మానవీయ కోణాల ఆవిష్కరణలతో నీహారిణి కవిత్వం…!

-దాస్యం సేనాధిపతి

ఖాళీఅయిన మౌనం నుండి

కనులు మూయని నిద్ర నుండి

నిండిన నింగిదుఃఖాగ్నిని అద్ది

సమాంతరరేఖలకు ఎర్రని చెమటలు పట్టిస్తాను

అంటూ సవినయంగా, సగర్వంగా ప్రకటించుకున్న కవయిత్రి డా|| కొండపల్లి నీహారిణిగారు…. “కాలప్రభంజనం” పేరుతో తమ నాలుగో కవితాసంపుటిని వెలువరించారు. తమ మామగారైన  చిత్రకళా తపస్వి డా|| కొండపల్లి శేషగిరిరావు జీవిత చరిత్ర, వారి వ్యాసాలన్నింటినీ ఏర్చికూర్చి “చిత్రశిల్పకళా రమణీయము” పేరుతో ఓ గ్రంథాన్ని తీసుకొచ్చారు.

          ఒద్దిరాజు సోదరుల పై పరిశోధన చేసి డాక్టరేట్  పట్టా పొందారు, 700 పేజీల గ్రంథాన్ని “తెలంగాణ వేగుచుక్కలు” పేరుతో ప్రచురించారు. మాజీ పార్లమెంట్  సభ్యులు పెండ్యాల రాఘవరావు, కౌసల్యాదేవి దంపతులకు వరంగల్ జిల్లా చిన్నపెండ్యాలలో జన్మించిన వీరు దాదాపు ఇరవైఏళ్లు ఉపాధ్యాయురాలిగా పనిచేశారు.

          ప్రవృత్తి రీత్యా ఓ కవయిత్రిగా సామాజిక చైతన్యానికి అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. నిరంతర సాహితీ అధ్యయనం… ఆమె ఓ సాహితీవేత్తగా ఎదగడానికి వీలు కలిగింది. “మయూఖ” అంతర్జాల ద్వైమాసిక పత్రికను, “తరుణి” అంతర్జాల మహిళా పత్రికను స్థాపించారు… వివిధ పార్శ్వాల పై కొంత మంది సాహితీకారుల పై ఆమె రాసిన విమర్శావ్యాసాలను ‘వ్యాసహారిక’ “సృజన రంజని” పేర్లతో సాహిత్య విమర్శ పుస్తకాలను సాహితీలోకానికి అందించారు. “రాచిప్ప” పేరుతో కథల పుస్తకాన్ని, “ అర్ర తలుపులు”, ”నిర్ణిద్ర గానం”, “ఎనిమిదో అడుగు” కవితా సంపుటులను వెలువరించిన ఆమె.. ప్రస్తుతం “కాల ప్రభంజనం” పేరుతో ఇంకో కవితా సంపుటిని మనకు అందిస్తున్నారు…

          నెలవంకకు దిద్దిన రంగులతో సుదీర్ఘయాత్రకు.. హృదయాలు నడిచి వెళ్లగలిగే వంతెన వేసి..కమిలిపోని బింబాల్ని నక్షత్రాలకు కట్టిదారులే సేసంధియుగంగా సాగిపోతానంటూ డా||నీహారిణి గారు “కాలప్రభంజనం” గ్రంథంలోని కవితలకు జీవం పోశారు. ఆగని వేదనల ధారలు ఉప్పొంగుతుంటే.. దిక్కు దిక్కున మొరపెట్టుకుంటూ ఒకానొక దిశకు నన్ను నేను బదిలీ చేసుకుంటానంటూ తమ సామాజిక చింతనను.. స్వాభిమాన వైఖరిని… ఆత్మవిశ్వాసాన్ని అక్షరాల్లో నిక్షిప్తంచేశారు.

          తమ తండ్రి పెండాల్య రాఘవరావుగారి నుండి అభ్యుదయ భావాలను… ప్రగతిశీల ఆలోచనలను పునికి పుచ్చుకున్న ఆమె..తమ కవిత్వంలో… ఇతర రచనల్లో వాటిని ప్రతిబింబింపజేస్తూ… పసికిరణాలను కాల్చే సుడిగుండాలి…. ఖండ ఖండాలుగా తెగనరకమని తూర్పుగాలుల్ని ముద్దజేస్తూ భువనానికి రుతుగీతాలు నేర్పిస్తానంటూ నినదించడం విశేషం !

