నా అంతరంగ తరంగాలు-1

-మన్నెం శారద

The purpose of our life is to be happy… Dalailama
***
          అప్పుడు నాకు పద్దెనిమిది సంవత్సారాలు. చదువు కొనసాగుతోంది . ఆ రోజు రాత్రి నన్ను పురజనులు ఏనుగు మీద ఎక్కించి ఊరేగిస్తూ ఘనంగా సన్మానిస్తున్నట్లుగా కలొచ్చింది . మెలఁకువరాగానే “ఇది కలా ?” అని కొంత నిరుత్సాహ పడినా ఆ దీపాలు, వింజామరలు, జనసందోహం …కళ్ళలో కనిపిస్తుంటే ….పొంగిపోతూ మొహం కూడా కడుక్కోకుండా వంటగదిలో పనిచేస్తున్న అమ్మ దగ్గరకి పరిగెత్తేను .
 
అదంతే !
 
          కొట్టినా తిట్టినా ముందెళ్ళి అమ్మకి చెప్పాల్సిందే ….
“అమ్మా అమ్మా, రాత్రి నేను ఏనుగెక్కినట్లు కలొచ్చింది తెలుసా !”అన్నాను సంబర పడిపోతూ .
 
అమ్మ అట్లు పోస్తున్నది.
 
          “చిన్నప్పుడే ఎక్కితిరిగావుగా… ఇప్పుడు కొత్తేముంది ” అంది చాలా నిర్లక్ష్యంగా అట్లకాడతో అట్టు తిరగేస్తూ .
 
          “అవుననుకో …కానీ ఇది సన్మానం తెలుసా .”..అన్నాను కొంత వుత్త్సాహంగా.
 
          “సరిసర్లే, పోయి మొహం కడుక్కో” అంది అమ్మ.
 
          అసలు ఏ పనీ చేయని కామ్ చోర్ నని ఎప్పుడూ అక్కసుగా వుండే మా అక్కా చెల్లెళ్ళు ” ఇంకాసేపు అక్కడే వుంటే అమ్మచేస్తుంది సన్మానం!” అంటూ పళ్ళికిలించేరు .
సరే… ఈ ఏడుపెప్పుడూ ఉండేదేలే అనుకుని మొహం కడుక్కుని అట్లు తింటుంటే పెద్దనాన్న గుర్తొచ్చారు.
 
          అప్పటికే అకాలంగా పెదనాన్న చనిపోయారు. అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఆయన్ని తలచుకుంటే కన్నీళ్లు వస్తాయి . అంత మంచి మనిషి !
తోడల్లుడి పిల్లలయినా స్వంతపిల్లల్లా ప్రేమించేవారు .
 
నేనంటే మరీ మరీ ఇష్టం !
 
          ఎప్పుడు సెలవులొచ్చినా మేము ఎక్కడవున్నా ఒక కానిస్టేబుల్ ని పంపి మమ్మల్ని తన దగ్గరకి రప్పించుకునేవారు . అలా మేము ఆ సారి నర్సీపట్నం వెళ్లాం. చుట్టూ అడవి. చాలా పెద్ద బయళ్లలో వీళ్ళ క్వార్టర్స్ ….అక్కడక్కడా విసిరేసినట్లు … మాకు గొప్ప ఆకర్షణ ఏమిటంటే రోడ్డు కవతల ఏనుగు శాల !
 
          జీప్ వెళ్ళలేని కారడవిలోకి వెళ్ళడానికి SP ,DSP ఏనుగు మీద క్యాంపుకి వెళ్లే వారు. ఒట్టి రోజుల్లో అది శాలలోనే ఉంటుంది. దానికి ఆహారం పెట్టాలంటే మా ఇంటికి తీసుకొచ్చి మేం అంటే పెదనాన్న ఇంట్లో వాళ్ళు ఎవరన్నా చూస్తుండగా పెట్టాలి, ఇక మా పిల్లల సందడి అంతా ఇంతా కాదు. ఎక్కడో కమలా సర్కస్ లో చూసిన ఏనుగు మా ఇంటికి వచ్చేసింది.
 
          మెట్లనిండా సర్దుకుని కిచకిచలాడుతూ కూర్చునే వాళ్ళం. మావటి రాగానే ‘బార్ సలాం !’ అనేవాడు . ఏనుగు తొండంతో సలాం చేసేది. ఎండుగడ్డితో చిన్న చిన్న దొన్నెలు చేసి వాటిలో కొలత ప్రకారం బియ్యం పోసి, కొంచెం బెల్లం కూడా పెట్టి, ఏదో మందువేసి దాని తొండానికి అందించేవాడు. అది నోట్లో పెట్టుకుని తినేది .
 
ఇక తర్వాత మా పిల్లల సందడి !
 
