మిట్ట మధ్యాహ్నపు మరణం- 17

– గౌరీ కృపానందన్

          అతని చేతిలో పెద్ద సైజు పుస్తకం ఉంది.

          “మయాస్ నాగరికత గురించిన పుస్తకం ఇది. చాల ప్రాచీనమైన నాగరికత ఇది. వాళ్ళు సూర్యుడిని ఆరాధించే వాళ్ళు. ఇంకా…”

          ఉమ అతను చెప్పే విషయాలను గమనించని దానిలా, “మీరు మొదట ఏమని అన్నారు. నా కేసు కోసం చూస్తున్నాను అని అన్నారు కదా?” అది.

          “అవును” అన్నాడు. తలను ఒక పక్కగా వంచి హుందాగా చూశాడు.

          “నా కేసు ఏమిటో మీకు తెలుసా?”

          “జరిగినదంతా తెలుసుకున్నాను ఉమా.”

          “ఎవరి నుంచి?”

          “ఆనంద్ దగ్గరినించి. క్రికెట్ ద్వారా అతనికీ నాకు ముందే పరిచయం.”

          “ఏం తెలుసుకున్నారు?’

          “ఈ పుస్తకాల షాప్ లో మాట్లాడుకోవడం కుదరదు. అలా బైటికి వెళ్లి ఒక కప్ కాఫీ తాగుదాం రండి.”

          ఉమ గడియారాన్ని చూసింది. మూర్తి మేనేజరును కలవడానికి ఇంకా అరగంట పైనే ఉంది.  

          “ఏం తీసుకుంటారు?” అడిగాడు రాకేష్. చిటిక వేయకుండా వెయిటర్ ని పిలిచాడు.

          “జస్ట్ కాఫీ ప్లీజ్.”

          కొంచం సేపు మౌనం తరువాత అన్నాడు. “చెప్పండి.”

“మీరే చెప్పాలి.”

          “నాకు అంతా తెలుసు ఉమా. మీ మనసు ఇప్పుడు ఎంత బాధలో మునిగి ఉంటుందో ఊహించుకోలేక పోతున్నాను. దాన్ని మళ్ళీ జ్ఞాపకం చేయడం నా అభిమతం కాదు. కాని ఆనంద్ నాతో చెప్పాడు. మీ భర్తను హత్య చేసిన హంతకుడిని ఎలాగైనా పట్టు కోవాలని మీరు పట్టుదలతో ఉన్నారని. ఆ విషయంలో నేను మీకు సాయం చేయగలను అని అనిపిస్తోంది.”

“ఎలా?”

          “నేను ఒక లా గ్రాడ్యుయేట్ ని. క్రిమినాలజి, ఫారెన్సిక్ సైన్స్ రెండింటిలో నాకు ఆసక్తి ఎక్కువ. మీకు అభ్యంతరం లేక పోతే మీతో కలిసి మీ భర్తను హత్య చేసిన వ్యక్తిని అది స్త్రీయో పురుషుడో పట్టుకోవడంలో సహాయం చేయాలనుకుంటున్నాను.”

          “జరిగినదంతా మీకు తెలుసా?”

          “తెలుసు. ఆనంద్ చెప్పిన తరువాత బెంగళూరు న్యూస్ పేపర్లన్నీ చూశాను. మాయ అన్న ఆ పేరు నన్ను ఆకర్షించింది. తనను పట్టుకోమని హంతకుడు సవాలు చేస్తూ  ఇచ్చిన క్లూ అనిపించింది. అందుకోసమే మాయ అన్న పుస్తకాన్ని చదవడం ప్రారంభించాను. ఆ నాగరికత విశేషాలు పూర్తిగా వ్రాయబడి ఉన్నాయి.”

          “దానికీ మూర్తి చనిపోయిన దానికి ఏమిటి సంబంధం?”

          “ఏదైనా లింక్ ఉండి ఉంటుంది.”

