రాధ పెళ్ళి చేసుకుంది

(నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక & అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎన్నికైన కథ)

– పి. చంద్రశేఖర అజాద్

          అతని పేరు మోహన్.

          పన్నెండు సంవత్సరాల వయసులో మొదటిసారి రాధను చూసాడు.

          అటు పట్నం, ఇటు పల్లెకు మధ్యగా వున్న ఆ ఊరికి వాళ్ల నాన్నకి బదిలీ అయింది. ఏడవ తరగతిలో చేర్చటానికి నాన్న బడికి తీసుకు వెళ్లినప్పుడు స్నేహితుల మధ్య కనిపించింది.

          అప్పుడు రాధ కొత్త అమ్మాయిలా అనిపించలేదు. అంతకు ముందు నుండి ఇద్దరూ మైదానంలో కూర్చుని, ఆకాశం, ఎగిరే పిట్టలూ, చెట్లను చూస్తూ మాట్లాడుకునే వాళ్లం కదా అనిపించింది.

          మోహన్ అప్పటికే అనేక పుస్తకాలు చదివాడు. వాళ్లమ్మకి పుస్తకాలంటే ప్రాణం. కలలు అతన్ని కుదిపేస్తుంటాయి. ఆ కలల్లోకి తరచుగా ఓ అమ్మాయి గులాబిరంగు మేఘాల మధ్య, తెల్లటి గౌను వేసుకుని విహరిస్తుండేది. మోహన్ కూడా అలా మబ్బుల్లోకి ఎగిరి ఆ అమ్మాయి చేతిని అందుకునే ప్రయత్నం చేసేవాడు. ఆమె చిటికెన వేలుని అందుకోబోతుండగా ఓ పెద్ద కుదుపు. అగాధాల్లోకి జారిపోతున్నప్పుడు ఉలిక్కిపడి లేచేవాడు.

          ఎప్పుడూ అదే కల! అక్కడే ఆ కల తెగటం!!

          అప్పటి నుంచి ఆ అమ్మాయిని తనకు కనిపించే ఆడపిల్లల్లో వెతికేవాడు. ఇప్పటికి నా కలల సుందరి దొరికింది అనుకున్నాడు.

***

          రాధ వాళ్ల నాన్న దగ్గర్లోని పల్లెలో వ్యవసాయం చేస్తుంటాడు. రోజూ బైక్ మీద వెళ్ళి వస్తుంటాడు. అలా అని మోతుబరి రైతు కాదు. ఆరు ఎకరాల భూమి వుంది. రాధను చదివించటం కోసం వచ్చారు. రాథకి ఓ చెల్లెలు వుంది. ఇద్దరికీ మూడు సంవత్సరాల తేడా వుంది. మోహన్ వాళ్ల కుటుంబం రాధ వాళ్ల పక్క ఇంటిలో చేరింది. పరిచయాలు జరిగాయి.

          ఓ రోజు రాధ తన ఇంటి నుండి ఓ బాక్స్ తీసుకుని వచ్చింది.

          మూత తీయగానే గుప్పున మషాళా వాసన, ఎర్రటి రంగు, నూనె బాక్స్ అంచుల్ని తాకుతోంది. ఆ ఘాటుకి మోహన్ కి తల తిరిగినట్లు అనిపించింది. మరుసటి రోజు ఇద్దరూ బడికి వెళ్తున్నారు.

          ”కోడికూర బాగుందా”? అడిగింది రాధ

          ”నేను మాంసం తినను” అన్నాడు మోహన్.

          ”ఈ విషయం మా అమ్మకి తెలియదు. ఆ కూరని పారేశారా?”

          ”లేదు. మా అమ్మతింది”.

          అప్పుడు ఆశ్చర్యంగా చూసింది.

