ముక్తి
(హిందీ మూలం: మన్నూ భండారీ, అనువాదం: అక్షర )
-అక్షర
హింది లేఖిక ‘మన్నూ భండారీ’
మన్నూ భండారీ ‘భానుపురా మధ్య ప్రదేశ 1931 లో జన్మించి 2021 ‘గురుగ్రామ్’ లో గతించారు. ఆవిడ ప్రఖ్యాతి భారతీయ రచయిత్రి ఏ కాకుండా స్క్రీన్ ప్లే రైటర్, ఉపాధ్యాయిని, ప్లే రైట్ గా కూడా ఖ్యాతి సంపాదించారు. ప్రస్తుతం నేను అనువదించిన ‘ముక్తి’ అన్న కథలో మద్యోత్తర భారత దేశంలో ముఖ్యంగా స్త్రీలు ఎంతలా మానసికంగా తమ భర్తకు లొంగిపోయి ఉండేవారో, చిత్రీకరించారు. భారతీయ స్త్రీ యొక్క ఆ అంశమే నేను ఈ అనువాదం ద్వారా పాఠకుల ముందు ఉంచటానికి ప్రయత్నించాను. దక్షిణ ప్రాంతంలో అటు వంటి స్త్రీలు లేక పోలేదు. కానీ నాకు తెలిసినంత వరకు తులనాత్మక అధ్యయనము చేస్తే ఇటువంటి మనస్తత్వం గల స్త్రీలు మధ్యోత్తర భారత దేశంలో ఎక్కువ.
ముక్తి
……..ఆఖర కు బ్రహ్మ-ముహూర్తం వేళ నాన్న ఆఖరిశ్వాస తీసుకున్నారు. గత కొన్ని రోజులగా డాక్టర్ గారు మా కుటుంబ సభ్యులతో చెపుతూనే వచ్చారు- “దేముడ్ని ప్రార్థించండి ఇంకా ఈయన్ని తన దగ్గరకు పిలుచ్కోమని,…. అన్యథా ఒకసారి కాన్సర్ నొప్పి, బాధా మొదలయిందంటే అసలు తట్టుకో లేరు.” మా ఇంట్లో వారి మనస్సులో కూడా ఇదే భావం మెదులుతున్నా పై నుంచి మాత్రం దుఃఖం గాంభీర్యం చూపిస్తూ మౌనంగా ఉండిపోయారు. మళ్లీ ఊరడిస్తూ ఆయనే అన్నారు “మీరూ ఆలోచించండి, ఇంత కంటే సుఖమైన మృత్యువు ఎవరికి ప్రాప్తం!! నలుగురు పిల్లలూ తమ తమ జీవితాల్లో స్థిరపడటమే కాదు, తండ్రిని ఎంత బాగా చూసుకుంటున్నారు!! ఇవాళ రేపు ఒకరితో ఒకరు అల్లుకు పోయిన ఇటువంటి కుటుంబం ఎక్కడ ఉంటుంది? ప్రతి ఒక్కరూ వచ్చి ప్రతిసారీ ఈయన పరిచర్యలో ఎక్కడ ఏంలోటు ఉండి పోతుందేమో అని మరీ మరీ చూసుకుంటున్నారు….” డాక్టర్ గారి మాటనే అందుకుంటూ నాకూ చెప్పాలనిపించింది
“ఇలా నాన్నకి వైద్యం చేస్తూ చేస్తూ మీలా మా కుటుంబంలో ఒకరిగా కలిసి పోయే డాక్టరు కూడా అందరికీ సులభం కాదు.” ఎందుకో కానీ నేను కూడా మిగతా వారి లాగానే మౌనంగా ఉండి పోయాను.
