నా అంతరంగ తరంగాలు-2

-మన్నెం శారద

 “Painting is just another way of keeping a diary.”……….Pobolo Picasso
***

          ఇంట్లో నేను పని దొంగనని పేరుంది గానీ నేను చాలానే పని చేసేదాన్ని. వంటపని అంటే మాత్రం నాకు గిట్టేది కాదు. (తర్వాత అన్నీ నేర్చుకున్నాననుకోండి ). అలానే మిషన్ మీద బట్టలు కుట్టడం కూడా .

          పాతసినిమాల్లో బీదవాళ్లంతా మిషన్ కుట్టి సంసారాలు పోషించడం చూసి నాకు విరక్తి వచ్చేసింది. ఎప్పుడయినా ట్రై చేసినా దారం ఉండలుగా చుట్టుకుపోయేది. ఛీ, ఇది మన బిజినెస్ కాదనుకుని చేతికుట్టుతో అందంగ కర్టెన్స్ చేతిరుమాళ్ళు, పిల్లో కవర్స్, సోఫా కవర్స్ కుట్టి వాటి మీద పెయింట్ చేసేదాన్ని. ఇప్పటికీ ఏదో ఒకటి చేతితో కుట్టడం, పూలు కట్టడం మానలేదు. 

          మొక్కలకి ఎరువులువేసి అందంగా తోట పెంచేదాన్ని. ఇంటిని నీట్ గా ఉంచడం, ఆర్టిస్టిక్ గా పెట్టడం నాకు ఇష్టమైన పనులు.

          కానీ, మా వాళ్ళ ద్రుష్టిలో ఇవి పనికిందకు లెక్కకు వచ్చేవి కావు. ఏ వూరిలో జాబ్ చేసినా నాన్నకు గవర్నమెంట్ క్వార్టర్స్ ఇచ్చేవారు. అది పోస్టాఫీస్ పక్కనో, మేడమీదో ఉండేది. ఎక్కడున్నా నాకు వరండాలో ఒక చిన్నగది దొరకడం నా అదృష్టంగా చెప్పు కోవాలి. ఇక అక్కడే నా మకాం !

          ఒక చిన్న టేబుల్, కుర్చీ వేసుకుని అక్కడే నా చదువు,పెయింటింగ్స్, రచనలు , పాటలు, ఆటలూ …. మా సిస్టర్స్ తో జోక్స్ ….నవ్వులూ …అన్నీ అక్కడే !

          నిన్న మా వీధి కౌన్సిలర్ ఎలా రోడ్డుకూడలిలో నిలబడి మాట్లాడిందో. అటుమొన్న నా కిటికీ దగ్గర తాగుబోతులు ఎలా ఒకరికొకరు నమస్కారాలు పెట్టుకుని తెల్లవార్లు మాట్లాడుకున్నారో చెబుతుంటే మా సిస్టర్స్ పగలబడి నవ్వేవారు. ఆ విధంగానే కాలేజీలో చదివినన్నాళ్ళూ నాదే ఇమిటేషన్ లో ఫస్ట్ ప్రయిజ్ ! కష్టేఫలి కదా !

          అమ్మ చదువుతున్నామో లేదో అని సడెన్ చెకింగ్స్కి వచ్చేది. వెంటనే సైగలు చేసుకుని పుస్తకాల్లో తలదూర్చేసేవాళ్ళం అయినా అమ్మ నమ్మేదికాదు . “ఇందాక నవ్వులు వినిపిస్తున్నాయి వేషాలేస్తున్నారా ?” అని నా వంక అనుమానంగా చూసేది.

          “ఏంటి నా వంక చూస్తావ్ …నేనసలు ఈ డెరివేషన్ సాల్వ్ కాక చస్తుంటే ….” అనేదాన్ని దబాయింపుగా .

          “వూ …ఈ సారి నవ్వులు వినిపించాలి… ” అంటూ అమ్మ కోపంగా వెళ్ళిపోగానే మళ్ళీ అందరం కిచకిచ నవ్వు లూ. నవ్వడమే ఒక తప్పుగా భావించే కుటుంబంలో పుట్టి సందు దొరికితే తెగ నవ్వడమే పనిగాపెట్టుకుని పెరిగాం మేము. ఇంత కోపిష్టి అమ్మ బొమ్మలు వేస్తుంటే మాత్రం ఏమీ అనేది కాదు. అది మా అదృష్టం ! మా సిస్టర్స్ అందరం కాస్తో కూస్తో ఆర్ట్ తెలిసిన వాళ్ళమే ! అందరం బొమ్మలు వేసేవాళ్ళం. ఖాళీ వున్నప్పుడు వచ్చి బొమ్మలు పరిశీలించి లోపాలు చెబుతుండేది అమ్మ. ఏది చేసినా చదువు తర్వాతనే. అలా మేము వడ్డాదిపాపయ్య, బాపూ, జెపి సింఘాల్ బొమ్మలు ప్రాక్టీస్ చేస్తుండగా నా చదువు పూర్తయింది.

          నాన్న అప్పుడు గుంటూరు అగ్రహారం పోస్టుమాస్టర్ గా వర్క్ చేస్తున్నారు. మేడమీద మేము…క్రింద పోస్ట్ ఆఫీస్.

