మా కథ (దొమితిలా చుంగారా)- 39

రచన: దొమితిలా చుంగారా 

అనువాదం: ఎన్. వేణుగోపాల్ 

కార్మిక శక్తి

          జనరల్ బన్ జెర్ ప్రజా సమ్మతితో అధికారంలోకి రాలేదు. మెషిన్ గన్లతో యూనివర్సిటీల్లో శ్మశాన ప్రశాంతి నెలకొల్పి, లెక్కలేనంత మందిని అరెస్టు చేసి బన్ జెర్ గద్దెనెక్కాడు. అధికారంలో స్థిరపడగానే ఆయన ప్రజా వ్యతిరేక చర్యలు చేపట్టాడు. మొదట డబ్బు విలువ తగ్గించాడు. తర్వాత ‘ఆర్థిక సంస్కరణలు’ తీసుకొచ్చాడు. తర్వాత కార్మికుల రేడియో స్టేషన్లను మూయించాడు. ……. అలా చాపకింద నీళ్ళలా ఒక్కొక్కపనీ చేసుకొచ్చాడు.

          కార్మిక సంఘాల్ని నిషేధించాడు. బొలీవియాలో సంఘాలుండడానికి వీల్లేదన్నాడు. గని కార్మిక సమాఖ్యనూ, సి.ఓ.బి నీ చెల్లవని ప్రకటించాడు. బొలీవియాలో తాను ఆడింది ఆటగా సాగాలనుకున్నాడు.

          కాని వాస్తవానికి బొలీవియన్ కార్మికవర్గం ఐక్యంగా సుసంఘటితంగా ఉన్నది. ఒక్క పురుషుల్ని మాత్రమే కాదు వాళ్ళ భార్యల్నీ, బిడ్డల్ని కూడ కలుపుకొని కార్మికవర్గం ఒక మహత్తర శక్తిగా మారి ఉంది. కార్మికోద్యమం ముగిసిపోలేదు, చనిపోలేదు. మేం బహిరంగంగా పనిచేయలేకపోయి ఉండవచ్చు కాని ఎంత నిర్బంధంలోనైనా మేం మునుముందుకే సాగిపోయాం.

          డబ్బు విలువ తగ్గించిన ఫలితంగా డాలర్ విలువ 12 పిసోల నుంచి 20 పీసోలకు పెరిగిపోయింది. 150 పిసోల అదనపు భత్యం చెల్లిస్తానని ప్రకటించిందిగాని చుక్కల నంటిన ధరలతో పోలిస్తే ఇది ఏ మూలకూ సరిపోదు. ఈ పరిస్థితి చూసి సంఘం స్త్రీలం ఒక ప్రతిపాదన పెట్టాం. కంపెనీ కొట్లో మాకు ఇచ్చే జీవనభృతి పరిమితిని పెంచ మన్నాం. కాని వాళ్ళు మా మాట పట్టించుకోక పోవడంతో ఒక మహిళా ప్రదర్శనకు రావలసిందిగా నేను రేడియోలో ఆహ్వానం పలికాను. ఆన్ సియా ఉన్నతాధికారి మా రేడియో స్టేషన్లో కొచ్చి మమ్మల్ని బెదిరించాడు. అవమానించాడు. “ఈ ప్రదర్శనలో వ్యభిచారులూ, లంజెలూ, సోమరిపోతులూ, మరే మంచి పని చేయలేని వాళ్ళు మాత్రమే పాల్గొంటార’ని రేడియోలో అన్నాడు. ‘ఇంతమాట పడ్డాక ఇంకెవరొస్తారు?’ అని నేను నిరాశపడ్డాను. నేనా విచారంతోనే ఇంట్లోంచి బయటికొచ్చాను. ఒక పొరుగు స్త్రీ ముఖంలోకి పరికించి చూశాను. “రాత్రి ఆ ఉన్నతాధికారి అన్నది విన్నావా?” అని ఆవిడ అడిగింది.

          “విన్నాను. ఈసారి బహుశా మనం విఫలమవుతామేమో!”

          “ఏమిటి? మనమా, విఫలం కావడమా? ఏమనుకుంటున్నావు నువ్వు? మనం తప్పకుండా ప్రదర్శన జరిపితీరాలి”.

