వెనుతిరగని వెన్నెల(భాగం-42)

డా||కె.గీత

(*“కౌముది” లో ధారావాహిక నవలగా 2015 నుంచి 2020 వరకు ప్రచురించబడిన  “వెనుతిరగని వెన్నెల” ఇప్పటివరకు చదవని వారి కోసం కౌముది సౌజన్యంతో నెల నెలా ఆడియోతో బాటూ ఇక్కడ ఇస్తున్నాం.) 

***

జరిగిన కథ: అమెరికాలో తన తల్లికి స్నేహితురాలు, స్త్రీలకు సహాయం చేసే సంస్థ “సహాయ”ను నడిపే ఉదయినిని కలవడానికి వస్తుంది సమీర. నాలుగు నెలల గర్భవతైన సమీర, తనకు విడాకులు తీసుకోవాలని ఉందని, అందుకు దోహదమైన పరిస్థితుల్ని చెపుతుంది. ఉదయిని “తన్మయి” కథ చెపుతాను, విన్నాక ఆలోచించుకోమని చెప్తుంది సమీరతో. చుట్టాల పెళ్లి లో కలుసుకున్న తన్మయి, శేఖర్ లకు  పెద్దవాళ్ల అనుమతితో పెళ్లి జరుగుతుంది. పెళ్లయిన మరుక్షణం నించే శేఖర్ అసలు స్వరూపం బయట పడుతుంది. మొదటి సంవత్సరంలోనే అబ్బాయి పుడతాడు. శేఖర్ తో ఒక పక్క కష్టాలు పడుతూనే తన్మయి యూనివర్శిటీ లో ఎమ్మే పాసయ్యి, జే.ఆర్.ఎఫ్ సాధిస్తుంది. తన్మయి ఆశయాల్ని భరించలేని శేఖర్ గొడవ చేసి ఇంట్లో నుంచి వెళ్లిపోయి విడాకుల నోటీసు పంపుతాడు.  ఎన్నో రోజులు పోరాడి, తన్మయి చివరికి శేఖర్ కు తనే విడాకులు ఇస్తుంది.  హైదరాబాదు కు దగ్గర్లో తన్మయికి లెక్చరర్ గా ఉద్యోగం వస్తుంది.

 ***

          మరుసటి వారంలో ఇంటికి వెళ్లి బాబుని తీసుకుని వచ్చింది తన్మయి. వంట సామాన్లు సర్దుకుంటూంటే అనుకోకుండా దు:ఖం ముంచుకొచ్చింది. 

          ఈ సామాన్లు నావి, ఈ వంట గది నాది, ఈ ఇల్లు నాది… అని అందరిలానే అమాయకంగా కలలుగన్న సగటు యువతి తను.

          అందులో ప్రతీ ఒక్కటీ ఎక్కడెక్కడ కొన్నదీ ఇంకా గుర్తే తనకి. నిజానికి సంసారానికి కావలసిన వంట సామాన్ల వంటివన్నీ తల్లే ఇచ్చి పంపించింది.

          కానీ కొత్తవి కాకుండా అప్పటికే ఏళ్ల తరబడి వాడుతున్నవి ఇచ్చి పంపించిందని శేఖర్ తల్లి చీవాట్లు వేసింది.

          తల్లి తను ఇంట్లో వాడుతున్న సామాన్లు, తను కట్టుకున్న చీరలు ఇచ్చిందంటే,  వాటిలో తల్లి “ప్రేమ”  ఉందని తన్మయి భావించినా అతను, అతని తల్లి మాత్రం పాతవి వొదిలించుకోవడానికి చేసిన కుట్రగా చూసేరు.

          తల్లి ఇచ్చిన సామాన్లు చూసినప్పుడల్లా అతను విసుక్కోవడం చూసి, అవన్నీ పక్కకి పెట్టి కాసిన్ని కొత్త సామాన్లు కొంది తన్మయి. అలా పూర్ణా మార్కెట్టు లో కొన్న చిన్న మజ్జిగ కవ్వమూ, జల్లెడా కనిపించేయి. 

          ఆ రోజు ఇంకా తనకి జ్ఞాపకమే. కొత్తగా సంసారం పెట్టిన రోజులు. అతని ఊర్లో ఉండేవాడు కాదు కాబట్టి సంసారానికి ఏది కావాల్సినా తనే వెళ్లి కొని తెచ్చుకునేది తన్మయి.

