నెల పండుగ
– డా॥కొండపల్లి నీహారిణి
రాతపూతల్లో కవి దోగాడి
భావ ధూళి కనిపించిన కన్నులతో నిన్నటి రోజును దోసిట్లో పోసినప్పుడు
నేల దాచిన రహస్యాల్ని వెలికి తీయాలి
తరాల తరబడి ఎరుపు దుఃఖ సాగరాలను
తనతో తెచ్చుకున్న జాతి అంతా నాలుగు రోజుల గుండె బరువు కన్నీటి మడుగులో కడిగి
దింపలేని ఇరుకును
మనసు గోడలకు తెలియని
కడుపుదేనని
ఐదు దశాబ్దాల
నిశ్శబ్ద క్షుత్తు నొప్పి నుండి దాటిరాలేని బతుకు భ్రమ
భ్రమలు బతుకైనప్పుడు
దాటిరాగల రాతి ప్రహరీలనుండి
అల్లుకుని
పాతుకుని
దాగిన ప్రసూనోదయాలు
పిచ్చి తీగదో
నచ్చని పూవుదో
ఎట్లా తెలుసుకుంటుందీ
అసమర్థ లోకం
ఇంటి కళ వెనుక
ఇంతటి గుట్టు దాగున్నదని మరో జాతి తోబుట్టువులకూ తెలియని
నొప్పి
నొప్పి
ఈ సుదీర్ఘ పయనానికి
మొదటి దశ
దశాంకమైనప్పటినుండి
ఎప్పటినుండో
తాత ముత్తాతల కాలమప్పటినుండి
ఆత్మలో దేహ భావం ఇంకి
మొలకెత్తినట్టు
ఋతు బాధల పనిభారాల స్నేహమేదో మట్టి పరిమళం లా
ఆమెను చుట్టుకున్నప్పటి నుండి
అర్థ శతాబ్దాలను వెంటేసుకొచ్చే
నెల పండుగ
ఆడ కూతుర్ల ఆరోగ్యోత్సవమై
జాతి సజీవత
ఇలా తలం పైన
ఇదేమీ కొత్త కాదు
సంకెలలు
సంకెలలు
తెగగొట్టలేని సంకెలలు
మంచీ చెడుల మధ్య
తీయలేని సంకెలలు
జీవకళకు ఆరోగ్యమిచ్చే నెల పండుగ
ఆమెను నిలబెట్టే పండుగ!
*****