సౌందర్య సీమ

-డా.కాళ్ళకూరి శైలజ

హిమాలయం నా పుట్టిల్లు
‘గుల్మార్గ్’ నే విరబూసిన బాట.
 
తొలి అడుగుల తడబాటు నుంచి,
ఇన్నేళ్లు నడిచిన దూరమంతా,
నేనై తమ దరికి వచ్చేదాకా
వేచి చూసిన ఉత్తుంగ శ్రేణులవి. 
 
కొండల భాష వినాలంటే 
మనసు చిక్కబట్టుకోవాలి.
ఆ భాషకు లిపి లేదు.
ఆ పాటకు గాత్రం ఉండదు.
 
ఎంత ఎత్తైనవో అంత లోతైన అంతర్మధనం జరిగేలా దీవించి,
అక్కున చేర్చుకునే సీమ.
 
ఆకలి,దప్పిక,ప్రేమ,గాయం పదేపదే
తూట్లు పొడిచిన జల్లెడను నేను.
ఈ దేహం పక్కకు పెట్టి, 
ఇక పర్వతాల గాలి పీల్చుకోవాలి.
 
చీనార్ ఆకుల నడుమ పండి, 
ఎలా వర్ణశోభితమయ్యానో!
తోటలోనే మాగిన ఆపిల్ గుత్తిలో
ఎన్ని అనుభూతి రసాలూరానో!
 
మలుపు మలుపున బండరాలను నునుపు చేసే వాగునై,
జన జీవన రొదకావల
జలతరంగిణీ ఘోషనయాను.
 
సతత హరిత సాలవృక్షం
ఒడిదుడుకుల్లో కదలక నిలిచే వైనం తెలిపితే,
పైన్ చెట్ల వరుసల్లో జారుతూ
కాలం కిలకిలా నవ్వింది. 
 
పాప్లర్ చెట్టు కణుపులెన్నున్నా 
తిన్నగా చిటారు కొమ్మన వాలిన
 ‘మైనా’ కలకూజితాల ఠీవి 
నా ఎదుట పాటల బాటలు పరిచింది.
 
దాల్ అలల్ని ముద్దులాడే చిట్టిబాతు,
ముక్కు చివర్న చేదు నిజాలు వడపోసి,
తడి అంటని తన్మయంతో సాగిపోతోంది. 
 
మాటల బడబాగ్ని మింగిన
సముద్రం ‘మౌనం’.
వేవేల స్వరాలు పొదిగిన అరుదైన గీతం ‘నిశ్శబ్దం’!
ఋతుచక్రం దొర్లే దారంతా
ఉనికి,ఊహ దోబూచులాడే గాలి.
ఛాయ ప్రఛ్ఛాయల భేటీ.
పురా రహస్యమేదో సునాయాసంగా వంటబట్టి ఊరట దొరికిన విశేషం. 
 
పూల పరాగం మోసుకొచ్చే తెమ్మెరలో
గుర్రపు డెక్కల తబలా శబ్దం.
మబ్బుల్లో తేలుతూ చెవిని చేరే
పెహెల్ గావ్ పశుల కాపరి మోహన మురళీ రవళికి 
పులకరించి రాలే మంచు పూల రజను.
 
గిరి,తరు,ఆవాస,మైదానాలన్నీ
ఒకే ధవళ తివాచీ.
ఉడుత,చిలక,పాము,పువ్వు
ఊహకొద్దీ ఊరించే 
మంచు బొమ్మల ప్రపంచం.
 
కోట్ల ముత్యాలు పోత పోసినట్టు
సుతిమెత్తని దూది కుప్ప పోసినట్టు
వెన్నెల పాలకు తెలి వెలుగుల తోడు పెట్టి,
పెరుగు బిళ్ళలు పేర్చినట్టు.
కడలి అలలపై నురగ తెచ్చి 
పైన్ ఆకు చివరల గుచ్చినట్లు.
మైళ్ళకు మైళ్ళ మంచు రాశి
స్వఛ్ఛ శ్రేష్ట ధవళ వారాశి.
 
