మరో సమిథ
-ఆదూరి హైమావతి
కారు దిగి తలెత్తి చుట్టూ చూసింది సిరి. వెంటనే తలత్రిప్పి తండ్రికేసి చూసి “భయంగా ఉంది నాయనా! ఇంతపెద్ద భవనంలో నా క్లాసెక్కడో ఎలాతెల్సుకోనూ” అంది భీతి గా.
“ఉండు తల్లీ! నిన్నొక్కదాన్నే ఎలాపంపుతానూ?నేనొస్తాగా “అంటూ కారు దిగి సిరి వెంట నడిచాడు ఆమెతండ్రి ఆనందయ్య.
ఇద్దరూ నడుస్తూ మెయిన్ ఆఫీస్ లోనికెళ్ళారు. తనను పరిచయం చేసుకుని, తన పాప క్లాస్ ఎక్కడో అడగ్గా, ఆఫీస్ లో ఆ ఉద్యోగి ఒక వ్యక్తిని తోడుగా పంపాడు, క్లాస్ చూపను.
క్లాస్ లో ఒక మహిళా లెక్చరర్ ఉన్నారు. అక్కడ సిరి, వాళ్ళనాన్న గారూ ఆగగానే ఆమె తలెత్తి చూసింది.
“మేడం న్యూ అడ్మిషన్” అని చెప్పి ఆవ్యక్తి వెళ్ళిపోయాడు.
“మా అమ్మాయండీ! కొత్తగా ఇక్కడ చేరను వచ్చింది.” అని పరిచయం చేశాక, ఆమె “అలాగే ! మీరు నిశ్చింతగావెళ్ళి రండి” అని ఆమె చెప్పాక ,
“వస్తానమ్మా! సిరీ తల్లీ !, సాయంకాలం వచ్చి తీసుకెళతాగా! ధైర్యంగా ఉండు” అని చెప్పి, కూతురు తలమీద నిమిరి వెళ్ళారాయన.
క్లాసులో మేడం “రామ్మా! వచ్చి కూర్చో” అన్నాక వెళ్ళి ఖాళీగా ఉన్న మొదటి బెంచీలో కూర్చుంది సిరి. ఆ మేడం అందరినీ పరిచయం చేసుకుంటూ, ఒక్కోరినీ లేపి పేరూ,
ఊరూ, చదివిన హైస్కూల్, మార్కులూ మొదలైనవి అడుగుతుండగా, సిరి వంతు వచ్చింది.
“నీపేరేంటి” అని ఆమె అడిగ్గానే లేచి నిలుచుంది సిరి,
“నాపేరు సిరి” అంది
“ఎక్కడ చదివావు ఇంతకుముందు” అనగానే
సిరి “మా ఊర్లోనే నండీ! ఒకటో క్లాస్ నుండీ పదోక్లాస్ వరకూ అక్కడే.”
“మీ ఊరిపేరేంటమ్మా?”
“మా ఊరు చింతక్రిందిపల్లె” అనగానే క్లాసంతా నవ్వారు.
‘పాత చింతకాయ పచ్చడన్నమాట’
‘చూస్తే తెలీడంలా! ఆ పట్టుపరికిణీ, మోచేతుల వరకూ జాకెట్టూ, చుట్టూ త్రిప్పి దోపుకున్న పమిటా, నడుందిగేలా జడ కుచ్చుల జడా, తల్లో పూలూ, చేతికి బంగారు
గాజులూ, మెడలో నెక్లెస్, కళ్ళకు కాటుకా, మొహాన నల్లని బొట్టూ, అన్నీ చింతకింది పల్లె లక్షణాలే’ అనే ఒక్కోరి కామెంట్స్ సిరికి విని పించాయి. క్లాసులో మేడంకూడా అన్నీ
విని మెల్లిగా నవ్వుకుని..
“సిరీ! మీ ఊళ్ళో హైస్కూల్ ఉందా” అని అడిగాక “
అవునండీ! ఉంది నేనక్కడే చదివాను.”
