ప్రముఖ రచయిత్రి కుప్పిలి పద్మ గారితో నెచ్చెలి ముఖాముఖి

-డా||కె.గీత 

(కుప్పిలి పద్మగారితో నెచ్చెలి ప్రత్యేక ముఖాముఖి వీడియోని పైన ఇస్తున్నాం.
చూసి, మీ అభిప్రాయాలు తప్పక తెలియజెయ్యండి.)

***

కుప్పిలి పద్మ
రచయిత్రి, కాలమిస్టు, మీడియా ప్రొఫెషనల్
***

          పదేళ్ళ సుదీర్ఘ కాలం ‘వార్త’ దినపత్రికలో నడిచిన వీక్లీ కాలమ్ ‘మైదానం’ రచయిత్రిగా కుప్పిలిపద్మ ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని సమకాలీన జీవితం పై విభిన్న కోణాల్లో చేసే వ్యాఖ్యానాలు తెలుగు పాఠకులకు సుపరిచితమే. తెలుగు పక్షపత్రిక ‘ప్రజాతంత్ర’లో మహిళా పేజీ ‘మిసిసిపి’కి సంపాదకురాలిగా పనిచేశారు. రెండు కథానికా సంకలనాలు కొత్త కథ (2017), ప్రాతినిథ్య కథానికా వార్షిక సంకలనం (2015) మీటూ కథా సంకలనం యీ మూడు కథా సంకలనాలకూ సంపాదకురాలిగా బాధ్యతలు నిర్వహించారు.

          పాఠశాల విద్యార్ధిగా వున్నప్పటి నుంచే కథలు ఒక రచయిత్రిగా కుప్పిలి పద్మ పేరు 90ల మధ్యకాలంలో నలుగురి దృష్టికీ వెళ్ళింది. 20 సంవత్సరాల వ్యవధిలో ఆమె 100కు పైగా కథానికలను రాశారు. ఇవి తొమ్మిది కథా సంపుటాలుగా వచ్చాయి. వీటితో పాటు మూడు నవలలూ, సృజనాత్మక వచనం రెండు సంపుటాలుగా వెలువడ్డాయి. ఆమె కథలు ‘శలభంజిక అంద్ ఒథెర్ స్తొరిఎస్’ గా ఇంగ్లీ ష్ లోకి అనువాదమయ్యాయి. ఆమె కవితలు ‘నెమలీకలు పూసే కాలం’ ‘మోహనదీతీరమ్మీద నీలిపడవ’ సంకలనంగా ప్రచురితమయ్యాయి.

          తన తొలి కథా సంపుటం ‘మనసుకో దాహం’ నుంచి ఇటీవలి ‘పొగ మంచు అడివి’’ వరకూ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆర్థిక సంస్కరణల పర్యవసానాల పై ఆమె రచనలు చేశారు. మానవ సంబంధాల్లో వస్తున్న మార్పులు, యువతీయువకుల జీవితపు ఆకాంక్షలు, బహిరంగ ప్రదేశాల్లో స్త్రీల పై పెరుగుతున్న హింస, ముఖ్యంగా నిత్య జీవితంలో స్త్రీలు ఎదుర్కొంటున్న మానసిక హింసపై ప్రత్యేక దృష్టి ఆమె రచనల్లో కనిపిస్తుంది. ప్రధానంగా కౌమార దశలోని ఊగిసలాటలు, వినిమయతత్వం, ప్రపంచీకరణ, సింగిల్ ఉమన్ ఎదుర్కొనే సవాళ్ళు, పనిస్థలంలోని సమస్యలను ఆమె కథలు చర్చిస్తాయి. ఆమె స్త్రీ పాత్రలు బలమైన వ్యక్తిత్వంతో వివిధ ముసుగుల్లో ఉండే పితృస్వామ్య విలువలను ఎదుర్కొంటాయి. అదే సమయంలో తమ స్వతంత్రయాన్ని పరిమితం చేస్తూ ఎదురయ్యే సవాళ్ళు, అనివార్యతలు, ఒత్తిడులు, ఊగిసలాటలను భరించి ధైర్యంగా పర్యవసానాలను ఎదుర్కొంటాయి. ప్రకృతి సౌందర్యాన్నీ, జీవితంలో దాని పాత్రనూ అత్యంత కవితాత్మకంగా చిత్రించటం ఆమె రచనల ప్రత్యేకత.

