అవమానం
-సి.వనజ
భుజానికి బాగ్ తగిలించుకొని వడివడిగా నడుస్తోంది సింధు. మంటలు మండిస్తున్న ఎండకు వెరచి వంచుకున్న మొహంలోంచి అప్పుడప్పుడూ చిన్న నవ్వు వెలుగుతోంది. ఇంట్లో చిన్నతల్లి అల్లరీ, రవి తలపులూ కలగా పులగంగా సింధు పెదవుల మీద నవ్వు మొలకలవుతున్నాయి.
అంతలోనే గుర్తొచ్చినట్టు చేతి గడియారం వంక చూసుకుంది సింధు. రెండవటానికి ఇంకా పది నిమిషాలుంది. నడవవలసిన దూరాన్ని అంచనా వేస్తూ తలెత్తి చూసింది. మలుపు వరకూ మరో ఫర్లాంగు పైన ఉంటుందేమో. ఆ మీద మరో అర ఫర్లాంగు బస్. ఆఫీసులో పడిపోవచ్చు.
రోజూ ప్రొద్దున్న, సాయంత్రం గొప్ప హడావిడి పడిపోతూ మనుషుల్నీ, వాహనాల్ని మోసే రోడ్డు మధ్యాహ్నం పూట మత్తుగా పడుకుంది. నల్లగా మెరుస్తున్న మంటల్లోకి ఒక్కరో ఇద్దరో సాహసవంతులు మాత్రం కాలు పెడుతున్నట్టు రోడ్డు మీద ఒక్కరో ఇద్దరో. అప్పటికీ రవి అననే అన్నాడు “మిట్ట మధ్యాహ్నం ఎండలో ఏం వెళ్తావు? ఇంకో రోజు చూద్దాంలే” అని. ఇద్దరూ ఇష్టంగా చేసే పనుల్లో ఇదొకటి. రోజూ కనపడిన చిల్లరంతా చిన్నితల్లి కిడ్డీ బ్యాంకులో వేసెయ్యటం, ఎప్పుడు నిండుతుందా అని ఆత్రంగా చూసి నిండగానే బ్యాంకులో తన ఖాతాలో వెయ్యటం.
చిరుచెమటలు తుడుచుకుంటూ తల పైకెత్తిన సింధుకు దూరంగా మలుపు తిరిగి ఎదురుగా వస్తున్న వాహనం కనిపించింది, హీరో హోండా కామోసు.
“నేను హీరో హోండా తప్ప మరొకటి నడపను”
“ఆడపిల్లవు నీకెందుకని కాదుగానీ కొంత కాలానికి నీకే అది కంఫర్టబుల్ గా అనిపించదు.”
“అదీ చూద్దాం” పెంకిగా ఎగరేసిన తల మధ్యతరగతి వాస్తవాలతో రాజీ పడింది. డిగ్రీ పూర్తికాగానే ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం, పెళ్లి. ఇప్పుడుమాత్రం ఏమైంది? ప్రేమించే భర్త చక్కటి చుక్కంటి పాప. మధురమైన సంసారం, ఇప్పుడిక ఇల్లు కొనుక్కోవటమే ధ్యేయం. అవసరమైతే రవి స్కూటరుందిగా. ఎందుకో రవికి స్కూటరే ఇష్టం. నిజానికి ఇద్దరికీ పనికొస్తుందని ముందున్న చేతక్ అమ్మి కైనెటిక్ హోండా కొనుక్కున్నారు. కానీ ఎందుకో అది రవి బండే అనిపిస్తుంది తనకు. ఎప్పుడూ నడిపేది కూడా తనేగా.
అరె మోటర్ సైకిల్ మీదకు తోలుతాడా ఏం? రోడ్డంతా ఖాళీగానే ఉందిగా.
ఓ! ఆపుతున్నట్లున్నాడు. నవ్వుతూ ఆపు… ఎక్కడైనా తెలిసిన మొహమా? గుర్తురాదే.