          ”మా అమ్మా నాన్నలది ప్రేమ పెళ్లి. ఇద్దరి కులాలు వేరు. రెండు పక్కల బంధువులు మా ఇంటికి రారు. మాకు స్నేహితులయినా, చుట్టాలయినా బయటివారే”. అలానా అన్నట్లు కళ్లు తిప్పింది రాధ.

          ”మా నాన్న కూడా మాంసం తినడు. ఆ అలవాటు నాకు వచ్చింది” అంది రాధ. అప్పుడు మోహన్ అమ్మా నాన్నల కులం గురించి రాధ అడగలేదు. చూస్తుండగానే కాలం కదిలిపోయింది. ఇంటర్ మీడియట్ వరకు అక్కడ వున్నారు. ఆ ఊర్లో జూనియర్ కాలేజ్ వుంది. రాధ సైన్స్ గ్రూప్ తీసుకుంటే మోహన్ ఆర్ట్స్ గ్రూప్ తీసుకున్నాడు.

          ”ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు” అంది రాధ.

          ”డిగ్రీ నుండి లిటరేచర్, తర్వాత పిహెచ్.డి తీసుకుని డాక్టర్ కావాలను కుంటున్నాను.

          ”ఉద్యోగాలు వస్తాయా?”

          ”లెక్చరర్ గా ప్రొఫెసర్ గా అవకాశాలు వస్తాయి”

          ఈ సారి హైదరాబాద్ కి మోహన్ వాళ్లు వెళ్తున్నారు.

          చివరి రోజు ఇద్దరూ కలుసుకున్నారు.

          ”నువ్వు చదువుని కొనసాగిస్తావా” అడిగాడు మోహన్.

          ”చేస్తాను. ఇంట్లో వద్దన్నా నేను ఒప్పుకోను” అంది రాధ.

          ”మనం తిరిగి ఎప్పుడు కలుసుకుంటామో తెలియదు. అందుకని నా మనసులో మాటని చెబుతున్నాను. నిన్ను చూసిన క్షణం నుండి మన మధ్య ఓ అనుబంధం వుందనుకున్నాను. ఇప్పటి దాకా మంచి స్నేహితులుగా వున్నాం. ఈ బంధం కొనసాగాలని నేను కోరుకుంటున్నాను”.

          ”స్నేహితులుగానేనా?” సూటిగా అడిగింది రాధ.

          ”నీ మీద నాకు ఇష్టం వుంది. ప్రేమ వుంది. కలిసి బతకాలన్న ఆశ వుంది. మనం టీనేజ్ లో వున్నాం. ఇప్పుడే ఇవన్నీ మాట్లాడటం సరయిందో కాదో నాకు తెలియదు. ముందు మనకంటూ గమ్యాలుండాలి. ఇంట్లో పెళ్లి గురించి సంభాషణ వస్తే నేను రాధని ప్రేమిస్తున్నాను అని చెబుతాను. ముందు అది నీకు చెబుతున్నాను”.

          రాధ మౌనంగా వుండిపోయింది. కొద్ది క్షణాల తర్వాత…

          ”నీకు ఇష్టం లేకపోతే చెప్పు. మనం స్నేహితులుగానే వుందాం” అన్నాడు మోహన్.

          ”నేను నీతో కలిసి బతకటం కుదరదనుకో. నువ్వు పెళ్లి మానేస్తావా?” అడిగింది రాధ.

          మోహన్ కొద్ది సేపు ఆలోచించాడు.

          ”మనం ప్రాక్టికల్ గా వుండటం మంచిది రాధా. రేపు ఏం జరుగుతుందో నేను చెప్పలేను. మనకంటే బతుకు శక్తివంతం అని నాకు తెలుసు. మనం కలిసి బతకలేక పోవటం అనేది నా వరకు ఓ మహా విషాదం. నేను ఒంటరిగా వుంటానా, ఇంకెవరినన్నా నా జీవితంలోకి ఆహ్వానిస్తానా అనేది ఇప్పుడు చెప్పలేను”.

