యాత్రాగీతం

అమెరికా నించి ఆస్ట్రేలియా

(ఇటీవల మేం చేసిన ఆస్ట్రేలియా యాత్రని గురించి నా ట్రావెలాగ్ సిరీస్ “యాత్రాగీతం” లో భాగంగా ఈ నెల నుంచి మీకు అందజేస్తున్నాను. చదివి మీ అభిప్రాయం పెట్టడం మర్చిపోకండి.)

-డా||కె.గీత

భాగం-1

          కాలిఫోర్నియాలో గత పదిహేనేళ్లుగా నివాసం ఉంటున్న మాకు ప్రపంచయాత్రలు చెయ్యాలనే కోరిక ఇన్నాళ్ళకి నెరవేరే అవకాశం వచ్చింది. ఇలా ఇతర దేశాలకు వెళ్లాలంటే మాకున్న సమస్యలు ఇప్పటి వరకు రెండు. ఒకటి అమెరికాలో గ్రీన్ కార్డు రావడం, రెండు తగిన డబ్బు సమకూరడం. అమెరికాలో గ్రీన్ కార్డు లేకుండా ఇతర దేశాలకు వెళ్లడం వరకు బానే ఉన్నా, తిరిగి రావాలంటే ప్రతిసారీ ఇబ్బందే. ఇక్కడ కంపెనీ మారడమో, ఉద్యోగం మారడమో జరిగిన ప్రతిసారీ ఆయాదేశాల్లో వీసా స్టాంపింగ్ కోసం అమెరికన్ కాన్సులేట్ చుట్టూ తిరగాల్సిందే. ఇక రెండోది, అతికష్టమైంది డబ్బు. ఎంత చెట్టుకి అంత గాలి అన్నట్టు ఎంత సంపాదించినా ఇంటి మార్టిగేజ్ కి, పిల్లల చదువులకి ఖర్చు పెట్టాల్సివచ్చే తరుణంలో ఇతర దేశయాత్రలు కష్టమే. ఇక కరోనా తగ్గుముఖం పట్టి జనం ఇతర ప్రాంతాలకు తిరగడం మొదలు పెట్టడంతో 2022లో ఉన్నంత రద్దీ ఎక్కడా లేదన్న సంగతి తెలిసిందే. అయితే ఒక పక్క ప్రపంచ ఆర్థిక వ్యవస్థని అతలాకుతలం చేస్తున్న యుక్రెయిన్, రష్యా యుద్ధం వల్ల పెరిగిపోయిన విమాన ఛార్జీలు మరొక పక్క నీళ్లు చల్లుతున్నాయి. 

          ఇన్నిటినీ అధిగమించి ఇప్పటిదాకా వెళ్లని మరో దేశం వెళ్లాలనే సాహసానికి శ్రీకారం చుట్టాం. 

          డిసెంబరులో వచ్చే క్రిస్టమస్ సెలవులు రెండువారాల్లో వెళ్ళడానికి ఆగస్టు నెలలో నించి ఆలోచనలు ప్రారంభించాం. ముందుగా ఎక్కడికి వెళ్లాలనేది వాతావరణ పరంగా చూస్తే ఉత్తరార్థ గోళంలో ఇప్పుడు చలికాలం, మంచుపడే కాలం, దక్షిణార్థ  గోళంలో వేసవి కాబట్టి దక్షిణార్థ గోళానికే వెళ్లాలని నిర్ణయించుకున్నాం. నిజానికి లండన్ , పారిస్, గ్రీస్  వంటివో, ప్రపంచ ఎనిమిది వింతలు వంటివో లిస్టులో ఎన్నాళ్ల నించో ఉన్నా అవన్నీ ఉత్తరార్థ గోళంలో ఉండడం వల్ల వాటిని పక్కన బెట్టక తప్పలేదు. ఇక  దక్షిణార్థ గోళంలో మూడు ప్రముఖ ప్రదేశాలు లెక్కకి  వచ్చాయి. ఒకటి ఆస్ట్రేలియా- న్యూజిలాండ్ (ఓషియానా),  రెండు దక్షిణ అమెరికా, మూడు దక్షిణ ఆఫ్రికా. 

          ఇందులో చిన్నప్పటి నుంచి సిడ్నీ ఒలింపిక్స్ గురించి, జనవరి ఒకటో తారీఖున ఓపెరా హౌస్ దగ్గిర జరిగే సంబరాల గురించి విన్నప్పుడు, టీవీలో చూసినప్పుడు,  కంగారూల గురించి, ఆస్ట్రేలియా స్థానిక ప్రజల గురించి, అతిపెద్ద దేశం కాబట్టి అక్కడి వాతావరణంలోని మార్పుల గురించి, అసలు పూర్తిగా దక్షిణార్థ గోళంలో ఉన్న ఆ భూ భాగం గురించి ఎన్నో ఊహలు, చూడాలన్న తపన పెరిగిపోయి ఉండడంతో ఆస్ట్రేలియాకి మొదటి ఓటు పడిందన్నమాట. 