          స్టోర్ రూమ్లో వున్న ఏజెన్సీ సరుకు అంటే చెరకు గెడలు, ఎలక్కాయలు. నారింజ పళ్ళు, తేగలు దాని తొండంలో పెట్టి అది తింటుంటే కేరింతలు కొట్టేవాళ్ళం. తర్వాత మావటి మమ్మల్ని ఏనుగు ఎక్కించేవాడు. అది కాలుని మెట్లలా వంచేది. అన్నయ్య మాత్రం అలా కాలు మీద నుండి ఎక్కేసేవాడు. మేం బాగా చిన్నపిల్లలం. భయపడే వాళ్ళం. అప్పుడు ఏనుగుని కూర్చోబెట్టేవాడు మావటి. మేము స్టూల్ ఎక్కి దాని చెవులు పట్టుకుని పైకి ఎక్కేవాళ్ళం. దాని మెడకండరాలు కదిలినప్పుడు అటూ ఇటూ వరిగి పడిపోతున్న భ్రాంతి కలుగుతుంది. అక్కడ కూర్చోవడానికి అందరికీ చచ్చేంత భయం !
నేను లోపల భయమున్నా హీరోయిజం కోసం అక్కడ కూర్చునేదాన్ని ….దాని మెడలోని ఇనుప గొలుసులు పట్టుకుని. దాని చెవులు కదిలిస్తుంటే వళ్ళు గగుర్పొడిచేది.పైగా మెడమీద ఏదో ద్రవం స్రవిస్తూ ఒకరకమైన వాసన! అలా అక్కడ వున్న నెలరోజులూ దాని మీదే విహారం !
 
          అది స్నానానికి వెళ్తే చెరువు ఒడ్డునే మకాం. అది అడవికి వెళ్లి ఆహారానికి చెట్టు కొమ్మలు విరిచి కోసుకుంటుంటే దాని వీపు మీదే జీవితం ! జీవితంలో మరెన్నడు దొరకని ఆనందం !
 
          ఒంగోలు నుండి మాచర్ల వెళ్లే వరకు మాకు స్కూల్ చదువు లేదు. అలాయిలా గాలికి తిరుగుతూ ట్యూషన్ లో చదువుకోవడమే. అలా ఏడో సంవత్సరంలో ఇంటూ ఫస్ట్ ఫామ్ అనే పరీక్ష రాసి స్కూల్లో జాయిన్ అయ్యాను.
 
          మాచర్లలో మా హిందీ మాస్టారు చాలా గమ్మత్తయిన మనిషి. చాలా గర్వంగా, పెద్ద షాల్ ని వెనుక నుండి చేతుల మీదుగా వేసుకుని గాలిలో ఎగరవేస్తూ పంచెపాళీతో చిన్న జారు ముడివేసుకుని నడినెత్తి వరకు పెద్ద తిరునామం పెట్టుకుని సాక్షాత్తు శ్రీ నాధ సార్వాభౌముడిలా క్లాసులో విలాసంగా ప్రవేశించేవారు. వెంటనే మేము లేచినిలబడి గట్టిగా “నమస్తే అయ్యవారూ “అని చేతులు జోడించి టాపు లేచిపోయేట్లు అరవాలి!లేదంటే క్షణాల్లో డస్టర్ వాళ్ళని ముద్దు పెట్టుకుంటుంది.
 
          ఆయన క్లాసులో మగపిల్లలు చాలా వరకూ బెంచీల మీద నిలబడే ఉండేవారు.
వున్న ఇద్దరు ఆడ పిల్లలు నేలమీద నిలబడి తల దించుకుని ఆయన తిట్టే తిట్లు తినే వాళ్ళం.
 
          ఆరోజు మాస్టర్ గారు ‘ హాతీ ‘ పాఠం చెబుతున్నారు.
 
          ఆయన “ఏరా…మీలో ఎవరన్నా ఏనుగుని చూసారంట్రా?” అని కొంత వ్యంగ్యం గా అడిగారు.
 
          నేను పరమసంతోషంగా లేచి నిలబడ్డాను.
 
          “ఎక్కడా?”అని ఆయన సహజ ధోరణిలో అడిగారు.
 
          నేను నా ఆనందం పట్టలేక “ఎక్కాను కూడా సార్” అన్నాను.
 
          “కలలోనా?…” అన్నారాయన హేళనగా.
 
          అవమానం భరించలేక నాకు బోల్డంత ఏడుపొచ్చేసింది. ఇలాంటి పంతుళ్లు ఒకరిద్దరి వల్ల నేను హిందీ హై, నై ల దగ్గరే ఆగిపోయి ఈ రోజున బాధ పడుతున్నాను.
సరే… ఇప్పుడు మనం వర్తమానంలోకి వచ్చేద్దాం.
 
          కలవొచ్చిన నాలుగయిదు రోజుల్లో నాకు కొవ్వూరు రోటరీ క్లబ్బు వారి నుండి ఆహ్వానం వచ్చింది. నన్ను వారి సభకు వచ్చి అడవిబాపిరాజు గారి గురించి , దామెర్ల రామారావు గారి గురించి మాట్లాడవలసిందిగా. అప్పటికే చోటా మోటా పత్రికలకు కథలూ కాకరకాయలు రాసి కవర్ పేజీల మీద బొమ్మలు వేస్తున్న నాకు ఇలాంటి గుర్తింపు, పిలుపు రావడం ఒకింత ఆశ్చర్యం, భయం కలిగించాయి.
 
