జీవితం అంచున -2 (యదార్థ గాథ)

(…Secondinnings never started)

-ఝాన్సీ కొప్పిశెట్టి

          తరువాతి మూడు రోజులు మూడు యుగాల్లా గడిచాయి.

ఒకటే రెస్ట్లెస్ నెస్…

రెస్ట్లెస్ నెస్ అంటే ఏమిటంటారా…

నాకు అప్పుడప్పుడూ కలిగే కుదురుంచని ఒక అస్థిమిత భావన.

అది కలిగినప్పుడు విసుగ్గా వుంటుంది… ఏ పని పైనా ధ్యాస వుండదు.

          మాట్లాడుతున్నా ఆ మాటలు నావి కావు. టీవీలో సినిమా చూస్తున్నా నా కళ్ళు దానిని గ్రహించవు. చదువుతున్నా తలకెక్కదు. తింటున్నా నాలుకకు ఆహారం రుచి తెలియదు.

          రోజూ చేసే రొటీన్ పనులు కూడా ఆ రోజే తల మీద పడ్డ అదనపు భారంలా బరువనిపిస్తాయి.

నిత్యకృత్యాలు అలుపనిపిస్తాయి.

అకారణంగా నా పక్కనున్న వాళ్ళ పై విసుక్కుంటాను.

కూర్చొంటే ఎందుకు కూర్చున్నానో అర్ధం కాక లేవాలనిపిస్తుంది.

నిలుచుంటే చతికిలపడాలనిపిస్తుంది.

          పడుకుంటే లేవాలనిపిస్తుంది… లేస్తే ఏమి చేయాలో తెలియని దుస్థితి… అదొక మతి స్థిమితం తప్పిన స్థితి.

మూడు రోజులుగా రెస్ట్లెస్నెస్ తో నలుగుతున్నాను.

కారణంనర్సింగ్ కోర్సు ఊసు అమ్మాయి ఎత్తకపోవటం.

          నర్సింగ్ కోర్సు గురించి అమ్మాయి ఏమయినా చెబుతుందేమోనని ఎదురు చూస్తున్న నాకు నిరాశే ఎదురయ్యింది.

          ఇంట్లో వంట, ఇతర పనులు యాంత్రికంగా చేసుకుపోతున్నానే తప్ప దేని పైనా ఆసక్తి లేదు. అంతా నిరాసక్తంగా వుంది. ఆకలి కూడా అనిపించటం లేదు.

          మూడో రోజున నిద్ర పట్టక మంచం పైన మసులుతూండగా బయట హాలులో అల్లుడు అమ్మాయిల సంభాషణ సన్నగా వినిపించింది.

          “ఈ వయసులో మీ అమ్మకి కోర్సు, ఉద్యోగం అవసరమా.. ఆవిడ ఉద్యోగానికి వెళితే చంటిదానిని ఎవరు చూసుకుంటారు” అల్లుడు అసహనంగా అంటున్నాడు.

          “ష్… ఏమిటా మాటలు. అమ్మ వింటే బాధ పడుతుంది. అయినా అమ్మ చూసు కుంటుందని మనం పాపను కన్నామా. అయినా పాపను చూడటానికి చైల్డ్ కేర్ లు వున్నాయి.”

          “చైల్డ్ కేర్ లో పెట్టేట్టయితే ఇంక అమ్మమ్మ ఎందుకు..ఆవిడ ఇక్కడకు రావటం దేనికి?”

          “ష్… నెమ్మదిగా మాటాడు. అయినా కోర్సు చేసినంత మాత్రాన ఉద్యోగం చేయాలని లేదుగా. కోర్సు ఆన్లైన్ .. వారానికి రెండు రోజులే ట్యుటోరియల్స్. ఆ రెండు రోజులూ నేను ఎలాగోలా మేనేజ్ చేసుకుంటానులే”

          “కోర్సంటూ చేసాక ఉద్యోగం చేయకుండా వుంటుందా..”

          అమ్మాయి నుండి జవాబు లేదు.

          మూడు రోజులుగా అమ్మాయి నర్సింగ్ ఊసు ఎత్తక పోవటానికి కారణం అర్ధమవ సాగింది.

All relations are built on necessities.

          అల్లుడిని తప్పు పట్టటానికి లేదు. ఇండియాలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగానికి స్వచ్చంద పదవీ విరమణ చేసి అమ్మాయికి సాయంగా వుంటానని వచ్చినదానిని కదా మరి. ఈ రోజున ఏదో పౌరసత్వం వచ్చిందని ఈ వయసులో విద్యార్థిగా మారాలనుకోవటం అత్యాశే.

          నేను కాలేజీకి ఊరేగి పాపను వేరెవరి సంరక్షణలోనో పెట్టటం ఎంతవరకూ సబబు..?

          ఎవరికైనా చెప్పినా నవ్విపోతారు.

          అయినా పిల్లలు, వాళ్ళ తల్లులు పెంచుతారనే పిల్లలను కంటారా..?

          ‘నీ పిల్లలు.. నీ బాధ్యత’ అని ఏ తల్లయినా తనకు నచ్చిన వృత్తో, ప్రవృత్తో ప్రశాంతంగా చేసుకోగలదా…

          అసలు అలా అన్న రోజున పిల్లల స్పందన ఎలా వుంటుంది ?

          ఎంతగా ప్రేమించే వాళ్ళయినా వాళ్ళ సౌకర్యాలకు, సదుపాయాలకు అంతరాయం కలిగితే సహిస్తారా…

          బంధాలన్నీ అవసరార్ధమేనా ?

          భర్తకి అనుగుణంగా భార్య నడుచుకోకపోయినా, పిల్లలకు అనుకూలంగా తల్లి నడుచుకోకపోయినా పర్యవసానమెలా వుంటుంది ?

          తన కోరికలన్నీ కలలుగా మిగుల్చుకుంటుందే తప్ప స్త్రీ కలలో కూడా తన కుటుంబానికి అసౌకర్యం కలిగించదు కదూ.

          భార్యగానూ, తల్లిగానూ అసలెప్పుడూ స్త్రీది సర్దుబాటు జీవితమేనా ?

          ఇలా తమకో ఐడెంటిటీ అంటూ లేకుండా తమ ఉనికినే మరిచిపోయి భర్త, పిల్లల కోసం బ్రతకటం బహూశా నా తరంతో అంతం అయిపోతుందనుకుంటా.

          అవును.. ఈ తరం అమ్మాయిలు వేరు. సమ ఉజ్జీల్లా భర్తతో డీ కొడుతూ, సమ పాళ్ళలో సంపాదిస్తూ, ఇంటి పనుల్లో భర్తకు సరి వాటాలు వేస్తూ అచ్చంగా ఆకాశంలో సగమంటూ స్వతంత్రంగా విహరిస్తున్నారు.

          ఏమిటో ఈ గాడి తప్పుతున్న ఆలోచనలు. అసలు ఏమి ఆలోచిస్తున్నానో నాకే అర్ధం కావటం లేదు.

          బయటి వాళ్ళ మాటలు వినపడకుండా గట్టిగా చెవులు మూసుకుని పడుకున్నాను.

*****

(సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.