గీతాంజలిశ్రీ
-నీలిమ వంకాయల
భారత రచయిత్రి గీతాంజలిశ్రీ అంతర్జాతీయ సాహిత్య వేదిక పై సంచలనం సృష్టించారు. ఆమె రాసిన నవలకు బుకర్ ప్రైజ్ దక్కింది. ఢిల్లీకి చెందిన గీతాంజలిశ్రీ (గీతాంజలి పాండే) హిందీ నవలా, లఘు కథా రచయిత్రి. ఆమె రాసిన రేత్ సమాధి(2018) ఆంగ్ల తర్జుమా ‘టూంబ్ ఆఫ్ శాండ్’కు 2022కు గాను ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ లభించింది.
“టూంబ్ ఆఫ్ శాండ్” అనేది అంతర్జాతీయ బుకర్ ప్రైజ్ గెలుచుకున్న భారతీయ భాషలో వ్రాసిన మొదటి పుస్తకం. పైగా హిందీ నుండి అనువదించబడిన మొదటి నవల. అంతేకాదు బుకర్‌ప్రైజ్ గౌరవం అందుకున్న తొలి భారత రచయిత/రచయిత్రి గీతాంజలిశ్రీ కావడం విశేషం.
26 మే 2022న లండన్‌లో జరిగిన ప్రధానోత్సవంలో గీతాంజలిశ్రీ(64) బుకర్ ప్రైజ్‌ను అందుకున్నారు.
1957 లో జన్మించిన గీతాంజలి తండ్రి సివిల్ సర్వెంట్. తండ్రి ఉద్యోగరీత్యా ఆమె ఉత్తరప్రదేశ్‌లోని వివిధ పట్టణాలలో పెరిగారు. ఇంగ్లీష్ మాధ్యమంలో చదివినప్పటికి ఉత్తరప్రదేశ్ తో ఉన్న అనుబంధం వల్ల ఆమెకు హిందీ భాషతో మక్కువ ఏర్పడింది. హిందీ సాహిత్యంతో తనకు ఉన్న సంబంధం కుటుంబ పరమైనదని, తన తల్లి కేవలం హిందీలోనే మాట్లాడేవారని ఆమె చెబుతూ ఉంటారు. ప్రస్తుతం ఉన్న ఇంగ్లీష్ మాధ్యమం లో చదివే పిల్లల కంటే తాము ఆ రోజుల్లో హిందీ పుస్తకాలు ఎక్కువ చదువుతూ ఉండేవార మని ఆమె హిందీ భాషతో అనుబంధానికి కారణాన్ని వివరిస్తూ ఉంటారు. ఇంగ్లీష్ భాషలో చిన్న పిల్లలు చదవటానికి పుస్తకాలు తగినంతగా లభించక పోవడమే వరంగా మారి పంచతంత్ర కథలు మొదలుకొని రామాయణ, మహాభారతాలు కూడా హిందీలో చదివే అవకాశం ఆమెకు కలిగింది.
గీతాంజలి పాండే తన తల్లి పట్ల ఉన్న గాఢమైన ప్రేమతో పేరు చివర తన తల్లి పేరు శ్రీని చేర్చుకున్నారు. కాలేజీ చదువు కోసం ఆమె ఢిల్లీ వెళ్ళినప్పటికి, ఆధునిక చరిత్రను అభ్యసించడం ప్రారంభించినప్పటికి హిందీతో అనుబంధం మరింత బలంగా అల్లుకున్నది. హిందీ సాహిత్యం చదివే అవకాశం లేక చరిత్రను ఎన్నుకొన్నప్పటికి హిందీని ట్యుటోరియల్స్ ద్వారా నేర్చుకున్నారు.
