ప్రథమ పుత్రిక చి. కరుణ వివాహ ముహూర్తం మాఘ మాసంలోనూ, ద్వితీయ కుమార్తె చి.తరులత వివాహ ముహూర్తం, వైశాఖ మాసంలోనూ వుండేలా కుదిర్చాడు, ప్రొద్దుటూరు కృష్ణమాచార్యులు!!
ఇంక రెండునెలల సమయమే ఉంది. ఈ రెండు శుభకార్యాలూ నిర్విఘ్నంగా జరిగేలా చేయమని కనకమ్మ వెంకన్నకు ముడుపు కట్టింది. పుట్టపర్తి మళ్ళీ యధాతథంగా తన రచనాలోకంలోకి ప్రవేశించటం – ఆమెకు ఆశ్చర్య కారణమైంది.
కనకమ్మకైతే కాళ్ళూ చేతులూ ఆడటమే లేదు. కుమార్తెలిద్దరికీ దాదాపు ఒకే సారి కల్యాణ ఘడియలు రావటం ఆనందదాయకమే ఐనా, పెళ్ళి అనగానే ఖర్చులు తలచుకుంటే, గుండె గుభేలుమంటూ వుంది. హైదరాబాద్లో వున్న తల్లి శేషమ్మ గారికీ, తమ్ముడు అప్పళాచార్లకూ, పెళ్ళైన చెల్లెలు కుం. అలమేలమ్మకూ, విషయం తెలియ జేసి, పదిరోజులు ముందుగానే వచ్చి తనకు ధైర్యమివ్వమంటూ వ్రాసింది. మామగారు అత్తగారు, శ్రీమాన్ పుట్టపర్తి శ్రీనివాసాచార్య దంపతులకు కూడా కుమార్తెల పెళ్ళిళ్ళ విషయం తానే వ్రాస్తూ ముందుగా రమ్మని ఉత్తరాలు వ్రాసి, పుట్టపర్తి సంతకం జతపరచి, పోస్ట్ చేసింది. ఇటు వంటి విషయాలు పుట్టపర్తి అసలు పట్టించుకోరని, ఇరువర్గాలవారికీ తెలుసు కాబట్టి, భగవంతుని మీదే భారమిక అనుకుందా ఇల్లాలు!!
కనకమ్మ తల్లిగారు, శేషమ్మా, తండ్రి కిడాంబి దేశికాచార్యులు – నెల రోజుల ముందే వచ్చేశారు. పెళ్ళిళ్ళకు సంబంధించిన ఆచార వ్యవహారాల పరిజ్ఞానం శేషమ్మగారిలో మెండుగా వుండటం వల్ల, బంధువులందరూ ఆమె సలహాలు తీసుకుంటూనే వుంటారు. ఆమె రాగానే మంచి రోజు చూసి, పసుపు దంపించి, పెళ్ళిపనులకు శ్రీకారం చుట్టించింది కుమార్తె కనకమ్మతో!!
అల్లుడు నారాయణాచార్యులకు కూడా ఆమె అంటే ఎంతో గౌరవం. కనకవల్లి పుట్టపర్తి వారి ఇంట అడుగు పెట్టిన కొన్ని రోజులకే, పుట్టపర్తి అత్తింటి అల్లుడైపోయారు. వివాహమైన వెంటనే పుట్టపర్తిని ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టినప్పుడు, తల్లి పాత్ర పోషించి, మందూ మాకులతో అల్లుడికి నయం చేసినది కూడా ఆమే!! అటు తరువాత, అనంతపురం, తిరువాన్ కూరు, డిల్లీ ఇలా ఉద్యోగాలు మారినప్పుడంతా కూతురి కుటుంబానికి కొండంత అండగా నిలిచింది శేషమ్మ గారే!! అంతే కాదు, చెప్పా పెట్టకుండా పుట్టపర్తి హిమాలయాలకు వెళ్ళిపోయిన గడ్డు పరిస్థితిలో కూడా, కుమార్తె కుటుంబాన్ని కడుపులో పెట్టుకుని కాపాడుకుంది. అందుకే ఒకవేళ కోపంతో తనను ఆమె ఏమైనా అన్నా, పట్టించుకోరు పుట్టపర్తి.
