నిన్నంతా మంచు ముసురు మేలి ముసుగుతో విందు చేసిన ఆకాశం ఈ రోజు ప్రకాశవంతంగా వెలిగిపోతున్నది. అక్కడక్కడ పేరుకుపోయిన మంచు, ముద్దలు కట్టింది. పచ్చటి లాన్ పై మంచు పిండి జల్లి ఆరబోసినట్లు ఉంది. ఆ మంచు పై పడిన ఎండ చూడడానికి ఎంతో అందంగా ఉన్నది. కానీ బయటకు వెళ్తే ఎండ వేడి ఏమీ తగలకపోగా చల్లటి గాలి ఈడ్చి కొడుతున్నది. మైనస్ డిగ్రీలో ఉన్న టెంపరేచర్ వల్ల నిన్నటి మంచు ఇంకా పూర్తిగా కరగలేదు.
రోడ్డు పై ఎక్కడ చూసినా తెల్లటి స్పటికాల ఉప్పు. మంచు కరిగి రోడ్డు పక్కన పల్లంలోకి చేరిన మురికినీరు. ఉప్పు స్పటికాలు, మంచు ముద్దలు భాను కిరణాలు పడి వెండి వెన్నెల్లా మెరిసిపోతున్నాయి. మోడువారిన చెట్ల కొమ్మల పైన పూసిన మంచు పూలు, క్రిస్మస్ చెట్ల పచ్చని ఆకుల పై అక్కడక్కడ దాక్కున్న శ్వేత వర్ణం ఇంటికి వెనుక వైపు కిటికీలోంచి విందు చేసే చెవుల పిల్లులు, బెదురు చూపుల జింకలు నిష్కలను ఎప్పుడూ ఆకట్టుకుంటాయి.
జీరో డిగ్రీ లలో, మైనస్ డిగ్రీల వాతావరణంలో కూడా రోజూ కనిపించే బాతులు, కుందేళ్లు , జింకలు మంచు కురిసే వేళల్లో ఎక్కడ ఉంటాయో.. ఎట్లా తమను తాము రక్షించుకుంటాయో అని సందేహం ఎప్పుడూ నిష్కలను వెంటాడుతూనే ఉంటుంది.
వెచ్చని టీ తాగుతూ, మంద్రంగా వచ్చే సంగీతంతో కలిపి ఆస్వాదించడం, బాతుల గురించో కుందేళ్లు జింకల గురించో ఆలోచించడం చేస్తూ ఉంటుంది నిష్కల. అది ఆమెకు ఎంతో ఇష్టమైన సమయం.
కానీ, ఈ రోజు ఆ మూడ్ లేదు. చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. బద్దకంగా .. చాలా బద్దకంగా ఉంది. ఏ పనీ చేయాలని అనిపించడం లేదు. ఏ పనీ చేయకపోయినా ఒక్కపూటకు కొంపలేమీ మునిగిపోవు కానీ, అమ్మకు ఫోన్ చెయ్యి అంటూ ఆమె లోపలి మనిషి మొట్టికాయ వేసింది.
అవును. నిజమే, అమ్మకు ఫోన్ చేయాలి. నిన్న కూడా అమ్మతో మాట్లాడలేదు.
అమ్మతో మాట్లాడకపోతే ఏదో వెలితిగా ఉంటుంది. ఈ రోజు మాట్లాడాలి. కానీ ఏంటో ఇప్పుడే మాట్లాడాలని లేదు.
ఎందుకింత బద్ధకం.. లే.. నిష్.. లే.. నువ్విలాగే ఉంటే అమ్మకి ఫోన్ చేయ్యకపోతే అమ్మ ఎంత కంగారు పడుతుందో నీకు తెలియనిది కాదు అంటూ తనకు తాను చెప్పుకుంది.
వెంటనే మొబైల్ అందుకుని అమ్మకు మెసేజ్ పెట్టింది. కొద్దిగా ఆగి ఫోన్ చేస్తానని.