          నిజంగానే జనం చాల ఆసక్తితో ప్రదర్శనలో పాల్గొన్నారు. రేడియోలో మా గురించి నీచంగా మాట్లాడిన ఆ వెధవను ఉరితీయాలని వాళ్ళు అరిచారు.

          ప్రదర్శన జరిగినంత సేపూ ఎవరూ మాట్లాడలేదు. మేం తిరిగి లాలాగువా నగర సమావేశం ప్రాంగణం దగ్గరికొచ్చేసరికి అక్కడ వీధుల్లో తిరిగి మాంసం అమ్మే స్త్రీలు కొందరు తమ కత్తులు సానబెట్టుకుంటూ తామిక మాంసం అమ్మదలచుకోలేదని, కిలోకు యాభై పిసోలిస్తేనే మాంసం ఇవ్వగలమనీ అన్నారు. ఎందుకంటే విలువ తగ్గింపు జరగగానే మాంసం కొట్లవాళ్ళే మొట్టమొదట కిలో మాంసం ధరను 9 పిసోల నుంచి 50, 60 పిసోలకు పెంచేశారు. అంటే డబ్బులు దండిగా ఉన్నవాళ్ళు మాత్రమే మాంసం తినగలరన్నమాట.

          ఈ మాటవిని జనం మాంసం కొట్టుమీద దాడిచేశారు. డిఐసి ఏజెంట్లు వచ్చారు. మళ్ళీ సైగ్లో-20లోని షా డెల్‌ మైనరోకు మేం చేరేసరికి జనం వచ్చి మామూలుగా గుంపులుగా నిలబడి జాతీయ గీతం పాడుతున్నారు.

          ఉపన్యాసాలిచ్చేవాళ్ళం యూనియన్ భవనం పై కప్పుమీదికి ఎక్కాంగాని ఏజెంట్లు బాష్పవాయువు ప్రయోగించి ప్రదర్శనను చిందరవందర జేశారు. ‘ఐపోయింది. మేం విఫలమయ్యాం ఇక లాభం లేదు …’ అనుకున్నాం. కాని కొద్ది క్షణాలాగి చూస్తే ఎటు చూసినా జనమే – జనం ఒక్క అంగుళం కూడా వెనక్కి తగ్గలేదు. ప్రదర్శకులను పోలీసులు అడ్డుకోలేకపోయారు. అది ఒక అపూర్వమైన ప్రదర్శన. ఆ ప్రదర్శన ద్వారా మేం విపరీతంగా పెరిగిపోతున్న ధరల్ని అదుపులో పెట్టగలిగాం.

          సైగ్లో -20 గని నుంచి ప్రతినెలా మూడు, నాలుగు వందల టన్నుల తగరం వెలికి తీయబడుతుంది. బొలీవియాని గనుల్లోకెల్లా ఎక్కువ తగరాన్ని ఉత్పత్తి చేసే గని కేంద్రం ఇదే. కనుక మా ఉత్పత్తికి సరిపోయేటట్టుగా మా కంపెనీ దుకాణాల్లో మాకు జీవనభృతి ఇవ్వాలని మేం ప్రతిపాదించాం. ఇతర గనులవాళ్ళు మా కంటే ఎక్కువ సరుకులు పొందుతున్నారు. అంతే కాదు, వాళ్ళ సరుకుల భృతి నిర్ణయించేటప్పుడు కుటుంబ సభ్యుల సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటారు. సైగ్లో-20లో మాత్రం ఈ సౌకర్యాలేమీ లేవు. మేమీ విషయమై కొమిబొలకు ఒక ఉత్తరం రాశాం. కంపెనీలో అత్యున్నతాధికారికి ఎంత భృతి దొరుకుతోందో మాకూ అంత దొరకాలని, ఎక్కువ తగరాన్ని ఉత్పత్తి చేస్తున్నందున మా భర్తలకా హక్కు ఉందనీ మేం రాశాం. వాళ్ళ సమాధానానికి ఒక గడువు పెట్టాం. అప్పటికీ వాళ్ళ నుంచి సమాధానమేమీ రాకపోతే అప్పుడు మళ్ళీ మేనేజర్ దగ్గరకెళ్ళి మరొక నలభై ఎనిమిది గంటల వ్యవధి కూడా ఇచ్చి చూశాం. ఐనా మాకు జవాబు రానేలేదు.

