నాగరీక పంకిలాన్ని కడిగేసిన బతుకు చిత్రం- రేవతి రాసిన ఒక హిజ్రా ఆత్మ కథ
-వి.విజయకుమార్
ఇవ్వాళ తృతీయ ప్రవృత్తి గురించి మాట్లాడటం మరీ అంత ఘోరమైన విషయమేమీ కాదు! నిన్న మొన్నటిదాకా వారి పట్ల సానుభూతిని కలిగివుండటం, వారి సమస్యల పట్ల మాట్లాడటం కూడా ఒక వింత!
రక్త మాంసాలూ, హృదయ రాగాలూ అన్నీ వున్నా జెనిటిక్ ఇంజనీరింగ్ లో జరిగిన యే అపసవ్యత వల్లో అటు పురుషుడి లక్షణాలనో, ఇటు స్త్రీ లక్షణాలనో సంపూర్ణంగా పొందకుండా ద్వి లైంగిక లక్షణాల్ని పొంది ప్రపంచానికి పరాయివారైపోయిన వెలి బతుకుల సజీవ చిత్రమిది.
ప్రపంచం వీరిని పరిహరిస్తోంది, పరిహసిస్తోంది. అంధుల్ని హేళన చేయడాన్ని అమెరికన్ సామాజిక సేవకురాలు హెలెన్ కెల్లర్ స్వయంగా ఎదుర్కొన్నారు. నల్ల జాతీయుల పై వివక్ష మొన్నమొన్నటి దాకా చూస్తూనే వున్నాం! వికలాంగుల పట్ల అపహాస్య ధోరణి ఇప్పుడిప్పుడేగా తగ్గుతోంది?
ట్రాన్స్ జండర్ల పై ఘోర వివక్ష మానవజాతికి ఒక మాయని మచ్చ.
ఈ వివక్ష ఎంత క్రూరమైనదో, ఎంత హేయమైనదో రేవతి జీవితం చూశాక నిజంగా మనం మనుషులమైతే సిగ్గుతో చచ్చిపోతాం! కొద్ది పాటి మానవత్వపు ఛాయలున్నా ఒక అపరాధభావనతో కుంగిపోతాం!
తమిళనాడులో ఒక దిగువ మధ్య తరగతి కుటుంబంలో దొరైస్వామి అనే బాలుడిగా జీవితం మొదలు పెట్టారు రేవతి. నాటి నుంచి పదేళ్లు వచ్చే వరకూ మామూలుగా కొనసాగినా, తన శరీరం తనకి తెలియకుండానే బాలికల్లాగా కట్టూ, బొట్టూ, జుట్టూ అలంకరణ కోసం ఆరాటపడుతుండటం, దాంతో ఇంటా, బయటా అందరూ తన ఆరాటాల్ని అపహాస్యం చేయడం, అవమానాలతో కష్టాలు మొదలవ్వడం వెంట వెంటే జరిగిపోయాయి. కుటుంబమూ, సమాజమూ అలి అనీ, పొట్టయ్ అనీ, తొమ్మిదో నంబర్ అనీ, హిజ్రా అనీ చిన్న బుచ్చుతూ, హేళన చేస్తూ, నిరంతరం కాకుల్లా వెంటాడి వెంటాడి వేధించడంతో ఏం చేయాలో తెలియని ఆ పసి హృదయం అమ్మ చెవి కమ్మని అమ్మి తన లాంటి అభాగ్యులూ, భ్రష్టులూ బతికే వెలివాడల్లోకి వెళ్ళిపోవడానికి ఢిల్లీ రైలు ఎక్కేస్తుంది. ఢిల్లీ నగరపు గల్లీలు వెతుక్కుంటూ, తన వంటి వారిని బిడ్డలా ఆదరించే తనకు గతంలో తారసిల్లిన “అమ్మ” పంచన చేరుతుంది. ఆ అమ్మ కూడా ఒక హిజ్రానే.
