వాడ్రేవు వీరలక్ష్మీ దేవి గారి ‘మా ఊళ్ళో కురిసిన వాన’

-సుశీల నాగరాజ

          డా. వాడ్రేవు వీరలక్ష్మి గారి వ్యాసమాలికల పుస్తకం “మా ఊళ్ళో కురిసిన వాన” చదివిన తర్వాత నా మనసు పలికిన పలుకులు!
 
          మీరు పంపిన పుస్తకాలలో ఒకటి  ” మా ఊళ్ళో కురిసిన వాన” అన్నీ వ్యాసాలు ఒక్క రోజే గుక్కతిప్పుకోక చదివేశాను! చదువుతున్నంతసేపు నాకు నేను చదువుతున్నట్లు కాక మీరు నా ఎదుట కూర్చుని చదువుతున్నట్లు మీ స్వరం నా చెవుల్లో​ వినిపించాయి!!
 
          మీ వ్యాసాలు చాలా సరళంగా, మన దిన నిత్య జీవితంలోని ఘటనలుగా కళ్ళ ముందు కదిలిపోయాయి ! మనసులో నిలిచిపోయాయి! అనుభవైక్యమైన అందరి మనసుల్ని, అట్టడుగున ఉన్న జ్ఞాపకాల్ని తట్టి లేపుతాయి! సుప్తంగా దాగిన నిధిలా వెలుపలికి వస్తాయి!
 
          మనం పుట్టి పెరిగిన, చదువుకున్న పాఠశాల, మనచేత ఓనామాలు దిద్దించి చదువు నేర్పిన ఉపాధ్యాయులు​, మనం తిరిగి ఆడుకున్న స్థలాలు ప్రతి ఒక్కటీ మీతో పాటూ నన్నూ వెంటాడాయి! 
 
          చాలాచోట్ల సుతిమెత్తగా జీవిత సత్యాల్ని బోధించారు! ఎక్కడ మనం తప్పటడుగు వేస్తున్నాము, మనం ఏమి కోల్పోతున్నాము, ఎలా బంధాల్ని నిలుపుకోవాలి, పెనవేసు కోవాలి! వెనుకటి వివాహాలలో పెళ్ళి పనులు ఇరుగు పొరుగూ, బంధువులు కలిసి చేసిన పిండి వంటలు, వడియాలు అప్పడాలు , ఆడుకున్న పరాచికాలు!!! ఇప్పుడు అన్నీ ఆర్డర్ చేసి మేకప్ వాళ్ళతో మేకప్ చేయించుకుని పెళ్ళి పీటలకు వస్తే చాలు. ముద్దు ముచ్చట్లు మాయం. అంతా యాంత్రికం! ప్రతి వ్యాసమూ మన ఆధునిక జీవితాన్ని ప్రతిబింబిం చింది. మనం ఏమి కోల్పొయాము అని తట్టి చూపించారు!. కుటుంబ జీవితం, పిల్లలతో అనుబంధం, పెద్దమ్మ, పిన్నమ్మ, పెదనాన్న, పెద్దత్త, ఇలా బంధువు లను, ప్రకృతిని, డాబా మీద కూర్చుని, వెన్నెల్లో చేతిముద్దలు తింటూ విన్న కథలూ అన్నీ పోగొట్టుకున్నాం!
 
          ఇస్మాయిల్ లేని లోటు, షాపింగ్ మాల్స్ , అప్పటి ఫాలోవర్స్ అంటే ఎవరు, గాంధీ అనుయాయులు, పైషర్టు లేకుండా ఒకరు, కాళ్ళకు చెప్పులు లేకుండా మరొక్కరూ, ఇలా ఉదాహరణంతో రాశారు! వారి ఋతువుల వర్ణణ అవర్ణణీయం!
 
          మనం వేర్లను రక్షించుకుంటే ఈ సరికొత్త ప్రళయం నుంచి , నేడు మనం చిక్కుకున్న విషవలయం నుంచి బయటకు వచ్చే ఆశాదీపం ఈ పుస్తకం! ఈ ప్రకృతి రక్షణ మన భుజస్కంధాల పై ఉంది ! గాలి, నీరు, తినే తిండి కల్మషం లేకుండా దొరకాలి! మీకు ధన్యవాదాలు లక్ష్మి! మనసును ఒక్కసారి తట్టి లేపింది! ఇంత కన్నా సంతృప్తి సార్థకత ఏం కావాలి రచయిత్రికి, పుస్తకానికి !!.
*****
Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.