          అప్పుడిక మేం స్త్రీలనందరినీ సమావేశ పరిచాం. జీవనవ్యయ భృతి గురించి అడగాలనేది సర్వసభ్య సమావేశ నిర్ణయమైనా మేనేజర్ ఆ సంగతి మాట్లాడే కనీస మర్యాద పాటించలేదు. మేనేజర్ నాయకత్వాన్ని కలుసుకోవాలనే ఉద్దేశ్యంతో లేడు గనుక అందరమూ కలిసిపోదామని నిర్ణయించుకున్నాం. అలా మేమందరమూ కటావికి కాలినడకన బయల్దేరాం. అది కూడా చాలా పెద్ద ప్రదర్శనే.

          మేం కటావికి చేరేసరికి మేనేజర్ లేడు. కనుక మేం లాపాజ్ యూనియన్ నాయకుల్ని లాపాలోని కొమిటీల్ మేనేజర్ లో రేడియో సంబంధాలు కలపమని అడిగాం.

          అప్పటికి సైగ్లో-20కి మాంసం వచ్చి నెల రోజులు దాటిపోయింది. మా భర్తలు పనికష్టం తట్టుకోవడానికి మేం ఉపయోగించే ఒకే ఒక్క పోషకాహారం అది. ఈ సంగతి కూడా మేం కొమిబొల్ మేనేజర్ తో మాట్లాడదలచుకున్నాం. కటావి రేడియోకు లాపాజ్ రేడియోతో సంబంధాలు కలిపాక మేం ఆయనకు మా దృక్పథాన్ని వివరించి, తక్షణమే జవాబివ్వమని కోరాం .

          జనరల్ మాతో ఈ సంగతి ప్రశాంతంగా చట్టబద్ధంగా పరిష్కరించబడవలసి ఉందని నత్తులు కొట్టాడు. సాకులు చెప్పేందుకు ప్రయత్నించాడు. ఆయన చెప్పేది వింటుంటే మాకు చాల అసంతృప్తి కలిగింది. చివరికి మేం పిచ్చెత్తిపోయి “సరే కల్నల్ గారూ, మీరు మిలిటరీ మనిషని మాకు అర్థం అవుతూనే ఉంది. అందుకే గనుల్లో సమస్యలుంటాయని కూడా మీరు అర్థం చేసుకోలేరు. మీకు తెలిసిందల్లా బ్యారల్లో ఎలాంటి క్రమశిక్షణ, ఎలా అమల్లో పెట్టాలి, సైన్యాన్ని ఎలా నడపాలి, ఎలా ముందుకు తీసుకుపోవాలి అనే విషయాలే. వాటి గురించి మీకంతా తెలిసి ఉండొచ్చు. కాని గనుల్లో రెక్కలు ముక్కలు చేసుకోవడమంటే, ఖనిజం తవ్వడమంటే, హీనమైన పరిసరాల్లో ఉండడం అంటే మీకేమీ తెలియదు” అన్నాం. మా పరిస్థితి అర్థం చేసుకొమ్మనీ, మా భర్తల కోసం ఆహారం పంపమనీ, జీవన వ్యయ భృతి పెంచే విషయం ఆలోచించమనీ మేం అడిగాం.

          మా మాటలు విని ఆయన మాతో అర్థాంతరంగా సంబంధాలు తెంపుకున్నాడు. కాని మేం పట్టుదలగా అక్కడే ఉండడంతో అక్కడి వాళ్ళు మాకా పెద్దమనిషితో మళ్ళీ సంబంధాలు కలిపారు. అప్పుడాయన “నేను స్త్రీలతో మాట్లాడవలసిన అవసరం ఉందని చెప్పే చట్టమేమీ లేదు. నేను మీతో మాట్లాడదలచుకోలేదు” అని కోపంగా జవాబిచ్చాడు. మేం దాన్ని నవ్వులాటగా భావించి “బావుంది, కల్నల్ నీవు నీ భార్యతో మాట్లాడొచ్చునని చెప్పే చట్టం ఉందా?” అన్నాం.