అత్తగారిపట్ల ఎంత గౌరవాదరాలున్నాయో, మామగారు ధన్నవాడ కిడాంబి దేశికాచార్యులన్నా అంతే గౌరవం వారికి!! దేశికాచార్యులు స్వతహాగా అమాయక చక్రవర్తి. ఏదో అదృష్టం బాగుండి, ఉపాధ్యాయుడిగా ఉద్యోగం వచ్చేంత వరకే తెలివి తేటలు వారికి ప్రాప్తించాయి కానీ, కాలానుగుణంగా వయసును బట్టి వ్యక్తిత్వంలో రావలసిన పరిణతి లేదు వారిలో!!
గద్వాల సంస్థానంలో ఆస్థాన పండితులైన శ్రీమాన్ ధన్నవాడ కిడాంబి రాఘవాచార్యుల వారి ప్రతిభాసంపన్నత చాలా గొప్పది. ఎన్నో సార్లు పండిత శాస్త్ర చర్చల్లో గెలుపొంది గజారోహణ గౌరవాన్నందుకున్న వారి అనేక సంస్కృత రచనలు, సాహిత్యలోకంలో బహు ప్రసిద్ధాలు. వారికి నలుగురు పుత్రులు. దేశికాచార్యులు, శ్రీనివాసాచార్యులు, రామచంద్రాచార్యులు, వెంకట నరసిమ్హాచార్యులు. ప్రథమ పుత్రుడు దేశికాచార్యులే పుట్టపర్తి మామగారు. కనకవల్లి బాల్యకాలంలో యీ రాఘవాచార్యుల తాతగారి ఒళ్ళో కూర్చునే కలం నడిపే విద్యను నేర్చుకున్నది!! సంస్కృతాంధ్ర పంచకావ్య పఠనం చేసినది కూడా తాతగారు, ధన్నవాడ కిడాంబి వారివద్దే!! ఆ గౌరవం మామగారి పట్ల కూడ ప్రదర్శించటం – పుట్టపర్తి విజ్ఞత!!
దేశికాచార్యుల అలవాట్లలో మొట్టమొదటిది, ఉదయాన్నే స్నానసంధ్యా ధ్యనుష్టానాలలో చాలా శ్రద్ధగా తిరునామాలు తీర్చి దిద్దుకోవటం ! క్రమం తప్పకుండా గాయత్రి పూర్తి చేయటం!! తరువాత, శేషమ్మగారందించిన ఫిల్టర్ కాఫీ సేవించి, పుర వీధులలో నడక సాగిస్తారు కాసేపు!! ఉపాహార వేళకు ఇంటికి చేరుకుని, రుచికరమైన ఉపాహార సేవనం తర్వాత, రామ కృష్ణ సమాజమో, దివ్య జ్ఞాన సమాజానికో వెళ్ళి ఆ రోజు దిన పత్రికలు, ఇతర సమాచారాల పఠనం తరువాత, సాపాటువేళకు ఇంటికి చేరుకోవటం!! భోజనానంతరం కునుకు!! తరువాత, దగ్గరిలోని అహోబిల మఠానికి వెళ్ళి కాలక్షేపం చేసి, మళ్ళి రాత్రి భోజనవేళకు ఇంటికి చేరుకుని, భోజనం తరువాత, ఇంటి వసారాలో పడకేయటం!!
వారి యీ దినచర్య, ఆ వీధిలోని పిల్లకాయలకు ప్రత్యేక ఆకర్షణగా వుండేది. ముఖ్యంగా, ఇంటి ముందున్న పెద్ద అరుగు పై కూర్చుని, ఓపికగా తిరునామాలు కళాత్మకంగా అద్దంలో చూసుకుంటూ దిద్దుకోవటం!! ఇదంతా పుట్టపర్తి గమనిస్తూనే వుండేవారు. కానీ అమాయకత ఉట్టిపడే మామగారి వాలకం చూస్తే ఏమీ అనబుద్ధయ్యేదే కాదు!! అందుకే ఆసక్తిగా వారినే గమనిస్తూ వుండే పిల్లలను, వీలైతే దేశికాచార్యులను ఆట పట్టించేందుకు చూసే పిల్లలను కోప్పడేవారు కూడా!!
