కాళరాత్రి-18
ఆంగ్లమూలం : ఎలీ వీజల్ -“నైట్”
అనువాదం : వెనిగళ్ళ కోమల
చీకటి పడింది. ఎస్.ఎస్.లు మమ్మల్ని వరుసలు కట్టమని ఆర్డరు యిస్తున్నారు.
మరల మా కవాతు మొదలయింది ` చనిపోయినవారు మంచు కిందపడి ఉన్నారు. వాళ్ళకోసం కడిష్ ఎవరూ పఠించలేదు. చనిపోయిన తండ్రులను కొడుకులు అలానే వదిలివేశారు. వారికోసం ఒక చిన్న కన్నీటిబొట్టు కూడా రాల్చలేదు.
మంచు కురుస్తూనే ఉన్నది. మేము నెమ్మదిగా మార్చింగ్ చేస్తున్నాము. గార్డులు కూడా అలసినట్లున్నారు. పాదం గడ్డ గట్టిపోయేటట్లున్నది. బాధించటం లేదు. ఇక నా పాదం పోయినట్లే అనుకున్నాను. కారు చక్రం ఊడిపడిపోయినట్లుగా నా పాదం గురించి ఆలోచన నన్ను వీడిపోయింది. ఒక్క కాలితోనే బ్రతుకుతాను. దాన్ని గురించి ఆలోచించక పోవటం ఉత్తమం ఆ ఆలోచనలకు మరోసారి టైమునిస్తాను.
మేము చిందరవందరగా నడుస్తున్నాం. గార్డులు అలసి ఉండటంతో పట్టించు కోవటం లేదు. చావుకు వారి మద్దతు అవసరం లేదు. చలి జనాన్ని చంపేస్తూనే ఉన్నది. అడుగడుక్కూ ఎవరో ఒకరు పడి చనిపోతూనే ఉన్నారు.
ఎస్.ఎస్.లు మోటారు సైకిళ్ళ మీద మా వెంట వస్తూనే ఉన్నారు. త్వరలోనే గ్లేవిడ్జ్ చేరుతాం. ఇంక కొన్ని గంటల్లో అంటున్నారు. మా చావుకు కారకులైన వారి నోటినుండి వచ్చినా ఆ మాటలు మాకు ఊరట కలిగించాయి. ఎలాగైనా అక్కడికి చేరుకోవాలనే తాపత్రయపడుతున్నాము. గ్లేవిడ్జ్ ముళ్ళకంచె దగ్గరలో ఉండాలని కోరుకుంటున్నాం.
రాత్రయింది. మంచు కురవటం ఆగిపోయింది. ఇంకా కొన్ని గంటలు నడిచాం. గ్లేవిడ్జ్ గేటు ముందుకు వచ్చాం. కపోలు మమ్మల్ని వెంటనే బ్యారక్కులలోకి పంపారు. జనం ఒకరినొకరు తోసుకుంటూ పడిపోయిన వారిని తొక్కుకుంటూ లోనకు జొరబడు తున్నారు.
నాన్ననూ, నన్నూ వాళ్ళే తోశారు. ‘‘నన్ను తొక్కేస్తున్నావు, దయ ఉంచు’’ అని నా కాళ్ళ కింద నుండి వినిపించింది.
ఆ గొంతు పరిచయమైనదిగా ఉన్నది. లోగడ విన్నట్లున్నది. ఎక్కడ విన్నాను? క్యాంపులోనేమొ! అతన్ని ఊపిరి పీల్చుకోనివ్వాలి అంటే నేను పైకి లేవగలగాలి. కాని నన్నెవరో తొక్కుతున్నారు. ఊపిరాడటం లేదు. నా గోళ్ళు గుచ్చి పైకి లేవాలనే ప్రయత్నం. ఎవరి ముఖాలను గిచ్చుతున్నానో గాలి పీల్చే ప్రయత్నంలో!