“అలాగా ! ఎన్నిమార్కులొచ్చాయి” అనగానే
“సిరి నాకు స్టేట్ ఫస్ట్ వచ్చిందండీ! ఇదిగోండి నామార్క్స్ షీట్” అని మేడం దగ్గరాకెళ్ళి చూపింది.
ఆమె ఆషీట్ అందుకుని పైకి పెద్దగా చదివింది. “తెలుగు 99, ఇంగ్లీష్ 99, మాత్స్ హండ్రెడ్ ఔటాఫ్ హండ్రెడ్, కెమిస్ట్రీ 98, ఫిజిక్స్ 99 ఇలా అన్నీ చదవి క్లాప్స్ ఇవ్వగానే అంతా క్లాప్స్ ఇచ్చారు.
“ఓహో! నీవేనా స్టేట్ ఫస్ట్ స్టూడెంట్ మన కాలేజ్ లో చేరబోతున్నదని మేనేజర్ గారు చెప్పారు, మీ నాన్నగారు ఫీజ్ కన్ సెషన్ కూడా వద్దన్నా రుట.”అంది మేడం.
“ఔనండీ! మా నాయనగారు ప్రతి ఏడాదీ పది మందికి ఫీజ్ కడుతున్నారు. నా కెందుకూ కన్ సెషన్” అంది .
“చాలా సంతోషం సిరీ! నీలాంటి అమ్మాయి మా కాలేజ్ స్టూడెంట్ కావడం మాకు గర్వకారణం. బాగా చదివి ఇక్కడా స్టేట్ ఫస్ట్ తెచ్చి మా కాలేజ్ కి కూడా మంచి గుర్తింపు
తెస్తావని భావిస్తాను.” అని మేడం అంటూండగా బెల్ మ్రోగింది.
ఆరోజు అందరు లెక్చరర్సూ పిల్లలందరినీ పరిచయం చేసుకుని అంతా సిరిని అభినందించి “సిరిలా చదవండి, మిగతా వన్నీ వదిలేయండి. మొబైల్స్, గ్రూప్స్, యూ ట్యూబ్స్, సినిమాలూ దేని జోలికీ వెళ్ళకండి, విద్యార్థుల్లా ఉండి మంచి మార్కులు సాధించి, మీకూ, మీ తల్లిదండ్రులకూ, మన కాలేజ్ కీ మీ వలన మంచి పేరు తేవాలి. తెలిసిందా! ఈ క్లాసయ్యక వెళ్ళి మీ టెక్స్ట్ బుక్స్ , నోట్ బుక్స్ మిగతావన్నీ కలెక్ట్ చేసు కోండి ఆఫీస్ రూంలో , రేపటి నుండీ లెసన్స్ బిగినవుతాయి. ఈ రోజు మధ్యాహ్నం క్లాసుల్లేవు. ఏ రోజు పాఠాలు ఆ రోజు చదివి నేర్చుకుని , డౌట్స్ ఉంటే అడిగి తెలుసుకోండి, తక్కువ మార్కులొస్తే ఎవ్వరినీ క్షమించేది లేదు.” అని ముగించి వెళ్లారు చివరి పీరియడు లెక్చరర్ గారు .
లెక్చరర్ వెళ్ళగానే అంతా సిరిచుట్టూ చేరారు. అంతా షేక్ హ్యాండ్ ఇచ్చి “నీ లాంటి అమ్మాయి మా క్లాస్ లో చేరటం మా అదృష్టం.” అంటూ అంతా ఆమె బట్టలనూ, నగలనూ, జడనూ, అందాన్నీ పొగిడారు. అన్నింటికీ తలవంచుకుని నమస్కరించింది సిరి.
“రా వెళ్ళి మన బుక్స్ కలెక్ట్ చేసుకుందాం.” అన్నారు అంతా.