ఆ ఆదివారం ఉదయం బద్దకంగా బెడ్ పై కదులుతున్నది నిష్కల. చేతిలో మొబైల్. ఫేస్బుక్ ఎక్కువగా ఆదివారం ఉదయం టీ తాగిన తరువాత తీరిగ్గా చూస్తుంది. కానీ ఇవాళ బెడ్ దిగకుండా ఫోన్ అందుకుంది. ఆన్ లైన్ లో ఉన్నట్లు గమనించిందేమో ‘హాయ్’ అంటూ మెసెంజర్ లో పలుకరించింది మేనత్త కూతురు సరిత. చాలా ఏళ్ళయి పోయింది ఒకరికొకరు కలిసి. అప్పుడప్పుడు సోషల్ మీడియాలోనే పలకరింపులు. పెళ్లయిన తర్వాత సరిత బిజీ అయిపొయింది. లేకపోతే ఎప్పుడూ ముఖపుస్తకంలోనే ఉండేది.
‘ఏమే సీమటపాకాయ్.. ఏమైపోయావ్.. ఎంత పెళ్లి చేసుకుంటే మాత్రం ముఖ పుస్తకాన్ని పలకరించకుండా.. చిన్నబోదూ.. ‘ పలుకరించింది నిష్కల.
‘మీ జుకర్ బాబుకేమొచ్చిందో ఏమో .. నన్ను బ్లాకేశాడు’
“”ఆ హ్హా హ్హా .. అవునా .. నువ్వేదో నేరం చేసి ఉంటావ్”
“అయ్యయ్యో .. ఎంత మాటన్నావ్? నేను నేరం చేయడమేమిటీ ..? నువ్వూ ఆ జుకర్ బాబు పాటే పాడుతున్నావా?
మీ దృష్టిలో ఓ ఫోటో పెట్టడమే నేరమా..? ప్చ్ అంతే గావచ్చు.. 28రోజులు బ్లాకేశాడు. మన పోలీసులు కూడా ఇంత అరాచకంగా ఉండరేమో ..
ఇలాంటి శిక్ష వేయరేమో..
ఈ సారి మళ్లీ బ్లాకాడనుకో .. నేనే వాడిని పీకి పడేస్తా.. వీడితోనే బతుకా ఏమన్నానా..?” అన్నది సరళత్త కూతురు సరిత.
“సరే కానీ, నీ శిక్షకు కారణమైన ఫోటో ఏంటే..” అడిగింది నిష్కల
“అదా.. మూడేళ్లు లేని మొండి మొల పిల్లగాడి ఫోటో. నీళ్ల బోర్ కమ్మీ పట్టుకుని వాడు వేలాడుతుంటే నీళ్లు రావట్లేదు. కానీ వాడి వంపు లోంచి మూత్రం చిమ్ముతున్న ఫోటో సరదాగా పెట్టాను.
ఆఫ్ కోర్స్ ‘గణతంత్ర దినోత్సవ ఫలాలు’ దాని కింద ఓ కామెంట్ కూడా పెట్టాననుకో .. ఆ ముఖపుస్తకానికి ఏమర్ధమైందో ఏమో .. బ్లాకిపడేసింది” అన్నది సరిత.
“హలో డియర్, ఆ ఫోటో నీకు తెలిసి పెట్టావో, తెలీక పెట్టావో తెలియదు కానీ, ఈ దేశాల్లో పిల్లల నగ్న చిత్రాలు పెట్టడం తీవ్రమైన నేరం” చెప్పింది నిష్కల .