వీటన్నింటి కంటే ముఖ్యం-“ ఇంత సేవా భావంతో రాత్రి అనక పగలు ఆనక నిరంతరం ఇలా నాన్న కాళ్ళువత్తుతూ కూర్చొనే భార్య ఎంతమందికి ప్రాప్తం? నాన్న పట్ల అమ్మకి ఉన్న ఆ సమర్పణా భావం చూసి నాకే చాలా ఆశర్యంగా ఉంటుంది. ఈవిడదీ కూడా పెద్ద వయస్సే కదా. ఇలా గత ఎనిమిది నెలల నుంచీ నాన్నకి పరిచర్యలు చేసి చేసి అలసిపోవటం లేదా?” తన వాక్యం పూర్తి చేయకుండానే డాక్టర్ గారు కూడా ఓ సారి అమ్మకి నాన్న పట్ల ఆ దీక్షా భావానికి తల వంచే ఉంటారు. కనీసం ఒకరైనా అమ్మలోని ఈ భావాన్ని గుర్తించారు. మిగతా వారికీ అమ్మ వేపు ధ్యాసే వెలటంలేదు.
ఆవిడ అలా పరిచర్య చేస్తూంటే అదే ఆవిడ నియతి, భాగ్యం అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. ప్రతి ఒక్కరి ధ్యాస నాన్న వైపే ఉంది. అది సహజం కూడా. ఆయనకి వచ్చిన జబ్బు కూడా అటువంటిదే. కానీ ఇలా ఇహ పర స్మృతి లేకుండా అమ్మ నాన్నకి చేస్తున్న పరిచర్య చూస్తూ ఉంటే నాకు అమ్మ ఆరోగ్యం కోసం బెంగ మొదలైంది. ఆవిడ కూడా జబ్బు చేసిందంటే ఆవిడలా నాన్నకి పరిచర్య చేసేది ఎవరు? పగలస్తమానం తైలంతో నాన్న గుండెల పై మర్దన, రాత్రంతా కాళ్లు నోక్కించుకుంటున్నారు. ఒక్క సారైనా “అయ్యో, అమ్మ కూడా మనిషే, ఆవిడకి కూడా ఆకలి నిద్ర ఉంటాయ” ఆని నాన్న గ్రహించారా? ఎంత సేపూ తనకి కావాల్సినట్లు జరిపించుకోవటం తన హక్కులా ప్రవర్తి స్తున్నారు. ఉండపట్టలేక నేనే ఒక సారి “ అమ్మా నువు ఒకసారి నడుము వాల్చిరా. అప్పటి వరకూ నేను కాలు వత్తుతాను.”అంటూ నేను ఆ పని అంది పుచ్చుకోంగానే నాన్న నా చేయ తోసేసి, విసుగ్గా ‘ఏమక్కరలేదులే’ అని పక్కకి తిరిగి పడుకుండిపోయారు. ఆ తరువాత నేను కూడా ఆ మాట అనలేదు.
నిన్న రాత్రి తొమ్మిది గంటలకు మేము రాత్రి భోజనం చేసి లేచే సరికి ఫోన్ మోగింది. ఫోన్ ఎత్తేసరికి అటునుంచి మా బాబాయ్ “ చిన్నా, ముందు అన్నయ మాటపోయింది. ఇంకాసేపటికి స్పృహ కూడా పోయింది. డాక్టర్ గారు వచ్చి బాగా పరీక్ష చేసి చెప్పారు “ ఇంకా కొన్ని గంటలే మిగిలాయి. మీ వాళని పిలిపించండి. తరవాత నర్స్ ని పిలిచి కొన్ని పనులు చెప్పి వెళ్లిపోయారు. నువ్వు శివంకీ ఫోన్ చేసి తెల్లవారంగానే మొదటి ఫ్లైట్ లో వచ్చేయమని చెప్పు. లఖ్నౌ ఫోన్ చేసి మీ అక్కకి చెప్పు. అమెరికా నుంచి ‘నమన్’ అంత వెంటనే రాలేడు కానీ కబురు చెయ్యాలి కదా….. చూడు నువ్వు ఈ ఫోన్ కాల్స్ చేశాక నర్సింగ్ హోమ్ వచ్చేయ్. నేను బయట పనులు చూసుకోవాలి కదా….”