          అప్పుడిక మా సంభాషణ కొంచెం మొరటుగా నడిచింది. ఆయన మళ్ళీ రేడియో కట్టేశాడు. నేనప్పుడు చాల మొండిగా ఉన్నాను. అప్పటికి నాకు ఉద్యోగ హోదాలతో అంతగా పరిచయం లేదు కాబట్టి కొమిబొల్ మేనేజర్ హోదా ఏమిటో తెలియక నేనాయనను కొన్నిసార్లు జనరల్ అనీ, కొన్నిసార్లు కల్నల్ అనీ, మరికొన్నిసార్లు ఊరికే ఏమండీ అనీ సంబోధించాను. ఈ హోదాలు – క్రమక్రమంగా తగ్గిస్తూ మాట్లాడడం చూసి కార్మికులు సంతోషించారు.

          మొత్తానికి కొమిబొల్ వాళ్ళు ఈ సమస్యను చర్చించడం కోసం తపాజ్ కు ఒక ప్రతినిధి బృందాన్ని పంపమని కోరారు. ఎన్నోసార్లు తిరగడానికి అవసరమైన సమయమూ డబ్బూ మాకు లేవుగనుక చర్చల కోసం వాళ్ళనే గనుల్లోకి రమ్మని మేమన్నాం.

          మాకు ఇతర గని పనివాళ్ళతో సమానమైన జీవనభృతి దొరకనే లేదు. వివక్షత ఇంకా కొనసాగుతూనే ఉంది. కొంత పెంచారుగాని అది మేమడిగనంత కాదు. నెలకు 30 కిలోల మాంసం, 20 కిలోల పంచదార, 8 కిలోల బియ్యం, 80 రొట్టెలు పెంచారు.

          మరుసటి రోజు మేం ఒక దర్యాప్తు జరిపాం. నిన్నటి ప్రదర్శనలో అందరూ పాల్గొనాలని మేం ప్రతిపాదించాం గదా, ఎందరు పాల్గొన్నారు, ఎందరు పాల్గొనలేదు? ప్రశాంతంగా ఇంట్లో బట్టలుతుకుతూనో, ఇస్త్రీలు చేస్తూనో కూచున్న స్త్రీలున్నారు. మేం ప్రదర్శన నిర్వహించబోతున్నామని విన్నప్పుడు వాళ్ళు హేళనగా మేమేమీ సాధించలేమన్నారు. మేం ఎందుకూ పనికి రామని, ఈ రకంగా సమయమంతా వృథా చేస్తున్నామని, ఆ సమయంలో వాళ్ళకు ఇంట్లో ఎన్నో బాధ్యతలున్నాయని వాళ్ళన్నారు. ప్రదర్శనకు వెళ్ళిన వాళ్ళందరమూ సమాధానం కోసం ఎదురుచూస్తూ రాత్రి పదింటి వరకూ అక్కడే కూచున్నాం. వాళ్ళు మమ్మల్ని ఎన్ని సమస్యలకు గురిచేసినా, చివరికీ సంభాషణ తెంచేసినా మేం పట్టు వదలలేదు.

          అక్కడ కనీసం నాలుగువేల మంది స్త్రీలం ఉండి ఉంటాం. ప్రదర్శన ముందు భాగం కటావిలోని యాజమాన్యపు కార్యాలయాల దగ్గర ఉన్నప్పుడు, చివర సైగ్లో-20 శ్మశానం దగ్గరుంది. అంటే అది దాదాపు రెండు కిలోమీటర్ల పొడవైన ప్రదర్శన అన్నమాట.

          అప్పుడు మేం ప్రదర్శనలో పాల్గొన్న వాళ్ళందరి చేతుల మీదా ముద్రలు వేశాం. ఒకటి యూనియన్ ముద్ర, మరొకటి గృహిణుల ముద్ర. ఈ ముద్రలు ఉన్న వాళ్ళ పేర్లు ఒక జాబితా రాసి పెరగబోయే జీవనవ్యయ భృతితో వాళ్ళకే ప్రయోజనం కలిగిద్దా మనుకున్నాం.

*****

(సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.