వెనుతిరగని వెన్నెల(భాగం-43)
–డా||కె.గీత
(*“కౌముది” లో ధారావాహిక నవలగా 2015 నుంచి 2020 వరకు ప్రచురించబడిన “వెనుతిరగని వెన్నెల” ఇప్పటివరకు చదవని వారి కోసం కౌముది సౌజన్యంతో నెల నెలా ఆడియోతో బాటూ ఇక్కడ ఇస్తున్నాం.)
***
జరిగిన కథ: అమెరికాలో తన తల్లికి స్నేహితురాలు, స్త్రీలకు సహాయం చేసే సంస్థ “సహాయ”ను నడిపే ఉదయినిని కలవడానికి వస్తుంది సమీర. నాలుగు నెలల గర్భవతైన సమీర, తనకు విడాకులు తీసుకోవాలని ఉందని, అందుకు దోహదమైన పరిస్థితుల్ని చెపుతుంది. ఉదయిని “తన్మయి” కథ చెపుతాను, విన్నాక ఆలోచించుకోమని చెప్తుంది సమీరతో. చుట్టాల పెళ్లి లో కలుసుకున్న తన్మయి, శేఖర్ లకు పెద్దవాళ్ల అనుమతితో పెళ్లి జరుగుతుంది. పెళ్లయిన మరుక్షణం నించే శేఖర్ అసలు స్వరూపం బయట పడుతుంది. మొదటి సంవత్సరంలోనే అబ్బాయి పుడతాడు. శేఖర్ తో ఒక పక్క కష్టాలు పడుతూనే తన్మయి యూనివర్శిటీ లో ఎమ్మే పాసయ్యి, జే.ఆర్.ఎఫ్ సాధిస్తుంది. తన్మయి ఆశయాల్ని భరించలేని శేఖర్ గొడవ చేసి ఇంట్లో నుంచి వెళ్లిపోయి విడాకుల నోటీసు పంపుతాడు. ఎన్నో రోజులు పోరాడి, తన్మయి చివరికి శేఖర్ కు తనే విడాకులు ఇస్తుంది. హైదరాబాదు కు దగ్గర్లో తన్మయికి లెక్చరర్ గా ఉద్యోగం వస్తుంది.
***
కొత్త ఊరిలో కొత్త ఉద్యోగంలో చేరి రెండు నెలలయ్యింది. క్రమంగా అక్కడి జీవితానికి అలవాటు పడసాగేరు తన్మయి, బాబు.
ఆదివారం ఉదయానే స్కూలుకి తయారు చేసినట్టే బాబుని లేపి తయారు చేసింది.
చుట్టూ ఉన్న పిల్లలందరూ బాగా స్నేహితులయ్యేరు బాబుకి. పాలు తాగి, టిఫిను తినగానే ఆరుబయట పిల్లలతో ఆడుకోవడానికి పరుగెత్తేడు.
ఎప్పటి నుంచో మిగిలిపోయిన పనుల లిస్టు బయటికి తీసింది తన్మయి. అందులో మొదటిది పాత చీరొకటి చింపి కర్టెన్లు కుట్టడం.
గది బయట వాకిట గుమ్మంలో చాప పరిచి సూది, దారం, కత్తెర వగైరా సరంజామా అన్నీ సర్దుకుని దీక్షగా పని చెయ్యసాగింది.
“అమ్మా, నా దోస్తు వాల్లింటికి తోలుకుపోతానంటుండు. పొయ్యి రానా?” అన్నాడు బాబు.
చాలా త్వరగా బాబు అక్కడి ప్రాంతపు యాస నేర్చేసుకున్నాడు.
పిల్లలు ఎంత త్వరగా కలిసి పోతారో కదా! ఎటొచ్చి పెద్దవాళ్లకే భేషజాలన్నీ. కానీ తను అదృష్ట వంతురాలు. ఇక్కడ తన చుట్టూ ఉన్న వాళ్లు అంతా తనను ఆదరంగా చూస్తున్న వాళ్లే.
బాబు యాస విని తాయిబా బాబు దగ్గిరికి వచ్చి బుగ్గలు పుణికి “అబ్బో, ఎంత మంచిగ అడిగిండు!” అని ముద్దాడింది.