          జాబ్ కోసం ఎంప్లాయిమెంట్ ఆఫీస్ లో పేరు నమోదు చేశాను. నాకు ఆ రోజు ఎంప్లాయిమెంట్ ఆఫీస్ నుండి పిలుపు వచ్చింది. అది ఆర్టిస్ట్ కం డ్రాఫ్ట్స్మన్ పోస్ట్ కి. ఆర్టిస్ట్ అని చూడగానే ఎగిరి గంతేసాను. ఎవరికీ చెప్పకుండా ఎంప్లాయ్ మెంట్ ఆఫీస్ కి పరిగెత్తేను. జాబ్ వచ్చేక చెప్పి థ్రిల్ కలిగించాలని. మా ఎదురు సందులోంచి వెళ్లి కుడి వైపు తిరిగితే హిందూ కాలేజీ, దాని పక్కనే ఎంప్లాయిమెంట్ ఆఫీస్. ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ గారికి విష్ చేసి నా సర్టిఫికెట్స్ చూపించాను. ఆయన వయసు యాభైయి ఉండొచ్చు. సఫారీ డ్రెస్సు వేసుకున్నారు. నన్ను కళ్లద్దాల్లోంచి పరిశీలనగా చూస్తూ “ఇవి నీవేనా.. ఎత్తుకొచ్చేవా? ” అన్నారు వ్యంగ్యంగా.

          “నావే సార్ “అన్నాను ఏడుపుమొహంతో.

          ఇంకా ఏ టెన్త్ క్లాసో చదువుతున్నావనుకున్నానమ్మాయ్, అది సరేగానీ ఈ పోస్ట్ కి బొమ్మలు వేయాలి తెలుసా.. బొమ్మలు!”అన్నారు వత్తి పలుకుతూ.

          “వేస్తాను సర్!”అన్నాను ఉత్సాహంగా.

          “అమ్మపిల్లా, ఉద్యోగం కోసం వేసేస్తానంటున్నావా.. Art రావాలి!”అన్నారాయన వేళాకోళంగా నవ్వుతూ.

          నన్నుచూసి ఆయన ఆటపట్టిస్తున్నారని తెలిసి “వుండండి సర్, ఇప్పుడే వస్తా ” అంటూ ఇంటికి రివ్వున పరిగెత్తుకొచ్చి నేను వాటర్ కలర్స్, ఆయిల్ కలర్స్ లో వేసిన పెయింటింగ్స్ పట్టుకుని వెళ్లి చూపించాను. అవన్నీ వడ్డాదిపాపయ్య గారు దీపావళి యువ సంచికల్లో వేసినవి. వాటిని చూడగానే ఆయనకళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి.

          “ఏంటి పిల్లా, ఇవన్నీ నువ్వే వేసేవా… అయితే వెంటనే పో ఆఁ ఆఫీస్ కి, లగెత్తు!” అన్నారు. అన్నదే తడవు నేను అంతకంటే శరవేగంతో అక్కడకి రిక్షాలో వెళ్లాను. అది family planing training centre office. దాని డైరెక్టర్ జానకి సుబ్రహ్మణ్యం అని ఒక తమిళి యన్. మగ్గిన జామపండులా వున్నారు ఆమె. నా బొమ్మలు చూడగానే తెగ ముచ్చట పడిపోయారు. స్టాఫ్ నందర్నీ పిలిచి నా బొమ్మలు చూపించారు. స్టాఫ్ లో డాక్టర్స్,  సైకాలజిస్ట్ లు, వున్నారు. అందరూ ఇంప్రెస్ అయ్యారు. వెంటనే పోస్టింగ్ ఆర్దర్స్ వచ్చేసాయి. రివ్వున ఇంటికి వెళ్లి ముందు ఆఫీస్ లో వున్న నాన్నకి చూపించాను.
నాన్నకి ముందు అర్ధం కాలేదు. అర్ధమయ్యాక ఆయన మొహం వికసించింది.

          “ఒరేయ్, ఎప్పుడు వెళ్ళావ్ రా! Very good, కంగ్రాట్స్, “అని స్టాఫ్ కి చెప్పారు. నాన్నకు ఆర్ధికంగా సహాయ పడాలన్నదే.. అంతర్లీనంగా నా ఆశయం.

          అందరూ వెంటనే నన్ను మెచ్చుకుని నాన్నని పార్టీ అడిగారు.

          నేను గర్వం గా వెళ్లి అమ్మకి చూపించాను.

          అమ్మ అంత సంతృప్తి పడలేదు. “ఈ డిపార్ట్మెంట్ లో నీకు ఎదుగుదల ఏం ఉంటుంది ” అని పెదవి విరిచింది. కొన్నాళ్లపాటు ఆఁ జాబ్ సరదగానే గడిచింది. కానీ ఆఁ బొమ్మలు అన్నీ మెడికల్ ఛార్ట్స్. అందులో art లేదు. నాకు లైఫ్ లేదు. క్లాస్ లు జరుగు తుంటాయి. డాక్టర్స్, నర్సులు, హెల్త్ విజిటర్స్, హెల్త్ అసిస్టెంట్స్ బేచస్ గా వస్తుంటారు. నాకు బోర్ కొట్టి పదినెలల్లో Resign చేసేసాను. మా మేడం మాత్రం తెగ ఫీల్ అయ్యారు. అంత ప్రేమ ఆమెకు నేనంటే. త్వరలోనే ఆమె కూడా రిటైర్ అయి చెన్నై వెళ్లిపోయారని తెలిసింది. ఆఁ వెంటనే (R&B) డిపార్ట్మెంట్లో నాకు జాబ్ వచ్చింది. ఇక మొత్తం నా సర్వీస్ అంతా అందులోనే సాగింది.

*****

(సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.