          పక్కింటి అమ్మాయి సలహాతో ఇంట్లో జల్లెడ, కవ్వమూ కొనడానికే కాకుండా వారానికి సరిపడా కూరలు కూడా కొని తెచ్చుకోవడానికి పూర్ణా మార్కెట్టు బస్సెక్కింది తన్మయి.

          రద్దీగా ఉన్న జగదాంబా జంక్షను పరికిస్తూ చుట్టూ ఉన్న సినిమా హాళ్ల గురించి కబుర్లాడుకునే జనాలకతీతంగా ఆకాశం కేసి చూడసాగింది తన్మయి.

          చిరుజల్లు కురావడానికి సిద్ధమైనట్లు మబ్బు మబ్బుగా ఉంది.

          పూర్ణా మార్కెట్టు రోడ్డు కివతల ఆగి, అటు వైపు దాటుకుని ద్వారం దాటి లోపలికి అడుగుపెట్టగానే వాన కురవకుండానే జల్లు కురిసినట్లు చిత్తడిగా ఉంది.

          బురదలోనే త్రోవకటూ ఇటూ కూరగాయల నించి వంట సామాన్ల వరకూ దుకాణాలు. కొన్ని నేల మీద గోనె సంచుల మీదా, కొన్ని బండ్ల మీదా, కొన్ని చిన్న దుకాణాలుగాను.

          వచ్చిపోయే వారిని తోసుకుంటూ, ఉమ్ముకుంటూ, తిట్టుకుంటూ హడావిడి పడ్తున్న జనం. 

          చేతి సంచీని భుజాన తగిలించుకుని, చిన్న చేతి పర్సుని జాకెట్టులో దాచి, చీర కుచ్చిళ్ళు పైకి దోపుకుని అతికష్టమ్మీద కావలసిన సామాన్లు కొనుక్కుని బయట పడింది తన్మయి.

          మజ్జిగ కవ్వమూ, జల్లెడల వైపు తదేకంగా చూసింది. ఇలాంటివి తన కంట పడకుండా ఉంటేనే తను మనశ్శాంతిగా ఉండగలదు.

          తన దగ్గర ఉన్నవి తల్లిని తీసుకొమ్మని, ఇంట్లో ఉన్న పాతవి తనకి ఇమ్మని అడిగింది. 

          “ఏమ్మా, మీ ఆయన మొదట్లో చేసిన నిష్టూరం చాలదా? పాతవెందుకులే. నువ్వెలాగూ నేనిచ్చినవి పక్కనెట్టి కొత్తవి కొనుక్కున్నావుగా, ఇన్నాళ్లుగా అవి ఇక్కడే పడున్నా నేనెప్పుడూ వాటిని వాడలేదు” అంది జ్యోతి నిష్టూరంగా.

          తన్మయికి కాళ్లలోకి నిస్సత్తువ వచ్చింది.

          అతనెప్పుడో తల్లిని బాధించిన మాట వాస్తవమే. అందుకు ఇప్పటికీ తను బాధ పడుతుంది. కానీ తను ఇప్పుడు వాళ్ల కూతురు మాత్రమే.

          ఇంకా పాతవన్నీ గుర్తు తెచ్చుకుని ఇంకా తల్లి తనని ఇలా నిష్టూరమాడడం ఎందుకు?

          అంతటితో ఆగకుండా తన్మయి తల్లిని తనతో రమ్మని అడగగానే.. తనతో రావడం ఇష్టం లేనట్లు ధ్వనిస్తున్న గొంతుతో, “అస్తమాటూ నీ వెనకాల తిరుగుతూ ఉంటే ఇక్కడ నాన్నగారిని ఎవరు చూస్తారమ్మా, ఇదేవన్నా మీ అత్తగారిల్లా మందీ మార్బలం ఉండడానికి, వాళ్లంటే జమీందారులు, డబ్బుకి లెక్క లేదు వాళ్లకి. అయినా వాళ్లకీ, వీళ్లకీ ఆయన్ను ఇక్కడ అప్పగించి, రావడం సుతరామూ ఇష్టం లేదు.” అంది. 

