జెనెటిక్స్ వేదికగా జనవిశ్వతాండవం-7
-కల్లూరి భాస్కరం
కాస్పియన్ సముద్రానికీ, నల్లసముద్రానికీ మధ్యనున్న ప్రాంతాన్ని ఒకసారి మ్యాప్ లో చూడండి; కొన్ని దేశాల పేర్లు కనిపిస్తాయి. వాటిలో ఆర్మీనియా ఒకటి. ఆర్మీనియాకు పశ్చిమంగా టర్కీ, ఉత్తరంగా జార్జియా, దక్షిణంగా ఇరాన్, తూర్పున అజర్బైజాన్ అనే దేశాలు ఉన్నాయి. యూరప్, ఆసియాల మధ్య ఉన్న ఈ మొత్తం ప్రాంతాన్ని కాకసస్ అంటారు. ఇక్కడే కాకసస్ పర్వతాలున్నాయి. కాకసస్ ప్రాంతం రెండు భాగాలుగా ఉండి, రెండు ఖండాలకు వ్యాపించింది. వీటిలో ఉత్తర కాకసస్ యూరోపియన్ రష్యాలో ఉంటే, దక్షిణ కాకసస్ ఆసియాలో ఉంది.
ఈ కాకసస్ గురించిన కొన్ని విశేషాలను ఇంతకు ముందు, ‘జెనెటిక్స్ వేదికగా జనవిశ్వతాండవం-5’లో చెప్పుకున్నాం. ఈ కాకసస్ పేరులో ‘కస్’ ధాతువు ఉందనీ, ఆ ధాతువుతో కూడిన అనేక పేర్లు కాకసస్ నుంచి మన కశ్మీర్ వరకూ వ్యాపించి ఈ ప్రాంతాల మధ్యనున్న అతిప్రాచీన సంబంధాలను చెబుతాయనీ కూడా చెప్పుకున్నాం.
ఆర్మీనియా-ఇరాన్ మూలాలు
ఆర్మీనియా-ఇరాన్ ల మధ్య 11వందల కిలోమీటర్ల దూరం ఉంది. అతిప్రాచీన కాలంలో ఈ రెండు చోట్లా ఉన్న జనంలో కొంతమంది కాకసస్ వైపు వలస ప్రారంభించారు. అప్పటికే ఆ ప్రాంతంలో ఉన్న జనానికి వీరి నుంచి జన్యువారసత్వం అందినట్టు ప్రాచీన DNA సమాచారం వెల్లడించింది. ఇలా ఆర్మీనియా-ఇరాన్ జన్యు వారసత్వాన్ని అందుకున్న జనంలో కొందరు ఉత్తర కాకసస్ లో భాగమైన పశ్చిమ కాకసస్ లో, మైకాప్(Maikop, లేదా Maykop) అనే నగరం చుట్టుపక్కల ఒక సంస్కృతిని అభివృద్ధి చేశారు. పురావస్తు రంగంలో దీనిని మైకాప్ సంస్కృతిగా వ్యవహరిస్తారు. 5వేల సంవత్సరాలను మించిన వెనకటి కాలంలో వీరిలోనే కొందరు కాకసస్ కు ఉత్తరంగా ఉన్న స్టెప్పీలలోకి, అంటే గడ్డిభూములున్న ప్రాంతాలలోకి వలసపోవడం ప్రారంభించారు. అప్పటికి స్టెప్పీలలో తూర్పుప్రాంత వేట-ఆహారసేకరణజనం(Eastern Hunter-Gatherers-EHG)జనం, సైబీరియా ప్రాంతంలో ఏన్షియంట్ నార్త్ యూరేసియన్ (ANE) జనం ఉండేవారు. ఈ ANE జనమే అమెరికా ఆదివాసులకు కొంత జన్యు వారసత్వం కూర్చినట్టు ఇంతకు ముందు చెప్పుకున్నాం.