“అవునా ..మన దేశంలో చాలా మంది పిల్లల బతుకు ఇదేననీ, నగ్నంగానో అర్ధ నగ్నంగానో తిరుగుతారనీ మీ వోడికి తెలియదేమో .. ఆడామగా పొట్టి పొట్టి చెడ్డీలు వేసుకుని రోడ్లమీద తిరుగుతారు కానీ, ఈ ఫోటో పెడితే తప్పొచ్చిందా .. అది అబ్యూస్ అయిందా?” ఉక్రోషంగా అన్నది సరిత.
“నేను ఎక్కువ పోస్టులు పెట్టను కానీ, హద్దులు తెలుసుకుని మసలుకుంటే అనేక అంశాలు పంచుకోవడానికి చక్కని వేదిక ముఖపుస్తకం అని నేననుకుంటాను.
సర్లే .. సర్లే .. గానీ ఏం చేస్తున్నావ్?” అడిగింది నిష్కల..
“మొహం పగిలి అనుభవాలు పాఠాలు నేర్పించాక వచ్చిన వేదాంతమా .. ” నవ్వింది సరిత.
“హద్దులు లేని అల్లర్లు చేసేంత సీన్, సమయం లేవు గానీ నీ సంగతులు చెప్పు. ఎలా ఉంది కొత్త జీవితం?” ఈ మధ్యే పెళ్లి చేసుకున్న సరిత నుద్దేశించి అడిగింది నిష్కల.
“ఏమని చెప్పను …
ఆలోచిస్తుంటే మన, అనే భావన ఉత్తదేమో ..
ఎవరి స్వార్థ ప్రయోజనం వారిది. సాగించుకోవాలి, సాధించుకోవాలనే తత్త్వం ఉన్నచోట మెతక మనుషులకీ ప్రేమతో ఆలోచించే వారికీ కొంత మానసిక క్షోభ, ఘర్షణ తప్పదేమో..
దీనికే సర్దుకుపోవడం అని అందమైన పేరు .. ” తాత్వికంగా చెప్పింది సరిత.
“ఏయ్ అల్లరి పిల్లా .. ఏమంటున్నావ్? అసలు నువ్వెలా ఉన్నావ్ “
“ఎలా ఉంటాను. నేను నేనుగానే ఉంటాను. ఇష్టం లేనివి తప్పకుండా చెప్తాను. ప్రేమగా ఉంటాను. అదే విధంగా సంఘర్షణ ఎదుర్కొంటాను. అయినా నాలాగా ఉండడటం మానను. చెప్పటమూ మానను. ప్రేమా మానను. దేనికదే .. ” తన జీవితాన్ని క్లుప్తంగా చెప్పింది సరిత.
జీవితంపై స్పష్టమైన అవగాహన ఉన్న సరితను మనసులోనే అభినందించింది నిష్కల.
అంతలో బయట బెల్ మోగింది. ఇప్పుడు ఒక్కటే ఉంటున్నది. తనతో షేరింగ్ లో ఎవరు లేరు. వాళ్ళ కోసం ఎవరైనా వచ్చారా అనుకోవడానికి. తెలిసినంత వరకు వచ్చే వాళ్ళు ఎవరూ లేరు. ఎవరై ఉంటారు?
ఈ మధ్య మత ప్రచారకులు ఎవరో ఏదో పాంప్లేట్ పట్టుకొచ్చి తమ మతం గొప్పదనాన్ని చెప్పడం .. గుర్తొచ్చింది. అలాంటి వాళ్లెవరో అయి ఉండొచ్చులే అని కదల్లేదు.
అల్లరి పిల్లగా కనిపించే సరితకు జీవితం పట్ల ఉన్న అవగాహన, లోతైన ఆలోచన, తనను తాను వ్యక్తపరచుకునే తీరు చూసి నిష్కల మనసు నిండిపోయింది. అప్పటి వరకు ఉన్న స్తబ్దత పోయి ఉత్సాహం తొంగి చూసింది ఆమెలో.
