అల్లంతదూరాన… ఆస్ట్రేలియాలో – 1
– విజయ గొల్లపూడి
విశాల పేరుకు తగ్గట్టే మనసు కూడా ఎంతో విశాలం. ఆమె మాట మృదు మధురం. కాలేజీ లో డిగ్రీ చదువుతూ మిత్రులతో ఆనందంగా గడచిపోతున్న రోజులు అవి. అగ్రికల్చర్ యూనివర్సిటిలో హార్టీ కల్చర్ కోర్స్ చదువుతోంది. చాలావరకు రోజంతా కాలేజీలోనే గడచిపోతుంది. రికార్డ్ వర్క్, లేబ్ వర్క్, ఎగ్జామ్స్ ఇలా క్షణం తీరిక ఉండదు ఆమెకు. ఐనా ఆమెకు ఎక్కడా విసుగు అనేదే రాదు. ఏ పని చేసినా అందులో పూర్తిగా లీనమై, ప్రతి క్షణం ఆనందించడం ఆమెలోని ప్రత్యేకత. తల్లిదండ్రుల గారాల పట్టి. ఏనాడు ఆమెకు చదువుకోమని చెప్పే అవసరం వారికి ఎప్పుడూ రాలేదు. అన్నీ వేళ తప్పకుండా అను కున్న పనులు చేసేయటం ఆమె దినచర్యలో భాగం.
విశాలకున్న ఫ్రెండ్స్ సర్కిల్ కూడా ఎక్కువే. క్లాసులు మొదలయ్యే ముందు, అగ్రికల్చర్, హార్టీకల్చర్ మరియు హోమ్ సైన్స్ వాళ్ళు అక్కడ లేడీస్ వెయిటింగ్ రూమ్ లో గలగల కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు.
ఆ రోజు వసుంధర వచ్చి, అందరికీ స్వీట్స్ పంచిపెట్టింది. కారణం ఏమంటే వాళ్ళ అక్క సైంధవికి పెళ్ళి నిశ్చయమైంది. అబ్బాయి ఆస్ట్రేలియాలో ఉంటాడు. ఎంగేజ్ మెంట్ వచ్చే ఆదివారమే. అలా కాసేపు రాబోయే నిశ్ఛితార్థం, ఆపై పెళ్ళి ఎపుడూ… ఇలా పిచ్చాపాటి మాట్లాడుకుని అందరూ ఎవరి క్లాసులకు వాళ్ళు హడావిడిగా వెళ్ళిపోయారు.
విశాలకు మనసులో ఆస్ట్రేలియా దేశం పేరు వినగానే తెలియకుండానే ఏవో ఆలోచనలు ముసురుకున్నాయి.
ఓహ్! ఆస్ట్రేలియా! అవును అంతకుముందు భారత్, ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్ టి.విలో వస్తుంటే చూసింది. గొప్ప టీమ్. నిజంగా డేవిడ్ బూన్ భలే ఆడాడు. మనిషి భారీకాయమైనా గాని, ఒక్క బంతి వృధా పోనీయకుండా వెంటనే బంతి వెనుక పరిగెట్టి ఆపడం చూస్తే చాలా ముచ్చటేసింది. ఆలెన్ బోర్డర్ నాయకత్వంలో మంచి పోరాట పటిమను చూపుతూ ఆ రోజు భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్ మంచి ఉత్కంఠను రేపింది.
అందుకే ఆస్ట్రేలియా పేరు వినగానే విశాల మనసు ఎక్కడికో వెళ్ళిపోయింది.
కాలేజీ అయ్యాక, ఇంటికి వచ్చి, కాళ్ళు కడుక్కుని రిలాక్స్ అవుదామని రేడియో పెట్టగానే రెహమాన్ మెలోడీ సాంగ్ వస్తోంది.
