో ఏడు చదువుతున్నాడు. అన్న ఏదో గవర్నమెంటు ఆఫీసులో యూడీసీ. బామ్మ మామూలుగానే మంచంలో మూలుగుతూ పడి వుంది. ఆవిడలో మాత్రమే ఏ మార్పూ కనిపించలేదు గీతకి.

          “ఇంటి విషయాలు మీరు రాయకపోతే నాకెలా తెలుస్తాయి? నాన్నకి ఒంట్లో బాగులేదని నాకెందుకు రాయలేదూ?” అంది విసుగ్గా..

          “నువ్వు బెంగ పెట్టుకుంటావని నాన్నే రాయొద్దన్నారు” అన్నాడు అన్న.

          విశేషాలన్నీ నాన్న చెప్తుంటే పక్కనే కూర్చుని వింది. ఆరేళ్లలో ఇన్ని సంగతులు జరిగివుంటాయని తను అనుకోలేదు. అమెరికాలో తన లోకంలో తను వుండి ఇక్కడ ఏం జరుగుతోంది అన్న ఆలోచన రానేలేదు తన మనసులోకి.

          మర్నాడు బాబాయి ఇంటికి వెళ్లింది. పిన్ని సంసారపక్షంగా వుంది. గీతని చూడగానే పాతచుట్టాన్ని పలకరించినట్టుగా మొదలు పెట్టి తన కష్టసుఖాలు ఏకరేవు పెట్టింది.

          “నాకెప్పుడూ ఏదో ఒక బాధ. తలనొప్పి, నడుం నొప్పి, మోకాళ్లు పట్టేయటం, ఏదో ఒకటి. పిల్లలు ఇద్దరూ రాక్షసులే అనుకో. కింద పెడితే పంటలుండవు, మీద పెడితే వానలుండవు. చంపుకు తింటున్నారు. పనివాళ్లమాట సరేసరి. గట్టిగా మాటంటే చేతిలో గిన్నె అక్కడే పారేసి పోతారు. వాళ్లకి మనమే భయపడాలి. మీ బాబాయిమాట అడక్కు. ఆయనకి ఇంటివాళ్ల కంటె వూళ్లో వాళ్లే ఎక్కువ. ఇంటిపనీ, బయటిపనీ అంతా నేనొక్కదాన్నే చూసుకోవాలి ..”

          గీత వింటూ కూర్చుంది.

          తనగోడు అయిం తరవాత, ఉషారాణి అమెరికాలో సుఖాల గురించి అడగటం మొదలుపెట్టింది. “అక్కడ అన్నిటికీ మెషీనులుంటాయిట గదా. మీకు కారుంది కాబోలు. నీకు వేరే కారుందా? ఉద్యోగం చేస్తున్నావుట. ఇక్కడ నేనూ చేస్తున్నాను ఎందుకూ .. చెప్పుకోడానికే. చాకిరీయే తప్ప రెండువారాలయ్యే సరికి నా జీతం ఆయన జీతం అంతా హుళక్కి. అయినా నిత్యం చచ్చేవాడికి ఏడ్చేవాళ్లెవరులే. … మీరే చేసారంటూ అమ్మానాన్నల మీద పడి ఏడవడానికి కూడా లేదు. లవ్ మేరేజి.”

          గీతకి మాట తోచలేదు. మౌనంగా వింటూ కూర్చుంది. ఆ పూట వాళ్లింట్లో భోంచేసి ఇంటికొచ్చేసింది.

          మర్నాడు శివరావు మామయ్యగారికి ఫోనుచేసి కొంచెంసేపు మాట్లాడి, సత్యం నెంబరు తీసుకుంది. సత్యం ఫోను అందుకుని ఎంతో చనువుగా మాట్లాడింది. గుంటూరు ఎప్పుడు వస్తావని అడిగింది. తనకి నలుగురు పిల్లలుట. ఇద్దరు ఆడపిల్లలూ, ఇద్దరు మగపిల్లలూ. తొలిచూలు ఆడపిల్ల, అత్తగారు ఎంతో ముచ్చట పడిపోయేరుట. “ఆ మధ్య నువ్వు రాసిన ఉత్తరం చూసి ఆవిడ ఎంతో మురిసిపోయేరు,” అంది సత్యం.

          “ఉత్తరం అందిందన్నమాట. మరి జవాబు రాయలేదేం?” 

          “ఏంలేదు. బద్ధకం అంతే. రాద్దాం రాద్దాం అనుకుంటూనే రోజులు గడిచిపోయేయి.”

          నాలుగురోజులాగి, గుంటూరు బయల్దేరింది. శివం మామయ్య బస్టాండుకి కారు పంపించేరు. గీత వాళ్లింట్లో కూర్చుని మాటాడుతుంటే కళ్లు చెమ్మగిల్లేయి. కనకమ్మ ఎంతో ఆప్యాయంగా పక్కన కూర్చుని, “నువ్వూ మీ ఆయనా బాగున్నారా అమ్మా? నీకక్కడ సుఖంగా వుందా?” అంటూ ప్రశ్నలేసింది.

          “బాగానే వున్నాం” అంది గీత.

          కనకమ్మే మళ్లీ “ఎక్కడయితేనేముందిలే. అంతా మనం అనుకోవటంలోనే వుంది, సుఖం అనుకుంటే సుఖం, దుఃఖం అనుకుంటే దుఃఖం.” అంది.

          అక్కడ ఓ గంట కూర్చుని, సత్యం యింటికి బయల్దేరింది. 

          శ్యాం వరండాలో కూర్చుని సాలిటేర్ ఆడుకుంటున్నాడు. గీతని చూసి, “బాగున్నావా? ఎప్పుడొచ్చావు?” అన్నాడు యాదాలాపంగా. మునపటి హుషారు లేదు మనిషిలో.

          లోపల్నుంచి సత్యం వచ్చింది, “రా, రా.” అంటూ. బాగా నునుపు తేలింది. ముస్తాబు కూడా ఓపాలు ఎక్కువే. మునపటి సత్యం కాదు.

          పది నిముషాల్లో గీత చాలా సంగతులు గ్రహించింది. పేరుకే శ్యామ్‌ కానీ వ్యాపారం అంతా తనే చూస్తోందిట. స్ఠానిక మహిళా సంఘం, లయన్స్ క్లబ్బు, ఇంకా అంతర్జాతీయ సంఘాలూ – తను వేలు పెట్టని వ్యాపకం లేదు. నెలకి నాలుగు రోజులు ఇంట్లో వుంటే గొప్పట. ఈ రోజు ఏ మీటింగులూ లేకపోవడం గీతరాత బాగుండే అన్నట్టుంది ఆవిడ మాటతీరు చూస్తుంటే. ఆ మాటా, ఈ మాటా మాట్లాడుతూ, హఠాత్తుగా, “నీకు పిల్లల్లేరుట కదా. విన్నాలే. మా బుజ్జిగాడిని పెంచుకోరాదూ?” అంది.

          గీత నిర్ఘాంతపోయింది. తను రైలు దిగింది మొదలు బామ్మా, ఇరుగూ, పొరుగూ – ప్రతివారూ ఏదోవంక పిల్లల ప్రసక్తి తెస్తూనే వున్నారు. ఎవరికి తోచిన సలహాలు వారు యిస్తూనే వున్నారు. “ఎందుకు లేరూ?” “వద్దనుకున్నారా? ఆయనే అన్నాడా? నీకు పుట్టిన బుద్ధేనా?” “ఎవరి లోపం? డాక్టర్లని సంప్రదించేరా?” “వెంకన్నకి ముడుపు కట్టుకో” “ఆ దేవుడు” “ఈ దేవత” “ఆ సామి” “ఈ అమ్మ” – గీతకి తలవాచిపోతూంది.

          వాళ్లంతా ఒక ఎత్తు. సత్యం తనకి ఆప్తురాలు. సత్యం దగ్గర తనకి మనశ్శాంతి అనుకుంది. కానీ ఈ సత్యం అలనాటి నేస్తురాలు కాదు. ఈమె సత్యవతి మేడమ్, హైక్లాస్ సోషలైటు, పేరు పొందిన సాంఘిక సేవాతత్పరురాలు.

          గీత మాటాడలేదు.

          సత్యమే మళ్లీ రొకాయిస్తూ, “ఏం? నిర్ణయాలు అయిపోయేయేమిటి? మీ చెల్లెలి కొడుకుని దత్తత తీసుకుంటావా?” అంది.

          గీత తేరుకుని, “లేదు. అసలు మేం ఏమీ అనుకోలేదు” అంది.

          “ఇంకేం మరి. ఇప్పుడయినా మొదలుపెట్టు ఆ ఆలోచన. నువ్వు ఇక్కడ వుండగానే తేల్చుకోడం మంచిది. నీకు ఏమైనా అనుమానాలుంటే చెప్పు.”

          “ఏమోలెద్దూ. ఇప్పుడెందుకు ఆ గొడవ. ఇది నేనొక్కదాన్నీ చేసే నిర్ణయం కాదు కదా.” అంది గీత. ఆ తరవాత అట్టేసేపు కూర్చోడానికి మనసొప్పలేదు. “పొద్దు పోతోంది, వెళ్తాను” అంటూ లేచి, “పద, బస్సెక్కిద్దువుగానీ,” అంది.

          సత్యవతి సరే పద అంటూ డ్రైవరుని పిలిచింది గీతని బస్టాండుకి తీసుకెళ్లడానికి.

          ఆ రాత్రి హరి పిలిచాడు ఎలా వున్నావని అడగడానికి. గీత దాదాపు ఏడుపు గొంతుతో జరిగిన సంగతి చెప్పింది.. హరి కూడా బాధపడుతూ, “మనకి తోచలేదు ఈ సంగతి.. సరేలే. ఆ మాటే చెప్పు. ఇద్దరం ఆలోచించుకోవాలి అని,” అన్నాడు.

          తరవాత అత్తవారి వూరు వెళ్లి నాలుగు రోజులుండి వచ్చింది. 

          ఓ సాయంత్రం వరండాలో కూర్చుని ఆలోచిస్తుంటే, మ.తె. సమావేశాల్లో కనిపించిన లెక్కల మాస్టారు గుర్తుకొచ్చేరు. ఆయన గీతకి అయిదో క్లాసులో లెక్కలు చెప్పేరు. తరవాత పి.హెచ్.డీ చేసి అమెరికా వెళ్లేరు. అక్కడ బాగులేదని ఇండియా వచ్చేసి, బెంగుళూరులో ఐఐటీలో చేరేరు. వాళ్లిచ్చే రూపాయలు డాలర్లకి సరితూగడం లేదని మళ్లీ అమెరికా వచ్చేరు. సమావేశాలలో గీతని గుర్తుపట్టి మాట్లాడుతూ, “మా ఆవిడ ఇండియా వెళ్లిపోదాం అంటోంది. ఇక్కడ ఎన్నాళ్లుంటానో తెలీదు” అన్నారు.

          ఆలోచిస్తూ సరోజ రావడం చూడనే లేదు.

          “ఏమిటి నీలో నువ్వే నవ్వుకుంటున్నావు?” అంటూ పక్కన చతికిలబడింది సరోజ. సరోజా, వాళ్లాయన సురేష్ కూడా లెక్కల మాస్టారిలాగే ఇటో కాలూ, అటో కాలూ వేసి కొన్నేళ్లు ఉయ్యాలలూగి, చివరికి జమ్‌షెడ్పూర్‌లో స్థిరపడ్డారు. సరోజ పుట్టింటికి వచ్చింది తల్లిని చూడ్డానికి.

          గీత ఉలికిపడి, తేరుకుని, “రా, రా. ఎప్పుడొచ్చేవు?” అంటూ కుశల ప్రశ్నలేసింది

          తరవాత మాట్లాడుతుంటే తన సందేహం వెలిబుచ్చింది. “ఇందాకా నువ్వు అడిగేవు ఏం ఆలోచిస్తున్నానని. ఏం లేదు. ఎక్కడ సుఖం వుంది అని ఆలోచిస్తున్నాను. నువ్వు కూడా రెండు లోకాలూ చూసావు కనక చెప్పు. ఏ దేశంలో సుఖం వుంది?”

          సరోజ నవ్వింది. “అది గొప్ప భేతాళ ప్రశ్న. జవాబు తెలిస్తే చాలా మంది దుగ్ధ తొంభైపాళ్లు వదిలించేయొచ్చు” అని, “అది అంత తేలిగ్గా తేలే ప్రశ్న కాదు గానీ. నువ్వెలా వున్నావు, చెప్పు. ఏంచేస్తున్నావు? పిల్లలేరీ?” అంది.

