ప్రేమించి చూడు
(నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక & అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎన్నికైన కథ)
-జి.యస్.లక్ష్మి
సరోజ ప్లేట్లో కొన్ని క్రీమ్ బిస్కట్లూ, రెండు కప్పులతో కాఫీ ఒక ట్రేలో పెట్టుకుని వెళ్ళి కూతురు సౌమ్య గదితలుపులు తట్టింది. అప్పటికప్పుడే గంట పైనుంచీ సౌమ్య, సౌమ్య ఫ్రెండ్ ఆద్య గదిలో కెళ్ళి తలుపు లేసుకున్నారు. ఆద్యకి మూణ్ణెల్ల క్రితమే పెళ్ళైంది. కొత్తగా పెళ్ళైన ఆ పిల్ల ఆఫీసయి పోగానే ఇంటి కెళ్ళకుండా సౌమ్యతో పాటు ఇక్కడికొచ్చి ఇంత సేపు ఏమి మంతనాలాడుతోందో సరోజకి అర్ధం కాలేదు.
తలుపు తీసిన సౌమ్య తల్లి చేతిలో ట్రే చూసి గబుక్కున అందుకుని, “థాంక్యూ మామ్..” అంటూ మళ్ళీ తలుపు మూసేసింది. తలుపు తెరవబడిన ఆ ఒక్క నిమిషంలో ఆద్య కళ్ళు తుడుచుకుంటున్నట్టు కనపడింది సరోజకి.ఒక్కసారి మనసు కలుక్కుమంది. నిన్నగాక మొన్న పెళ్ళైన పిల్ల…ఏం కష్టమొచ్చిందో పాపం.. అనుకుంది. అయినా ఏవైనా కష్టముంటే అమ్మానాన్నలతో చెప్పుకోవాలి కానీ ఇలా ఫ్రెండ్స్ తో చెప్పుకుంటారా… అందులోనూ ఇంకా పెళ్ళికాని పిల్లతో.. సౌమ్యకి సంసారం గురించీ, సర్దుకుపోవడాల గురించీ ఏం తెలుసని ఆ ఆద్య ఇక్కడి కొచ్చినట్టూ!
లాయర్ గా ప్రాక్టీస్ చేస్తున్నసరోజ ఇలా పరిపరివిధాల ఆలోచిస్తూండగానే ఇంకో అరగంట తర్వాత సౌమ్య, ఆద్య ఇద్దరూ గదిలోంచి బైటకొచ్చేరు. చల్లటి నీళ్ళతో మొహం కడుక్కుందేమో ఆద్య మొహం కాస్త తేరుకున్నట్టనిపించింది.
“వెళ్ళొస్తానాంటీ..” అంటూ సరోజకి చెప్పి వెళ్ళిపోయింది.
“ఏవైందే తనకీ!” ఆతృత ఆపుకోలేక పోయింది సరోజ.. సౌమ్య “అబ్బే.. ఏం లేదు మామ్.. నా దగ్గర పెన్ డ్రైవ్ తీసుకుందు కొచ్చిందంతే..” అంటూ మాట దాటేసి అక్కణ్ణించి వెళ్ళబోయింది సౌమ్య..
“ఆగు.. అసలేం జరిగిందో చెప్పు.” గట్టిగా అడిగింది సరోజ.
“అబ్బే.. నువ్వు కల్పించుకోవల్సినంత పెద్ద విషయమేవీ కాదు మామ్..ఏదో చిన్న సలహా కోసం వచ్చిందంతే.”
“ఏం.. ఆ సలహా ఏదో వాళ్ళమ్మా నాన్నలనే అడగొచ్చుగా.” ఊరుకోలేదు సరోజ.
“అబ్బా.. మామ్. నువ్వు అంత తేలిగ్గా వదలవు కదా!” అంటూ తల్లి పక్కన కూర్చుని చెప్పసాగింది సౌమ్య.
“ఆద్యకి ఈ మధ్యేగా పెళ్ళైందీ. వచ్చే నెలలో వాళ్ళాయన రాజాని కంపెనీ నాల్నెల్ల పాటు జర్మనీ పంపుతోందిట. అతను లేకుండా ఎలా ఉండడం అని ఫీలవుతోందంతే.”
“అదేంటీ.. వాళ్ళత్తా మావగారూ ఉన్నారు కదా!”
“నిజం చెప్పాల్సొస్తే అదే దాని భయం. మొగుడున్నన్నాళ్ళూ వాళ్ళు బాగానే చూసేరూ.. అతను వెళ్ళేక ఏం బాధలు పెడతారోనని.”