కాకసస్ నుంచి స్టెప్పీలలోకి జరిగిన వలసల నుంచి రూపొందిన జనాలలో భాగమే, యామ్నాయ జనం. వీరు కాకసస్ జనం నుంచీ, స్టెప్పీలలోని వేట-ఆహారసేకరణజనం నుంచీ సమానంగా జన్యువారసత్వాన్ని పొందారు. వీరే ఆ తర్వాత మళ్ళీ స్టెప్పీల నుంచి అటు పశ్చిమంగా యూరప్ వైపు, తూర్పుగా దక్షిణాసియావైపు వలసకట్టారు…
ఈ వలసల వివరాలు కొంచెం గందరగోళంగా అనిపించే మాట నిజమే. అసలు వలసలే పెద్ద గందరగోళం; నిలువుగా, అడ్డంగా, కుడి ఎడమలుగా-ఎలా వీలుగా ఉంటే అలా జనం వలసలు సాగించడం కనిపిస్తుంది. ఈ వలసలు జరిగిన క్రమంతోపాటు, వాటి ఆర్మీనియా-ఇరాన్ మూలాలను కూడా ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటూ ముందుకు వెడదాం.
***
పైన పేర్కొన్న మైకాప్ సంస్కృతీ గురించే కాక, స్టెప్పీలతో ముడిపడిన వివిధ సంస్కృతుల గురించి డేవిడ్ డబ్ల్యు. ఆంథోనీ తన The Horse The Wheel And Language అనే పుస్తకంలో చాలా విస్తారంగా, సచిత్రంగా రాశాడు. అలాగే, బిజినెస్ వరల్డ్ మాజీ సంపాదకుడు, కాలమిస్టు అయిన టోనీ జోసెఫ్ (Tony Joseph) తన ‘ఎర్లీ ఇండియన్స్ (Early Indians)’ అనే పుస్తకంలో మైకాప్, యామ్నాయ సంస్కృతుల గురించి స్పృశించాడు. నూతన జన్యుపరిశోధనల వెలుగులో, ప్రధానంగా భారత్ జన్యుచిత్రాన్ని ఆవిష్కరిస్తూ రాసిన పుస్తకం ఇది.
సమాధి దిబ్బలు…కుర్గన్లు
పైన చెప్పిన మైకాప్ సంస్కృతికి చెందిన జనాలు చనిపోయిన పోయినవారి కోసం, సాధారణంగా కొయ్యతో ఒక సమాధిగది నిర్మించి దాని పై రాళ్ళు, మట్టి పోగేసి దిబ్బలను తయారుచేసేవారు. వీటిని ‘కుర్గన్(kurgan)’ అంటారు. ఈ మాట టర్కీభాషల్లో ఒకటైన కిప్చాక్ (Kipchak)కు చెందిన మాట. దీనికి కోట, లేదా దుర్గం మొదలైన అర్థాలున్నాయి. మరియా గింబ్యూటస్(Marija Gimbutas) అనే పురాతత్వ శాస్త్రవేత్త మొదటిసారి 1950లలో ఈ కుర్గన్ ల గురించిన ఊహాసిద్ధాంతాన్ని ప్రతిపాదించింది, ‘ఎర్లీ ఇండియన్స్ (Early Indians) నుంచే ఉటంకించుకుంటే, ఈ కుర్గన్ల నిర్మాణంతో సహా మైకాప్ సంస్కృతి ప్రభావం యామ్నాయ జనం మీద బాగా పడింది. సంస్కృతంతో సహా నేటి ఇండో-యూరోపియన్ భాషలన్నింటికీ మాతృక అయిన ప్రోటో-ఇండో-యూరోపియన్ భాష యామ్నాయ జనాల భాష కావడానికి ముందు కాకసస్ ప్రాంతంలోనే మొదట మాట్లాడి ఉండవచ్చునన్న అభిప్రాయం తరచు వ్యక్తమవుతూ ఉంటుందని టోనీ జోసెఫ్ అంటాడు.