“మా నాయనగారు ఈ పాటికే అన్నీ తీసుకుని ఉంటారు.” అంది.
ఇంతలో గుమ్మం వద్దకు వాళ్ళనాన్న ఆనందయ్య వచ్చారు. “సిరీ బంగారుతల్లీ! ఈ రోజుకు క్లాసులు లేవుట, నీ పుస్తకాలన్నీ తీసేసు కున్నాను. వెళదామా!” అనగానే, అందరి
కేసీ చేతులూపి, తండ్రితో బయల్దేరింది సిరి. అలా సిరి కాలేజ్ మొదలైంది.
అది పేరున్న ప్రైవేట్ కాలేజ్. విద్యార్థులను పచ్చి కొబ్బరిముక్కల్లా రుబ్బి రసం తీసి ఆ రసానికి మార్కులు సంపాదించి తమ కాలేజ్ పేరు రాష్ట్ర స్థాయిలో మొదట నిల్పుకుని, బ్యాంకు బ్యాలెన్స్ పెంచుకుంటూ రొమ్ము విరుచుకునే యాజమాన్యం. అక్కడ చదివే పిల్లలకు పగలూ, రాత్రీ తెలీదు. భోజనం రుచి తెలీదు.సెలవులూ, మజా ఉండదు. ఐతే కొందరు పిల్లలు వీటన్నింటినీ వదిలేసి జల్సాచేసేసుకుని చివరకు
ఏదో మార్గంలో మార్కులు సంపాదిస్తుంటారు. ధనికుల పిల్లలూ, అధికారాలున్న వారి పిల్లలు, పదవులున్న వారి పిల్లలూ మిగతా వారితో చేరరు.
రోజూ కార్లో రానూ, పోనూ కష్టంగా ఉంటుందనీ, ఆ సమయంలో బాగా చదివిస్తామనీ ఆనందయ్యకు చెప్పి చెప్పీ ఒప్పించి, సిరిని అక్కడి హాస్టల్లో చేర్చను యాజమాన్యం
ఒప్పించింది. సొమ్ము చేసుకోను అది మరో చక్కని మార్గం. హాస్టల్ ఖర్చులు భారీగానే గుంజొచ్చు.
అలా సిరి హాస్టల్లో చేరింది. ఇంటినీ, అమ్మానాన్నలనూ, ఊరినీ వదలి మరో చోట ఉండటం అదే సిరికి మొదటిమారు. బాగా ఏడుస్తూ ఇల్లు వదలి వచ్చింది. ఆమె కంటే ఆమె అమ్మానాన్నలకు ఎక్కువ బాధ కలిగింది. వాళ్లనాన్న ఆనందయ్యకు సిరి పుట్టాకే కలిసివచ్చి, పంటలు పండి, కొబ్బరి కాయలకు మంచి గిరాకీవచ్చి బాగా కూడి వచ్చిందని, సిరి అనే పేరు పెట్టుకున్నారు. ఆమె లేకుండా ఆయన భోజనం చేయను కూడా ఇష్టపడడు.
సిరి తల్లి గారు లలితమ్మ “ఇలా ఐతే రేపు పెళ్ళిచేసి పంపాక ఏం చేస్తారూ! కడుపున కన్న నా కంటే మీరు బాధపడటం బాగాలేదు. ఆడపిల్ల అంటేనే మరోచోటికి వెళ్ళేదని తెలీడం లేదా! లేచి వచ్చి భోజనం చేయండి.” అని చెప్పాక వెళ్ళి భోంచేశాననిపించారు.
అలా సిరికీ, వారి తల్లితండ్రులకూ సిరి కాలేజీ హాస్టలు ఎన్నడూ లేని దిగులు కలిగించింది. సిరి హాస్టల్లో దిగగానే అంతా చుట్టూ చేరారు. “దిగులు పడకు, వాట్సాప్ లో మీ అమ్మా నాన్నలకు రోజూ మెసేజ్ చేసుకోవచ్చు.” అనగానే, సిరి “వాట్సాపా అదేంటీ!” అంది.
