మనం కలుసుకున్న సమయాలు (జయతి లోహితాక్షన్ పుస్తకావిష్కరణ & సమీక్ష)

-సి.బి.రావు

          కొన్ని పుస్తకాలను మనం చదువుతాం. మరికొన్ని మనల్ని చదివిస్తాయి. ఈ రెండవ కోవలోకి చెందే  పుస్తకాలలో జయతి లోహితాక్షన్ వ్రాసిన మనం కలుసుకున్న సమయాలు వుంటుంది.

          ఎవరీ జయతి లోహితాక్షన్?

          పూర్వాశ్రమంలో ఒక పాఠశాల అధ్యాపకురాలు. నేడు ఒక ప్రకృతి ప్రేమికురాలు, సంచార జీవి. స్వస్థలం: బోధన్ (నిజామాబాద్ జిల్లా), లోహితాక్షన్ (అధ్యాపకుడు) తో వివాహం. ఈ పుస్తకానికి ముందే జయతి వ్రాసిన రెండు పుస్తకాలు 1. అడవినుండి అడవికి 2.అడవి పుస్తకం. ఇప్పుడు తాజాగా మనం కలుసుకున్న సమయాలు. 

          ఈ పుస్తకం ఇటీవలనే, జయతి కుటీరంలో, జగ్గంపేట (కాకినాడ జిల్లా) లో, 2022 నవంబర్ 20 న, చిన వీరభద్రుడి గారిచే ఆవిష్కరింపబడ్డది. ఆశ్చర్యకరంగా సుమారు 50 మంది పుస్తకాభిలాషులు సుదూర ప్రాంతాల నుండి వచ్చి, సభను జయప్రదం చేసారు.

          ఈ పుస్తకావిష్కరణ సమయంలో జయతి మరియు లోహితాక్షన్ గార్ల లఘు ప్రసంగాలు ఈ కింది వీడియోల లో చూడగలరు.

https://drive.google.com/file/d/1Vmkfk9le9L-6JMjqncGSrUqQPwD8AfQh/view?usp=share_link

https://drive.google.com/file/d/1brxQi4n8qurEh3MfkmoMy5-PsBgzY2Bt/view?usp=share_link

మనం కలుసుకున్న సమయాలు

ఈ పుస్తకంలో జయతి అడవిలో తమ అనుభవాలను వివరిస్తారు. చెట్టు కింద జీవించటంలో, ప్రకృతి మమైక్యం లో కలిగే ప్రమోదాన్ని వివరిస్తారు. చెట్టు కింద నివసించే సమయంలో తమ పుస్తకాలను చెట్టు తొర్రలో భద్రపరుస్తారు. కాని కొన్ని రాత్రులు తెల్లవారు ఝామున చలికి తట్టుకోవటం కష్టం. అనుకోకుండా వాన వస్తే దగ్గరిలోని దేవాలయానికి వెళ్లి తలదాచుకోవల్సిందే. 

జయతి మాటల్లో

          “ఇప్పుడు కుటీరం లేదు. గోడల్లేవు. తలుపుల్లేవు. కప్పులేదు. ఎండా నీడ, చలీ, కొండా, నెగడు ఇవి మాత్రమే వున్నాయి. అడవి చుట్టూ వుంటే, కావలసిందేముంది. ఒక చెట్టు తొర్ర మా పుస్తకాల గూడైంది. మూడు చెట్లకి రెండు హమ్మోక్ లు (Hammock) బిగించి కట్టాం. నేనొక చెట్టు కింద నివాసం వుండాలని నాకెప్పుడూ అనిపించేది. అది ఇట్లా సాధ్యమైంది. లోహికీ ఈ చెట్టు కింద బాగుంది.” 

          జయతి సంచార జీవి అని పైన చెప్పాను కదా. సముద్ర తీరం నుంచి నదీ తీరానికి లేదా అడవి మధ్యలో వుండటానికి జయతి ఇష్టపడతారు. ఈ ప్రయాణాలలో ఎన్నో అనుభవాలు, కొన్ని తీపివైతే మరికొన్ని జటిలమైనవి.