          సరికొత్త తరం (మిల్లెన్నీల్స్) ఎదుర్కొనే సవాళ్ళనూ, అంశాలనూ తెలుగులో చర్చించే, వ్యాఖ్యానించే పరిణతి చెందిన స్త్రీవాద స్వరం ఆమెది. ఇది ఇతర భాషల్లోని రచయితలు కూడా ఆమె రచనల ప్రతిభను గుర్తించేలా చేసింది. ఆమె కథలెన్నో ఇంగ్లిష్ లోకి అనువాదమయ్యాయి. భారతీయ భాషల్లోని ఉత్తమ కాల్పనిక కథలను ఏటా సంకలనాలుగా తెచ్చే ‘కథ’ అనే ఢిల్లీకి చెందిన సాహిత్య సంస్థ ‘మసిగుడ్డ’ కథను ఇంగ్లిష్ లోకి అనువదించి ప్రచురించింది. మసిగుడ్డ కథ ఒడియా, మలయాళంలోకి అనువదించారు. ‘గోడ’ కథను ఇండియన్ లిటరేచర్ మంత్లీ జర్నల్లో అనువదించారు. ‘అజేయ’ కథ కన్నడ, ఇంగ్లీష్ భాషలోకి అనువాదమయింది. ‘మమత’, ‘నిర్ణయం’, ‘ఇన్ స్టెంట్ లైఫ్’ కథలు అనువాద రూపంలో వివిధ కథా సంకలనాల్లో ప్రచురితమయ్యాయి. ‘సెకెండ్ హస్బెండ్’ కన్నడంలోకి, మలయాళంలోకి అనువదించారు. ఆమె రచనలను చాలా విశ్వవిద్యాలయాల్లో ఎందరో ఎం.ఫిల్, పీహెచ్ డీ విద్యార్థులు అధ్యయనం చేస్తున్నారు.

          జాతీయస్థాయికి చెందిన వివిధ రైటర్స్ మీట్స్ లో ఆమె క్రియాశీలకంగా పాల్గొంటున్నారు. ప్రాంతీయంగా, జాతీయంగా జరిగే ఎన్నో సాహితీ కార్యక్రమాల్లో ఆమెను వక్తగా ఆహ్వానిస్తుంటారు. ఢిల్లీ సాహిత్య అకాడమీ ఆహ్వానితుల్లో ఆమె ఒకరు. శాంతినికేతన్ లో జరిగిన గురుదేవ్ రవీంద్రనాథ్ టాగూర్ శత జయంతోత్సవాల్లోనూ, సాహిత్య అకాడమీ నిర్వహించిన పూర్వోత్రి- గౌహతిలోనూ ఆహ్వానితురాలిగా పాల్గొన్నారు.

ప్రచురణలు
మొదట ప్రచురించిన పుస్తకం : అమృత వర్షిణి (1993)
కథా సంపుటాలు : మనసుకో దాహం (1994)
ముక్త (1997)
సాలభంజిక (2001)
మంచుపూల వాన (2008)
వాన చెప్పిన రహస్యం (2014)
ద లాస్ ఆఫ్ యిన్నొసెన్స్ (2015)
కుప్పిలి పద్మ కథలు (2017)
మంత్ర నగరి సరిహద్దులలో (2018)
పొగమంచు అడివి (2019)​​​

ఇంగ్లిష్ లోకి అనువాదం : ​ Saalabhanjika and other stories​​
Editors: Alladi Uma and M. Sridhar (2015)​

సృజనాత్మక వచనం : శీతవేళ రానీయకు – మ్యూజింగ్స్ ( 1999)

నవలలు: ​​​ అహల్య (1998)
మహి ( నవ్య- ఆంధ్రజ్యోతి లో సీరియల్ -2009)

కవిత్వం:​​​ నెమలీకలు పూసే కాలం (2017)
మోహనదీ తీరమ్మీద నీలిపడవ (2021)

నిర్వహించిన కాలమ్స్ : మైదానం – వార్త దినపత్రిక (1995-2005)
మల్లెల కాలమ్ – సాక్షి దినపత్రిక
యెల్లో రిబ్బన్ – వాకిలి వెబ్ మ్యాగజీన్
సంపెంగ పూల వాన – విహంగ వెబ్ మ్యాగజీన్
అర్బన్ మ్యూజింగ్స్ – మన తెలంగాణ