విని నేను కాసేపు స్తబ్దుగా ఉండిపోయాను. రవికి నేను చెప్పకుండానే అంతా అర్థం అయిపోయింది. దగ్గరకు వచ్చి ఆనునయంగా భుజం పై చెయ్యి వేసి “నర్సింగ్ హోమ్ వెళ్దామా” అని. అవునని తల ఊపాను. “బాబాయ్, ఏమన్నారు” అడిగాడు రవి. “నాన్న సృహకోల్పోయారుట. ఇంట్లో వారందరికి కబురు చేయమన్నారు. అంటే నాన్న ఇంక…..” నాకు ఇంకదుఖంతో నోరు పెగల్లేదు. రవి నా వీపు నిముర్తూ ఉండిపోయాడు. “ ధైర్యం తెచ్చుకో శివాని. నువ్విలా అయిపోతే మీ అమ్మకి ఎలా ధైర్యం చెపుతావు??” అమ్మ తలపుకు రాంగానే మనస్సు ఇంకా వికలమై పోయింది. కబురు తెలిసాక అమ్మ ఎలా బతుకుతుందో అని. వేను వెంటనే నన్నునేను సర్ది పుచ్చుకుని బొంబై పెద్దన్నయకి ఫోను చేశాను. చెప్పింది విని “ పోనీలే నాన్న ఇంకా ఎక్కువ బాధ పడకుండా ప్రశాంతంగా వెళ్లి పోయారు. తెల్లవారి ఫస్ట్ ఫ్లైట్ కి వచ్చేస్తాను. కానీ చూడు ‘సుషమా’ రాల్లేదు. పిల్లల్కి బోర్డ్ పరీక్షలు కదా!! అయినా అందరం వచ్చి ఏం చెయ్యాలి అక్కడ? అక్కకి ఫోన్ చేస్తే తను కూడా వీలైనంత త్వరగా వస్తానంది. మరేమీ అడగలేదు. నాన్న విషయం తెలిసిందే. సాటి ఆడదానిగా అక్క అమ్మ కోసం ఒక్క వాక్యం అయినా అనలేదు. ఏదో హాజరు వేయటానికి వస్తున్నట్లు వస్తున్నారు.
ఎదోగా అనిపించి రవితో అదే మాట అన్నాను. “ అలా ఎందుకు అనుకుంటున్నావు శివానీ? నీకు గుర్తు లేదా మీ నాన్న రీపోర్ట్స్ మొదటి సారి చూడంగానే మొదటి నాలుగు నెలలు మీ అన్నలిద్దరూ ఎంతంత సేపు వచ్చి కూర్చునేవారు. వైద్యానికి అయ్యే ఖర్చు మీ అన్నలిద్దరూ పంచుకున్నారు.
కాబ్బట్టే కదా మీ నాన్న గారిని నర్సింగ్ హోమ్ లో ఉంచగలిగాము? మిగతా వారు కూడా రోజూ వచ్చి చూసి వెళుతున్నారు కదా? అవును కాలంతో పాటూ అన్నీ కొంచెం మందగిల్లాయి. అది సహజమే కదా?” అని నాకు నచ్చ చెప్పాడు రవి. నిజమే కదా? నేను మాత్రం మునపటిలా నాలుగయదు గంటలు నాన్న దగ్గర ఎక్కడ కూర్చుంటున్నాను. ఇది జీవిత తథ్యం. రోగంకాలం ఎక్కువ అవుతున్న కొద్దీ రోగి దగ్గర మిగతా వాళు గడిపే సమయం తగ్గిపోతూ ఉంటుంది. కాలంతో పాటూ అంతా సామాన్యం అయిపోతునట్లు అనిపించినా ఎక్కడో మనస్సు పొరల్లో ఏదో జరగకూడని దాన్ని కోసం ప్రతీక్ష సమయం కూడా తగ్గి పోతుంది. అందుకేనేమో నాన్న మరణవార్తా అందరికీ దుఃఖాన్ని కంటే నిశ్చింతత ప్రసాదించింది. “ రిలాక్స్, శివాని, నువు ఇప్పుడు ఇవన్నీ ఆలోచించేకన్న అమ్మవిషయం ఆలోచించు. ఆవిడకి నీ అవసరం ఎంతైనా ఉంది.