లోహ పరిజ్ఞానంలో పై చేయి
చక్రమూ, బండీ, గుర్రమూ కూడా మైకాప్ జనం నుంచే యామ్నాయ జనానికి అందాయనీ, ఇవి యామ్నాయ జనం చరిత్రను కీలకమైన మలుపు తిప్పాయని గత వ్యాసభాగాలలో చెప్పుకున్నాం. నిజానికి యామ్నాయ జనం ఒక్కరి చరిత్రనే అవి మలుపు తిప్పాయనడం పొరబాటు; వారి ద్వారా భారతదేశం సహా మొత్తం యూరేసియా చరిత్రనే అవి మార్చివేశాయి. ఈ యామ్నాయ జనాల సంచార జీవనం అప్పటికే ఉన్న అనేక స్థిరజనావాసాలను నిర్మానుష్యం చేసివేసింది.
యామ్నాయ జనం అడుగుపెట్టిన ప్రతిచోటా వారు మృతులకు నిర్మించుకుంటూ వెళ్ళిన కుర్గన్లు మాత్రమే మిగిలాయి. వీరికి ముందున్న మైకాప్ సంస్కృతీజనాలకు, దక్షిణాన మెసపొటేమియాలోని ఉరుక్ నాగరికతకు చెందిన జనాలకు మధ్య ఆనాడు వర్తక సంబంధాలుండేవి. మెసపొటేమియాలో లోహసంపద లేదు కనుక అక్కడివారు కాకసస్ జనాలకు తమ వస్తువులు ఇచ్చి వారి దగ్గరి నుంచి లోహాలు తెచ్చుకునేవారు. ఈ వర్తక వారసత్వాన్ని యామ్నాయ జనం కూడా అందిపుచ్చుకోవడమే కాదు, లోహ పరిజ్ఞానంలో కూడా పైచేయిని సాధించారు. ఈ లోహపరిజ్ఞానమే ఘర్షణలలో, యుద్ధాలలో కీలకంగా మారి వీరికి తోడ్పడింది.
రెండు రకాల జన్యువారసత్వం
డేవిడ్ రైక్ నే కనుక మరోసారి ఉటంకించుకుంటే, 5వేల సంవత్సరాల క్రితం ఈ యామ్నాయజనం మధ్యయూరప్ లోకి ప్రవేశించేనాటికి అక్కడ రెండు రకాల జన్యు వారసత్వం కలిగిన జనాలున్నారు. అప్పటికి నాలుగువేల సంవత్సరాల క్రితం అనటోలియా నుంచి వచ్చిన తొలి వ్యవసాయజనాల ద్వారా సంక్రమించిన జన్యు వారసత్వం వాటిలో ఒకరకమైతే, అప్పటికే ఎంతో కాలంగా అక్కడున్న వేట-ఆహార సేకరణజనాల ద్వారా సంక్రమించినది ఇంకొక రకం. అయితే, మొదటి రకంతో పోల్చితే రెండవ రకం చాలా స్వల్పం. సరిగ్గా ఇదే కాలంలో యామ్నాయకు చెందిన మరో శాఖవారు దూరప్రాచ్య యూరప్ లోకి అడుగుపెట్టారు. వీరిది భిన్నమైన జన్యునిర్మాణం. ఇందులో తూర్పు యూరప్ కు చెందిన వేట-ఆహారసేకరణజనం, ఇరాన్ సంబంధజనాల జన్యువారసత్వం దాదాపు సమపాళ్లలో కలిసింది. ఈ 5వేల సంవత్సరాల వెనకటి కాలానికి యూరప్ వ్యవసాయజనం-యామ్నాయ సంబంధం కలిగిన స్టెప్పీజనాల మధ్య సాంకర్యం జరగలేదు.
కోడెడ్ వేర్ సంస్కృతి
మధ్యయూరప్ లో స్టెప్పీ సంబంధమైన జన్యువారసత్వాన్ని అందించిన జనాలను ‘కోడెడ్ వేర్ (Corded Ware)’ సంస్కృతికి చెందిన జనంగా పురాతత్వ శాస్త్రజ్ఞులు సంకేతించారు. మెలితిరిగిన తాడు ముద్రలున్న కుండల నిర్మాణశైలిని తెలిపే మాట అది. యూరప్ లో స్విట్జర్లాండ్ నుండి రష్యావరకూ -సువిశాలప్రాంతానికి ఈ సంస్కృతి విస్తరించింది. జర్మనీలో ఈ కోడెడ్ వేర్ తో సమాధి చేసిన జనాలలో 75 శాతం మేరకు యామ్నాయ జన్యువారసత్వం, మిగతా 25శాతం మేరకు అనటోలియాకు చెందిన వ్యవసాయజనాల వారసత్వం కనిపించాయి. ఉత్తర యూరప్ లో ఆ తర్వాతి కాలానికి చెందిన అన్ని సంస్కృతుల జనాలలోనూ స్టెప్పీ జన్యువారసత్వం కొనసాగింది.