అంతా అయోమయంగా ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. “నీకు వాట్సాప్ లేదా! ఏదీ నీ మొబైల్ ఫోన్ తియ్యి” అనగానే, సిరి “మొబైల్ ఫోనా!” అంది. తిరిగి అంతా ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. “ఇంత ధనికుల బిడ్డవు! నీకు మొబైల్ ఫోన్ లేదా!” అనగానే, సిరి వారి కేసి చిత్రంగా చూసింది.
వెంటనే వారికున్న మొబైల్ ఫోన్స్ చూపి,” మొబైల్ ఫోన్ అంటే ఇలా ఉంటుంది. దీన్లో మనం ఎవరికైనా ఇలాంటి ఫోన్స్ ఉన్నవాళ్ళతో మాట్లాడవచ్చు. వారినిచూడవచ్చు, అంతేకాక సమాచారం పంప వచ్చు, ఏ భాషలోనైనా సరే. ఇంకా దీన్లో సినిమాలూ, యూ ట్యూబ్స్, అన్నీ చూడవచ్చు. ఇది దగ్గర ఉంటే ఇంట్లో ఉన్నట్లే.” అన్నారు అంతా , తలో మాటా చెప్తూ.
“ఐతే నేను మా నాయన్ని చూడవచ్చా!” అంది సిరి.
“అహా! ఐతే ఆయనకూ ఇలాంటి ఫోన్ ఉండాలి. మీ ఇంట్లో ల్యాండ్ ఫోన్ ఉంటే నీవు మా ఫోన్ లోంచీ మీ నాయనగారితో మాట్లాడవచ్చు” అంటూ ఆమె నోట్ బుక్ లో వ్రాసు కున్న ఇంటి ల్యాండ్ లైన్ ఫోన్ నెంబర్ డయల్ చేసి , అటు నుంచీ ‘హలో’ అన్నాక “సిరీ! మీ నాయనగారు మాట్లాడు” అని ఆమె చేతికిచ్చారు.
సిరి ఫోన్లో తండ్రితో మాట్లాడ సాగైంది..
“నాయనా! ఇక్కడ మా స్నేహితుల దగ్గర చేతిలో పట్టే నోట్సంత ఫోనుంది నాయనా! ఇది నీకూ నాకూ ఉంటే రోజూ మనం చూసుకుంటూ మాట్లాడు కోవచ్చంట” అంది.
ఆనందయ్య మహా ఆనంద పడిపోతూ “ఉండు బంగారూ సిరమ్మా! రేపు పొద్దుటేల్నే మన మేనేజర్ను తీసుకెళ్ళి నీకోటీ నాకోటీ, మీ అమ్మ కోటీ కొని తెచ్చి ఇచ్చి పోతాగా!, రోజూ
నిన్ను చూడంది ఉండలేను సిరెమ్మా” అన్నాడు. పక్కనున్న స్నేహితులు, ఎలాటి ఫోన్ ఉండాలో చెప్పాక, ఎంత ఖరీదో చెప్పాక వాళ్ళ నాన్నకు చెప్పింది సిరి.
మరునాడు మధ్యాహ్నాని కంతా ఆమె క్లాసులోకి వచ్చి ఆనందయ్య ఫోన్ ఉన్న ప్యాకెట్ ఇచ్చి ,” రాత్రికి ఫోన్ చెయ్యమ్మా! ఈలోగా నేనూ మన మ్యానేజర్ దగ్గర నేర్చుకుని తయారు గుంటాను. ఆయన్ని మనం మాట్లాడుకున్నాకే పంపుతాను ఇంటికి రోజూ, నీవు మీ స్నేహితులకాడ నేర్చుకో, అమ్మాయిలూ నేర్పుతారుగా!” అని ‘సరే ‘చెప్పించుకుని వెళ్ళాడు, ఆనందంగా ఆనందయ్య.
