ఈజిప్టు పర్యటన – 2
-సుశీల నాగరాజ
“మనిషి కాలానికి లోబడి ఉంటే, కాలం పిరమిడ్స్‌కి లోబడి ఉంది” – అరబ్ నానుడి.
“మానవ నాగరికతకు సాంకేతిక చిహ్నమైన చక్రం (wheel) ని కనుక్కోక ముందే ఇంత అద్భుతమైన కట్టడాలను ఎలా సాధించారు?!!”
ఈ ప్రశ్నలకు సమాధానాలు ఈ నాటికీ లేవు.
శరీరంలోకి వారి ఆత్మలు ప్రవేశిస్తాయని పూర్వుల నమ్మకం! మరణించిన తరువాత జీవితం ఉందని విశ్వాసం !. అందుకు వీలుగా శరీరం కృశించకుండా మమ్మిఫికేషన్ వల్ల నిలవ (preserve) చేసి, పెద్ద పెద్ద సమాధుల్లో (పిరమిడ్) ఫెరోల శరీరాలను దాచేవారు. ఈ మమ్మిఫికేషనుకు 70రోజుల సమయం. మరుజన్మలో జీవితం బాగా సాగటానికి వీలుగా ఎన్నో విలువైన సంపదలను, భోజన సదుపాయం కోసం కావలసిన సరుకులు, చివరకు వైన్ కూజాలు కూడా ఈ సమాధుల్లో దాచేవారు.
ప్రపంచంలో అత్యంత, అత్యున్నత సాంకేతికవిలువలతో నిర్మించారు పిరమిడ్లను. ఇవి ఈజిప్టు నాగరికతకు ప్రతిబింబంగా మన ముందు నిలిచిఉంది. ఇవి ఈజిప్టు రాజుల సమాధులు. ఇందులో ఒకటి గ్రేటు పిరమిడ్డు.! దీని నిర్మాణానికి 1,00,000 మంది బానిసలు పని చేశారట. రాజుల శవాన్ని ఉంచే శవపేటిక (కాఫిల్ లేక సర్కోఫంగస్). ఉత్తర దిశ నుంచి పిరమిడ్ లోపలికి ప్రవేశ మార్గం ఉంది. అక్కడ నుంచి ఒక వరండా ఉంది.
ప్రాచీన ఈజిప్ట్ నాగరికతలో ముఖ్యమైన దేవత సూర్యుడు. (“రా” అని పిలుస్తారు) సూర్యాస్తమయం పశ్చిమాన జరుగుతుంది కాబట్టి, పిరమిడ్‌లు కూడా పశ్చిమాన్నే కట్టాలన్న సాంప్రదాయం వచ్చింది.
గిజాలోని పిరమిడ్‌ను చూస్తుంటే, ఏదో తెలియని అలౌకికమైన భావం !
గిజా పిరిమిడ్ ఈజిప్ట్ లో ఎంతో ప్రత్యేకమైనది. ప్రపంచంలోని ఏడు వింతల్లో ఒకటిగా గుర్తింపు పొందిది” గ్రేటు పిరమిడ్డు ఆఫ్ ఈజిఫ్టు “అని. ఇది క్రీస్తుపూర్వం 2550లో ఫారో రాజులు నిర్మించారు. ”
” మానవ నిర్మితమైన అతి ప్రాచీన కళాఖండాలు” అనటంలో సందేహంలేదు.
“ఎన్ని ఫొటోలు, టీవీ ప్రోగ్రాములు, వీడియోలు చూసినా, ప్రత్యక్షంగా పిరమిడ్లని చూస్తే కలిగే అనుభూతుల్ని వర్ణించటం కష్టం! ” ఈజిప్టు చూసి వచ్చినవారు రాశారు. నా భావాలకు ప్రతిరూపం ఈ వాక్యాలు. అందుకే ఇక్కడ పెడ్తున్నాను.