          ఆకాశపు తీగల వెంట ఎన్నికావ్య సందేహాలు పరిచయ కావ్యాలుగా ప్రణమిల్లు తున్నాయి ఇప్పుడు! గతాన్ని తిరస్కరించలేను.. వర్తమానంలో పాల్గొన లేనంటూ  “అలుపులేని గెలుపు” కవితను ప్రారంభించారు. మెలకువ తనం..మెలకువ గుణం ఒక చొరవచూపుతో నిలబెడుతుంది నిన్ను అంటూ కొనసాగించారు. సకాల స్పందన చేయాలన్న సంకల్ప స్ఫురణే విశ్వలయ అనీ.. అదే అలుపులేని గెలుపు ఈ ఎరుక నీకూ నాకూ అందిస్తుంది… అలుపులేని గెలుపు! అంటూ ముగించడం బాగుంది.

          సంకెలలు తెగిన సౌందర్యంలో దగ్గరితనాన్ని మరింత కలిపేస్తూనే దూరాలెంచమనని సందర్భమిది అనీ…. అద్భుత ప్రచలిత తరగలు గుండెలోనికి చేరవేస్తున్న వేళ లోకం కన్నుతో చూడుమని హితవు పలుకుతూ “అంతఃకరణశుద్ధి” కవితను తీర్చిదిద్దారు.

          ఇప్పుడు భయమేదైనా ఉన్నదంటే అది చావును గురించి కాదు..బతుకును గురించేనంటూ తేల్చి చెబుతూ “కాలప్రభంజనం” కవితను రాశారు. అమ్మలు… కనిపారేయని అమ్మలు..! నాన్నలు.. అక్రమ సంబంధాలులేని నాన్నలు! రెక్కలతో నివారణచావు దాటించు.. ఇక భయమేమైనా ఉంటే.. బతుకు గురించిగాక.. భావి గురించి గాక చెడును గురించి అనిపించుమని సూచించారు.

          ఎవరికి వాళ్ళు ఎరుకగల వాళ్ళె.. అనుభూతుల్ని అస్తిత్వానికి ఎగరేసి, ఎత్తిపట్టిన శక్తికేతనమై దుమికి.. కత్తితో ఖండంగా కామాంధుల్ని చెండాండచావేదైనా ఉంటే చావునై వస్తానను అంటూ రాసిన పంక్తులు…స్వాభిమాన తిలకాన్నిఅద్దేలా కొలువుదీరాయి.

          “కాలాతీత వ్యక్తులు” కవితలో పదిమాటలు హృదయవీణలు మీటుతుంటే.. పది స్వరాలు చరిత పుటలు చేరుకుంటవనీ.. పక్వముతో జీవమూ..సంసిద్ధతతో పోరాటమూ… ఏకత్వభావఝరిలా మనం రాయాల్సిన గేయాలమౌదాం! గాయాల్నిమాన్పుదాం! అంటూ పిలుపునిచ్చారు.

          నేటి సామాజిక పరిస్థితులకు అద్దంపడుతూ.. ‘సందేహ జీవనం’ కవితను ఇందులో పొందుపరిచారు. తెగిన ఆలోచనలను తెంపలేని అనుబంధాలను ఒక్కటి చేయలేని మనం.. సుడిగాడ్పుల రెక్కలు తొడిగించుకుని… అన్నీ కలీ అని తెలిసినా.. కొన్నైనా ఒప్పుకోలేని భయస్తులం… అందరమూ ఎవరికి వారమూ ఆ మిశ్రిత యథాలాప గమన సందేహ జీవనులమే అంటూ కవయిత్రి తమ వేదనను వ్యక్తపరిచారు.

          కత్తి అవసరంలేని యుద్ధం చేస్తున్న రోజులివి? రాపిడి రాపిడి.. రాపిడిలో రవ్వలు మొలవాల్సిన సందర్భమనీ.. ఆకురాలిన తీగలు అల్లుకుపోతున్నవి భూగోళ గమనాన్ని.. లోలోన అలజడి ఘట్టాల్ని దాటి.. ఘటం ఉన్నంత వరకు కొత్త చిగురుల పచ్చదనాన్ని ఆహ్వానించుమని “ఆకురాలిన తీగ” కవిత ద్వారా హితవు పలికారు.

          ఔను మీరు విన్నది నిజమే!! అవి అర్రమందారాలు! బంధించకండి!! ఆమెను “పని” ఖానాలో అహం దారాలతో బంధించకండంటూ “అర్రమందారాలు” కవితను రాశారు.

          ఆమె పోలీసామె కాదు..