“ఎందుకు పెడతారూ.. వాళ్ల కోడలే కదా.. అంతకీ ఏదైనా మాటామాటావస్తే వాళ్ళ పేరెంట్స్ కి చెపితే సరీ.. పెద్దవాళ్ళతో మాట్లాడతారు.”
“వాళ్ళ పేరెంట్స్ దేశంలో లేరుకదా! వాళ్ల అక్కకి డెలివరీ టైమని అమెరికా వెళ్ళేరు. అందుకే నా దగ్గరికి వచ్చింది.”
సరోజ మనసు కరిగిపోయింది.
“పెళ్ళికాని పిల్లవి.. అత్తింట్లో గొడవలు నీకేం తెలుస్తాయి కానీ.. సంగతేవిటో నాతో చెప్పు.”
సౌమ్యకి రోషం వచ్చింది.
“ఇంకా పెళ్ళికానంత మాత్రాన ఆ మాత్రం తెలీకుండా లేను. అంతదాకా ఎందుకూ! నీ దగ్గరికి వచ్చే క్లయింట్లని చూస్తున్నానుగా.. ఒక్కొక్కరి కథా వింటుంటే కడుపు దేవేస్తోంది. అందుకే ఆద్యకి మంచి సలహా ఇచ్చేను.” గర్వంగా చెప్పింది సౌమ్య. ఏవిటన్నట్టు చూసింది సరోజ.
“అదే.. ఇంట్లో ప్రతి రూమ్ లోనూ సి సి కెమెరాలు పెట్టించెయ్యమన్నాను. రేప్పొద్దున్న వాళ్ళేదైనా చేసినా అంతా రికార్డ్ అయివుంటుంది కనక ఆద్యకి న్యాయం జరుగుతుంది.”
తెల్లబోయింది సరోజ.
“అసలు నాకు ఒక విషయం చెప్పు… ఆద్య అత్తమావలు కోడల్ని హింసించేటంత
దుర్మార్గులా! నాకలా కనిపించలేదే.. తనని తిడుతున్నారా.. తిండి పెట్టటంలేదా… పుట్టింటినించి డబ్బు తెమ్మంటున్నారా.. ఏం చేస్తున్నారు!” ఆత్రంగా అడిగింది సరోజ.
“అదేం లేదమ్మా.. ఇన్నాళ్ళూ వాళ్ళబ్బాయి ఇంట్లోనే ఉన్నాడు కదా.. అందుకని ఆద్యని బాగానే చూసుకున్నారు. ఇప్పుడు మరి అతను లేకుండా ఒక్కతే వాళ్లతో ఉంటే ఏవిచేస్తారోనని భయం. అందుకే నన్ను సలహా అడగడాని కొచ్చింది.” చిరాకొచ్చింది సరోజకి.
“అందుకని నువ్వు ఆద్యని సిసి కెమెరాలు పెట్టించమని సలహా ఇచ్చేవన్న మాట. కోడలు ఇలా చేసిందని తెల్సి ఇది వరకు ఏ ఉద్దేశ్యం లేని వాళ్ళైనా వాళ్ళ అత్తమామలు ఆద్య మాట్లాడిన ప్రతి మాటా రికార్డ్ చెయ్యొచ్చుగా.. అది వాళ్లకి ప్రూఫ్ అవుతుందిగా.”
“ఆద్య వాళ్లని అలా చెడుమాటలు ఎందుకంటుందమ్మా..”
“మరి వాళ్ళు మట్టుకు ఆద్యని సరిగా చూడరని ఎలా చెప్పగలవ్!”
“అదేంటమ్మా.. పొద్దున్న లేస్తే నీ దగ్గరికి ఇలాంటి ఆడపిల్లలు ఎంత మంది వస్తున్నారూ! వాళ్లకి నువ్వు ధైర్యం చెప్పినట్టే నేనూ ఆద్యకి చెప్పేను.”
“వాళ్లని అత్తమామలు హింసించేరు. వాళ్ళు భరించలేని బాధపడి, ఇంక పడలేక నా సాయం కోరి వచ్చేరు. అలా బాధపడే ఆడపిల్లలకి చట్టం ఎప్పుడూ సహాయంగా ఉంటుంది. కానీ, ఇక్కడ ఆద్యకి అలాంటి బాధలేవీ లేవు కదా!”
“ఏమో.. పెడతారేమో..” ఆలోచిస్తూ నెమ్మదిగా అంది సౌమ్య.