          అంతే కాదు కనీసం మాట వరసకైనా కాసిన్ని ఉప్పులు పప్పులు పట్టుకెళ్లమని కూడా ఇవ్వలేదు. 

          ఆడించిన పంట బియ్యం అదే రోజు ఇంటికి వచ్చేయి. 

          అక్కడికీ తన్మయి నోరు తెరిచి అడిగింది.

          “ఇక్కడి నుంచి అంత దూరానికి బియ్యం పట్టుకెళ్లడం ఎందుకు? అక్కడే కొనుక్కో.” అంది జ్యోతి.

          మనసులోనే నిట్టూర్చుకుంది తన్మయి. తనకి అతనితో కలిసి ఉన్నప్పడూ బాధలే. విడిపోయేకా బాధలే. తనలాంటి దౌర్భాగ్యపు బతుకు పగ వాళ్లకి కూడా కలగకూడదు.

          ఇప్పుడు తన్మయి ఒంటరిగా ఉంటూందన్న సత్యం తెలిసీ తల్లి ఇలా సూటీపోటి మాటలతో వేధిస్తూ, అంటీ ముట్టనట్ట్లు ఎందుకు ఉంటుందో  అర్థంకాదు.

          రైలెక్కిందే గాని నిద్ర రాలేదు. తెల్లారగట్లెప్పుడో కణకణా మండుతున్న కళ్లని బలవంతంగా మూసుకుంది “అంతా నా దురదృష్టం!” అనుకుంటూ.

***

          ఉదయానే రైలు దిగి, చాలా సేపు బస్సు కోసం ఒక చోట నిలబడ్డారు. 

          తర్వాత అర్థమైన విషయం ఏవిటంటే అక్కడ సిటీ బస్సులు మాత్రమే ఆగుతాయని, ఎర్ర బస్సులకు దగ్గర్లోని బస్టాండుకి వెళ్లాలని.

          సామాన్లు మోసుకుని, ఆటో కోసం నడిచింది.

          బాబు చెంగు పట్టుకుని త్వరగా నడుస్తున్న తల్లిని అనుసరించేడు.

          అత్యంత రద్దీగా ఉంది బస్టాండు.

          చేతిలో సామాన్లు ఉండడం వల్ల బస్సులో సీటు కోసం పరుగులెత్తే మనుషులతో ఓడిపోసాగింది.

          పక్కనే ఉన్న యువకుడొకతను “ఇలా ఇవ్వండి నేను సాయం చేస్తా” అని చప్పున చేతిలోని సామాన్ల సంచీ అందుకున్నాడు.

          అంతే కాకుండా అతిలాఘవంగా సీటు కూడా సంపాదించేడు.

          “చాలా థాంక్సండీ” అంది తన్మయి కృతజ్ఞతా పూర్వకంగా.

          బస్సెక్కగానే నిద్ర ముంచుకొచ్చింది తన్మయికి.

          బాబు అప్పటికే ఒళ్ళో వాలిపోయేడు. బాబుకి అటువైపు కూచున్న ఆ యువకుడు “ఏ ఊరు వెళ్తున్నారు?” అన్నాడు.

          చెప్పింది తన్మయి.

          “అది నా ప్రాణ స్నేహితుడి ఊరు. నేనస్తమాటూ వస్తుంటాను.” అన్నాడు.

          తన్మయి నిద్ర కళ్ళతో ఊకొట్టింది.

          అతనదేమీ పట్టించుకోకుండా “సారు.. రాలేదా మీతో” అన్నాడు.

          “రాలేదు” అని కళ్లు మూసుకుంది.

          బస్సు ఎక్కడో స్టాపులో ఆగింది. 

          “మక్క బుట్టల్..మక్క బుట్టల్ ” అంటూ కిటికీ దగ్గర మొక్కజొన్న పొత్తులమ్మే పిల్లల అరుపులకి మెలకువ వచ్చింది తన్మయికి.

          కిటికీ దగ్గిర కూచున్న యువకుడు చప్పున మూడు కొని, తన్మయి వైపు తిరిగేడు. తన్మయి వద్దనేలోగానే  రెండు చేతిలో పెట్టేడు.

          ఉదయం నించీ ఏమీ తినకపోవడం వల్లనేమో బాబు చటుక్కున మొక్క జొన్న పొత్తు ఒకటి అందుకుని తినసాగేడు.