          “మాయ అన్నది ఒక మనిషి పేరు.”

          “మీకు ఎలా తెలుసు?”

          “ఒక ఉత్తరం వచ్చింది, మాయ అన్న సంతకంతో.”

          “ఉత్తరంలో ఏమని వ్రాసి ఉంది?”

          “సరిగ్గా గుర్తు లేదు. ‘అంతా మంచే జరుగుతుంది. భగవంతుడు కాపాడుతాడు. వస్తున్నాను. మాయ’ అని వ్రాసి ఉంది.”

          “ఆ ఉత్తరం ఉందా మీ దగ్గర?”

          “లేదు. బెంగళూరు ఇనస్పెక్టర్ మాధవరావు గారికి పంపించేశాను.”

          “సరే. నేనెలాగూ బెంగళూరుకు వెళ్తాను. ఆయన్ని కలుస్తాను. వాళ్ళేమైనా కనుక్కున్నారా? ఏమైనా ఆచూకి తెలిసిందా?”

          “తెలియదు.”

          “ఉమా! నేను మీ విషయంలో అనవసరంగా జోక్యం చేసుకుంటున్నానని అనుకోరు కదా. మీ కధను వినగానే ఎలాగైనా మీకు హెల్ప్ చేయాలని నా మనసు తపన పడుతోంది. ఒక్క విషయం చెబితే తప్పుగా అనుకోరు కదా.”

“ఏమిటది?”

          “మీరు చాలా అందంగా ఉన్నారు. చాలా సింపిల్ గా, ఎటువంటి మేకప్  చేసుకో కుండానే వచ్చారు. అయినా కూడా… పక్కనే ఉన్న టేబిల్ వైపు క్యాజువల్ గా చూడండి.”

          ఉమ యధాలాపంగా తిరిగినట్లు ఆ వైపు చూసింది. ఒక యువకుడు ఆమెను కన్నార్పకుండా చూస్తున్నాడు. ఉమ చూడగానే చిరునవ్వు నవ్వాడు.

          ఉమ చప్ప్పున తల తిప్పుకుంది.

          “యు ఆర్ స్టిల్ బ్యూటిఫుల్!”

          ఉమ చటుక్కున కాఫీ ఒక్క గుక్కలో తాగేసింది. “ధాంక్స్! వస్తాను. నాలుగున్నరకి అప్పాయింట్ మెంట్ ఉంది.”

          “ఎవరితో అని నేను తెలుసుకోవచ్చా?”

          ఉమ కాస్త తటపటాయించింది. ఇతని మాటల తీరు, ప్రవర్తన ఆమెను ఆకర్షిస్తున్నాయి. అది ప్రమాదం అని మనసులో ఏ మూలనో హెచ్చరిస్తోంది. ఇతనితో ఎక్కువ స్నేహం పెట్టుకోకూడదు. ఎందుకు? ఎవరు నన్ను శాసించేది? ఉమా! నిగ్రహించుకో.. మనసు హెచ్చరించింది.

          “నేను వస్తాను.”

          “చెప్పడానికి ఇష్టం లేకపోతే వద్దు.” కాఫీ బిల్ పే చేసి ఆమెతో నడిచాడు.

          “నేను వెళ్ళొస్తాను” అంది ఉమ.

          “నేనూ మీ వెంట రానా?”

          “వద్దు.”

          “మళ్ళీ మనం ఎప్పుడు కలుద్దాం?”

          “మీకు ఏదైనా పనికి వచ్చే విషయం దొరికితే, ఆనంద్ ద్వారా తెలియ జేయండి. మనం కలుసుకోవడానికి ఇక మీద ఆవశ్యకత ఉండదనుకుంటాను.”

          అతని ముఖం ఒక్కసారిగా పాలి పోయింది. ఆమెకి బాధగా అనిపించింది. అతని మనసు గాయపడిన విషయం తెలుస్తూనే ఉంది.