“చూడు సౌమ్యా.. మన చుట్టూ చాలా మంది మనలాంటి వాళ్ళే ఉంటారు. కేవలం పదిశాతం మంది మాత్రమే దుర్మార్గులుంటారు. మనం పొద్దున్న లేచి ఆ దుర్మార్గుల కథలే వింటున్నాం కనక మన ఆలోచనలు ఇలా ఉంటున్నాయి. అందుకే ప్రస్తుతానికి ఆద్యని తొందరపడకుండా అత్తమామలని అర్ధం చేసుకుందుకు ప్రయత్నించమను. వాళ్ళేవో బాధలు పెడతారేమోనని భయపడిపోవద్దను. ఇప్పటికి మూణ్ణెల్లనించి ఆఇంట్లో వాళ్లతో ఉంటోంది. వాళ్ళ స్వభావం ఆ మాత్రం గ్రహించలేక పోయిందా. అయినా ఇంతంత చదువులు చదివేరు. మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. బైట నలుగురిలో ఎలా మసలాలో తెలిసున్నవాళ్ళు. ఆమాత్రం లోకజ్ఞానం లేకుండా ఉన్నారా మీరు!”
తల్లి మాటలకి రోషమొచ్చింది సౌమ్యకి.
“ఈ అత్తమామలు కొడుకు ఎదురుగా ఉన్నప్పుడు ఒకలాగా లేనప్పుడు మరోలాగా
ప్రవర్తిస్తారు కదా.. ఇలా ముందు జాగ్రత్త పడడంలో తప్పేవుందీ..”
“మీరనుకున్నట్టే వాళ్ళూ అనుకుంటే..”
“అంటే”
“అంటే.. మొగుడు ఎదురుగా ఉన్నప్పుడు ఒకలాగా లేనప్పుడు మరోలాగా కోడలు
ప్రవర్తిస్తుందని వాళ్లనుకుంటే..”
“అబ్బా.. అమ్మా. నువ్వు కాలికేస్తే మెడ కేస్తున్నావ్.. మెడ కేస్తే కాలికేస్తున్నావ్. ఆద్య ప్రవర్తన మీద నీకు నమ్మకం లేదా!”
“నాక్కాదు నమ్మకం ఉండాల్సింది, వాళ్లత్తా మావలకి. అలాగే ఆద్యక్కూడా వాళ్ళత్తా మావల మీద నమ్మకం ఉండాలి. ఎవరికో ఏదో అయిందనీ, అది మనకీ అయిపోతుందని భయపడడంలో అర్ధం లేదు.”
“భయం కాదు. ఇది ముందు జాగ్రత్త.”
“ముందు జాగ్రత్త అంటే ఇది కాదు.” కూతురి వైపు పూర్తిగా తిరుగుతూ సరోజ అడిగింది.
“సౌమ్యా, ఒక మాట చెప్పు. మీరు ఇంత పెద్ద పెద్ద కంపెనీల్లో పని చేస్తున్నారు కదా… అక్కడ పరిస్థితులు చాలా సంక్లిష్టంగా అంటే కాంప్లెక్స్ గా ఉంటాయి కదా… మీరిలా ప్రతీదీ రికార్డ్ చేసుకుంటూ, వీడియోలు తీసుకుంటూ ఉంటారా..”
“అలా ఎలా ఉంటాం మామ్..కానీ మా జాగ్రత్తల్లో మేముంటాం. ప్రాజెక్ట్ మేనేజర్
తో ఎలా ఉండాలో, టీమ్ లీడర్ తో ఎలా ఉండాలో, కలిసి పనిచేస్తున్నవాళ్లతో ఎలా
ఉండాలో మాకు తెల్సుకదా. కంపెనీలో పరిస్థితులకి అనుగుణంగా మమ్మల్ని మేం
ప్రిపేర్ చేసుకుంటాం.”
“కదా! ఏదో ఉద్యోగానికే అలా మిమ్మల్ని మీరు ప్రిపేర్ చేసుకుంటున్నప్పుడు, మీ
జీవితానికి ఒక తోడుగా వచ్చినతని అమ్మానాన్నలతో కలిసి ఉండడానికి ఎందుకు ప్రిపేర్
అవరూ!”
అర్ధం కానట్టు చూసింది సౌమ్య.