పక్కవరకూ వచ్చిన బండి ఆగినట్లే ఆగి…వేగం అందుకుంది.
“బా…స్టర్డ్”
బండి వెనుక పరుగెత్తింది సింధు. మోటార్ సైకిల్ వేగం ముందు ఆవేశంతో పట్టు తప్పుతున్న కాళ్ళ బలం చాలలేదు. చూస్తుండగానే బండి కనుమరుగయింది.
అవమానం, దిగ్భ్రమ, దుఃఖం కలగలిపి ముంచెత్తుతుంటే చూస్తూ నించుండి పోయింది సింధు. షాక్ తో వంగుని కిందపడిన బాగ్ తీసుకోబోతూ అలాగే నిస్పృహగా మోకాళ్ళ మీద కూర్చుండి పోయింది.
పట్టపగలు నడిరోడ్డు మీద అంత ధైర్యంగా, అంత దుర్మార్గంగా వాడు వంటి మీద చెయ్యి వేసిన వైనం తల్చుకుంటే దుఃఖం, రోషం ముప్పిరి గొంటున్నాయి సింధును. పారిపోయిన వాడిని తలుచుకుంటుంటే గుండెల్లో మంటలు రేగుతున్నాయి సింధుకి, మోటార్ సైకిల్ వేగం పెంచుతూ వెనక్కు తిరిగి చిద్విలాసంగా వాడు చూసిన చూపు గుర్తు తెచ్చుకుంటుంటే మండుతున్న గుండెల్లో నొప్పికూడా తెలిసింది.
“ఏమండీ, ఏమైంది? గొలుసేమన్నా లాక్కుపోయాడా దొంగవెధవ” తలెత్తి చూసింది. సింధు ఎదురుగా ఎవరో ఏభై ఏళ్ళావిడ.
“లేదండి గొలుసేం ఎత్తుకుపోలేదు” అంటుంటే గొంతు జీరపోతోంది.
“మరి…? తెలిసిందిలేమ్మా. పోకిరీ వెధవలు తల్లి కడుపున పుట్టిన రకాలు కాదు”
“ఇక్కడే మా ఇల్లు. కాసిని మంచినీళ్లు తాగి పోదువుగాని”
“వద్దండీ వెళ్ళిపోతాను” నెమ్మదిగా ఆఫీస్ వైపు నడక ప్రారంభించింది సింధు.
ఆఫీసులో అడుగుపెడుతూనే ఫైలు పట్టుకుని మేనేజరు రూంవైపు పోతున్న ప్రగతి ఆగి పలకరించింది.
“వచ్చేసావా? ఈ ఎండలో ఏం ఆనందం! చూడు మొహం ఎట్లా అయిందో” అంటూనే ఆగి మొహంవైపు తేరిచూస్తూ “ఏయ్ సింధూ! ఏమైంది?” అడిగింది ప్రగతి.
ఏంలేదు. ఏంలేదు. అంటూంటేనే గొంతులోంచీ, మనసులోంచీ దుఃఖం తన్నుకు వస్తోంది సింధుకి.
“ఏయ్ సింధూ ఏమైందసలు. పద ముందు మొహం కడుక్కుందుగాని” ఖాళీగా వున్నా లంచ్ రూమ్ వైపు చేయిపట్టుకుని దారితీసింది.
మొహం మీద పడిన చల్లటి నీళ్ళు దుఃఖం చారల్ని కడిగాయి కాని, భారాన్ని తగ్గించ లేకపోయాయి.
ప్రగతి తెప్పించి కప్పులో పోసిన కాఫీ తాగుతూ చెప్పింది సింధు. వింటున్నంతసేపు ప్రగతి మొహంలో విస్మయం, కోపం పరుగు తీస్తూనే వున్నాయి.
“ఇప్పుడేం చేద్దాం. బండి నెంబర్ గుర్తుపెట్టుకున్నావు కదూ. పోలీసులకి కంప్లైంట్ చేద్దామా”
“ఫోన్ చేస్తే వెంటనే పట్టుకుంటారేమో”
“ఎక్కడికి చేస్తాం?”