ఆ రోజు రాత్రి స్నేహితుల సాయంతో వాళ్ళనాన్నతో ఫోన్లో మాట్లాట్టమే కాక, పరస్పరం చూసుకుని ఆనందించారు. “ఇట్టంటిది ఉందని మనకు తెలీకనే పోయె.” అని ఆనందయ్య అంటుంటే, “దీనిలో ఇంకా చాలా ఉంటాయిట నాయనా! నేను
నేర్చుకున్నాక నీకూ చెప్తాలే.” అంది సిరి.
“ఎందుకమ్మ మన మేనేజర్ లేడూ ఆయన కాడా ఉందిలే ఇట్టంటిది, నేర్చేసుకుంటాగా, నీవు నేర్చుకో తల్లీ!” అని ఆనందించాడు ఆనందయ్య కూతుర్ని రోజూ చూడవచ్చని.
“సిరిని అక్కడ చేర్పించింది, చదువుకోనా, నీతో రోజూ చూసుకుంటూ మాట్లాడుకోనా!ఏందయ్యా ఈ ఇపరీతం!” అని భార్య అంటున్నాలెక్క పెట్టలేదు ఆనందయ్య.
రోజులు సాగుతున్నాయ్. రోజూ కూతుర్ని చూసుకుంటూ ఆనందంగా గడప సాగాడాయన. కొద్ది రోజులయ్యేసరికి సిరికి ఆమె స్నేహితులు, నీకు ‘టిక్ టాక్’ నేర్పమా! బిగ్ బ్యాడ్ నేర్పమా! చిక్ చాక్ నేర్పమా,! టేక్ రిస్క్ నేర్పమా ![ ఇవేవీ ప్రస్తుతానికి లేవు, పిల్లలను పాడుచేయను మరెన్నో రావచ్చు]యూట్యూబ్ లో సినిమాలూ ఇంకా చాలా చూడవచ్చు నేర్పమా!’ ఈ మైల్ ‘పెట్టుకుని చాలా మందితో స్నేహం చేయవచ్చు, ఫేస్ బుక్ అకౌంట్ లో ఎంతో మందితో విదేశీయులతో సహా స్నేహం చేయవచ్చు, చాలా మజాగా ఉంటుంది. ఈ చదువులేంటి? నీ లాంటి ధనికుల బిడ్డకు చదు వెందుకు? ప్రపంచాన్ని చూడు. నాలెడ్జ్ నేర్చుకో. బావిలో కప్పలా బతికావ్ మీ పల్లెలో, ప్రపంచం
ఎంత పెద్దదో , ఎన్ని వింతలున్నాయో తెల్సుకో. ఈ దుస్తులేంటి? పరికిణీ, జాకెట్, లంగా మీ అమ్మమ్మల కాలం నాటి దుస్తులు ఎవ్వరూ వేసుకోరు కాలేజ్ లో, మమ్మల్నిచూడూ! టైట్ ప్యాంట్స్ , లోనెక్ షర్ట్స్ ఇలా ఉండాలి కాలేజ్ అమ్మాయిలు. నీ అందానికి నీ ఒంటి రంగుకు, నీ పెర్సనాలిటీకి మొగపిల్లలంతా నీ వెనక పడి చస్తారు’అంటూ బాగా ఎక్క బోయటాన, ఆమె తండ్రికి ఫోన్లో చెప్పి తనకో బ్యాంక్ అకౌంట్ చేయించుకుని, కాలేజ్ బ్యాంక్ లో సొమ్ము తీసుకోడమేకాక , ఫోన్ లోనే సొమ్ము చెల్లించే, ఫోన్ పే, గూగుల్ పే వంటివి నేర్చేసుకుని అన్నీ రూముకే తెప్పించుకునే ఏర్పాటు చేసేసుకుంది. ధనికుల జతలో ఉండటాన కాలేజ్ వారేమీ అభ్యంతరాలు చెప్పలేదు.
