యాదోంకి బారాత్-4

-వారాల ఆనంద్

కరీంనగర్ – మిఠాయి సత్యమ్మ స్వీట్ హౌస్ – ఓ చరిత్ర ఓ జ్ఞాపకం  

కరీంనగర్ నా నేస్తం,

కరీంనగర్ నా ప్రేయసి,

కరీంనగర్ నా జీవితం,

కరీంనగర్ నా ఊపిరి.

కరీంనగర్ పోత్తిల్లల్లో పెరిగాను, వీధుల్లో తిరిగాను, ఒకటి కాదు రెండు కాదు ఆరు దశాబ్దాలకు పైగా ఈ వూరును నేను పెనవేసుకున్నాను. ఈ వూరు నన్ను తన చేతుల్లో పెంచింది.

          వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, సామాజికంగా, రాజాకీయంగా, సాంస్కృతికంగా, సృజనాత్మకంగా కరీంనగర్ నాకు వేదికయింది. గుండె దిటవు చేజారినట్టు అనిపించినప్పుడల్లా కరీంనగర్ నాకు వెన్ను దన్నుగా నిలబడి అడుగు ముందుకు పడేలా చేసింది.

          ఇంతలా ప్రవాహంలా నన్ను చుట్టేసిన కరీంనగర్ అనేకానేక సందర్భాల్లో నా దేహంలో, ఆలోచనల్లో ఉచ్వాస నిశ్వాస అయి నన్ను నిలబెట్టింది. అందుకే నేను ఈ ఊరంటే ప్రాణం బెడతాను.

***

కరీంనగర్ కేవలం నాకే కాదు మా నాన్న శ్రీ వారాల అంజయ్య గారికీ అంతే. తను కూడా ఇక్కడే పుట్టి పెరిగి ఎదిగి తన కుటుంబమూ, ఉద్యోగమూ, ఉద్యోగ విరమణ దాదాపుగా అన్నీ ఇక్కడే. తనిప్పుడు 85 ఏళ్ళ యువకుడు.తానే కాదు మా నానమ్మ వారాల నరసమ్మ, తాత నరసయ్యలు తమ సంసారం మొదలుపెట్టిందీ, వెలుగు వెలిగిందీ ఆరి పోయిందీ ఇక్కడే. ఇట్లా మూడు నాలుగు తరాలుగా మేమంతా కరీంనగర్ తో ముడివడి వున్నాం.

***

          నిజానికి కరీంనగర్ నగర వయసు కేవలం 115 ఏళ్ల పై చిలుకు మాత్రమే. హైదరాబాద్ నగరం రాజధానిగా క్రీ.శ. 1751 నుంచి దాదాపు 225 ఏళ్ళ పాటు ఏలిన ఆసిఫ్ ఝాహీ నవాబుల కాలంలో తర్వాత నిజాం కాలంలో జిల్లా కేంద్రంగా ఎలగందుల ఖిల్లా వుండేది. ఖిలాదారుల పాలనలో జిల్లా నడిచేది. ఆ కాలంలో మానేరు నది ఒడ్డున అలిపిరాల అని ఓ గ్రామం వుండేది. ఆరవ నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ 1905లో చేపట్టిన జిల్లాల పునర్ వ్యవస్థీకరణలో భాగంగా జిల్లా కేంద్రాన్ని అలిపిరాలకు మార్చారు. ఎలగందుల ఖిలేదారుగా వున్న కరీముద్దీన్ షా పేరున అలిపిరాలను కరీంనగర్ గా మార్చారు. ఇప్పటికీ నగరంలోని కాపువాడలో కరీముల్లా షా దర్గా వుంది. ఉర్స్ ఉత్సవాలు ఘనంగా జరుగుతూ వుంటాయి. ఇక ఆంగ్లేయుల ఆధిపత్యంలో జిల్లా అధికారులుగా ఇంగ్లీష్ వాళ్ళు రావడం మొదలయింది. బ్రిటిష్ వారి సంస్కృతిలో భాగంగా కరీంనగర్ లో కూడా నగరం నడిబొడ్డున క్లాక్ టవర్ నిర్మించారు. అది ఇప్పటికీ చెక్కు చెదరకుండా వుంది. ఇక నిజాం నవాబు గద్దెనెక్కి 25 ఏళ్ళ పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా కరీంనగర్ ప్రవేశ ద్వారంగా అప్పటి జాగీర్దారులు జుబ్లీ కమాన్ నిర్మించారు. ఇది స్థూలంగా కరీంనగర్ స్థితి, జిల్లా కేంద్రంగా ఏర్పాటయిన కొంత కాలానికే నడిబొడ్డున క్లాక్ టవర్ చెంతనే మిఠాయి దుకాణం పెట్టి మా నానమ్మ తాతయ్యలు నిలబడ్డారన్న మాట.

