శ్రీరాగాలు-8

పుణ్యం దేవుడెరుగు

(డా.కె.గీత “వెంకటేశ్వర మెట్ట కథలు” నించి)

-డా.కె.గీత

          నా చిన్నతనంలో మా తాతయ్య చచ్చిపోయాక అమ్మమ్మగారింటి దగ్గర నా మేనమామలే ఇల్లంతా నడిపేవాళ్ళు. మా అమ్మమ్మ మహా జాగ్రత్త గలది. ఒక్కోసారి అవసరమైనవి కూడా ఖరీదేక్కువైతే కొనేది కాదు. కొననిచ్చేది కాదు. మా పెద్దమామయ్య ఎప్పుడేనా అయిదు రూపాయల చేపలు కొన్నాడంటే, వంటింటి కవతలే అడిగేది ఖరీదు. రెండ్రూపాయల కంటే ఎక్కువైతే – బుట్ట గేటు కవతల పడేట్టు విసిరేది. మరొకటి చెప్తాను. నా యిరవయ్యవ పుట్టిన్రోజునాడు కాళ్ళకి దణ్ణం పెట్టి పళ్ళు చేతబెడితే, మా అమ్మమ్మ, ‘ఇంద… జాగ్రత్తగా వాడుకో’ అని ఓ కొత్త అర్ధరూపాయికాసు చేతబెట్టింది. అమ్మమ్మగా ఇంత జాణగా ప్రవర్తించే మా అమ్మమ్మ, నాన్నమ్మగా మాత్రం బహు దుబారా మనిషి అని వినికిడి. సరే ఇంతకీ పాయింటు కొద్దాం. నన్ను మా అమ్మమ్మ వారసురాలంటారు…గుణాల్లో మాత్రమే సుమా! అటువంటి పరమ జాగ్రత్త పరురాలికి (అదేంటోగానీ ‘పిసినారి’ అని నన్నెవరైనా అంటే నాకు చాలా కోపం వచ్చేస్తుంది) ఎంత గడ్డు సమస్య ఎదురైందో కదా!

          “ఏంటోయ్ పెద్ద కబుర్లు చెప్తున్నావ్? కష్టపడి డబ్బులు సంపాదించే వాడికి, ఖర్చు పెట్టడం కూడా తెలిసుండాలి. అదీ మొగాళ్ళ లక్షణం. నీకు నలభైయ్యైదు రూపాయలంటే లెక్కా పత్రం లేకుండా పోతున్నాయి. అరే! నేనెక్కడా చూళ్ళేదు ఇంత వెర్రి మొగుణ్ణి. వాడు నలభై అయిదూ అడిగేడే అనుకో… బేరమాడొద్దూ?! నీ జేబులో సొమ్ములు దండిగా వుంటే చాలు. నీ నోటికి హద్దూపద్దూ వుండదు”.

          “అది కాదు గీతా! నా మాట విను”.

          “నేను విన్నుగాక వినను. ఈ వెంకటేశ్వర మెట్ట మీదేనా ఇంత అయిపూ ఆజా
లేని రేట్లు? – భూలోకవంతా ఇంతేనా? నిన్ను పంపిస్తే అంతేలే. లోకంలో ఎక్కడన్నా ఉందా ఇంత అన్యాయం! అయినా నిన్ను అని ప్రయోజనం ఏంటట? నేనే వెళ్ళచ్చు గదా! లేదా నీ కూడా నేనూ రావచ్చు గదా! అయినా నువ్వెవరిని అడిగి వెళ్ళావయ్యా ఇంతోటి మాసిన బట్టల బుట్ట కొనేసేందుకు? పైగా ఆర్డరిచ్చి వొచ్చాడట నా సామి – ఇరవై రూపాయలు”

          “గీతా! నీకు ముక్కు పొడుగ్గా వుంటే వుందిగానీ, మరీ ఇంత ఆవేశం పనికిరాదు. కాస్త నే చెప్పేది వింటావా??…” – నవ్వుని మీసం వెనకాల నొక్కిపెట్టి ఏదో అనబోయాడు బావ.

          ఆ నవ్వు చూసేసరికి నాకు అరికాలి మంట నెత్తికెక్కిపోయింది!!

          “అంటే నేనింత వాగుకుంటున్నా నీకు నవ్వులాటగా కన్పిస్తూందన్న మాట. అత్త కొడుకు అత్త కొడుకు, అని సంబరపడి కట్టుకున్నందుకు ప్రతి విషయంలో బాగానే ఎగతాళి నేర్చుకున్నావ్. నేనెందుకు నెత్తీ నోరూ కొట్టుకుంటున్నానో నీకేమైనా కాస్తయినా అర్థం అవుతోందా అసలు?”

