విజయవాటిక-18
చారిత్రాత్మక నవల
– సంధ్య యల్లాప్రగడ
ఇంద్రపురి యువరాజు మందిరము
ఎత్తైన ఆ యువరాజ మందిరములో స్తంభాల పైన చెక్కిన సింహముఖాలలో రాజసం ఉట్టిపడుతోంది. విష్ణుకుండిన రాజుల రాజముద్రిక సింహముఖము. వీరత్వానికి, ధైర్యానికి గుర్తు. పంజా ఎత్తి దెబ్బకొట్టటానికి సిద్ధంగా ఉన్న ఆ ముద్రను మొదటి గోవింద వర్మ కాలంలో స్వీకరించారు. తమ వీరత్వానికి గుర్తుగా వారు ఆ ముద్రను రాజముద్రికను చేసి వీలైనంత వరకూ వారి భవనాలలో, శిల్పాలలో జొప్పించారు.
యువరాజు మందిరంలోని స్తంభాల మీద మనకు ఆ ముద్ర కనపడుతుంది. పై నుంచి బరువుగా వ్రేలాడుతున్న తెరలు ఆ స్తంభాలకు కట్టి ఉన్నాయి. ఆ మందిరంలో గోడలకు అలంకరించిన విష్ణుకుండిన రాజుల తైలచిత్రాలుతో పాటు మహాదేవుని శిల్పాలను కూడా అలంకరించారు.
సింహాలు అటునిటు ఉన్న అందమైన ఆసనములో కూర్చొని ఉన్నాడు యువరాజు విక్రమేంద్రుడు.
ఆయన ఎదురుగా నలుగురు కూర్చొని ఉన్నారు. వారి వస్త్రధారణ చూస్తే వారు తెలుగువారులా లేరు. వారి ముఖ కవళికలు వారిని కళింగులని చూపుతున్నాయి.
వారు నలుగురు, భక్తితో ఉన్నారు. వారి శరీరములో అణుకువ అణువణువునా కనపడుతోంది.
మరో వైపు యువరాజు ఆంతరంగికుడు, మిత్రుడు అయిన భాస్కరుడు ఉన్నాడు. వారి మధ్య ఉన్న బల్ల మీద కొన్ని పత్రాలు పెట్టి ఉన్నాయి. ఆయన దృష్టి ఆయన ముందు ఉన్నవారి మీదలేదు. ఆ పత్రాల మీద కూడా లేదు. ఎటో చూస్తున్నాడు. కళ్ళు మూసుకొని, తెరచుకొని దీర్ఘాలోచనలో ఉన్నాడు.
కొంత సేపటికి కళ్ళు తెరచి భాస్కరును చూసి “భాస్కరా! ఇది నమ్మవచ్చా?” అన్నాడు.
భాస్కరుడు నవ్వాడు. నవ్వుతూనే “ప్రభూ! ముందు వీరిని విశ్రాంతి మందిరానికి పంపుదాము…” అన్నాడు.
ఆ మాటలో నర్మగర్భమైన శ్లేష ఉన్నది. యువరాజు విక్రమేంద్రవర్మ తలఊపాడు.
భాస్కరుడు చప్పట్లు చరిచాడు. ద్వారం వద్ద సేవకుడు నిలబడ్డాడు.
“వీరిని తీసుకొని మన విశ్రాంతి మందిరములో విడిది చేయించు…” అన్నాడు.
“చిత్తం ప్రభూ!” అంటూ అతను వారి వైపు చూసి “రండి” అంటూ ముందుకు సాగాడు.
వారు వెళ్ళిన తరువాత దండనాయకుని పిలిచి “వీరిని ఎటూ వెళ్ళకుండా విడిది గృహానికి కావలి ఉండండి…” అంటూ పంపివేశాడు భాస్కరుడు.
విక్రమేంద్రవర్మ మౌనంగా చూస్తున్నాడు.
ఆ బల్ల మీద కళింగరాజు సందేశము ఉంది.
ఆ సందేశం ఆనాటి ఉదయం కళింగ నుంచి కొందరు పెద్దల బృందం తీసుకు వచ్చారు. వారు కళింగరాజు అనంతవర్మ నుంచి సందేశం తీసుకువచ్చారు.
వారిని యువరాజు తన అతఃపురములో కలిశాడు. వారు తెచ్చిన సందేశం ఆయనను ఆలోచనలో పడేసింది. వచ్చిన వారు కళింగ ప్రధాన మంత్రి ఆదిత్యుని అధ్యక్షతన వచ్చారు.