గ్రేట్ పిరమిడ్స్ ఆఫ్ గిఝా కళ్ళ ఎదుట కనిపించగానే !!! అద్భుతం ! మనిషి సృష్టించిన అద్భుతం! మన ఊహకే అందదూ. ఏమిటి !ఎలా ! ఇదే పురాతన “సెవెన్ వండర్స్ ఆఫ్ ది వరల్డ్ ” ఈజిప్టు లో మిగిలిన ఒకే ఒక్క పిరమిడ్డు .ఇది సున్నంరాయి (లైమ్ స్టోన్ ), గ్రానైట్ తో కట్టబడింది. దీని ఎత్తు 481 అడుగులు, మూల పొడవు ( బేస్ లెంగ్త్) 756 అడుగులు. 3800 సంవత్సరాలు ప్రపంచంలో మనిషి సృష్టించిన పొడవైన కట్టడంగా నిలిచిపోయింది. ఇందులో 3 గదులు, క్రిందగది, రాణి గది, రాజుగది అని. లోపలికి వెళ్ళడానికి $29/- డాలర్లు. వెళ్ళటం చాలా కష్టతరమైనదే. కష్టపడి ఎక్కిన , దిగటం మరీ కష్టం!
తరువాత సోలార్ బోటు మ్యూజియం చూశాము. ప్రఖ్యాతి చెందిన ఖుంఫు పడవను 1968 లో మళ్ళీ నిర్మించి, గిజా పిరమిడ్డు దగ్గరే ఉంచారు. చనిపోయిన రాజుల్ని స్వర్గానికి తీసుకొనివెళ్ళేందుకు ఉపయోగించే సాధనం, అని.
అక్కడి నుంచి స్పింక్స్ దగ్గరికి వచ్చాము. ఇది 2520- 2494 బి.సి మద్యలో కట్ట బడినది. ఈ స్పింక్స్ శరీరం 72 మీటర్ల పొడవు కలిగి 20 మీటర్ల ఎత్తు కలిగి ఉంది. . పశ్చిమం వైపు నుంచి తూర్పువైపు చూస్తూ ఉంది. పౌరాణిక రూపంతో సింహం దేహం , మనిషి తలతో సున్నంరాతితో కట్టబడింది. తల భిన్నమైన దేహం అలాగే చెక్కుచెదరక గంభీరంగా అందర్నీ ఆకర్షిస్తూ కూర్చొని ఉంది. భోజనం తరువాత ఈజిప్షియన్ మ్యూజియంకు వెళ్ళాము.
ఈజిప్టు మ్యూజియం
ఇందులో 1,20,000కి పైగా పురాతన వస్తువులూ 12 మమ్మీలూ ఉన్నాయి. దీన్ని 1902లో నిర్మించారు. 2011లో పిరమిడ్స్ కు సంబంధించిన పూర్తి చరిత్ర , ఆ వస్తువులు, బంగారు ఆభరణాలు. ఇంకా ఎన్నో అందులో ఉన్నాయి, చూడడానికి రెండు కళ్ళూ చాలవూ! తరువాత చాలామంది షాపింగుకు వెళ్ళారు. రోడ్డు పై ఉన్న టీ షాపులో కూర్చొని “టీ” సేవిస్తూ చుట్టూ చూస్తూ కాలంగడిపాము మేము.
బిడ్డల్ని ఎత్తుకొని డబ్బులు అడిగేవాళ్ళు చాలామందే. అన్నిటి కంటే ఆశ్చర్యం మనం నుదుటి పై పెట్టుకొనే బిందీలు అమ్మాయిల్ని చాలానే ఆకర్షించింది. ఒకర్ని చూసి ఒకరు చాలా మందే వచ్చి బిందీలు అడిగి పెట్టించుకొన్నారు. పిరమిడ్డు దగ్గర కూర్చొని ఉంటే చాలా మంది అమ్మాయిలు అబ్బాయిలు విద్యార్థులు వచ్చి ఫోటో తీసుకోవాలని అడిగి తీసుకొన్నారు selfie లు. ఎందుకని తెలియదు.
*****
(సశేషం)