          “సరి. నువ్వు కూడా మొదలెట్టకు సొద. ఛస్తున్నాను జవాబులు చెప్పలేక.” అంది గీత చిరాగ్గా..

          “లేదులే. అడగను. నీకు నచ్చిన మాటలే చెప్పు.”

          గీత మనసు తేలిక పడింది. మనసిచ్చి మాటాడే ఆత్మీయురాలు దొరికింది. “పద, అలా కాస్సేపు క్రిష్ణ వొడ్డున తిరిగొద్దాం.” అంది లేస్తూ.

          సరోజ గీతవేపు నిదానించి చూసింది. గీత ఆద్యంతాలులేని ప్రశ్నతో కుస్తీ పడుతోంది. సమాధానం ఎవరు చెప్పగలరు?

          గీత తండ్రితో ‘బయటికి వెళ్తున్నాన’ని చెప్పి, బయల్దేరింది. ఇద్దరూ క్రిష్ణాబరాజి చూస్తూ నెమ్మదిగా నడుస్తున్నారు.

          “నువ్వు అడిగిన ప్రశ్నకి జవాబు ఏం చెప్పాలో నాకూ తెలీదు గీతా. నువ్వు టీవీ చూస్తావా?”

          “చాలా తక్కువ. ఏం?”

          “ఒక గేం షో వుంది price is right అని. ఆ హోస్టు ఏదో ఒక వస్తువు చూపించి ధర చెప్పమంటాడు పోటీదారుని. ఆ పోటిదారు అక్కడ చేరిన ప్రేక్షకుల వేపు చూస్తాడు. దాదాపు వంద మంది వుంటారు. అందరూ తలో ధరా అరుస్తారు. అంత మంది అన్ని ధరలు చెప్తే దేన్ని నమ్మడమో ఆ పోటీదారుకి ఎలా తెలుస్తుందంటావు?”

          “ఏమో లెద్దూ. నాకు తెలీదు. నువ్వే చెప్పు చంపక.”

          “అదే నేను చెపుతున్నదీను. ఆ అబ్బాయికీ తెలీదు. చివరికి తనకి తోచిన ధర చెప్తాడు. మరి ఆ పని ముందే చెయ్యొచ్చు కదా. ప్రేక్షకుల దిక్కు చూట్టం ఎందుకూ అంటే సమాధానం లేదు. జీవితం కూడా అంతే. మనకి కావలసింది పని గట్టుకు మంచి చెడ్డలు ఆలోచించుకోకుండానే నిర్ణయాలు చేసేసుకుంటాం. దానికి మద్దతు ఇచ్చేవారి కోసం దిక్కులు చూస్తాం. అది యిచ్చేవారుంటే సంతోషం. లేకుంటే విచారం. మనం చేసేది మనం ఎలాగూ చేస్తాం. నాకు తెలిసిందంతా నేనూ, మా ఆయనా, పిల్లాడూ – మేం ముగ్గురం వీలయినంత ప్రశాంతంగా రోజులు గడుపుకోటమే. నేను మెడిసన్‌ పూర్తి చెయ్యలేదు. సురేష్ ఆరోగ్యం ఏమంత మంచిది కాదు. అంచేత నేను అతనితోనే వుంటాను ఎల్లవేళలా, అతను ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తాను. మొదట్లో బాబు చిన్నప్పుడు కాస్త కష్టం అయింది కానీ ఇప్పుడాబాధ లేదు. వాడు ఎదిగాడు. నాకింక పూర్తిగా శలవు. మా ఇంట్లోనూ వూళ్లోనూ కూడా ఎంత మంది కొరుక్కుతిన్నారో చెప్పలేను. నా తెలివితేటలన్నీ బుగ్గిపాలయేయనీ, నాకు వ్యక్తిత్వం లేదనీ, కొందరు సంఘ సంస్కర్తలయితే నేను స్త్రీ వాదాన్ని ఒక దశాబ్దం వెనక్కి మళ్లించానని కోప్పడ్డారు కూడాను. ఈ సొల్లుకబుర్లన్నీ పట్టించుకోకపోతే ఎనలేని శాంతి. నేను సాధించింది అంతే.”

          సరోజ వదనం నిర్మలంగా ప్రకాశిస్తూంది. గీత సరోజ చేతిని ఆప్యాయంగా తన చేతిలోకి తీసుకుని, “తెలీదంటూనే చక్కగా చెప్పావు. ఎవరికైనా కావలిసింది అంతే కదా ఆత్మ తృప్తి.” అంది.

***

          గీత ఇండియానించి తిరిగొచ్చేక ఇద్దరూ ఎవరి వ్యాపకాల్లో వాళ్లు పడిపోయారు. ముందు అనుకున్నట్టుగానే గీతని ఫుల్ టైం సూపర్వైజరుగా చేశారు వాళ్ల సెక్షనుకి. ఇప్పుడు గీతకి తీరిక లేదు. రోజంతా ఆఫీసులోనే సరిపోతోంది.

          హరి కంపెనీ కూడా బాగా అభివృద్ధి అయింది. కన్సల్టింగు అనో కొత్త డీల్ అనో ప్రయాణాలు ఎక్కువయేయి హరికి. అంచేత ఒకొక్కప్పుడు శనాదివారాలు కూడా ఇంటికి రావడం లేదు. ఒకొక్కప్పుడు గీతనే షికాగో రమ్మంటున్నాడు కంపెనీ పార్టీలకి.

          “నాకు రావాలని లేదు, మీరు వెళ్లండి” అంది గీత ఒకసారి.

          “నువ్వు రాకపోతే బాగుండదు,” అన్నాడు.

          “అలంకార ప్రాయంగానా?”

          “అలంకారం అని కాదు. నీ అండదండలు నాకు వుంటేనే కదా నేను ఘనకార్యాలు సాధించగలిగేది.”

          “మీకు నా పరిపూర్ణ సహకారం వుందని రాసివ్వనా?”

          “చూసావా, నీకు హాస్యంపాలు కూడా ఎక్కువే. నువ్విలా మాట్లాడతావనే మా ఆఫీసులోవాళ్లకి నువ్వంటే ఇష్టం.”

          గీతకి చిరాకేసింది కానీ అణుచుకుని వూరుకుంది. పోచంపల్లి చీరె ఒకటి తీసి కట్టుకుని, బయల్దేరుతుంటే, “యూ ఆర్ బ్యూటిఫుల్” అన్నాడు హరి. ఈ మధ్య ఈ రకం వాగ్ధోరణి అతనికి బాగా పట్టుబడింది. 

          గీత మాటాడలేదు. ‘ముఖమే కనిపించింది కానీ మనసు కనిపించలేదతనికి. లేక అతను ఆమె మనసులోకి చూడదలుచుకోలేదో, చూడబోతే కనిపించేది భరించడం కష్టం అనేమో’ గీత ఆలోచనల్లో పడిపోయింది కారులో కూర్చుని.

          రెండున్నర గంటలు ప్రయాణం చేసి, పార్టీ ఇస్తున్న థాంప్సన్‌గారి ఇల్లు చేరుకున్నారు. ఇల్లు పెద్దదే. మిసెస్ థాంప్సన్సుగారికి ఇంటి అలంకరణ అత్యంత ప్రీతికరమయిన కాలక్షేపం. మార్తా స్టూవర్ట్‌ చూసిందంటే కళ్లు తిరిగాలి. అంత అందంగా అమర్చింది ఆవిడ.

          ఆహూతులు అట్టే మంది లేరు. ఎనిమిది మంది మాత్రమే. న్యూయార్కునించి విలియమ్స్ వచ్చాడు. గీతని ఆనవాయితీ ప్రకారం పలకరించి చిత్ర బాగుందనుకుంటాను అన్నారు. గీత వాళ్లబ్బాయి ఎలా వున్నాడని అడిగింది. తరవాత ఇద్దరూ పక్కనున్న వారితో మాటలు కలిపారు.

          థాంప్సన్ ఎవరికి ఏ డ్రింకు కావాలో కనుక్కున్నాడు. గీత తనకి ఏమీ వద్దంటే, జూస్ కానీ సోడా కానీ ఇవ్వనా అని అడిగేడు. జూసు తీసుకుంటానంది గీత.

          మిసెస్ థాంప్సన్ వేరుశనగపప్పూ, ఛీజు ముక్కలూ, క్రాకర్సూ తెచ్చిపెట్టింది బల్లమీద డ్రింకులతో పాటు నమలడానికి.

          ఇక్కడ కూడా ఆడవారూ మగవారూ జట్లు జట్లుగా విడిపోవడం గీతకి ఆశ్చర్యం వేసింది.

          ఓ గంటసేపు కబుర్లు అయ్యేక, దాదాపు ఏడుగంటలకి వెచ్చపెట్టాల్సినవి వెచ్చపెట్టి, బల్లమీద ప్లేటులూ, ఫోర్కులూ, మొదలయినవి సర్దింది ఇంటావిడ. మిస్టర్ థాంప్సన్ ఆవిడకి సాయం చేసేడు. అందరూ తమతమ డ్రింకులు పుచ్చుకుని భోజనాల బల్ల దగ్గరికి చేరేరు. ఎవరు ఎక్కడ కూర్చోవాలో మిసెస్ థాంప్సన్ చెప్పింది. వరసగా గిన్నె తరవాత గిన్నె అందుకుంటూ, కొంచెం వడ్డించుకుని తరువాతి వారికి అందిస్తూ ఒక రౌండు వడ్డనలు ముగించారు.

          భోజనాలయ్యేక, అందరూ లివింగ్రూంలో చేరి కబుర్లు చెప్పుకున్నారు. థాంప్సన్ హాస్య కథలు చెప్పాడు. వచ్చిన వాళ్లందరూ గలగల నవ్వేరు. అంతా పద్ధతి ప్రకారం జరిగిపోయింది.

          తిరుగు ప్రయాణంలో హరి గీతతో అన్నాడు, “చూశావా, రానన్నావు కానీ బాగానే ఎంజాయ్ చేసేవు” అని.

          గీత “అవున్లెండి” అంది పొడిగా.

          “నువ్వు రాకపోతే నేనిచ్చుకోవాలి సమాధానాలు. మనకేవో స్పర్థలున్నాయి అనుకుంటారు. నువ్వు నాకు సపోర్టు ఇవ్వడంలేదనుకుంటారు. ఇంట్లోనే సఖ్యత లేకపోతే ఆఫీసులో సహోద్యోగులతో ఎలా పని చేస్తావు అంటారు. నాకు టీం స్పిరిట్ లేదంటారు” అన్నాడు పరిస్థితి వివరిస్తూ.

          గీత నిరామయంగా వింటూ కూచుంది.

          వారిద్దరి మధ్య అనుబంధం చిన్నబీట వేసి క్రమంగా ఎడం పెరుగుతోంది కానీ ఇద్దరిలో ఎవరికీ ఆ స్పృహ వున్నట్టు లేదు. ఎవరి పనుల్లో వారు మునిగిపోయారు. అలాటి సమయంలో హరి స్నేహితుడు ఒకాయన ఇల్లు కొనమని సలహా ఇచ్చేడు. అది స్టేటస్ చిహ్నమే కాక ఇన్వెస్ట్‌మెంటూ, టాక్స్ రైటాఫ్ లాభాలూ కూడా వుంటాయని. సొంత యిల్లు అన్న సుఖం ఒక్కటే కాక హరి ఆదాయానికి అది అవసరం.

          గీతతో చెప్తే, “సరే చూద్దాం” అంది తను కూడా.

          దాంతో మరో రెండు ప్రశ్నలు – ఎక్కడ? ఎంతలో? షికాగోలో ధరలు చాలా ఎక్కువ. పొలిమేరల్లో అయితే కాస్త నయం కానీ ఇద్దరూ చెరోవేపూ ప్రతిరోజూ గంటల తరబడి రోడ్డుమీదే బతకాలి. పైగా ఊపిరాడని జనం. అంతూ పొంతూ లేకుండా కోలాహలం. పోనీ, మధ్యే మార్గంగా రాక్ఫర్డులో చూద్దాం అనుకున్నారు కానీ అక్కడ మార్కెట్ బాగులేదు. ఇళ్లు అప్రీషియేట్ అవవు. అమ్మబోతే పెట్టుబడి కూడా గిట్టుబాటు కాకపోవచ్చు. చూడగా చూడగా మాడిసనే నయం అనిపించింది. దాదాపు పదేళ్లుగా most livable city గా పేరు తెచ్చుకుంది. ఆఖరికి మాడిసన్లోనే ఇళ్లు చూడ్డానికి నిశ్చయించుకున్నారు.