***

          కరీంనగర్ తో మా కుటుంబానికి ఇంత అనుబంధం ఉన్నప్పటికీ వారాల వారి మూలాలు వేములవాడలో వున్నాయి. టెంపుల్ టవున్ అయిన ఆ గ్రామంలో మా తాతల నాటికే మిఠాయీలమ్మేవారని నేను విన్నాను. మా తాతయ్యలు వేములవాడ స్థానికులు. వారాల రాజయ్య, వెంకయ్య, భవాని, రాజన్న, నర్సయ్య, స్వామి ఇలా వాళ్ళు మొత్తం అయిదుగురు. వీరిలో పెద్దవాడయిన రాజయ్య ఆ కాలంలోనే వూరు విడిచి హైదరాబాద్ కు వలస వెళ్ళాడు. తనకు గొప్పగా తెలిసిన మిఠాయీలు చేసే వృత్తి నైపుణ్యంతో అక్కడే కొంతకాలం వున్నాడు. ఉప్పల్ ప్రాంతంలో వుండిన సత్తెమ్మను వివాహం చేసుకుని వేములవాడకు పోకుండా జిల్లా కేంద్రమయిన కరీంనగర్ చేరుకున్నాడు. తన తమ్ముళ్ళు భవాని, నర్సయ్యలను తన వద్దకే పిలిపించుకుని కరీంనగర్లో మొట్టమొదటి మిఠాయిల దుఖానం ఆరంభించాడు. మిగతా ఇద్దరు వేములవాడలోనే వుండిపోయారు. వారాల రాజయ్య, భవానీలు స్వీట్స్ తయారీ విభాగాన్ని భట్టీ పొయ్యి, మిఠాయిల సాంచాలతో (Moulds) సహా చూస్తే,  కార్యదక్షత కలిగిన సత్యమ్మ దుఖానం నడిపేది. ఇక తాత నర్సయ్య అక్కడే రంగు రంగుల గాజులతో గాజుల దుఖానం నడిపేవాడు. తమ్ముల్లిదరికీ వారాల రాజయ్య సత్యమ్మలే వివాహాలు జరిపారు. కానీ సత్యమ్మరాజయ్యలకుకానీ, భవానీ దంపతులకు కానీ పిల్లలు కలుగ లేదు. కేవలం నర్సయ్య నర్సమ్మలకు మాత్రమే పిల్లలు కలిగారు. వారిలో నలుగురు కొడుకులు( వెంకట స్వామి, జగన్నాధం, సత్యనారాయణ, అంజయ్య), అయిదుగురు కూతుళ్ళు( కాశమ్మ, ఆండాలమ్మ, సక్కుబాయి, శ్యామల, సువర్ణ). పుట్టి పోయిన వాళ్ళ వివరాలు నాకు తెలీదు.  

          ఎప్పుడో కొంత వ్యవసాయ భూమి ఉన్నప్పటికీ మాది ప్రధానంగా వ్యాపార కుటుంబం. మిఠాయిల వ్యాపారం. కరీంనగర్ నగరం నడిబొడ్డున గడియారం( CLOCK TOWER) దగ్గర ఆ షాప్ లో రంగు రంగుల చిలుకలు, బట్టీసలు, బెండ్లు, శక్కరి పుట్నాలు, కోవాపెడా, గులాబ్ జామూన్, కలాఖండ్, బాదుషా, జిలేబీ, ఝాంగ్రీ, లడ్డు, చేక్కీ లాంటి అనేక రకాల స్వీట్లు, సేవ్, బూంది, మిక్షర్ లాంటి ఖారా ఇలా ఒకటేమిటి అనేక రకాల తయారీలతో వెలిగిపోయిందా దుఖానం, కేవలం కరీంనగర్ లోని దుకాణంలోనే కాకుండా జిల్లలో పలుచోట్ల జరిగే జాతరలకు ఎడ్ల బండ్ల మీద వెళ్లి వ్యాపారంచేసేవారు. చిల్కల పేర్లు, బత్తీసల దండలతో సహా అనేక స్వీట్లు జాతరలలో అమ్మి వచ్చేవారట. దాదాపు నూరేళ్ళ క్రితమే మా కుటుంబం మిఠాయోళ్ళ కుటుంబంగా పెరుగాంచింది. అప్పుడు ఈ చుట్టుపక్కల అనేక గ్రామాల్లో మున్నూరు కాపు కులస్తులలో వివాహమంటే మిఠాయి సత్తెమ్మతో చుట్టరికం వుందంటే పెళ్ళిళ్ళు క్షణంలో కుదిరేవట. మా పెదనానమ్మ మిఠాయి సత్తెమ్మగా కరీంనగర్ ఊర్లోనే కాకుండా చుట్టుపక్క అనేక ప్రాంతాల్లో ప్రసిద్దులు. మహిళ అయినప్పటికీ హైదరాబాద్ లో పుట్టి పెరిగింది కావడం చేత ఆమె వ్యాపార వ్యవహార నిర్వహణల్లో గొప్ప ప్రతిభ చూపే వారు. తన స్వంత గుర్రం మీద వూర్లో తిరిగేది అని మా పెద్దలు చెప్పారు. ఆనాటి జిల్లా అధికారుల్నుంచి మొదలు ఇక్కడి ముస్లిం జాగీర్దార్లు, భూస్వాములు సత్యక్కా అంటూ ఆమెను గౌరవంగా పిలిచేవారంట. అట్లా మిఠాయి సత్యమ్మ ప్రభ 1960ల దాకా వెలిగింది. తర్వాత కరీంనగర్ లాంటి పట్టణాల్లోకి మార్వాడీలు రావడం దిల్లీవాలా స్వీట్ హౌస్ లంటూ కొత్త స్వీట్ షాపులు, ఉత్తరాది వాళ్ళ బేకరీలు లాంటివి రావడంతో అప్పటికి వున్న షాపుల స్థితి తారుమారు కావడం మొదలు పెట్టింది. ఆధునికత పెరుగుతూ సమాజంలో వస్తున్న మార్పులకు మిగతా వ్యాపారాల్లాగే మిఠాయి సత్యమ్మ స్వీట్ హౌస్ తన ఉనికిని కోల్పోవడం మొదలయింది. దానికి తోడు నర్సయ్య తాత చనిపోవడం, సత్యమ్మ నరసమ్మల తర్వాతి తరం ఉద్యోగాల వైపునకు మరలడం కూడా ఒకింత కారణమయింది. అట్లా కరీంనగర్ తో సహా దాదాపు అన్ని ప్రాంతాల్లో నూతన వ్యాపార పోకడలు, వ్యవస్థలు రూపు దిద్దుకోవడంతో సరికొత్త వాతావరణం ఏర్పడింది. మా తరం వచ్చేసరికి  మిఠాయి దుఖానం చివరి రోజుల్ని చూశాం, గత వైభవం ఒక జ్ఞాపకంగా మిగిలిపోయాయి.