“డైరెక్టరీలో ఉంటుందిగా. 100 అక్కడికి చేద్దాం.”
“అయితే నా టేబుల్ దగ్గరికి పద అక్కడైతే కాస్త విడిగా తెరిపిగా ఉంటుంది.”
డయల్ చేసి అవతల ఫోన్ ఎత్తి “హలో కంట్రోల్ రూమ్” అని వినిపించగానే “మేమో కంప్లైంట్ ఇవ్వాలండీ” అంది సింధు.
“ఏం కంప్లైంట్”
“రోడ్డు మీద నడిచివస్తూంటే ఒక వ్యక్తి మిస్ బిహేవ్ చేసాడు. బండి నెంబరు గుర్తు పెట్టుకున్నాను.”
“మీ పేరు”
చెప్పింది సింధు.
“ఏ ఏరియా నుంచి చేస్తున్నారు”
“నల్లకుంట”
“నల్లకుంట స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వండి. అక్కడికి లైను కలుపుతాను.”
మళ్ళీ పాత ప్రశ్నలే. ఓపిగ్గా సమాధానాలు చెప్పింది సింధు.
“అయితే మేడం, మిస్ బెహేవ్ చేయడమంటే ఏం చేశాడు. కాస్త వివరంగా చెప్తారా?”
“అంటే చాలా…” అని ఏం చెప్పటమో, ఎలా చెప్పటమో తెలియక ఆగి మళ్ళీ ” చాలా అసభ్యంగా ప్రవర్తించాడు” అంది.
“ఏమన్నా అన్నాడా?”
“అనటం కాదు చెయ్యి వేశాడు”
“చెయ్యేసి?”
“చెప్పండి మేడం”
సహనం నశించిపోతోంది సింధుకి. “చెయ్యొక్కటీ వేస్తే చాలదా? ఏం చేసుంటే మీకు కంప్లైంట్ కిందికి వస్తుంది? మీరు చెప్పండి. అవునో కాదో నేను చెప్తాను” తీవ్రంగానే అంది.
“అంత కోపమైతే యెట్లా మేడం. మీరోసారి పోలీస్ స్టేషన్ కి రండి. రిటెన్ గా కంప్లైంట్ ఇద్దురుగాని”
“అంటే ఇప్పుడు నా కంఠశోషంతా కంప్లైంట్ కానే కాదా? దీని ఆధారంగా మీరేమీ చేయనే చేయరా? బండి నంబర్ కూడా ఇచ్చాముగా?”
“చెయ్యమని కాదు కానీ మీరోసారి రండి”
“మంచిది” ఫోన్ పెట్టేసింది సింధు. సంభాషణ వింటున్న ప్రగతి కూడా సింధుతో పాటు నీరసపడి పోయింది.
కాసేపు ఇద్దరూ మౌనంగా కూర్చున్నాక ముందు ప్రగతే తేరుకుని “పోనీ ఈ చికాకులో ఇంక పనేం ఎక్కుతుంది. ఇంటికి వెళ్ళిపోతావా?” అంది.
“ఇంకో రెండు గంటలు ఇక్కడే కూర్చుంటే అయిపోయేదానికి ఎందుకులే. ఆడవాళ్ళం కదా అవసరాలెక్కువ. సెలవలు, పర్మిషన్లూ పొదుపుగా వాడుకోవాలి. ఇంక వెళతాను ఇప్పటికే ఆడవాళ్లు కబుర్లకే వస్తారని అపవాదులేవో ఉండనే వున్నాయిగా” లేచింది సింధు.
***
గుమ్మంలో అడుగుపెడుతూనే అమ్మచేతుల్లోంచి దూకుతున్న పాపను వారిస్తూ బాగ్ పడేసి గబగబా కాళ్ళూ చేతులూ కడుక్కొని వచ్చి పాపను చేతుల్లోకి తీసుకుంది సింధు.