          హరి హనుమయ్యగారికి ఫోను చేశాడు సలహా అడగడానికి. వాళ్లు ఇక్కడ చాలా కాలంగా వున్నారు కనక ఆనుపానులు చెప్పగలరని. 

          ఆయన “నేను ఇల్లు కొని ఇరవై ఏళ్లయింది కదండీ. అప్పటికీ ఇప్పటికీ మార్కెట్ చాలా మారిపోయింది. దామోదరంగారు ఈ మధ్యనే కొన్నారు. ఆయన్ని కనుక్కోండి” అని దామోదరం నెంబరు ఇచ్చారాయన.

          హరి ఎప్పుడో ఒకసారి హనుమయ్యగారింట్లోనే దామోదరాన్ని చూశాడు కానీ అట్టే పరిచయం లేదు.

          దామోదరానికి ఫోన్ చేస్తే ఆయన ఇల్లు కొనడంలో కష్టసుఖాల మీద పావుగంట ఉపన్యాసం ఇచ్చి, తనకి తెలిసిన ఒక ఇండియన్ రియల్టరు ఉన్నాడని చెప్పి పేరూ, ఫోన్నెంబరూ ఇచ్చాడు హరికి. అతను బెన్నీపేరుతో చెలామణి అవుతున్న బ్రహ్మానందం, “ఏజంట్లు వెంటనే ఫోనెత్తరు. వాళ్లు చాలా బిజీగా వున్నారని మనం అనుకోవాలని వాళ్ల తాపత్రయం. ఆ సంగతి అందరికీ తెలుసు అని వాళ్లక్కూడా తెలుసు. అయినా అదో తంతు. ఒకటి రెండు రోజుల్లో పిలుస్తాడు లెండి” అన్నాడు దామోదరం.

          తరవాత హరి బెన్నీని పిలిచాడు. అనుకున్నట్టుగానే ఆన్సరింగ్ మెషీను పలికింది.

          మర్నాడు బెన్నీ ఫోన్ చేశాడు హరికి. “ఎక్కడ కలుసుకుందాం మాట్లాడడానికి?” అని అడిగాడు లాంఛనప్రాయంగా.

          “మీరే చెప్పండి. మీ ఆఫీసుకి రమ్మంటే వస్తాం. లేదా మీరు మా యింటికి వచ్చినా సరే,”

          బెన్నీ తనే వాళ్లింటికి వస్తానని చెప్పాడు. అలా అయితే వాళ్ల జీవనసరళి కూడా కొంత వరకూ తెలుసుకోవచ్చని. శనివారం ఉదయం పది గంటలకి కలుసుకోడానికి నిశ్చయించుకున్నారు ఉభయులూ.

          అనుకున్నట్టుగానే శనివారం వచ్చాడు బెన్నీ. రెండు నిముషాలు పోచికోలు కబుర్లు అయిం తరవాత ఆయన మొదలుపెట్టాడు, “మామూలుగా ‘మీపరిస్థితి చెప్పండి’ అని అడగడం ఆచారం. కానీ నేను మాత్రం మరో విషయం మాట్లాడాలి మీతో ముందస్తుగా. నేను ఇండియనులతో పని చెయ్యడం మానేసి మూడేళ్లయింది.” అన్నాడు.

          “అదేమిటండీ. ఎంచేత?”

          “అదే చెప్తాను. తరవాత మీకు ఇష్టమయితే ఇళ్లు చూపిస్తాను.”

          “అదీ ముఖ్యమే. మీకూ మాకూ మధ్య సామరస్యం వుంటేనే కదా పని సవ్యంగా సాగేది. చెప్పండి” అన్నాడు హరి.

          “మీకు నా నెంబరు ఇచ్చింది దామోదరంగారేనా?” అని అడిగాడు బెన్నీ.

          “అవునండీ.”

          “ఆయనకి రియలెస్టేట్ లైసెన్సుంది అని మీకు తెలుసా?”

          “తెలీదు. ఆయనకి లైసెన్సుంటే మీకెందుకు రిఫర్ చేసేరు మరి?”

          “అదే చెప్పబోతున్నాను. ముందు మనం స్పష్టం చేసుకోవలసిన విషయం అదే. నాకు చాలా ముఖ్యం కూడాను. నేను మనవాళ్లతో బిజినెస్ ఎందుకు మానుకున్నానంటే,,” అంటూ మొదలెట్టి, ఆయన చెప్పిన చాలా పెద్ద కథ సారాంశం ఏమిటంటే –

          ఇల్లు కొనటం చాలా పెద్ద మొత్తంతో కూడిన వ్యవహారం కనక ‘మనం ఎక్కడ బోల్తా పడతామో’ అన్న భయం సహజం. ప్రతి ఒక్కరికీ తమడాలర్లకి సంపూర్ణంగానో ఇంకా ఎక్కువగానో విలువ రాబట్టుకోవాలన్న తాపత్రయం కూడా సహజమే. అందుకు నేను తప్పుబట్టను. కానీ తకరారొచ్చేది వాళ్ల అర్థంలేని అనుమానాలతో. వారికి మొట్టమొదట అడ్డొచ్చేది పిరికితనం. ఊబిలో ఇరుక్కుంటున్నామేమో, మోసపోతామేమో అని ప్రతివారికీ అనుక్షణం అపనమ్మకమే. అంచేత విషయ సేకరణ మొదలెడతారు. కనిపించిన ప్రతివారినీ వాకబు చేస్తారు. ఎవరేం చెప్పినా నమ్ముతారు.

          రెండో మెట్టు “మన”వాడు అంటే నాతో చర్చలు సాగించడం. ఏ భజనకో భోజనానికో పిలవడంతో మొదలవుతుంది. మాటవరసకే ‘మార్కెట్ ఎలా వుంది’ అంటూ ప్రారంభిస్తారు. ‘మేం ఇల్లు కొందాం అనుకుంటున్నాం’ అంటారు. ఆ మాట ఏ ఏజంటుకయినా కర్ణపేయమే కదా. నేను ఎంతో వుత్సాహంగా వాళ్లు అడిగిన విషయాలన్నీ చక్కగా వివరిస్తాను – ఏ ప్రాంతంలో ఇళ్ల ధరలు పెరుగుతున్నాయి, ఇరుగుపొరుగుల సాంఘికస్థాయి ఏమిటి లాటివి. వారివల్ల నేను ఎంతో కొంత కమిషన్ సంపాదించగలను అనుకుని ఓపిగ్గా వాళ్లతో తిరుగుతాను. కొత్తయిళ్లూ, పాతయిళ్లూ చూపిస్తాను. బిల్డర్లతో మాట్లాడతాం, స్థలాలు చూపిస్తాను. మా ఆఫీసులో కూడా నేను తప్పకుండా ఆ బిజినెస్ తెస్తాననే ఆశిస్తారు. ‘మనం, మనం, తెలుగువాళ్లం. లేదా భారతీయులం. ఒకరికొకరు అండగా వుండాలి’ అంటూ వాళ్లు నాకు అప్పుడప్పుడు గుర్తు చేస్తుంటారు. ఏడాదో రెండేళ్లో ఇలా లాగుతారు. హఠాత్తుగా వాళ్లు పిలవడం మానేస్తారు. నేను పిలిస్తే ఫోను తియ్యరు. అప్పుడు తెలుస్తుంది వాళ్లు మరో రియాల్టరు ద్వారా కొనేశారని. ఇంత కాలం నేను తిరిగిన తిరుగుడే కాక, నా పరువు కూడా పోతుంది మా ఆఫీసులో. ఈయనకి వాళ్ల దేశీజనాలలోనే పరపతి లేదు అన్న పేరు నాకు వచ్చేసింది ఇలాటి ‘మనవాళ్ల’ మూలంగా. ఇలా నా నెత్తిన చేతులు పెట్టిన వారిలో దామోదరంగారిది పెద్ద ఖాతా.”

          గీతా, హరీ తెల్లబోయారు. వ్యాపార‌ ప్రపంచంలో విశేషంగా అనుభవం గల హరి కూడా నమ్మలేక పోయాడు. మనవాళ్లలో లుక లుకలున్నాయని తెలుసు కానీ ఈ స్థాయిలో వున్నాయని అనుకోలేదు అతను. ఘోరం!

          “మరి ఆయనే కదా మీ ఎడ్రెస్ ఇచ్చింది?” అన్నాడు హరి ఇంకా నమ్మకం కుదరక.

          “అదేనండీ మిగతా కథ. ఆయనకి ఆ ఇల్లు కొనడంతో రియలెస్టేటు విద్య పట్టువడి పోయింది. లైసెన్సేముంది మూడు నెలలు క్లాసులూ, ఐయిదు గంటలు పరీక్ష. అంచేత లైసెన్సు తీసేసుకున్నాడు. ఇలా ఫోన్నెంబరు ఇచ్చేయడం తేలిక కనక ఇచ్చేస్తుంటాడు. అప్పుడు ఆయన క్లయింటుల వెంట తిరగఖ్కర్లేదు నాలాగ. ఇప్పుడు చూడండి. మీరేం అనుకుంటారు? దామోదరంగారు ఎంత మంచివాడు, మనవాళ్లకి సాయం చెయ్యాలని తపిస్తున్న సహృదయుడు అనుకుంటారు. నేను చెయ్యవలసిన పనంతా చేస్తాను. ఆయనకి 20 శాతం రిఫరల్ ఫీ. ఆయనకదీ లాభం. మీరు కొనకపోతే ఆయనకి వచ్చే నష్టం ఏమీ లేదు.”

          “సారీ” అన్నాడు హరి.

          గీత లేచి వంటింట్లోకి వెళ్లింది కాఫీ పెట్టడానికి.

          బెన్నీ ప్చ్ అని చప్పరించి, “అంచేత ఈ ‘మనవాళ్లు’ స్పిరిటు నాలో చచ్చి పోయింది. సాధారణంగా మనవాళ్లెవరయినా పిలిస్తే వాళ్లని మరో అమెరికను ఏజంటుకి అప్పగించేస్తాను. నా దగ్గర ఇన్ని షోకులు పోయే ఈ మనవాళ్లు అమెరినుల దగ్గర పిల్లిపిల్లల కంటె అన్యాయం. ఇంత ఘోరంగా మాటాడుతున్నాడేమిటి అనుకోకండి. వాళ్ల శ్రమలాటిదే కదా నా శ్రమకూడా అని వాళ్లు అనుకోరు. అది చూస్తే నాకు మంట. మళ్లీ నెలనెలా భజనలకి మాత్రం హాజరు ఆ దామోదరంతో సహా. అందుకే నేను రాను అక్కడికి. ఎందుకొచ్చిన భజనలు చిత్తశుధ్ధిలేని శివపూజలు.”

          “అందరూ అలాగే ఉండరు కదండీ” అన్నాడు హరి నెమ్మదిగా.

          “ఆ మాటా నిజమేనండీ. వున్నారు వుత్తములు కూడా. మీరూ కలిసేరేమో, రూపా, సేనాపతీ, అలాగే ఉషా వర్మా, రామన్ దీపికా …. అందులో రూపా వాళ్లూ ఇంకో మెట్టు పైకి వెళ్లి, బిల్డరు నన్ను కమిషన్ తగ్గించుకోమంటే, వాళ్లు అడ్డుపడి నా కమిషను నాకు పూర్తిగా ఇప్పించేరు. అలాటి వారిని పొద్దున్నే తలుచుకుని దణ్ణం పెట్టుకుంటాను. కానీ దురదృష్టవశాత్తు నన్ను మట్టి కరిపించినవాళ్లే ఎక్కువ.”

          “మాకు అవన్నీ తెలియవులెండి. మేం మీతో మొదలుపెడితే మీ చేతుల మీదుగానే ఇంటివాళ్లం అవుతాం. నేను కూడా బిజినెస్ చేస్తున్నాను. వ్యాపారంలో నీతి ముఖ్యం అని నేను నమ్ముతాను,” అన్నాడు హరి.

          గీత కాఫీ, పకోడీలు తీసుకొచ్చింది.

          “కేవలం సందేహం తీర్చుకోడానికే అడుగుతున్నాను. అమెరికనులతో అలాటి బాధలుండవా?” అని అడిగింది గీత.

          “ఉంటారండీ వాళ్లలో కూడా. ఎటొచ్చీ వాళ్లు ‘మనం మనం’ అంటూ హరికథలు చెప్పరు కదా. బిజినెస్ అనే మొదలుపెడతారు. అటో ఇటో తేల్చేసుకుంటాం తేలిగ్గానే.”