తన్మయి బాబుని ఫ్రెండుతో పంపడానికి తటపటాయిస్తూండగా, “నేను తోలుకుపోయి ఒప్పజెప్పి వొస్తాలె మేడం, నువ్వు ఫికర్ గాకు” అని ముందుకు నడిచింది తాయిబా.
వాళ్లలా వెళ్లగానే గేటు చప్పుడు అయింది.
ఎదురుగా నిలబడ్డ ప్రభుని చూసి ఆశ్చర్యపోయింది.
“అరే, ఇలా ఎలా ప్రత్యక్షమయ్యేడు! అసలితనికి ఇల్లెలా తెలిసింది?” తనలో తను అనుకుంది.
తన్మయి మనసులోని ఆలోచనలని కనిపెట్టినట్లు, “నాకు ఇల్లెలా తెలిసిందను కుంటున్నారా? ఇదేమన్నా మహానగరమా? మీ కాలేజీ దగ్గర్లో కిళ్లీ కొట్టు వాడినడిగినా ఇట్టే తెలిసిపోతుంది.” అన్నాడు చుట్టూ పరికిస్తూ.
అంతలోనే వీపు మీద వేసుకున్న బాగ్ ని కింద పెట్టి, వాకిట్లోనే ఉన్న చిన్న ముక్కాలిపీటను దగ్గరకు జరుపుకుని కూచున్నాడు.
“ఎందుకొచ్చినట్లు?” ఇంకా ఆలోచిస్తూనే ఉంది తన్మయి.
“పైగా ఒక ఉత్తరమైనా రాయకుండా ఇలా వచ్చేసేడేవిటి?”
అదే అడిగింది.
“అదేవిటి? మీరేగా, మీ కాలేజీలో కంప్యూటరు అసిస్టెంట్ కావాలని అడిగేరు. ఉద్యోగం ఖాళీలేదా మరి?” అన్నాడు కొంటెగా నవ్వుతూ.
తన్మయికి కాస్త చిర్రెత్తుకొచ్చింది. తను ఉద్యోగంలో చేరిన రోజెప్పుడో అడిగినప్పుడు, “ఆ పల్లెటూర్లో, అంత చిన్న కాలేజీలో తనకి ఉద్యోగమేవిటని పెద్ద ఫోజు కొట్టేడు. ఇప్పుడేమో ఇలా”
తన్మయి మొహంలోని సీరియస్ నెస్ చూసి, “అరెరే, మీకు కోపం వచ్చినట్లుంది. ఊరికే, ఏదో సరదాకి అన్నానులెండి. నిజానికి మీకు కంప్యూటరు నేర్పించాలని వచ్చేను.” అన్నాడు.
తను కంప్యూటరు గురించి కొద్దో గొప్పో వివేకానందా పాఠశాలలో నేర్చుకుంది.
ఇప్పుడు ఇతను వచ్చి తనకు నేర్పించేదేముంటుంది?
కొంచెం నిర్లక్ష్యంగా మొహం పెట్టి “నాకు కంప్యూటరు గురించి బానే వచ్చు” అంది.
“బానే అంటే?” అన్నాడు.
“డాస్ కమాండ్స్ , లోటస్ నోట్స్ వచ్చు. ఇంకా ఏవైనా నేర్చుకోవాలా?” అంది గొప్పగా.
సమాధానంగా “ఊ..ఇంట్రెస్టింగ్. ఇంకేం, ఇప్పుడు హాట్ టాపిక్ అయిన డాట్ కామ్ బూమ్ గురించి కూడా తెలిసుండాలి”అన్నాడు.
తన్మయి తెల్లమొహం వైపు చూస్తూ “మీ కాలేజీలో ఇంటర్నెట్ ఉందా?” అన్నాడు.
“ఇంటర్నెట్టా…అంటే?” సాలోచనగా అంది.
చిన్న చిరునవ్వు నవ్వి, “నాకు కొంచెం మంచి నీళ్లయినా ఇస్తారా?” అనడిగేడు.
తన్మయికి అప్పటి వరకూ తను వాకిట్లో నుంచే మాట్లాడుతున్నానని గుర్తుకొచ్చి, చప్పున గడప లోపలికి వెళ్లి, “లోపలికి రండి” అంది.