గీతాంజలిశ్రీ మొదటి కథ ‘ బెల్ పాత్ర ‘ (1987), ఇది హేన్స్ సాహిత్య పత్రికలో ప్రచురించబడింది. తర్వాత 1991 లో ఆమె కథాసంకలనం ప్రచురించబడింది. అప్పటి నుంచి మరో రెండు చిన్న కథల సంపుటిని అలాగే ఐదు నవలలను ప్రచురించింది. ఆమె రచనలు అనేక అవార్డులను అందుకున్నాయి. ఇంగ్లీష్, ఫ్రెంచ్, జర్మన్, సెర్బియన్ మరియు కొరియన్ భాషలలోకి అనువదించబడ్డాయి. మయి(2000) క్రాస్‌వర్డ్ బుక్ అవార్డు 2001కి నామినేట్ అయ్యింది. భారతీయ ప్రముఖ రచయిత ప్రేమ్‌చంద్ పై విమర్శనాత్మక రచన కూడా చేసింది. బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనల ఆధారంగా రాసిన ‘హమారా షహర్ ఉస్ బరాస్’ అనేక ప్రశంసలు అందుకుంది.
బుకర్ ప్రైజ్ గెలుచుకున్న గీతాంజలి శ్రీ రచన ‘రేత్ సమాధి’ విశేషాలు: రేత్ సమాధి.. ఉత్తర భారతంలో ఎనభై ఏళ్ల వృద్ధురాలి కథ. వృద్ధురాలు తన భర్త మరణంతో తీవ్ర డిప్రెషన్‌లోకి జారుకుంటుంది. ఆ పై ఆమె జీవితం కొత్తగా మారుతుంది.. అది ఎలా అనేది ఆ నవలలోని కథ.
వాస్తవానికి 2018లో హిందీలో రేత్ సమాధి ప్రచురించబడింది, ‘టూంబ్ ఆఫ్ శాండ్’ పేరుతో ఆమె పుస్తకం యూకేలో ఇంగ్లీష్‌లోకి తర్జుమా అయ్యింది. టిల్టెడ్ యాక్సిస్ ప్రెస్ ద్వారా ఆగస్టు 2021లో ఆంగ్లంలో ప్రచురించబడింది. మొత్తం 135 పుస్తకాలను యూకేకు చెందిన ఈ అంతర్జాతీయ సాహిత్య వేదిక జ్యూరీ పరిశీలించగా.. చివరి తరుణంలో ఆరు పుస్తకాలు బుకర్ ప్రైజ్ కోసం పోటీపడ్డాయి. అందులో టూంబ్ ఆఫ్ శాండ్ కు ఈ గౌరవం దక్కింది.
జడ్జింగ్ ప్యానెల్ చైర్‌పర్సన్ ఫ్రాంక్ విన్నే మాట్లాడుతూ, గీతాంజలిశ్రీ రాసిన రేత్ సమాధి ఆత్మీయ భావనలతో కూడిన భిన్నస్వరాలు గల నవల అని, దానిని డైసీ అద్భుతంగా, ఆకట్టుకునేవిధంగా అనువదించారని, ‘టూంబ్ ఆఫ్ శాండ్’ లోని శక్తి, అతిశయం, సరస సల్లాపాలు, చమత్కారాలు తమను కట్టి పడేసాయని, మంత్ర ముగ్ధులను చేసాయని అన్నారు. ఇది భారతదేశ విభజనకు సంబంధించిన నవల అని తెలిపారు. దీనిలోని ప్రేమ , గొప్ప ఓదార్పు అందరినీ ఆకర్షిస్తాయన్నారు. వర్ణరంజిత మైన లోకంలోకి యువత, వృద్ధులు, స్త్రీ, పురుషులు, కుటుంబం అందరూ నిమగ్న మయ్యేలాగా ఈ నవల చేస్తుందన్నారు.
గీతాంజలితో పాటు రేత్ సమాధిని ఇంగ్లీష్‌లోకి ట్రాన్స్‌లేట్ చేసిన డైసీ రాక్‌వెల్(అమెరికా)కు కలిపి ఈ గౌరవం అందించారు. ఇందుకుగాను యాభైవేల బ్రిటిష్ స్టెర్లింగ్ పౌండ్లను క్యాష్ ప్రైజ్‌గా అందించారు.
*****
నీలిమ వంకాయల స్వస్థలం అమలాపురం. M.Sc., M.A., B.Ed. చేశారు. వృత్తి రీత్యా టీచర్. కథలు, అనువాదాలు రాయడం ప్రవృత్తి. బాలల్లో విలువలు పెంపొందించే ఆటలు, ఆడియో విజువల్స్ తయారు చేశారు.