ఇంట్లో పెళ్ళిపనులు మొదలై పది పదిహేను రోజులయ్యాయి. పెళ్ళి ప్రొద్దుటూరు రంగయ్యగారి సత్రంలో!! సుబ్రమణ్యం మొదలైన పుట్టపర్తి శిష్యులు దాదాపు రోజు విడిచి రోజు వస్తూనే వున్నారు, సరుకులు తెచ్చి పడేస్తూ వున్నారు!! ఎక్క్కడి నుంచీ అని పుట్టపర్తి అడగనూ లేదు. వారు చెప్పనూ లేదు. కారణం ప్రొద్దుటూరులో పుట్టపర్తి ఆరాధకులు, వారి వారి వ్యాపారాలను బట్టి బియ్యం, పప్పూ, వుప్పూ, బట్టలూ వంటి వస్తువులు గురువుగారి ఇంటికి పంపిస్తూ వుండటమే!!
ఇదిలా వుంటే, ఒకరోజు, ప్రొద్దుటూరు శిష్యులలో ఒకడైన కే.సుబ్బయ్య పండ్ల బుట్టతో ఇంటికి వచ్చాడు. పుట్టపర్తి వారు రామకృష్ణా హైస్కూల్ కు వెళ్ళారు కాబట్టి అమ్మగారు కనకమ్మగారికి పాదాభివందనం చేసి, మరింత భక్తి శ్రద్ధలతో ఒక కవరు నుండీ, చేతి పరిమాణంలో వున్న చిన్ని పొత్తములు పది కాపీల పాకెట్ ఆమెకు అందించాడు. కనకమ్మ ఆ పొత్తమును చేతుల్లోకి తీసుకుని చూసింది!! శీర్షిక ‘మహాకవి పుట్టపర్తి.’ అంటే భర్త గురించి, వారి వ్యక్తిత్వ విశేషాలు, బహుభాషా వైదగ్ధ్యము వంటి విశేషాలతో కూర్చిన పొత్తమన్న మాట!! సంభ్రమాశ్చర్యాలతో పుటలు తిరగేస్తున్న అమ్మగారి వైపు చూస్తూ సుబ్బయ్య అన్నాడు – అమ్మా, అయ్యగారిలో నా మనసు గ్రహించిన విశేషాలను ఇందులో పొందు పరచాను. పండిత దృష్టితో కాక, వారి శిష్యుడిగా గురుస్థానంలో వారిని హృదయంలో ప్రతిష్టించుకుని ఆరాధిస్తున్న నా వంటి ఒక అర్భకుని అక్షరార్చనగా చూడవలె!! ముందుగా మీరు దీని తొలి ప్రతిని అందుకోవటం యాదృచ్చికమే ఐనా, మా అయ్యగారి జీవన నౌకకు చుక్కానిగా మీరే దీన్ని యీ విధంగా ఆవిష్కరించటం, భగవదేఛ్ఛగా భావిస్తానమ్మా!! మీ ఇంట జరుగుతున్న తొలి కల్యాణ వేళ, నూతన వధూ వరులకు ఇది నా విలువైన కానుకగా సమర్పించుకుంటున్నానమ్మా!! స్కూల్ లో అయ్యగారిని దర్శించుకుని ఊరికి పోతాను.’ అని మళ్ళీ నమస్కరించి వెళ్ళిపోయాడు.
కనకమ్మ ఆనందానికి పట్టపగ్గాలు లేవు. ఆ పుస్తకాలను ఇంట్లోని పూజా స్థలంలో పెరుమాళ్ళు దృష్టి పడేలా ఉంచి, కళ్ళు మూసి నమస్సులర్పించి, భర్త కీర్తి ఇలాగే జగద్విదితం కావాలని మనసారా కోరుకుని, చిన్ని పొత్తాన్ని మళ్ళీ చేతుల్లోకి తీసుకుందామె!!
తాను మొట్టమొదట ప్రొద్దుటూరు స్థానికోత్తర పాఠశాలలో పుట్టపర్తిని దర్శించుకున్న అపురూప క్షణాలను ఎంతో ఉద్వేగంతో వర్ణించాడు సుబ్బయ్య. పుట్టపర్తి శిష్యునిగా గర్విస్తూ, ఆ అనుభవాన్ని తనకే పరిమితం చేసుకోవాలని భావించే మరొక స్నేహితునికి, నాలుగణాలు లంచమిచ్చి మరీ పుట్టపర్తి సమీప దర్శనం చేసుకోవటాన్ని నిష్కల్మషంగా వర్ణించాడతడు!! పుట్టపర్తి ఆశీస్సులు పొందిన తరువాత, వారి గురించి తాను విన్న కన్న అనేక విషయాలను తేట తెలుగులో, సులభసుందర రీతిలో వ్రాసుకొచ్చాడు.