***

కరీంనగర్ – మా ఇల్లు – మిఠాయి సత్యమ్మ స్వీట్ హౌస్

నాలుగు గోడలు, పైన కప్పు, తలుపులూ, కిటికీలు, ఇవన్నీ కలిస్తే ఇల్లవుతుందా. ఇల్లంటే

గూడేనా అంతేనా. కాదేమో….

 

“ఇల్లు కేవలం గూడేకాదు

అనుబంధాల అల్లిక

అనుభవాల కలబోత

 

పండుగలూ పబ్బాలూ

కేరింతలూ కోప తాపాలూ

కలిసివుండడమే ఇంటికి పునాది

 

ఇల్లెప్పుడూ ఇరుకు కాదు

మహా వృక్షంలా నీడ నిస్తుంది

కంటి నిండా నిద్ర నిస్తుంది

ఓ చిరునామా నిస్తుంది

 

గాలి

ఇంటిచుట్టూ సమిష్టి భావనతో

సయ్యాట లాడుతుంది

 

ఇంటిముందు వేపచేట్టూ

వెనకాల బాదం చెట్టూ

నీడనే కాదు నిమ్మళాన్నీ ఇస్తాయి

 

కదిలిపోయిన కాళ్ళకీ

ఒత్తిగిలిన మనస్సుకీ తమను తాము తెలుసుకోవడానికి

తమలోకి తాము చూసుకోవడానికీ

 

ఇల్లే నెలవు

అది మట్టిదయినా

గూన పెంకులదయినా

***

          సరిగ్గా అలాంటి ఇంటి గురించే నేనివ్వాళ గుర్తు చేసుకుంటున్నాను. నాలుగు మాటలు మాట్లాడ బోతున్నాను. మీతో పంచుకోబోతున్నాను.  

          నా చిన్న నాడు మా నానమ్మ ‘మిఠాయి సత్యమ్మ’ స్వీట్ హౌసూ, మా ఇల్లూ వేర్వేరు కాదు. రెండూ ఒకటే. ఇంటి ముందు వేప చెట్టూ, ఖడ్గరీల ( సలాకల) తలుపులూ వాటి వెనకాల ఒక వైపు స్వీటు షాపూ, మరో వైపు గాజుల దుకాణం. వాటి మధ్యలోంచి వెళితే పెద్ద దర్వాజ. దాటితే విశాలమయిన ఇల్లు. అదో చతుశ్శాల భవంతి. పెద్దపెద్ద స్తంభాలూ దూలాలతో కట్టిన ఆ ఇంటి కప్పు గూన పెంకులతో కప్పబడి నిండుగా కనిపించేది. ఎన్ని గదులు ఎంతమంది వుండేవారో గుర్తొస్తే అంతమంది ఒక చోట హాయిగా వుండడం ఎట్లా కుదిరిందో ఆశ్చర్యం కలుగుతుంది. దాన్ని ఇల్లనేకంటే ఓ మున్సిపల్ స్కూలు అనో, పెద్ద లాడ్జి అనడమో బాగుంటుంది. ఆ ఇంట్లో ఎవరి వంట వారిది ఎవరి జీవితం వారిది అయినా అంతా కలిసి ఓ పెద్ద ఉమ్మడి కుటుంబంలా వుండేవాళ్ళు. అది ఇవాల్టి రోజుల్లో సాధ్యమా అనిపిస్తుది. ఈ రోజుల్లో దాదాపు అన్నీ FRACTURED FAMILIES అయిపోయి satellite లుగా నివాసాలేర్పరుకుంటున్న స్థితి. ఇప్పుడు ఒకే  రక్త సంభదీకుల ఉమ్మడి కుటుంబాన్నే ఊహించలేని పరిస్థితి. కానీ ఆ రోజు మా ఇంట్లో మా వారాల వారి కుటుంబాలే కాకుండా అనేక మంది కిరాయికి వుండి అక్కా అన్నా అత్తా మామ అని పిలుచుకుంటూ కలిసిపోయి వుండే వాళ్ళు. అందుకే ఇవ్వాళ అప్పటి మిఠాయి సత్యమ్మ’ స్వీట్ హౌసూ, మా ఇల్లూ ఒక పెద్ద కలేమో అనిపిస్తుంది.

          ఇప్పుడా ఇంటినీ కుటుంబాన్నీ గుర్తు తెచ్చుకుంటే సరిగ్గా బెంగాలీ నవలాకారుడు శరత్ రాసిన నవలలే గుర్తొస్తాయి. విశాలమయిన ఇండ్లూ, ఉమ్మడి కుటుంబాలూ వారి మధ్య ప్రేమలూ, అంతర్లీనంగా వుండే అయిష్టాలూ, కోపతాపాలూ, కాల గమనంలో ఒక్కొక్కరూ ఆ ఇళ్ళను వదిలి వెళ్ళడం అంతా అంతా ఆ మహా రచయిత శరత్ రాసినట్టు గానే మా ఇల్లూ మిఠాయి దుకాణం ఉండేవి.      

***

          అప్పటికి కరీంనగర్ జిల్లా కేంద్రమే అయినప్పటికీ ఇంకా వూరు లక్షణాలతో పెద్ద గ్రామంలానే వుండేది.