          “మీరు ఎలా చెప్పినా సరే. ఎప్పుడైనా నా హెల్ప్ కావాలని అనిపిస్తే మీరు ఈ నంబరుకు ఫోన్ చెయ్యండి. నేను లేకున్నా మెసేజి ఇవ్వండి. సరేనా.”

          “ సరే.” ఆ కార్డును తీసుకుంటున్నప్పుడు ఆమె వేళ్ళు అతని వేళ్ళను తాకాయి.

          మూర్తి ఆఫీసు ఆమె ఎదురు చూసినట్లుగా పెద్దగా లేదు. చిన్నదే. రిసెప్షనిస్ట్ కి తానెవరో చెప్పగానే, “కూర్చోండి. మిస్టర్ శర్మ గారికి కబురు చేస్తాను. వెంటనే మిమ్మల్ని పిలుస్తారు” అని అంది.

          మేనేజరు ఆమెను లోపలికి రమ్మని పిలవకుండా, తానే స్వయంగా రిసెప్షన్ కి వచ్చి ఆమెను చూశాడు.

          “మిసెస్ మూర్తి! ఇలాంటి సమయంలోనే మీరు ధైర్యంగా ఉండాలి. బెంగళూరుకు నేను టెలిగ్రాం కూడా ఇచ్చాను. ఆఫీసు నుంచి ఏమైనా హెల్ప్ కావాలంటే చేయడానికి సిద్దంగా ఉన్నామని. వచ్చిందా?”

          “వచ్చి ఉంటుంది సార్. నేను దేనినీ గమనించే స్థితిలో అప్పుడు లేను.”

          “అర్ధం చేసుకోగలను. కాఫీ తెప్పించనా?”

          “వద్దు. ఇప్పుడే కాఫీ తాగాను.”

          “చెప్పండి. నా వల్ల ఏదైనా హెల్ప్ కావాల్సివస్తే తప్పకుండా చేస్తాను.”

          “మూర్తి ఇప్పుడు లేరు. వ్యక్తిగా అయన గురించిన అసలైన అభిప్రాయం చెప్ప గలరా?”

          “ఎందుకు అడుగుతున్నారు?”

          “ఆయన ఎందుకు హత్య చేయబడ్డారో తెలుసుకోవాలి.”

          “ఓ… అలాగా.”

          “ఆయన హత్యకి కారణం ఏమై ఉంటుందో మీరు ఊహించగలరా?”

          కాస్సేపు ఆలోచించారు. వేషభాషలకు తగినట్లు పైప్ వెలిగించుకున్నారు. పొగను వదులుతూ చెప్పారు.

          “లేదమ్మా. ఏ కారణమూ కన్పించడం లేదు. మూర్తి లాంటి మనిషిని చూడడం చాలా అరుదు. వేరే కంపెనీల నుంచి ఆఫర్స్ వచ్చినా వెళ్ళలేదు. ఉద్యోగంలో సవాళ్ళను ఎదురుకోవడం అతనికి చాల ఇష్టం. అతని వల్ల కంపెని టర్న్ ఓవర్ చాలా ఇంప్రూవ్ అయ్యింది. అతని ప్రమోషన్ కూడా ఇవ్వాలనుకున్నాము.”

          “ఈ కంపెనీలో ఎంత మంది స్త్రీలు పని చేస్తున్నారు?”

          “ఎనిమిది మంది.”

          “వాళ్ళలో ఎవరైనా మూర్తికి సన్నిహితంగా ఉంటారా?”

          “ఓ.. నో.. సర్టెన్లీ నాట్.”

          “వాళ్ళలో ఎవరికైనా మాయ అని పేరు ఉందా?”

          “లేదు,”

          “మీ కంపెని వ్యాపార పరంగా ఆయనికి ఎవరైనా శత్రువులు ఉండొచ్చు కదా?”