          “తల్లీ! నమస్కారం. ఇంక దండకం ఆపుతావా! బుద్ధి పొరపాటయ్యి నేనొక్కణ్నే వెళ్లి ఎడ్వాన్సు ఇచ్చాను. ఇంకో నాలుగు గంటల్లో రమ్మన్నాడు. సాయంత్రం తయారవ్వు. నువ్వే వచ్చి మాట్లాడుకుందువుగాని. ఇంక శాంతించి, భోజన కార్యక్రమాలు చూస్తే, త్వరగా కానిచ్చి……” అని మంచం మీది దుప్పటి బర్రున లాగి, దులిపి వేసాడు.

          నాకు నవ్వు వచ్చేసింది.

          “ఊ…ఊ… ఇవ్వేళ్టికి చేసిన నిర్వాకం చాలు” అని విసురుగా వంటింట్లోకి వెళ్ళిపోయాను.

          సాయంత్రం ఠంచనుగా నిద్రలేపి,  బయల్దేరదీసాను.

          వెంకటేశ్వర మెట్ట మీద కాస్త దిగువలోనున్న మేదర పేట అది. నాలుగైదు
కుటుంబాలున్నాయి.  కొందరు వెదురుని పేళ్ళుగానూ, తడికెలుగానూ చేస్తున్నారు. ఓ
ముగ్గురు నలుగురు అల్లుతున్నారు.

          ఓ నలభైయేళ్ళతను వణుకుతున్న చేతుల్తో చకచకా బుట్ట అల్లుతున్నాడు. మమ్మల్ని చూసి, “రండమ్మా! ఒక్క నిముషంలో అల్లీసేసి ఇచ్చీత్తాను” అన్నాడు.

          బండి దిగుతూనే… చీర చెంగు దోపి, ఓ కాలు మొదటి మెట్టు మీదేసి,
“ఏంటయ్యా! నీకిదేమైనా న్యాయంగా వుందా? ఒక్క బుట్టకి నలభయ్యయిదు తీస్కుంటావా?” అని స్పీడుగా అడిగేశాను.

          అతను చేసే పని ఆపకుండా, చేత్తోటి జబ్బంతా చిరిగిపోయిన చేతుల బనీనుని
పైకి లాక్కుని నెమ్మదిగా అన్నాడు.

          “తల్లీ! దర్మంగానే అడగతన్నావు. మా కట్టాలెవరితో సెప్పుకోం? వెదురు ఒకటి పదేను, ఇరవై రూపాయలయ్యింది. రోజల్లా గొడ్డుల్లా యేళ్లు కాయలు కాసీసీలాగా అల్లుతాం చిన్న చిన్న తడికెల్లాటయ్యి. బుట్టలు, సేటలు, అప్పుడప్పుడూ ఇలాటి ఆర్డర్లు తగులు తయ్యి… నెలకి ఓటో రెండో… నువ్వే ఆలోసించమ్మా. నాకు ముగ్గురు కుర్రోళ్లు. పని సేసేది ఒక్క సెయ్యి. తినీవి నాలుగు పొట్టలూ”

          “ఆ… అంత మిగలకుండా మీరు మాత్రం ఎందుకు పనిచేస్తారయ్యా? వచ్చిన
డబ్బులు అన్నీ ఏం చేస్తన్నావ్?”

          ఓసారి నాకేసి చూసి తలొంచుకుని, వొణుకుతున్న మెడతో అన్నాడు.

          “మాకు సిన్నతనంనించీ అలవాట్లయ్యిపోతయ్యి తల్లీ! పొద్దస్తమానం పనిసేసీసినాక, సాయింత్రానికి సుక్కడిపోవాల. నేపోతే పని జరగదు. పైగా ఈ సుట్టొకటీ…అరగంటకోటైనా పీల్చా పోతే యేళ్ళు పనిసెయ్యవు. ఇంక అయిపోయిన అలవాటుని మానుకోలేను. ఇయ్యన్నీ నేపోతే కాలూ సెయ్యీ ఆడదు. రెక్కాడితే గానీ డొక్కాడని సంసారాలు. పాపం పున్నెం బగమంతుడి కెరుక. నీకు తోచినంత ఇచ్చెళ్ళు తల్లీ! కట్టపడీవోళ్ళకి డబ్బు ఇలువ తెలుత్తాదంట. నా కట్టం… ఆడదానివి నువ్వెరగవా తల్లీ!” అని మూతికి తడికి బిగించి మా ముందుంచేడు.

          బావ వెనక్కి తిరిగి, పది రూపాయలు తీసి, “ ఇవి చాలునా” అన్నట్టు నాకేసి
చూసేడు. 

          నేనే జేబులో చెయ్యి పెట్టి, ఇంకో పదిహేనేసి, “ఇవ్వు బావా! అతని కష్టం మనకొద్దు” అనేసి రోడ్డు మీది కొచ్చేసేను.

(రచన-సంచిక -14- ఫిబ్రవరి, 1993లో ప్రచురితం)

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.