గుర్తొచ్చింది. ఆ గొంతు జూలియక్‌ది. బ్యూనా ఆర్కెష్ట్రాలో, వయొలిన్ వాయించే జూలియక్‌ది. ‘‘నువ్వా జూలియక్’’ అంటుంటే, ఆ గుర్తు వచ్చింది 25 కొరడా దెబ్బలు “ అన్నాడు. ఇక మాట్లాడలేదు. ‘‘జూలియక్ ఎట్లా ఉన్నావు? ఏమి కావాలి?’’ అని అడిగాను.
బాగానే ఉన్నా, గాలి అందటం లేదు ` నా వయొలిన్ ` అన్నాడు. అతనికి మతి పోయిందనుకున్నా. ఆ స్థితిలో తన వయొలిన్ గురించి మాట్లాడుతుంటే. ‘‘నాతో వయొలిన్ తెచ్చాను, విరక్కొడతారేమొ’’ అనే భయం వ్యక్తం చేశాడు.
నన్నెవరో అణగద్రొక్కుతున్నారు. ఊపిరందటం లేదు, అయిపోయింది, రోడ్డు చివరకొచ్చాను. ఊపిరాడక చనిపోతున్నాను నేను అనుకున్నాను.
నాకు బ్రతకాలనే కాంక్ష తీవ్రమయి నన్ను తొక్కేస్తున్న వ్యక్తిని బలంగా గోళ్ళు గుచ్చి తోసెయ్యాలని ప్రయత్నం, నా మీద పడిన బరువు ఒక శవానిదేమో! కాని చివరికి కొంత ఖాళీలో నుంచి పిసరంత గాలి పీల్చగలిగాను.
‘నాన్నా, యిక్కడే ఉన్నావా’ అని పిలిచాను. ఊపిరందిన తరువాత నాన్న నాకు దూరంగా పోయి ఉండడు. దూరంగా నాన్న గొంతు వినిపించింది ‘‘నిద్రపోదామని ప్రయత్నిస్తున్నా’’ అన్నాడు. మరో ప్రపంచం నుండి వినిపిస్తున్నట్లున్నది ఆ గొంతు.
నాన్న యిక్కడ నిద్రపోదామనుకుంటున్నాడా? ఇంకా ఏమన్నా ఉన్నదా? క్షణం ఏమరితే చావే గతి! అనుకుంటుండగా వయొలిన్ వినిపించింది. చీకటి బ్యారెక్కులో చనిపోయిన వారు బ్రతికున్న వారి మీదకు పడిపోతున్నచోట వయొలిన్ మోగటమా? చావుకు సిద్ధంగా ఉండి కూడా వయొలిన్ వాయించే పిచ్చివాడెవరు? నేను భ్రమపడటం లేదు గదా?
జూలియక్ అయి ఉంటాడు. బిథోవెన్ వాయిస్తున్నాడు. అంత హృద్యమైన శబ్దం నేనెప్పుడూ విని ఉండలేదు.
నా కింద నుండి ఎప్పుడు తప్పించుకున్నాడు జూలియక్, నాకు తెలియనే లేదు.
ఆ చీకటిలో జూలియక్ వయొలిన్ వాయించటం వింటున్నాను. తన ఆత్మానందం కరిగించి వాయిస్తున్నాడు, వయొలిన్ తీగలమీద జీవితాన్ని కరిగిస్తున్నాడు. అతని తీరని కోరికలు, అతని మసకబారిన గతం నశించిన భవిష్యత్తు ` అంత గొప్పగా వాయిస్తున్నాడు. ఇదే ఆఖరేమొ! చనిపోయిన వారికి, చనిపోతున్నవారికి ఫేర్‌వెల్‌గా ఇంత చక్కని సంగీతం జూలియక్ వాయిస్తున్నాడు. ఈ కాన్సర్ట్‌నూ, జూలియక్‌నూ నేను ఎలా మరువగలను? ఇప్పటికీ నేను జూలియక్ వాయించిన బిథోవెన్ పాట వింటుంటే నా మనోఫలకం మీద పాలిపోయిన జూలియక్ ముఖం కదలాడుతుంది. ఎలా మరచిపోతాను. జూలియక్ పడిపోయి శవంగా మారటం?