          ఊరు నడుమిట్ల మా ఇంటికి సమీపంలోనే పెద్ద గడియారం (క్లాక్ టవర్) దానికి నాలుగు వైపులా నాలుగు ప్రధాన రోడ్లు, పడమటి రోడ్డుకు వెళ్తే ఇప్పటి అన్నపూర్ణా కాంప్లెక్స్ స్థానంలో కలెక్టరేట్, ట్రేజరీ, రిజిస్ట్రేషన్ తదితర రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయా లన్నీ ఒకే చోట కొలువు తీరినట్టుగా ఉండేవి. దానికి ఒక పక్క కూరగాయల మార్కెట్ దాని పైన మటన్ మార్కెట్, ఇంకో వైపు వెంకటేశ్వర ఆలయం. పెద్ద గడియారం చుట్టూరా వ్యాపార దుఖానాలూ, దక్షిణం వైపు వెళ్తే గంజ్, ఉత్తరం వైపు ఆల్ఫా చౌరాస్తా(ఇప్పటి రాజీవ్ చౌక్), తర్వాత ఖార్ఖానా గడ్డా ఇట్లా మొత్తం పెద్ద గడియారం చుట్టూరా వ్యాపార అధికార కేంద్రాలు విలసిల్లేవి. పెద్ద గడియారానికి తూర్పు రహదారి పై  మా ఇల్లు- మిఠాయి సత్యమ్మ స్వీట్ హౌస్ ప్రధాన ఆకర్షణ. దాన్నుంచి ముందుకు వెళ్తే కాపువాడ అదే పాత ‘అలిపిరాల’, అప్పటికింకా పల్లె వాసనలు పోని స్వచ్చమయిన వూరు.

***

          ఇక మా ఇల్లు– మిఠాయి సత్యమ్మ దుఖానం విషయానికి వస్తే అదిఅటు వ్యాపారమూ ఇటు నివాసమూ కలగలసిన సంఘమ స్థలి. ముందున్న మిఠాయి దుఖానానికి వెనకాల గది తిజోరీ గది. అంటే డబ్బూ దశ్కం పెట్టుకునే ఇప్పటి బాంక్ లాకర్ లాంటిది, అప్పటికి మంచి వ్యాపార కుటుంబం కనుక అది ఆనాటి అవసరం. ఇక దాని వెనకాల గది లక్ష్మి అమ్మవారి గది. కొంచెం చీకటిగా వుండేది. అందులో ప్రతి శుక్రవారం పూజ, ప్రతి దీపావళికి నోములు జరిగేవి. ఇక గాజుల దుకాణం వెనకాల గదిలో పంతులు కుటుంబం నివాసం. ఆయన సైకిల్ కంపని, కొంత వడ్డీ వ్యాపారం నడిపేవాడు. ఇక రోడ్డు వైపే గాజుల షాప్ కి అవతల సయ్యద్ వెల్డింగ్ షాప్ నడిపే వాడు. ఇక చతుశ్శాల భవంతిలో భాగంగా ఇంటి నడుమ గచ్చు open to sky. దాని చుట్టూరా నాలుగు వైపులా Living space. దాని చుట్టూ పొడుగూతా గదులు. ఒక వైపు మామూలు దేవుడి గది. ఇక మా నానమ్మ నరసమ్మ నర్సయ్యల నలుగురు కొడుకుల్లో ముగ్గురు ఇక్కడే వుండే వాళ్ళు. రెండవ పెదనాన్న శ్రీ జగన్నాధం, పెద్దమ్మ సత్తక్క తమ నలుగురు పిల్లలతో ( సురేష్, మహేష్, శోభ, రమ)పాటు కాపు వాడలో రామయ్య తాత ఇంట్లో వుండే వాళ్ళు. ( ఆ వివరాలు మరోసారి)

          ఇక ఇక్కడ అందరికంటే పెదనాన్న శ్రీ వెంకటస్వామి- శారదమ్మల కుటుంబం, శ్రీ సత్యనారాయణ-ఊర్మిళ కుటుంబం, మా కుటుంబం నివాసమున్నారు. మూడు కుటుంబాలకూ రెండేసి గదులు. ఒకటి వంటకు మరోటి నివాసానికి. ఇవి పోను కటిక మీనాజీ మామ తమ కుటుంబంతో మరి రెండు గదుల్లో వుండేవారు. ఆయన దగ్గరలోని కల్లు  దుఖానంలో ఆహార పదార్థాలు (మంచింగ్) అమ్మేవాడు. వాటిల్లో కాళ్ళు తలకాయ వేపుడు, మటన్ ముక్కలతో చేసిన చీకులు, రక్తం ఉడికించిన నల్ల, మిర్చీ బజ్జీ అలా ఒకటేమిటి ఎన్నో సాయంత్రానికి రెడీ చేసుకుని కళ్ళు షాప్ కి వెళ్ళే వాళ్ళు. ఇక మరో గదిలో మార్కెట్ లో తాళాలు రిపేర్ చేసే రాజాజీ, రాంబాయత్త తమ ముగ్గురు కూతుళ్ళతో వుండేవాళ్ళు. ఇట్లా అనేక కుటుంబాలతో ఇల్లు కళకళ లాడేది. వచ్చే పోయే చుట్టాల సంగతి చెప్పనే అవసరం లేదు. పిల్లల విషయానికి వస్తే శారదమ్మకు నలుగురు కొడుకులు ( మోహన్, ప్రకాష్, రాజేందర్, నర్సింగ్), అయిదుగురు కూతుళ్ళు ( జయ, శాంత, ఉమా, జ్యోతి, భాగ్య), ఊర్మిలమ్మకు ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్ళు ( అశోక్, నరేందర్, విద్య, సంధ్య), ఇక మా అమ్మ రాధకు మేము ముగ్గురు కొడుకులు, ఇద్దరు కూతుళ్ళు ( ఆనంద్, అర్జున్, అమర్, మంజుల, అనురాధ) ఇలా మొత్తం అందరూ కలిసి 20 మంది పిల్లలు. అంతా కలిసి ఆ ఒక్క ఇంట్లో కలిసిమెలిసి వుండేవాళ్ళు. ఇద్దరు పెద్దవాళ్ళు నానమ్మలు సత్యమ్మ, నరసమ్మ, భవానీ తాత కూడా. మా తాత నర్సయ్య నేను పుట్టకముందే పరమపదించారు. ఇట్లా పిల్లాపెద్ద కలిసి 30 మంది దాకా నివాస ముండే ఇంట్లో మరో వైపు భట్టీ వుండేది. అందులో స్వీట్స్, ఖారా తయారు చేసే వాళ్ళు. ఇక అవి చేసే పనివాళ్ళు, పాల వాళ్ళు మా వాళ్ళతో కలిసి క్రిక్కిరిసి పోయి గంధరగోళంగా వుండేది అంటే అతిశయోక్తి కాదు. అయినా అంతా సంయమనం స్నేహం బంధుత్వ పిలుపులతో సందడి సందడిగా. ఎవరింటిలో ఏమి వండామన్నది ప్రధానం కాదు. భోజనం వేళకి రాధమ్మ చిన్నీ ఏమి వండినవ్, ఊర్మిళ చిన్నీ ఏం కూర అంటూ అంతా ఉమ్మడి గానే వుండేది.  