తన బంధాలకి ప్రాణం పోసి బతికించుకో గల సరిత తనకు ఏదో అన్యాపదేశంగా చెబుతున్న భావన కలిగింది ఆమెలో. అత్త కూతురు సరితను గురించి ఆలోచిస్తూ “అత్త బాగుందా” అని అడిగింది నిష్కల.
కాల్ చేయనా .. అడిగింది సరిత
అంతలో.. మళ్లీ బెల్ మోగింది.
ఇక కదలక తప్పలేదు. సారా పన్నెండు గంటలకు వస్తానని చెప్పింది. ఇప్పుడే వచ్చేసిందా ఏమిటి అనుకుంటూ వెళ్లి తలుపు తీసింది నిష్కల.
ఎదురుగా ఉన్న వ్యక్తిని చూసి నివ్వెరపోయింది.
ఉరుము లేని పిడుగులా అంకిత్..
ఇలా ఊడి పడ్డాడేంటి?
ఊహించని పరిణామం, అతన్నే చూస్తూ “నేను తర్వాత మాట్లాడతాను ” అని సరితకు చెప్పి మొబైల్ ఆఫ్ చేసి అటూ ఇటూ తిప్పుతున్నది నిష్కల.
“ఏంటి? అపరిచుతుడిని చూసినట్టు అట్లా చూస్తున్నావు. నన్ను లోపలికి రానీయవా..? ” అంటూ చల్లటి గాలితో పాటు అతనూ లోపలికి తోసుకొచ్చాడు. అతను తన లగేజితో లోపలికి వచ్చేశాడు. వచ్చి తలుపు మూశాడు.
ఏమిటీ దౌర్జన్యం?
ఎందుకు వచ్చాడు? ప్రేమతోనే వచ్చాడా? నిజ్జంగా ప్రేమ ఉంటే చెప్పాపెట్టకుండా ఎలా వెళ్ళిపోతాడు?
పాలలో నీటిని కనిపెట్టే మీటరున్నట్టు ప్రేమలో ద్రోహాన్ని కనిపెట్టే మీటరుంటే ఎంత బాగుండు.
పోనీ ప్రేమను కొలిచే మీటర్లు ఉంటే.. ఇతని ప్రేమని కొలిచేదాన్ని, తన ఆలోచనకు తానే లోలోన నవ్వుకుంది.
అట్లా ఉంటే ప్రేమించి మోసం చేసే కేసులు ఉండవు. ప్రేమికుని ఇంటి ముందు ధర్నాలు, దీక్షలు కనిపించవు. నాలాంటి లాయర్లకు పని చాలా తగ్గిపోతుంది. పాపం గీత.. ఆమెకు ఇలాంటి గతే పట్టకపోను అనుకుంటూ అంకిత్ కేసి చూసింది.
షూస్ విప్పి షూ రాక్ లో పద్దతిగా పెట్టాడు. వేసుకున్న జాకెట్ తీసి క్లోసెట్ లో పెడుతున్నాడు. అంకిత్ ఏది చేసినా అంతే. చాలా సిస్టమేటిక్ గా చేస్తాడు. కానీ నా విషయంలోనే.. కనీసం మాట మాత్రమైనా చెప్పకుండా వెళ్ళిపోయాడు.
తమ మధ్య ఏమీ జరగనట్లే ఉంది అతని ప్రవర్తన. నిజానికి జరిగింది ఏమీ లేదు. మరి ఎందుకు చెప్పాపెట్టకుండా వెళ్లిపోయినట్లు?
ఇప్పుడు ఎలా అంకిత్ ని డీల్ చెయ్యడం?
పరిపరి విధాలా ఆలోచిస్తున్నది ఆమె మైండ్.
అతని పట్ల ద్వేషం లేదు. కానీ బాధ ఉంది. అందరిలాగా మూడుముళ్లు వేసుకున్న బంధం కాదనే కదా అతను అంత సులువుగా, బాధ్యత లేకుండా గడప దాటగలిగాడు. బంధు మిత్రులందరి ముందూ తమ బంధం ముడివేసుకుంటే కొంత జవాబుదారీ తనం ఉంటుందేమో.. అది లేకపోబట్టి ఇలా ప్రవర్తించాడు.