“విష్ణుకుండినుల సామ్రాజ్య యువరాజు, భావి మహారాజు, పరాక్రమవంతులు, ధీశాలి, ధీరోదత్తులైన శ్రీ శ్రీ శ్రీ విక్రమేంద్రవర్మకు జయము కోరుతూ, మీ మిత్రుడు కళింగాధీశుడు, పరాక్రమవంతులు అయిన అనంతవర్మ మహారాజులు పంపుతున్న లేఖ.
మన ఉభయ దేశాలు సదా సస్యశ్యామలమై మెసలాలంటే, శాంతి భద్రతలు ముఖ్యము. అటు వంటి శాంతిని కోరుతూ మనము మిత్రులుగా కన్న బంధువులుగా ఉండటము ఉచితమని తలచి ఈ సందేశము పంపుతున్నాము.
మాకు రాజమాత, వైదికమతోద్ధరణాశీల , గంగాభవానీ సమాన మహారాణి వాకాటక మహాదేవి అంటే పరమ భక్తి. ఆమెకు మా ప్రణామములు. వారి కుమారులుగా మాకు మీరంటే కూడా ఎంతో గౌరవము ఉన్నది.
వీటి వలన మేము ఆలోచించి మీకు పంపుతున్న సందేశమిది. మా ఒక్కగానొక్క కుమార్తె, అవంతికాదేవి మా గారాలపట్టి. ఆమెకు నేడు వివాహము చెయ్యాలని మేము తలచాము.
మీ కుమారుడు ఇంద్రభట్టారక వర్మ గురించి విని ఉన్నాము. మా అమ్మాయి అందచందాలకు మీ కుమారుడు తగిన వాడని తలచి, మీకు ఈ సందేశము పంపుతున్నాము. మీరు ఈ సందేశముతో పాటూ పంపుతున్న జన్మ కుండలిని, చిత్ర పటాన్ని చూడగలరు. ఆలోచించుకొని మీ నిర్ణయము తెలియచెయ్యవలెను.
ఽఽఽస్వస్తిఽఽఽ”
అన్న ఆ లేఖను కళింగ మంత్రి చదివి వినిపించాడు.
అది విక్రమేంద్రునికి ఆశ్చర్యం కలిగించింది. కాని ఆయన బయటపడలేదు.
దాని విషయమై కళింగునితో స్నేహము తనకు భవిష్యత్తులో ఎంత లాభసాటి అన్న ఆలోచనలో ఉన్నాడు.
వచ్చిన కళింగ బృందాన్ని పంపి, భాస్కరుడు, యువరాజు ఆలోచించటం మొదలుపెట్టారు.
“ప్రభూ! వారితో సంబంధానికై మన మాహారాజు మాధవవర్మ ఒక బృందమును పంపినారని నేను విన్నాను…”
“అవునా… మరి ఈ లేఖలో ఆ విషయము చెప్పలేదు అనంతుడు…”
“ప్రభూ ! వారు ఎందుకు చెబుతారు? పైగా వారు ఇదే కుటుంబములో మనతో సంబంధము కలుపుకోవాలనుకుంటున్నారంటే, ఇదేమి రాజకీయమో ఆలోచించుకోవాలి..”
“అవును. అనంతుడు నాకూ మాధవునకూ శత్రుత్వమున్నదని తలచినాడేమో…”
“తలచినా, మన మధ్య రావటానికి ఆయనకు ఎంత ధైర్యము ప్రభూ!”
“ఆలోచించవలసిన విషయము…”
“అంతే కాదు, బహుశా మహాదేవవర్మకు రాజు అయ్యే అవకాశము లేదని, మన రాజకుమారునికి ఉందని ఆలోచించుకొని ఉండవచ్చు. తమరు యువరాజు. తమ తదనంతరము మరి మన రాజకుమారులే కదా ఏలిక…”
“అవును అలా ఆలోచించి ఉండవచ్చు…”
“ తన కుమార్తే మహారాణి కావాలని ఆశపడుతున్నాడు కాబోలు…”
“లేదా నాకు మాధవునితో పోరు సంభవిస్తే తను సహాయపడగలనని ఇది అన్యాపదేశమేమో, ఆలోచించు భాస్కరా…”
“అదీ అయి ఉండవచ్చు…”
“మా మాతృశ్రీ గారి ప్రస్థావన కూడా ఉన్నది చూచితివా…”
“అవును ప్రభూ! “వాకటకా మహాదేవి” అన్న విశ్లేషణను వాడినాడు చూచారా…”
“అవును…”
“ప్రభూ! అనంతునికి ఒక్కతే కుమార్తె. కుమారులు లేరు…”
“అంటే అనంతుని తరువాత ఆ రాజ్యము మన తెలుగు రాజ్యములో కలుస్తుందంటావా భాస్కరా?”