కారు నర్సింగ్ హోమ్ ముందు ఆగితే ఇహ లోకానికి వచ్చాను. అమ్మని ఎలా ఎదురుకోవాలా అని’ అనుకుంటూ, లేని ధైర్యం తెచ్చుకుని, రూమ్ కి వెళ్ళి చూసి విస్తుపోయాను. అమ్మ ఇంకా అలా నాన్న కాళ్లు వత్తుతూనే ఉంది. నన్ను చూస్తూనే “చిన్నా నువ్వేమిటీ ఈ వేళప్పుడు వచ్చావు.”అని. నాకు అర్థం అయ్యింది – బాబాయ్ ఇంకా అమ్మ కి ఏం చెప్పలేదని. నేను కూడా వీలైనంత సహజంగా “ ఎమీలేదమ్మా, బాబాయికి ఏదో పని మీద వెళ్లవలసి వచ్చి నన్ను ఇక్కడకు పిలిచారు.” ఏం మాట్లాడాలో తేలిక అడిగాను- “ఇంకా ఏమీ తిన లేదా?” అన్నాను సణుగుతూ.
“అదేమిటి చిన్నా, ఇప్పుడే కదా మీ నాన్న ఇన్నాళ్ళకి మంచి నిద్ర పోతున్నారు. నేను కాళ్లు వత్తటం ఆపెనంటే, మేలుకువ వచ్చి ఎంత కేకలు వేస్తారో నీకు తెలియదా? నా తిండిది ఏముందీ, అది బొక్షులో ఉన్న కడుపులో ఉన్నా ఒకటే లేద్దు.”
నాన్న భయం అమ్మ మనసులో ఎంతలా పాతుకుపోయిందంటే, నిద్రలో ఉన్నారని తెలిసినా కాళ్లు వత్తటం మాత్రం మానలేదు. నాన్న కోపం అమ్మ ప్రారబ్ధం అన్నట్లు. అంత కంటే ఆశ్చర్యం, బోలెడు అనుభవం ఉన్న అమ్మకి అర్థం అవటం లేదా? అది నిద్ర కాదు, నాన్న స్పృహ లో లేరని. ఎనిమిది నెలల నాన్న జబ్బు అమ్మ ఆకలి నిద్రనే కాదు ఆవిడ మిగతా ఇంద్రీయాల్ని కూడా నిస్తేజంగా చేసినాయా? ఇంకాసేప్ట్లో జరగబోయే తంతు దాని పై అమ్మ ప్రవర్తన ఊహించొకోగలను నేను. అయినా అమ్మ ముందు అంత సహజంగా నేను ఎలా ఉండగలిగానో నాకే తెలీదు.