టెలిఫోన్ ధ్వనిలా నవ్వేదానా…
మెల్బోర్న్ మెరుపులా మెరిసేదానా
డిజిటల్ లా చెక్కిన స్వరమా
మళ్ళీ పాట వినగానే విశాల ధ్యాస ఆస్ట్రేలియా దేశం పై మళ్ళింది. రచయిత భువన చంద్ర మెల్బోర్న్ మెరుపులా మెరిసేదానా అని రాసారు అంటే ఆస్ట్రేలియాలో మెల్బోర్న్ మిరిమిట్లు గొలిపేంత అందంగా ఉంటుందన్న మాట. “సుందరమైన ఆస్ట్రేలియా ఒక సారైనా వెళ్ళి చూడాలి”
ఏమిటో వసుంధర వాళ్ళ అక్క పెళ్ళి చేసుకుని ఆస్ట్రేలియా వెళ్ళిపోతుందని చెప్పగానే, నా ఆలోచనలన్నీ ఆస్ట్రేలియా దేశం చుట్టూ పరిభ్రమిస్తున్నాయేంటి?
విశాల తనలో తనే నవ్వుకుంది. మనసు ఎంత పిచ్చిది. ఒక మాట వినగానే, ఎన్నో
ఆలోచనలు, ఎక్కడ పొంతన లేకుండా అసలు విషయం వదిలేసి, ఏవేవో అల్లుకుంటూ
వెళ్ళిపోతుంది. అవును ఇపుడు ఎందుకు ఇవన్నీ నా మనసులో ఆస్ట్రేలియా గురించి అలలు రేపుతున్నాయి. మనసు నిలకడగా పెట్టుకుని, రేపు జరుగబోయే ఎంటమాలజీ పరీక్షకు సిద్ధం కావాలి అనుకుని, పుస్తకాలు ముందేసుకుంది.
ఇలా రోజులు దొర్లిపోతున్నాయి. విశాల పరీక్షలు అన్నీ బాగా రాసింది. ఆ రోజు వెయిటింగ్ రూమ్ లో వసుంధర వాళ్ళ అక్క సైంధవి ఫోటోలు తీసుకువచ్చి చూపించింది. పెళ్ళి అయిన వెంటనే అబ్బాయితో ఆస్ట్రేలియా వెళ్ళిపోయింది. వాళ్ళ అక్క, బావ ఆస్ట్రేలియా సిడ్నీలో దిగిన ఫోటోలు అందరికీ గొప్పగా చూపించుకుంది.
నిజంగా ఆస్ట్రేలియా ఇంత అందంగా ఉంటుందా? ప్రపంచంలో అందమైన నగరంగా సిడ్నీ! ఓహ్! అందమైన ఒపెరా హౌస్ , చుట్టూ నీళ్ళు, ఒక్కసారిగా ఫోటోలు
చూడగానే విశాల, వావ్! ఫెంటాస్టిక్, మీ అక్క, బావ చాలా బాగున్నారు, బ్యూటి ఫుల్ లొకేషన్, అని వసుంధరకి కాంప్లిమెంట్స్ ఇచ్చింది. వసుంధర ఆనందంతో అక్కని ఫోటోలో చూసుకుని మరోసారి మురిసిపోయింది.
వసుంధరా! నువ్వు కూడా డిగ్రీ అయిపోగానే ఆస్ట్రేలియా వెళ్ళిపోతావా? ఎపుడూ ప్రశ్నలు సంధిస్తూ ఆట పట్టించే భార్గవి అడగగానే, లేదు, నేను ముందు యూ.ఎస్ లో ఎమ్.ఎస్ చేయాలి. జీఆర్ ఈ, టోఫెల్ రాస్తాను, అని గట్టిగా చెప్పింది.
భార్గవి వెంటనే విశాల వైపు తిరిగి, మరి నువ్వేం చేస్తావు విశాలా.. నువ్వు కూడా యు. ఎస్ వెడతావా? అంది.
ఊహించని ఆ ప్రశ్నకు విశాల దగ్గర సమాధానం లేదు. ఏదో ఊహలలో విహరించటమే తప్ప, తన మనసులో కూడా అటువంటి ఆలోచన లేదు.
“లేదు, భార్గవి, నేను ఇక్కడే చదువు కంటిన్యూ చేస్తాను. వేరే దేశం వెళ్ళే ఉద్దేశ్య మైతే లేదు అని చెప్పింది.”
అవును, భార్గవి, డిగ్రీ కాగానే, మరి నువ్వేమి చేస్తున్నావ్?