          అట్లని  ఆ ఇంట్లో సబ్ టీఖ్ హై అన్నట్టు కాదు. కోపాలూ తాపాలూ, అలకలూ అన్నీ ఉండేవి. కాని చాలా మట్టుకు అనుకున్నా సర్దుకునే వాళ్ళు. పెదనానమ్మ సత్యమ్మ ఆరోగ్యం కుంటుపడగానే నరసమ్మ రాజ్యం మొదలయింది. దుకాణాలు ఆమె చేతిలోకి వచ్చాయి. పండగలప్పుడు మా అమ్మలూ గాజుల షాపులో మహిళలకు గాజులు తోడిగే వాళ్ళు.

***

          ఇక వాడలో మా ఇద్దరు నానమ్మలకూ పెద్దవాళ్ళుగా మంచి గౌరవం వుండేది. సరిగ్గా 50 ఏళ్ళ క్రితం పెద్ద గడియారం తూర్పు రోడ్డుకు అంటే మా ఇంటిముందున్న రోడ్డుకు ‘తిలక్’ రోడ్డు అని నామ కారణం చేసారు. దాంట్లో టేల చంద్రయ్య, శ్యాం, రాజేశం, వారాల ఇంట్లో వాళ్ళు మోహన్, ప్రకాష్, అశోక్, నరేందర్, రాజేందర్ తదితరులు ప్రధాన బాధ్యత నిర్వహించారు. లాంచనంగా ప్రారంభించినప్పుడు ప్రముఖ రాజకీయవేత్త జువ్వాడి చుక్కా రావు పక్క నుండి మిఠాయి సత్యమ్మతో రిబ్బన్ కట్ చేయించి ఆమెను గౌరవించారు. చిన్ననాడు చూసిన ఆ దృశ్యం ఇంకా నా మదిలో నిలిచిపోయింది. అంతే కాదు ఆ రోజుల నుంచే తిలక్ రోడ్డులో ప్రతి ఏటా ‘ఉట్లు’ కొట్టడం, శివరామకృష్ణ భజన మండలి ఆధ్వర్యంలో వినాయక ఉత్సవాలు నిర్వహించడం జరుగుతున్నది. మొదట్లో మిఠాయి దుఖానం ముందు జరిగే ఉత్సవాలు పెద్ద గడియారం ఆవరణలో జరపడం మొదలు పెట్టారు. మొదట్నుంచీ ఈ ఉత్సవాలల్లో వారాల కుటుంబానిది ప్రధాన భూమికగా వుంది.

          తర్వాత మరో సందర్భంలో జే.చంద్రశేఖర్ రావు ఎం.ఎల్.ఎ గా వున్నప్పుడు పెద్ద గడియారం renovation చేసిన తర్వాత ప్రారంభోత్సవాన్ని అప్పటికి దాదాపు నూరేళ్ళు పూర్తి చేసుకున్న మా నానమ్మ నరసమ్మ చేతుల మీదుగా చేయించారు.

***

ఇట్లా ఇల్లు- మిఠాయి దుఖానంతో మరిన్ని జ్ఞాపకాలతో మళ్ళీ వారం కలుస్తాను.

ఇద్దరు నానమ్మలు, తాత పాదాలకు నమస్కరిస్తూ….

***

కరీంనగర్ –మిఠాయి సత్యమ్మ ఇల్లు-నివాసం వలస   

కాలాన్ని దర్శించాలనుకుంటాను

రూపం లేదు

 

కాలాన్ని స్పృశించాలనుకుంటాను 

దేహం లేదు

 

కాలాన్ని వినాలనుకుంటాను

రాగం లేదు

 

కాలం అనుభవంలో తెలుస్తుంది

జ్ఞాపకంగా మిగులుతుంది (వారాల ఆనంద్)

 

అట్లా గత అనుభావాల్లోంచి కొన్ని జ్ఞాపకాల్ని మీతో పంచుకుంటున్నాను.