తెల్లవారి అయిదు గంటలకు నాన్న ఆఖరి శ్వాస తీసుకున్నారు. నేను రూమ్ కి వచ్చిన కాసేపటికే నర్స్ నన్ను పక్కకి పిలిచి చెప్పింది- తను మాటి-మాటికి లోనికి బయటకు వచ్చీ వెళ్లీచేస్తే అమ్మకు అనుమానం వచ్చి ఏడవటం మొదలేడుతుందని, ప్రతి పది నిమిషాలకి నన్నే నాన్న ఊపిరి తీస్తున్నారో లేదో చూడమంది. నాన్న తల నిమురుతున్నట్లుగా నేను అదే పరీక్షగా గమనిస్తున్నాను. ఆయిదు నిమిషాల క్రితం ఆయన ఊపిరి సరిగ్గా లేదనిపించి నర్స్ ని పిలిచాను. నర్స్ వచ్చి నాన్న పల్స్ చూసి నాన్న కాళ్ల పై నుంచి మెల్లగా అమ్మ చెయ్ తీసి పక్కన పెట్టింది. ఇక అమ్మని పట్టుకోవటం మా ఎవరి తరం కాలేదు. మా మిగతా దగ్గర బంధువులు ముందరే వచ్చి క్రింద నిల్చుని ఉన్నారు. నర్స్ కబురు ఇవ్వంగానే మా బాబాయి పిన్ని రవి అందరూ పైకి వచ్చారు. కేవలం అమ్మ తప్పితే అందరూ రాత్రి నుంచే మానసికంగా తయారయ్ ఉన్నారు. పిన్ని అమ్మ వీపు పై రాస్తూ ధైర్యం చెప్తోంది. కానీ అమ్మ మాత్రం అలా ఏడ్చి ఏడ్చి ఇంక ఓపిక లేనట్టు రెండుచేతుల్తో ముఖం దాచుకుని. మౌనంగా ఉండిపోయింది. నర్స్ సౌగ్య చేస్తే అమ్మని అక్కడ నుంచి లేవనెత్త పోయాను కానీ నా తరం కాలేదు. నాన్న కాళ్ల దగ్గర కూర్చొన్న మనిషి అలాగే ఉండి పోయింది. నాన్నతో పాటూ అమ్మ ప్రాణాలు కూడా పోయినాయా అనిపించింది. ఎలాగో ఇంటికి తీసుకువచ్చి అమ్మని నాన్న గదిలోనే కూర్చోపెట్టాము. గోడకి ఆనుకుని నెల పై కూలపడి పోయింది.
మిగతా వారందరూ బయటకు నడిచారు. నేను మాత్రం అమ్మకి తోడుగా ఉండి పోయాను.
తరవాతి కార్యక్రమం జరిగిపోతూనే ఉంది. పెద్దన్నయ మొదటి ఫ్లైట్ కి వచ్చేశాడు. ఏర్ పోర్ట్ నుంచి తిన్నగా నర్సింగ్ హోమ్ కె వెళ్లాడు. మా పిన్ని ఇద్దరూ ఇంట్లో సర్దుబాటు చేస్తున్నారు. పదకొండు గంటలకు నాన్నని ఇంటికి తెచ్చారు. అందరూ ఒక్కసారి గొల్లున ఏడవటం మొదలెట్టారు. ఖర్మ కాండం ప్రారంభించారు, ఏవేవో శ్లోకాలు చదివేస్తున్నాడు బ్రాహ్మడు. ఒకరి తరవాత ఒకరు వచ్చి నాన్న కాళ్ల కి దణ్ణం పెడుతున్నారు. అమ్మని పట్టుకుని బయటకు తెచ్చాము. నాన్న పాదాల పై తల వంచిన అమ్మని ఎలాగో లేవనెత్తి నేను నాన్నకి దణ్ణం పెట్టి వచ్చి చూస్త్నిని కదా అమ్మ అక్కడే కూల పడిపోయి కన్నీరు కారుస్తున్నది. ఇవాళ ఏ నాన్న కోసం అమ్మ అంతలా ఏడుస్తున్నదో, ఆయన తోటి ఆవిడ జీవితం ఎలా ఉండి ఉంటుంది. చిన్న పొరపాటు జరిగినా నాన్న కోప భయానికి వణికి పోతున్న అమ్మ గుర్తుకు వచ్చి నా కళ్లు ప్రహవించాయి. ఎలాగైనా కాసేపు అమ్మ నడుం వాలిస్తే బాగుండ్ను. కానీ అది అసంభవం అయింది.
సాయంత్రం ఆయిదు గంటలకు అందరూ తిరిగి వచ్చారు. అన్నయ అమ్మ దగ్గర కూర్చుని ఏదో ధైర్య వాక్కులు చెప్పాడు. అమ్మ మాత్రం ఇంకా ఏడ్చే శక్తి కూడా లేనట్టు మౌనంగా ఉండి పోయింది. కొంచెం ఆలస్యంగా అక్క కూడా వచ్చింది. గట్టిగా ఏడుస్తూ అమ్మని వాటేసుకుని ‘అయ్యో, నాకు నాన్న ఆఖరి చూపు అయినా దక్కలేదు. కొంచెం ముందు తెలిస్తే వచ్చేదాన్ని కదా ..’ ఎలాగో అక్కని ఊరుకోపెట్టి అవతలికి పంపించాను. పొద్దుటి నుంచి ఆకలితో ఉన్నవారు రాత్రి కొంచెం ఖిచడీ తిన్నారు.