          ”మంచిది మోహన్. నాకు కూడా నువ్వంటే ప్రేమ. నీతో కలిసి బతకాలని నాకుంది. చివరి నిముషం వరకూ అందుకు ప్రయత్నం చేస్తాను” అంది రాధ.

***

          రాధ పెళ్లి చేసుకుంటోంది.

          ఈ మాట విన్నప్పుడు మోహన్ ఉలిక్కిపడ్డాడు.

***

          రాధ మోహన్ లు కాస్త ఎడంగా కూర్చున్నారు.

          ఎదురుగా విశాఖ సముద్రం.

          నాలుగు సంవత్సరాల తర్వాత కలుసుకోవటం. ఈ మధ్య కాలంలో కొన్ని లేఖలు.

          ”నిన్ను కలుసుకుంటానని అనుకోలేదు” మోహన్

          ”ఏం జరగాలన్నా సమయం ఆసన్నం కావాలి కదా!” రాధ.

          ”నువ్వు పెళ్లి చేసుకుంటున్నావని విన్నాను”.

          ”గ్రాడ్యుయేషన్ అయ్యాక నువ్వు చదువుకుంటావా? పెళ్లి చేసుకుంటావా అని ఇంట్లో అడిగారు. చదువుకుంటాను అన్నాను. ఈ మధ్య మళ్లీ పెళ్లి గురించి కదిపారు. నేను మోహన్ని చేసుకుంటాను అన్నాను. వారిలో ఆశ్చర్యంతోపాటు షాక్ కలిగింది. వాళ్లకు కులం లేదుగా అన్నాడు నాన్న. కులం లేకపోవటం ఏమిటి! అమ్మా నాన్నలవి రెండు కులాలు. మోహన్ ది మూడో కులం అన్నాను”

          మోహన్ ఆశ్చర్యంగా చూస్తున్నాడు.

          ”మీ ఇద్దరూ కలిస్తే నాలుగో కులమా అంది అమ్మ. అవును. ఆ తర్వాత ఇలా కులాలు పెరుగుతుంటాయి. అలాగే ప్రాంతాలు, భాషలూ, దేశాలు కలుస్తుంటాయి, నదులు సముద్రాలను కలిసినట్లు అన్నాను. నువ్వు చదువు మానేయ్ అన్నారు. చదువుకీ పెళ్లికి సంబంధం ఏమిటి అన్నాను. అయితే పెళ్లి చేసుకుని చదువుకో అన్నారు. అలా సంబంధాలు వెతుకుతున్నారు. అప్పుడు నేను పెళ్లి చేసుకుంటున్నాననే వార్త బయటకు వచ్చింది”

”తర్వాత….?”

          ”ఈ మధ్యన ఓ సంబంధం వచ్చింది. నేను అతన్తో మాట్లాడాలన్నాను. సరే అన్నారు. అతనికి చెప్పాను. నాకు మోహన్ అనే మిత్రుడితో ప్రేమతో పాటు శారీరక సంబంధం వుంది. చదువుకీ పెళ్లికి సంబంధం లేనట్లు, శరీరానికి పెళ్లికి కూడా లేదు అనుకుంటే మనం కలిసి బతుకుదాం అన్నాను. ఇంటికి వెళ్లాక చెబుతాను అన్నాడు. తర్వాత ఏం చెప్పాడో తెలియదు. ఇంట్లో గొడవ జరిగింది” అని ఆ సన్నివేశం గురించి చెప్పింది.

          ”నువ్వు అతన్తో ఏం మాట్లాడావు?” సీరియస్ గా రాధ నాన్న.

          ”అతను చెప్పి వుంటాడు కదా?”

          ”నువ్వు అతనికి చెప్పిన మాటను మోహన్ కి చెప్పి చూడు. అప్పుడేమంటాడో తెలుసుకోవాలని నాకూ వుంది” అన్నాడు రాధ నాన్న.

          అక్కడ ఆపి మోహన్ కళ్లల్లోకి చూసింది.