          “అమ్మో నేనేమిటి.. సభలో మాట్లాడటమేమిటి .. నేను వెళ్ళను “అని నాన్నతో చెప్పాను.
 
          “కాదులే.. వెళ్ళు.. అలాంటి అవకాశం అందరికీ రాదు” అన్నారు నాన్న నవ్వుతూ.
అమ్మకూడ సంతోషం కొంత దాచుకుని “భయమేంటి పద, నేను తీసుకెళ్తా. ముందు వాళ్ళ గురించి లైబ్రరీకి వెళ్లి విషయం సేకరించు “అంది ప్రోత్సహిస్తూ.
 
          ఇక్కడ అమ్మగురించి కొంత చెప్పుకోవాలి.
 
          అమ్మకి చదువన్నా, సాహిత్యమన్నా చాలా ఇష్టం. మా ఇంట్లో పెద్దపెద్ద రచయితల పుస్తకాలు ఉండేవి. శరత్ చంద్ర, ప్రేమ్ చంద్, రవీంద్రనాథ్ ఠాకూర్, చిలకమర్తి, గురజాడ… ఇలా వారందరి రచనలు ఉండేవి. నాన్న హిస్టరీ స్టూడెంట్. అందువల్ల చరిత్ర కు సంబంధించిన పుస్తకాలు ఉండేవి. అర్ధం కాని వయసులో అవన్నీ కూడా నేను చదివాను.
 
          అమ్మ చెప్పినట్లు లైబ్రరీకి వెళ్లి వారిద్దరి గురించి కొంత విషయాన్ని సేకరించాను. ఆ రోజు రానే వచ్చింది. అమ్మతో కలిసి కొవ్వూరు చేరుకున్నాను. స్టేషన్ కు రోటరీ క్లబ్బు పెద్దలు కొందరు వచ్చి సాదారంగా తీసుకెళ్లి ఒక డాక్టర్ గారింటిలో విడిది ఇచ్చారు. ఆఁ సాయంత్రం మీటింగ్!
 
          టైం దగ్గర పడుతున్న కొద్దీ నాకు దడ దడ….
 
          సభలో పెద్దల్ని చూసాక గజ గజ…
 
          అందరూ వయసులోనూ విద్య లోనూ చాలా పెద్దలు! ఎక్కవగా లాయర్లు డాక్టర్ లూ..
స్టేజ్ మీదకి బలికి తయారుచేసిన మేకలా వెళ్లాను. బహుశా అదే నా మొదటి ఉపన్యాసం!
ఇంకా రెండు జడలు వేసుకుంటున్నాను.
 
          నన్ను చూసి అందరూ చిరునవ్వులు చిందించారు.
 
          వారిలో ఒక పెద్దాయన లేచి ” మనముందు ఈ రోజు వక్తగా వున్న అమ్మాయి వయసు రీత్యా చాలా చిన్నది. కొన్ని విషయాల్లో ప్రజ్ఞావంతురాలని మనం ఈ వేదిక మీదకు పిలుచుకున్నాం. కాబట్టి ఆఁ అమ్మాయిని ప్రశ్నలు వేసి వేధించకుండా చెప్పింది విందాం. “అని చెప్పారు. అప్పటికే నాకు జ్వరం వచ్చినట్లు వళ్ళంతా వేడెక్కి పోయింది.
ఎలాగోలా బట్టీ పట్టిందంతా గడ గడా అప్పజెప్పి బయట పడ్డాను.
 
          తర్వాత అందరూ వాళ్ల ఇళ్లకు రమ్మని ఆహ్వానించారు. అమ్మకు, నాకూ పట్టు చీరలు పెట్టి సాదారంగా వీడ్కోలు పలికారు. ఊపిరి పీల్చుకొని ‘కల నిజమాయెగా…’ అని పాడుకుంటూ ఇల్లు చేరాను. ఇదీ నా గజారోహణ పర్వం!
 
( చిగురాకు రెపరెపలు చదవని స్నేహితుల కోసం కొంత అందులోని భాగాలు ఇందులో సందర్బం వచ్చినప్పుడు కలుపుతున్నాను. పూర్తిగా వినాలంటే లక్ష్మి చెప్పిన కథల్లో మీరు యూ ట్యూబ్ లో వినవచ్చు.)

*****

(సశేషం)

Please follow and like us:

2 thoughts on “నా అంతరంగ తరంగాలు-1”

  1. చిన్నతనం లోనే కథలు రాయడం.. అది అందరూ మెచ్చుకోవడం గజారోహణ సన్మానమే ! శారద గారికి అభినందనలు

Leave a Reply

Your email address will not be published.