“నేనైతే మా బావను పెళ్ళి చేసేసుకోవాలని ఫిక్స్ అయిపోయాను. ఇంట్లో వాళ్ళు ఇప్పటికే గొడవ చేస్తున్నారు. నేను ఈ కోర్స్ చదవడమే గొప్ప” అంటూ గట్టిగా నవ్వింది.
ఇంతలో క్లాస్ లకు టైమ్ కావడంతో అందరూ అక్కడ నుంచి వెళ్ళిపోయారు.
విశాల, మానవాళికి భగవంతుడు ప్రసాదించిన మేలిమి వజ్రమేనేమో. తన జీవితానికి ఎప్పటికప్పుడు మెరుగులు దిద్దుకుంటూ, తనకేమి కావాలో తెలుసుకుంటూ ముందుకు దూసుకుపోయే వెలుగు రేఖ. ఎవరికి ఏ సాయం కావాలన్నా లేదు, కాదు అనకుండా బంధువులకు, మిత్రులకు తలలో నాలుకలా సమయానికి ఆదుకుంటుంది.
ఒకసారి క్లాసులో తన స్నేహితురాలు వైదేహి చేపల పేర్లు, వాటి కుటుంబాల
పేర్లు గుర్తు పెట్టుకోవడానికి శ్రమ పడుతూ బట్టీ కొడుతుంటే, అలా కాదు! వైదేహి ఇదుగో నీకో సులభమైన కిటుకు చెపుతాను. పరీక్షలలో మర్చిపోకుండా గుర్తుంచుకోవడానికి. హిల్సా ఎలిషా ఈ చేప పేరు గుర్తు పెట్టుకోవడానికి, ఇదిగో మన క్లాసులో జూనియర్స్ ని తెగ ర్యాగింగ్ చేసే శిరీష తెలుసుగా అలాగే శిరీష, ఎలిషా రిథమ్ అసోసియేట్ చేసుకో. ఎపుడూ క్లిష్టమైన పేర్లు గుర్తుండాలి అంటే వాటిని ఫన్నీగా మనకు ఎదురుగా కనిపించే వ్యక్తులు, వస్తువుల పేర్లతో అసోసియేట్ చేసుకోవడమే. అపుడు నువ్వు నిద్రలో లేపినా వెంటనే చెప్పేయ గలుగుతావే”
విశాల చెప్పిన సలహాకు, వైదేహి పడి పడి నవ్వింది. తరువాత రోజు విశాల
కనబడగానే, నీ ట్రిక్ భలే బాగా పనిచేస్తోందే, నేను ఇపుడు మనకున్న ఫిషరీస్ లో చేపల పేర్లు అన్నీ కష్టపడకుండా నేర్చేసుకున్నాను అని వైదేహి ఆమెను ప్రశంసించింది.
విశాల ఒక రోజు ఇంటికి చేరుకోగానే తను ఎంతగానో ఇష్టపడే తాతయ్యగారు ఇంట్లో ఉన్నారు. తాతయ్యగారు మీరు ఎప్పుడు వచ్చారు? వస్తున్నట్లు ఒక కార్డు ముక్క ఐనా రాయలేదు.
లేదు విశాలాక్షీ! అనుకోకుండా బయలుదేరాను. మా వేలువిడిచిన మేనత్త వాళ్ళ మనవరాలి పెళ్ళి ఉంది. నన్ను చూడాలి రమ్మనగానే, ఇదిగో అక్కడ పెళ్ళి చూసుకుని తుర్రుమని మా విశాలాక్షిని చూడటానికి వచ్చేసాను.
అలా విశాలను విశాలక్షీ అంటూ అప్యాయంగా పిలిచేది తాతయ్యగారు మాత్రమే. లలిత అమ్మవారిని ఆరాధించే విశ్వనాథం గారు మనవరాలిని సాక్షాత్ కూతురి ఇంట వెలసిన కాశీ విశాలాక్షిగా, అపురూపంగా చూసుకుంటారు. రిటైరైన తరువాత వీలు దొరికి నప్పుడల్లా కూతురింటికి వచ్చి ఒకటి, రెండు రోజులు ఉండి, మనవరాలితో కబుర్లు చెప్పుకుంటే గానీ ఆయనకు తోచదు.