యామ్నాయ సంస్కృతీజనానికీ, కోడెడ్ వేర్ సంస్కృతీజనానికీ మధ్య సంబంధాలు ఉన్నాయా, లేదా అన్న విషయంలో పురాతత్వశాస్త్రజ్ఞులలో అంతవరకూ అభిప్రాయ భేదాలు ఉంటూ వచ్చాయి. వాస్తవానికి పశ్చిమానికి విస్తరించిన యామ్నాయ సంస్కృతే కోడెడ్ వేర్ సంస్కృతన్న సంగతిని తాజా జన్యుసమాచారం స్పష్టం చేసినదని డేవిడ్ రైక్ అంటాడు. పెద్ద పెద్ద సమాధి దిబ్బ (కుర్గన్)లను నిర్మించడం, గుర్రాలమీద, పశుపోషణ పై ఆధారపడిన ఆర్థికత మీద ఎక్కువగా ఆధారపడడం, హింసవైపు మొగ్గడం, పురుష కేంద్రిత జీవనవిధానం మొదలైన అంశాలలో ఈ రెండు సంస్కృతుల మధ్య పోలికలు కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి.
***
ఇలాంటి ఇంకా అనేక వివరాలలోకి వెడుతున్నకొద్దీ, మనదేశంతో సహా అనేక దేశాలుగా యూరేసియాను విభజిస్తున్న నేటి కృత్రిమమైనసరిహద్దులు అన్నీ చెరిగిపోయి; అన్ని ప్రాంతాలూ, అందరు జనాలూ ఒకటిగా కలిసిపోయి; స్వేచ్ఛగా ఒకచోటి నుంచి ఒక చోటికి రాకపోకలు సాగిస్తున్న ఒక విలక్షమైన ఊహాచిత్రం కళ్ళకు కడుతుంది. స్టెప్పీజనాలు అడుగు పెట్టడానికి ముందు యూరప్ స్థితిగతులు ఎలా ఉండేవో- The End of Old Europe and the Rise of the Steppe- అనే శీర్షికతో డేవిడ్ ఆంథోనీ చెప్పుకుంటూ వచ్చిన వివరాలు, కేవలం యూరప్ గురించే కాక, మనదేశం గురించి కూడా చెబు తున్నట్టు ఉంటాయి. ఇప్పటికి 6వేల 2వందల సంవత్సరాలకు మించిన వెనకటి కాలంలో పురాతన యూరప్ ఎంతో ఉచ్చదశలో ఉండేదట. మృతులకు వైభవోపేతంగా అంత్యక్రియలు జరిగేవట. ఆ పైన, వేలకొద్దీ జనావాసాలు ఉండేవి. సమాధుల్లో వేల సంఖ్యలో బంగారు ఆభరణాలు బయటపడ్డాయి. అప్పటి యూరప్ జనాలు బహుశా మాతృస్వామికులు, లేదా అమ్మవారిని ఆరాధించేవారని సూచిస్తూ ప్రతిచోటా స్త్రీ ప్రతిమలు కనిపించాయి. బంగారం, రాగి వంటి విలువైన లోహాలు కొందరికే పరిమితం కావచ్చుకానీ, అవి కీలకం కావనీ; భూమి, కలప, శ్రామికశక్తి, జీవితభాగస్వామి మొదలైన-జీవించడానికి అవసరమైన కీలక వనరులు మాత్రం అందరికీ అందుబాటులో ఉండేవనీ డేవిడ్ ఆంథోనీ అంటాడు. ఈ కారణాల వల్ల ఏదో ఒక ప్రాంతమో, పట్టణమో, జనాలో ఇతరుల పై పెత్తనం చేసే అవసరం, అవకాశం నాటి యూరప్ వ్యవసాయ సమాజంలో తలెత్తలేదని ఆయన అంటాడు.