          “సరేలెండి. చెప్పేను కదా మాతో మీకు అలాటి పేచీలుండవు. నాకంత ఓపిక కూడా లేదు.”

          “నేను కూడా మీరలాటివారు కారనే విన్నాను. అందుకే ఇంత దూరం వచ్చేను. మీరు సరేనంటే పని మొదలుపెడదాం. లేకపోతే ఇంత వరకూ నేను చెప్పిన హరికథకీ గీతగారి పకోడీలకీ చెల్లు. నా దారిన నేను పోతాను. మీరు మరో ఏజంటుని చూసుకోండి.”

          హరి గీతవేపు చూశాడు. ఇద్దరూ బెన్నీద్వారానే ఇల్లు కొనడానికి నిశ్చయించుకున్నారు. బెన్నీకి కూడా వీళ్లు తనచేత గడ్డి కరిపించరన్న నమ్మకం కుదిరింది.

          “సరే అయితే. ముందు అప్పిచ్చే వాడితో మాట్లాడాలి మీరు. మీకు ఎంత అప్పు పుడుతుందో మొదట్లోనే తెలుసుకోడం ముఖ్యం. నేను ఒక ఫోన్నెంబరు ఇస్తాను. ఈయనతోనే మాట్లాడాలనేం లేదు. మీకు ఇంకెవరైనా తెలిసిన లెండరుంటే వారితోనే మాట్లాడండి.” అంటూ ఒక నెంబరు ఇచ్చి, మళ్లీ ఫోను చేస్తానని చెప్పి బెన్నీ వెళ్లిపోయాడు.

          బెన్నీ ఇచ్చిన నెంబరుకి వెంటనే ఫోన్ చేశాడు హరి.

          “సాయంత్రం రావడానికి వీలవుతుందా? ఆరు గంటలకి రాగలరా? లేదంటే ఐయిదు అయినా సరే. ఈ లోపున నేను కొంత సమాచారం సేకరించి వుంచుతాను” అంటూ వివరాలు తీసుకున్నాడు లెండరు.

          ఆ సాయంత్రమే హరీ, గీతా లెండరుని కలుసుకున్నారు.

          అతను “మీ క్రెడిట్ రేటింగ్ బాగుందండీ” అని చెప్తూ, వాళ్లు చెప్పిన విషయాలన్నీ రాసుకుంటూ, “మీకు క్రెడిట్ కార్డులు ఎన్ని వున్నాయి?” అని అడిగాడు.

          “వుంటాయి పదో పన్నెండో. ఏ షాపుకి వెళ్లినా ఉచితంగా దానం చేసేవి అవే కదా.”

          “అవన్నీ కత్తిరించేయండి. లేకపోతే మీకు దొరికే అప్పు మొత్తం తగ్గిపోతుంది.”

          “వాటిమీద అప్పులేం లేవండి.”

          “లేకపోయినా, ప్రతికార్డుకీ ఇంత చొప్పున తగ్గించేస్తారు మీకు ఇవ్వబోయే అప్పులో,” అని సలహా ఇచ్చి, “మరొక సందేహం. మీరు ఎవరికో మూడు వేలు అప్పు ఇచ్చినట్టు కనిపిస్తోంది. అది మళ్లీ వసూలు చేసినట్టు లేదే” అన్నాడు.

          హరి ఆశ్చర్యపోయాడు. “అది చేబదులుగా ఇచ్చింది. నా పెర్సనల్ విషయం” అన్నాడు.

          లెండరు, “అవుననుకోండి. ఇక్కడ కనిపించింది కనక సెటిల్ చేసుకోడమే మంచిది. వాళ్లని అడగగలరా మీకు ఇప్పుడు అవసరం అని?” అన్నాడు ఆయన.

          హరి సరే మాట్లాడతానని చెప్పి, ఇంటికి వచ్చేశాడు. తరవాత టేషుకి ఫోను చేస్తే, “సుమతి అంతా అదోరకం. నేను వచ్చి చెక్కు ఇచ్చేస్తాలే. పది నిముషాల్లో వస్తాను,” అన్నాడు. 

          హరి మళ్లీ బెన్నీని పిలిచి తమకి ఎంత అప్పు పుట్టగలదో చెప్పేడు.

          “సరే ఆరేంజిలో మీకు కొన్ని ఇళ్లు చూపిస్తాను శనివారం వెళ్దాం ఇళ్లు చూడ్డానికి. అవి మీకు నచ్చకపోవచ్చు. కానీ మీకు ఎలాటి ఇల్లు నచ్చుతుందో నాకు ఒక అభిప్రాయం ఏర్పడుతుంది, తరవాత మీకు నచ్చగలవు అనుకున్నవి ఎంచుకుని చూపించగలను” అన్నాడు బెన్నీ. ఇంటి గురించి తెలుసుకోవలసిన విషయాలు – అసలు అమ్మేవాడికి ఆ యిల్లు అమ్మడానికి హక్కులున్నాయా, ఇంటి మీద ఎన్ని అప్పులున్నాయి, ఆ యిల్లు కట్టడం పటిష్టంగా వుందా వంటి విషయాలూ కూడా సందర్భానుసారం చెప్పుకుంటూ వచ్చేడు.

          అనుకున్న శనివారంనాడు పది గంటలకి బెన్నీ వచ్చి, హరినీ, గీతనీ తనకారులో ఎక్కించుకుని బయల్దేరారు ఇళ్లు చూడడానికి. హరికి పెద్ద ఇల్లు ఆధునికమయిన హంగులతో కావాలి. గీతకి చిన్నఇల్లయితే చాకిరీ తక్కువ, ప్రాణానికి హాయి అని వుంది.

          వాళ్లు ఇళ్లమీద చేస్తున్న వ్యాఖ్యలని బట్టి, “సరేనండీ. ఇప్పుడు నాకు కొంత అర్థం అయింది మీకు ఎలాటి ఇల్లు నచ్చగలదో. వచ్చేవారం మళ్లీ వెళ్దాం. అప్పుడు మీకు నచ్చగలవు అనుకున్నవి చూపిస్తాను” అన్నాడు బెన్నీ.

          మొత్తం మీద ఒక ఇంటి మీద ఇద్దరికీ ఏకాభిఫ్రాయం కుదిరింది. నెల తిరిగేసరికి ఇల్లు కొని గృహప్రవేశం చేసేరు.                                                                   

***

          ఇల్లు కొని యాడాది అయింది. గీత పనిచేస్తున్న బాంకులో పెద్ద మార్పులు వచ్చేయి భారీ ఎత్తున. ఇదంతా మీ మంచికే అంటూ ధైర్యం చెప్పేరు యజమానులు వుద్యోగస్థులకి. ఆ తరవాత మూడు వారాల్లో చాలా మందికి ఉద్వాసన చెప్పేరు రెండు వారాల జీతం చేతిలో పెట్టి. గీత ఉద్యోగం పోలేదు కానీ కిందిస్థాయికి దించి, తనపైన కొత్తగా డిగ్రీ పుచ్చుకు వచ్చిన యువకుడిని వేశారు. కొత్త బిచ్చగాడు పొద్దెరగడు అన్నట్టు అదిరిపడుతున్నాడు ఆ అబ్బాయి. ముందు మేనేజరు మంచీ చెడ్డా, ఆనూపానూ తెలిసిన అనుభవజ్ఞుడు. ఈ కుర్ర మేనేజరుకి రూళ్లు వల్లె వేయడం వచ్చు కానీ పని సాధించడం తెలీదు.

          గీతకి చిరాగ్గా వుంది. 

          హరి పరిస్థితి అందుకు పూర్తిగా వ్యతిరేకం. అతని కంపెనీ అంచెలంచెలుగా పెరిగిపోతోంది. దేశంలోనే కాక విదేశాల్లో కూడా కన్సల్టింగ్ చేస్తున్నాడు.

          అలాటి రోజుల్లోనే “మా కుర్రబాసుతో మాహా చిరాగ్గా వుంది.” అంది గీత ఓ రోజు.

          “వదిలెయ్. వెధవ్వుజ్జోగం,” అన్నాడు హరి కాయితాలు చూసుకుంటూ.

          గీతకి గట్టిగా తగిలింది “వెధవ్వుజ్జోగం” అన్న మాట. హరి అంత తేలిగ్గా తీసిపారేస్తాడు అనుకోలేదు ఇంత వరకూ. తనది పెద్ద వుద్యోగం కాకపోవచ్చు కానీ తనకి తృప్తినిస్తోంది. ఒక రకంగా గౌరవం తెచ్చిపెట్టింది. ఆఫీసులో అందరూ తనని ప్రత్యేకంగా చూస్తారు. కంప్యూటరులో ఎవరికి సమస్య వచ్చినా తను రిపేరు చేసిపెడుతోంది. అంతేకాక కీషాలాటి స్నేహితులు ఆవుజ్జోగం వల్లే దొరికారు. హరికి ఇది అర్థం కాలేదు అన్నసంగతి ఇప్పుడు అవగతమయింది గీతకి. మనసు విరిగింది. తను న్యూయార్క్ airportలో దిగిన రోజు గుర్తొచ్చింది. ‘ఈ దేశంలో నాకు నేనే దిక్కు’ అన్న భావనకి విత్తు పడింది ఆ క్షణంలో.

          వారం రోజులనాడు హరికి హాంకాంగు‌‌లో పెద్ద ప్రాజెక్టు వచ్చింది. గీతతో చెప్పేడు.

          “బాగుంది” అంది నిర్లిప్తంగా.

          “నీకు బాంకులో చిరాగ్గా వుంది అన్నావు కదా. హాంకాంగ్ వచ్చెయ్ నాతో” అన్నాడు.

          “అక్కడ నేనేం చేస్తాను? మీకేమో ఊపిరాడని పని” అంది నెమ్మదిగా.

          “ఏం చెయ్యక్కర్లేదు. నువ్వు చెయ్యకపోతే జరగదేమిటి? అక్కడ నీలాటి ‘వైఫులు’ చాలామందే వుంటారు. ఏవో కాలక్షేపాలు వుంటాయి” అన్నాడు.

          గీత మాట్లాడకుండా అక్కడినించి లేచి వెళ్లి పోయింది. గీతకి ఎంత ఆలోచించినా ఏం చెయ్యాలో తోచడంలేదు. బాధగా అనిపించినా హరి మాటల్లో కొంత నిజం లేకపోలేదు. అతనితో వెళ్తే మరో దేశం చూసినట్టుంటుంది కదా. కానీ ఇక్కడ వుద్యోగంతో తాను పొందుతున్న తృప్తిని అంత తేలిగ్గా వదిలేసుకోగలదా? కొత్త సూపర్వైజరుని తలుచుకుంటే వెళ్లిపోవాలనిపిస్తోంది. పోనీ సరోజకి ఉత్తరం రాస్తేనో … తను మాత్రం ఏం చెప్తుంది? ‘నీకు ఏది బాగుంటే అదే చెయ్యి’ అంటుంది. నిజానికి గేంషో కథ చెప్పినప్పుడే చెప్పేసింది  .. యేతావాతా నిర్ణయించుకోవలసింది తనే అని.

          మర్నాడు “ఇప్పుడు కాదులెండి తరవాత చూద్దాం. ఇప్పటికి మీరు వెళ్లిరండి” అంది.

          “సరే, నీ యిష్టం” అన్నాడు హరి.

          హరి వెళ్లిపోయేక, గీత మళ్లీ తన పనిలో పడిపోయింది.

          వారం రోజులయింది. కొంచెంసేపు ఏదో పుస్తకం చదువుకుని పడుకోబోతూంటే ఫోనొచ్చింది. హాంకాంగ్‌నించి హరి చేసాడు.

          “ఓహ్, వాహ్, గీతా, గీతా, guess what, great news, amazing. Struck a million dollar deal!” అంటూ గబగబా, హుషారుగా, హడావుడిగా, ఆనందాతిరేకాలతో అరిచేడు ఫోనులోనే.

          “గ్రేట్. కంగ్రాట్స్” అంది గీత కూడా సంతోషంగా. హరి పడ్డ పాట్లకి ఫలం కనిపించిందని సంతోషించింది.

          “మరి ఎప్పుడు తిరిగి వస్తున్నారు?” అని అడుగుతుండగానే లైను కట్టయిపోయింది. జవాబు లేదు. హరి మళ్లీ ఫోను చేస్తాడేమో అని చాలాసేపు చూసింది. కాని మళ్లీ ఫోను మోగలేదు. తనే చేస్తే ఎంగేజిడు. రెండుసార్లు చేసి చూసి, సరే స్నేహితులందరికీ శుభవార్త చెప్తున్నాడు కాబోలు అనుకుంది.