ఊహూ.. పెళ్లా .. సహజీవనమా .. అది కాదు తమ సమస్య. తమ సంబంధంలో అంటే, ఆడ మగ సంబంధంలో ఈ పంచాయితీకి కారణం పెత్తనం, డబ్బు.
అవును, అవే.
అది ఏడడుగులు నడచినా, సహజీవనం చేసినా ..ఆడామగా పంచాయితీకి కారణం మాత్రం అవే. తనతో ఏర్పరచుకున్న బంధం నుంచి అతను తప్పించుకోలేదు. మరో బంధంలోకి పోలేదు. అలా చేస్తే పెళ్లి చేసుకోలేదు కాబట్టి, సహజీవనంలోంచి సులభంగా బయటపడవచ్చు అనుకుని ఇలా చేశాడని అనుకోవచ్చు.
సమాజంలో కుటుంబ విలువలు, సంప్రదాయాలు, కట్టుబాట్లు, స్త్రీ పురుషులిద్దరికీ ఒకే విధంగా ఉండకపోవడమే అసలు సమస్య. అలా ఉంటే బహుశా ఇలాంటి సమస్యలు రావేమో..
చూద్దాం..
సహజీవనంలో ఉన్న జంట లోని ఆడపిల్ల పెళ్లి చేసుకుందాం అంటే మొహం చాటేసిన అబ్బాయిలు ఉన్నారని తెలుసు. పెద్దల ప్రమేయం లేకుండా రహస్యంగా పెళ్ళి చేసుకుని కొన్నాళ్ళకి మా పెద్దల బలవంతం మీద అంటూ మరో పెళ్లి చేసుకున్న ప్రబుద్దుల కేసులు తన ఎరుకలోనే ఉన్నాయి. ఇలాంటప్పుడు అమ్మాయిబరితెగించింది. ఫలితం అనుభవిస్తున్నది అనడం చాలా సార్లు విన్నది. తల్లిదండ్రులు చూపిన సంబంధం చేసుకోకుండా వేరే బంధంలోకి వెళ్తే ఆ అమ్మాయిని బరితెగించింది అనడం భారతీయ సమాజంలో కొత్తేమీ కాదు, మాములే.
బాధితురాలైన అమ్మాయిదే తప్పంతా అంటూ అమ్మాయి మీదే నెట్టేయడం బాధితురాలినే నేరస్తురాలిని చేయడం అక్కడ సాధారణమే. పెద్దలు చూసిన సంబంధమే అయినా పెళ్లి కాకుండానే అతనితో రిలేషన్ లో ఉండడం వల్ల తనను తాను కోల్పోయిన అపరాధ భావనలో గీత ఎంత వేదన అనుభవిస్తున్నదో తెలిసిందే. తప్పు ఎవరిదైనా గానీ అమ్మాయినే బాధ్యురాలిని చేస్తూ రకరకాల తీర్పులు ఇచ్చేయడం సమాజానికి అలవాటే..
ఎక్కడి నీతి? ఏమిటీ ద్వంద్వ నీతి?
ఆమె అతన్ని నమ్మడం, లేదా ప్రేమించడం తప్పు ఎలా అవుతుంది? నమ్మించి మోసం చేసిన వారిది కదా..
మోసంతో తడి గుడ్డతో గొంతు కోసిన వాడిది కదా ..
స్త్రీ పురుష సంబంధాల్లో అసమాన విలువలు అమ్మాయి పై ఎంత విషం చిమ్ము తున్నాయి?
అయిన వాళ్ళనుకున్న వాళ్ళు, కానివాళ్ళనుకున్నవాళ్ళు క్లిష్ట సమయంలో గడ్డి పోచంత సాయం చేయరు గానీ తీర్పులిచ్చేయడానికి ముందుంటారు.
