చకోర పక్షి
– గంగాపురం శ్రీనివాస్
జీలకర్ర, బెల్లం
విడివడక ముందే
గోరింటాకు ఎరుపు
ఎల్వకముందే
అప్పుల కుప్పలు
కరిగించడానికై
నెత్తి మీదున్న చెల్లి పెళ్లి
కుంపటి దించడానికి
చకోర పక్షిలా
చక్కర్లు కొడుతూ
గొంతుక తడారలేని
ఇసుక దిబ్బలపై
రెక్కలు తెగి వాలిన
ఓ. వలస విహంగామా,
ఎన్నో ఆశల ఊసులతో
ఎగిరొచ్చిన
ఓ. కలల పావురమా
హృదయం ద్రవించలేని
సాయబుల చేతిలో
బందీవై, బానిసవైనావా!
ఎడారి దేశంలో రాళ్ళు కరిగి
చమురౌతదేమోగానీ,
మనసు కరగదని ఎరుగక
పోతివి గదా!
పెరుగుతున్న
నీ ప్రతిరూపంపై
చేతితో నిమురుతూ
నీ రూపం తల్చుకుంటూ…
నీ ప్రియసఖి
కోరికలన్నీ
పంటి బిగువున దాస్తు..
అనుక్షణం నీకై.
ఎదురు చూడవట్టె
జీవితాంతం
తోడుంటానని జెప్పి
సీమంతానికే లేకపోతివి,
బారసాలకు రాలేకపోతివి;
చిన్నోని ముద్దు, మురిపెం
చూడకపోతివి,
నాన్న ప్రేమను చూపక పోతివి
మూడు పసళ్లయినంక
కార్తీక మాసంల
వొస్తున్ననంటివి,
అసలు వీసా కాదని మోసపోతివి
చీకటి బతుకుల చేరువై
కటకటాల పాలైతివి.
తిప్పలుపడి
అప్పులుజేసి
ఉండలేక, రాలేక
ఎడారి గాచిన వెన్నెలైందా!
నీ జీవితం
పొట్టకూటి కోసమేళ్తే
చిప్పకూడు దక్కిందా!
కన్నతల్లి కోటొక్క మొక్కులో
ఇల్లాలి కండ్లల్ల ఒత్తులో
నీ బిడ్డ పుణ్యఫలమో,
నీ తండ్రి త్యాగ ఫలమో,
మళ్ళీ మాకైతే దక్కితివి బిడ్డా!
నీ బిడ్డపై ఒట్టేసి జెప్పు
మమ్మల్నిడిసి మళ్లపోనని
నువ్వొచ్చిందే పదివేలు!
ఇగ నిన్నొదలమంటూ
తోబుట్టువులంతా సుట్టుకునె
నిన్నిడిసిపెట్టనని
సంటోడు నీ పెద్దనేలు
గట్టిగ దొర్కవట్టుకునే
మూడేండ్లకు
మొదటి ముద్దువెట్టుకుంటివి
కండ్లు కాల్వలవ్వంగ!!
( కుటుంబం కోసం గల్ఫ్ కు వెళ్లి బతుకీడిస్తున్న వలస అన్నలకు అంకితం)
*****