          చాలాసేపు ఆలోచిస్తూ పడుకుంది – హరి కానీ మరొకరు కానీ అమ్మా, నాన్నా, ఇల్లూ, వాకిలీ, పాడీ పంటా, తోబుట్టువులూ, స్నేహితులూ -అందర్నీ, అన్నిటినీ వదులుకుని ఇక్కడికి రావడం ఇందుకే కదా. తమ కలలు పండించుకోడానికే. పాపం నానా అవస్థలూ పడ్డాడు ఇలాటి డీలుకోసం. ఇదే ఇండియాలో వుంటే ఇలాటి అవకాశం రావడానికి, ఈ స్థాయి చేరుకోడానికి సప్తజన్మలెత్తాలి.

          తెల్లవారుఝామున చిన్న కునుకు పట్టింది. ఇంతలో ఎవరో తలుపు తట్టేరు. ఇంత రాత్రివేళ ఎవరై వుంటారా అనుకుంటూ తలుపు తీసింది.

          ఎదురుగా హరి సహోద్యోగి థాంప్సన్ నిలబడి వున్నాడు. అతని మొహం చూస్తూనే గీత గుండెల్లో చిన్నవణుకు ప్రారంభమయింది. కాళ్లలో సత్తువ హరించుకు పోయింది. తలుపు గట్టిగా పట్టుకుంది.

          “మే ఐ కమిన్” అంటూ ఆయన లోపలికి అడుగేసి, గీత చెయ్యి పుచ్చుకుని నడిపిస్తూ సోఫా దగ్గరికి తీసుకొచ్చేడు. గీత సోఫాలో కూలబడింది.

          “హరి చాలా మంచివాడు. అపారమయిన తెలివితేటలు గలవాడు” అన్నడు థాంప్సన్.

          “ఏం జరిగింది?” అంది గీత నూతిలోంచి మాటాడుతున్నట్టు.

          “హార్ట్ ఎటాక్.”

          “అసలేం జరిగింది?”

          “హార్ట్ ఎటాక్. క్షణాల మీద ప్రాణం పోయింది.”

          తరవాత నెమ్మదిగా వివరాలు చెప్పేడు. ముందు రోజు ఫోనులో మాట్లాడుతూ పడిపోయాడు. చాలాసేపటి వరకూ ఎవరూ చూడలేదు. చూసేసరికి ప్రాణం పోయింది. తాను సాధించిన ఘన విజయం, ఆ ఆనందంలో పుచ్చుకున్న షాంపేనూ కలిసి అతనికి ప్రాణాంతకం అయేయిట.

          “మీ వాళ్లెవరైనా వున్నారా ఇక్కడ?” అని అడిగాడు థాంప్సన్. తపతినెంబరిచ్చింది గీత.

          తపతి సంగతి విన్న వెంటనే బయల్దేరి వస్తున్నానని చెప్పి ఫోను పెట్టేసింది. తరవాత చిత్రని వాళ్ల అమ్మగారి దగ్గర వదిలి వచ్చింది. మామయ్య రమణని పిలిస్తే ఆన్సరింగు మెషినొచ్చింది.

          తపతి వచ్చే వరకూ వుండి ధాంప్సన్ వెళ్లిపోయాడు. వెళ్లే ముందు కంపెనీలో హరికి రావలసిన మొత్తం లెక్కలు కనుక్కుని చెప్తానన్నాడు. గీత తలూపింది.

          పదిగంటలయ్యే సరికి ఊళ్లో చాలా మందికి తెలిసింది. పన్నెండయ్యే సరికి ఇంటినిండా జనం. కొందరు ఏవో వంటకాలు చేసి తీసుకొచ్చారు. ఇండియాకి ఫోను చేసారు.

          తరవాత ఏం చెయ్యాలి? గీతకి ఎవరు సాయం వుంటారు? ఇండియానించి ఎవరైనా వస్తారా? హరి విల్లు ఏమైనా రాశాడా? ఆస్తి వ్యవహారాలు గీతకి ఏమైనా తెలుసా? గీతకి ముందెలా జరుగుతుంది? ఇక్కడే వుంటుందా? ఇండియా వెళ్లిపోతుందా?

          ప్రశ్నలు … ప్రశ్నలు .., ప్రశ్నలు ..

          హాల్లో కూర్చుని అందరూ తలో సలహా ఇస్తున్నారు. సలహాలు పుచ్చుకోడానికి గీత అక్కడ లేదు. మంచం మీద కూర్చుంది తలుపులేసుకుని. మనసంతా శూన్యంగా వుంది. ఇంత కాలం గడిచి పోయింది రేపెలా అన్న ప్రశ్న లేకుండా. ఇప్పుడు హఠాత్తుగా క్షణాల మీద మొత్తం బతుకు కుప్పకూలి పోయింది ఇసకమేడలా. క్షణంలో సగం సేపు పట్టలేదు. కాలమేఘాలు కమ్ముకొచ్చేశాయి. చుట్టూ గాఢాంధకారం.

          రేపెలా గడుస్తుంది అని కాదు తన బాధ. ఇప్పటికిప్పుడు అర్జంటుగా తనకి కావలసింది ‘ఎందుకిలా జరిగింద’న్న ప్రశ్నకి సమాధానం. ఎవరు చెప్పగలరు? మనసులో ఒక మూల ఆయన మాటవిని ఆయనతో వెళ్లివుంటే బాగుండేదేమో అని కూడా అనిపించింది. కానీ అది తనకేమీ ఉపశమనం కలిగించడం లేదు. … 

          ముందు గదిలో చేరినవారందరినీ పంపించేసి, తపతి వచ్చి పక్కన కూర్చుంది. గీత వెర్రిగా తపతి వేపు చూసి, ఆమె వొడిలో వాలి, నిశ్శబ్దంగా కుమిలిపో సాగింది.

          మర్నాటికి కొన్నివిషయాలు అవగతమయ్యేయి. ఇండియానించి రాగల వారెవరూ లేరు. తల్లి లేదు .తండ్రి పెద్దవాడయిపోయాడు. ప్రయాణంచేసే స్థితిలో లేరాయన. అన్నకి శలవు లేదు. చెల్లెలు సంసారం వదిలి రాలేదు. అత్తగారు, “నేనేం చెయ్యగలను. నాకేం తెలుసు. ఇక్కడే కాశీకెళ్లి తిలోదకాలు విడుస్తాను” అంది.

          రెండో రోజు హరికాయం హాంకాంగ్‌నించి వచ్చింది. హనుమయ్యగారూ, మాధవూ, పూనుకుని దహనం చేయించేరు. వాళ్ల సలహాలన్నిటికీ తలూపింది గీత.

***

          ఈతంతులన్నీ ముగిసేసరికి వారం రోజులు పట్టింది. గీతకి ఇంట్లో వుండడం కష్టంగా వుంది. తపతి అక్కడే వుంది పది రోజులు. వూళ్లో తెలుగు వాళ్లు రోజూ వచ్చి కాస్సేపు కూర్చుని వెళ్తున్నారు. ఏపూటకాపూట భోజనాలు తెస్తున్నారు. ఇందరి మధ్య గీతకి ఏకాంతం లేదు. అభిమానాలు చూపించుకోడానికి ఇంత విషాదం కావాలా అనిపిస్తోంది. అంత కంటే అసలయిన విషాదం తనే వీరందరికీ దూరంగా వుంటూరావడం. ఇప్పుడు మాత్రం వీరందరూ చూపే అభిమానం నుండి తప్పుకునే మార్గం కనిపించడం లేదు. అది మరీ బాధగా వుంది. తనకి కావలసింది వారిచ్చే ఓదార్పు కాదు. తనకి కావలసిందేమిటో, అది చెప్పడం ఎలాగో గీతకి తెలీడంలేదు. తపతితో ఆ మాటే అంది.

          “నువ్వు మళ్లీ ఆఫీసుకి రాకూడదూ?” అంది. ఇప్పటికే బోలెడు శలవులయిపోయేయి ఇండియా వెళ్లిరావడానికి, 

          గీత మేనేజరుని పిలిచి వస్తున్నానని చెప్పి, వెళ్లింది. తొలిరోజు ఆఫీసులో అడుగెట్టగానే అందరూ సానుభూతి చెప్పేరు. గీత బల్లమీద పెద్ద పువ్వులగుత్తి పెట్టేరు. ఏ మాత్రం పరిచయం లేనివారు కూడా ఓమారు తనబల్ల దగ్గర ఆగి, I’m so sorry అంటుంటే గీతకి ఏమిటో ఎబ్బెట్టుగా వుంది.

          ఆ తరవాత డబ్బు వ్యవహారాలు మొదలయ్యేయి. హరికంపెనీవాళ్లు దివాలా తీశాం అని ప్రకటించేరు. ఇంటికొచ్చి ఇన్ని కబుర్లు చెప్పిన థాంప్సన్ అయిపులేడు. మాధవు కోర్టుకి ఎక్కుదాం అన్నాడు. కానీ, హనుమయ్యగారు అది మంచిదికాదని వారించేరు. పెద్ద కంపెనీలతో పేచీ పొట్టేలు కొండతో ఢీకొనడం వంటిది అన్నారు. హరి రాబడి హుష్ కాకీ అన్నంత తేలిగ్గా ఎగిరిపోయింది. బాంకులో తన అంతంత మాత్రం. రోజు గడుపుకోవచ్చు కానీ ఇంత ఇల్లు భరించడం మాత్రం అయ్యేపని కాదు.

          గీత బెన్నీని పిలిచి ఈ ఇల్లు అమ్మేసి చిన్న ఇంట్లోకి మారే మార్గం చూపించమని అడిగింది. ఆయన కూడా జరిగినదానికి నొచ్చుకుని, తనకి చేతనయిన సాయం చేస్తానని మాటిచ్చాడు.

          “నిజం చెప్తున్నాను. ఇల్లు కొని ఏడాది కూడా కాలేదు. మీకు నష్టం రాకుండా అమ్మడానికి ప్రయత్నిస్తాను. లాభం వస్తుందనుకోను.” అన్నాడు బెన్నీ.

          “సరే. ఎలా వీలయితే అలా చెయ్యండి” అంది గీత, కాయితాల మీద సంతకాలు పెట్టి.

          క్రమంగా చాలా మంది రావడం తగ్గించేసినా, భాగ్యంగారు మాత్రం అప్పడప్పుడు వచ్చి కొంచెంసేపు కూర్చుని వెళ్తున్నారు. గీత భజనకి రాదని, ఆవిడే ప్రసాదం తెచ్చి ఇస్తున్నారు.

          “కాస్త మనశ్శాంతిగా వుంటుంది. ఒక్కసారి వచ్చి చూడండి భజనకి,” అన్నారావిడ ఓ రోజు.

          గీత ఇబ్బందిగా మొహం పెట్టి, “చెప్పేను కదండీ. నాకు బాబామీద నమ్మకం లేదు. నన్ను ఒదిలేయండి” అంది.

          “బాబా అనే అనుకోకండి. ఏదేవుడేనా ఒకటే కదా. భజన పాటలు అందరు దేవుళ్ల గురించీను. మనసుకి కాస్త ఊరట. మార్పుగా కూడా వుంటుంది. ఇలా ఒక్కరూ వుంటే మనసుకి ఇంకా బాధ,” అన్నారావిడ.

          గీత సరేలెండి అంది కాదనే ఓపిక లేక.

          ఆదివారం రెండు గంటలకి అని చెప్పారావిడ. గీత కాస్త ఆలస్యంగా వెళ్లి అందరికంటే వెనక కూర్చుంది. భజన అయిపోగానే ఒకరిద్దరు పలకరించారు. గీత ముక్తసరిగా సమాధానాలు చెప్పి, వెళ్లొస్తానని భాగ్యంగారికి చెప్పి బయల్దేరబోతుంటే, ఓ మూడేళ్ల పాప గీత దగ్గరికి వచ్చింది చేతులు చాచి ఎత్తుకోమంటూ.

          గీత చిన్నగా నవ్వి, పాపని ఎత్తుకుని, చుట్టూ చూసింది.

          అచల వచ్చి, హాయ్ ఆంటీ అంటూ పాపని తీసుకుంది.

          “మీ పాపా?” అనడిగింది గీత ఆశ్చర్యపోతూ. అచలకి పిల్లలున్నారని అనుకోలేదు ముందు చూసినప్పుడు.

          “అవును ఆంటీ. ఇండియాలో మా అమ్మవద్ద వుండింది. ఇప్పుడే తీసుకొచ్చుకున్నాం” అంది.