లోపలికి అడుగు పెడుతూనే గోడకున్న వివేకానందుడి పటం మీద రాసున్న వాక్యాలు బిగ్గరగా చదివేడు “Knowledge is stregth -Weekness is death”
మరొక మనిషి వస్తే కూర్చోవడానికి కుర్చీ కూడా లేదు తన దగ్గర. సమయానికి తాయిబా కూడా లేదు, అడిగి తెద్దామంటే.
తన్మయిని దాటుకుని, గది మూలనున్న చాప పరుచుకుని గోడకి జేరబడి కూచుంటూ, “అబ్బా, ఆశ్రమంలాగా ఎంత నిరాడంబరంగా ఉందో మీ ఇల్లు!” అన్నాడు.
అరల్లోని పుస్తకాల వైపు దృష్టి సారించి “అబ్బో ! అమృతం కురిసిన రాత్రి… ఆహా! మహా ప్రస్థానం…” అనసాగేడు.
తన్మయి ఆశ్చర్యంగా చూసింది.
“ఏం .సీ. ఏ చదివిన వాడికి ఇంత తెలుగు వచ్చా?”
అదేం పట్టించుకోకుండా, మహాప్రస్థానం తీసుకుని “మావూ కూసింత తెలుగు నేర్సుకున్నావండీ.. అంటూ
“నైలునదీ నాగరికతలో – సామాన్యుని జీవితమెట్టిది?
తాజ్ మహల్ నిర్మాణానికి – రాళ్ళెత్తిన కూలీలెవ్వరు?
సామ్రాజ్యపు దండయాత్రలో – సామాన్యుని సాహసమెట్టిది?
ప్రభువెక్కిన పల్లకి కాదోయ్ – అది మోసిన బోయీలెవ్వరు?”
అని బిగ్గరగా, గంభీరంగా చదివేడు.
తన్మయి ఆశ్చర్య చకితురాలై అలా నిలబడి పోయింది. “ఎంత బాగా చదివేడు!”
అతను పుస్తకం పక్కన పెట్టబోతూ ఉంటే “మరొకటి ..” అంది “అమృతం కురిసిన రాత్రి ” అతనికి ఇస్తూ బతిమాలాడుతున్నట్టు.
కాస్సేపట్లోనే ఆ గది నిండా కవితా సౌరభాలు విరిసేయి.
***
ఆదివారం కావడంతో కాలేజీ మూసేసి ఉంది.
కానీ, ప్రిన్సిపాల్ కాలేజీలోనే ఒక గదిలో మకాం ఉంటూ ఉంటారు కాబట్టి గేటు తెరిచే ఉంది.
ప్రిన్సిపాల్ యాదగిరిగారికి ప్రభుని పరిచయం చేసింది తన్మయి.
ఆయన సాదరంగా ఆహ్వానించి, “మీ అసుంటి యువకులు మా కాలేజీ ఇన్ స్ట్రక్టరు అయితే మంచిగుంటది” అన్నారు.
కంప్యూటరులాబ్ లో ఉన్న పది కంప్యూటర్లని చూస్తూ “ఊ…అన్నీ విండోస్” అన్నాడు ప్రభు.
తన్మయి, ప్రిన్సిపాల్ అర్థంకాక, ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు.
“గదిలో ఉన్న విండోస్ అన్నీ ఏ.సీ కోసమని మూసేసి ఉంచారు.” చప్పున అదే చెప్పింది తన్మయి.
“సారీ, నేను ఆపరేటింగ్ సిస్టం గురించి మాట్లాడుతున్నాను” అన్నాడు చిన్నగా నవ్వుతూ.
ఇలా కంప్యూటరుకి సంబంధించి తన అజ్ఞానం బయట పడినప్పుడల్లా అతని పెదవుల మీద కనిపిస్తున్న చిన్న నవ్వు తన్మయికి కోపాన్ని తెప్పించసాగింది.
అంతకు అంతా పట్టుదలా పెరగసాగింది “లాభం లేదు, ఎలాగైనా ఇవన్నీ నేర్చుకోవాలి” తనలో తను అనుకోబోయి పైకే అనేసింది.