          ”పెళ్లి మీద నీ అభిప్రాయం ఏంటి రాధా?” అడిగాడు మోహన్.

          ”మా బంధువుల్లో ఒకావిడ వుంది. ఆమె పెళ్లి చేసుకోలేదు. ఆస్తి వుంది. ఆమెది కూడా నా లాంటి సమస్యేమో నాకు తెలియదు. బాగా చదువుకుంది. మంచి ఉద్యోగం చేసింది. ఇప్పటికీ ఒంటరిగా వుంది. నీతో నా పెళ్లికి మా ఇంట్లో ఒప్పుకోం అన్నాక ప్రేమకి, పెళ్లికి కూడా ఇక్కడ స్వేచ్ఛ లేదని నాకు  అర్థం అయింది. అడ్డుగా చాలా గోడలు వున్నాయి. నువ్వు చెప్పు మోహన్”

          ”తర్వాతేం జరిగిందో చెప్పు. నేను నా అభిప్రాయం చెబుతాను”

          ”చదువు మానేయమన్నారు. కుదరదు అన్నాను. మాకూ నీకు సంబంధం లేదు అన్నారు. మంచిదన్నాను. విశాఖలో చదువు కంటిన్యూ చేస్తున్నాను. ఇప్పుడు నాకు మీ అమ్మా నాన్నల్లా స్నేహితులు మాత్రం వున్నారు. వారికి పెళ్లి తర్వాత, నాకు పెళ్లికి ముందే” అంది రాధ.

          ”మనిద్దరి మధ్య ఎలాంటి రిలేషన్ వుందో నీకు తెలుసు. మీ నాన్నకి కాదు. నీకు చెబుతున్నాను. నువ్వు ఇతరుల్తో శారీరక సంబంధాలు పెట్టుకోవనే నమ్మకంతో నేను ఈ మాటలు అనటం లేదు. యాక్సిడెంటల్ గానో, మోహించో ఇతరులతో రిలేషన్ నీకున్నా అది గతం అనుకుంటాను. మనం కలిసి బతుకుదాం”

          ”నాకు ఇంకొకరితో రిలేషన్ వుందని మీ పేరెంట్స్ కి చెప్పగలవా?”

          ”చెబుతాను. అది నా బాధ్యత అనుకుంటాను. వాళ్లు అంగీకరిస్తే మంచిదే. కాదంటే నా బతుకు నాది అంటాను”

          ”మన పెళ్లి అయ్యాక కూడా ఇతరుల్తో రిలేషన్స్ కంటిన్యూ అయితే?”

          ”మనం పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నాం రాధా. ఇప్పటి వరకూ నాకు ఏ స్త్రీతోనూ శారీరక సంబంధం లేదు. పెళ్లి అనే వ్యవస్థలో ఇద్దరు వ్యక్తుల సహజీవనం వుంటుంది. వుండాలి. ఎవరికి నచ్చకపోయినా బలవంతంగా కలిసి వుండనవసరం లేదు. ఎవరి బతుకు వారు బతకొచ్చు. అలాంటి చట్టం రావటానికి పెద్ద పోరాటాలు జరిగాయి. పెళ్లి అనే వ్యవస్థ బయటకి వచ్చి నువ్వు మాట్లాడుతున్నావు”

          ”పెళ్లి అనే వ్యవస్థలో వుంటూ రెండు సంబంధాలను కొనసాగిస్తున్నవారు లేరా?” అంది రాధ.

          ”ఉంటారు. అలాంటివి కొంత మంది రహస్యంగా చేస్తారు. విడాకుల చట్టం వున్నప్పుడు అలా ద్వంద్వంగా ఎందుకు బతకాలి? బతకలేమని భయమా? సెక్యూరిటీ కోసమా? ఓ కొత్త మార్గం వేయాలనుకున్నప్పుడు, కనీసం అలా బతకాలనుకున్నప్పుడు ఇలాంటి వాటినీ ధిక్కరించాలి. అది నిజాయితి” అన్నాడు మోహన్.