          “పోలీసుల కన్నా చురుగ్గా ప్రశ్నలు అడుగుతున్నారు. అలాంటిది ఏదీ లేదు.”

          “మరి ఎందుకు సార్ ఆయన్ని హత్య చేశారు? ఏదైనా కారణం చెప్పండి ప్లీజ్.” ఉప్పెనలా ముంచుకొచ్చింది ఏడుపు.

          “మిసెస్ మూర్తి. కామ్ యువర్ సెల్ఫ్. వసంతా! కాఫీ తెప్పించు. మిసెస్ మూర్తీ!”

          “నన్ను ఉమా అనే పిలవండి.” ఏడుపును నిగ్రహించుకుంది.

          “ఉమా! మీకు మా కంపెనీ లో ఉద్యోగం కావాలా?”

          “వద్దు సార్ వద్దు. కావాల్సింది నా ప్రశ్నకు జవాబు మాత్రమే.”

          “ఓ.కే. మీరు ఎప్పుడు వచ్చినా సరే ఉద్యోగం ఇప్పిస్తాను. చనిపోయిన మూర్తి పట్ల మేము నిర్వర్తించవలసిన బాధ్యత ఇది.”

          “ధాంక్స్ ! ఎప్పుడైనా ఉద్యోగం కావాలని అనిపిస్తే వస్తాను.”

***

          మాధవరావు గ్రాఫాలజీ ఎక్స్ పర్ట్ నుంచి వచ్చిన రిపోర్ట్స్ ఒకసారి చూశారు. ముఖ్యంగా ఏమీ లేదు. ఏ క్లూ దొరకలేదు.

          రామకృష్ణని మరోసారి విచారణ చేయాలి. వాళ్ళు చెప్పిన కారణం విచిత్రంగా, వినోదంగా అనిపించింది. ఆలోచనల్లో మునిగిపోయిన మాధవరావు చూశారు ఆ ఫోటోను.

          టేబిల్ మీద ఎన్లార్జ్ చేయబడిన ఫోటో. ఎటువంటి ఆసక్తిలేకుండానే యధాలాపంగా చూశారు.

          ఉమ, మూర్తి చాలా సంతోషంగా, ఒకరికి ఒకరు తీసిపోనట్టుగా నవ్వుతూ కనిపించారు ఆ ఫోటోలో. మరునాడు తన మరణం గురించి ఏ మాత్రమూ ఊహ లేని మూర్తి ఉమ భుజాల చుట్టూ చెయ్యి వేసి దగ్గరగా నిలబడి ఉన్నాడు. బ్యాక్ గ్రవుండులో చెట్లు, టెన్నిస్ కోర్టు, చిన్న పాప నడుస్తూ, చెట్ల వెనక నుంచి తొంగి చూస్తున్న అతనూ కనబడ్డారు.

          అంతకు ముందు చూసిన చిన్న ఫోటోలో చెట్టు వెనక నుంచి తొంగి చూసే వ్యక్తి చెట్టు నీడలో కలిసి పోయినట్లుగా ఉండి ఉండొచ్చు.  ఇప్పుడు కూడా అస్పష్టంగానే కనబడుతున్నాడు. కాస్త దూరంగా పెట్టుకుని చూస్తే లీలగా కనబడుతున్నాడు. అతని బనియన్ లో క్రింద ఉన్న అక్షరాలు సగం వరకు కనబడ్డాయి.

M..A…

          మాధవరావుకి రక్తపు నాళాల్లో రక్తం వేగంగా ప్రవహించి నట్లనిపించింది. భూతద్దంతో మళ్ళీ పరీక్షగా చూశారు. అతని ముఖం స్పష్టంగా కనిపించ లేదు. కాని చెట్టు చాటు నుంచి వాళ్ళిద్దరినీ రహస్యంగా తొంగి చూస్తున్న విషయం మాత్రం తేటతెల్లంగా కనబడుతోంది. పెన్సిల్ తో అతని చుట్టూ గీత గీశారు.