***

          ఓ విత్తు మొలకెత్తి  మొక్కయి, ఎదిగి చెట్టయి వికసించి విరబూసి విస్తరించి పెద్ద వృక్షమయినట్టు ఓ కుటుంబం కూడా క్రమంగా ఎదిగి పిల్లా పాపలతో మహాకుటుంబం అవుతుంది. కరీంనగర్లో అట్లా ఎదిగిన కుటుంబాల్లో వారాల కుటుంబం ఒకటి. మొదట మా పెదనానమ్మ మిఠాయి సత్యమ్మ ఛత్రఛాయలో పెరగడం ఆరంభించింది. తనకి సంతానం లేకపోవడంతో తన మరిది వారాల నర్సయ్య-నరసమ్మల కుటుంబం ఎదగడంలో ఆమె ప్రేమతోనూ, బాధ్యతతోనూ ప్రధాన భూమికను పోషించింది.  

          అప్పటికి కరీంనగర్ కు కరెంటు (ELECTRICITY) రాలేదు. చౌరాస్తాల్లో స్థంభం వుండి దాని చివర కందీల్ లాంటి నాలుగు దీపాలు ఉండేవి. అవి గ్యాస్ నూనెతో వెలిగేవి. రోజూ సాయంత్రం కాగానే వాటిని నూనెతో నింపాల్సి వచ్చేది. మిఠాయి సత్యమ్మ అప్పుడే మరిది నర్సయ్యకు దగ్గరి గ్రామం ఉరుమడ్ల నుంచి నరసమ్మను ఇచ్చి పెళ్లి చేసింది. అంతే కాదు హైదరాబాద్ కు చెందిన ప్యాట బాలరెడ్డిని ఆయన కుటుంబాన్నీ కరీంనగర్ తీసుకొచ్చి అండగా నిలబడి ఇక్కడే స్థిరపడేలా చూసింది. మొదట వీధి దీపాల్లో ప్రతి సాయంత్రం గ్యాస్ నూనె నింపే పని గుత్తాకు(Contract) తీసుకున్న ప్యాట బాలరెడ్డి తర్వాత సైకిల్ కంపని (టాక్సి) నడిపి క్రమంగా హోటల్ వ్యాపారంలోకి వెళ్లి స్థిరపడి పోయారు. బాల రెడ్డి, బాయమ్మల పెద్ద కొడుకు తర్వాత మున్సిపల్ కౌన్సిలర్ అయ్యాడు. నాన్నమ్మని సత్యక్కా అని పిలుస్తూ కుటుంబ సభ్యుడిగా వున్నారు. అట్లే యాదయ్య అని ఒక వ్యక్తిని కూడా మిఠాయి సత్యమ్మ హైదరాబాద్ నుంచి తీసుకొచ్చింది. తిలక్ రోడ్ మూల మీద ఒక చిన్న కొటీర్ల ఉంటూ గాజులు అమ్మే వ్యాపారం చేసేవాడు. అతన్ని యాదయన్నా అని అందరం ప్రేమగా పిలిచేవాళ్ళం. ఇంట్లో ఒకడిగా ఉండేవాడు.          

          ఇట్లా ఎందరికో అండగా నిలిచిన మిఠాయి సత్యమ్మ తన సొంత వాళ్ళనీ ఎంతో ప్రేమతో ‘లాడ్’ చేసి మరీ పెంచారు. బహుశా అదే ఆ కుటుంబానికి బలమూ బలహీనతా అయింది. మిఠాయి షాపూ గాజుల దుఖానం ఉచ్చ స్థితిలో వున్న కాలమది.

***

          ఎలాంటి ఆరోగ్య కేంద్రాలూ ఆసుపత్రులూ లేని ఆ కాలంలో మా నానమ్మ తాతయ్యలకి పురిట్లోనే పుట్టి పోయిన వాళ్ళు కాకుండా అయిదుగురు కూతుళ్ళు, నలుగురు కొడుకులూ వున్నారు. పెద్ద కూతురు కాశమ్మను మిఠాయి సత్యమ్మ తన హైదరాబాద్ మూలాల్ని వదలకుండా పాత చుట్టాలే అయిన ఖైరతాబాద్ లోని పసునూటి అనంతయ్యకు ఇచ్చి వివాహం చేసింది. వారికి నలుగురు కొడుకులు, ముగ్గురుకూతుళ్ళు. తర్వాతి కాలంలో ఆ యింటికి మా ఇంట్లోంచి ఇద్దరు అమ్మాయిల్ని మేనరికం ఇచ్చారు.

          ఇక రెండవ కూతురు అండాలును కూడా హైదరాబాద్ లోని గౌలిగుడా చమన్ కు చెందిన రామకిష్టయ్యకు ఇచ్చి పెళ్లి చేసారు. వారికి ఆరుగురు కొడుకులు, అయిదుగురు కూతుళ్ళు.

          మూడవ కూతురు సక్కుబాయిని (మా నాన్న ఆమెను ప్రేమగా ప్రమీలా అని పిలిచేవాడు) సిరిసిల్లాకు చెందిన ఆకుల శంకరయ్యకిచ్చారు. వారికి ముగ్గురు కుమారులు, ఒక కూతురు.