          ”ఈ మధ్య పెళ్లి మీద కొత్త ప్రశ్నలు వస్తున్నాయి” అంది రాధ.

          ”ఇప్పుడు రావటం ఏమిటి? పెళ్లి అనే వ్యవస్థ మొదలయినప్పటి నుంచి వున్నాయి. అవి మన దాకా రాకపోవచ్చు. అయినా పెళ్లి మీదేనా ప్రశ్నలు. ప్రేమ, మోహం, జీవితం మీద లేవా? అసలు లోపం లేని వ్యవస్థంటూ వుందా? ప్రశ్నించటానికి వీలు లేదన్న వేదాల మీద ప్రశ్నలు లేవా? ఎవరు ఎక్కడ పని చేస్తున్నా లోపాలు వున్నాయని తెలిసీ అక్కడ ఎందుకు పని చేస్తున్నారు? ఎప్పుడు బయటపడుతున్నారు? ఇవి కూడా ఆలోచించాలి. ఈ ప్రశ్నలు నీ అన్వేషణలో భాగం అయితే నేను సంతోషిస్తాను. రాబోయే మార్పులు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. సహజమైన విషయాలు కూడా వక్రీకరణకు గురవుతాయి. జీవితానికి, సిద్ధాంతానికి, ఆచరణకు మధ్య గల గీతలు చెరిపేసే ప్రయత్నం చేస్తారు. మనం బయలుదేరదాం” అన్నాడు మోహన్.

          ”నీ ప్రేమకీ, పెళ్లికి సమాధానం దొరికిందా” అంది రాధ.

          ”ఆ రెండు విషయాల్లోనూ నాకు స్పష్టత వుంది. నీకు క్లారిటీ వచ్చిన రోజున మనం మాట్లాడుకుందాం” అన్నాడు.

***

          అయిదారు సంవత్సరాలు గడిచిపోయాయి.

          ఆ రోజు తర్వాత రాధతో ఎలాంటి సంభాషణ లేదు. ఇప్పుడు హైదరాబాద్ లో సమావేశం. రాధ బెంగళూరులో పని చేస్తోంది. ముందు మోహనే అడిగాడు నీతో మాట్లాడాలి. నన్ను అక్కడకి రమ్మంటావా అని. తనే వస్తానంది.

          గోల్కొండ కోట దగ్గర కలుసుకున్నారు. ఇంతకు ముందు రాధకి ఇప్పటి రాధకీ పోలికే లేదు. భాష, దుస్తులు, నడక తీరు, ఆమె లోని కాన్ఫిడెన్స్, ఓ గంభీరత, అణువణువులోనూ మార్పు కనిపిస్తోంది.

          ”నీ నుండి సమాధానం వస్తుందని ఇప్పటి వరకూ ఎదురు చూసాను. నువ్వు మరిచిపోయి వుండాలి లేదా నీకు క్లారిటీ రాకపోయి వుండొచ్చు. నేను ఓ కుటుంబాన్ని డ్రీమ్ చేస్తున్నాను. అప్పుడు అడిగిన నీ ప్రశ్నకు జవాబు మళ్లీ చెబుతున్నాను. నీ జీవితంలోకి ఎవరు వచ్చినా, రాకపోయినా నువ్వు ఇష్టపడితే మనం పెళ్లి చేసుకుందాం”

          ”ఇంకా నన్ను గాఢంగా ప్రేమిస్తున్నావు! మనం సహజీవనం చేద్దాం” అంది రాధ.

          ”పెళ్లి చేసుకున్నాక ఎవరైనా చేసేది అదే. ఆ పదానికి నీ నిర్వచనం చెబుతావా?”

