నడక దారిలో-24
-శీలా సుభద్రా దేవి
జరిగిన కథ : తండ్రి పోవటంతో అమ్మ నలుగురు పిల్లలతో ఆర్థిక సంక్షోభంలో చిక్కు కుంది. నా చదువు అంచెలంచెలుగా సాగి డిగ్రీ లో చేరాను. ఖాళీ సమయాలను సాహిత్యం, సంగీతంతోనూ, బాపూ బొమ్మలు చూసి వేయటంతోను గడిపాను. స్వాతి పత్రికలో శీలా వీర్రాజు గౌరవసంపాదకునిగా చూసి దేవి పేరుతో స్నేహితురాలు ఉషా చిరునామాతో ఉత్తరాలు రాసేదాన్ని. బంధువులు, మిత్రులు కరతాళ ధ్వనులతో, రోణంకి అప్పలస్వామి గారి ఆధ్వర్యంలో వివాహం జరిగింది. పరీక్షలు కాగానే హైదరాబాద్ లో కొత్తకాపురం, నాలుగు నెలల అనంతరం విజయనగరం వెళ్ళాను. మేలో పరీక్షలు ముగించుకుని హైదరాబాద్ శాశ్వతంగా వచ్చేసాను. కొత్త కాపురం. ఏడాది తిరగకుండానే మా జీవన గీతానికి పల్లవి చేరింది. తర్వాత—
***
ఒకసారి సారస్వత పరిషత్తులోని సాహిత్య అకాడమీ సమావేశాలకు హాజరై, ఆ తర్వాత శివరాజు సుబ్బలక్ష్మిగారు దగ్గరలోనే ఉన్న మా యింటికి వచ్చారు. ఆమెవస్తే నా చెయ్యి పట్టుకొని మరి వదలరు. ఆమె నా చెయ్యి పట్టుకుంటే నాకు పురిటి గదిలోకి నేను వెళ్తున్నప్పుడు అమ్మ పట్టుకున్నప్పటి స్పర్శ గుర్తు వస్తుంది. చాలా సేపు ఆమెతో కబుర్లు చెప్పుకున్నాం.
ఒకసారి మా చిన్నక్క ఉత్తరం రాస్తూ వదిన వల్ల అమ్మ చాలా ఇబ్బంది పడుతుందనీ, కోరుకొండ వచ్చినప్పుడు బతకాలని లేదని బాధ పడిందనీ తనకు అమ్మని చూస్తే ఆందోళనగా ఉందనీ తన దగ్గర ఎక్కువ రోజులు ఉండటానికి ఇష్టం పడటం లేదనీ రాసింది. అది చదివేసరికి నాకు దుఃఖం ముంచుకు వచ్చింది. చిన్నక్కది కులాంతర వివాహం కనుక అతని తరపువాళ్ళు వచ్చినపుడు ఇబ్బంది అని అమ్మ అవసరం అయినప్పుడే వెళ్తుంది. నేను ఉమ్మడి సంసారంతో ఉండటాన నా దగ్గరా ఉండనంటుంది. ఆ రోజంతా అమ్మని తలచుకుని బాధపడ్డాను.
నేను చదువు పూర్తి చేసుకుని ఉద్యోగంలో చేరి అమ్మని నా దగ్గరే ఉంచుకుని చూసుకోవాలని చిన్నప్పటి నుండి అనుకునేదాన్ని. రావిశాస్త్రి, బీనాదేవి సాహిత్యం విపరీతంగా చదివి, రంగనాయకమ్మని అవుపోసన పట్టి నన్ను నేను చెక్కుకుని సమాజంలో మార్పు తెచ్చేలా బతకాలని ఎన్నో ఊహించుకుని తీరా అన్నీ మరచిపోయి ఈ పెళ్ళి చేసుకొని వచ్చేసి అమ్మని మళ్ళీ కష్టాలు ఊబిలోనే ఉంచేసానని నన్ను నేను తిట్టుకున్నాను. డిగ్రీ పూర్తి చేయకుండా అర్థాంతరంగా వదిలేసి నా ఆశల్ని ఛిద్రం చేసుకున్నా ననిపించింది. మళ్ళీ మనసు చదువు మీదకు వెళ్ళింది. నేను ఇలా ఉండిపోకూడదు. మళ్ళా నిద్రపోయిన ఆలోచనలు ఆవులిస్తూ లేచాయి.