“అంతే కదా ప్రభూ! కాకపోతే ఎవరికి వెడుతుంది?”
“అసలు ఎందుకు మహాదేవవర్మను కాదనుకున్నారో తెలుసుకోవాలి మనము…”
“చారులను పంపుతాను ప్రభూ. కాని మనము పూర్తిగా ఈ సందేశమును కొట్టిపడెయ్య లేము. మీరు ఆలోచించాల్సిన విషయమిది…”
“చూద్దాము…” అన్నాడు విక్రమేంద్రవర్మ శ్రద్ధగా అవంతిక చిత్రపటాన్ని చూస్తూ.
తదనంతరము జాతకచక్రాన్ని రాజ జ్యోతిష్యులకు పంపారు. చిత్రపటాన్ని ఇంద్రభట్టారకునికి పంపారు.
వచ్చిన కళింగ బృందంతో ఆనాటి సాయంత్రం విందు ఏర్పాటు చేశాడు యువరాజు.
యువరాజు విక్రమేంద్రునికి కవిత్వమన్న ప్రీతి. కళింగ బృందంలో కవులు కావ్యగానము చేస్తున్నారు.
సంగీతము, కవితా పఠనముతో సాయంత్రం నెమ్మదిగా నడుస్తున్నది. యువరాజు కళింగ మంత్రితో మాటల సందర్భంలో “మీకు మా మహారాజు గారి వద్ద నుంచి కూడా వివాహ ప్రతిపాదన వచ్చినదని విన్నాము. మీరు దానికి ఎందుకు సమ్మతించక ఇటు వచ్చారు?” అంటూ వారిని సూటిగా అడిగాడు.
కళింగ మంత్రి తడబాటు లేకుండా, “ప్రభూ! మహారాజు మాధవవర్మ గారు ఈ సంబంధము కలుపుకోవాలని ఎంతో మనస్సుపడిన మాట నిజము. కాని మా జ్యోతిష్యులు మా రాజకుమారి జాతకానికి, మాహారాజుల పుత్రుని జాతకానికి పొసగదని చెప్పినారు. అందుకనే మా మహారాజు ధైర్యము చెయ్యలేకపోయినారు. ఆ విషయము చెప్పటానికి కూడా వారు ఎంతో వగచినారు…”
“అవునా.. ఏదో సంవత్సర కాలము తరువాత అన్నారని విన్నాము…”
“అవును ప్రభూ! నెమ్మది మీదట వచ్చి జాతకము కలవటము లేదని చెప్పాలని వారి ఆలోచన. కాని తెలుగువారిపైన ఆయన ప్రేమ అపారము. విష్ణుకుండినులతో ఏదో రకముగా సంబంధము కలుపుకోవటానికి మీకు ఈ ప్రతిపాదన పంపారు…” వివరించాడు కళింగ మంత్రి.
యువరాజు మరి ఏమీ మాట్లడలేదు.
కళింగ మంత్రి తెలివికి మనస్సులో మెచ్చుకున్నాడు.
“మేము మా రాజగురువులను సంప్రదించి, మాతృశ్రీ గారి అనుమతి స్వీకరించి మీకు కబురు పంపగలము” చెప్పాడు యువరాజు.
ఆనాటి విందు ముగిసింది.
***
అమరావతి
రాజమాత మండలదీక్ష సాగుతున్నది, నిర్విఘ్నముగా. ఆమె రోజు రోజుకు నీరసిస్తున్నట్లు చూసినవారు చెబుతున్నారు.
ఆహారం బాగా తగ్గించింది. ఆమె దేహము కాంతివంతం కావటం కూడా అందరూ గమనిస్తున్నారు.
ఆమె ఆనాడు కూడా పరమేశ్వరునికి రుద్రాభిషేకం చేసింది. అనంతరం కొంత సేపు శివపురాణం చదివి వినిపించుకున్నది, ద్విజోత్తమునిచే. తదనంతరం ఆమె రెండు పండ్లు తిన్నది. చిన్న లోటాతో పాలు త్రాగింది. తదనంతరం కొంత సేపు విశాంత్రి తీసుకొని మరల తన ధ్యానంలో మునిగింది.
ఆనాటి సాయంత్రం ఆమెను చూడ శ్రీకరుడు వచ్చాడు.
అతను ఆమెను ఈ మధ్య కొంత ఎక్కువగానే దర్శించి వెడుతున్నాడు. ఆమె అంటే అతనికి భక్తి. ఆమె అతనికి ఒక గొప్ప అద్భుతం.