          “జీప్ తీయండి.”

          “ఎక్కడికి వెళ్ళాలి సార్?”

          “ఆ రోజు వెళ్లాం కదా. మల్లీశ్వరం యూత్ అసోసియేషన్ క్లబ్. మళ్ళీ అక్కడికి వెళ్ళాలి.”

          యూత్ క్లబ్ లో ఉన్న సెక్రటరీ మాధవరావును గుర్తించాడు.

          “రండి సార్. ఆఫీసు రూమ్ లో కూర్చుని మాట్లాడుకుందాం. ఆ రోజే మీరు అడిగిన లిస్టు ఇచ్చేసానుగా. హంతకుడు దొరికాడా?”

          “ఇంకా లేదు. ఈ ఫోటోను కాస్త చూడండి.”

          చూశాను. “బాగా ఉంది.”

          “ఫోటోలో పెన్సిల్తో మార్క్ చేసి ఉంది చూశారా? ఆ మనిషిని చూడండి.”

          “మనిషి ఎక్కడ ఉన్నాడు? చెట్టేగా ఉంది?”

          “కాస్త పరిశీలనగా చూడండి.”

          ఆయన కళ్ళజోడు పెట్టుకుని మరీ చూశారు. “ఆ… అవును. ఒక మనిషి కనబడు తున్నాడు. మీరు చెప్పింది నిజమే.” ఫోటోను తిరిగి ఇవ్వబోయారు.

          “బాగా చూడండి. అతను ఎవరో గుర్తుపట్టగలరా?”

          ఆయన మళ్ళీ ఛూసారు. “ఇలా రాత్రి వేళల్లో నన్ను గుర్తుపట్టమంటే ఎలాగండీ స్వామీ! మీరు చెప్పిన తరువాతే అక్కడ ఒక మనిషి ఉన్నట్లు, అదీ లోతుగా చూస్తేనే తెలుస్తోంది. చూసి చూసి కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. ఫోటో ఇక్కడే ఉంచి వెళ్ళండి. పగటి వెలుతురులో చూసి, మనిషి ఎవరని తెలిస్తే ఫోన్ చేసి చెబుతాను.”

          “ఇప్పుడు చెప్పలేరా?”

          “కష్టం సార్! నేనెవరి పేరైనా చెబితే మీరు అతన్ని చావ బాదేస్తారు.”

          “మీరు మాతో సహకరించడం లేదు.”

          “ఇదెక్కడి సమస్య వచ్చి పడిందిరా దేవుడా? గుర్తు తెలియలేదని అంటున్నాను అంతే.”

          “మీరు కావాలనే తెలియలేదని చెబుతున్నారు.” అన్నాడు సబ్ ఇనస్పెక్టర్.

          సెక్రటరీకి చిర్రెత్తు కొచ్చింది. “ఇలా అంటే ఏం చేయను. ఆల్ రైట్ ! నాకు ఏమీ తెలియదు. నన్ను విసిగించకండి.”

          “నువ్వు ఊరుకో తిమ్మప్పా. సార్! మీరు టైం తీసుకోండి. ఈ ఫోటో కాపి ఒకటి ఇక్కడ ఉంచుతాను. రేపు ఉదయం వెలుతురులో చూసి ఏదైనా తెలిస్తే ఫోన్ చేసి చెప్పండి. మాధవరావు క్రైం బ్రాంచ్ అని చెబితే చాలు. సరేనా.”

          “సరి సార్.”

          “ఇంకో విషయం. ఎప్పుడైనా మెంబర్లకి  మీ క్లబ్ పేరు ప్రింట్ చేసిన టీ షర్ట్ ఇచ్చారా?”

          “టీ షర్ట్ అంటే?”

          “అదేనండీ. ఆడా మగా తేడా లేకుండా వేసుకునే బనియన్ లు వాటి మీద డిజైనులు, వాక్యాలు ప్రింట్ చేయబడి ఉంటాయి.”