ప్రభు ఈ సారి ప్రశంసా పూర్వకంగా నవ్వేడు.
అంతలోనే దీక్షగా పనిలో పడ్డాడు.
కంప్యూటరు ముందున్న వైరు కుర్చీలో కూర్చుని, చకచకా మీటలేవో నొక్కుతూ “ఇంకా కాన్ ఫిగర్ చేసినట్లు లేరు” అన్నాడు.
ప్రిన్సిపాల్ అతని పక్కకి కుర్చీలాక్కుంటూ మరొక కుర్చీ తన్మయికి చూపిస్తూ , “అవ్వన్నీ మాకు తెల్వది, ఇగో, మా తెలుగు మేడంకి తెలుస్తయి” అన్నారు.
ప్రభు కంప్యూటరు వైపే పరీక్షగా చూస్తూ, ఈ కంప్యూటర్లతో బాటూ ఇంకేవైనా వైర్ల వంటి సామాన్లు ఇచ్చేరా? అన్నాడు.
తన్మయి ఆ గదిలోనే ఒక పక్కగా ఉన్న గోద్రేజ్ బీరువా తెరిచింది.
కాలేజీలో ఇతర క్లాసురూములకూ, ఈ గదికీ నక్కకీ నాకలోకానికీ ఉన్నంత తేడా ఉంటుంది.
ఎంట్రన్సులో గాజు తలుపు, గదంతా ఎర్ర కార్పెట్టు, కొత్త బల్లల మీద కొత్త కంప్యూటర్లు, కీ బోర్డులు, మౌసులు, బల్లల కింద ఒక సీపీయూలు, వైర్లు, అన్నిటినీ మించి కొత్త వైరు కుర్చీలు, ఇదుగో ఈ బీరువాలో లాబ్ కి కావలసిన సమస్తమైన సామాన్లతో ఈ గదెక్కడ!
పెచ్చులూడిన గచ్చు, ఇంకుల సంతకాలతో రంగులు మారిపోయిన పాత బెంచీలు, అవసాన దశలో ఉన్న డెస్కులు, సంవత్సరాల తరబడి అరిగిపోయి వైట్ బోర్డు లయిపోయిన బ్లాక్ బోర్డులతో మిగతా క్లాసురూములెక్కడ!
“దీనిని కీ–బోర్డంటారు. ఇది దాదాపు టైపు మిషను వంటిదే….” ప్రభు ప్రిన్సిపాల్ గారికి ఒక్కొక్కటీ వివరిస్తూ ఉంటే తన్మయి విస్మయంగా వినసాగింది.
“ఇంత బాగా పాఠాలు బోధిస్తున్న టీచర్ ని ఇప్పటి వరకూ తను చూడలేదు“
మరో గంటలో అన్ని కంప్యూటర్లనూ ఒకసారి ఆన్ చేసి, ఆఫ్ చేసి, “ఆ బీరువాలో ఫ్లాపీ డిస్కులు ఇలా అందుకోండి “ అన్నాడు ప్రభు.
తన్మయి మొహంలో ప్రశ్నార్థకాన్ని చూసి, చిన్నగా నవ్వుతూ లేచెళ్లి, బీరువాలో ఒక మూలనున్న డిస్కుల పేకెట్టుని తెచ్చేడు.
“ఇందులో మీ ఆఫీసులో ఇదిగో, ఈ ఫైల్లో ఉన్న సమాచారాన్నంతా భద్రపర్చగలిగే “స్పేస్” ఉంటుంది” అన్నాడు.
తన్మయి, ప్రిన్సిపాల్ అర్థం కాక, మొహమొహాలు మళ్లీ చూసుకున్నారు.
ప్రభు ప్రిన్సిపాల్ గారి వైపు తిరిగి “నేను వచ్చే వారం మళ్లీ వస్తానండి. కాన్ఫిగర్ చెయ్యడానికి ఇక్కడ నాక్కాలవసిన సామగ్రి లేదు. నేను వచ్చేటపుడు నాతో తెస్తాను.” అని
తన్మయి వైపు తిరిగి, “నేను చెప్పేవన్నీ అర్థం కాకపోతే చెప్పండి. మళ్లీ చెపుతాను. నాకేం ఫర్వాలేదు. నిజానికి ఇదంతా కొత్త ప్రపంచం. రేపటి ప్రపంచం. అందులో నేనూ విద్యార్థినే” అన్నాడు.