అమ్మకి కూడా కొంచెం తినిపించటానికి ప్రయత్నించాను కానీ, రెండు చేతులూ జోడించి నాకో దణ్ణం పెట్టేసింది. మరునాడు పది గంటల నుంచీ పరామర్శకి రావటం ప్రారంభించారు. మగవారు బయటే కూర్చుండి పోయారు, ఆడవాళ్లు లోపల గదిలో ఓ పక్క, రెండో పక్క ముఖం మీద కొంగు కప్పుకుని అమ్మ. కాసేపు ఏడ్చి నాన్న ధైర్యం , కాన్సర్ జబ్బు గురించి మాట్లాడుతున్నారు.
పని కుర్రాడు సౌగ్య చేస్తే వెళ్లి వచ్చిన వారికి మంచి నీరు అందించాను. ప్రతి ఒక్కరూ ఒకే మాట- “ ఆయన అదృష్టవంతుడు. ఇది మరణం కాదు, ముక్తి.
లేకపోతే ఇలాంటి జబ్బుకి ఎలాంటి బాధా లేకుండా ఇంత ప్రశాంతగా పోయిన వారిని చూసామా? ఇది ఆయన పుణ్య ప్రతాపం కాకపోతే ఇంకేమిటీ? వారి మాటలు వింటూ నేను వంటగదిలోకి రాంగానే అక్క వడి వడిగా వచ్చి “ చిన్నా నువు ఇక్కడ ఉన్నావా? అమ్మ ఏంటి అక్కడే కూర్చుని నిద్ర పోయింది. నేను దగ్గరకు వెళ్ళి చూస్తే సన్నగా అమ్మ గురక వినిపిస్తునది. ఇంకా దగ్గరకు వెళ్లి అమ్మని లేపి కూర్చోపెట్టాను. కానీ నిద్ర వల్ల కూర్చోలేక పోతున్నది. నువు వచ్చి అమ్మని చూసుకో లేకపోతే………….”
“అమ్మ నిద్ర పోయిందా?” వెంటనే చేతిలోని ట్రే అక్కడే పడేసి పరుగు లాంటి నడకతో అమ్మ దగ్గరకు వచ్చాను. వదిన సాయంతో అమ్మని పక్క గదిలోకి తీసుకువెళ్లి మంచం పై పడుకోపెట్టాను. మెల్లగా తల పై రాశాను . క్షణంలో నిద్రలోకి జారుకుంది. ఇంతలోకి అక్క వచ్చి కొప్పడింది- “ అదేమిటే అమ్మని మళ్లీ నిద్ర పుచ్చావా? బయట పరామర్శకు వచ్చిన వారు చూస్తే ఏమనుకుంటారు? ఈవిడేమో దిట్టంగా నిద్ర పోతోందా…..”
“అక్కా, నువు చూడలేదు అమ్మ ఇన్నాళ్లూ. గత ఎనిమిది నెలల నుంచీ రాత్రీ పగలూ అనక, తిండీ నిద్ర లేక ఎలా గడిపిన్దో. నువు లఖ్నౌలో కూర్చుని ఉన్నావు. కానీ ఇక్కడ ఉన్న వారుకూడా ఆవిడ్ని ఎన్నడూ గుర్తించ లేదు.