ఉద్యోగం చేయలేక, రచనలు చేసుకోలేక, పాటలూ పాడుకోలేక, చిత్రాలూ వేయక ఇలా స్తబ్దత తో ఉన్నామా, తిన్నామా, పడుకున్నామా అన్నట్లు బతకటం నాకు నిరాశతో మనసంతా నిండిపోతూ ఉండేది.
ఇంట్లో నా మరుదులూ, వాళ్ళు మిత్రులూ, చుట్టుపక్కల వాళ్ళూ అందరూ నన్ను వదినా అని పిలుస్తూ ఉండేవారు. వీర్రాజుగారు ఇంట్లో అందరూ ఉన్నప్పుడు నన్ను పేరుతో పిలవటానికి మొగమాటం పడటం, పాప పుట్టాక మా కాంపౌండులో నార్త్ ఇండియన్ వాళ్ళు ‘ పల్లవి కా మా’ అని పిలవటం, నేను కొన్నాళ్ళకు నా పేరేంటో మర్చిపోతానేమోననిపించేది.
మార్చిలో మా చిన్నన్నయ్యకీ, చిన్నాడబడుచుకి మేము చేసుకున్నట్లు గానే కుందుర్తి ఆంజనేయులు గారి అధ్వర్యంలో సభావివాహం హైదరాబాద్ లోనే జరిగింది. ఆమె వెళ్ళిపోయాక ఇంటి బాధ్యత పూర్తి గా నాదే అయ్యింది. మా ఇంట్లో పేయింగ్ గెస్ట్ గా ఉండే అతనికి బదిలీ కావటంతో వెళ్ళిపోయాడు. ఇప్పుడు నా కోసం కొంతైనా సమయం మిగుల్చుకోవాలను కున్నాను.
సాహిత్య అకాడమీ సమావేశాలకు హాజరు అయ్యేందుకు హైదరాబాద్ వచ్చిన ఉప్పల లక్ష్మణరావు గారూ, మధురాంతకం రాజారాం గారూ మా యింటికి భోజనానికి వచ్చారు. అంతకు ముందు నేను రాసిన కథ గురించి అభినందిస్తూ ఉత్తరం రాసిన లక్ష్మణరావు గారు మరోసారి కథ గురించి చాలాసేపు మాట్లాడి బాగారాస్తున్నాననీ ఇంకా రాయమని ప్రోత్సహించారు. అది విన్న వీర్రాజు గారు తర్వాత ‘నన్ను కథలు రాయటం మానేసావెందుకు’ అని మందలించారు. ఏం చెప్పలేక నేను నవ్వి ఊరుకున్నాను.
కానీ నేను హైదరాబాద్ వచ్చాక రాసినది ఏదీలేదు అంతకు ముందు రాసి పత్రికలకు పంపిన కథలే ఓ నాలుగు వరకూ ప్రచురితం అయ్యాయి. ఎప్పుడన్నా ఒక ఆలోచన వచ్చి ఏ రాత్రిపూటో కాగితాల మీద పెట్టినది పూర్తిచేసే సమయం లేక అసంపూర్తిగా ఉండి పోయాయి. పుస్తకాలు చదవటమూ తగ్గిపోయింది. ఎప్పుడన్నా కొంచెం ఖాళీ దొరుకుతే అల్మారా లోని ఓ కవితా సంపుటి తీసి ఒకటి రెండు కవితలు మాత్రమే చదవటం కుదిరేది.
అంతలో పెద్ద ఉత్పాతం వార్నిషు పెయింట్స్ రిప్రజెంటేటివ్ గా పనిచేస్తున్న మా మరిది కలెక్ట్ అయిన సొమ్ము సక్రమంగా యాజమాన్యానికి చెల్లించటం లేదని పెద్ద గొడవ అయ్యి మా మరిదిని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసారు. అంతే కాక కొంత మంది అతను అప్పులు చేసాడని ఇంటి మీదకు వచ్చారు. దాంతో అందరం అతలాకుతలం అయిపోయాము. అనుకోకుండా అంతకు ముందు పత్రికలకు వేసిన చిత్రాలు తాలుకు సొమ్ము, ప్రభుత్వం సంస్థలకు వేసిన సావనీర్ల చిత్రాలకు వచ్చిన డబ్బు, బేంకులో కొద్ది కొద్దిగా దాచుకున్నదీ అంతా అప్పులు తీర్చటానికి జమ కట్టేసారు. ఈ సంఘటన నాలో భవిష్యత్తు గురించి చాలా భయం కలిగించింది.ఈ ఊబిలోంచి ఎప్పటికైనా తేరుకోగలమా అనే బెంగ ఏర్పడింది.