ప్రిన్సిపాల్ నవ్వుతూ “మంచిది, మీకెన్నడు వీలైయినా రండి, గట్లనే మా పిల్లలకూ జర కంప్యూటరు చెప్పుండ్రి. ఆదివారమైనా మనం ఒక గెంట క్లాసులు పెడదాం, ఏమంటరు?” అన్నారు .
ప్రభు చిన్నగా నవ్వుతూ “అన్ని వారాలూ నాకు ఖాళీ ఉండక పోవచ్చండి. నా వరకూ ఎందుకు? మీ తెలుగు మేడంకి అన్నీ నేర్పిస్తాను. ఇక ఆవిడే చూసుకుంటారు” అన్నాడు సెలవు తీసుకుంటూ.
అతను మాములుగా అన్నా, ఎక్కడో కొంచెం కొంటెతనం కనిపించి, తన్మయి చిరుకోపంగా తల తిప్పుకుంది.
బయటకు రాగానే చెంగు చుట్టూ తిప్పుకున్నా కింద జీరాడుతున్న తన్మయి పొడవైన జడని చూస్తూ “ఏవిటీ మీ కోసం ఇంత దూరం వస్తే భోజనం పెట్టరా?” అన్నాడు.
వెనక్కి తిరిగి అతని ముఖం వైపు చూసింది. “అప్పుడే వెళ్లిపోవాలా “అన్నట్లు దీనంగా పెట్టిన ముఖం చూసి చిర్నవ్వు నవ్వి “నాకు వంట అంత గొప్పగా రాదు మరి” అంది.
“నాకు చాతనవును. బంగాళా దుంపల వేపుడు బాగా చేస్తాను” అన్నాడు హుషారుగా.
అతనితో నడుస్తూనే ఆలోచించసాగింది తన్మయి.
“ఎవరితను? తన జీవితంలోకి వేగంగా దూసుకు వస్తున్నాడు!
ఇతనికెలా చెప్పాలి? అసలే తను ఒంటరిగా ఉంటూంది. ఇలా అతను వారం వారం వస్తే చూసే వాళ్లకి బావుంటుందా?
చిన్నప్పటి నించీ తల్లీతండ్రీ కట్టుదిట్టాలతో పెంచేరు.
గట్టిగా నవ్వడమే పెద్ద తప్పన్నట్లు భావించే ఊర్లో పెరిగింది తను. ఇక మగ వాళ్లతో మాట్లాడడం కూడానా?
నరనరాల అంతరాంతరాల్లో జీర్ణించుకుపోయిన సమాజం పట్ల బెరుకు, భయం వెంటాడుతున్నాయి.
ఇతను నగరంలో ఉండడానికి అలవాటు పడ్డ యువకుడు. అతనికీ తనకీ ఎంతో భేదముంది.
పైగా అతను మగవాడు. సమాజంలో అతనికున్నంత వెసులుబాటు స్త్రీగా తనకు ఉందా?
ఎంతైనా తన జాగ్రత్తలో తను ఉండడం మంచిది.”
“ఏవిటీ? భోజనం పెట్టమన్నందుకే ఇంత దీర్ఘాలోచనలో పడ్డారా?” ప్రభు మాటవిని ఈ లోకంలోకి వచ్చి పడింది.
దారిలో కూరగాయల మార్కెట్టు లోపలికి నడిచింది.
అప్పటికే తనకి పరిచయమైన ఒకట్రెండు దుకాణాల వాళ్లు, “ఏం మేడమ్, సారా?” అనసాగేరు.
తన్మయి తల అడ్డంగా ఊపుతూ ఆ ప్రశ్నలకు సమాధానాలివ్వడానికి కష్టపడడం చూసి, ప్రభు “సారీ, మిమ్మల్ని ఇబ్బంది పెడ్తున్నానా?” అన్నాడు.
వాకిట్లో తాయిబా ఎదురైంది, “పొద్దు పొద్దున్నే ఏడికి పొయ్యిరు మేడం” అంటూ నవ్వుతూ ప్రభు వైపు చూసి చప్పున పక్కకి తప్పుకుంది.