గ్లేవిడ్జ్‌లో మూడు రోజులు గడిపాం. తిండిలేదు, నీళ్ళు లేవు. బ్యారక్ నుండి బయటకు రాకుండా ఎస్.ఎస్. కాపలా ఉన్నారు ద్వారం దగ్గర.
ఆకలిగా, దప్పికగా ఉన్నది. మురికి అవతారంగా ఉండి ఉంటాను. ఇతరుల అవతారాలు చూస్తుంటే నా సంగతి అర్థమయింది. బ్యూనా నుండి వెంట తెచ్చుకున్న రొట్టె ఎప్పుడో అయిపోయింది. మరో రేషన్ ఎప్పుడిస్తారో తెలియదు.
దగ్గరలో కేనన్లు వినిపిస్తున్నాయి. మాలో శక్తిగానీ, ధైర్యంగానీ ఇసుమంత గూడా మిగలలేదు. జర్మన్లకు టైము ముగుస్తున్నది అని ఆలోచించటానికి గూడా ఓపిక లేదు. రష్యన్లు వచ్చి ఆదుకుంటారనే ఆశా లేదు.
జర్మనీ మధ్యకు మమ్మల్ని పంపుతారని తెలిసింది. మూడవరోజు ప్రొద్దున్నే బ్యారక్కుల నుండి మమ్మల్ని బయటకు లాగారు. బ్లాంకెట్లు కప్పుకున్నాం ` క్యాంపు రెండుగా చీలిన గేటు దగ్గరకొచ్చాము. ‘సెలెక్షన్’ అని అందరూ అన్నారు.
ఎస్.ఎస్. ఆఫీసర్లు సెలెక్షన్ చేస్తున్నారు. బలహీనులను ఎడంవైపుకు, పరుగెత్త గలవారిని కుడివైపుకూ పంపుతున్నారు. నాన్నను ఎడం వైపుకు పంపారు. నేను నాన్న వెంట పరుగు పెడుతుంటే ఎస్.ఎస్ పిలిచాడట ‘రా వెనక్కి’ అని. నేను ముందు ముందుకే పోతున్నా. ఆఫీసరు హడావిడి చేస్తుంటే ఇదే అదను అని కొందరు కుడివైపుకు జరిగారు. నేనూ, నాన్నా కూడా మారాం. తుపాకి మోతలు వినవస్తూనే ఉన్నాయి. కొందరు చనిపోతూనే ఉన్నారు.
మమ్మల్ని ఒక అరగంట మార్చి చేయించిన తరవాత రైలు రోడ్డు మధ్యగా ఉన్న ఒక పొలంలోకి తీసుకు వచ్చారు. రైలు రాక కోసం మేమక్కడ వేచి ఉండాలి.
మంచు విపరీతంగా కురుస్తున్నది. మేము కూర్చోగూడదు, కదలగూడదు.
మా దుప్పట్ల మీద మంచు దట్టంగా పేరుకుంటున్నది. మాకు రొట్టెలు యిచ్చారు. తిన్నాము. మంచు ముక్కలు తిని దాహం తీర్చుకున్నాము. మేము వంగకూడదు గనుక మా స్పూన్లతో ముందు వాడి వీపు మీద పడిన మంచుగడ్డలు తిన్నాము. ఇంత రొట్టె ముక్క, యింత మంచుముక్క మా పని చూసి ఎస్.ఎస్‌లకు నవ్వు వచ్చింది.
రైలుబండి వచ్చి ఈ నిలబడే శిక్షని తగ్గిస్తుందని ఎదురు చూశాం. బండి లేటుగా వచ్చింది. పొడవాటి ట్రెయిను. కప్పులు లేని జంతువులను చేరవేసే కార్లు. ఎస్.ఎస్.లు మమ్మల్ని బండిలోకి తోశారు. ఒక్కొక్క బోగీలోకి వందమందిని ఇరికించారు. అందరం ఎముకలగూళ్ళలాగే ఉన్నాం. బండి బయలుదేరింది.