కూతురి చేతిమీద చెయ్యివేసి నెమ్మదిగా చెప్పసాగింది సరోజ. “చూడమ్మా.. ఇవాళో రేపో నువ్వుకూడా పెళ్ళి చేసుకుని ఒకింటికి వెళ్ళాల్సిన దానివి. అందుకే వివరంగా చెప్తున్నాను, విను. చాలా మంది అమ్మానాన్నలు ఈ రోజుల్లో ఆడపిల్లైనా మగపిల్లాడైనా అపురూపంగానే పెంచు కుంటున్నారు. కావల్సిన చదువు చెప్పిస్తున్నారు. వాళ్ళు అభివృధ్ధిలోకి వస్తే పొంగిపోతున్నారు. ఇక్కడిదాకా బాగానే ఉంది. కానీ ఇంటికి కోడల్ని తెచ్చుకుంటున్నప్పుడు, లేదా తన కూతురు ఇంకో ఇంటికి కోడలిగా వెడుతున్నప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయోనన్న భయం పెద్దవాళ్లకి ఉంటుంది. ఇదివరకు రోజుల్లో పెద్దకుటుంబాలుండేవి కనక సర్దుకుపోవడం అన్నది ఇటు కోడలికీ, అటు అత్తకీ కూడా సాధారణంగానే ఉండేది. ఎక్కడో అక్కడక్కడ చిన్న చిన్న గొడవలు తప్పితే కుటుంబాలు రోడ్డున పడేవి కావు. కానీ ఇప్పుడలా కాదు. సర్దుకుపోవడమనే భావమే చాలామందిలో తగ్గిపోయింది. నాక్కావల్సినట్టె ఉంటాననే భావం చాలామందిలో కనిపిస్తోంది. తొమ్మిదింటి నుంచి అయిదుదాకా ఉండే ఆఫీసులోనే వాళ్ల రూల్స్ కి తగ్గట్టు మిమ్మల్ని మలచుకునే మీరు జీవితాంతం కలిసి ఉండాల్సిన కుటుంబ సభ్యులతో వాళ్లకి తగ్గట్టు నడుచుకోడానికి ఎందుకు ఆలోచిస్తారు! ఏదో మీ ఇండివిడ్యుయాలిటీ అంతా పోయినట్టు ఎందుకు ఫీలవుతారూ!”
కోపమొచ్చింది సౌమ్యకి. “ఆఫీసుకీ, ఇంటికీ పోలికేంటమ్మా. ఈ ఆఫీసు కాకపోతే
ఇంకోటి. కానీ ఇల్లు అలా కాదే.. నా ఇంట్లో నాకు నచ్చినట్టు ఉండడంలో తప్పేమిటీ!”
నవ్వింది సరోజ.. “సరిగ్గా నేనూ అదే చెప్పబోతున్నాను. ఆఫీసులో నువ్వు పోతే ఆ
ప్లేస్ లోకి ఇంకోళ్ళు వస్తారు. కానీ ఇంట్లో అది పూర్తిగా నీ ప్లేస్. అలాంటప్పుడు దానిని ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలీ!”
“నేనూ అదే చెప్పేను ఆద్యతో.. జాగ్రత్తగా ఉండమనే.” ఉడుకుమోత్తనంతో అంది
సౌమ్య.
ఏదో సమాధానం చెప్పబోతున్న సరోజ ఆఫీస్ రూమ్ లోంచి తన జూనియర్ లాయర్ పద్మజ రావడంతో ఏవిటన్నట్టు చూసింది.
“మేడమ్, మీకోసం ఎవరో అమ్మాయి వచ్చింది. వనజట ఆమె పేరు. నిన్న మీకు ఫోన్ చేస్తే ఇవాళ రమ్మన్నారుట.” అంది.
“ఓహ్.. వనజా….అవును.. రమ్మన్నాను. ఇక్కడికే పంపించు.” అంటూ “నీకు ఇప్పుడేమైనా పనుందా! లేకపోతే పక్కన కూర్చుని ఈ వనజ కేసు విను.” అంది
కూతురితో.
“పదినిమిషాల్లో వస్తాను..” అంటూ లోపలికెళ్ళి ఫ్రెష్ అయి వచ్చింది సౌమ్య.
సౌమ్య ఫ్రెష్ అయి వచ్చేటప్పటికి సరోజ ఎదురుగా ఉన్న సోఫాలో సన్నగా, లోతుకు పోయిన కళ్ళతో, సర్వం పోగొట్టుకున్నట్టున్న ఒక అమ్మాయి కూర్చునుంది. పక్కన జూనియర్ పద్మజ ఆ అమ్మాయి చెప్పేది రికార్డ్ చేసుకుందుకు సిధ్ధపడుతోంది. సౌమ్య వెళ్ళి సరోజ పక్కన కూర్చుంది.
“చెప్పమ్మా.. నీ పేరేమిటీ.. ఏం చదువుకున్నావూ!” సౌమ్యంగా అడిగింది సరోజ.
“నా పేరు వనజ మేడమ్. నేను కంప్యూటర్ సైన్స్ లో డిగ్రీ చేసేను.”
“మరి ఏదైనా ఉద్యోగంలో ఎందుకు చేరలేదు. ఉద్యోగం చెయ్యడం ఇష్టం లేదా”
“చదువవగానే పెళ్ళి కుదిర్చేసేరండి మా నాన్నగారు. పెళ్ళయేక చేస్తానంటే మా
ఆయన వద్దన్నారండి..”