          ”ఇద్దరం దూరంగా వున్నాం. ఎవరో ఒకరు ప్రొఫెషన్ ని వదులుకోవాలి. అది నువ్వా, నేనా అనేది తేల్చుకోవాలి. ఎవరి వృత్తిని వారు చేసుకుంటూ మనం కలిసి బతకొచ్చు కదా!”

          ”అది ఆర్థిక పరిస్థితిని బట్టి ఆధారపడి వుంటుంది. పెళ్లి చేసుకున్నవారు పిల్లల కోసం, చదువుల కోసం అనేక మంది దూరంగా వుంటున్నారు. మనం పెళ్లి చేసుకుందాం. నాకు వీలయినప్పుడు నేను బెంగళూరు వస్తాను. అలానే నువ్వు హైదరాబాద్ రావచ్చు”.

          ”పెళ్లి అంటేనే పురుషుడి ఆధిపత్యం” అంది రాధ.

          ”అలా ఎందుకు అనుకోవాలి. కొన్ని కుటుంబాల్లో స్త్రీల ఆధిపత్యం వుంది”.

          ”ఆ సంఖ్య స్వల్పం”.

          ”ఇక్కడ అంకెలు కాదు ముఖ్యం. నువ్వో సంస్థలో పని చేస్తున్నావు, మీ బాస్ స్త్రీ కావచ్చు. పురుషుడు కావచ్చు. రేపు నువ్వే బాస్ వి కావచ్చు. ఆధిపత్యం లేని చోటు ప్రపంచంలో వుండదు – కనీసం కొన్ని శతాబ్దాలు”.

          ”ఇక్కడ కావాల్సింది తర్కం కాదు” అంది రాధ.

          ”తర్కం లేకుండా ఏ మార్పు మొదలు కాదు. నువ్వూ, నేను ప్రేమించుకున్న క్షణాల్లో తర్కం వుందేమో నాకు తెలియదు. నేను అప్పటికి గుర్తించలేదు. ఆధిపత్యాల గురించి నువ్వు మాట్లాడుతున్నావంటేనే అది నువ్వు వాడుకుంటున్నట్లు”.

          ”పెళ్లిని నేను హేట్ చేస్తున్నాను. ఎందుకు పెళ్లి? పిల్లల కోసమా? ఇవన్నీ మగవాళ్లు ఆడవారి మీద రుద్దారు. స్త్రీలంటే పిల్లల్ని కనే ఓ ఫ్యాక్టరీ”

          ”సంఖ్యల గురించి మాట్లాడావు కదా! మాతృత్వం ఓ వరం అనుకునేవారు చాలా కోట్ల మందున్నారు. కొంత మంది పిల్లల్ని కనాలనుకున్నా కనలేరు. లోపాలు ఎవరిలోనయినా వుండొచ్చు. ఇప్పుడు పిల్లలు కావాలనుకుంటే చాలా మార్గాలున్నాయి రాధా!”

          ”సెక్స్ అనేది భౌతిక అవసరం. ఒప్పుకుంటావా?” అంది రాధ.

          ”అది సహజమైన విషయం”.

          ”దూర దూరంగా వున్నప్పుడు ఆ అవసరాన్ని ఇతరుల్తో తీర్చుకుంటే తప్పేంటి? అన్ని రకాల భోజనాలు తింటున్నాం కదా! దాని చుట్టూ ఇన్ని తాత్విక గూళ్లు అల్లు కోవటం ఎందుకు?

          చిన్నగా నవ్వాడు మోహన్.

          ”ఎందుకు నవ్వుతున్నావు?”

          ”గూళ్లు అల్లుకునేది రక్షణ కోసం. అవి పిట్టల కోసమైనా!. మనుషుల కోసమైనా మనుషులు ఎందుకు బతకాలి? తిండికా? బట్టకా? పిల్లల కోసమా? సెక్స్ కోసమా? ఇలా అడిగితే ఏం మాట్లాడగలను. మాట్లాడితే మాత్రం నీకు నచ్చుతుందా?”