          “మీరు మా పిన్నిలా వుంటారు కొంచెం. పాపకి ఆమెవద్ద బాగా అలవాటు. అంచేత మీ దగ్గరకొచ్చింది” అంది అచల.

          గీత నవ్వి, పాపని రెండు నిముషాలు ఎత్తుకుని అచలతో మాట్లాడి ఇంటి కొచ్చేసింది.

          నాలుగు రోజులు పోయేక, ఓ సాయంత్రం అచల పాపని తీసుకుని వచ్చింది. వస్తూ వస్తూ నాలుగు పుస్తకాలు తెచ్చింది. భగవద్గీత, ఉపనిషత్సారం, వేదసారం …

          గీత “చూస్తాలెండి, సాధారణంగా నాకిలాటివి చదవాలనిపించదు” అని, పాపవేపు తిరిగి, “నీ పేరేమిటి?” అని అడిగింది.

          “గగన” అంది ముద్దుగా పాప, రెండు చేతులూ చాచి ఆకాశం చూపుతూ.

          “బాగుంది పేరు. ఆకాశం అంత ఎత్తుకి ఎదిగిపోతుందనా అర్థం?” అంది గీత.

          “చూస్తున్నారు కదా ఆంటీ. ఒక్క క్షణం నేలమీద నిలవదు కాలు.  సిసింద్రీ.” అంది అచల.

          “పుట్టగానే తెలిసిందేమిటి సిసింద్రీ అవుతుందని.”

          “పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది కదా ఆంటీ. లేకపోతే పేరు ఎలాగా పెట్టేరు కదా, నిలబెట్టుకుందాం అని అలా ఎగిరిపడుతుంటుందేమో..”

          “అద్సరే గానీ ఈ పుస్తకాలు ఇప్పుడు వద్దు. నేనిప్పుడేం చదివే మూడ్‌లో లేను. కావలిసినప్పుడు నేనే అడుగుతాను. మీ దగ్గరే వుండనీండి” అంది గీత.

          అచల ఒప్పుకోలేదు. “మీరు చదివితీరాల్సిందే ఆంటీ. లేకపోతే ఈ సిసింద్రీని ఇక్కడ వదిలేసి పోతాను. అప్పుడు మీరే నన్ను వెతుక్కుంటూ రావాల్సి వస్తుంది” అంది.

          గీతకి కనిపించిన పుస్తకమల్లా చదివే అలవాటు లేదు. స్పీడురీడింగు అసలే లేదు. రోజుకి యాభై పేజీలు చదివితే గొప్ప. ఒక వాక్యం చదివి దాన్నిగురించి ఆలోచిస్తూ పది నిముషాలు గడుపుతుంది.

          ఆఖరికి ఆచల పోరుపడలేక ఓ సాములారి పుస్తకం తీసుకు చదివింది. అతి సామాన్యమయిన విషయాలే. మన దేశంలో కూరగాయల మనిషికి కూడా వుంటుంది ఆ పాటి పరిజ్ఞానం. గీతకి అర్థం కానిది అచలకి ఈ పుస్తకాల మీద అంత ఆశక్తి ఎలా ఏర్పడిందా అని. ఆ మాటే అడిగింది ఓ రోజు.

          “మాయింట్లో మా అమ్మకీ నాన్నకీ నమ్మకాలు లేవు. అంచేత మేం ఏ నమ్మకాలూ, పూజలూ లేకుండానే పెరిగాం. ఇక్కడికి వచ్చిన తరవాత నాకు పెద్ద కష్టం వచ్చేసింది. ప్రతివారూ మనదేశం, మనమతం, మన ఆచారాలూ గురించి అడుగుతారు. పిడుక్కీ బియ్యానికీ ఒకటే మంత్రం అనీ సరదా కబుర్లయినా అదే, పెద్ద చర్చయినా అదే. నాకు తెలీదంటే ఎలా చూస్తారో చెప్పక్కర్లేదు కదా. మీరూ చూసేవుంటారు భాగ్యంగారింట్లో భజనలకి వస్తారు ఫ్రాంక్లిన్ అని అమెరికన్. ఆయనకి హిందూమతం గురించి తెలిసింది చూస్తే నాకు తల తిరిగిపోయింది. నాడీ మండలం, సహస్రార పద్మం, ఆత్మబోధ అంటూ గుక్క తిప్పుకోకుండా మూడుగంటలు ఉపన్యాసం ఇవ్వగలరాయన. ఆ అవమానం భరించలేక నేను కూడా పుస్తకాలు చదివేసి తెలిసేసుకోవాలి అని నిశ్చయించేసు కున్నాను” అంది అచల.

          గీత నవ్వింది. “బాగుంది. కారణం ఏదయినా జ్ఞాన సముపార్జన మంచిదే.”

          “అంతే కాదు. కిందటేడు నాకొక కేరళ అమ్మాయి కనిపించింది. పన్నెండేళ్ల వరకూ ఇండియాలోనే పెరిగిందిట. మేం కలుసుకున్న మొదటి రోజున మామూలుగానే మొదలెట్టేం ఏవూరంటే ఏవూరంటూ. మా అమ్మా, నాన్నా ఇక్కడికి వచ్చినప్పుడు నాకు ఏడాది కూడా నిండలేదు. అయినా నాకు ఆంధ్రప్రదేశ్ ఒక రాష్ట్రం అని తెలుసు. మరి నేను కేరళ అంటే ఆ అమ్మాయి ఏమందో తెలుసా?”

          “ఢిల్లీ పక్కనా అని అడిగిందా?”

          “అలా అన్నా బాగుండు. ‘ఏదో చిన్నవూరు కాబోలు, ఎప్పుడూ వినలేదు’ అంది. అంచేత నేనిప్పుడు అడిగినవాళ్లకీ అడగనివాళ్లకీ కేరళ ఒక రాష్ట్రం అనీ, అక్కడ చాలా మంది చదువుకున్నవాళ్లు వున్నారనీ చెప్పేస్తూంటాను.”

          “బాగుంది కథ. నాకు నాడీమండలం అవీ తెలీవు కానీ ఈ పుస్తకాల్లో వున్నపాటి తెలుసు. నా చిన్నప్పుడు మా అమ్మతో పురాణకాలక్షేపాలకి వెళ్తూండేదాన్ని. అంచేత నన్ను ఈ పుస్తకాలు చదవమని పోరు పెట్టకండి” అంది గీత.

          అచల నవ్వేసి, “సరేలెండి ఆంటీ” అని వెళ్లిపోయింది. కానీ అప్పడప్పుడు రావడం మానలేదు. క్రమంగా పాపకి గీత దగ్గర బాగా అలవాటయింది.

          ఒకసారి గీతని అడిగింది శనివారం తాను ఎక్కడికో వెళ్లాలనీ, బేబీసిటర్ దొరకలేదనీ, “పాపని మీ దగ్గర వదిలిపెట్టనా ఒక్కపూట” అని.

          గీత సరేనంది.

          “ఆంటీని ఊరికే ఊదర పెట్టకు,” అని చెప్పింది అచల పాపతో.

          “నా దగ్గర అల్లరి చెయ్యదులెండి”

          “అవునాంటీ. నా మొహంమీదే రాసుంది ‘బాదర్ మీ’ అని తాటికాయలంత అక్షరాలతో”.

          అచల వెళ్లిపోయిన తరవాత, గీతకి ఏం చెయ్యాలో తోచలేదు. కార్టూనులు చూస్తుందేమోనని టీవీ పెట్టింది. కానీ గగనకి టీవీ చూస్తూ కూర్చునేంత స్థిమితం లేదు. నిప్పులు తొక్కినట్టు ఇల్లంతా దాట్లేస్తూ గీతని క్షణం కూర్చోనివ్వలేదు. ఆడు కుంటుందేమోనని అచల తెచ్చిన బొమ్మలు ఇచ్చింది కానీ ఏ ఒక్క ఆటవస్తువుతోనూ అయిదు నిముషాలు కూడా ఆడుకోలేదు ఆ పిల్ల. నాలుగు కాయితాలూ, రంగుపెన్సిళ్లూ ఆ పిల్లముందు పడేసింది. నాలుగు గీతలు గియ్యడం, ఇదేమిటి, అదేమిటి అంటూ గీతని అడగడం.

          రెండు గంటలయ్యేసరికి గీతకి నీరసం వచ్చింది. ఇండియాలో తన చిన్నతనం గుర్తొచ్చింది. తెల్లారి లేస్తే పొద్దు పోయే వరకూ తను ఎక్కడుందో కూడా తెలిసేది కాదు అమ్మకి. కొబ్బరాకులతోనూ కాగితప్పడవలతోనూ గంటల తరబడి ఆడుకోగలిగింది. ఇప్పుడు ఈ పిల్లలు? 

          ఆలోచిస్తూండగా, గగన వచ్చి తనఒళ్లోకి వాలి, మొహంలో మొహం పెట్టి కొంటెగా చూడసాగింది.

          గీత చిన్నగా నవ్వుతూ, పాప రెండు చెంపలూ తనచేతిలోకి తీసుకుని “ఎందుకలా అల్లరి చేస్తావు?” అని అడిగింది.

          పాప కళ్లు చికిలించి, “నాకు అదే బాంతుంది” అనేసి, గీత చేతులు తోసేసి, గదిలో గిరగిర తిరగడం మొదలెట్టింది బొంగరంలా.

          గీత నవ్వుకుంది, “నిజమే. ఎవరేనా అంతే కదా,”

***

          హరిలేని జీవితానికి అలవాటు పడుతోంది గీత క్రమేణా. తనని ఓదార్చడానికి వచ్చేవారి సంఖ్య కూడా తగ్గుముఖం పట్టింది. 

          తపతి ఓరోజు మాటల్లో “నా స్నేహితురాలు హాలీ అని ఇది వరకు మాడిసన్‌లో వుండేది. శనివారం మా యింటికి వస్తోంది.” అంది గీతతో.

          “ఎక్కడినించి?”

          “వాషింగ్టన్‌‌నించి, నువ్వు కూడా రా. కలుద్దువుగానీ. ఆవిడకి మనసంస్కృతి అంటే చాలా అభిమానం.”

          “సరే ఆదివారం వస్తాను.”

          ఆదివారం గీత వచ్చే వేళకి, హాలీ, తపతీ పెరట్లో చెట్టు కింద కూర్చుని వున్నారు.

          “హాలీ మధురలో మూడేళ్లు గడిపింది. ఆవిడ పీహెచ్‌డీ విషయం కర్మ. తమిళం చక్కగా మాట్లాడుతుంది,” అంది తపతి ఆవిడని పరిచయం చేస్తూ.

          హాలీ నవ్వింది, “హా, చక్కగా మాట్లాడడం, తపతికి హాస్యంగా వుంది” అంది తేలిగ్గా.

          గీత హాలీవేపు చూసింది. కాలంలో బాగానే వుండి వుండాలి, ఇప్పుడు మాత్రం ఎముకలగూడులా వుంది, గట్టిగా గాలేస్తే తూలిపడుతుందేమో అన్నట్టు. తలకి స్కార్ఫ్ చుట్టుకుంది. ఓపిక తెచ్చుకుని మాట్లాడుతోంది. కాని తను జాలి పడుతునట్టు కనిపిస్తే బాగుండదు. మామూలుగా వున్నట్టు కనిపించడానికి అవస్థ పడుతోంది. తపతి మాత్రం మామూలుగానే మాట్లాడుతోంది. తనకి ఎలా సాధ్యం అయిందో మరి. బహుశా వారి మధ్య అనుబంధం అలాటిదేమో.

          గీత పడుతున్న అవస్థ హాలీ గమనించనట్టు తనమానాన తను మాట్లాడసాగింది. గీతకి అమెరికా ఎలా వుందని అడిగింది. ఇండియాలో ఎక్కడి నుంచి వచ్చేరని అడిగింది. మీరిద్దరూ ఎలా కలిసారని అడిగింది.

          తరవాత తన ఇండియా అనుభవాలు చెప్పసాగింది. “మీనాక్షీ దేవాలయంలో బ్రాహ్మణులకి తప్ప ప్రవేశం లేదు. నాకు అది తమాషాగా అనిపించింది.”

          “ఎందుకు? దాదాపు అన్ని దేవాలయాల్లో అది మామూలే,” అంది గీత.