ఆ మూడు నెలల పరీక్షల్లో అన్నిట్లో మార్కులు తగ్గాయి. లెక్చరర్స్ అడగ్గా “మా ఫాదర్ అన్నీ చూసుకుంటారు, నా గురించీ బెంగ పడకండి సార్! మీ కాలేజ్ లో మొదటి ర్యాంక్
నాకే వచ్చితీరు తుంది” అని నిర్లక్ష్యంగా చెప్పింది సిరి. ఆమె వస్త్రధారణలోమార్పుకూడా గమనించారు లెక్చరర్స్ అంతా. క్రమేపీ సిరి క్లాసులకు రావడం కూడా తగ్గింది. మత్తుగా ఉండటం కూడా గమనించారు. తండ్రికి ఫోన్ చేయడం సొమ్ము కావాల్సినప్పుడే.
“ చాలా బిజీగా ఉన్నాను నాన్నా! చదువుతో. “ అనిచెప్పేది. రోజంతా ఫోన్లోనే. టిక్ టాకే ప్రపంచం. ఫైనల్ పరీక్షల సమయంలో యాజమాన్యం సిరి తండ్రికి కబురంపి విషయం వివరించారు.
“అయ్యా! మీ అమ్మాయి ఈ ఏడాది పాస్ కావడం కష్టం, మీరేమైనా సర్దుబాటు చేయ గలిగితే సరి. లేకపోతే మీ అమ్మాయి ఫెయిల్ ఔతుంది” అని హెచ్చరించారు.
దిక్కుతోచని ఆనందయ్య , “ఎందుకని మా అమ్మాయి ఇలా ఐంది? చదువులో తెలివిలో ఫస్ట్ ఉండేది. మీకు చెప్పను రావడం లేదా!” అని యాజమాన్యంతో తగాదాకు దిగాడు. అందరిలోకీ పెద్ద వాడైన ఒక లెక్చరర్ ఆయన్ను ఒక గదిలో కూర్చోబెట్టి
“అయ్యా! నాపేరు నాగేశ్వర్రావు. మీరు పెద్దలు, ధనికులు, మంచివారు. మీ అమ్మాయిని ఎంతో క్రమశిక్షణతో పెంచారు. కాలేజ్ జీవితం లో పిల్లలు స్నేహితులతో చేరి చాలా కొత్త
విషయాలను తెల్సుకుంటూ ప్రమాదపు అంచులను చేరుతారు. అలా అవుతున్నామనేది వారికీ తెలియదు. తెల్సుకునే సరికి జారి క్రిందపడి పోతారు. మీ అమ్మాయి ఎంతో తెలివైనదీ, బుధ్ధిమంతురాలూ, మాత్రమే కాక అమాయకురాలు కూడా. పిల్లలను
పెంచడంలో కాస్తంత నాగరికం కూడా నేర్పాలి. మీరు మరీ పల్లెటూరి బిడ్డలా పెంచారు. అందువల్ల మీ అమ్మాయి ఈ నాగరీక ప్రపంచంలో పడి కొత్తొక వింత కావటాన ఇలా వాటికి
బానిసై పోయింది. మీ బిడ్డేకాదు. ఈ రోజుల్లో చాలా మంది ఈ టిక్ టాక్ ల వంటి వికృత మైన సోషల్ మీడియా మాయ లోపడి సమాజాన్నీ, చదువునూ, జీవితాన్నీ కూడా కోల్పోతున్నారు. ఈ సోషల్ మీడియా మాయ యువతను నిర్వీర్యులను చేస్తున్నది. వారి మేధను మసిచేస్తున్నది. దీనిని కనిపెట్టిన వారికి, లోకంలోకి వదలిన వారికీ ఏ శిక్ష విధించినా పాపం లేదు. మనం కొన్ని సౌకర్యాల కొరకు ఫోన్స్ కొనిస్తే , వాటిలోని విషం