మంచు తివాచీ నడుమనక్కడక్కడా
గరిక మరకత మణుల మిలమిలలు.
ఏది ఏరో,ఏది కొలనో చెప్పలేని 
అఖండ హిమనీనదం. 
ఎటుచూసినా కాంతులీనే ఆనంద రాశి.
సాదృశమైన దేదీ 
శాశ్వతం కాదని చెప్పే తెలి మంచు. 
 
ఎంతటి నిశ్శబ్దం చెవికి సోకుతుందో! 
అంతటి మహాధ్యానం చేసే విరామం.
 
గిట్టల జాడలొదిలి సాగిన రాత్రి పర్యాటకులు,
పాదాల ఆనవాళ్ళతో పగటి అతిధులు.
శీతల శిశిరం లో 
జీవ చైతన్యం చేసే అనుదిన సంతకాలు.
 
కళ్ళతో కొలిచే దూరం కాళ్ళతో,
కాళ్ళతో నడిచే వేగం మనసుతో కొలవలేని మరో ప్రపంచం.
 
అడివినీ,ఆకాశాన్నీ గోడలకు అంటించుకున్న ఇరుకు లోంచి
వినీల లోకం లోకి పరుగు తీసి,
గత స్మృతుల వెచ్చదనం గుండెల్లో నింపుకున్నా,
మరలి రాని ప్రేమల తలచి పన్నీరై కరిగినా,
ఒకేసారి జననమరణాల నడుమ ఊయలూగించే స్వఛ్ఛ స్వేచ్ఛ సీమ.
 
నకలు పూల గుత్తులు చూసి చూసి విసిగిన మనసు, 
చేతులు చాలని పూల నడుమ మరుగుజ్జుతనం వదిలి,
వేయి భంగిమల ఆనంద నృత్యం చేసే అరుదైన వనభూమి.
 
ఆ పొలాల చాలు, 
కుంకుమ పూరేకల ఊదా పరిమళమై తేలిన క్షణాల్లో,
కార్తీక ఉషోదయాల్లో నేలను ముద్దాడే
పారిజాతాలొడిసి పట్టిన చేతులే 
మంచు బంతులు చేసి ఆడే అల్లరి నేర్చుకుంటాయ్.
మట్టిని శ్వాసించిన ప్రాణం  
మంచులో పిల్లిమొగ్గలేసే కేరింతై తుళ్ళిపడుతుంది.
 
అటు తెల్లని తెలుపు,
ఇటు పసిడి మెరుపు,
ఆ కొండవాలున తేనె గోధుమ,
ఈ పక్క చిక్కని మేఘఛ్ఛాయ
క్షణక్షణ వర్ణ చిత్ర విశేషం.
 
చలికి బిగిసిన శతాబ్దాల నమ్మకాన్ని  మోసుకెళ్ళే డోలీవాని శ్వాస సాక్షిగా,
అడుగు జారితే బ్రతుకు దక్కని ప్రమాదపుటంచున,
కొత్త సత్యమేదో బోధపరిచే సవాళ్ళ భూమి.
 
పునర్వసంతం,పునరపి శిశిరం
నిసర్గ సౌందర్యం,విస్మయ వినోదం.
స్మిత తామర సహస్రాలు విరిసిన 
ప్రవిమల సరళ మండలం.
నశ్వర జీవితాన్ని విప్పి చెప్పే శాశ్వత సత్యం.
 
కాశ్మీరం అంటే
మృణ్మయ మనోభాండాన్ని నింపే 
హిమ హిరణ్మయ జీవన మాధుర్యం.
 
ప్రకృతి తో నెయ్యం
చిరంతన చేతనా సౌకుమార్యం.

*****

Please follow and like us:

2 thoughts on “సౌందర్య సీమ (కవిత)”

  1. ” మనసుతో కొలవలేని మరో ప్రపంచం” సుందర కాశ్మీరం. కళ్లముందు కి తెచ్చారు శైలజ గారు. కవిత బాగుంది.

Leave a Reply

Your email address will not be published.