“నీకు పెళ్ళై ఎన్నేళ్ళయింది!”
“ఏడాది మీదా ఆరు నెలలయిందండి.”
“ఏంటి నీ సమస్య!”
“పెళ్ళైన దగ్గర్నిండీ నాలో అన్నీ తప్పులే కనిపించేయండి మా ఆయనకి. అసలే
అనుమానం మనిషేమో నేనేం చేసినా తప్పు పట్టేవాడండి. నేను ఇంటి ముందరి బాల్కనీలోకి కూడా వెళ్ళకూడదనీ, మా పుట్టింటికి కానీ, ఫ్రెండ్స్ కి కానీ ఎవరికీ ఫోన్లు చెయ్యకూడదనీ ఇలాంటి ఆంక్షలు చాలా పెట్టేవాడండి. ఎప్పుడైనా పొరపాటున నేను అతను చెప్పిన మాట వినకపోతే చెయ్యి కూడా చేసుకునేవాడండి.”
“ఇంట్లో మీ ఇద్దరే ఉండేవారా!”
“లేదండి. మా అత్తగారు కూడా మాతోనే ఉండేవారు. ఆవిడకి ఈయనొక్కడే కొడుకండి.”
“మరి, ఆవిడ మీ ఆయన్ని కొట్టొద్దని ఆపేది కాదా!”
“లేదండి..” తలొంచుకుని మొహం చిన్నబుచ్చుకుని నెమ్మదిగా చెపుతోంది వనజ.
“మరీ ఈ మాట మీ పుట్టింట్లో చెప్పలేదా!”
“చెప్పేనండి. అందుకే మా నాన్నగారు నలుగురు పెద్దమనుషులతో వచ్చి వాళ్ళ చేత మా ఆయనకి భార్యనలా తిట్టి కొట్టకూడదని చెప్పించేరండి. అలాచెప్పించినందుకు
అతనికి కోపం వచ్చి ఆ పెద్దమనుషులకి పొగరుగా సమాధాన మిచ్చేడండి. అందుకని నా బాధ చూడలేక కొన్నాళ్ళు పుట్టింటికి తీసికెడతానని శ్రావణమాసం నోములయ్యేక
పంపుతానని నాన్నగారు మా ఇంటికి తీసుకొచ్చేరండి.”
సరోజ, సౌమ్య శ్రధ్ధగా వినసాగేరు. పద్మజ జాగ్రత్తగా రికార్డ్ చేస్తోంది. “నోములయ్యేక మా ఆయన్నొచ్చి నన్ను తీసికెళ్ళమని ఫోన్ చేస్తే ఎత్తలేదండి. మెసేజ్ చేస్తే బదులు లేదండి. చూసీ చూసీ మా నాన్నే నన్ను అత్తింట్లో దింపిరావడానికి తీసికెడితే అక్కడ వాళ్ళు లేరండి. అప్పటికి నెల క్రితవే వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయేరనీ, ఎక్కడి కెళ్ళేరో తెలీదనీ పక్కవాళ్ళు చెప్పేరండి. మా నాన్నకేం చెయ్యాలో తెలీక మా అత్తగారి స్వంత ఊరు వెడితే ఆ ఇల్లూ తాళం పెట్టుందండి. మా ఆయన పని చేసే కంపెనీలో కనుక్కుంటే అతన్ని ఆన్ సైట్ లో జపాన్ పంపించేరని చెప్పేరండి. నాకు తెలీకుండా ఆయన దేశం విడిచి ఎలా వెళ్ళిపోయేరోనని చాలా అనుకున్నానండి. ఫోన్ చేస్తేతియ్యరు. మెసేజ్ పెడితే జవాబియ్యరు. అసలు ఎక్కడున్నారో అడ్రసు తెలీట్లేదండి. ఇప్పుడు నేనేం చెయ్యాలో తెలీక మీ దగ్గరకి వచ్చేనండి.”
“ఇంక వాళ్ళకి సంబంధించిన బంధువులు, అక్కచెల్లెళ్ళు, అన్నదమ్ములూ ఎవరూ లేరా!”
“ఒక్కడే కొడుకు కదండీ. తల్లీ, కొడుకూ ఇద్దరే ఉంటారు. నేను కాపరానికంటు అక్కడున్న ఆరు నెలల్లోనూ బంధువులమంటూ ఎవరూ రాలేదండి..”
“ఎవర్నీ కనుక్కోకుండా మీ నాన్న పెళ్ళెలా చేసేరూ!”
“అంటే.. వాళ్ల తాతగార్లూ, మా తాతగార్లూ బాగా తెలుసుటండి. ఈమధ్యనైతే ఎవరూ
తెలీదు కానీ బాగా పేరున్న కుటుంబాలనీ, జాతకాలు కూడా బాగా కలిసేయనీ పెళ్ళి
చేసేరండి.” తలొంచుకుంది వనజ తప్పు చేసినట్టు.