బలరాం గారు, మా కాంపౌండులోనే అద్దెకు ఉన్న ఆయన మిత్రుడు సర్వే ఆఫ్ ఇండియా లో పనిచేస్తున్నవారు కావటాన చాలా ప్రయత్నం మీద మా మరిదికి అందులో ఉద్యోగం వచ్చేలా చేసారు. హమ్మయ్య ఇకనైనా బుద్దిగా పనిచేసుకుంటే ఒడ్డున పడతాం అనుకున్నాం.
చిన్నన్నయ్య వాళ్ళూ అమ్మతో కలిసి విడిగా వేరే ఇల్లు తీసుకుని కాపురం పెట్టారు. పోనీలే అమ్మకి కొంత వెసులుబాటు ఉంటుంది అనుకున్నాను.
అంతలోనే మరో బాధ కలిగించే ఉత్తరం. చిన్నక్కకి రెండో బాబు పుట్టాడు. కానీ నెల రోజులకే డయేరియాతో హాస్పిటల్లో చేర్చినా కూడా చనిపోయాడని తెలిసింది. తొమ్మిది నెలలు గర్భంలో మోసి పుట్టబోయే వాడిమీద ఎన్నో కలలు కని తీరా ఇలా చిట్లిపోవటం చాలా విషాదం. ఇదే సమయంలో అమ్మ గురించి గుర్తు వచ్చింది.పెద్ధకొడుకని అన్నయ్యను ఎంతో అబ్బురంగా చూసుకొనే ఉంటారు. కానీ ఎందుకో ఏ విషబిందువు అన్నయ్య మనసులో ఎప్పుడు ఎవరు చిలకరించారో ? నాకు ఊహ తెలిసీ అన్నయ్య అమ్మతో ఆదరంగా మాట్లాడగా చూడలేదు. మరి అమ్మ మనసులో ఎంత రోదిస్తుందో. తలచుకోగానే కళ్ళు చెమ్మగిల్లాయి.
చిన్నాడబడుచు కాపురానికి వెళ్ళిపోవటం, మరిదికి ఉద్యోగం రావటంతో నాకు కొంత వెసులుబాటు కలిగింది. వీర్రాజు ఉదయం పదిగంటలకే భోజనం చేసి వెళ్ళిపోవటం, చిన్నమరిదికి షిఫ్ట్ లు అందుకని అప్పుడప్పుడు నా కోసం కొంత ఖాళీ సమయం దొరికేది. తొందరగా పనిముగించుకొని పుస్తకాలు చదవటం మళ్ళా మొదలెట్టాను. పల్లవికి చిన్న చిన్న పాటల్ని నేర్పించటం చేసేదాన్ని.
అక్కయ్య నుండి ఉత్తరం వచ్చింది.”డిగ్రీ పూర్తి చేసేయకూడదా? తర్వాత ఏదైనా ఉద్యోగం లో చేరితే ఆర్థికంగా కూడా కొంత వెసులుబాటు ఉంటుంది కదా “అంది. నేను కూడా ఆలోచనల్లో పడ్డాను.
ఈలోగా మా ఫిజిక్స్ మేడం జ్యోతి గారి నుండి కూడా ఉత్తరం వచ్చింది. రెండు మూడేళ్ళలో పాత సిలబస్ తీసేస్తారని, పరీక్ష కడితే మంచిదనీ, కావాలంటే తాను కొంత మర్చిపోయిన పాఠాలకి గైడ్ చేస్తాననీ రాసారు. నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఒక స్టూడెంట్ పట్ల ఇంత శ్రద్ద చూపి ఉత్తరం రాయటం నిజంగా అబ్బురమే. నేను ఆఖరి సంవత్సరం లో ఉండగా అప్పుడే ఎమ్మెస్సీ పూర్తిచేసి మా కాలేజీకి లెక్చరర్ గా జ్యోతిగారు వచ్చారు. అందువల్ల మాతో స్నేహితురాలు లాగే ఉండేవారు. ఆమె నాన్నగారు ఎమ్మార్ కళాశాల లో ఫిజిక్స్ లెక్చరర్.