దొరై స్వామి పిలుపు ఒక అబ్సెషన్ రేవతికి! ఆ హిజ్రా అమ్మ సాయంతో “నిర్వాణం” పొందుతుంది. నిర్వాణ ప్రక్రియ అంటే పురుషాంగాన్ని తొలగించి కొన్ని హార్మోన్లు తీసుకొని వక్షోజాలను పెంచుకొని ఇంచుమించు స్త్రీ అనిపించుకోవడం! ఆ ప్రక్రియ అత్యంత క్రూరంగా వున్నా తనని ఆవహించే స్త్రీత్వాన్ని సంతృప్తి పరచుకోవడం కోసం, “రేవతి” గా ఒక గుర్తింపు కోసం ఆ నరకాన్ని భరిస్తుంది.
ఢిల్లీ, ముంబాయి, బెంగళూరు ఎక్కడైతే ఏమిటి? అక్కడ వాడలన్నీ ఘోరాతి ఘోరమైన నరక కూపాలే! చీకటి రాత్రుళ్ళు రాళ్ళు విసిరే వీధి రౌడీలు, కళ్ళతో, మాటలతో తూట్లు పొడిచే మర్యాదస్తులు, వికృత కాముక క్రీడలకు ఈ నిర్భాగ్యపు అపరిపక్వ శరీరాల్ని అత్యంత జుగుప్సాకరంగా వాడేసుకునే బేవార్సులు. బ్లేడ్లతో కోస్తూ, నెత్తురోడేలా హింసిస్తూ, రాక్షసానందాన్ని పొందే అధో లోకపు పైశాచిక గణాల సమవాకారాలూ, మానవ మృగాల పహారాలూ సర్వ సాధారణం ఇక్కడ. జాలీ, కరుణా, దయా, కనికరం లేని మాంస వ్యాపార మది! ఇంక పోలీసు జులుం మరింత నీచం. యే కేసూ దొరక్కపోతే ఈఅర్భకుల్ని స్టేషన్ లోకి తీసుకెళ్ళి, బట్టలు విప్పించి, ఘోరంగా అవమానించి, తీవ్రంగా హింసించి, ఆపరేషన్ చేయించుకున్న భాగంలో, మల ద్వారాల్లో లాఠీతో పొడిచి, వాళ్ళు నొప్పితో విలవిల లాడుతున్నా, ఇసుమంత కనికరం లేకుండా, నిస్సిగ్గుగా వాళ్ళు అడుక్కొని సంపాదించుకున్న ఆ వందో, రెండువందలో కూడా లాక్కొని, తన్ని తరిమేసే ఆ దగుల్బాజీ పోలీసుల గురించి రేవతి చెప్పిన సందర్భాలు కంటతడి పెట్టిస్తాయి. వాళ్లే తప్పు చేయరు, కేవలం మర్యాదస్తులు తిరిగే రోడ్డు మీద తిరిగితే చాలు! ఈ దాస్టీకం ఏ క్షణంలో నైనా జరగొచ్చు! ఎటు నుంచైనా ముంచెత్తవచ్చు! ఎక్కడైనా పొంచి వుండొచ్చు! నిరంతరం భయం భయం!
రేవతిగా మారిన తర్వాత జీవితం నల్లేరు మీద బండి నడక కాలేదు! ఢిల్లీ, ముంబాయి వెలివాడల్లో ఆ అపరిపక్వ శరీరంతో అయిష్టంగానైనా బతకాలంటే రెండే దార్లు! ఒకటి దుకాణాల చుట్టూ ముష్టి ఎత్తుకోవడం, లేదంటే వికృత కాముక క్రీడలకు లొంగిపోవడం! ఆ వచ్చిన డబ్బులు తనకి నీడ నిచ్చే హమామ్ “అమ్మ” చేతిలో పోయడం! యే హిజ్రాకైనా ఇదే జీవితం! అప్పుడప్పుడూ ఇంటికి వచ్చి వెళ్లేప్పుడు ఇంట్లో సైతం అవమానాలే, ఆస్తిలో వాటా రాదంటారు అన్నలు, డ్రైవింగ్ లైసన్సు ఇవ్వనంటుంది ఆర్టీఓ ఆఫీసు. కుటుంబాన్ని వీడలేక ఒక వైపు, అనునిత్యం అవమానించే సమాజం నుంచి పారిపోలేక ఇంకోవైపు, కొద్దో గొప్పో తన మనో వేదనల్ని అర్థం చేసుకొనే హమామ్ లోనూ బతకలేక, ఆత్మహత్య కూడా చేసుకోలేక రేవతి అనుభవించిన శాపగ్రస్త జీవితం గుండెల్ని పిండేస్తుంది.