          కాస్త ఆలోచిస్తున్నట్లు బుర్ర గోక్కున్నారు. “అవును జ్ఞాపకం వచ్చింది. పోయిన సంవత్సరం అలాంటి బనియన్లు కొంత మంది మెంబర్స్ కి ఇచ్చాము, MAYA అని ప్రింట్ చేయించి.”

          “ఇప్పుడు ఈ ఫోటోను మళ్ళీ చూడండి.”

          “అవును బనియన్ లో కొద్దిగా కనబడుతోంది.”

          “ముఖాన్ని గుర్తు పట్టగలరా?

          ఒక సారి తల అడ్డంగా ఊపుతూ, “మీరు ఫోటోని ఉంచి వెళ్ళండి. ప్రయత్నిస్తాను” అని అన్నారు.

          మాధవరావు పట్టు వదలని విక్రమార్కుడిలా, “నేను పోయిన సారి షూస్ గురించి అడిగాను, మీరు కూడా వాటిని బాస్కెట్ బాల్ టీంకి, క్రికెట్ టీంకి ఇచ్చామని చెప్పారు కదూ” అని అన్నాడు.

          “అవును.”

          “వాళ్లకి టీ షర్ట్స్ ఇచ్చినట్లు గుర్తుందా?”

          “ఆ… జ్ఞాపకం వచ్చింది. ముఖ్యంగా క్రికెట్ టీంకి ఇచ్చాము.”

          “క్రికెట్! వెరీ గుడ్. వాళ్ళ లిస్టు ఉందా మీ దగ్గర?”

          “వెతికి చూడాలి సార్. పోయిన సంవత్సరానికి చెందిన లిస్టు. చాలా మంది వదిలి వెళ్లి పోయారు కూడా.”

          “కాస్త వెతకండి. నాకు ఆ లిస్టు ఎలాగైనా కావాలి.” కాస్త నొక్కి చెప్పారు.

          “ప్రొద్దున్న ఇస్తాను.”

          “చూడండి. మేము ఊహించేది నిజమే అయితే ఆ లిస్టులో ఉన్న ఒక వ్యక్తి కొత్తగా పెళ్ళయిన జంట హనీమూన్ కి వచ్చినప్పుడు, భర్తను హత్య చేశాడు. కత్తితో పదిసార్లు కసిగా పొడిచాడు. అతన్ని కనుక్కోవడంలో మనం జాప్యం చేసే ఒక్కొక్క క్షణమూ అతను మన నుంచి దూరంగా వెళ్లిపోతాడు. రాత్రి పన్నెండు గంటలైనా సరే. ఆ లిస్టు తీసి ఇవ్వండి.”

          ఆయన గొణుక్కుంటూ లోపలికి వెళ్లి  ఫైళ్ళను దులిపి, ఒక్కొక్క దాన్నీతీసి పరిశీలించసాగారు.

          మాధవరావు ఆ ఫోటో కేసి మళ్ళీ చూశారు. లాబ్ లో ఇచ్చి ఇంకాస్త ఎన్లార్జ్ చేసి చూడాలి. అతని ముఖం స్పష్టంగా లేకున్నా, వేసుకున్న టీ షర్ట్ లోని ఆక్షరాలు చూస్తే ముఖ్యమైన ఫోటో లాగా అనిపించింది. మూర్తి చనిపోయే ముందు తీయబడ్డ ఆఖరు ఫోటో. ఆ ఫోటోలో చెట్టు చాటున ఒక వ్యక్తి, అతని టీ షర్ట్ లో ప్రింట్ చేయబడ్డ అక్షరాలు. మరునాడు మూర్తి హత్య చేయబడిన గదిలో అద్దం మీద కనబడిన అవే అక్షరాలు!