          “అక్కడే కదా మధ్వాచార్యుల వారు గుడిగోపురం ఎక్కి గాయత్రీ మంత్రం, కులమత ప్రమేయాలు లేకుండా, సకల జనులకీ వినిపించేలా గానం చేసింది. ఆయన ఉపదేశ సమయంలో వారి గురువు గాయత్రీ మంత్రానికి బ్రాహ్మణులు మాత్రమే అర్హులనీ, శాస్త్రవిదుల నుండి మాత్రమే పొందాలనీ చెప్పేరుట, మధ్వాచార్యులు ‘ఈ మంత్రం బ్రాహ్మణేతరులకి ఇచ్చినందున నేను నరకానికి పోవలసి వస్తే అది నాకు సమ్మతమే’ అని గుడి గోపురం ఎక్కి సకల జనులకూ వినిపించేరుట. అలాటిది మరి ఆ గుడిలోనే అబ్రాహ్మణులకి ప్రవేశం లేదంటే ఆయన ఉపదేశాలను వారు గౌరవించలేదనే కదా అర్థం.”

          హాలీ కొంచెం ఆగి, ఓగుక్క నీళ్లు తాగి, మళ్లీ మొదలు పెట్టింది. “తిరపతి వెళ్లినప్పుడు మొదటిసారి అంతే అయింది. రెండోసారి వేళ్లే వేళకి రూల్సు మారిపోయేయి.  ‘తిరపతి దేవుడు దేవుడు కాడు అని నేను అనను’ అని రాసిస్తే చాలు, లోపలికి రానిస్తాం అన్నారు. అంటే ఈ ఆంక్షలు శిలా శాసనాలు కావనీ, ఏ ఆచార్యులో, స్వాములో తమకి తోచినట్టు మార్చుతారనీ తెలుస్తోంది.”

          గీతకి ఆవిడ వాదన కంటే ఆవిడకి ఈ సాంప్రదాయాల్లో గల ఆసక్తి ఆశ్చర్యంగా అనిపించింది.

          “మీ రిసెర్చి కర్మ మీదట కదా. ఏమని సిద్ధాంతీకరించేరు?”

          “ఇదమిత్థంగా నేనేమీ సిద్ధాంతాలు చెయ్యలేదు ఆ విషయంలో. మేం ఎంత చదివినా, ఎంత ప్రయత్నించినా బయటి వాళ్లమే కదా. మీకు అర్థమయినట్టు మాకు అర్థం అవడం సాధ్యం కాదు.”

          “అదేనా మీ సిద్ధాంతం?”

          “కాదు. మీరు ‘కర్మ’ అన్న పదాన్ని యే యే సందర్భాల్లో ఎన్ని విధాలుగా వాడుతున్నారో తరిచి చూడడానికి ప్రయత్నించేను. అంతే.”

          “అవుననుకోండి. కానీ మీరు ఏదో ఒక అభిప్రాయానికి రావాలి కదా.”

          హాలీ నవ్వింది. “ఏకటీక లేదని అర్థమయింది. అంతే. వ్యక్తిని బట్టీ, సమయాన్ని బట్టీ, సందర్భాన్నిబట్టి అనేక విధాల అన్వయించుకుంటున్నారు ఆ పదాన్ని. ఆ సౌకర్యం వుండబట్టే ఆ పదం అంత ప్రాచుర్యంలోకి వచ్చి వుండొచ్చు. ఈ రోజు నేను ఇక్కడ మీతో కూర్చోడం నా కర్మ, నా కాన్సర్ కూడా నా కర్మే. కానీ ఈ రెండు సందర్భాలలోనూ రెండు రకాల అర్థాలు స్ఫురిస్తాయి కదా. నేను ఇక్కడికి రావాలని పని గట్టుకు వచ్చేను. అందులో నా సంకల్పం వుంది. నాకు కాన్సర్ రావడంలో నా సంకల్పం లేదు. ఇంకా ఆలోచిస్తే నాకు ఇక్కడికి రావాలనిపించడం కూడా కర్మవల్లనేనేమో. పూర్వ జన్మలో మీరు నాకు బంధువులయి వుండాలి,” హాలీ చిన్నగా నవ్వింది.

          గీత ఆశ్చర్యానికి అంతు లేదు. ఈ హాలీ మాటలు వింటుంటే ఈ విడకి మన మతంలో ఇంత ఆసక్తి ఎలా వచ్చిందా అని.

          తపతి మౌనంగా వాళ్ల సంభాషణ వింటూ కూర్చుంది.

          “మీకు పూర్వ జన్మలో నమ్మకం వుందా?”

          “నమ్మకం అని గట్టిగా చెప్పలేను కానీ ఏదో ఒక శక్తి మనని నడిపిస్తూ వుండి వుండాలి. నాకు ఈ బుద్ధి ఎందుకు పుట్టిందో చెప్పలేం కనక. నేను మధురలో వున్నప్పుడు, ఆ గుడి వెనక ఒక జ్యోతిష్కుడు వుండేవారు. ఆయన గతాగతాలను ఖచ్చితంగా చెప్పగలరని చాలా మంది నమ్ముతారు. ఒకసారి వెళ్లేను ఆయనతో మాట్లాడడానికి. నేను పూర్వ జన్మలో ఆ ఆలయంలోనే  దేవదాసిని అనీ, అందుచేతనే నాకు అక్కడికి తిరిగి రావాలన్న కోరిక కలిగిందనీ అన్నారాయన.”

          “మీకూ అలాగే అనిపిస్తోందా?”

          “మరొక రకంగా చెప్తాను. ఆ మాట నాకు మనశ్శాంతినిచ్చింది. సైన్సు ప్రతి సంఘటనకీ, ప్రతి వస్తువుయొక్క పరివర్తనకీ కారణాలు చెప్పలేనంత కాలం మనం మరొక శక్తి వుందని ఒప్పుకోక తప్పదు ఏ పేరు పెట్టి పిలిచినా. నేను ఇక్కడికి రావడానికి కారణం తపతి సౌజన్యం అనుకుంటే, ఆవిడ సౌజన్యానికి కారణం తనకి అనుభవమయిన మరొక సంఘటన అవ్వాలి. ఆ సంఘటనకి కారణం మరొక అనుభవం. .. ఇలా తవ్వుకుంటూ పోతే నిజంగా ఎక్కడ మొదలు అన్నదానికి సమాధానం లేదు తలకావేరిలా.”

          “మీరు చూశారా తలకావేరి?”

          “అదే చెపుతున్నా. కావేరీనది పుట్టిన స్థలం అని ఒక స్థలం చూపిస్తారు. కాని ఆ స్థలంలోకి నీరు ఎలా వచ్చిందన్నదానికి సమాధానం లేదు కదా,” హాలీ తల అడ్డంగా వూపింది నిస్పృహతో.

          తపతి లేచింది, “భోజనం తీసుకొస్తాను” అంటూ.

          “నా భోజనం ఫ్రిజ్‌లో ఎడమవేపు వెనక్కి పెట్టేను. కొంచెం వేడి చేస్తే చాలు” అని తపతితో చెప్పి గీతవేపు తిరిగి, “నేను చాలా కాలం వెజిటేరియనునే. ఈ మధ్య డాక్టరు మీటు తినాలన్నాడు ప్రొటీను చాలడంలేదని.” అంది క్షమాపణగా.

          “దానికేముంది లెండి. ఇప్పుడు అందరికీ ఏమిటి తింటాం అన్నది వ్యక్తిగతం అయిపోయింది. కనీసం ఈ విషయంలో కులధర్మాల పట్టింపులు రూపుమాసినందుకు సంతోషించాలి” అంది గీత.

          భోజనాలయిన తరవాత, హాలీ తపతిని భగవద్గీతలో ఒక అధ్యాయం చదవమని అడిగింది.

          తపతి గిన్నెలూ, పళ్లేలూ తీస్తుంటే, గీత కూడా రెండు గిన్నెలు అందుకుంది. ఇద్దరూ అవి లోపల పెట్టి తిరిగి వచ్చేరు. తపతి భగవద్గీత తీసి, “ఏ అధ్యాయం?” అని అడిగింది హాలీని.

          “మీ ఇష్టం.”

          తపతి పురుషోత్తమ యోగం చదువుతుంటే, హాలీ పద్మాసనం వేసి, కళ్లు మూసుకుని, ధ్యాన ముద్రలో కూర్చుంది.

          గీతకి పట్టలేని ఆశ్చర్యంగా వుంది వారిద్దరినీ చూస్తుంటే. తపతి పరిచయం అయి ఇంత కాలం అయినా ఆమెలో ఈ కోణం తను మునుపెన్నడూ చూడనేలేదు. మనం ఒకరిని తెలుసు అనుకుంటాం కానీ, మనకి తెలీని కోణాలు ఇంకా ఎన్నో అనిపించింది ఆ క్షణంలో.

          తపతీ, హాలీ కలిసి ఆపూట సృష్టించిన వాతావరణంలో గీత పరవశించి పోయింది.

***

          హాలీ వచ్చి వెళ్లిన తరవాత తపతిలో ఏదో మార్పు కనిపించింది గీతకి. పిలుపులు తగ్గి పోయాయి. పట్టి చూస్తే నీరసించినట్టు కనిపిస్తోంది. మరుపూ, చెరుపూ కూడా.

          “ఏం అలా వున్నావు? ఒంట్లో బాగులేదా?” అని అడిగింది గీత ఓ రోజు.

          “ఏం లేదు. బాగానే వున్నాను,” అంది తపతి.

          “నిన్న పిలుస్తానన్నావు, పిలవలేదేం?”

          “పిలుస్తానన్నానా?” అంది తపతి ఎటో చూస్తూ.

          ఒకవేళ హాలీ గురించి ఆలోచిస్తూ మనసు పాడుచేసుకుంటోందేమో అనుకుని, “నీరసంగా కనిపిస్తున్నావు. ఓ సారి డాక్టరుని చూడరాదూ” అంది..

          “చూస్తాలే” అంది కానీ తపతి డాక్టరు దగ్గరికి వెళ్లలేదు, ఆఖరికి గీతే పట్టుబట్టి ఎపాయింటుమెంటు తీసుకుంది.

          రెండువారాల పాటు రకరకాల టెస్టులు చేసి, బ్రెయిన్ ట్యూమర్ అని నిర్ణయించేరు. “ఫరవాలేదు. బినైన్ ట్యూమర్. సర్జరీతో నయమవుతుంది. మీ వాళ్లు ఎవరేనా వున్నారా?” అని అడిగేడు డాక్టరు.

          పిల్లలున్నారనీ, మాట్లాడతాననీ చెప్పి తపతి ఇంటికొచ్చేసింది. తరవాత కొడుకు వాసుని పిలిచి చెప్పింది.

          ఆ అబ్బాయి వెంటనే వస్తానని చెప్పి రెండోనాటికి దిగేడు.

          వాసు గీతకి కృతజ్ఞతలు చెప్పేడు తల్లిని డాక్టరు దగ్గరికి తీసుకెళ్లి ముదరక ముందే కనుక్కున్నందుకు.

          తల్లితో “నాతో వచ్చేయ్. అక్కడే చేయిస్తాను సర్జరీ.” అన్నాడు.

          తపతికి నచ్చలేదు ఇక్కడినించి కదలడం. “అక్కడికెందుకూ? ఇక్కడ నాకు అలవాటయిన డాక్టరు. ఆయనకి నా పరిస్థితి అంతా బాగా తెలుసు. ఇక్కడే చేయించుకుంటాను సర్జరీ” అంది.

          “నువ్వు ఆరోగ్యంగా వున్నన్నాళ్లూ, నీకు ఇక్కడే బాగుంది కదా అని వూరుకున్నాను. కానీ నీకు బాగులేనప్పుడు, నువ్వు ఇక్కడ ఒక్కదానివీ వుంటానంటే ఒప్పుకోను. నువ్వు నాతో రావాల్సిందే,” అన్నాడు వాసు.

          “అవును. అదే మంచిది” అంది గీత కూడా. అన్నీ బాగానే వున్నప్పుడు ఎవరెక్కడున్నా ఫరవాలేదు. కష్ట కాలంలో కొడుకులూ, కూతుళ్లే ఆదుకోవాలి. అందే కానీ మనసులో బాధగానే వుంది. తపతి వెళ్లిపోతుందనుకుంటే.

          తపతికీ అంతే. ఈ దేశం వచ్చిన దగ్గర్నుంచీ ఇక్కడే వుంది. ఇదే తనకి పుట్టినిల్లూ, మెట్టినిల్లూ అయింది. అందులోనూ గీత బాగా అలవాటయి పోయింది. వూరు వదిలి వెళ్లిపోడం కష్టం. కానీ, వాసు పట్టుబడుతున్నాడు.