          పొద్దుట బిస్కెట్లు  ఇవ్వబోతే తిననని మొరాయించేడు. వాడెప్పుడూ పొత్తుతిననట్లు ఆదరాబాదరాగా తినడం చూసి తన్మయికి నవ్వొచ్చింది.

          అతనేమనుకున్నాడో ఏమో అని “థాంక్సండీ” అంది తన్మయి.

          బదులుగా అతను “వచ్చేదే మా ఊరు. ఎప్పుడైనా తప్పకుండా రండి” అని జేబులో చిన్న కాగితాల బొత్తిలో నుంచి ఒక కాగితం చింపి అతని పేరు, ఫోను నంబరు రాసిచ్చేడు.

          “మురళి…” అతని పేరు చూడగానే తన్మయికి చప్పున వివేకానందా పాఠశాల, వెంకట్, మురళి జ్ఞాపకం వచ్చేరు.

          జీవితం ఎంత విచిత్రమైంది!

          అక్కడున్నంత సేపు మురళి తనకే కష్టమొచ్చినా ఆదుకునేవాడు. ఇప్పటికీ ఆదుకుంటున్నాడన్నమాట.

          అతని వైపు తిరిగి నమస్కరించింది.

***

          బస్టాండులో దిగి రిక్షా ఎక్కింది తన్మయి. 

          ఇక్కడి రిక్షాలు తమ వైపులా కాకుండా విభిన్నంగా ఉన్నాయి. కూచునే సీటుకి, కాళ్లు పెట్టుకునే చోటుకి మధ్య నేలపీట కంటే తక్కువ ఎత్తు ఉండడాన్ని ఆశ్చర్యంగా చూసేడు బాబు.

          తమ వైపు కూచునే సీటు కుర్చీలో కూచున్నంత ఎత్తు ఉండి, కాళ్లు కిందికి పెట్టుకుందుకు వీలుగా ఉంటుంది.

          తన చిన్న తనంలో సినిమాకి వెళ్లేటపుడు నడిచి వెళ్లి, వచ్చేటపుడు రిక్షా కట్టించుకునే వారు.

          అమ్మా, నాన్నల మధ్య కాళ్ల దగ్గిర కూచునేది తను. కానీ ఇంటికి వచ్చేసరికి బాగా నిద్రపోయేది.

          ఇక ఇంటి గుమ్మం దగ్గిర దిగి లోపలికి నడవాలంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు తనకి.

          రాత్రంతా తనని రిక్షాలో తిప్పుతూ అలాగా పడుకోనిస్తే బావుణ్ణని అనిపించేది.

          “పెద్దయ్యాక తప్పకుండా తను అలాగే చెయ్యాలి” అనుకునేది. 

          ఆ ఆలోచన రాగానే నవ్వొచ్చింది తన్మయికి.

          పక్కనే కూచుని కబుర్లు చెప్తున్న బాబు తల నిమురుతూ వాడి మెరుపు కళ్లలోకి చూడసాగింది తన్మయి.

          కబుర్లలోనే నిద్రలోకి జారుకున్నాడు. నిశ్చింతగా పడుకుని నిద్రపోతున్న చిన్నారి తలని ముద్దాడింది. 

          వాడికి తన తల్లిదండ్రుల దగ్గిర ఎంత దగ్గిరతనం ఉన్నా తనతో ఉన్నపుడు ఉన్న హుషారు వాడికి అక్కడున్నపుడు ఉండదు ఎందుకో.

          తనకి కూడా ఒదిలొచ్చేటప్పుడెప్పుడూ వాడి బెంగ చూపులు తనని వెంటాడుతూనే ఉండేవి. 

          కడుపున మొయ్యడం, కడుపున పుట్టడం… ‘పేగు బంధం’ అంటే ఇదేనేమో! 

          “ఇక మనం హాయిగా ఉందాం నాన్నా! ” అంది ఆప్యాయంగా వాణ్ణి దగ్గరకు హత్తుకుని.

***

          బాబుని ఊర్లో మంచి స్కూల్లో జాయిను చేసింది.

          స్కూలు యూనిఫారం, పుస్తకాలు, పుస్తకాల సంచీ, టిఫిను బాక్సు, వాటర్ బాటిల్ వంటివన్నీ  కొంది.