యూరప్ నాటకీయ పతనం
ఆ తర్వాత వందేళ్ల స్వల్పకాలంలోనే వాతావరణంలో మార్పు రావడం మొదలై శీతాకాలాలు మరింత శీతలమయ్యాయి. 140 ఏళ్లపాటు అతిశీతల వాతావరణం కొనసాగింది. దిగువ డాన్యూబ్ నదీలోయలో చాలా తరచుగా వరదలు సంభవించడంతో భూసారం కొట్టుకుపోయి సేద్యయోగ్యత తగ్గింది. కొన్నిచోట్ల ఎక్కువ శీతల వాతావరణాన్ని తట్టుకోగల వరి(rye)సాగు మొదలైంది. ఇవీ, బహుశా మరికొన్ని ఒత్తిడులు పెద్ద సంక్షోభానికి దారితీయించాయనీ; ఆ తర్వాత సాపేక్షంగా శీతల వాతావరణం తగ్గినా, నాటి బాల్కన్ దేశాల సంస్కృతుల్లో నాటకీయమైన మార్పులు వచ్చాయనీ డేవిడ్ ఆంథోనీ అంటాడు, ఉదాహరణకు, గృహసంబంధమైన తంతుల్లో స్త్రీ ప్రతిమలను తరచు వాడడం తగ్గిపోయింది; ఆభరణాలు ధరించడం కూడా ఆగిపోయింది; మంచి పనితనం చూపే కుండలకు బదులు సాదాసీదా కుండల తయారీ ప్రారంభించారు; స్థిర జనావాసాలలో జీవించడం తగ్గి, పశుపాలన మీద ఎక్కువ ఆధారపడుతూ వచ్చారు. ఈ పరిణామాలతో పాటు లోహపరిశ్రమ, గనుల తవ్వకం మొదలైనవి కూడా హఠాత్తుగా ఆగిపోయాయనీ; ఈ విధంగా పాత యూరప్ పతనం కావడానికి వాతావరణంలో వచ్చిన మార్పులు, వ్యవసాయ వైఫల్యాలు, అంతస్సంఘర్షణలు, కలప, రాగి సరఫరా తగ్గడంతో పాటు స్టెప్పీజనాలు అడుగుపెట్టడం కూడా కారణమనీ ఆయన అంటాడు.
సింధునాగరిక ప్రాంతాలలోనూ డిటో
ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే, ఈ యూరప్ అనుభవానికి మరో వెయ్యేళ్ల పైబడిన అనంతరకాలంలో మనదేశంలో సంభవించిన పరిణామాల ప్రతిబింబాన్ని పై వివరాల అద్దంలో స్పష్టంగా చూసుకోవచ్చు. ఇండో-యూరోపియన్ జనాలు, అంటే ఇంతకు ముందు చెప్పుకున్న యామ్నాయ జనాల వారసులు మనదేశంలోకి అడుగుపెట్టేనాటికి ఇక్కడున్న సింధునాగరిక ప్రాంతాలలో వ్యవసాయం ఉచ్చదశలో ఉంది. యూరప్ లో ఉన్నట్టే ఇక్కడ కూడా స్థిరజనావాసాలు ఉండేవి. యూరప్ లో లానే ఇక్కడ కూడా సరస్వతీ నది అంతర్థానానికి దారితీసిన వాతావరణం మార్పులలాంటివీ సంభవించి ఇండో-యూరోపియన్ జనాలు సింధుప్రాంతం నుంచి మరింత తూర్పుగా చొచ్చుకు రావడానికి, దాని పర్యవసానంగా స్థానికులతో వారికి ఘర్షణలు తలెత్తడానికీ దారి తీయించాయి. ఈ పరిణామక్రమం మొత్తంలోకి ఇప్పుడు లోతుగా వెళ్లలేము కానీ, ఇక్కడ ప్రత్యేకించి మనకు ఆసక్తి కలిగించే విషయమేమిటంటే; మన వేద, పురాణ, ఇతిహాసాలలో ఈ పరిణామాల ఛాయలను స్పష్టంగా పోల్చుకోవచ్చు.