కుటుంబం, సమాజం, సంస్కృతి చేసే దాడిని నిస్సహాయంగా భరించే వారు కొందరైతే, ఆత్మాహుతి చేసే వారు మరికొందరు. కొద్ది మంది మాత్రమే సవాళ్లను దీటుగా ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్నది.
భావోద్వేగాలతో బంధాలను పెంచుకోవడం వల్ల ఇటు వంటి సమస్యలు వస్తాయేమో..!
కానీ అంకిత్ ఇప్పటి వరకు ఆ విధంగా ఎన్నడూ చేయలేదు. అతను కొద్దిగా ఎమోషనల్. నేనే ప్రాక్టికల్ గా ఉంటానేమో..!
పెళ్లి తో పాటు లాంఛనంగా వచ్చే కనిపించని శారీరక, మానసిక హింస.. పెళ్లి వ్యవస్థలో అంతర్భాగంగా మారిపోయింది.
ఒక వేళ కొత్త ఇబ్బందులు ఎదురవుతాయి అనుకుంటే , జీవితం నరకం అవుతుంది అనుకుంటే నేను ఎందుకు ఊరుకుంటాను. ఆ బంధం నుండి శాశ్వతంగా పక్కకు తప్పు కుంటాను.
అమ్మాయిలను ప్రేమ పేరుతో సహజీవనంలోకి లాగే మోసగాళ్లు మగవాళ్ళు అని అప్పుడెప్పుడో ఆర్జీవీ అన్న మాటలు గుర్తొచ్చాయి ఆ క్షణాన. ఇటు వంటి బాధ్యతలేని కామెంట్స్ చేసి మగవాళ్లందరిని మోసగాళ్లుగా మార్చేయడం కూడా అన్యాయమే.
అలా కొందరు ఉండవచ్చు. కాదనను. అందరూ అలా కాదు. నిజమైన ప్రేమ ఉంది కాబట్టే అంకిత్ వచ్చాడు. మగవాళ్ళంతా మోసగాళ్లు కాదని నిరూపించుకోవల్సింది అంకిత్ లాంటి వాళ్లే ..
అంకిత్ ఆవేశం, తొందరపాటుతో అనాలోచిత నిర్ణయాలు చేస్తుంటాడు అప్పుడప్పుడు. తీరిగ్గా ఆలోచించుకుంటే తన తప్పు తాను తెలుసుకుంటాడు. అది అతని బలహీనత అయివుండొచ్చు. లేదా అదే అతని బలం కూడా అవుతుందేమో.. .
ప్రతి మనిషికి జీవన అవసరాలు, అనుబంధాల తర్వాత కావలసింది స్వేచ్ఛ. అది ఆడ, మగ ఎవరికైనా వక్తిగత స్వేచ్ఛ కావాల్సిందే. దీన్ని ఎప్పటికీ కోల్పోకూడదు.
ఈ ప్రపంచంలో పరిపూర్ణమైన మనిషంటూ ఉండరేమో.. నిండుగా, అందంగా నవ్వుతూ కనిపించే చందమామలో మచ్చలు లేవా.. ప్రతి మనిషిలో ఏవో ఒక లోపం ఉంటుంది. అది చిన్నది కావచ్చు. పెద్దది కావచ్చు.
ఇద్దరి మధ్య అవగాహన, అర్ధం చేసుకునే విధానం బట్టి, వారి మానసిక స్థితిని బట్టి ఎదుటివారు స్వీకరించే విధానం బట్టి ఉంటుందేమో… అది పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్న దంపతులైనా, సహజీవనంలో ఉన్న జంటైనా.. కానీ సమాజానికి సహజీవనం అంటే పేచీ.. ఎందుకో..