“ఒకవేళ అతని అడ్రసు దొరికితే నువ్వు అతనితో కాపరం చేస్తావా!” సూటిగా అడిగింది సరోజ వనజని.
వనజ చేస్తానన్నట్టు తలూపింది. సౌమ్య వనజ ఒప్పుదలకి ఆశ్చర్యపోయింది.
“సరే.. ఇలా నా మొగుడు అడ్రసు తెలుసుకోమంటూ పోలీసు కంప్లెయింటు ఇద్దాం..నిన్న
నేను ఫోనులో చెప్పినట్టు నువ్వు అతనికి చేసిన ఫోన్లూ, పెట్టిన మెసేజిలు అన్నీ రికార్డ్ చేసి తెచ్చేవా.” అడిగింది సరోజ.
“తెచ్చేనండి.” అంటూ ఓ కవరు టీపాయ్ మీద పెట్టింది వనజ.
“ఈ కేసు ఏ జ్యూరిస్డిక్షన్ లోకి వస్తుందో కనుక్కుంటాను.. నువ్వు రేపు పదకొండు గంటలకల్లా రా.”
“అలాగేనండీ..” అంటూ వనజ నెమ్మదిగా లేచి వెళ్ళిపోయింది.
వనజ వెళ్ళేక సరోజ సౌమ్య వైపు తిరిగింది.
“చూసేవా.. అసలు హెరాస్ మెంట్ అంటే ఇదీ.. పెళ్ళి చేసుకున్నవాడు పత్తా లేకుండా పోయేడు. అత్తగారు ఎక్కడుందో తెలీట్లేదు. బంధుమిత్రులెవరూ లేరంటోంది. ఒకవేళ ఉన్నా కూడా ఇలా పోలీసులూ, కేసులూ, కోర్టులూ అంటే ఎవరూ ముందుకి రారు. ఇప్పుడా అమ్మాయి పరిస్థితేవిటి. ‘నీకు పెళ్ళి చేసేసేం.. ఇంక మాకు సంబంధం లేదు. అక్కడే ఉండాలి నువ్వూ’ అనే చాలా మంది తల్లుల్ని చూసేను నేను. ఇక్కడ ఈ అమ్మాయి తండ్రి మంచివాడు కనక ఇంట్లోకి రానిచ్చేడు. లేకపోతే ఏ రోడ్డుమీద ఉండాలి ఈ అమ్మాయి!”
తల్లి ప్రశ్నకి జవాబు చెప్పలేకపోయింది సౌమ్య.
“చూడమ్మా.. ఎంత రోజులు మారేయనుకున్నా ఇప్పటికి కూడా మొగుడిని విడిచి పెట్టి వచ్చిన అమ్మాయికి సమాజంలో ఉండవల్సినంత గౌరవం ఉండదు. తమ తమ నెలవులు తప్పిన అన్నట్టు తను ఉండవలసినచోట ఉంటేనే ఈ సమాజంలో ఆడదానికి గౌరవం. అందుకే మొగుడు తిట్టినా కొట్టినా, చీదరించుకున్నా అత్తింటిని వదిలిపెట్టరు ఇల్లాళ్ళు.”
“అంటే తమకంటూ ఒక వ్యక్తిత్వం ఉండదా! ఆ చాకిరీ ఎక్కడ చేసుకున్నా పొట్ట
నిండదా!” ఆవేశంగా అంది సౌమ్య. నవ్వింది సరోజ.
“నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు. కేవలం తిండికోసమే చాలా మంది ఇల్లాళ్ళు
పడుండడం లేదు. డబ్బు విలువైనదే. బతకడానికి కావల్సినదే. కానీ విలువలన్నవి అంతకన్న విలువైనవి. డబ్బు లెక్కపెట్టుకోవచ్చు. కానీ విలువలన్నవి లెక్కకు అందనివి.”
“విలువలంటే..” అర్ధం కాక అడిగింది సౌమ్య..
“విలువలంటే నీకున్న సంస్కారాన్ని బట్టి ఉంటాయి. అందుకే ఇది వరకు ఏ తల్లి పెంచిందీ అనేవారు. నువ్వు పెరిగిన పరిస్థితులూ, ఆ పెరిగే క్రమంలో సమాజం నిన్ను
తీర్చిదిద్దిన వైనం ఇందులోకి వస్తాయి. అంటే సమాజంలో పెద్దలను గౌరవించాలీ,
పిల్లలను బాధ్యతగా పెంచాలీ వంటి నియమాలుంటాయి. వీటిని తప్పితే శిక్షేమీ
ఉండదు. కానీ సమాజంలో విలువ తగ్గిపోతుంది.”