          ”మాట్లాడాలి. ఎవరికి నచ్చకపోయినా, నేను మాట్లాడుతున్నాను కదా!”

          ”ఇవన్నీ లేకుండా కూడా మనుషులు బతికారు. ఇప్పటికీ బతుకుతున్నారు. అంతకు మించి లోతుకు వెళ్ళాను. సెక్స్ కోసమే అయితే పెళ్లి కంటే సహజీవనంలోనే అలాంటి అవకాశం వుంది. పెళ్లి మంచికో, చెడుకో కొన్ని నియమాలు పెట్టుకుంది. పెళ్లి తంతుని ఇష్టపడని వారు కూడా సహ జీవనాన్ని విచ్చలవిడిగా వాడుకోవటం లేదు. ఇంక చర్చ అనవసరం. మనం ఫ్రెండ్స్ గా వుందాం”.

          ”అది మాత్రం ఎందుకు?”

          ”శత్రువులుగా వుండాల్సిన అవసరం లేదు కాబట్టి. ఎవరి బతుకు వారు బతుకు తున్నాం కదా!”

          ”విష్ యూ హ్యాపీ మ్యారీడ్ లైఫ్” అంది రాధ.

          ”థాంక్స్. నువ్వు కోరుకుంటున్న లేదా నువ్వు మంచి దనుకుంటున్న సహజీవనంలో నువ్వు సంతోషంగా వుండాలి రాధా. ఎవరికయినా అంతిమ లక్ష్యం ఆనందంగా బతకటమే!”

          ”సంతోషం”

          తర్వాత రాధకి తన పెళ్లికి చెందిన శుభలేఖను పంపాడు. మోహన్ దంపతులకు గ్రీటింగ్స్ పంపింది.

***

          తర్వాత రాధ అమెరికా వెళ్లిందని తెలిసింది. మధ్యలో రకరకాల వార్తలు వినిపించాయి. ప్రముఖ సెలబ్రిటీలతో సహ జీవనం చేస్తోందని. ముఖ్యంగా హైసొసైటీ మహిళా బృందాల్లో తిరుగుతోందని.

          కాలం దశాబ్దాల్లోకి విలీనం అయింది. కాలానిది ఆగని పయనం.

          ఆ రోజు మోహన్ తన భార్యతో కలిసి ఎయిర్ పోర్ట్ కి వెళ్లాడు-తమ అమ్మాయిని ఢిల్లీ పంపించటానికి. వీడ్కోలు చెప్పి కార్ పార్కింగ్ దగ్గరికి వెళ్తుంటే ‘మోహన్’ అని ఎవరో పిలిచారు. ఆగి చూసాడు.

          పరుగులు తీసుకుంటూ వచ్చింది రాధ.

          ఎంత మేకప్ చేసుకున్నా జుట్టుకి రంగువేసుకున్నా, వృద్ధాప్య లక్షణాలు కనిపిస్తున్నాయి. ముఖంలో జీవితం అందించిన అనుభవాల తాలూకు మెరుపులూ వున్నాయి. అదే ఉత్సాహం ఆమెలో.

          ”సునీతా… నీకు చెబుతుంటాను కదా రాధ. నా తొలి ప్రేమికురాలు”

          సునీత నమస్కరించింది.

          ”ఇంత సడన్ గా దర్శనం ఏమిటి రాధా!”

          ”నేను పూర్తిగా ఇండియా వచ్చేశాను. నీకో షాకింగ్ విశేషం చెబుతున్నాను. ఇంతకు ముందు బయట వారి నుండి విన్నావు. నీ రాధ పెళ్లి చేసుకుంటోంది”.

          చిన్నగా నవ్వాడు.

          ”నువ్వు సంతోషపడతావని నాకు తెలుసు”

          ”ఇప్పుడు నా కెందుకు సంతోషం. ఈ నిర్ణయం అప్పుడు తీసుకుని వుంటే ఆనందంతో చిందులు తొక్కేవాడ్ని”

          ముగ్గురూ నవ్వుకున్నారు.