పాపను చేతిలో పట్టుకుని పరధ్యాన్నంగా కూర్చుండిపోయిన సింధును అటుగా వచ్చిన అమ్మ మందలించింది. “పాలవేళ కాలేదూ. అది ఏడుస్తుంటే ఎక్కడున్నావ్” అన్న మందలింపుతో ఈ లోకంలోకొచ్చి జాకెట్ హుక్కులు తప్పించి పాపకు రొమ్మునందిస్తుంటే ఏదో కొత్తభావం ముల్లులా గుచ్చుతున్న అనుభూతి కలిగింది సింధుకి.
స్కూటర్ స్టాండ్ వేసి లోపలికి వచ్చిన రవి సోఫాలో కూర్చుని షూ విప్పు కుంటూ “ఏం సింధూ తొందరగా వచ్చేసేవు. బజారుకి వెళ్ళివద్దామనుకున్నాంగా. మీ ఆఫీసుకి వెళ్ళాను. మీ కొలీగ్ ప్రగతి కదూ పేరు. ఆటోలో వెళ్లిపోయావని చెప్పింది” అంటూ తలెత్తి చూసి”అరే సింధూ ఏమైంది? కన్నీళ్ళెందుకు” దగ్గరికొచ్చి రెండు చేతుల్లో పొదువుకుంటూ అడిగాడు.
గొంతులో నొప్పి కట్టిన కన్నీళ్ళనీ, అవమానాన్నీ మాటల్లోకి అనువదించి ఆగి ఆగి చెపుతున్న సింధుకి రవి చేతుల్లో చిత్రంగా ఓదార్పు లభించింది. ప్రగతితో, పోలీస్ వాళ్ళ తో మాట్లాడినప్పుడున్న ఆవేశం, ఉక్రోషం బదులుగా నిశ్చింత లభించినట్లయి ఊరట కలిగింది సింధుకి.
తెల్లవారి ఆఫీసుకి రోజూకన్నా కాస్త ముందుగానే తయారయిపోయి అద్దం ముందు టక్ సరిచేసుకుంటున్న రవిని పిలిచింది సింధు.
“తొందరగా రావాలి రవీ. పోలీస్ స్టేషన్ కి వెళ్ళాలి కదా. వస్తానని చెప్పాను.”
“తొందరేం లేదులే. ఒక్కక్షణం నువ్వు కూర్చో ముందు” అంటూ తానూ వచ్చి కుర్చీ లాక్కుని కూర్చున్నాడు.
ఒక్క క్షణం ఏం మాట్లాడాలో ఎట్లా మాట్లాడాలో తెలియనట్లు నిశ్శబ్దంగా ఉండి పోయాడు రవి.
“అది కాదు సింధూ. అన్ని పోలీస్ స్టేషన్లకు ఫోన్ చేసే ముందు నాకు చెయ్య వలసింది. మనం పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగటం అయ్యేపనేనా? నువ్వే చెప్పావుకదా. వాళ్ళేమన్నా చెయ్యటం మాటలా ఉంచి, మనం పోలీసుల చుట్టూ , పోలీసులు మన చుట్టూ తిరుగుతున్నారన్నదే పెద్ద వార్త అవుతుంది. అలాగని వదిలేద్దాం అని నా ఉద్దేశ్యం కాదు. బండి నంబరు గుర్తుంది కదా. నా ఫ్రెండొకడు ఎస్ ఐ గా చేస్తున్నాడు. వాడికి చెప్పాను. వాడు చూసుకుంటాడులే. మనం ఇక్కడితో వదిలెయ్యటం మంచిది.” యెంత అనునయంగా మెత్తగా చెప్పినా వింటున్న సింధుకి రాత్రి కలిగిన ఓదార్పు కరిగిపోయి మళ్ళా నిన్నటి మధ్యాహ్నపుటెండలో నడి రోడ్డు మీద కలిగిన ఒంటరి అనుభూతి కలిగింది. మాట్లాడకుండా లేచి బయటకు నడిచింది.