“ఏంటో.. నాకేవీ అర్ధం కావట్లేదు. ఇంతకీ ఆద్యకి నేను సిసి కెమెరాలు పెట్టమని
చెప్పడంలో తప్పేవిటో అస్సలు తెలీట్లేదు.” విసుక్కుంది సౌమ్య.
“అవే విలువలంటే. పెద్దలని గౌరవించడం, పిల్లల్ని ప్రేమించడం మన సంస్కారం మనకి నేర్పిన విలువలు. ఆద్య అలా పెద్దవాళ్ల మీద అనుమానంతో సీసీ కెమెరాలు పెట్టడం విలువల్ని పాటించకపోవడం కాదా!”
“మరి ఆ పెద్దలనే వాళ్ళు రేప్పొద్దున్న ఏదైనా చేస్తే ప్రూఫ్ ఉండొద్దా!”
“అలా ఏదైనా చేస్తారని ఎందుకనుకోవాలీ! ఇది వరకు ఎప్పుడైనా అద్యని ఏమైనా
అన్నారా!
“అనలేదూ..కానీ అప్పుడు ఆద్య మొగుడు ఉన్నాడు. ఇప్పుడు ఒక్కతీ అయి పోతుంది కదా.. అందుకని జాగ్రత్త పడడంలో తప్పేవుందీ..”
“జాగ్రత్త పడడమంటే కావల్సిన వాళ్లని అనుమానించడం కాదు. ఇంతంత చదువులు చదువుకున్నారు. నాలుగురకాల మనుషుల మధ్య మసులుతూ ఉద్యోగాలు చేస్తున్నారు. ఎవరితో పలకరింపుతో ఆపాలో, ఎవరితో కేవలం పనిగురించే మాట్లాడాలో, ఎవరితో వ్యక్తిగత విషయాలు చెప్పాలో మీకు తెలుసు. ఏదైనా ప్రమాదం మీదపడినప్పుడు
తెలివిగా దాని నుంచి ఎలా తప్పుకోవాలో కూడా ఈ పాటికి మీకు తెలిసే ఉంటుంది. ఒకవేళ నువ్వన్నట్టే ఆద్య అత్తమావలు దుర్మార్గులే అయితే ఆ తెలివితేటలతో వాళ్లని
ఎలా ఎదిరించాలో ఆలోచించుకోవాలి ఆద్య. అంతేకానీ ఎవరికో ఏదో జరిగిందనీ, అది తనకీ జరుగుతుందేమోననీ ఇలా సీసీ కెమెరాలు పెట్టాలనే ఆలోచన రావడమే తప్పు.
భార్యాభర్తల సమస్య అయితే అది వాళ్ళ బెడ్ రూమ్ దాటి రాకూడదు. కుటుంబసభ్యుల మధ్య సమస్య అయితే అది ఆ ఇల్లు దాటి రాకూడదు. ఒకసారి సమస్య బైట కొచ్చిందా తెల్సినవాళ్ళూ, తెలీనివాళ్ళూ వాళ్ళకి తోచిన సలహాలిచ్చేసి, అసలు వ్యక్తిని ఆలోచించు కోనీకుండా చేసేసి, ఇలాంటి హాస్టీ స్టెప్స్ తీసుకునేలా చేస్తారు. కాని ఆ తర్వాత వచ్చే ఫలితానికి బాధపడేది ఆ నలుగురూ కాదు కదా…ఈ అమ్మాయే.”
“అంటే..ఆద్య విషయంలో నేను అనవసరంగా కల్పించుకుని సీసీ కెమెరాల సలహా
నిచ్చేనంటావా!” కాస్త చిన్నబుచ్చుకున్న మొహంతో అడిగింది సౌమ్య.
“ఊహు.. కాదు. అసలు నీ దగ్గర ఈ విషయం ప్రస్తావించడం ఆద్యదే తప్పు. తను
ప్రస్తావించినప్పుడు ఇంతలా ఇన్వాల్వ్ అవకుండా నెమ్మదిగా తననే ఆలోచించుకోమని
నువ్వు చెప్పి ఉంటే బాగుండేది. ఇప్పుడు ఉన్న భావోద్వేగం కాసేపయ్యాక ఉండదు తనకి. ఇంటికెళ్ళాక తనే నెమ్మదిగా ఆలోచించుకునుండేది.”
“మరిప్పుడు ఆద్య ఏం చెయ్యాలంటావ్!” సౌమ్య ప్రశ్నకి నవ్వింది సరోజ.