చిక్కని చీకట్లో మిణుగురు వెలుగులా “సంగమం” అనే స్వచ్ఛంద సంస్థలో చేరిన తర్వాత రేవతి ఎన్నో యేళ్ళుగా తపిస్తూ వస్తోన్న వైవాహిక జీవితాన్ని ఒక సహోద్యోగితో ప్రారంభిస్తుంది. వారిరువురికీ పొరపొచ్చాలు రావడంతో సంవత్సరం తిరగక మునుపే ఆ జీవితం ముగిసిపోతుంది. ఉన్న కొద్దిపాటి ఆస్తి పంచడానికి వెయ్యి షరతులు పెట్టే అమ్మా నాన్నలతో విసిగి వేసారి, నిరంతరం తను కడుపు కొట్టుకొని సంపాదించిన ఆ కాసిని డబ్బులు ఆ అన్నలకూ, వారి సంతానానికి ఇచ్చేసి మళ్లీ తనకు అలవాటైన జీవితాన్ని వెతుక్కొని వెనుదిరుగుతుందామె!
“సంగమం” తన లాంటి పతితుల, భ్రష్టుల కోసం పనిచేస్తుంది, ఎందరో తన లాంటి అభాగ్యుల సమస్యల పట్ల సానుభూతిని చూపి, ఎందరికో వెలుగుదారి చూపే ప్రయత్నం చేస్తోంది. అటువంటి సంస్థలో పనిచేస్తూ తన లాంటి వారి కోసం, కొంచెం ఆత్మవిశ్వాసమూ, తల దాచుకునేందుకు ఇంత గూడూ, రవ్వంత ఆత్మ గౌరవమూ కల్పించి బతుకు తెరువు కోసం మార్గాలు చూపుతుంది.
ఆద్యంతం హృదయ విదారకం, అయినా గాఢాంధకారంలో చిరువెలుగు రేవతి జీవితం. మనిషిగా పుట్టినా, తాము యే రకంగానూ బాధ్యులు కాకపోయినా, ఒక జీవ వైకల్యాన్ని పొందినందుకు, నిరంతరం ఎద్దేవ చేసే ఈ సభ్య సమాజానికి, ఈ మర్యాదస్తుల ప్రపంచానికి, ఆర్తిగా చేసుకునే ప్రార్థనేమో అనిపిస్తుంది! “మమ్మల్ని మనుషులుగా చూడండి చాలు!” అంటూ మొరపెట్టుకొనే వేడికోలేమో అనిపిస్తుంది! మీలో ఎక్కడైనా అటువంటి భావన వుంటే తక్షణమే మిమ్మలి ప్రక్షాళన చేసే కెథార్సిస్ నేమో అనిపిస్తుంది! పి. సత్యవతి గారి అనువాదంలో ఇది విషాద గాంధర్వం వినిపిస్తుంది.
*****
నేను ఆంగ్ల సాహిత్యం మరియు అర్ధశాస్త్రం లో ఎం.ఏ చేశాను. అయిల సైదా చారి గారి రెండు కవితా సంపుటాలూ, అందెశ్రీ గారి కొన్ని పోయెమ్స్, దెంచె నాల గురితప్పిన పద్యం కవితా సంపుటి ఇంగ్లీష్ అనువాదాలు చేశాను. అంగార స్వప్నం లో కూడా కొన్ని అనువాదాలు చేశాను. రంగనాయకమ్మగారూ, గాంధీ గారు సంకలనం చేసిన వర్గాల గురించి పుస్తక అనువాదం ఇటీవల విడుదల అయింది. మరికొన్ని అనువాదాలు పుస్తకాలు గా వెలువడ్డాయి.నా సమీక్షలూ, కవితలూ, వ్యాసాలూ, తెలుగు పత్రికల్లో వస్తుంటాయి. సారంగ లో, కౌముదిలో ఒకటీ రెండూ వచ్చాయి. మీ పత్రికకి పంపడం ఇదే ప్రథమం. సాహిత్య ప్రపంచానికి నాది పూర్తిగా కొత్త మొహం.