ఒక్క ఉదాహరణ చెప్పుకుంటే, కోడెడ్ వేర్ సంస్కృతీజనాలు మధ్యయూరప్ లోకి అడుగుపెట్టేనాటికి అక్కడి అనేక సాగుభూముల చుట్టూ దట్టమైన అడవులు వ్యాపించి ఉన్న సంగతిని డేవిడ్ రైక్ ప్రస్తావిస్తాడు. ఇదే కాలంలో ఉత్తర యూరప్ లో పాక్షికంగా అడవులుగా ఉన్న ప్రాంతాలు గడ్డిభూములుగా మారిపోయాయి. అంటే, కొత్తగా వచ్చిన కోడెడ్ వేర్ జనాలు అడవులను నరికి కొన్ని ప్రాంతాలను స్టెప్పీ తరహాలోకి మార్చుకున్నారన్నమాట. ఇది స్థానిక వ్యవసాయజనాలకు, అక్కడికి వలస వచ్చిన స్టెప్పీజనాలకూ మధ్య అక్కడక్కడ తప్పనిసరిగా ఘర్షణలను సృష్టించే ఉంటుంది. మన దేశంలో ఇలాంటి ఘర్షణల అవకాశాన్ని ఇంద్ర-వృత్రాసురుల ఘర్షణ, వృత్రాసురవధ లాంటి ఘట్టాలు స్పష్టంగా సూచిస్తాయి.
ఖాండవదహనం ఉదాహరణ
ఆ తర్వాత ఇండో-యూరోపియన్ నేపథ్యం ఉన్న జనాలు మనదేశంలో వ్యవసాయానికి మళ్లిన దశ కనిపిస్తుంది. ముఖ్యంగా భరతవంశ క్షత్రియులు వ్యవసాయ విస్తరణలో ముఖ్యపాత్ర పోషించినట్టు- పౌరాణిక, తదితర ఆధారాల రీత్యా రాంభట్ల వంటి పండితులు అన్వయించారు. మహాభారతంలో ఖాండవదహనమే ఇందుకు తిరుగులేని ఉదాహరణ. ఇంతకు ముందు చెప్పుకున్నట్టు కృష్ణుడు సహాయకుడిగా ఖాండవవనాన్ని దహించడంలో భరతవంశ క్షత్రియుడైన అర్జునుడు నాయకపాత్ర పోషించాడు. అంతకు ముందు కూడా అనేకసార్లు ఆ ప్రయత్నం జరగగా. ఆ అడవిని ఆశ్రయించుకుని ఉన్న జనాలందరూ ఏకమై దానిని విజయవంతంగా ప్రతిఘటించారనీ, ఈసారి మాత్రం కృష్ణార్జునుల ఆయుధబలం ముందు నిర్వీర్యులైపోయి ఆక్రమణకు దారి ఇచ్చారనీ మహాభారతం చెబుతుంది.
శతపథ బ్రాహ్మణంలో అటవీదహన ఘట్టం
డి. డి. కోశాంబీ An Introduction to the Study of Indian History అనే తన పుస్తకంలో, ‘ఆర్యు’ల అడవుల నిర్మూలన పద్ధతిని శతపథ బ్రాహ్మణం నుంచి ఇలా ఉదహరిస్తాడు:
“విదేహమాధవుడు ఆ సమయంలో సరస్వతీనది దగ్గర ఉన్నాడు. పవిత్రుడైన అగ్ని భూమిని దహిస్తూ తూర్పుగా సాగిపోయాడు. పురోహితుడైన గౌతమ రహుగణుడు, రాజైన విదేహమాధవుడు అగ్నిని అనుసరించి వెళ్లారు. అగ్నివైశ్వానరుడు నదులన్నింటినీ ఎండిపోయేలా చేశాడు కానీ, ఉత్తరపర్వతం (హిమాలయం) నుంచి ప్రవహించే ‘సదానీర’ అనే నదిని మాత్రం ఎండిపోయేలా చేయలేదు. అగ్ని దహించని కారణంగా వెనకటి కాలంలో బ్రాహ్మణులు ఎవరూ ఆ నదిని దాటి వెళ్లలేదు. ఇప్పుడు ఆ నదికి తూర్పున చాలా మంది బ్రాహ్మణులు ఉన్నారు. ఇంతకు ముందు కాలంలో అగ్నివైశ్వానరుడు రుచి చూడనందు వల్ల సదానీర నదికి తూర్పున ఉన్న భూములు సాగుకు దూరంగా, చిత్తడి నేలలుగా ఉండిపోయాయి. కానీ బ్రాహ్మణులు యజ్ఞాల ద్వారా వాటిని అగ్నికి రుచి చూపించడంతో ఇప్పుడవి సాగుయోగ్యంగా మారాయి. నడివేసవిలో కూడా ఈ నది పొంగి ప్రవహిస్తూ ఉంటుంది. అగ్ని దహించని కారణంగా ఈ నదిలోని నీరు ఎంతో చల్లగా ఉంటుంది.