          ఓ పూట వాదోపవాదాలు అయిన తరవాత, తపతి వాసుతో వెళ్లడానికే నిశ్చయమయింది. ఇంక మూటా ముల్లే సర్దుకోడం, అప్పగింతలు …

          హరి పోయినప్పటినించీ చిత్ర తల్లి దగ్గరే వుంది. తపతి ఇమాన్యూల్‌ని పిలిచి తన ఆరోగ్యం సంగతి చెప్పి, ఇల్లు ఏంచేయమంటారని అడిగింది.

          ఆయన అయ్యో అని బాధ పడి, వాసు దగ్గరికి వెళ్తున్నందుకు సంతోషించి. ఇల్లు మాట మీ యిష్టం అన్నాడు. ఆవిడ ఏం చేసినా తనకేమీ అభ్యంతరం లేదన్నాడు.

          తపతి గీతతో “నువ్వు ఎలాగా చిన్నింటిలోకి మారాలనుకుంటున్నావు కదా. ఈ యింట్లో వుండు” అంది.

          గీతకి అభ్యంతరం చెప్పడానికి ఏమీ కనిపించలేదు. కాస్సేపు ఆలోచించి, “నీ యిల్లు నీ పిల్లలకి చెందాలి కానీ నేనేమిటి మధ్యన” అంది.

          “నా యిల్లేమిటిలే. నేనేం కొన్నానా, కట్టించేనా. నాకూ వుచితంగా వచ్చిందే కదా. అంచేత నేను మరొకరికి ఇచ్చేయడమే ధర్మం. ఆ మరొకరు నువ్వే ఎందుకు కాకూడదూ? దేవుడు చల్లగా చూసి, నా పిల్లలిద్దరూ బాగానే వున్నారు. నేను ఇవ్వకపోతే వాళ్లకి జరగదనేం లేదు.” 

          సరేనంది గీత.

          “మీరు మా యింటికి రావాలి ఆంటీ” అని మరీ మరీ చెప్పేడు వాసు గీతకి.

          తపతి వెళ్లిపోయిన తరవాత ఓ రోజు అచల వచ్చింది. “నాకు కాలిఫోర్నియాలో ఉద్యోగం వచ్చింది, అక్కడికి మారిపోతున్నాం” అంది.

          “సంతోషం అచలా. అభినందనలు,” అంది గీత.

          “మీరు కాలిఫోర్నియా రావాలి ఆంటీ.” అంది అచల.

          “అలాగేలే. ముందు మీరు వెళ్లి ఇల్లూ వాకిలీ చూసుకు స్థిరపడండి.”

          “ఊరికే వస్తాను అంటే కాదు అంటీ. తప్పకుండా రావాలి” అంటూ గీతచేత ప్రమాణం చేయించుకు కానీ వదిలిపెట్టలేదు ఆ అమ్మాయి.

***

          గీత పుస్తకం పట్టుకు కూర్చుంది. కళ్లు పేజీమీద వున్నాయి కానీ మనసు లేదు.

          అచల పట్టుబట్టి “ఈ పుస్తకం మీరు చదివి తీరాల్సిందే, చదవకపోతే వూరుకోను. పరీక్ష పెడతాను” అంటూ గొడవ చేసి ఇచ్చిన పుస్తకం.

          తను “అలాగే, అలాగే” అంటూ ఇన్నాళ్లూ జరుపుకొచ్చింది. కానీ ఈ మధ్య మనసు అస్సలు బాగుండడం లేదు. తన జీవితంలో భాగస్వాములు హరీ, తపతీ. ఇద్దరూ కూడా మాటా పలుకూ లేకుండా మాయమయిపోయేరు. తను ఇంత కాలం జరిగేది చూస్తూనూ, జరగనిదానికి విచారించకుండానూ కాలం గడిపేసింది. ఇప్పుడు ఏదో బలమైన శక్తి తనని దిగలాగుతోంది.

          ఆలోచనల్లో మునిగిపోయిన గీత నింగిని కువకువలు వినిపించి తలెత్తి చూసింది.

          కొంగలు బారులు తీరి కోణాకారంలో ఎగిరిపోతున్నాయి క్వంయిక్వంమంటూ. శిశిరం ప్రారంభం కాగానే దక్షిణాదికి తరలిపోయిన పక్షులు తిరిగొస్తున్నాయి వసంతం వస్తోందని చాటుతూ. అవి పట్టిన కోణాకారం చూడముచ్చటగా వుంది కవాతువేళ సుశిక్షితులయిన  సైనికుల బారుల్లా.

          గీతకి ఎప్పుడో ఎక్కడో చదివిన పాఠం గుర్తొచ్చింది. చాతక పక్షులు ఆకాశంలో వర్షపు చినుకుల కోసం నిరీక్షిస్తూ తలకిందులుగా ఎగురుతూ వుంటాయిట.  వర్షపు చినుకులు స్వచ్ఛతకి పెట్టింది పేరు. అంత స్వచ్ఛమయిన నీరు అయితేనే అవి గ్రహిస్తాయి కాబోలు. ఆ చినుకులు కలుషితం కాకముందే, కింద పడక ముందే అంబర వీధిలోనే అందుకోవాలని వాటి తపన. అంటే ఆ పక్షులకి అంతటి పరిజ్ఞానం వుందనుకోవాలి.

          గీత తలలో తామరతంపరగా ఆలోచనలు చెలరేగేయి. తను కూడా అలాటి స్వచ్ఛమయిన, పరిపూర్ణమయిన జీవితం కోసమే ఎదురు చూసిందా? అన్న సందేహం కలుగుతోంది ఇప్పుడు.

          తను జీవితంలో కోరుకున్నది ఏమిటి? పుట్టుకా, చదువూ, పెళ్లీ, .. ఒకదాని తరవాత ఒకటి లెక్కల్లో స్టెప్పుల్లా జరిగిపోయాయి. సత్యం తనని గురించి అన్నమాట నిజమే. జరుగుతున్నది చూస్తూ, జరుగుతున్న సంఘటనల్లో తన జోక్యం లేకుండా, తోలుబొమ్మ ఆడినట్టు నిర్వికారంగా తనపాత్ర నిర్వహించింది. ఏ ఒక్క వస్తువు కోసమూ తనకి తానై ప్రయత్నించ లేదు. ఏటివాలులో గరికపోచలా కొట్టుకొచ్చేసిందంతే. అమెరికాకి రావడం కూడా అలా కొట్టుకుపోవడంలో భాగమే. అందరిలాగా “నేనొక మనిషిని, నేను సాధించవలసింది ఇది” అని ఎందుకు అనుకోలేదు తను?

          బుచ్చిబాబు చివరికి మిగిలేది జ్ఞాపకాలే అన్నారు. కానీ తనకి అలా అనిపించడం లేదు. తన జీవితంలో ప్రవేశించిన వాళ్లందరూ కేవలం జ్ఞాపకాలు కారు. ప్రతి వొక్కరికీ తన జీవితాన్ని రూపు దిద్దడంలో పాలుంది.

          శివం మామయ్యా, కనకమ్మత్తా చదివించేరు, పెళ్లి చేసేరు ఏ ప్రతిఫలాపేక్షా లేకుండా.

          సత్యం పరిచయంలో లోకరీతి కొంత వరకూ తెలిసింది.

          శ్యామ్‌ మేకపోతు గాంభీర్యానికి అర్థం ఏమిటో తెలియజేశాడు.

          సరోజ మెడిసన్‌లో చేరిందే కానీ అదే గమ్యం చేసుకోలేదు. తనకి కావలసిందేమిటో, అది ఎలా సమకూర్చుకోవాలో తెలుసుకుని తన జీవితం తాను దిద్దుకుంది.

          హరి కూడా అంతే. తనకి ఏం కావాలో, ఎలా సాధించుకోవాలో తెలిసినవాడు. స్వతహాగా మంచివాడే కానీ తనకీ అతనికీ మధ్య ఆత్మీయమైన  బాంధవ్యం ఏర్పడ లేదు. కానీ అతన్ననడానికీ లేదేమో. తనకేం కావాలో తనకే తెలీలేదు. కారణం ఏదయినా ఇద్దరి మధ్య ఆత్మీయత లేకుండా పోయింది.

          తపతి పరిస్థితులని అర్థం చేసుకుని నిర్ణయాలు చేసుకోగల సమర్థురాలు. తపతిలో ఆ గుణం తనకి బాగా ఉపకరించింది. అచల, తనకంటే దాదాపు 15 ఏళ్లు చిన్నది అయినా జీవితం అంటే స్థిరమయిన అభిప్రాయాలు వున్నాయి ఆ అమ్మాయికి.

          తెలివితక్కువ పిల్ల అనిపించుకున్న చిత్ర కూడా తన నైపుణ్యాన్ని స్పష్టం చేసింది తన భాషలోనే. చిత్రలేఖనం ద్వారా తన వ్యక్తిత్వాన్ని నిరూపించుకుంది.

          హాలీ తన కర్మని మనసా నమ్మి స్వీకరించింది తను కోరుకున్నది అది కాకపోయినా.

          భాగ్యం గారి నమ్మకాలు మరొక రకం. ఆవిడ నమ్మకాలలో సందేహాలు లేవు.

          మూడేళ్ల గగనని తలుచుకుంటే నవ్వొస్తోంది. “నాకు అల్లరి చెయ్యడం బాగుంటుంది” అని చెప్పగలిగింది.

          వీళ్లందరూ తన మార్గం నిర్దుష్టం చేసుకోడానికి కారణభూతులు అయ్యేరు. జీవితంలో అనేక కోణాలు — సంగీతం, సాహిత్యం, ధార్మికం, ఆధ్యాత్మికం, లౌక్యం – పరిచయం చేసేరు.

          తను కూడా చాతకపక్షులు వానచినుకుల కోసం ఎదురు చూసినట్టు ఒక నిర్దుష్టమయిన,  స్వచ్ఛమయిన బతుకు కోసం ఎదురు చూస్తూ ఇంత కాలం గడిపేసింది. అంతే. వాన చినుకులు కురియడం అయాచితంగా, ఒకరి ప్రమేయం లేకుండా జరుగుతుంది. తను కూడా అలాగే తన అభీష్టమేదో అది దానంతట అదే వచ్చి ఒళ్లో వాలుతుందని ఎదురు చూసినట్టు ఇప్పుడు తెలుస్తోంది.

          “నా జీవితంలో ప్రవేశించిన ప్రతి ఒక్కరికీ ధ్యేయం వుంది. నేను మాత్రం చాతకపక్షిలా వాటంతట అవే కురిసే వానచినుకుల కోసం ఎదురు చూస్తున్నాను” అనుకుంది గీత నిట్టూర్చి.

          తన జీవితంలో అన్నిటికంటే ఘోరమయిన విషాదం అదేనేమో – నాకు ఫలానాది కావాలి అని నిర్ణయించుకోలేక పోవడం, దాని కోసం ప్రయత్నించక పోవడం.

          తపతీ, అచలా గీతని మర్చిపోలేదు. అప్పుడప్పుడు పిలిచి మాట్లాడుతూంటారు. రారమ్మని పిలుస్తూంటారు. గీతకి ఆనందంగా వుంటుంది తన యందు ఇంత అభిమానం చూపించేవారు వున్నారని తలుచుకున్నప్పుడు. 

***

          ఊరికి ఉత్తరపు పొలిమేరల్లో ఒక చిన్న ఇంటి ముందు పంచలో కూర్చుని గీత వంచిన తల ఎత్తకుండా వొళ్లో లాప్‌టాప్ పెట్టుకుని టైపు చేస్తూంటుంది ఏవేళప్పుడు చూసినా.

          ఆ దారిన పోయేవారు ఓమారు అటు చూసి ముందుకి సాగి పోతూంటారు.

          ఒక రోజు ఒకాయన అడిగాడు, “ఏమిటి రాస్తున్నావు?”

          “చరిత్ర”

          “ఎందుకు?”

          “నా తృప్తికోసం.”

          “ఏళ్ల తరబడి చూస్తున్నాను ….  ఎప్పుడు అవుతుంది?”

          “అవదు. చరిత్రకి అయిపోవడం ఏమిటి?.”

* * * * *

(సమాప్తం)

చిత్రకారుడు: ఆర్లె రాంబాబు

Please follow and like us:

One thought on “చాతకపక్షులు నవల- 21 (చివరి భాగం)”

  1. “తన జీవితంలో అన్నిటికంటే ఘోరమయిన విషాదం అదేనేమో – నాకు ఫలానాది కావాలి అని నిర్ణయించుకోలేక పోవడం, దాని కోసం ప్రయత్నించక పోవడం.”

    చాలా బాగా చెప్పారు. సగటు మనిషి ఇందువల్లే సుఖం అనుభవించలేకపోతున్నాడు.

Leave a Reply

Your email address will not be published.