          ”నువ్వు పెళ్లి అనే వ్యవస్థ మీద యుద్ధం చేశావు కదా!” అన్నాడు మోహన్

          ”అది తప్పు. నేను యుద్ధం చేయలేదు. అస్త్ర సన్యాసం చేయలేదు. నా బతుకు నేను బతికాను. మీలాంటి వారందరి వల్ల నన్ను నేను సంస్కరించుకున్నాను” అంది రాధ.

          ”ఇండియా వచ్చావు కాబట్టి మా ఇంటికి వచ్చి సునీతని ఇంటర్వ్యూ చెయ్యి. నా ఆధిపత్యం గురించి చెబుతుంది”.

          ”తప్పకుండా. నీ విజటింగ్ కార్డ్ ఇవ్వు. మనం కలుసుకుందాం” అని తీసుకుని ఇద్దరికీ ‘బై’ చెప్పి వెళ్లిపోయింది.

          రెండు రోజుల తర్వాత మోహన్ కి ఫోన్ వచ్చింది.

          ”నేను రాధని” అంది.

          ”చెప్పురాధా”

          ”నేను చెప్పటం కాదు. ఇన్ని దశాబ్దాల తర్వాత ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావని నువ్వు నన్ను అడగాలి”.

          ”అది నీ వ్యక్తిగతం రాధా. పెళ్లి గురించి నువ్వు అనేక కోణాల్లో మాట్లాడావు. పెళ్లి అనే వ్యవస్థలో బతుకుతున్న ఆడవారి మీద మీ బృందాల్లో నవ్వుకునే వారన్న విషయం, జాలి పడటం నాకు తెలుసు. అలాంటి వారు మీలాంటి వారిని చూసి జాలి పడతారనేది వేరే విషయం. అప్పుడలా వుండటానికి, ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవటానికి నీకు అహం అడ్డురాలేదు అందుకు సంతోషం”

          ”మోహన్. అది ఫోన్లోనో, కొన్ని గంటల్లోనో చెప్పే విషయం కాదు. అది నీకు మాత్రమే కాదు. ప్రపంచానికి చెప్పాలి. ఆ బాధ్యత నాకుంది. ఇప్పటి వరకు ఎన్నో అనుభవాలు వచ్చాయి. నా జీవితాన్ని నేను ప్రయోగ శాలగా మార్చుకున్నాను. నాకు ద్వంద్వం అంటే ఏంటో ప్రాక్టికల్ గా తెలిసింది. ఇప్పుడు ఆలస్యంగా అయినా పెళ్లి తాలూకు అనుభవాలను తెలుసుకోవాలని పించింది. రేపు శుభలేఖ వస్తుంది. నాలుగు రోజుల్లో నా పెళ్లి. నువ్వూ సునీత తప్పకుండా రావాలి”.

          ”అలాగే”

          ”నేను నా జీవితానుభవాలు రాస్తున్నాను. అది ఇంకో ఛాప్టర్ వుంది. అది నిన్ను కలిపి చర్చించాక పూర్తి చేస్తాను. అందులో సంచలనాలు వుండవచ్చు. నా ప్రయాణంలో నా భాగస్వామ్యం వుంది. నేను ఇష్టపడి చేసిన జర్నీ అది. నేరం ఎవరి మీదో నెట్టను. ఒకటయితే నిజం. ఎవరు ఏం ప్రవచిస్తున్నారనేది కాదు. ఎవరి ఆచరణ ఎలా వుంది. ఇది నిర్ణయించుకోవలసింది వ్యక్తులే. నా కథను అలానే తీసుకోవాలి. వీలయితే మీరు రేపు బయలుదేరండి. పెళ్లి ఏర్పాట్లు చూసే బాధ్యత ఓ మిత్రుడిగా నీకూ వుంది” అంది.

***

రాధ పెళ్లి చేసుకుంది!

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.