అమ్మా, నీ చదువు ఎపుడు పూర్తి కావస్తుంది. నాకు తెలిసినవాళ్ళు అపుడే మీ పెద్ద మనవరాలు ఏమి చేస్తోంది, పెళ్ళి సంబంధాలు చూస్తున్నారా అని అడుగుతున్నారు.
“అమ్మో తాతయ్యగారు, అపుడే పెళ్ళా? ఇంత కష్టపడి చదివేది వెంటనే పెళ్ళి చేసుకోవడానికా? నేను చేసేది ప్రొఫెషనల్ డిగ్రీ కదా! పోష్ట్ గ్రాడ్యుయేషన్ చేసి, ఒక రెండేళ్ళైనా జాబ్ చేస్తే బాగుంటుంది కదా!”
ఇంతలో అక్కడికి వచ్చిన తండ్రి శ్రీనివాస్ గారు, నీ ఆలోచన బాగానే ఉన్నా విశాల, నీ ప్రయత్నాలు నువ్వు చేస్తూ, పై చదువులు కొనసాగించు. మా వైపు నుంచి పెళ్ళి ప్రయత్నాలు మేము చేస్తాం. బంగారంలాంటి అవకాశం జీవితంలో ఎపుడు ఎటునుంచి వస్తుందో మనకు తెలియదు కదా! అంటుంటే విశాల సిగ్గుమొగ్గై, మొహమాటంతో ఏమి అనలేక అక్కడ నుంచి తుర్రుమంది.
మామయ్య గారు నేను మెల్లిగా పెళ్లి ప్రయత్నాలు విశాలకు మొదలెడదామను కుంటున్నాను మీ ఆశీస్సులతో. మీకు తెలిసిన మంచి సంబంధాలు ఉంటే తప్పకుండా చెప్పండి.
ఇంతలో వరలక్ష్మిగారు కాఫీ అందిస్తూ అవును నాన్నగారు. ఈ రోజులలో పెళ్ళి కుదరటం కష్టంగా ఉంది అబ్బాయికైనా, అమ్మాయికైనా సరే. జాతకాలు, అమ్మాయి, అబ్బాయి ఒకరికొకరు నచ్చి, అన్ని కుదిరేసరికి రెండేళ్ళయినా పడుతుంది. ఈ లోపు వాళ్ళు జాబ్ లో సెటిలయితే ప్రేమ వివాహాలు అంటారు. తల్లిదండ్రులుగా మన బాధ్యత మనం చేయాలి కదా. మీ రోజులలో పెద్ద కుటుంబాలు, ఉమ్మడిగా ఉంటూ, ఐదుగురు పిల్లలను ప్రయోజకుల్ని చేసి, పెళ్ళిళ్ళు చేసారు. మీరే మాకు ఆదర్శం నాన్నగారు
అని కూతురు, అల్లుడు ఆయనను తీయని మాటలతో ఆనంద మకరందంలో ముంచేసారు.
“సరే అలాగే, నాకు తెలిసిన సీతారామయ్య గారు ఈ మధ్యనే వాళ్ళ ఆఖరిఅమ్మాయి పెళ్ళి చేసారు. మ్యారేజ్ బ్యూరో నడుపుతున్నారు. ఒక మంచి రోజు చూసి, మన విశాల వివరాలు ఇచ్చి రిజిష్టర్ చేయండి. తనకు తగ్గ సంబంధం, ఈడు, జోడు చూసి, పూర్వా పరాలు అన్నీ వాకబు చేసి ముందుకు వెళ్ళాలి. నేను ఉదయమే మళ్ళీ ఊరు వెడతాను. ఆవకాయల సీజన్ కదా! సుందరం తోట నుంచి మామిడికాయలు తీసుకువస్తాను అన్నాడు. మీ అన్నయ్య, వదిన నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. నేను అక్కడకు వెళ్ళాక, మళ్ళీ పెళ్ళి సంబంధాలు, మన విశాలకు యోగ్యంగా, ఆమోదయోగ్యంగా ఉన్న వాళ్ళ వివరాలు పంపుతాను.”
* * * * *
(ఇంకా ఉంది)