          నాలుగవ కూతురు శ్యామలను దగ్గరి బంధువయిన గోలి పోశెట్టికిచ్చి చేసారు వారికి ఆరుగురు కొడుకులు ఒక కూతురు, ఇక చివరి అమ్మాయి సువర్ణను కరీంనగర్ కే చెందిన లింగయ్యకు ఇచ్చి చేయగా వారికి ఇద్దరు కూతుళ్ళు ఒక కుమారుడు. ఇట్లా వారాల వారి కుటుంబంలో మాకంటే ముందు తరం ఆడపడుచులు పిల్లా పాపలతో వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డారు. ఇదంతా ఎందుకంటే ఆ రోజుల్లోనే ఆడపిల్లల్ని వివిధ ప్రాంతాలకిచ్చి పెళ్లిళ్ళు చేయడం. అంతస్తులు ఆడంబరాలు లేకుండా మనకు కలిస్తే చాలు అనుకునే తత్వం గురించి చెప్పడానికే.

          ఇక కొడుకుల్లో పెద్దవాడు వెంకట స్వామి. మిఠాయి సత్యమ్మకు అత్యంత ప్రియ మయిన కుమారుడు. బహుశా ఆయన్నిచేసినంత లాడ్ (గారాబం) ఇంకెవరిని చేయలేదని చెబుతారు. చిన్నప్పుడు వెంకటస్వామిని, తర్వాతి వాడయిన జగన్నాథంని హైదరాబాద్ మెథడిస్ట్ స్కూలులో చేర్చారు. కొంతకాలం చదివిం తర్వాత కరీంనగర్ తిరిగి వచ్చారుట. ఇక అప్పటి నుంచి వెంకటస్వామికి పట్టపగ్గాలు లేకుండాపోయాయి. అది గమనించి నర్సమ్మకు అన్న అయిన బొమ్మ కిష్టయ్య పెద్ద కూతురును ఇచ్చి పెళ్లి చేసారు. మేనపిల్ల వుండగా పరాయి సంబంధం చేయవద్దన్నది అప్పటి అప్రకటిత కట్టుబాటు. బొమ్మ కిష్టయ్యకు ముగ్గురు కొడుకులు. బొమ్మ రామన్న, బొమ్మ రంగన్న, బొమ్మ వెంకటేశ్వర్ ( ఆయన తర్వాత ఎం.ఎల్.ఎ అయ్యారు). పెళ్లి తర్వాత వారికి ఒక కుమారుడు కలిగి పురిట్లోనే ఆ తల్లి మరణించడంతో ఆ అబ్బాయి మోహన్ ను అప్పుడు సరిగ్గా తను కూడా బాలింత అయిన నానమ్మ నర్సమ్మే పాలిచ్చి పెంచిందట. తర్వాత వెంకటస్వామి నాయినకు ( మేమంతా నాన్నలందరినీ నాయిన అని పిలిచే వారం) అల్లం మల్లయ్య కూతురు శారదతో పెళ్లి చేసారు వారికి ముగ్గురు కొడుకులు అయిదుగురు కూతుళ్ళు. దాదాగిరితో పాటు కత్తులు పట్టుకు తిరిగిన వెంకటస్వామి నాయిన తర్వాత దేశాలు పట్టుకు పోయాడు. అనంతర కాలంలో శారదమ్మ అష్టకష్టాలు పడి తన పిల్లలని సాకింది. క్రమంగా వ్యాపారం వెనక్కి పట్టడం కూడా అప్పుడే మొదలయింది.

          ఇక రెండవ కుమారుడు జగన్నాథం ‘మా దగ్గరే ఇరవై మంది పని వాళ్ళున్నారు’ మేం ఉద్యోగం చెయడమేమిటి అన్న అభిప్రాయంతో వున్నవాడు. కాని జగ్గయ్యనాయనకు కాపువాడకు చెందిన రామయ్య సారు కూతురు సత్యమ్మతో పెళ్లి అయింది. రామయ్య తాత అల్లున్ని బతిమలాడి ఒప్పించి ఉపాధ్యాయుడిగా నౌకరీలో చేర్పించాడు. రామయ్య గారంటే అప్పుడు టీచర్ గా పెద్ద పేరు. ఆయన వద్ద ఠికానా ఉంటూ అనేక మంది చుట్టు పక్కల ఊర్ల దొరల పిల్లలు చడువునే వారుట. అలాంటి వారిలో ఒకరయిన జే.వి.నరసింగ రావు అనంతర కాలంలో ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి కూడా అయ్యారు. కరీంనగర్ లో ప్రముఖ న్యాయవాదులు హనుమంత రావుతో సహా అనేక మంది ఆ ఇంట్లోనే వుండి చదువుకున్న వారే. తర్వాత జగ్గయ్యనాయన గంజ్ స్కూలు లో నాకు కూడా టీచర్ అయ్యారు. క్రమబద్ద మయిన జీవితాన్ని గడిపి తాను నమ్మిన అంశాల పై మొండిగానూ అత్యంత కటువుగానూ ఉంటూ జీవితాన్ని గడిపారు. సత్యమ్మ పెద్దమ్మ అన్న కుమారుడు బండి సంజయ్ ప్రస్తుతం ఎంపీ గానూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగానూ వున్నాడు.

          ఇక మూడవ కుమారుడు సత్యనారాయణ. సత్తయ్య నాయిన అంటే ‘వాడెంత వీడెంత’ అనే గడబిడ, గాయి గాయి, లొల్లి లొల్లి. తను ఆటవీ శాఖ లో పని చేసేవాడు. మిఠాయి సత్యమ్మను అక్కా అని పిలిచే ప్యాట బాల్ రెడ్డి పెద్ద కూతురు ఊర్మిళను ఇచ్చి పెళ్లి చేసారు. ఆయన తాట్లవాయి నుంచి అనేక ప్రాంతాల్లో పని చేసాడు. కరీంనగర్ కు వచ్చినప్పుడల్లా అందరినీ కలవడం ఎంజాయ్ చేయడం తనకి అలవాటుగా వుండేది. ఇక కరీంనగర్ లో వున్నప్పుడల్లా ప్యాట వాళ్ళ రాజ్ మహల్ హోటల్ నుంచి అన్ని హంగులతో ఫుడ్ పార్సెల్ రావాల్సిందే. అట్లా ఆయన జీవితం మూడు గ్లాసులు ఆరు బిర్యానీలుగా సాగింది.  