ఎవరిదాకా ఎందుకు? ఎవరి సేవలో అమ్మ ఇన్నాళూ అంతా మర్చిపోయి జీవించిందో ఆ నాన్న ఎప్పుడైనా అనుకున్నారా- అమ్మ శరీరానికి కూడా అలసట ఉంటుందని. చిన్న పొరపాటు జరిగినా ఎలా కేకలు వేసేవారంటే, అమ్మ గజగజ వణికి పోయేది. ఈ ఎనిమిది నెలల్లో నాన్న పరిచర్యలు చేస్తూ చేస్తూ ఎంతలా నీరసించి పోయింది అంటే ఆవిడలో కూర్చుని ఏడ్చేశక్తి మిగల లేదు. ఆడవారందరూ బయటే గదిలో కూర్చొన్నారు కదా, నువు కూడా వెళ్లి వారితో కూర్చుండి పో. ఎవరైనా అడిగితే “అమ్మకి వంట్లో బాగోలేదని, కూర్చునే స్థితిలో లేదని చెప్పు.” అన్నాను అక్కతో. నా ముఖం పై తీవ్రమైన భావం చూసి ఏమనుకుందో కానీ అక్క మారు మాట్లాడకుండా ఏదో సనుక్కుంటూ వెళ్లి పోయింది. నేను వెళ్లి గది తలుపు మూసేసి, మరో పక్క ఉన్న కిటికీ తలుపు తెరిచాను.
రక, రకాల మాటలు వినిపిస్తున్నాయి. ఇది మనం దుఃఖపడే సమయం కాదు. సరైన సమయానికి ఆయనకు ముక్తి ప్రసాదించాడు దేముడు.
నేను వెను తిరిగి చూశాను. బయట నుంచి వస్తున్న శబ్దాలకు అమ్మ మేలు కుంటుందేమో, అని. కానీ లేదే. అమ్మ అలాగే ఆదమరచి నిద్రలో ఉంది నిశ్చింతగా.
*****
పుట్టిపెరిగి గ్రాడ్యుయేషన్ చేసింది జంషెడ్పూర్ లో. ఎం. ఎ. బెనారస్ హిందూ యూనివర్సిటీ నుంచి చేసాను. మా నాన్నగారు కీర్తిశేషులు శ్రీ భాగవతుల ఉమామహేశ్వర శర్మగారు స్వయంగా తెలుగుసాహిత్యం, భాష అంటే ప్రాణంగా చూసుకునేవారు. ఆఖరిశ్వాస వరకూ తెలుగు కావ్య రచనలు చేసి, తెలుగుతల్లి సేవ చేసారు. ఆయన ప్రభావం వలన కొంతా, అప్పటికే తెలుగు రచయిత్రిగా మంచి పేరు, ప్రఖ్యాతులు తెచ్చుకున్న శ్రీమతి సుగుణమణి (అరవింద) గారి ప్రోత్సాహం, సాంగత్యం వలన నాలో కథలు రాయాలన్న ఉత్సాహం పొంగిపొర్లింది. ఫలితంగా నేను ప్రయత్నపూర్వకంగా తెలుగు రాయటం, చదవటం నేర్చుకుని, స్థానిక పత్రిక కోసం రాసాను. అవి అందరూ మెచ్చుకున్నందున ఆంధ్రపత్రిక, ఆంధ్రజ్యోతి పత్రికలకు పంపటం, వారు వాటిని ప్రచురించటం జరిగింది. కథా రఅహ్యిత్రిగా పేరు తెచ్చుకుంటూన్న సమయంలోనే వివాహం జరిగి సంసార సాగరంలో మునిగితేలుతూ, స్కూల్ టీచర్ గా ఉద్యోగం చేస్తూ, జీవితాన్ని ఈ రెండింటికి అంకితం చేసాను. సంసార బాధ్యతలు కొంతవరకు తీరాక నాలోని రచయిత్రి నేను ఇంకా బ్రతికి ఉన్నానంటూ ముందుకొచ్చింది. ఈసారి నా బంధువు అయిన అనూరాధ ప్రోత్సాహంతో మళ్లీ రాయటం మొదలుపెట్టాను. నేను సాహితీ ప్రపంచంలోకి అడుగుపెడితే పైలోకంలో ఉన్న మా నాన్నగారు చూసి తప్పకుండా సంతోషిస్తారన్న ఆశతో…