          మరి ఆస్ట్రేలియా అతిపెద్దది కదా. ఇందులో ఏమేం చూడాలి? ఏ ప్రదేశాలని ఎన్నుకోవాలి అనేది తర్వాతి ప్రశ్న. ఇందుకోసం ఎంతో రీసెర్చి చేసేం. మిత్రులని సంప్రదించేం. మొత్తానికి సిడ్నీ తరువాత మేం అనుకున్నది క్వీన్స్ ల్యాండ్, ఆ తరవాత మెల్ బోర్న్. ఈ మూడింటిని, లేదా రెండిటిని కలిపే ప్యాకేజీ టూరు కోసం వెతికేం. అలాగే ఇంచుమించుగా  పది, పన్నెండు రోజుల టూరు చాలనుకున్నాం. అంతకు మించితే సెలవులు, బడ్జెట్టు రెండూ మించిపోతాయి. 

          విడివిడిగా విమాన, హోటలు ఛార్జీలు, అక్కడ చూడాల్సిన ప్రదేశాల ఖర్చులు – ప్యాకేజీ టూర్లతో పోల్చి లెక్కవేస్తే  ప్యాకేజీ టూరు మంచిదనే నిర్ణయానికి వచ్చాం. అందుకు ఎన్నో ప్యాకేజీ టూర్ల కంపెనీల ఆన్ లైన్ రీసెర్చి, ఫోన్ కాల్స్ఉపయోగపడ్డాయి. 

          మొత్తానికి ట్రిప్ మాస్టర్స్ డాట్ కామ్ అనే కంపెనీలో మాకు నచ్చిన ప్యాకేజీ  దొరికింది. అయితే కొన్ని ఎడ్జస్ట్ మెంట్లు చేసుకోవాల్సి వచ్చింది. మొదటిది డిసెంబరు మూడు, నాలుగు వారాల సెలవుల్లో వెళ్లడం వల్ల ఖర్చు రెట్టింపు అవుతుంది కాబట్టి కనీసం మా పెద్దమ్మాయి సెలవులు ప్రారంభం కాగానే, అంటే డిసెంబరు మొదటి, రెండు వారాల్లోనే వెళ్లిరావడం. అలాగే బేసిక్ పేకేజీని మాకు నచ్చినట్టుగా మార్చుకోవడం. అంటే నలుగురం వెళ్తున్నాం కాబట్టి వాళ్ళిచ్చే డబుల్ బెడ్స్ కాకుండా మాకు కావాల్సిన క్వీన్ బెడ్స్ ఉన్న రూమ్ కి మార్చుకోవడం, కనీసం మూడున్నర, నాలుగు స్టార్ల హోటలు తీసుకోవడం వంటివి. ఇక పిల్లల్తో కొత్త ప్రదేశానికి వెళ్తున్నాం కాబట్టి  ఎయిర్పోర్టు నించి పికప్, డ్రాపాఫ్ వంటివి కూడా కలిపాం. కరోనా తగ్గుముఖం పడ్తున్న సమయం కాబట్టి ఎందుకైనా మంచిదని వీలైనంత వరకు స్మాల్ గ్రూపుటూర్లు, కుదిరితే మాకు మాత్రమే ప్రత్యేకించిన వెహికిల్స్ లో వెళ్ళిరావడానికి చూసుకున్నాం. ఇక మా చిన్నమ్మాయి ఎక్కువ దూరం నడవడానికి పేచీ పెడుతుంది కాబట్టి తనకి కుదిరే విధంగా చూడాల్సిన ప్రదేశాలని, టూర్లని ఎన్నిక చేసుకున్నాం. అలాగే పిల్లలకి ఇష్టమైన ప్రదేశాలకే మొదటి  ప్రాధాన్యతని ఇచ్చేం.  

          ఇక అన్నీసరే. ముందుగా ఆస్ట్రేలియా వీసా తీసుకోవాలి కదా. అయితే ఇక్కడో తిరకాసుంది. ఆస్ట్రేలియా వీసాకి తప్పనిసరిగా ఒక ఐటినరీని కూడా అప్లికేషనుతో బాటూ సబ్మిట్ చెయ్యాలి. అలాగని టూరు వాళ్లకి ముందు డబ్బులు కట్టేస్తే ఆ తర్వాత వీసా రాకపోతేనో! కాబట్టి  డబ్బులు కట్టకుండా ఐటినరీ డౌన్ లోడ్ చేసుకోనిచ్చే సైట్లు కూడా చూసుకోవాలన్న మాట.  

          అలాగే వీసా వచ్చిన తర్వాతే ప్యాకేజీ కొనుక్కోవాలి. కానీ ఇటువంటి ప్యాకేజీలు ఎంత ముందు కొనుక్కుంటే అంత చవకగా వస్తాయి. వీసా వచ్చేసరికి ప్రయాణం దగ్గిర పడిందంటే ఖర్చు ఆకాశన్నంటుతుంది. మరెలా?

*****

(సశేషం)

 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.