గూడెపులోవ

          లోవ అంటే లోయ అని అర్థం. తూర్పు కనుమల్లో నాగుల పర్వత పాదాల్లో కొండ మీద చెట్టు కింద నుంచి కదిలి ఎనభై మైళ్ల అవతల వరాహనది వొడ్డున చిన్న కుటీరంలో నివాసం. కుటీరమంటే ఇనుప దూలాలపై, ఇనుప రేకులు. గోడలు, కిటికీలు లేవు. మరుగు కోసం ముందున ఒక దుప్పటి కట్టారు. జయతి కదిలి వెళ్తే సహవాసిగా వైటీ (అడవి కుక్క, వీరి పెంపుడు కుక్క) తోడూ, నీడగా వెంట రావల్సిందే. వైటీకి ఎక్కడకు వెళ్లినా, అక్కడి కుక్కలతో వైరం, స్నేహం రెండూ వుంటాయి. ఒక సాయంత్రం జయతి నది ఇసుక మీద కూర్చొన్నప్పుడు, కొండపైన జీడిపిక్కలేరే భార్యా భర్తలు తారసపడ్తారు. అతనికి ఎందుకో జయతి అంటే ద్వేషం. అప్పుడు జరిగిన విచిత్ర సంఘటన జయతి మాటల్లో-

          “అతడు తాగి తూలుతున్నాడు. అతడు మా సమీపంగా వచ్చాడు. అతడి కళ్ళు నిప్పుల్లా వున్నాయి. వైటీని దూషిస్తూ, ‘నా కుక్కనిపుడు పిలుస్తాను చూడు, నిన్ను చీరేస్తుంది. నాది సింహం, సింహం’ అన్నాడు. అన్నవాడు పిలవనే పిలిచాడు ఈల వేసి. దూరంగా నదిలో కుక్కల్తో ఆడుకుంటూ వుంది శివ. యజమాని పిలుపు విని ప్రతిస్పందించింది. బాణంలాగా దూసుకొచ్చింది. వైటీ దానికి ఎదురు వెళ్లింది. లోతు తక్కువ నీళ్ల దగ్గర కలుసుకున్నాయి. స్నేహంగా తోక వూపుతూ, వెనక కాళ్ల మీద కూర్చుంది వైటీ. నల్ల కుక్కా, దాని వెనక వచ్చిన నాలుగు కుక్కలూ వైటీ ముందు వినయంగా నాలుగు కాళ్లమీద కూర్చున్నాయి”.  

అడవిలో కవితాగానం

          “రాత్రి కాసేపు వెన్నెల్లో కూర్చున్నాము నేను లోహి. చుట్టూ మైలు దూరం దాకా నేను కోరుకున్న ఒంటరితనమే. నేనడిగాను ‘ఒక కవిత ఇవ్వవూ! ఏదైనా.’

          కాసేపాగి ఒక కవిత వినిపించారు. అట్లా మెక్సికన్ కవి అక్టేవియో పాజ్ తెలిశాడు.

Between now and now,

between I am and you are,

the word bridge. (Octavio Paz)

ఇక నా వంతు- A Zen Forest పుస్తకంలోంచి 

The Vacant Sky.

no front, no back;

The bird’s paths.

no east, no west.” 

అడవి కుటీరంలో ఒక రోజు

          “వైటీకి కిటికీలో పగటి నిద్ర ఇష్టం. కిటికీ లోపలి వైపు కందిరీగ గూడు కట్టుకుంది, సరిగా వైటీ పడుకునే చోట. ఏవేవో మోసుకొస్తూ లోపలికీ బైటకూ కందిరీగ ఎగుర్తూ వుంటుంది. పిల్లలు గూటిని ఖాళీ చేసి ఎగిరిపోతాయి. మరొక కందిరీగ వస్తుంది. మధ్యాహ్నం కావటానికి కొద్దిగా ముందు, మెల్లగా, చెట్టుపాము కిటికీ లోపలికి దూరి పైకప్పులోకెళ్తుంది. మధ్యాహ్నం కోసం వంట, రేపటి కోసం పప్పు నాన బెట్టటం వంటివి పూర్తిచేసి, ఆ సమయంలో నేను ఆ క్షణంలో వుంటాను. పై కప్పులో పాము ఏదో చేస్తుంది. కప్పల వేట, ఎలుకల వేట. మొన్న కుబుసం వదిలి పోయింది. మొదట కందిరీగ తిరగటం వైటీకి చిరాకు తెప్పించేది. దాన్ని వెళ్లగొట్టాలని చూసేది. రాను, రాను కిటికీలో వైటీ నిద్ర వైటీది, కందిరీగ పని కందిరీగది, పాము దారి పాముదీ ఐపోయింది.”  