ఆధునికులం అనుకునే వాళ్లకు కూడా భయమే. వారు ఆధునికులు కాదా? అసలు ఆధునికత అంటే..? అది ఆలోచనల్లో ఉండాలా.. వస్త్రధారణ , అలంకరణ చూసి ఆధునికులు అనుకోవాలా..? విభిన్నతలు, ప్రత్యేకతలు ఉంటే ఆధునికత అక్కున చేర్చుకోదా? సహజీవనం అనుకున్న దాంట్లో నిజంగా సహజీవనం, సమాన జీవనం ఉంటున్నదా..?
కుల, మత, ప్రాంత భేదాలు, సాంస్కృతిక, మానసిక భావనలు నుండి బయట పడితే తప్ప సహజీవనంలో నిలదొక్కుకోలేరేమో..
నిష్కలనే తదేకంగా చూస్తున్న అంకిత్ ని ఒక్క చూపు చూసి చూపు తిప్పుకుంది.
మడుగులోకి దిగిన తర్వాత బురద కడుక్కోవాలా .. అనుకుంటే ఎలా?
ఒకవేళ ప్రతికూల పరిస్థితులు ఏర్పడితే ఓర్పు నేర్పుతో మార్చుకోగలనా? అంత శక్తి సామర్ధ్యం తనకు ఉన్నదా? అయినా ఎందుకు మార్చుకోవాలి? ఎందుకు మారిపోవాలి? ప్రశ్నలు దూసుకొచ్చాయి.
ఒకవేళ పొత్తు కుదరక పోతే ఏం చేయాలో నాకు తెలుసు. అతనికీ తెలుసు. మనసు చంపుకుని బతకాల్సిన పనిలేదు. అరిచి గీ పెట్టి గొడవ పడాల్సిన పనిలేదు. పరస్పరం మాట్లాడుకుని విడిపోవడమే. ఎలాంటి నిరూపణలు, వివరణలు వద్దు. నన్ను నేను ప్రేమించుకుంటాను.
అంకిత్ ని ప్రేమిస్తాను. అతని పట్ల నాలో ఉన్న వ్యతిరేక భావాలు, దిగులు తుడిచి వేయడానికి యత్నిస్తాను. డబ్బు, ఇద్దరి మధ్య గొడవలకు కారణం కాకూడదు. ఇద్దరికీ ఉండే కామన్ ఖర్చులకు ప్రతినెలా ఇద్దరూ సమంగా కొంత సొమ్ము ఖర్చు చేస్తే సరి.
ఒక వేళ విడిపోవాల్సి వస్తే అతని ఆస్తి మీద, సంపాదన మీద నాకు ఎటువంటి ఆశ లేవు కాబట్టి ఆధారాల కోసం ఎటువంటి పెళ్లి అవసరం లేదు. ఎటువంటి గందరగోళం లేదు.
నిష్కల ఆలోచనలు ఎటునుండి ఏటో తెగిన గాలిపటంలా లోకమంతా చుట్టేస్తున్నాయి.
అయినా ఏంటి ఇలా ఆలోచిస్తున్నాను ..
చూద్దాం కాలం ఏం సమాధానం చెబుతుందో.. ఏ కొత్త దారులు సృష్టిస్తుందో ..
పరిపరివిధాల ఆలోచిస్తున్న నిష్కలకు అంతరాయం కలిగిస్తూ
“నిష్ .. ఆకలేస్తోంది. ఏమి చేసుకుందాం” అంటూ సోఫా నుంచి లేచాడు. బాగ్ లోంచి తీసిన ఫోటో ఫ్రేమ్ తీసి టేబుల్ పై పెట్టాడు. నిండుగా నవ్వుతున్ననిష్కలను చూస్తూ నా జాబిలమ్మ అనుకున్నాడు అంకిత్.
విరిసీ విరియని అంకిత్ నవ్వు మొహంలోకి చూస్తూ… అతని వెనుకే ఆమె
* * * * *
(మళ్ళీ కలుద్దాం )