బాల్యంలోనే పెనుగొండ లక్ష్మి రచన, వివాహానంతరం ప్రొద్దుటూరు వాసం, కొప్పరపు సుబ్బయ్య గారి అండదండలతో ప్రొద్దుటూరు వాసం, తిరువనంతపురం విశ్వ విద్యాలయం పుట్టపర్తికి ఎం.ఏ. పరీక్ష నుండీ మినహాయింపునిచ్చి మరీ నిఘంటు నిర్మాణ విభాగాధికారిగా నియమించటం, అటు తరువాత, అనంత శయనం అయ్యంగార్ గారి సలహాతో ఢిల్లీ కేంద్ర సాహిత్య అకాడమీలో ఉద్యోగం, పలు భాషల పై పుట్టపర్తి అధికారం వంటి ఎన్నో విషయాలు పూస గుచ్చినట్టు వ్రాశాడు సుబ్బయ్య.
ఇంకా చాలా విషయాలు చదవాలని వుంది. ‘ఎక్కడున్నావే కనకా??’ అమ్మ గొంతు వినిపించింది. ఆనందంగా శేషమ్మ దగ్గరికి పుస్తకం తీసుకుని వెళ్ళింది. విడిదింట్లో పెట్టేందుకు పెద్ద సైజు కర్జికాయలూ, చక్కిలాలూ వంటివి చేస్తూ వున్న తల్లి శేషమ్మకు పుస్తకం చూపించింది ,’అమ్మా, మీ అల్లుడి గురించి వారి శిష్యుడు వ్రాసిన పుస్తకం, ఇప్పుడే ఇచ్చి పోయినాడు. చూడు.’ అని చూపించింది. పొయ్యి దగ్గర చెమటలు కక్కుతూ పనిలో మునిగి వున్న శేషమ్మ ముఖంలోనూ ఆనందం!! ఏదీ?? చీర కొంగుతో చెమట తుడుచుకుని, పుస్తకం అందుకుందామె!! ‘మా అల్లుడు బంగారం మరి !!’ పేజీలు కొన్ని తిరగేసి, ‘తీరికగా చదవాలమ్మా!! ముందీ పని కానీ!! ఇదిగో!! పదరపేణీలు చేసేందుకు చక్కెర సన్నగా విసరి వుంచుకోవలె!! డాల్డా, మైదా పిండి ఎక్కడున్నాయ్?? అవన్నీ సిద్ధం చేసుకుంటే, సాయంత్రం చేద్దాం. సరేనా??’
పెళ్ళిల్లు కాబట్టి అప్పటికి పఠనానికి విరామం తీసుకోవలసే వచ్చింది తల్లీ కూతుళ్ళకు!! కానీ, పుట్టపర్తి కూర్చునే కుర్చీ దగ్గరి టేబుల్ మీద ఆయన దృష్టి పడేలా అమర్చి, మళ్ళీ ఇంటి పనుల్లో పడింది కనకవల్లి!!
సాయంత్రం పుట్టపర్తి స్కూల్ నుండి ఇంటికి వచ్చి కరుణాదేవి అందించిన కాఫీతో కుర్చీలో కూర్చుంటూ సుబ్బయ్య వ్రాసిన పుస్తకం ప్రతి అక్కడే వుండటం గమనించారు. ఇది నిజంగా నూతన వధూవరులకే కాదు, తన అభిమానులకూ విమర్శకులకూ కూడా కానుకే అనిపించింది వారికి!! స్కూల్ లో తనను కలుసుకున్న సుబ్బయ్య చెప్పినట్టు యీ పుస్తక తొలి ప్రతిని అందుకోవటం, ఆవిష్కరించటం కూడ అర్ధాంగి ద్వారా కావటం, సముచితంగా తోచింది వారికి కూడా!!
పుస్తకం తిరగేస్తున్నారు.
సుబ్బయ్య, తాను మదరాసు ప్రెసిడెన్సీ కళాశాలలో చదువుతున్నప్పటి రోజులలో (1955 ప్రాంతాలు) పుట్టపర్తి ఉపన్యాసం ఏర్పాటు చేసినప్పటి జ్ఞాపకాలను పంచుకున్న పంక్తుల పై వారి దృష్టి నిలిచి పోయింది. ఆ సంఘటన ఇప్పుడు మళ్ళీ కళ్ళముందు కదలాడినా, శిష్యోత్తముడి మాటల్లో చదవటం గొప్ప అనుభూతిగా తోచింది వారికి!!
*****
(సశేషం)