ఇక నాలుగవ కుమారుడు మా నాన్న అంజయ్య. టీచర్ గా పనిచేసారు. వేముల వాడకు చెందిన గొప్ప డాక్టర్ మంగారి సుబ్రహ్మణ్యం రెండవ కూతురు రాధతో తనకు పెళ్లి అయింది. ఇపుడే పెళ్లి వద్దని తాను ఇంకా చదువుకోవాలని భావించిన నాన్నకు పెళ్లి తర్వాత చదివిస్తామని ఇచ్చిన హామీని మామ నిలుపుకోలేదని తనకు పెద్ద అసంతృప్తి వుండేది.

దాన్ని అప్పుడప్పుడూ వ్యక్తం చేసినా తొందరలోనే మర్చిపోయాడు. కార్ఖానాగడ్డ హై స్కూల్, ధన్గర్వాడి హై స్కూల్, ముఖరంపుర, ఆర్ట్స్ కాలేజీ లాంటి చోట్ల పని చేసి మంచి టీచర్ గా నిలబడ్డాడు. వారికి మేము అయిదుగురం పిల్లలం. మాలో అప్పటి కాల పరిస్థితులు, కుటుంబ స్థితి కొంచెం కొంచెంగా నాకు మాత్రం తెలుసు. మిగతా వాళ్ళు చిన్న వాళ్ళు. 1974లో మిఠాయి సత్యమ్మ అనారోగ్యంతో మృతి చెందింది. ఇక అప్పుడు మా నాన్న అన్నలు గొంతు ఎత్తడం మొదలు పెట్టారు.    

          మా నాన్నను వాళ్ళ చిన్నాయన వేములవాడలో వున్న వారాల స్వామి ఎప్పుడో చిన్నప్పుడు పెంపకానికి తీసుకున్నాడని వెంటనే ఇల్లు విడిచి వెళ్లాల్సిందేనని సత్తయ్య నాయిన పెద్ద గొడవ చేసి అల్లరి చేసాడు. నానా హంగామా చేసాడు. ఏనాడూ స్వామి తాత ఇంటికి మా నాన్నవెళ్ళలేదు. ఎప్పుడూ ఈ ఇంటి వాడిని కానని అనుకోలేదు. ఇల్లు విడిచి వెళ్ళాల్సిన అవసరం వస్తుందని అనుకోలేదు. కాని వారి మాటలతో తీవ్ర మనస్తాపానికి గురై అమ్మని నన్ను చిన్న పిల్లల్నీ తీసుకుని ఇల్లు విడిచాడు. కొంత సామానుతో మంకమ్మ తోటకు వలస వెళ్లి మంగలి సాయన్న ఇంట్లో మూడు చిన్నగదుల పోర్షన్ లో కిరాయికి చేరిపోయాడు.

          ఆ రాత్రి ఇల్లు ఖాళీ చేసేవేళ మా నానమ్మ, పెద్దమ్మలు భోజనాలు చేసి నోట్లో పాన్ లు వేసుకుని సెకండ్ షో సినిమాకు వెళ్ళారు. మేమంతా మౌనంగా ఆ మిఠాయి సత్యమ్మ ఇల్లును ఖాళీ చేయాల్సి వచ్చింది. ఎన్ని ప్రేమలు అనుబంధాలూ వున్నాయనుకున్నా ఆస్తుల విషయానికి వచ్చేసరికి స్వార్థం చిందులు వేస్తుందన్నది అక్షర సత్యంగా నిలబడింది. మామూలుగా వివరించి వుంటే సంతోషంగా వెళ్ళేవాళ్ళం. కానీ జరిగిన హంగామా, కలిగిన అవమానంతో నేనూ నాన్నా దశాబ్దానికి పైగా మిఠాయి సత్యమ్మ ఇంటికి కానీ, తిలక్ రోడ్డు వైపునకు గానీ వెళ్ళలేదు.     

***

          ఉమ్మడి నివాసంలా వున్నా ఆ ఇంట్లో నేనేమీ గొప్ప బాల్యాన్ని అనుభవించ లేదు. అప్పుడు నాకేమో మాట సరిగ్గా పలకలేని స్థితి. ఎన్ని వెక్కిరింపులో, మరెన్ని అవమానాలో…

ఆ రోజుల్లో వాళ్ళు నన్ను

మూగ సముద్రం లోకి తోసేసారు

మాటను మింగలేక

బయటకు పలక లేక

ఆనాడే మౌనం నా దేహాన్ని కప్పేసింది

 

చుట్టేమో అరుపులు

గోల గోలగా

మాట్లాడుతారు కాట్లాడుతారు  

అంతా జాతర జాతర

 

ఎవరి గుహ వాళ్ళది

ఎవరి ప్రదర్శన వాళ్ళది

 

కాటగల్సిన పిల్లాడిలా

మాటకీ మౌనానికీ  నడుమ

గాలిలో ఆధారం లేని 

ఊయల ఊగుతూ నేను …

 

కోవా పేడానో శక్కరి పుట్నాల్లానో

ధ్వనించే ‘కన్నయ్యా’ అన్న

నాన్నమ్మ చల్లని పిలుపు నీడన

ప్రేమ నిండిన అమ్మ వొడిన  

నాన్న నీడన సేదదీరిన  (వారాల ఆనంద్)

*****

(సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.