          వచ్చే ముందు ఐస్క్రీము, ఫైవ్ స్టార్ చాక్లెట్ల వైపు చూపించేడు బాబు.

          “కొంటాను గానీ, ఏదో ఒక్కటే ” అంది.

          కాస్సేపు అటూ ఇటూ ఊగిసలాడి చివరికి  ఐస్ క్రీము కావాలన్నాడు.

          ఇంటికి నడుస్తూండగా, “అమ్మా! మనం రేపు ఫైవ్ చాక్లెట్టు కొనుక్కుందామేం?” అని ముద్దుగా అడిగేడు బాబు.

          పసివాడితో “అలాగే” అని  అబద్ధాలాడడం ఇష్టం లేదు తన్మయికి.

          “లేదు నాన్నా, ఇలాంటివి మనం నెలలో ఒక్క రోజు మాత్రమే కొనుక్కుంటాం.” అంది సాలోచనగా. 

          అర్థమయీ కానట్టున్న వాడి ముఖం చూసి, “అమ్మకి వచ్చే జీతంలో మన ఖర్చులు పోను, కొంత దాచుకోవాలమ్మా. అనుకోకుండా మనకి కష్టం వచ్చిందనుకో మనకి డబ్బులు ఎవరిస్తారు చెప్పు?” అంది.

          ఏదో అర్థమైనట్టు తలూపేడు వాడు. 

          ఇంటికి రాగానే పుస్తకాలన్నింటికీ అట్టలు వేసి, పేర్లు  రాసింది. 

          ఒక అర ఖాళీ చేసి వాడి స్కూలు వస్తువులు సర్ది పెట్టింది.

          రెండో రోజే స్కూలు బస్సెక్కనని పేచీ పెట్టేడు బాబు.

          “ఏవిటమ్మా” గోముగా అడిగింది తన్మయి.

          స్కూటర్ల మీద, బళ్ల మీదా తల్లిదండ్రులతో ముందూ, వెనకా కూచుని వెళ్తున్న పిల్లల వైపు చూపించేడు.

          తన్మయి మనస్సు చివుక్కుమంది.

          “తండ్రి గుర్తురాకుండా పెంచాలని ఎంత తపన పడ్తున్నా కుదరడం లేదు. ఎలా?” 

          ఆలోచించే కొలదీ తలనొప్పి రాసాగింది తన్మయికి. 

          అనుకోకుండా  మర్నాడు కాలేజీలో టైపిస్టు “చిట్”లో చేరుతరా మేడమ్ అనడగగానే ఒప్పుకుంది.

          అప్పటి వరకు అసలు చిట్ అంటే ఏవిటో, ఎందుకు అంతా ఇలాంటివి కడతారో తెలియదు తనకి.

          “ఒక్కసారి డబ్బు అవసరమయ్యే మనలాంటి మధ్య తరగతి వారికి వడ్డీ తక్కువ మార్గం ఇదొక్కటే” అన్నాడు టైపిస్టు మొదటి నెల డబ్బు కట్టించుకుంటూ.

          ఆ మరసటి రోజు నించీ సెకండ్ హాండులో లేడీస్ బండి ఎవరైనా అమ్ముతారేమోనని పేపర్ లో లోకల్ ప్రకటనలు వెతక సాగింది తన్మయి.

          ఆ సాయంత్రం కిరసనాయిలు ఒత్తుల స్టవ్వు వల్ల బాగా మసి పట్టేసిన గిన్నెల్ని తోముతున్న తన్మయి వైపు చూస్తూ “గేసు కనెక్షను కి అప్లై చెయ్యరాదు మేడమ్ ?” అంది తాయిబా.

          “అప్లయ్ చేసిన సంవత్సరం దాకా రాదట కదా!” అంది తన్మయి.

          “ముందు స్టవ్వు కొనుక్కో మేడం. కనెక్షను వచ్చే వారికి నా కాడ డబుల్ సిలిండర్ నువ్వొకటి వాడుకో” అంది. 

          గేసు స్టవ్వు, సిలిండర్.. అని తన దగ్గిర ఉన్న కాస్త డబ్బులూ ఇలాంటి వాటికి ఖర్చు పెట్టడం కష్టం. 