ఆమె బాధ్యతకు ఒక జవాబ్!! అంటూ లేడీపోలీసు ఉన్నతంగా చిత్రిస్తూ “ఈ కదనరంగాను” కవితను రూపుదిద్దారు.

          ఆరు గాలం చెమటను పుడమితల్లికి ధారవోసే అతడే హాలికుడు..అను నిత్యం పనిపాటల పథగా మిశ్రమశీలిని ఆమె నేహాలిని అంటూ “హాలిని – హాలికుడు”కవితను తీర్చిదిద్దారు. వెన్నుముక లాంటి దేశకీర్తి నిజమే అతడు నీడలా వెన్నంటి భుజకీర్తినైజమే ఆమె అంటూ హాలిని హాలికుల సమన్వయాన్ని..బంధాన్నిఅందంగా ఆవిష్కరించారు.

          చినుకుల మిన్ను మురిపెపు మన్ను తటిల్లతల నల్లమబ్బు నీటి కుండల గగనం నవ్వినా ఏడ్చినా మనుగడ ప్రశ్నార్థకం అంటూ “తెల్లమబ్బు వెనుక” కవితను ఆలోచనాత్మకంగా మలిచారు. పత్తి ఎత్తు లతికమలు విసిరేసి… వరి గిరి గీసుకున్నా దాచేసి… తెల్లమబ్బు వెనుక సత్యమైన నవ్వవుతాడని రైతన్నను ఉన్నతంగా చిత్రించారు. అతని మనుగడే ప్రశ్నార్థకం అయినప్పుడు సమస్తలోకం ఆకలితో అలమటించక తప్పదని..అతడే లేని పక్షాన అమ్మలేని పాపాయిలా అవక తప్పదని చెప్పిన తీరుబాగుంది.

          ఎత్తిన పిడికిలి సత్యాన్ని జారనివ్వని జ్ఞానతేజమై.. లక్ష్యకేతన మెగరేసి నాటి ఆనవాళ్ళను ఇప్పుడు గుండెసొరుగులోకెత్తుకునే కాలం సౌందర్యమైంది. మరో కవిత ద్వారా బొమ్మగాని ధర్మభిక్షం పట్ల కవయిత్రి తమ గౌరవాన్నిచాటుకున్నారు. బాలుగారికి అక్షరాంజలి ఘటిస్తూ ‘బాలుమయం’ కవితను రాశారు. మరో కవితలో మాజీ ప్రధాని పీవీని కీర్తించారు.

          గృహ వాసం గొప్ప సహవాసమనీ.. పాత కోపతాపాలను కడిగేసుకున్న మేమిద్దరమూ ఇప్పుడు శుభ్రపరిచిన పాత్రల్లా మెరుస్తున్నం.. అంటూ దంపతుల అన్యోన్యతను కవయిత్రి తమదైన శైలిలో ఆవిష్కరించిన తీరు అభినందనీయం.

          అక్రమార్కుల చిట్టాలిప్పి..కవితల దుడ్డుకర్రలతో దండించే రక్షకుడిగా కవిని అభివర్ణిస్తూ ‘కవి’ కవితను రాశారు.

          ‘నిశ్శబ్ద వ్యవధి’ కవితలో అమ్మ మాట్లాడకుంటే..పిల్లలేమై పోతారు? కవి ప్రవాహంలో కవిత్వం లేకుంటే పాఠకులేమై పోతారు? అని ప్రశ్నించారు.

ఆడోళ్ళంటేనే బతుకమ్మ !

బతుకమ్మంటేనే ఆడోళ్ళు…

          బ్రతుకు చిత్రానికి తీర్చిదిద్దిన సమర సతాభావనల రంగులు ఆడోళ్లు అంటూ ‘బతుకమ్మ-ఆడోళ్ళు’ కవితకు రూపమిచ్చారు. స్త్రీవాద కవిత్వానికి ఈ గ్రంథంలో సముచిత స్థానం కల్పించారు.

          ఇలా అనేక కవితా పంక్తులు ఉదహరించడానికి యోగ్యంగా ఉన్నాయి. కవయిత్రి నీహారిణిగారు తమఅనుభవాన్ని రంగరించి అందించిన భావాలను అభినందించకుండా ఉండలేము..

          మన దేశంలో ఉన్నా.. విదేశాల్లో ఉన్నా కవయిత్రి నీహారిణిగారు కవిత్వ సృజనను నిరంతరం కొనసాగించడం స్వాగతించదగింది. తమ కలానికి మరింత పదును పెట్టు కుని మున్ముందు మరింత గాఢమైన కవిత్వం అందిస్తారన్న విశ్వాసం ఉంది.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.