ఇంట్లోకి అడుగుపెడుతూనే, “అయ్యో, కరివేపాకు మరిచిపోయాను, వెళ్లొస్తాను” అంది తన్మయి.
“మరేం ఫర్వాలేదు, నేను వెళ్తాను” అన్నాడు ప్రభు.
“వద్దు, నాకివన్నీ అలవాటే, ఈ లోగా మీరు కాస్త మొహం కడుక్కుని అలా చేరబడండి” అంది మడత మంచం వైపు చూపిస్తూ చెప్పులు వేసుకుని.
తన్మయికి ఒంటరిగా ఉంటూ, అన్ని పనులూ తనంతట తను చక్కబెట్టుకోవడం అలవాటైన మూలానో ఏమో గానీ, ఎవరి సాయం తీసుకోవడం, ఎవరి మీదా ఆధారపడడం ఇష్టం ఉండడంలేదు.
ప్రభు చిన్నతనం నించీ తెలిసిన వాడు, మంచి వాడు. ఆయినా అతను ఇంటికి వస్తే తనకెందుకు తెలీని ఆందోళన ఎందుకు కలుగుతూంది?
అతను మంచి సంస్కారవంతుడు కూడా.
గవర్నమెంటు ఉద్యోగానికి ఇంటర్యూకి వెళ్లినపుడు ప్రభుతో కలిసి బిర్లా మందిర్ కి వెళ్లిన రోజు జ్ఞాపకం వచ్చింది తన్మయికి.
బస్సులోకి ఎక్కే ముందు అతను తన చేతిని కాస్సేపు గట్టిగా పట్టుకున్నపుడు అతని చేతుల్లో తనని వదలలేని భావమేదో స్ఫురించింది.
ఎందుకైనా మంచిది అతనికి దూరంగా ఉండాలని అనుకుంది.
అనుకోవడమే కాదు, బిర్లామందిర్ మెట్లెక్కుతూ అదే చెప్పింది.
అందుకు సమాధానంగా “ చిన్నప్పుడంతా మీతో మాట్లాడాలని తపించే వాణ్ణి. కానీ, ఏదీ అమ్మాయి గారు ఎప్పుడైనా కరుణిస్తేనా? అఫ్కోర్స్, మనం చదివింది పల్లెటూరు కావడం వల్ల ఎప్పుడూ ధైర్యం చెయ్యలేకపోయాను. కానీ ఇప్పటికీ నేను దాచుకోవల్సిన అవసరం నాకు కనబడం లేదు. మీకు వెన్నెల్లో బిర్లా మందిర్ చూడడం ఇష్టం. ఒక స్నేహితుడిగా కనీసం ఆ కోర్కెని వెన్నెట్లో కాకపోయినా సాయంత్రపు వెలుగులో చూపించలేనా? నా వల్ల ఏదైనా తప్పు జరిగితే నన్ను క్షమించండి” అన్నాడు. అతని మాటల్లో సిన్సియారిటీ కనిపించింది తన్మయికి.
“మీకో విషయం చెపుతాను, ఏమనుకోరుగా” అన్నాడు కాస్సేపట్లో.
ఏవిటన్నట్లు చూసింది తన్మయి.
“సండే ఈజ్ గ్రేటర్ దేన్ మండే” అన్నాడు తనకు మాత్రమే వినబడేటట్లు.
అది తను ఇంటర్మీడియేట్ చదువుకునేటప్పటి మాట.
అమ్మాయిల లోదుస్తులు పొరబాటున పైకి కనిపిస్తే అబ్బాయిలు సర్దుకోమని చెప్పడానికి తమ కాలేజీలో వాడే మాట అది.
ఇతనికి ఇవన్నీ ఇంకా గుర్తున్నాయా? చప్పున సర్దుకుంటూ అప్రయత్నంగా నవ్వింది తన్మయి.
“హమ్మయ్య, అలా నవ్వుతూ ఉండొచ్చుగా ఎప్పుడూ. నవ్వుతుంటే ఎంత బావున్నారో మీరు” అన్నాడు మొహంలోకి ఆరాధనా పూర్వకంగా చూస్తూ.