“నేను ఎక్కడ నివసించాలి?” అని విదేహమాధవుడు అగ్నిని అడిగాడు. “ఈ నదికి తూర్పున నివసించ”మని అగ్ని అన్నాడు. ఇప్పటికీ కోసల జనానికి, విదేహజనానికి ఈ నదే సరిహద్దు.”
ఆర్యులు హిమాలయపాదాల దగ్గర ఉన్న అడవులను దహిస్తూ తూర్పుదిశగా సాగారనీ, అడవి అంతరించిన నేల పొడిబారిపోయిందనీ; అంతలో ఒక హిమానీనదం నుంచి పుట్టిన నది (సదానీర) తమ గమనాన్ని కొంతకాలం పాటు అడ్డుకున్నా, ఆ తర్వాత పై పద్ధతిలోనే అడవులను దహిస్తూ ఆర్యులు ముందుకు సాగి చివరికి తూర్పున స్థిరపడ్డారనీ దీనికి కోశాంబీ వివరణ.
*****
(సశేషం)
సాహిత్య విమర్శకుడిగా, పత్రికా రచయితగా, రాజకీయ విశ్లేషకుడిగా, అనువాదకుడిగా, కాలమిస్టుగా, కథా రచయితగా కల్లూరి భాస్కరం తెలుగు పాఠకులకు పరిచితులు. ఆయన వివిధ తెలుగు పత్రికలలో పనిచేశారు. సాహిత్య విమర్శలోనే కాక, రాజకీయ సామాజిక అంశాలలోనూ కొత్త ఆలోచనలను పరిచయం చేసిన వ్యక్తిగా గుర్తింపు పొందారు. పురాచరిత్ర, మానవ పరిణామ చరిత్రల పై ప్రత్యేక ఆశక్తి, అధ్యయనంతో అనేక వ్యాసాలు రచించారు.
‘కాళికస్పృహ – మరికొన్ని సాహిత్య వ్యాసాలు’, ‘కౌంటర్ వ్యూ (ఆంధ్రప్రభలో రాసిన వీక్లీ కాలమ్)’, ‘అవతల’ (వార్తలో రాసిన రాజకీయ, సామాజిక వ్యాసాలూ), ‘గ్లోబల్ సందర్భంలో నగ్నముని కొయ్యగుర్రం’, ‘లోపలి మనిషి’ (భారత మాజీ ప్రధాని పి.వి. నరసింహారావు రచన ‘ది ఇన్సైడర్’కు తెలుగు అనువాదం), ‘మోహన్ దాస్’ (రాజ్ మోహన్ గాంధీ ఆంగ్లంలో రాసిన గాంధీజీ చరిత్రకు తెలుగు అనువాదం) కల్లూరి భాస్కరం ముద్రిత రచనలు. మహాభారతంలోని మన చారిత్రక మూలాలను తవ్వి తీసే ప్రయత్నంలో ఈ రచన తొలిభాగం మాత్రమే. మహాభారతం ఆధారంగా ఆయన రచించిన మరికొన్ని పుస్తకాలు త్వరలో ముద్రణ కాబోతున్నాయి.