“ప్రపంచం మొత్తం గుప్పిట్లో పెట్టుకుని తిరుగుతోంది ఈ కాలం యువత. అందుకు
మీరేమీ మినహాయింపు కారు. అంతదాకా ఎందుకూ…సాధారణంగా పెద్ద కంపెనీల్లో ఏవో
మోటివేషన్ క్లాసులు అవుతూనే ఉంటాయి. వాటివల్ల మీరు నేర్చుకున్నదేవిటి.. ఎదుటి
మనిషిని క్షమించడం, ప్రేమించడం నేర్చుకోమనేకదా..ఆద్య అత్తామామలు తనని ఇప్పటిదాకా ఏమీ బాధలు పెట్టకుండా ఉంటే కనక ఆద్యని కూడా వాళ్లని ప్రేమించమని చెప్పు.”
“అంటే..”
“అంటే…ఆద్య భర్త ఊళ్ళో లేనప్పుడు ఆద్య ఏం చెయ్యాలీ! ఆ తల్లితండ్రులకి
అతను లేని లోటు కనిపించకుండా వాళ్ళ అవసరాలు చూడాలి. అతనుంటే వాళ్లని ఎంత జాగ్రత్తగా చూసుకుంటాడో అంతకన్న ప్రేమగా చూసుకోవాలి. ఆద్యకి తన అమ్మా నాన్నలెలాగో రాజాకి కూడా వాళ్ళమ్మానాన్నలు అంతేగా. ఈ వనజ మొగుడిలాగా మరీ సైకలాజికల్ పేషంట్ అయితే తప్ప ఏ మనిషీ ఎదుటివాణ్ణి కొట్టెయ్యాలీ..తిట్టెయ్యాలీ అనుకోడు. ఆద్య అత్తమావలు అలాంటివారు కాదే.. ఎంచక్క వాళ్లతో కలిసిపోయి, వాళ్లకి కావల్సినవి అందించి, కాస్త ప్రేమగా మాట్లాడితే… నేను చెప్తున్నాను చూడూ.. రేప్పొద్దున్న ఆద్య మొగుడు జర్మనీ నుంచి వచ్చేక కూడా వాళ్ళు ఆద్యనే అతనికన్న ప్రేమగా చూస్తారు.”
కళ్ళు విప్పార్చి తల్లినే చూస్తుండిపోయింది సౌమ్య.
కూతురి చేతిని తన చేతిలోకి తీసుకుని “ఎప్పుడైనా సరే ప్రేమని పంచినప్పుడున్న ఆనందం మరొకప్పుడుండదమ్మా.. మనం ఎంత ప్రేమిస్తే దానికి రెట్టింపుగా ఎదుటివాళ్ళు
మనని ప్రేమిస్తారు. అందుకే మన పెద్దవాళ్ళెప్పుడో చెప్పేరు… నీ చుట్టూ ఉన్నవాళ్లని సంతోషంగా ఉంచితే నీ ఆనందం రెట్టింపవుతుందని.”
తల్లి చెప్పిన మాటల గురించే ఆలోచిస్తూ ఆద్యకి ఫోన్ చేసింది సౌమ్య..
“ఆద్యా, మీ అత్తమామల విషయంలో తొందరపడకు. ముందు వాళ్లని బాగా గమనించు. రాజా లేనప్పుడు వాళ్లకేం కావాలో చూడు. ఎంతైనా మీ అమ్మానాన్నలు నీకెలాగో రాజాకి
కూడా వాళ్లలాగే కదా! ఆ తర్వాత వాళ్ళ ప్రవర్తనని బట్టి ముందు ఏం చెయ్యాలోచూద్దాం.”
“అదేవిటే.. ఇందాక కెమెరాలూ ఏవో అన్నావ్!” అట్నించి ఆద్య అడిగిన ప్రశ్నకి,
“నిజవే కానీ.. మా మామ్ ఇలా చెయ్యమని చెప్పింది. నాకూ అదే సరైనదనిపిస్తోంది.
నువ్వు భయపడుతున్నట్టు ఏదైనా జరిగితే నిన్ను చూసుకోడానికి నేనూ, మా మామ్
ఉన్నాంగా..” అంటూ ఫోన్ పెట్టేసిన సౌమ్యని మురిపెంగా చూసుకుంది సరోజ..
*****
నా పేరు గరిమెళ్ళ సుబ్బలక్ష్మి. జి.యస్.లక్ష్మి పేరుతో రచనలు చేస్తుంటాను. సోషియాలజీలో మాస్టర్స్ డిగ్రీ , కర్ణాటకసంగీతం(వీణ)లో డిప్లొమా చేసాను. పలు పాఠకుల ప్రశంసలు పొందిన కొన్ని పురస్కారాలు, బహుమతుల వివరాలు…