యాత్రాగీతం

బహామాస్ 

-డా||కె.గీత

భాగం-10

బహామాస్ క్రూజ్ (రోజు -4, చివరిభాగం)

          నాసో నగర సందర్శన పూర్తయిన రోజు క్రూయిజ్ లో రాత్రి భోజనం ప్రత్యేకమైనది. ఫార్మల్ దుస్తులు వేసుకుని రెస్టారెంటులో సీటు రిజర్వ్ చేసుకుని చేసే భోజనం అన్నమాట. మగవారు సూటు, బూటు లేదా కనీసం ఫుల్ హాండ్ షర్టు ఇన్ షర్టు చేసుకుని, బూట్లు వేసుకుని, ఆడవారు చక్కని గౌన్లు వేసుకుని చక్కగా తయారయ్యి మరీ భోజనానికి వెళ్లడమే ఫార్మల్ డిన్నర్ అన్నమాట. భోజనంలోని ఐటమ్స్ కూడా ప్రతి రోజూ తినేదానికి భిన్నంగా వెరైటీగా ఉంటాయి. అయితే ఇచ్చిన పరిమితిగా ఉన్న మెనూలోనే స్టార్టర్ దగ్గరనించి డిసర్ట్ వరకూ రెండు మూడు వెరైటీలు చొ.న ఉంటాయి. మేం అందుకోసమే ప్రత్యేకించి తెచ్చుకున్న బట్టలు వేసుకోవడమే కాకుండా ఆ రోజు ప్రత్యేకించి ఉండే ఫోటో షూట్ కి కూడా వెళ్లాం. 

          యాత్రలో అది చివరి రోజు కావడంతో ఓడలో గానాబజానా ఆకాశాన్నంటుతూ ఉండగా మేమిద్దరం డెక్ పైకి వచ్చి వెన్నెట్లో సముద్ర కెరటాల్ని, నీటిని చీల్చుకు వెళ్తున్న ఓడ చెదరగొడుతున్న వెన్నెల కిరణాల్ని చూస్తూ కబుర్లు చెప్పుకున్నాం. ఇట్టే గడిచి పోయినట్టు అనిపించినా బాగా నచ్చింది ఆ క్రూయిజ్ ట్రిప్ మాకు. 

          మూడు రోజుల బహామాస్ యాత్ర పూర్తి చేసుకుని మర్నాడు పొద్దున్నే 6.30 కల్లా మయామీ తీరానికి చేరుకున్నాం. సముద్రంలో ప్రయాణిస్తున్నంతసేపు లోపల్లోపల ఎప్పటికైనా తిరిగి భూభాగాన్ని చూస్తామా అని అనిపిస్తూ ఉంటుంది. ఉదయం తీరాన్ని చూడగానే మా సంతోషానికి అవధుల్లేవు. పిల్లలు “ల్యాండ్ ఓహోయ్” అని అరిచేరు. 

          ఉదయాన బ్రేక్ ఫాస్ట్ ఉండడంతో అన్నీ సర్దుకుని వచ్చి ఓడలోనే కాఫీలు, టిఫిన్లు పూర్తి చేసుకున్నాం. 

          ఎనిమిదిన్నర ప్రాంతంలో మయామీ షిప్ యార్డులోని ఇమ్మిగ్రేషన్ కార్యక్రమాలన్నీ సజావుగా పూర్తయ్యి తిరిగి అమెరికాలోకి అడుగుపెట్టాం. 

          రెంటల్ కారు తీసుకుని మయామీలో స్వీట్ వాటర్ అనే ప్రాంతంలో ఉన్న డాల్ఫిన్ మాల్ లో సాయంత్రం వరకు గడిపాం. ఈ 240షాపులున్న ఈ డాల్ఫిన్ మాల్ మయామీలో అన్నిటికన్నా పెద్ద షాపింగ్ మాల్. 

          అక్కడ ఫుడ్ కోర్ట్ దగ్గిర చిన్నపిల్లలు ఆడుకునే ఏరియాలో నేలమీద పెద్ద పెద్ద తినుబండారాల్ని పోలిన బొమ్మలు ఉంటాయి. పిల్లలకిష్టమైన వాఫుల్స్, అరటిపళ్ళు, ఆమ్లెట్ వగైరాల మీద పిల్లలు ఎక్కి దుముకుతూ ఆడే చోటి నుంచి సిరి ఓ పట్టాన రానని పేచీ పెట్టింది. 

          హోటల్ హిల్టన్ లోని మా బసకు చేరుకుని కాస్త విశ్రాంతి తీసుకుని రాత్రికి ఇండియన్ రెస్టారెంట్ అశోకాలో భోజనం చేసాం. మూడు రోజుల నుండి అలిసి పోయినట్లయ్యి ఆ రాత్రికి పెందరాళే నిద్రపోయాం. 

          మర్నాడు తెల్లారగట్ల మయామీ నుండి అట్లాంటా మీదుగా తిరుగు ప్రయాణం ప్రారంభించి పన్నెండు గంటలకల్లా మా ఊరికి చేరుకున్నాం. 

          మాలాగా అమెరికా పశ్చిమ తీరంలో ఉన్నవాళ్ళకి ఒక వారం రోజుల సెలవులో వెళ్లి రావడానికి ఒక చక్కని టూరు బహామాస్ క్రూయిజ్ టూరు.

*****

(సమాప్తం)

 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.