అవార్డులు : ఉత్తమ రచయిత్రిగా అమృతలత – అపురూప అవార్డ్ 2020-21
ఉత్తమ రచయిత్రిగా వాసిరెడ్డి సీతాదేవి అవార్డు (2017)
ఉత్తమ రచయిత్రిగా సాహితీ మాణిక్యం అవార్డు (2016)
ఉత్తమ రచయిత్రిగా దాట్ల నారాయణ రాజు సాహితీ పురస్కారం (2015)
ఉత్తమ కథానికా రచయిత్రిగా చాసో అవార్డు (2008)
తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ఉత్తమ రచయిత్రి అవార్డు
ఉత్తమ రచయిత్రి- అబ్బూరి వరద రాజేశ్వరరావు ట్రస్ట్ అవార్డు (2002)
ఉత్తమ రచయిత్రిగా తెన్నేటి హేమలత అవార్డు , వంశీ ఇంటర్నేషనల్ అవార్డు లు (2004)
సాలభంజిక కధానికకు మధురాంతకం రాజారాం సాహిత్య సంస్థ, తిరుపతి నుంచి కథాకోకిల పురస్కారం (2001-2002)
సాలభంజిక కథానికకు ఉత్తమ కథా రచయిత్రిగా రంగవల్లి మెమోరియల్ ట్రస్ట్ అవార్డు (2001)
భాషా నైపుణ్యాలు, కృషికి సంబంధించి ‘తెలుగు వైభవం’లో భాగంగా తెలుగు అధికార భాషాసంఘం చేత ప్రత్యేక గుర్తింపు (2004)
ఢిల్లీ తెలుగు అకాడమీలోని ఆంధ్ర అసోసియేషన్ అవార్డు (1995)
పద్మ మోహన అవార్డు (1993)

ప్రత్యేక గౌరవాలు :

  • 20 సంవత్సరాల్లో వచ్చిన ఉత్తమ కథానికల్లో ఒకటిగా సాలభంజిక’ను ‘కథ’ ఎంపిక చేసి ప్రచురించింది ‘
  • వందేళ్ళలో వచ్చిన 100 ఉత్తమ కథానికల్లో ఒకటిగా ‘యిన్ స్టెంట్ లైఫ్’ను విశాలాంధ్ర ఎంపిక చేసి ప్రచురించింది.
  • ప్రతిష్ఠాత్మక సాహిత్య అకాడమీ స్త్రీల సాహిత్యానికి సంబంధించి సంకలనం చేసిన ఉత్తమ కథల్లో ‘ముక్త’ ఒకటి.
  • కథాసాహితి ప్రచురించిన 2001 ఉత్తమ కథల్లో ‘కుబుసం’ ఎంపికయింది.
  • తెలుగు విశ్వవిద్యాలయం తెచ్చిన ఉత్తమ కథానికా సంకలనంలో రెండు కథానికలు ‘ముక్త’, ‘గోడ’ఎంపికయ్యాయి.
  • సాహితీ మిత్రులు ప్రచురించిన ‘సమయమూ సందర్భమూ’ సంకలనంలో ‘ఇన్ స్టెంట్ లైఫ్’ఎంపికయింది.
  • ‘కథ’ సంకలనాల్లో ఆరు కథానికలు- మసిగుడ్డ, వీడీఆర్ఎల్, ఇన్ స్టెంట్ లైఫ్, సాలభంజిక, వర్షపు జల్లుల్లో, ద లాస్ ఆఫ్ ఇన్నొసెన్స్ వచ్చాయి.
  • ‘వందేళ్ళ తెలుగు కథకి వందనం’లో ప్రచురణకు ‘యిన్ స్టెంట్ లైఫ్’ ను ఎంపిక చేశారు.

ఇతర కార్యకలాపాలు:

  • గుడిపాటి వెంకట చలం శత జయంతోత్సావాల సందర్భంగా ఆయన జీవితం-రచనలపై ఆంధ్రప్రదేశ్ లోని వివిధ పట్టణాల్లో, ఢిల్లీలో ప్రసంగాలు
  • వివిధ కళాశాలల విద్యార్థులకూ, పోలీసులకూ, ఓఎన్ జీసీ లాంటి కార్పొరేట్ సంస్థలకూ జెండర్ సమస్యలపై ప్రసంగాలు, ఓరియెంటేషన్ తరగతుల నిర్వహణ

ఇతర మీడియా కార్యకలాపాలు: క్రియేటివ్ హెడ్ గా జీ టీవీ , మా టీవీల్లో విధులు.

క్రియేటివ్ డైరెక్టర్ – టెలి ఫిల్మ్ : మంచుపూల వాన
స్క్రీన్ ప్లే . సంభాషణల రచన : నవ్య , మంచు తెర
డైరెక్టర్ : లఘు చిత్రం : ‘టి- జంక్షన్’

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.