          సంచార జీవి (Nomadic creature, Banjara Style), ప్రకృతి కాంత అయిన జయతి తెలిసో, తెలియకో హెన్రి డేవిడ్ థారో ని అనుసరిస్తున్నట్లుగా తోస్తుంది. Henry David Thoreau, American naturalist ప్రకృతి ప్రేమికుడు. రెండు సంవత్సరాలు వాల్డేన్ సరస్సు వొడ్డున, పట్టణానికి దూరంగా చిన్న చక్క కుటీరంలో గడిపాడు. మతం, రాజ్యాంగం ప్రజలను స్వేచ్ఛగా బతకనివ్వటంలేవని, వాటికి దూరంగా మనిషి ప్రశాంతంగా వుండగలడని అతని ప్రగాఢ  విశ్వాసం. అతని ఉవాచ ఏమంటే – “Live at home like a traveller”.

హెన్రి డేవిడ్ థారో ఆలోచనలో  

‘Most of the luxuries and many of the so-called comforts of life are not only not indispensable, but positive hindrances to the elevation of mankind. — Thoreau  

          హెన్రి డేవిడ్ థారో నాగరికతను తోసిపుచ్చలేదు; ఇంకా అడవే సర్వస్వమనలేదు. మధ్యస్తంగా ప్రకృతి, సంస్కృతి కలగలిసిన గ్రామీణ సహజత్వాన్ని కోరుకున్నాడు. 

          మహాత్మా గాంధి, లియో టాల్స్టాయ్, మార్టిన్ లూథర్ కింగ్ వంటి ప్రముఖుల పై Thoreau వ్రాసిన ‘Civil Disobedience’ ప్రభావం వుంది. Thoreau వ్రాసిన Walden పుస్తకం  అతని సాధారణ జీవితం, ప్రకృతి పై గల ప్రేమను తెలియచేస్తుంది. ఈ Walden పుస్తకాన్ని విశ్వవ్యాప్తంగా, భారతదేశం తో సహా కాలేజీలలో పాఠ్యపుస్తకంగా వుంచారు.  

          జయతి అడవిలో వుంటూ కూడా కెమేరా, చరవాణి (Mobile) లను వాడుతున్నారు. Facebook ద్వారా తన పాఠకులకు దగ్గరయ్యారు. ఆడవిలో ప్రకృతి దృశ్యాలను కనుల విందుగా facebook లో మనకు అందిస్తున్నారు. హెన్రి డేవిడ్ థారో చెప్పినట్లుగా అడవిని, శాస్త్ర విజ్ఞానాన్ని కలగలిపి జీవనం సాగిస్తున్నారు. తన అడవి అనుభవాలను తన పుస్తకాల ద్వారా మనకు తెలియచేస్తున్నారు ప్రకృతి కాంత జయతి.  

          ఇక చివరగా మనం కలుసుకున్న సమయాలు పుస్తకం గురించి మీకు ఒక చిన్న తమాషా ప్రశ్న.

పుస్తకం పేరులోని మనం అంటే ఎవరు?

1.జయతి & లోహితాక్షన్

2.జయతి  & పాఠకులు

3.జయతి, లోహి, నది, నీరు, మనుషులు, చెట్లు 

4.జయతి & చిన వీరభద్రుడు  

మీ సమాధానాన్ని  వ్యాఖ్యలో తెలియచేయండి.       

*****

Artist: ఉదయ్ కుమార్ మార్లపూడి

Please follow and like us:

One thought on “మనం కలుసుకున్న సమయాలు (జయతి లోహితాక్షన్ పుస్తకావిష్కరణ & సమీక్ష)”

  1. పరిచయ< బాగుంది. పుస్తక ఆవిష్కరణకి వెళ్ళళేకపోయాను కాని మరుసటి ఉదయం మిత్రులతో కుటీరానికి వెళ్ళాను. వైటి హైద్రాబాదు దగ్గిరలోని ఇబ్రహిం పట్నం లో ఉన్నప్పుడు, చిన్నప్పుడు నాతో ఆడుకుంది.

Leave a Reply

Your email address will not be published.