          అదే చెప్పింది తాయిబాతో.

          “హయ్యో మా లాంటి వారందరూ డబ్బులు మస్తు ఉండే అన్నీ కొనుకుంటరంటరా మేడమ్!” అంది నవ్వుతూ.

          సాయంత్రం వాయిదా పద్ధతిలో స్టవ్వు, మిక్సీల వంటివి అమ్మే దుకాణానికి తీసుకెళ్లి, “భయ్యా! మా మేడమ్ కి మంచి స్టవ్వు చూపియ్” అంది.

          “ఆ..ఆ..ముందు డబ్బులు ఎలా కట్టాలో కనుక్కో కుండానే..”అంది తన్మయి అడ్డు తగులుతూ.

          “అరే మా కాలేజీలో మేడమ్ మీరు. ఏది నచ్చినదో ఫస్టు చూసుకొండి. మీకు నచ్చిన వాయిదాలో పైసల్ కట్టండి.” అంటూ దుకాణాదారు రెండు మూడు స్టవ్వులు చూపించేడు.

          అందులో నాణ్యమైన కంపెనీ స్టవ్వు చూపించి ఇందులో కాస్త రేటు తక్కువది చూపించండి” అంది.

          అతను లోపలనించి మరొక రెండు పట్టుకొస్తూ , వాయిదాల వివరాలు రాసున్న ఒక అట్ట ముక్క తెచ్చేడు.

          అన్నిటికన్నా తక్కువ ఖరీదు స్టవ్వుకి నెలకు వంద చొప్పున  పన్నెండు నెలలు కట్టాలి. దాని అసలు ఖరీదు తొమ్మిది వందలే. కానీ వాయిదాలో పన్నెండు వందలు కట్టాలి.

          తన్మయి తటపటాయించడం చూసి, “మీకు పదకొండువందలకే ఇస్తా, మొదటి నెల మాత్రం రెండు వందల్ కట్టి తీసుకెళ్ళండి” అన్నాడు అతను.

          తాయిబా నవ్వుతూ, “ఏం భయ్యా మాకెన్నడూ ఇవ్వక పోతివి” అంది.

          “మేడమ్ ఏడికెల్లో ఈడికొచ్చింది. మనం మంచిగుండాలె గదా!” అన్నాడు అతను.

          తన్మయి పర్సులో నుంచి రెండు వందలు తీసి అతని చేతిలో పెట్టింది.

          “స్టవ్వు మంచిగుంది. గిట్లనే నెలకో వస్తువ జమకూర్సుకో మేడమ్, సంవత్సరం ఏ పాటికి! సామాన్లు ఒక్క తడవ కొంటే ఎప్పటికీ పడుంటయ్యి” అంది తాయిబా స్టవ్వు తన్మయి చేతిలో నుంచి అందుకుని నడుస్తూ.

          “సామాన్లు ఒక్క తడవ కొంటే ఎప్పటికీ పడుంటయ్యి”… తన విషయంలో ఇదెప్పుడూ నిజం కాలేదు. 

          “వస్తువులు అశాశ్వతమైనవి తాయిబా” అంది దీర్ఘంగా నిట్టూర్చి తన్మయి.

          “అంత గొప్ప మాటలు నాకర్తం కావులే. ఈడ గెన్సి గడ్డలు కొందాం మేడమ్” అని ఆగింది తాయిబా.

          ఏదో ఆలోచనలో ఉన్న తన్మయి వైపు చూసి నవ్వి, “బాగుంటయి. తిని సూడు” అంది కాల్చిన దుంపను విరుస్తూ.

          “మక్కబుట్టలు నాకు భీ ఇస్టమే” అంది తన్మయి పక్కనున్న మొక్కజొన్న పొత్తు వైపు చూస్తుండడం గమనించి. 

          తాయిబా  హుషారుగా కబుర్లు చెప్తూ తన పక్కన నడుస్తుంటే దూరం అనిపించడమే లేదు తన్మయికి.  “ఎప్పుడూ ఈ అమ్మాయిలా ఉంటే ఎంత బావుణ్ణు” అనుకోకుండా ఉండలేకపోయింది తన్మయి. 

          బాబు కూడా అలసట అనకుండా వాళ్ల కబుర్లు వింటూ నడవసాగేడు.

*****

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.