వైపు యువత పయనించి తమ మేధనూ, మనస్సునూ, విలువైన తిరిగిరాని సమయాన్నీ వృధాచేసుకుని నిండు జీవితాలను వ్యర్థం చేసు కుంటున్నది. నేనూ మీ లాంటి దౌర్భాగ్యపు తండ్రినే. మహామేధావైన నా కుమారుడు వీటికి పడి సమిధైపోయాడు . పేరెంట్స్ అందరికీ ఎరుక పరచాలని ప్రయత్నిస్తున్నాను. ఆ లోపే ప్రమాదపు అంచుకు
చేరిపోతున్నారు యువత. మీ అమ్మాయిని కొంతకాలం మీ ఇంటికి లేదా ఏదైనా ఆశ్రమాల వంటి కొత్త ప్రశాంత స్థలాలకూ తీసుకెళ్ళి, కాస్త స్థిమిత పడ్డాక తీసుకురండి. ఇది నా సలహా” అని నాగేశ్వర్రావు గారు అంటూండగానే కాలేజ్ లో పెద్దగోల అంతా ఎక్కడికో పరుగులూ, ఉరుకులూ, పెద్దగా అరుపులూనూ.
“సిరి మూడో అంతస్తు పై నుండీ దూకేసింది, టిక్ టాక్ లో ఎవరో ‘నీవు పై నుండీ దూకగలవా! పిరికి దానివా!’ దూకితే నీకు ఇరవై వేల లైక్స్’ అని మేసేజ్ పెట్టారట . వెంటనే దూకేసింది’ అనే కేకలు విని ఆ వైపు పరుగు తీశారు సిరి నాన్నగారు గుండె
బాదుకుంటూ, నాగేశ్వరరావుగారూ నూ. యువత తల్లితండ్రులారా తస్మాత్ జాగ్రత.
*****
నేను 40 సం. [యం.ఏ. బియెడ్] ఉపాధ్యాయినిగా, ప్రధానోపాధ్యా యినిగా పనిచేసి 2004 లో వృత్తి విరమణపొందినాను.
ఆరోజుల్లో ఆకాశవాణి విజయ వాడ కేంద్రం నుండి వ్యాసాలు, నాటకాలు, టాక్స్ ప్రసారమయ్యాయి. ఎక్కువగా బాలవిహార్లో వచ్చాయి.
4 మార్లు జిల్లా స్థాయిలోనూ , 1992లో రాష్ట్రస్థాయిలో ఉత్తమ ఉపాధ్యా య అవార్డు , 1994 లో జాతీయస్థాయిలో ఉత్తమ జాతీయ స్థాయి ప్రధానోపాధ్యాయినిఅవార్డు, 2003లో కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ జయేంద్ర సరస్వతీ స్వామీజీచే జాతీయ స్థాయి అవార్డు [ ఇన్నో వేటివ్ టెక్నిక్స్ ఇన్ క్లాస్ రూం టీచింగ్ అనే రిసెర్ఛ్ అంశానికి] గోల్డ్ మెడల్ భగవంతుని కృపతో అందాయి.
భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారు మానవతా విలువలను . భారతీయ సంస్కృతినీ లేతవయస్సులో పిల్లల మమనస్సుల్లో నింపాలనే ప్రయత్నంతో, 1969లో స్థాపించిన బాలవికాస్ అనే ఉచిత మానవతా విలువల బోధనా తరగతులు నిర్వహిస్తూ ,ఒక సేవకురాలిగా 1978 నుండీ వుంటూ, స్టేట్ రిసోర్స్ పర్సెన్గా 1985నుండి రాష్ట్రస్థాయి పర్యటనలు సంస్థ తరఫున సాగిస్తూ ఈ రోజువరకూ జీవిస్తున్నాను. ప్రస్తుతం పుట్టపర్తి ఆశ్రమ ఐఛ్ఛిక సేవలో జీవనం కొనసాగుతున్నది.