సంధ్యవేళ బిర్లామందిర్ పై నుంచి నగరాన్ని చూడడం ఎంతో ఆహ్లాదంగా ఉంది.
చుట్టూ ఉన్న విశేషాలు చేత్తో చూపిస్తూ వివరిస్తున్న ప్రభు వంక చూస్తూంటే మనసులో అజ్ఞాత మిత్రుడు మెదిలేడు.
“మిత్రమా! నీకెన్ని రూపాలో కదా!” అనుకుంది తన్మయి.
అంత సేపు మాట్లాడినా తన వ్యక్తిగత జీవితం గురించి ఒక్క ప్రశ్న కూడా అడగని అతని సంస్కారానికి మనసులోనే అభినందనలు తెలుపుకుంది.
***
కరివేపాకు కొని వెనక్కు వస్తూ, “తను అనవసరంగా భయపడుతున్నట్లుంది. ప్రభు తన చిన్న నాటి పరిచయస్తుడు. ఇప్పుడు మిత్రుడు, తన మంచికోరేవాడు. కాలేజీలో పని కోసం ఒకట్రెండు సార్లు అతను వచ్చెళితే తనకు కలిగే నష్టమేముంది?”
అలా అనుకోగానే మనస్సు కాస్త తేలిక పడి వడివడిగా నడవసాగింది.
*****
(ఇంకా ఉంది)
డా|| కె.గీత పూర్తిపేరు గీతామాధవి. వీరు “నెచ్చెలి” వ్యవస్థాపకులు, సంపాదకులు. తూ.గో.జిల్లా జగ్గంపేటలో జన్మించారు. ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి కె. వరలక్ష్మి వీరి మాతృమూర్తి. భర్త, ముగ్గురు పిల్లలతో కాలిఫోర్నియాలో నివాసముంటున్నారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయంలోఇంగ్లీషు, తెలుగు భాషల్లో ఎం.ఏ లు, తెలుగు భాషా శాస్త్రం లో పిహెచ్.డి చేసి, 10 సం. రాల పాటు మెదక్ జిల్లాలో ప్రభుత్వ కళాశాల అధ్యాపకురాలిగా పనిచేసారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నించి 2006 లో “ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ” పొందారు.అమెరికాలో ఇంజనీరింగ్ మేనేజ్ మెంట్ లో ఎం.ఎస్ చేసి, ప్రస్తుతం సాఫ్ట్ వేర్ రంగంలో భాషా నిపుణురాలిగా పనిచేస్తున్నారు.
ద్రవభాష, శీతసుమాలు,శతాబ్దివెన్నెల, సెలయేటి దివిటీ, అసింట కవితాసంపుటులు, సిలికాన్ లోయ సాక్షిగా కథాసంపుటి, వెనుతిరగనివెన్నెల నవల, At The Heart of Silicon Valley -Short stories (2023),Centenary Moonlight and Other Poems(2023) ప్రచురితాలు. నెచ్చెలి ప్రచురణ “అపరాజిత” – గత ముప్పయ్యేళ్ల స్త్రీవాద కవిత్వం (1993-2022) పుస్తకానికి సంపాదకులు & ప్రచురణకర్త. ‘యాత్రాగీతం’ ట్రావెలాగ్స్, ‘కంప్యూటర్ భాషగా తెలుగు’ పరిశోధనా వ్యాసాలు కొనసాగుతున్న ధారావాహికలు. అజంతా, దేవులపల్లి, రంజనీ కుందుర్తి, సమతా రచయితల సంఘం అవార్డు, తెన్నేటి హేమలత-వంశీ జాతీయ పురస్కారం, అంపశయ్య నవీన్ పురస్కారం మొ.న పురస్కారాలు పొందారు.
టోరీ రేడియోలో “గీతామాధవీయం” టాక్ షోని నిర్వహిస్తున్నారు. తానా తెలుగుబడి ‘పాఠశాల’కు కరికులం డైరెక్టర్ గా సేవలందజేస్తున్నారు. కాలిఫోర్నియా సాహితీ వేదిక “వీక్షణం”, తెలుగు రచయిత(త్రు)లందరి వివరాలు భద్రపరిచే “తెలుగురచయిత” వెబ్సై ట్ వ్యవస్థాపకులు, నిర్వాహకులు.