చిత్రం-42

-గణేశ్వరరావు 

 
          11వ శతాబ్దానికి చెందిన రాజరాజ నరేంద్రుడు తన కుమారునికి కన్యను వెతుకుతూ కొడుకు చిత్రాన్ని పొరుగు రాజ్యాలకు పంపి అక్కడి కన్యల చిత్రాలు తెప్పించుకొని చూసేవారట, అలా ఒక రాచకన్య చిత్రాన్ని చూసి ఆమె అందానికి ముగ్ధుడై ఆమెని తన కోడలుగా చేసుకోటానికి బదులుగా తానే చేసుకున్నట్టు వినే ఉంటారు.
 
          ‘చంద్రహారం’ సినిమాలో చందన రాజు తన ఊహా సుందరి చిత్రాన్ని గీయటం చూసే ఉంటారు. ‘ఇది నా చెలి..ఇది నా సఖి..ఇది నా మనోహరి ‘ అని పాడుతూ ఎన్టీఆర్ తనదైన బాణీలో (కత్తి పైకి విసిరి పట్టుకున్నట్టు) చిత్రపటం పూర్తయ్యాక కుంచె ను పైకి విసిరి పట్టుకోవడం మనం మరచిపోలేము. ఆ కోవలోకే వస్తుంది ఈ చిత్రం.
 
          1913లో Ignacio Zuloaga అనే స్పెయిన్ ఆర్టిస్ట్, Mathieu de Noailles అనే కౌంటెస్ చిత్రాన్ని గీశాడు. ఆమె ఒక కవయిత్రి, నవలా రచయిత్రి, ఆ కాలం నాటి స్పెయిన్ రాజవంశీయుల ప్రతినిధి.
 
          ఈ తైలవర్ణ చిత్రం అపూర్వం: చిత్రంలో ఆమె మనకేసే తిరిగి చూస్తోంది, ఆమె పడుకున్న తీరు – మీరు నా పైనుంచి చూపు మరల్చుకుంటే చూడండి ఏం చేస్తానో! – అన్నట్టు సవాలు విసురుతున్నట్టుంది. ఆమెతో పాటు ఆమె చిత్రాన్ని గీసిన కళాకారుడు కూడా – నన్ను చూడండి, నా అందాన్ని పొగడండి – అంటున్నారు. ఆమె పారిస్ లో ఉండేది, కళాకారులు, రచయితలతో కాలం గడిపేది, తన ఇంటికి ఆహ్వానించేది, చిత్రంలో చూపించినట్లు తన సోఫాలో చేరగిలపడేది – కవ్విస్తూనట్టు. శోభాయమానంగా ఆమె symmetry ఉంది ఈ చిత్రంలో. తెరల మీద ఉన్న పూలు, కూజాలోని పూలతో పోటీ పడుతున్నాయి, పరచిన దుప్పటికున్న ముడతలను అనుసరిస్తున్నాయి తెరలు. ఆమె కాళ్లకు తొడుక్కున్న నల్లని మేజోళ్ళు ఆమె జుట్టు రంగుతో మ్యాచ్ అయ్యాయి. దట్టమైన వాటి రంగులు – ఆమె ధరించిన లేత గులాబీ రంగు దుస్తులను మరింత రమణీయంగా కనబరుస్తున్నాయి, అంతే కాదు – ఆమె దుస్తుల రంగు ఆమె ఒంటి రంగు కి ఎంత దగ్గరగా వచ్చాయంటే – దుస్తులు ఏ మాత్రం తొలగినా నగ్నం గా అగుపడే ఆమె భుజాలు చూడగలిగేతే ..ఆ దృశ్యం నిస్సందేహంగా చూపరులని మోహంలో ముంచివేస్తాయి అని అనిపించేటంత! చందన రాజైనా మరెవరైనా ఈ చిత్రాన్ని చూసి ఆమె వన్నెల చిన్నెల కలువ కన్నుల చూపులకు సమ్మోహితులవకుండా ఉండలేరు! Impressionism కు ఈ చిత్రం ఒక అద్భుతమైన ఉదాహరణ.
*****
Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.