చలి కాచుకోటానికి ఒకరికొకరం చొచ్చుకుని కూర్చున్నాము. తలలు బరువు కోల్పోయినట్లు, బ్రెయిన్‌లో ఏవో జ్ఞాపకాలు దొరులు తున్నాయనిపించింది. ఇక్కడో, మరోచోటో, ఈ వేళో, రేపో చచ్చిపోతాం. రాత్రికి ముగింపు లేదన్నట్లున్నది.
అందరం తలలు వంచుకొని ఒకరి మీద ఒకరం ఒరుగుతూ స్మశానంలో మంచుతో కప్పబడి నట్లున్నాం. ఉదయమవుతుండగా పోయినవారి, ఉన్నవారి మధ్య తేడా ఏమిటని గమనిస్తున్నా, నాకేమీ తేడా కనిపించలేదు. ఒకతనివైపు చూస్తున్నాను. కళ్ళు నభో మండలం వైపు చూస్తున్నట్లు కళ్ళు పెద్దవిగా తెరచి ఉన్నాయి. పాలిపోయిన ముఖాన్ని మంచు కప్పేసింది.
నాన్న నన్ను అతుక్కునే ఉన్నాడు. దుప్పటి మంచు మయం. చనిపోయాడా? పిలిచాను. పలకలేదు. కదలటం లేదు. అరవ గలిగితే పెద్దగా అరిచేవాడిని. పోరాడటానికి గానీ, బ్రతకటానికి గానీ ఏమీ కారణం కనిపించటం లేదు. అకస్మాత్తుగా ఒక పొలంలో బండి ఆగింది. కుదుపుకు కొందరు నిద్ర మేల్కొన్నారు.
శవాలను బయటకు తోసేయండి అని ఎస్.ఎస్.లు ఆర్డరు వేశారు. బ్రతికున్న వారికి కొంచెం స్థలం చిక్కుతుందని సంతోషించారు. నేల మీద పడిపోయిన వారిని వలంటీర్లు ఈడ్చేస్తున్నారు.
ఇక్కడొకడున్నాడు అని వాలంటీర్లు అతని బట్టలు విప్పి తామే తొడుక్కున్నారు. ఇద్దరు గుంట తవ్వే వాళ్ళు అతని తల, ఒకరు, కాళ్ళు మరొకరు లేవనెత్తి బోగీ నుండి పిండి బస్తాని విసిరేసినట్లు విసిరేశారు.
ఇక్కడ ఒకాయన ఉన్నాడు. నా పొరుగు అతనే కదలటం లేదు అంటూ నాన్న వైపు వస్తుంటే నేను నాన్నను నా శరీరంతో కప్పాను. నాన్న శరీరం చల్లబడిపోయింది. నాన్నను తట్టి, చేతులు రుద్ది ‘లే నాన్నా, కల్లు తెరువు. వాళ్ళు నిన్ను విసిరేయ బోతున్నారు’ అన్నాను.
వాళ్ళిద్దరూ నన్ను అవతలికి లాగి ` ‘‘చనిపోయాడు, నీకు కనపడటం లేదా’ అంటుంటే, లేదు ఆయన ఇంకా చనిపోలేదు’’ అని అరిచాను. నాన్నను గట్టిగా కొడుతున్నాను, సగం కళ్ళు తెరిచాడు, భారంగా ఊపిరి తీసుకుంటున్నాడు, ‘నేను చెప్పాను కదా, చూడండి’ అంటే వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు.
మా బోగీనుండి 20 శవాలను ఈడ్చిపారేశారు. వందల శవాలను మంచులో పారేసి ట్రెయిన్ బయలుదేరింది. వాళ్ళు సమాధులు కూడా నోచుకోని అనాధలు.
*****
(సశేషం)
వెనిగళ్ళ కోమల మూల్పూరు గ్రామంలో జన్మించారు. ప్రముఖ హేతువాది ఇన్నయ్య గారి సతీమణి. అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో ఇంగ్లీష్ ప్రొఫెసర్ గా 1995 లో పదవీ విరమణ చేశారు. ప్రస్తుత నివాసం అమెరికాలోని వాషింగ్టన్ డి.సి.