          ఇది యాదృచ్చికంగా జరిగినది మాత్రం కాదు. మొదటి రోజే వాళ్ళని ఫాలో అయ్యాడు. ఫోటో తీస్తున్నప్పుడు చెట్టు చాటుకి వెళ్లిపోయాడు. మామూలు వ్యక్తి అయితే చెట్టు వెనక దాక్కోవలసిన అవసరం ఏమిటి? మూర్తిని హత్య చేసిన హంతకుడు ముమ్మాటికీ ఇతడే! మాధవరావు మనసు ఉద్వేగంతో నిండి పోయింది.

          “ఇదిగోనండీ లిస్టు. క్రికెట్ ప్లేయర్స్ లిస్టు. ఇంతకు ముందు కూడా ఈ లిస్టు ఇచ్చాను.”

          “ఇచ్చారు. బాస్కెట్ బాల్ ఆడిన వాళ్ళ లిస్టు. అందులో ఒకపేరు పరిచయమైనదిగా అనిపించి, ఈ కేసును కాస్త తికమక పెట్టింది. ఈ లిస్టులో ఉన్న వాళ్ళలో ఎంత మంది టీ షర్ట్స్ కొన్నారో తెలుసా?”

          “అదెలా చెప్పగలం సార్? కొంత మంది కొన్నారు. కొంత మంది కొనలేదు. ఎక్కడో వ్రాసి పెట్టాను. వెతకాలి.”

          “వాళ్ళ అడ్రసులు వెతికి రేపు ఇవ్వగలరా?”

          సెక్రటరి ముఖంలో కాస్త రిలీఫ్ కనబడింది. “అలాగే సార్. తప్పకుండా” అన్నారు.

          మాధవరావు ఆ లిస్టు వైపు మరోసారి చూశాడు.

          జాకి, ఇంత్యాస్ అహ్మద్, బాబు, మురళీధర్, శంకరమూర్తి, మాదప్ప, రాకేష్, విజయకుమార్, నారాయణ రావ్ మొత్తం పదిహేను మంది పేర్లు ఉన్నాయి. ఆ లిస్టు తీసి జేబులో పెట్టుకున్నారు.

***

          ఉమ కూరగాయల సంచీతో రోడ్డు ప్రక్కన నడుస్తోంది. ఈ మాత్రం పనైనా చేయడానికి అత్తగారు ఒప్పుకుంది. మొదట్లో ఆనంద్ తోడుగా వచ్చే వాడు. కాని ఈ మధ్య సాకులు చెప్పడం మొదలు పెట్టాడు.

          “ వద్దు ఉమా! మనం ఇద్దరం రోడ్డు మీద కలిసి వెళితే బాగా ఉండదు.” నసిగాడు.

          “దానిదేముంది? నేను ఒంటరిగానే వెళ్లి వస్తాను.”

          ఇంటి నుంచి కూరగాయల మార్కెట్ రెండు ఫర్లాంగుల దూరమే ఉంటుంది. ప్రొద్దుటి వేళలో అలా నడిచి వెళ్ళడం మనసుకి ప్రశాంతతను కలిగించింది.

          “బీన్స్ ఎంత?”

          “రామ్మా రా. బీన్సు తీసుకో. బెండకాయలు ఒక అరకిలో వెయ్యనా?”

          కూరగాయలు కొంటుండగా వెనక నుంచి హలో అన్న పిలుపు వినబడి తిరిగి చూసింది. రాకేష్! ఒక్క క్షణం మనసు ఉద్వేగంతో నిండి పోయింది. మనసులోని భావాలు ముఖం మీద కనబడకుండా నిగ్రహించుకుంది.

          “ఉమా! మీ కోసం ముఖ్యమైన న్యూస్ ఒకటి తెచ్చాను. మీ భర్తను హత్య చేసిన వ్యక్తిని గురించి ముఖ్యమైన విషయం ఒకటి తెలిసింది” అన్నాడు విప్పారిన ముఖంతో.

*****

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.