వీర్రాజు గారు ఆఫీసు నుండి రాగానే ఉత్తరం చూపించాను. ఆయనా ఆశ్చర్యపోయారు. మీ అన్నయ్యకి ఉత్తరం రాసి ఫీజు కట్టమని చెప్పు అన్నారు. వెంటనే ఉత్సాహంగా ఉత్తరం రాసాను.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రపంచ తెలుగు మహాసభలు ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలనుకుంది. దాంతో వీర్రాజు గారికి రెండు మూడు నెలల ముందు నుంచే బిజీ అయిపోయింది. సభల సావనీర్ బాధ్యత వీర్రాజు గారిపై పడింది.
సభల సందర్భంగా యాభై ముగ్గురు చిత్రకారులచేత తైలవర్ణ చిత్రాలు వేయించి
“రెండున్నర వేల సంవత్సరాల తరతరాల తెలుగు జాతి” అంశంతో ప్రదర్శన ఏర్పాటు చేయాలనే నిర్ణయించారు. అందుకని రాజమండ్రి నుండి వీర్రాజు గారి సన్నిహిత మిత్రుడు మాదేటి రాజాజీ, వారి శిష్యులు ఒక ఇద్దర్ని కూడా తైలవర్ణ చిత్రాలు వేయటానికి ఎంపిక చేసారు. ఎగ్రిమెంటు కోసం వచ్చి న రాజాజీ గారి సాయంతో విజయనగరం వెళ్ళటానికి టికెట్లు రిజర్వేషన్ చేయించారు.
అప్పుడప్పుడు వీలు చేసుకుని ఫిజిక్స్ పుస్తకం తెరవడం మొదలెట్టాను. కాలేజీ వదిలి పెట్టి మూడేళ్ళు అయిపోయింది. ఏకాగ్రత కుదిరే సరికి పాప దేనికోసమో పేచిపెట్టటమో ఏ పక్కింటివారో,స్నేహితులో రావటమో జరిగేది. మళ్ళా పుస్తకం అవతల పడేసి పనిలో పడాల్సి వచ్చేది. మనసు ఉసూరుమనేది.
పరీక్షకి ఓ వారం రోజుల ముందుగా వెళ్తే అక్కడ అమ్మ పాపని చూసుకుంటుంది కనుక చదువుకోవచ్చులే అనుకున్నాను.
కానీ అంతకు ముందు నేను విజయనగరం వెళ్తే ఆడబడుచు ఉండేది. ఇప్పుడు నేను వెళ్తే ఎలాగో అని ఒక సందిగ్ధం, ఇల్లు పట్టించుకోకుండా చదువు కోసం ఊరుమీద పడింది అని నలుగురూ నాలుగు మాటలు అంటారని ఒకబెంగ. ఇప్పుడు పరీక్ష పాసవ్వకపోతే వచ్చిన నష్టం ఏమిటీ అని గుసగుసలు పోతారేమో అని మనసులో గుబులైంది.
కానీ వీర్రాజు గారు మాత్రం” రాజాజీ వాళ్ళూవచ్చి మనం ఇంట్లోనే దిగి పెయింటింగ్స్ వేస్తారట. ఆయిల్ కలర్స్ వాసనలూ అవీ ఘాటుగా ఉంటాయి. పాప చిన్నది కదా ఇబ్బంది అవుతుంది. పరవాలేదు వెళ్ళు వంట సంగతి మేం చూసుకుంటాంలే” అన్నారు. కొన్ని సులభమైన వంటలు ఎలా చేయాలో పేపరు మీద రాసుకున్నారు.
ఆయన ఇచ్చిన భరోసాతో ఇంకా పరీక్షలు నాలుగు రోజులు ఉన్నాయనగా మార్చి 17వ తారీఖున రాజాజీగారితో కలిసి బయలుదేరాను. రాజాజీ గారు రాజమండ్రిలో దిగిపోగా నేను విజయనగరం వరకూ వెళ్ళిపోయాను.
*****
మీ ఆత్మీయ స్పందన కు ధన్యవాదాలు సుశీల గారూ
సుభద్రా దేవి గారి జీవితం లో లాగానే చాలామంది జీవితాల్లో ఎన్నో చిక్కుముడులు. ఎంత సహనంగా, నెమ్మదిగా, నేర్పు తో ఆ ముడులన్నిటినీ ( అన్నీ కాకపోయినా, కొన్నిటినైనా) విప్పుకొంటూ వెళ్తుంటే అంతగా మన వ్యక్తిత్వం పదును తేలుతూ వస్తుంది. కానీ అంతటి నెమ్మదితనం, నైపుణ్యం సుభద్ర గారి కొందరికే ఉంటుంది. అది చాలా మంది కి ఆదర్శప్రాయం.