రాజమాత శ్రీకరుణ్ణి పూజా మందిరంలోనికి రమ్మని కబురు పంపింది.
శ్రీకరుడు ఆ మందిరంలోనికి ప్రవేశించి దేదీప్యమానంగా ప్రకాశిస్తున్న రాజమాతకు భక్తితో ప్రణామాలర్పించాడు.
అతనికి తీర్థమిచ్చి కూర్చోబెట్టింది.
ఆమె పాదాల దగ్గరగా కూర్చున్నాడు శ్రీకరుడు.
“నాయనా కారా! ఈ రోజు నీతో ఒక విషయము చెప్పాలనుకున్నాను…” అన్నదామె ఉపోద్ఘాతంగా.
“చెప్పండి తల్లీ. మీ ఆజ్ఞను మహాప్రసాదముగా నిర్వహిస్తాడీ కారుడు…”
“నీవు ముందు నాకో ప్రమాణాము చెయ్యాలి…”
“అవశ్యము తల్లీ!!”
ఆమె పరమశివలింగం ముందున ఉన్న త్రిశూలం అందుకున్నది. అది చాచి “కారా ఎట్టి పరిస్థితులలో నీవు ఈ రాజవంశము కోసము సదా నిలబడి ఉంటానని, రాజ్యం ఖండ ఖండాలు కాకుండా నిలబడుతానని నాకు మాట ఇవ్వు…”
రాజవంశాల పద్ధతి ప్రకారం ఆ శూలము చివర తన వేలి రక్తం చిందించి ప్రమాణం చేశాడు శ్రీకరుడు.
“రాజమాతా! నేను ఈ రాజ్యం కోసము, ఈ వంశ ప్రతిష్ట కోసము నా చివరి రక్తం బొట్టు వరకు ధారపోస్తాను…”
రాజమాత తేరుకున్నది. ప్రక్కన ఉన్న పరిచారికకు ఆ శూలంనిచ్చింది. ఆమె అది శుభ్రము చేసుకోవటానికి వెళ్ళింది.
“కారా నాకు కొన్ని దినముల క్రిందట దుశ్శకునాలు కనిపించాయి. వాటి అర్థమేమని రాజగురువులను ప్రశ్నించాను. వారు చెప్పిన దాని బట్టి రాజ్యములో సంక్షోభము సంభవిచ్చవచ్చు. రాజ్య పీఠము కోసము అంతర్యుద్ధాలు జరగవచ్చు…” అంటూ ఆగింది రాజమాత.
* * * * *
(ఇంకా ఉంది)
తెలంగాణలో పుట్టి పెరిగారు. వివాహాంతరము అమెరికా వచ్చారు. గత పదహరు సంవత్సరాలుగా అట్లాంటా నగరములో నివాసముంటునారు. ఫీనిక్స్ విశ్వవిద్యాలయం నుండి ఎం. బి. ఎ డిగ్రి పొందారు. శ్రీవారు కొండల నల్లజర్ల టీ మొబైల్ లో పని చేస్తున్నారు. కుమార్తె మేఘన. స్టాంఫోర్డ్ లో రెసెర్చు అసిస్టెంట్ గా సైకాలజీ ల్యాబ్ లో పనిచేస్తున్నది. సాంఘిక సేవాసక్తితో వివిధ తెలుగు సంఘాలలో కార్యకర్తగా అట్లాంటా తెలుగు సంఘములో పని చేశారు. తానా, అమెరికన్ రెడ్‌క్రాస్, అట్లాంటా సాయి టెంపుల్, అట్లాంటా హిందూ టెంపుల్, వీ.టీ. సేవ ఇత్యాది సంస్థల్లో స్వచ్ఛంద సేవ సేవలందించారు. దక్షిణ ఆసియా స్త్రీల సంక్షేమం కోసము సేవలందించే ‘రక్షా’ సంస్థ వారి “Ramesh Bakshi Leadership” అవార్డును, ‘పాడుతా తీయగా’ వారి సహకార అవార్డును, సిలికానాంధ్రవారి అవార్డును అందుకున్నారు. “నేను వడ్డించిన రుచులు, చెప్పిన కథలు” అన్న పుస్తకం ప్రచరించబడింది. కౌముది, సంచిక, మాలిక, దర్శనం వెబ్ మ్యాగజైన్స్ లో వీరివి ప్రతినెలా ప్రచురితమౌతున్నవి. ఊహలుఊసులు అన్న తెలుగు బ్లాగు రచయిత.