సమయానికి ఆ సబ్బిన్స్పెక్టర్ ఊళ్ళో లేడు. దాంతో మరో మూడు రోజులు మామూలు గానే గడిచిపోయాయి. నాలుగో రోజు యథావిధిగా సింధూ, రవీ తయారై స్కూటర్ మీద ఆఫీసులకి బయల్దేరిపోతున్నారు. సందు మలుపు తిరిగి రోడ్డెక్కబోయేంతలో ఏదో ఊరేగింపు అడ్డురావడంతో స్కూటర్ ఆపేసాడు రవి.
“స్త్రీల పై అత్యాచారాలు నశించాలి”
“లైంగిక నేరాలకు కఠిన శిక్షలు విధించాలి”
“కుటుంబ హింసను ఖండించండి”
“మహిళలపై హింస మానవ హక్కుల ఉల్లంఘనే”
దాదాపు వందా నూట యాభై మందున్న ఊరేగింపులో పట్టుకున్న ప్లేకార్డులు చూస్తూ నినాదాలు వింటోంది సింధు.
“రోడెక్కి అరవటం వల్లనే సమస్యలు పరిష్కారమయితే అందరూ ఇట్లా రోడ్లు మాత్రం ఎక్కితే సరిపోతుందేమో”
ఎప్పుడూ రవి సంభాషణలో తన స్నేహితుల సంభాషణల్లో దొర్లే మాటలే అయినా సింధుకవి కొత్తగా అనిపించాయి.
“అవును మరి మనకు న్యాయంగా కావలసినదాని కోసం అడగటమూ రాదు. పోరాడటమూ రాదు, మనకు పోలీస్ స్టేషన్లకు పోవటం పరువు తక్కువ, ఇట్లా రోడ్డెక్కి అరవటం చిన్నతనం మనం న్యాయం కోసం కూడా అడ్డదారులే తొక్కుదామనుకుంటాం. అదీ చాతకాకపోతే కాళ్ళు ముడుచుకుంటాం.”
“అది కాదు సింధూ” అంటూ చెప్పబోయాడు రవి. ఆ ప్రయత్నాన్ని మధ్యలోనే అడ్డుకుంటూ-
“ఏది కాదు? వాళ్ళు గొంతు చించుకుని నిలేస్తున్న సమస్యే నాకెదురైతే పైరవీ చేసి పరిష్కరించుకుందామనుకున్నాం. దాని వల్ల నాకు కలిగిన వేదనా తీరదు. మనస్సులో క్షోభా ఆరదు. ఇంకో రోజున అటు వంటి సంఘటన జరగకుండా పోదు. మహా అయితే ఈ సారి వాడు ముందే చూసుకుని ఏ దిక్కూ అండా లేని ఆడదాని మీద చెయ్యేస్తాడు, కానీ ఇదిగో నాలా ఇంకా రోడ్డెక్కని వేలాది మంది ఆడవాళ్ళ గురించీ, మగవాళ్ల తల్లులు, పెళ్ళాల కోసం కూడా ఒక కంఠమై అరుస్తున్నారే ఇదిగో వాళ్ళు. వీళ్ళే వాళ్ళ గుండెల్లో అసలైన బెదురూ పుట్టించగలరని నాకు నమ్మకం కలుగుతోంది. నామోషీ పడవలసింది దేనికో కూడా నాకిప్పుడు అర్థమైంది” అని స్కూటర్ దిగి నించున్న సింధు మరో మాట కూడా అంది.
“అవమానాన్ని ఎదుర్కోకపోవడమే అసలైన అవమానం.”
*****
(ఆంధ్రజ్యోతి దీపావళి సంచిక 1999 ప్రచురణ)
ముందు కిడ్డీ బ్యాంక్ లో డబ్బులు జమచెయ్యడానికి వెళ్తున్నట్టు వ్రాశారు – తర్వాత దాన్ని ఆఫీస్ గా మార్చారు.
పోలీసుల పనితనం తెలపడంతో సహజత్వం కనిపించింది.